ఇండియనులం!

(మార్పు 56)

భోజనాలయింతరవాత, “పెద్దక్కయ్యని చూసి చాలారోజులయిందని, ఓమారు వెళ్దామా?” అన్నాను వాళ్ళిద్దరితో.

లీలా, అరవిందా కూడా హుషారుగా పదండంటూ లేచేరు.

మమ్మల్ని చూస్తూనే పెద్దక్కయ్య రండి అంటూ ఆహ్వానించింది. కానీ ఆ స్వరంలో ఆహా ఎన్నాళ్ళయిందో నిన్ను చూసి అన్న ఆత్రం లేదేమో అనిపించింది నాకు. ఏదో మాటవరసకి అన్నట్టు, వచ్చేరు కనక లోపలికి రండి అన్నట్టు ఎందుకొచ్చేవని అడగలేక రమ్మన్నట్టు అయిష్టంగా నిర్వికారంగా ఆహ్వానించినట్టుంది.

“ఏం, అలా ఉన్నావు?ఒంట్లో బాగులేదా?” అన్నాను, సందేహిస్తూ.

“బాగానే ఉంది,” అంది ఆవగింజంతైనా బాగుందనిపించని స్వరంతో.

నాకేం మాటాడాలో తోచలేదు. రెండువేపులా ఉంటేనా కదా మాటాడాలన్న సరదా.

గదిలో చుట్టూ చూస్తూ కూర్చున్నాం ముగ్గురమూ  కొంచెంసేపు. ఆవిడ కిటికీలోంచి చూస్తూ కూర్చుంది. ఒడిలో ఏదో పుస్తకం ఉంది. చదివినమేరకి ఆనవాలుగా ఎడంచేతి చూపుడువేలు పేజీలమధ్యపెట్టి పుస్తకం మూసి పట్టుకుంది. తరవాత నెమ్మదిగా పుస్తకం నేలమీదికి జార్చేసింది.

“ఏమిటి చదువుతున్నావు?”

“హ్మ్. ఏదో ఇంగ్లీషుపుస్తకం స్నేహాలు ఎలా పెంచుకోడం, ఆ తరవాత వాళ్ళని మనవేపు తిప్పుకోడం ఎలా అని,” అని నవ్వింది.

“ఇప్పుడా?” అన్నాను నేను కూడా నవ్వుతూ.

అవును మరి, ఇద్దరం జీవితం నాలుగోపాదంలో నలుగుతున్నాం. నేనిక్కడికి చేరి నలభైఏళ్ళయింది, ఆవిడకి ఇరవైఏళ్ళకిపైమాటే. ఇప్పుడింకా స్నేహాలు ఎలా చెయ్యాలి, ఎలా నిలుపుకోవాలి అని ప్రశ్నించుకోడంలో అర్థం లేదు. … ఒక్కక్షణం మాత్రమే అలా అనిపించింది. నిజానికి ఏవయసులోనూ మరో ప్రాణికోసం తహతహ తప్పదు కదా.

“ఏం తెలిసిందయితే?” అన్నాను సీరియస్‌గానే.

పెద్దక్కయ్య తల అడ్డంగా ఆడించింది ఏమీ తెలీలేదన్నట్టు. రెండు నిముషాలూరుకుని, “మాఅమ్మాయిదగ్గర్నుంచి ఏ కబురూ లేదు. పది రోజులు పైనే అయింది,” అంది నెమ్మదిగా తనలో తనే మాటాడుకుంటున్నట్టు.

“ఏ చెడు వార్తా లేదు కనక సుఖంగానే ఉందని అనుకోవాలి,” అన్నాను తేలిగ్గా, మామూలుగా జనం అలవాటుగా చిలికించే ఊకదంపు.

“అంతేలే. అసలు ఎప్పుడు పిలిచినా బాగానే ఉన్నాను, తొడతొక్కిడిగా ఉంది. ఊపిరాడ్డంలేదు. తరవాత పిలుస్తాలే అంటుంది ఎప్పటికప్పుడే. తరంగాలెళ్తే స్నానం చేస్తానన్నట్టు. ఆ పనులు తెమలడం అంటూ జరిగేసరికి నేను చెప్పాలనుకున్నది మరిచిపోతాను.”

