దివంగతము – 2

(మార్పు 55)

“చిన్న ఇంటర్వ్యూలు. అసలు పుస్తకం పేరే “రచయిత్రులతో కలిసి తాగుతూ ..” అని కదా. అంచేత రకరకాల  పానీయాలు సేవిస్తూ, మాటాడుకున్న మాటలు అవి. రచయిత్రులేమో స్వర్గస్థులు. అంచేత ఇదొక ఊహాగానం కదా.”

“అంటే అందులో మనం గ్రహించేది ఏమైనా ఉందా లేదా?”

“ఇంగ్లీషు పుస్తకాలు తెగ చదివేవాళ్ళమాట చెప్పలేను కానీ నాకు కొత్త సంగతులు తెలిసేయి.”

“చెప్పు, చెప్పు. నేను కూడా తెలుసుకుంటాను.”

“మార్గరెట్ మీడ్ పొలనీషన్, సమొవా ద్వీపాల్లో స్థానిక జాతులమీద చాలా పరిశోధన చేసి, పుస్తకాలు రాసింది. సమొవాలో స్త్రీల ఆధిపత్యంమూలంగా అక్కడ ప్రజలు హాయిగా బతుకుతున్నారంటుంది. ఈనాటి స్త్రీవాద సిద్ధాంతాలకి ఆమె రచనలు మూలం కావచ్చంటున్నారు. అక్కడక్కడ వీళ్ళ వ్యాఖ్యలు కూడా నవ్విస్తాయి.”

“ఏమందో చెప్పవేం?”

“ఆఁ, ఉండండి, చెప్తాను.. మ్… సమొవా జనాలగురించి రాస్తూ వారికి అమెరికాలోలా సెక్స్‌కి సంబంధించిన సంగతులకి వేరే పుస్తకాలూ, విడియోలు అవుసరం లేదు, వాళ్ళంతట వాళ్ళకే తెలుస్తుంది అంటుంది Coming of Age అన్న పుస్తకంలో.”

నేను కూడా నవ్వేను. నాకు తెలిసింతవరకూ అమెరికనులే ఇలాటివిషయాల్లో చాలా ముందున్నారని నేననుకుంటున్నానింతవరకూ. చాలామంది అభిప్రాయం కూడా అదేనేమో, పుస్తకాలు, విడియోలూ, తదితర గుంపులూ, వెబ్ సైటులూ మొదలైనవి.. J)

“నాకు మరోవిషయం కూడా తట్టింది ఇవి చదువుతుంటే. రచయితలకి – రచయితలనే కాదులెండి – అసలు ఏరంగంలోనైనా ఒక స్థాయి చేరినవారికి ఆవేశంపాలు ఎక్కువేమో.”

“ఎందుకలా అనుకుంటావు? మనిషి జన్మెత్తిన ప్రతివాడికీ ఏదో సమయంలో ఆవేశం రాదేమిటి?”

“అలా కాదు. మేధావులు మనకి మార్గదర్శకులు కదా.”

“రచయితలందరూ మేధావులే అంటే నేనొప్పుకోను.”

“సరే, రచయితలందరూ కాదు. కానీ మేధావులందరూ రచయితలే. అంటే వారు వాళ్ళబుర్రలు అరగదీసుకుని, చుట్టూ ఉన్న మనుషుల్ని నిశితంగా పరీక్షించి గ్రహించిన పరమసత్యాలు ఏదో ఒకరూపంలో ప్రజలకి సరఫరా చేస్తున్నారు. అందుకే ప్రసిద్ధులయిన రచయితలందరూ మేధావులకిందే లెఖ్ఖ.”

“అంతేలే,” అన్నాను, మరేం అనాలో తోచక.

అరవింద కూడా అవునన్నట్టు తలూపింది.

రెండు నిముషాలపాటు గదిలో నిశ్శబ్దం అలముకుంది.

మళ్ళీ లీలే అందుకుంది, “ వీళ్లు రచయితలుగా మంచి పేరు తెచ్చుకునీ, పదిమందిచేత ఔననిపించుకుని … ఎందుకలా చేసేరో, ప్రాణాలు తీసుకుని ఏం సాధించాలనో  … ఆత్మహత్య పిరికితనం, తమలో తమకే నమ్మకం లేదని పాఠకులు అనుకోరని వాళ్ళకి తోచదా?”

“దానికీ దీనికీ సంబంధం ఏమిటి? రాతలు రాతలే, బతుకులు బతుకులే.”

