ఊసుపోక – ఈ ఆడాళ్ళు కూరెలా తరుగుతారో :(

(ఎన్నెమ్మకతలు 124)

హా, ఆగు, ఈ ఆడాళ్లంటావు, నువ్వు మాత్రం … అంటూ మొదలెట్టకు. నాకు తెలుసులే నీకొచ్చే ప్రథమ సందేహం అదేనని. “కూరలు తరగగల ఆడాళ్ళు” అన్న పరిమితార్థంలో నేనంటున్నది. ఏం జరిగిందా? చెప్తాను, విను.

కాపురానికొచ్చినకొత్తలో కూరలు తరగడం ఎలాగో అని దిగులుపడుతుంటే మాయింటికి తరుచూ వచ్చే పిహెచ్.డి కుర్రాడొకడు ఆదుకున్నాడు నన్ను. ఎనిమిది చేతులూ, శంఖచక్రాలూ లేవు కానీ నాప్రాణానికి ఆపూట ఆపద్భాంధవుడిలాగే కనిపించేడు. పాపం, అతనికి తెలుగువంటకాలు చాలా ఇష్టంట. “నేను కత్తి తెచ్చిపెడతాను, మీరు కూర చేసి పెట్టండి” అన్నాడు. అలాగే అంటూ ఒప్పేసుకున్నాను మహోత్సాహంతో. “మరి ఎలాటి కత్తి కావాలి, చిన్నదా, పెద్దదా, మొత్తం సెట్టు తేనా, ఒక్క కత్తి చాలా” … ఇలా సందేహాలు వెలిబుచ్చేడతను. అంతవరకూ నాకూ తెలీదు ఇన్ని కరవాలాలున్నాయని.  సుమారుగా కూరలు తరుక్కునేదొకటీ, మేకలు నరుక్కునేదొకటీ మొత్తం రెండుంటాయనుకున్నాను. అలా కాదుట, వంకాయకొకటీ. గుమ్మడికాయకొకటీ, బీరకాయ పొట్టు చెక్కడానికి ఇంకోటీ. ఉల్లికొకటీ, అల్లానికి మరొకటీ … వెల్లుల్లికి వేరే ఉంటుందిట, దాన్ని ప్రెస్సరంటారుట, అది మళ్ళీ నిమ్మకాయకి పనికిరాదుట – ఇలా అతను నాకు ఎంతో ఓపిగ్గా పాఠం చెపుతుంటే, కళ్లు తిరిగేయి. అమ్మో, ఈదేశం ఎంత పురోభివృద్ధి చెందినదేశం, వీళ్ళెంత సూక్ష్మపరిశీలకులు అని నోరు తెరుచుకు కళ్లప్పగించి చూస్తూ ఉండిపోయేను. నాకళ్లు మెరిసేయేమో కూడా కన్నీళ్లతో. అతను జాలిగా నావేపు చూసి, అవున్లే, నాకు తెలుసు మీదేశంలో ఇన్ని రకాలు లేవు అన్నాడు.

అతను అలా అనడానికి రెండు కారణాలున్నాయి.

నేను ఈదేశం వచ్చేనాటికి, మాఇంట్లో మేం కత్తిపీటలే వాడుతున్నాం. నేలమీద కూర్చుని, కాలితో పీట కదలకుండా పట్టుకుని, నిలువుకత్తిమీద వంకాయో, గుమ్మడికాయో రెండు చేతులా పుచ్చుకుని తరిగేరోజులవి. నీకూ తెలుసు కదా కడవంత గుమ్మడికాయ కత్తిపీటకి లోకువ. గుమ్మడికాయ అయినా పచ్చిమిరపకాయ అయినా ఆ కత్తిపీటతోనే అయిపోయేది పని. ఆరోజుల్లో అన్నమాట ఆ పిహెచ్.డీ అబ్బాయి ఇండియా వెళ్ళేడు. కత్తిపీట చూసి, ముచ్చట పడి ఒకటి తెచ్చుకున్నాడు కూడా. అప్పటికింకా ఎయిర్పోర్టుల్లో ఇప్పుడున్నంత పకడ్బందీగా జాగ్రత్తలు లేవు. ఇదుగో, ఇది తెస్తున్నాను అని వారి కళ్ళముందొకసారి ఆడిస్తే చాలు నైవేద్యం పెట్టినట్టు. సరే, పో అని పంపేసేవారు.