అవునన్నట్టు తలూపేను. పృథ్వి విశాలం అయినతరవాత, అదే సాంకేతికంగా, ఎంత దూరంలో ఉన్నవారినీ ఆకాశంలో నక్షత్రాల్లా చేయి సాచి అందుకున్నట్టే పలకరించే వసతి ఏర్పడ్డంతో ఈ హలోలాడేవాళ్ళ మంద కూడా అలవి కానంతగా పెరిగిపోయింది. ఆడుకునే ఊసులు కూడా అంతే. ఏ నెట్వర్కు వలయంలోనో హలో అని ఒకరికి చెప్తే వందమందికి ఉలుకుపాటు.

“ఇంకేమిటి విశేషాలు?” అన్నాను మాట మారుస్తూ.

“నేనీమధ్య ఇంగ్లీషుపుస్తకాలు చదవడం మొదలెట్టేను.”

“హా, బావుంది. అవును గానీ, నువ్విన్నాళ్ళూ తెలుగు తెలుగు అంటూ తెగ హోరు పెట్టేవు కదా. పైగా ఈకాలం పిల్లలు ఇంగ్లీషు పుస్తకాలు చదివినట్టు తెలుగు చదవడంలేదని గోల కూడా పెడుతూ వచ్చేవు కదా.”

పెద్దక్కయ్య నవ్వింది. “వాళ్లు చదవాలి. నేను చిన్నప్పుడు తెలుగు పుస్తకాలు చదివేను కదా. నావంతు అయిపోయింది. వీళ్ళేమో అస్సలు తెలుగు చదవకుండా, ఒఖ్ఖ ఇంగ్లీషే చదవడం, మాటాడ్డం, రాయడం చేస్తూంటే …”

“అందరూ కాదు కదా.”

“ఇంతకీ ఏం చదివేవేమిటి?”

“ఇప్పటివరకూ ఏవో రెండు మూడు చదివేను. ప్రస్తుతం విల్లా కాథర్ పుస్తకం ఒకటి చదువుతున్నాను.”

“ఎలా ఉంది?”

“ఎప్పుడో ఎనభైల్లో మై ఏంటోనియా చదివేను. అందరూ ఆ నవల మెచ్చుకుంటుంటే. మీకో మాట చెప్పలేదనుకుంటా. ఓసారి నేను డ్రైవ్ చేసుకుంటూ నెబ్రాస్కా వెళ్ళేను. తిరికి వస్తుంటే, రెడ్ క్లౌడ్ అని బోర్డు కనిపించేసరికి చూదాం అని అటు తిరగేను.”

“ఎందుకూ?”

“రెడ్ క్లౌడ్‌ ఆవిడ పుట్టినవూరు కాదు కానీ అక్కడికి మారినతరవాత ఆక్కడే స్థిరపడిపోయింది చివరివరకూ. అక్కడ చిన్న మ్యూజియం కూడా ఉంది ఆవిడపేరుమీద అని చదివేను. అంచేత …”

“ఎలా ఉంది మ్యూజియం?”

“నవ్వకండి. అదసలు అంత చిన్న పల్లెటూరని నేననుకోలేదు. నేను వెళ్ళింది ఆదివారం. తీరా చూస్తే ఎర్రమట్టి గోడల్తో ఒక చిన్న పశువులకొట్టంలాటిదొకటి ఉంది మ్యూజియం అంటూ. అది కూడా మూసేసి ఉంది. వీధుల్లో నరసంచారమే లేదు. దీనికోసమా అరవై మైళ్ళు పక్కదారి పట్టింది, అరవై డాలర్లు టికెట్టూను అనిపించింది.”

“టికెట్టేమిటి?”