“అది కాదండీ. వాళ్లు కథల్లో వాస్తవికత చూపుతూనే, ఏదోరకం  సత్సందేశం, మనని మంచివేపు నడిపించే సందేశం కదా ఇస్తారు.  మరి ఇలా ప్రాణాలు తీసేసుకుంటే, పాఠకులకి వారిమీద నమ్మకం పోదూ? చెప్పేదొకటీ చేసేదొకటీ అనిపించదూ?”

“సందేశాలన్నీ మాటల్లోనే, క్రియలో సాధ్యం కాదు.”

“ఎందుక్కాదూ?”

“ఎందుకంటే నేను చెప్తాను,” అంది అరవింద.

మేం ఇద్దరం ఉలిక్కిపడ్డాం, “చెప్పు.” “చెప్పు.”

“రచయితలు schizophrenics,”

హాహాహాహ – మళ్ళీ జమిలిగా ఇద్దరం. … ఆ తరవాత ప్రశ్న ఇద్దరం యుగళగీతంలా, “నీ పిహెచ్.డికి ఇదేనేమిటి వస్తువు?”

“అది కాదండీ. ఈ రచయితలందరికీ ఎంతో కొంత అతిశయం ఉంటుంది. తమరచనలని ఆదరించే పాఠకులకి తామంటే ఒకరకం అభిప్రాయం ఉందని వాళ్ళకి తెలుసు. అది తమ అతిశయాన్ని పెంచేదిగానే ఉండాలి అని కూడా ఆశిస్తారు. అంచేత పాఠకులు తమగురించి ఏమనుకుంటున్నారో తదనుగుణంగా తమ స్వరూపం తమకథల్లో వ్యక్తమయేలా జాగ్రత్త పడతారు. అది కాక వారి నిజస్వరూపం వేరే ఉంటుంది. అది వారికి తెలియొచ్చు, తెలియకపోవచ్చు. ఆ స్వరూపం అన్నమాట ఈ ఆత్మహత్యగా బయటపడింది. ఇది నా అభిప్రాయం,” అంది అరవింద.

“మ్. ఆలోచించవలసినవిషయమే,” అన్నాను, ఆలోచిస్తున్నట్టు ముఖకవళికలు అమర్చుకుని.

“నాక్కూడా అది కొంతవరకూ నిజమేనేమో అనిపించింది డోరతీ పార్కర్ రచనలు చదువుతుంటే. వాటిల్లో మరణం ఒక ప్రముఖ అంశం. ఎల్లవేళలా ఆమెమనసులో ఆ అంశం మెదుల్తూనే ఉందనుకుంటాను. అందుకే ప్రపంచం అంటే, సాటి రచయితలూ,  విమర్శకులూ అంటే ఆమెకి అట్టే గౌరవం లేదు.”

లీల నవ్వుతూ అంది, “ఈ ఇంటర్వ్యూలో కూడా ఆమె సమకాలీనసాహిత్యంగురించి కటువువైన మాటలే చెప్పింది. ఆమె ఆత్మహత్య చేసుకోలేదు కానీ ఆ ప్రయత్నం చేసిందొకసారి, విఫలప్రయత్నం.”

“నేనూ అదే చూసి, అసలు ఎంతమంది రచయిత్రులు ఆత్మహత్యలు చేసుకున్నారు అని జాలంలో వెతికేను. అమెరికాలో చాలామందే ఉన్నారు చూసేవా?”

“సిల్వియా ప్లాత్ అవెన్లో తల దూర్చేసి పైకెళ్ళిపోయింది.”

“హుమ్, గాస్ పొయ్యిలు అందుకు పనికొచ్చేయన్నమాట. అయినా సునాయాస ఆత్మహత్యావిధానం వీళ్ళకెవరికీ తోచలేదా?”

“మార్గరెట్ మిచెల్ రోడ్డు దాటుతూ జోరుగా వస్తున్నకారుకి ఢీకొని పోయింది.”

“అది నిజం కాదంటూ ఈమధ్య ఓ పుస్తకం వచ్చింది,” అంది అరవింద.

“అరవైఏళ్ళతరవాతా?” అన్నాను ఆశ్చర్యంగా.

“అదే ఆ డ్రైవరుని అప్పట్లో జైల్లో పెట్టేరు, తప్పతాగి డ్రైవ్ చేస్తూ రోడ్డున పోతున్న ఆమెకి పెట్టేసేడని. ఆతరవాత ఆయన చనిపోతూ కూతురికి చెప్పేట్ట అది నిజం కాదనీ, ఆవిడ పెద్ద పేరున్న రచయిత్రి కనక పోలీసులు కుమ్మక్కయి, తనమీద తప్పు రుద్ది, జైల్లో పడేసేరని.”