“అక్కడ పోలీసులు వియత్పథంలో తిరుగుతూ నిఘా కాస్తారుట. నేను వెళ్ళినదారిమీద 55 లిమిటుట. మాకు విస్కాన్సిన్లో 70 మైళ్ళు. ఆ అలవాటులో నేను 65లో వెళ్ళేను. నాకు తరవాత ఇంటికి వచ్చింది శ్రీముఖం.”

“సరేలే. పుస్తకం ఎలా ఉంది?”

“అదే, అసలు చెప్పవలసింది అది. Death comes for a bishop అని.”

“ఆవిడ ఆకాలానికి విప్లవరచయిత్రికింద లెఖ్ఖ,” అంది అరవింద కలగజేసుకుని, “ఆవిడవి బాగా పేరు తెచ్చుకున్నవి My Antonia, O Pioneers!.”

“అవును, నేను కూడా విన్నాను. ఓ పయనీర్స్ చదివేను, చాలా కాలం అయింది. నిజానికి ఈ పుస్తకం కూడా పయనీర్స్ లాటిదే. ఆవిడకి మతవిషయాల్లో చాలా విశ్వాసం ఉంది. అంటే మూర్ఖ విశ్వాసం కాక, సమాజానికి ఒక మార్గం చూపే సాధనంగా. నాకు ఈ పుస్తకంలో ప్రధానంగా నచ్చింది ఆవిడ కథనం.”

“డెత్ అని పేరు పెట్టడం చూస్తే, ఏదో ఒక సంప్రదాయానికో మతానికో అంతం అనిపించడంలేదూ?” అన్నాను సందేహిస్తూ.

“ఏమో తెలీదు.”

“ఇంకా పూర్తిగా చదవడం అవలేదేమిటి?”

“లేదు. నీకు తెలుసు కదా, నాకు దృష్టి నిలవడం కష్టం. అంచేత పుస్తకం పుచ్చుకుని, పొద్దు పుచ్చడానికి చదువుతాను. కళ్ళు ఒకొకమాటా చదువుతాయి కానీ అందులో బుర్రకెక్కేది పదో వంతు. కానీ నాకు విల్లా రాసినతీరు నచ్చి, సగం అయిపోయేక, మళ్ళీ మొదటినించీ మొదలు పెట్టేను.”

నాకు నవ్వొచ్చింది, “బాగుంది ముందుకీ వెనక్కీ ఊగడం. మరి పుస్తకంలో నచ్చినఅంశాలు ఏమిటి?”

“అదే చెప్పబోతున్నా. ఇందులో ప్రధానాంశం ఫ్రెంచి, ఇటాలియన్ బిషప్పులు న్యూమెక్సికోలో ఇండియనులని (అదే రెడిండియన్, అమెరికనిండియన్) క్రిస్టియనులుగా మార్చే ప్రయత్నం. ఇండియనులు మూర్ఖులు, అజ్ఞానులు, మూఢవిశ్వాసాలలో మునకలేస్తున్న మూర్ఖులనే కానీ వాళ్ళు అలాటి జీవనవిధానం ఏర్పరుచుకోడానికి వాళ్ళకారణాలు వాళ్ళకున్నాయి అని అనుకోలేదు. పైగా న్యూమెక్సికోలో కెథీడ్రల్ మొత్తం ప్రపంచానికే ఆదర్శం కాగలదన్న నమ్మకం కూడా ఉంది వాళ్ళకి. అంచేత అక్కడ వీళ్ళ ఫ్రెంచి, ఇటాలియన్ మతాన్ని ప్రచారం చెయ్యాలని తలపెట్టేరు. అలా ఆ బృహత్కార్యాన్ని చేపట్టిన ఒక బిషప్, పాద్రే … దేశం ఆమూలనించి ఈమూలకి ప్రయాణం చెయ్యడం, దారిలో ఆయనకి తారసపడిన ఇండియనులూ, సంఘటనలూ … నన్ను ఆకట్టుకున్న అంశం ఈ మతాలు మార్చడానికి చేసే ప్రయత్నంవెనక వారికి ఇండియనులంటే ఉన్న అభిప్రాయాలు, నిజం చెప్పాలంటే చిన్నచూపు. అవతలివాడు మనకంటే తక్కువ అనుకున్నప్పుడే కదా మనం వాడిని ఉద్ధరించడానికి తలపడతాం.”