“ఇప్పుడు ఆ తండ్రి చెప్పినకథ ఆ కూతురు వెలుగులోకి తెచ్చిందా?”

“ఆఁ, మిచెలే కారుకి అడ్డు పడిందని, ఆ డ్రైవరుకి కారు ఆపే టైం లేకపోయిందనీ ఆవిడ కథనం.”

“వీళ్ళందరూ తమ సాహిత్యంలో సృష్టించుకున్న ప్రపంచానికీ వాస్తవ ప్రపంచానికీ పొత్తు కుదరకపోవడంవల్ల ఒంటరితనం, దానితో వచ్చే దిగులూ … ఇలా రకరకాల మానోవేదనలకి గురై, ప్రాణాలు తీసుకుంటారేమో.”

“ఒంటరితనం ఎందుకూ? వీళ్ళందరికీ భర్తలూ, సన్నిహితులూ, సాహితీ స్నేహితులూ బాగానే ఉన్నట్టుంది కదా. సదా బోలెడుమంది వీళ్ళతో సాహిత్యచర్చలు చేసేరు.  వర్జీనియా వుల్ఫ్ విషయంలో తల్లిదండ్రులూ, తోబుట్టువులూ వరసగా ఒకరితరవాత ఒకరు పోవడం మూలంగా కలిగిన మానసికాందోళన తట్టుకోలేక ఆత్మహత్యకి పాల్పడిందంటారు. మొదటి ప్రయత్నం విఫలమయినతరవాత, రెండోసారి జేబునిండా రాళ్ళు వేసుకుని నదిలోకి నడిచిపోయిందిట. నన్ను పాలింప నడచివచ్చితివా అని పాడలేదనుకుంటాను.”

“తెలుగువాళ్లలో కూడా అలాటి సంఘటనలున్నాయా?” అనడిగింది అరవింద.

“నాకు తెలిసినంతవరకూ తమ ప్రాణాలు తీసుకున్న దాఖలాలు లేవు. మనవాళ్ళు పాత్రలనే ఎడాపెడా చంపేశారు ముఖ్యంగా యాభయవ దశకంలో రచయిత్రులు,” అన్నాను నవ్వి.

లీల కూడా నవ్వుతూ, “అవును, రాధ చచ్చిపోయింది, సూర్యారావు చచ్చిపోయేడు. వాళ్ళమ్మ చచ్చిపోయింది, వాళ్లన్నయ్య చచ్చిపోయేడు, అంటూ కొన్ని నవలల్లో అయితే ఆఖరి ఇరవై పేజీలూ మారణహోమమే,” అంది.

“ఒక రచయిత్రి గాస్ సిలెండరు పేలి ప్రమాదవశాత్తూ పోవడం జరిగిందని మాత్రమే నాకు తెలుసు. సినిమావాళ్ళూ, డ్రామావాళ్లూ, సంగీతజ్ఞులు, కవులూ – ఎవరూ ప్రాణాలు తీసుకున్నవాళ్లు లేరనుకుంటా. రాజకీయాల్లో మాత్రం విమానాలూ తుపాకీగుళ్ళూ చెప్పుకోదగ్గ పాత్ర వహించేయి కొందరిని దివికంపడానికి. … మామూలుగా మనరచయిత్రులు అంత నిర్వేదానికి గురి కారు, వీళ్ళందరికీ కుటుంబంలోనూ, సమాజంలోనూ కూడా మంచి బలగమే ఉంటూంది. మనదేశంలో జనాభా పెద్ద వరం, చాలావరకూ ఆత్మహత్యల్లాటి అఘాయిత్యాలకి అడ్డు పడుతారు చుట్టూ ఉన్నవాళ్ళు. అసలు జరగవని కాదు కానీ వెసులుబాటు తక్కువే.”

“అంటే మనకి ఆత్మహత్య తక్కువా?”

“మ్.”

“అత్తలూ, ఆడబడుచులూ, మొగుళ్ళూ పెట్టే బాధలు పడలేకా, జరుగుబాటు లేకా, గత్యంతరం లేకా బతుకు అంతం చేసుకనేవారు ఉన్నారు. అక్కడ కారణాలు స్పష్టమే. అంటే మంచి పని చేసేరని కాదు నేనంటున్నది. ఎలాటిపరిస్థితుల్లో ఆమార్గానికి ఒడిగట్టేరో నాకు తెలుస్తుంది అంటున్నాను.”

“నేననుకోడం పిరికివాళ్ళు మాత్రమే అలా చేస్తారని.”

“పిరికితనమే అనే ఎందుకనుకోవాలీ? తనకి కావలసింది దొరక్కపోయితేనూ, దొరికించుకునే దారి లేకపోతేనూ, నిరాశా, నిస్పృహా కలిగి, తమమీద తమకే నమ్మకం లేకుండా పోయినప్పుడు ఎందుకీ బతుకు అనిపించవచ్చు. లేదా, తనమీద చుట్టూ ఉన్నవారికి నమ్మకం లేకపోవడంవల్ల కలిగిన నిరాశ కావచ్చు. అది నిజానికి పిరికితనం కాదు సరి కదా నన్నడిగితే ధైర్యమే అంటాను. తెగింపు కావాలి కదా అలా ప్రాణాలు తీసుకోడానికి.”

“ఏమో, నాకు పిరికితనమనే అనిపిస్తుంది. ఒకటి జరక్కపోతే, మరోటి చూసుకోవాలి కానీ, ఏదో ఒక్కదానితోనే తనబతుకంతా ముడి పడి ఉందనుకోడం, లేదా ముడిపెట్టుకోడం తెలివితక్కువతనం.”

“పోనీ అలా అనుకున్నా, తెలివితక్కువతనం పిరికితనం ఒకటి కావు కదా.”

“నాదృష్టిలో ఒకటే. చేతకానితనం, తెలివితక్కువతనం, పిరికితనం – ఒకే రాయికి వేరు వేరు పలకలు. దానికేం గానీ, నాకు ఈపుస్తకంలో నచ్చింది ఈ ఇంటర్వూలు చేసినవారి ఊహాచిత్రాలు.”

“అంటే, వర్జీనియా వుల్ఫ్ తను చనిపోయేక లెనర్డ్ ఎంతకాలం బతికేడు అని అడగడంలాటివి. నిజంగా వర్జీనియా వుల్ఫ్‌కి అలాటి తాపత్రయం ఉందో లేదో మనకి తెలీదు కదా. కానీ ఆవిడరచనలు కొన్ని చదివేను.  ఆవిడ అలా అడగడానికి ఆస్కారం ఉందేమో అనిపించింది. అదీ నేనంటున్నది, అంతే నేనంటున్నది కూడా.”

“ఎడ్నా సెయింట్ విన్సెంట్ మిలీ జీవితంమీద చేసిన వ్యాఖ్యానం ఒకటి నాకు చాలా నచ్చింది, నీక్కావలసినవి కావలిసినట్టు  అమర్చి పెట్టడానికి జీవితం నీకు అచ్చిలేదుˮ అని. (Life is under no obligation to give what you want.)

ˮఆవిడది కూడా ఆత్మహత్యేనా?ˮ

ˮకాదు. హఠాన్మరణం. మెట్లమీదనించి జారిపడి చనిపోయిందిట.ˮ

హుమ్, లీల నిట్టూర్చింది దిగంతాల్లోకి దృష్టి సారించి.

నేను కొంచెంసేపూరుకుని, తనేం మాటాడకపోతే, ’’ఏమిటంత సుదీర్ఘంగా ఆలోచన?’’ అన్నాను పరీక్షగా మొహంలోకి చూస్తూ.

లీల నావేపు ఒక్కక్షణం చూసి, తలొంచుకుంది.

“ఏమిటి?”

“చెప్తే మీరేంవంటారో అని”

నేను చిన్నగా నవ్వేను. “హుం. ఏమన్నా మాటే కదా, మీద పడి కొట్టను కదా.”

“కొట్టరులెండి. మాట చాలదేమిటి, అసలింకా అదే ఎక్కువ నొప్పి కూడాను.”

“సరే. ఏమీ అననని మాటిస్తున్నాను.”

”ఏంలేదు. నాకు చిన్నప్పట్నుంచీ. కనీసం కాలేజీలో చేరినరోజులనించీ ఇలాటి ఆలోచనలుండేవి. వార్తల్లో ఎవరో ఒకరు పోయేరని చూసినప్పుడల్లా, ఆ విషయాన్ని గురించిన ఆలోచనలు చాలా ఉండేవి.”

“డోరతీ పార్కర్‌లాగా?”