“మనదేశంలో జరిగింది కూడా అంతే కదా కొంతవరకూ.”

“అందుకే నాక్కూడా ఇదేదో చూదాం, ఈ మతాంతరాల ఆంతర్యం ఏమిటో కొంతైనా తెలుసుకుందాం అని మొదలు పెట్టేను.”

“అసలు ఇది నవల కాదని ఒక వాదన ఉంది,” అంది అరవింద.

“నవలే అన్నవాళ్ళేం అంటారు మరి?”

“అందులో కొన్ని పేర్లూ, ఊర్లూ కల్పన కనక నవలే అని. అసలు విల్లా కాథర్ కూడా దీన్ని నవల అనడం కన్నా కథనం (నరేటివ్) అనడం మంచిదంటుంది.”

“ఆవిడ కథనం అంటే కథనమే అనాలి కదా మరి. మన కాశీయాత్రలా.”

“నవలంటే ముగింపు ఉండాలి. ఇందులో ముగింపు ఉంది, ఏ కథయినా ఎప్పుడో ఒకప్పుడు ముగియాలి కదా. కానీ ఇందులో ముగింపుకంటే పయనానికే ఎక్కువ ప్రాధాన్యం, అంచేత దీన్ని కథనం అంటున్నానని ఆమె అన్నారు.”

“మంచి పాయింటే,” అన్నాను ఆలోచిస్తూ.

“ఏం, మీకు ఇంకా ఏవో ఆలోచనలు వస్తున్నట్టున్నాయి.”

“కథకి ముగింపు, ముగింపులో చమత్కారం – వాటిమాటేమిటి అని ఆలోచిస్తున్నాను. ఇంతకీ ఆనవలలో నీకు నచ్చినవేమిటో చెప్పనేలేదు.”

“మొదటిది ఆ రోజుల్లో ప్రయాణాలు. కంచరగాడిదలమీదా, గుర్రాలమీదా మైళ్ళకి మైళ్ళు ప్రయాణాలూ, దారిపొడుగునా వారు ఎదుర్కొన్నప్పుడల్లా స్థానిక ఇండియనులు సాయం చెయ్యడం, ఆ తరవాత వారియందు ఆయనకి సద్భావం కలగడం, వాళ్ళ ఆచారవ్యవహారాలు ఎంతో విపులంగా వివరించడం – ఇవన్నీ అద్భుతంగా ఉంది.”

“నాకు ఇక్కడ మరో అనుమానం. ఆమధ్య ఒక రచయిత అన్నారు పాఠకులు చదవకుండా దాటేసే భాగాలు రాయొద్దని. మరి వర్ణనలు చాలావరకూ దాటేయొచ్చు కదా.”

“అందుకే నేను ప్రత్యేకించి చెప్తున్నది. ఈవిడ ఒకమనిషినో ఒక ఆచారాన్నో వర్ణస్తుంటే మనకి మరిన్ని ఇతర విషయాలు కూడా తెలుస్తాయి. ప్రతి పాత్రనీ పరిచయం చేసినప్పుడల్లా, జాతిలక్షణాలూ, వ్యక్తిత్వలక్షణాలూ కూడా ముప్పేటగా అల్లుకుని, మొత్తం వాతావరణం ఎంతో సహజంగా అనిపిస్తుంది. ఆ మనిషే కాక మొత్తం గది అంతా కళ్లముందు మెదుల్తుంది.”

అరవింద ఐఫోనులో చూసుకుంటోంది తాజావార్తలకోసం కాబోలు. నాకు అలాటివి అంతగా నచ్చవు, అది మర్యాద కాదనే నేను అనుకుంటాను కానీ ప్రస్తుతానికి ఏమీ అనదలుచుకోలేదు. అనకపోవడమే మంచిదయింది.