”ఆవిడతో పోలికేమిటి కానీ, … అసలు ఇంకా చాలామంది రచయిత్రులే కనిపిస్తున్నారు చావుని వస్తువుగా తీసుకున్నవారు. ఎమిలీ డికెన్సన్ కూడా అంతే కదా.”

”అదీ నిజమే. నేననుకోడం – జీవితాన్నిగురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలిచ్చే మేధావులందరూ అంతంగురించి కూడా మాటాడాలనే అంటాను. బతుకెంత ముఖ్యమో చావూ అంతే ముఖ్యం. ఇందులో ఎక్కువతక్కువలూ, మంచీ చెడూ లేవు.”

“మీరలా మాటాడితే, జాగ్రత్త, ప్రజలు మిమ్మల్నిగురించే అనుకుని, మీయింటిముందు పహరా కాస్తారు మీరేం అఘాయిత్యం చేస్తారోనని. లేదా అఘాయిత్యం చేసే లక్షణాలు కనిపిస్తున్నాయనీ, ఆత్మహత్య నేరమనీ జైల్లో పడేస్తారంతే.”

“అందుకే కదా రహస్యంగా నీకు చెప్తున్నది.”

“మనదేశంలో అయితే బావిలో దూకడం, లేకపోతే రైలుకింద పడడం. రోజూ పేపర్లో ఎక్కడో ఓ చోట ఈవార్తలు చూస్తూ ఉండడంచేతేమో, నేను రైల్లో ప్రయాణం చేసినప్పుడల్లా తలుపుదగ్గరికి వెళ్ళి, తలుపు తీసుకు నిలబడి, గెంతేస్తే ఎలా ఉంటుందో అని దీర్ఘంగా ఆలోచించేదాన్ని.”

“ఏమిటి ఆపింది నిన్ను?”

“ఏమో .. అసలు నాకది ఆత్మహత్యాప్రయత్నంగా అనిపించలేదు. ఎదురుగా ఎవరైనా ఉంటే, వాళ్ళని ఆట పట్టించడానికి అలా చేస్తున్నట్టు ఊహించుకున్నాననుకుంటా నాకు నేనే,” అంది చిన్నగా నవ్వుతూ.

“డోరతీ పార్కర్ విషయంలో ఆవిడ అలా రాయడానికి కారణం ఆనాటి సమాజమనీ, ఆవిడ శైలిలో కరుకుదనం, వ్యంగ్యం సమాజంమీద వ్యాఖ్య కోసమే ఉపయోగించుకుంది అనీ అంటుంది ఒక విమర్శకురాలు. By debunking traditional love and romance, by running down families and middle-class life, even by advocating suicide as the best way out, she was playing into a need to acknowledge openly the desperation of the times” (Suzanne L. Bunkers)  అని,” అంది అరవింద.

ఆ అమ్మాయి ఈనాటి సాహిత్యం చదువుతోంది కనక ఆమెకే ఎక్కువ తెలియాలి. ఆవిషయంలో నేను వాదనకి తలపడలేను ఆపిల్లతో.

“దానికి కారణం కూడా ఆనాటి సాహిత్యరంగంలో రచయితలూ, విమర్శకులూ, పత్రికాధిపతులూను. మేధావి అయిన రచయితకి అదే పనిగా మెచ్చుకునేవారివల్ల ప్రోత్సాహం లేదు. ఆవిడ పుస్తకానికి ముందుమాట రాస్తూ, ఒక రచయిత, రెండూ, మూడూ తరగతి విమర్శకుల పొగడ్తలమూలంగా డోరతీ పార్కర్ ప్రతిభ దెబ్బ తింది అని వ్యాఖ్యానించేడు. రచయితకి వివేచనతో కూడిన విమర్శ మాత్రమే బలమిస్తుంది.”

లీల కూడా అక్కడా అక్కడా కెలుకుతున్నట్టుంది ఈ సాహిత్యం. అంచేత ఇక్కడ కూడా నేను మౌనమే.

”“ఇంతకీ మనం ఎవరు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు అన్నవిషయంలో ఏదీ నిర్ధారణగా తేల్చుకోలేదు. మరి మీకేమైనా ఆలోచనలున్నాయా? ఉంటే, శలవీయగలరా? లేక రెండురోజులతరవాత కనిపించమంటారా?” అంది లీల సీరియస్‌గా చూస్తూ.

నేను గాఢంగా ఊపిరి పీల్చుకుని, కళ్ళు సగం మూసి, “చెప్పడానికేమీ లేదు,” అన్నాను.