“ఇదుగో,” అంటూ ఆ ఫోను నామొహందగ్గరికి సాచింది. నేననుకున్నట్టు తను కబుర్లకోసం చూడ్డంలేదు. మేం మాటాడుకుంటున్న నవలలోంచి ఒక పేరా చూపించింది.

He was dark in coloring, but the long Spanish face, that looked out from so many canvases in his ancestral portrait gallery, was in the young Cardinal much modified through his English mother. With his caffe oscuro eyes, he had a fresh, pleasant English mouth, and an open manner.

అలాగే మరొకాయనగురించి, “His bowed head was not that of an ordinary man,- it was built for the seat of a fine intelligence. His brow was open, generous, reflective, his features handsome and somewhat severe. There was a singular elegance about the hands below the gringed cuffs of the buckskin jacket. … ఇలా సాగుతుంది.”

“ఓ,” అన్నాను ఆవాక్యాలు చదివి. నిజమే. ఆ వాక్యాలు చదువుతుంటే చాలా విషయాలే తెలుస్తున్నాయి ఆమనిషిగురించి.

పెద్దక్కయ్య కుర్చీపక్కన నేలమీద ఉన్న  పుస్తకం వొంగి తీసుకుని, తాను చదివినమేరకి గుర్తుగా కాగితంముక్క పెట్టుకున్న చోట తెరిచి, అంది, “ప్రదేశాలు వర్ణంచేటప్పుడు కూడా చాలా సూక్ష్మవిషయాలు ఎంతో పొందిగ్గా అమరుస్తుంది చిత్రకారుడు బొమ్మ గీసినట్టే, అంటూ చదవసాగింది, “He had been riding among them since early morning, and the look of the country had no more changed than if he had stood still. He must have travelled thirty miles of these brick-dust, and naked of vegetation except for small juniper trees. And the juniper trees too were the shape of Mexican ovens. … The hills thrust out of the ground so thickly that they seemed to be pushing each other, elbowing each other aside, tipping each other over.”

చదువుతున్న ఆవిడమొహం చూస్తే నాకు ముచ్చటేసింది. నాకిలా ఎవరో చదువుతుంటే వినే అలవాటు ఎప్పుడో చిన్నప్పుడుంది కానీ ఈమధ్యకాలంలో జరగలేదు. కాగితంమీద మాటలకి గొంతుక ఎరువిస్తే అంత బాగుంటుంది మరి. ఆమాటే అన్నాను.

“నువ్వు చదువుతుంటే మరింత అందం వచ్చింది ఆవాక్యాలకి.”

“ఇప్పుడు ఆడియో పుస్తకాలు దొరుకుతున్నాయి కదా,” అంది అరవింద.

నేను తలూపేను అవునన్నట్టు. కానీ ఆ అనుభవం వేరు. ఇలా ఎదురుగా మరో మనిషి కూర్చుని చదవడం వేరు.

“విల్లా కాథర్‌కి భాషగురించి, Jacinto usually dropped the article in speaking Spanish, just as he did in speaking /English, though the Bishop had noticed that when he did give a noun its article he used the right one. The customary omission, therefore, seemed to be a matter of taste, not ignorance. In the Indian conception of the language, such attachments were superfluous and unpleasing, perhaps. – ఇది చదువుతుంటే నాకు నవ్వొచ్చింది. మనకి కూడా ఆ ఆర్టికల్స్ అగమ్యగోచరమే కదా,” అంది లీల.

“అలాగే అవిడకి ఒకొక జాతివిలువలగురించి కూడా నిర్దుష్టమైన అభిప్రాయాలు ఉన్నట్టు కనిపిస్తోంది. ఒకచోట ఏ మిషనరీ ఏం సాధించగలడు అని చర్చించుకుంటున్నసందర్భంలో అంటుంది

Spanish fathers made good martyrs, but the French Jesuits accomplish more. They are the great organizers. … The French missionaries have a sense of proportion and rational adjustment. They are always trying to discover the logical relation of things. … The Germans classify, but the French arrange.

బిషప్‌కి అమెరికనులు ఇండియనులని ఎంతగా హింసించేరో, అవి తప్పించుకోడానికి ఇండియనులు ఎలాటి అవస్థలు పడవలిసివచ్చిందో రచయిత్రి చెప్తుంటే మనకి కూడా ఆ ఇండియనులంటే గౌరవం ఏర్పడుతుంది.

A man can do whole lot when they hunt him day and night like an animal. Navajos on the north, Apaches on the south; the Acoma run up a rock or to the see.

All this plain, the Bishop gathered, had once been the scene of a periodic man-hunt; these Indians, born in fear and dying by violence for generations, had a at last taken this leap away from the earth, and on that rock had found the hope of all suffering and tormented creatures- safety.

“మీమాటలు చూస్తుంటే నాకొకటి తోస్తోంది. ఇండియనులంటే వీళ్ళకి హీనమైన అభిప్రాయం ఉంది. మనదేశంలోనూ అంతే జరిగింది. ఇంగ్లీషువాళ్ళు మనవాళ్ళని క్రిస్టియనులుగా మార్చడానికి చాలా కృషి చేసేరు కదా. అలాగే ఈ ఫ్రెంచి బిషప్పులూను. ఎటొచ్చీ, ఈ ప్రధాన బిషప్ వైలాంట్, స్నేహితుడు లటూర్ – ఇద్దరికీ ఎదురైన ఒకొక ఇండియను, ఒకొక ఇండియను కుటుంబం – మూలంగా వారికి ఇండియనులతో స్నేహాలు ఏర్పడతాయి. మనదేశంలో హిందువులూ, ముస్లిములూ రాజకీయాలనేపథ్యంలో కొట్టుకున్నా, విడివిడిగా వ్యక్తిస్థాయిలో స్నేహాలు ఏర్పరుచుకున్నట్టే. అందుకే ఈ పుస్తకం మీకంత నచ్చిందేమో అనిపిస్తోంది.”

“అది ఒక కారణం కావచ్చు.”

“ఇలా చెప్పుకుంటూ పోతే మన హరికథల్లా తెల్లారిపోతుంది,” అంది లీల కిటికీవేపు చూసి.

నేను గోడనున్న గడియారం చూసేను. పదకొండు. “అయ్యో, చాలా ఆలస్యం అయిపోయింది. పదండి, మరోరోజు మిగతా కథ,” అన్నాను లేస్తూ.

“పోనీ, ఈరాత్రికి ఉండిపోండి. తెల్లారి లేచి వెళ్దురుగాని,” అంది పెద్దక్కయ్య.

నేను మిగతా ఇద్దరిమొహాలు చూసేను.

“మీకు ఇబ్బంది అవుతుందేమో,” అంది లీల.

“ఇబ్బందేమిటి. మనం ఇండియనులం,” అంది పెద్దక్కయ్య నవ్వి.-

—-

గమనిక: ఇందులో ఉదహరించిన భాగాలు Death comes for the Archbishop అన్నపుస్తకంలోనించి తీసుకున్నాను. ఆ పుస్తకం లింకు http://www.feedbooks.com/book/2118/death-comes-for-the-archbishop

ఫీడ్బుక్స్ వారికి కృతజ్ఞతలు. Gutenberg.org లో కూడా లభ్యం. 

(సెప్టెంబరు 12, 2013)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

5 thoughts on “ఇండియనులం!”

  1. >> “ఇబ్బందేమిటి. మనం ఇండియనులం,” అంది పెద్దక్కయ్య నవ్వి.

    మీరెలాగా ఏదో అనుకుంటారులెండి కానీ, ఈ ఒక్క వాక్యం కోసం ముందర అంత సుత్తి అవసరం అని అనిపించింది నాకు. బోరు కొట్టించేసారు; మిగతా “మార్పు” భాగాల కంటే 😦

    ఇలా రూడ్ గా రాసానని ఏమీ అనుకోకండేం? 🙂

    మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.