“అదేమిటి, మీకెప్పుడూ అనిపించలేదా?”

“అనిపించింది. అనిపిస్తూనే ఉంటుంది రోజుకి రెండు సార్లయినా.”

చెప్పండి, చెప్పండి మరి చెప్పండి … ఏమిటవేమిటవేమిటి?

“అబ్భ అంత తొందరైతే ఎలా?”

“తొందేమిటి, వారం రోజులయింది మొదలు పెట్టి. ఎంత ఓపిగ్గా ఉంటే మాత్రం,” అంది లీల కళ్ళు చిట్లించి.

“నాకు వాళ్ళందరిసంగతీ తెలీదు. నేను మాత్రం ఆలోచిస్తుంటాను ఆత్మహత్య చేసుకుంటే ఏమవుతుందని. రోజుకి రెండు సార్లయినా.”

“సరే, ఆ తరవాత ఏమయిందో చెప్పండి. మీరలా ఆలోచించినతరవాత ఏమవుతుంది?”

“తరవాతిసంగతి నాకు తెలీదు. నేను ఆలోచిస్తానంతే.”

“భయంతోనా? విచారంతోనా? ఉత్సాహంతోనా?”

“అదేదీ కాదు. నిత్యజీవిజంలో నిరంతరం సాగే ఆలోచనల్లో ఒక భాగంగానే. నేనొక సిద్ధాంతం చేసుకున్నాను. మనం ఒకటి తలుస్తే, దైవం మరొకటి తలుస్తాడు కదా. అంచేత నేను తప్పకుండా పోతాను అనుకుంటే, దైవం దానికి వ్యతిరేకంగా చేస్తాడని ధీమా.”

“అది ఆత్మహత్య కాదు.”

“అనుకుంటే ఆత్మహత్యే. ఎందుకంటే, మనసా నన్ను నేను కొంచెం కొంచెం చంపుకుంటున్నానన్నమాట.”

“సరే అలాగే అనుకుందాం. తరవాతేం అవుతుంది?”

“ఏమీ కాదు. చెప్పేను కదా, దైవం మనం అనుకున్నట్టు చెయ్యడు కదా. అంచేత ఏమీ కాదు,” అన్నాను లేస్తూ.

లీల, అరవింద కూడా లేచేరు.

ముగ్గురం వంటింట్లో జొరబడి వంట మొదలు పెట్టేం. “మెంతివంకాయ కూర, ముక్కలపులుసు నేను చేస్తా.” “కందిపచ్చడి, కాకరకాయ పొడి నేను …” “కేరట్ హల్వా, కొత్తిమీర కారం నేను …” “నా పెసరపప్పు పాయసం ఊరూ వాడా చెప్పుకుంటారు” “నా తోటకూర పప్పు తింటే మీరు జన్మలో మర్చిపోలేరు”

ఈపూట నవకాయ పిండివంటలతో భోజనం మాయింట!

మీరు కూడా రావచ్చు మాయింటికి బోజనానికి, మాయిల్లెక్కడో తెలిస్తే, గంటలో రాగలిగితే :p.

 

`“కందిపచ్చడి, కాకరకాయ పొడి నేను …” “కేరట్ హల్వా, కొత్తిమీర కారం నేను …” 

“నా పెసరపప్పు పాయసం ఊరూ వాడా చెప్పుకుంటారు” “నా తోటకూర పప్పు తింటే మీరు జన్మలో మర్చిపోలేరు.”

ఈపూట నవకాయ పిండివంటలతో భోజనం మాయింట!

మీరు కూడా రావచ్చు మాయింటికి బోజనానికి, మాయిల్లెక్కడో తెలిస్తే, గంటలో రాగలిగితే :p.

(సెప్టెంబరు 1, 2013)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

2 thoughts on “దివంగతము – 2”

  1. టపా వాతావరణాన్ని కొంచెం తేలిక పరిచే ఉద్దేశ్యంతో ఒక చిన్న జోక్ చెప్తాను. అదేమిటంటే – ఓ వ్యక్తి లైబ్రరీకి వెళ్ళి ఆత్మహత్య చేసుకోవటం ఎలా అనే విషయం మీద పుస్తకం ఉందా అని లైబ్రేరియన్ ని అడిగాడట. ఉంది కాని, మీరు తీసుకువెళ్ళితే తర్వాత ఆ పుస్తకాన్ని లైబ్రరీకి ఎవరు రిటర్న్ చేస్తారు అని లైబ్రేరియన్ అడిగాడట.

    మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s