ఇంతకీ ఇలా కత్తులసమాచారం సకలం తెలిసిన ఆ పెద్దమనిషి అన్నిటికీ పనికొస్తుందిలే అని మూరెడు కత్తి తెచ్చిచ్చేడు నాకు. చెప్పొద్దూ, అది చూడగానే గుండె దడదడలాడింది. కూరలు తరుక్కోడానికి అని చెప్పలేదు కానీ మేకలు నరకడానికి కాదని నేను ప్రత్యేకించి చెప్పలేదు కదా అనిట. చాలా పదును, జాగ్రత్త అని కూడా చెప్పేడు.

గత నలభైఏళ్లగా అదే వాడుతున్నాను కూరలు తరుక్కోడానికీ, కొబ్బరికాయ కొట్టడానికీ కూడా. ఆ రెండో వాడకంమూలంగా ఈమధ్య పిడి వదులయిపోయి, కదులుతోంది. మళ్ళీ అలా వాడబోతే, ఎగిరి నామొహంమీదో, ఎదటివారిమొహమ్మీదో గంటు పెట్టే ప్రమాదస్థాయికి వచ్చింది. ఇహ తప్పదని, వారంరోజులకిందట నేను మళ్ళీ మరో కత్తి కొనుక్కోడానికి బయల్దేరేను. నా కత్తిబజారు కార్యక్రమం అంతా చెప్పను కానీ, ఈసారి మూరెడు కాక జానెడుపొడుగుది తెచ్చుకున్నానని మాత్రం గ్రహించగలరు. ఈమారు అది చాలాపదును, జాగ్రత్త అని చెప్పడానికెవరూ లేరు. కానీ, 40 ఏళ్ళు అమెరికాలో ఉన్నాక ఆ మాత్రం తెలీదేమిటి ఎవరికి మాత్రం – అదే మనజాగ్రత్తలో మనమే ఉండాలని, అంచేత నాకు నేనే చెప్పుకుని మమ అనుకున్నాను శ్రద్ధాభక్తులతో.

జాగ్రత్తగా ఉన్నాననే అనుకున్నాను. కాయ బల్లమీద పెట్టి తరగబోయేను. కాయ టప్మని తెగింది. రెండో ముక్క తరగబోతున్నాను. బల్లమీద ఎర్రగా చార కనిపించింది. … ఎక్కడినించి చెప్మా అని చూస్తున్నా, మరి బీరకాయ ఎర్రగా ఉండదు కదా. అప్పుడు గ్రహించేను నావేలునించని.

గబగబ కొళాయి తిప్పి, చన్నీళ్ళకింద చెయ్యి పెట్టి, తెగినవేలు బొటనవేలితో నొక్కి పట్టుకుని, వంటింట్లో గిన్నెలూ, తప్పేలాలూ ఎక్కడివక్కడ వదిలేసి, ఈపూటకి తాజాగా, వేడివేడిగా ఒండుకు తినే అదృష్టానికి నోచుకోలేదు, టీవీలో ఏదైనా సరదాగా ఉందేమో అని చూస్తూ కూర్చున్నాను. అదేం ఖర్మో, నేను ఎప్పుడు టీవీ చూడబోయినా, ప్రకటనలతోనే తెరుచుకుంటుంది తెర. గోరుచుట్టుమీద రోకటిపోటులా, సాటిలేని, ఆ జన్మాంతం మొక్క వోని కత్తి ప్రకటనతో మొదలయింది నా టీవీ ఆనందం. నాకెప్పుడూ అనుమానమే. ఈ టీవీ ప్రకటనల్లో రానున్న రెండు క్షణాల్లో కొనేస్తే, రెండు రెట్లు ఆదా అంటాడు. కానీ మనం ముందు డబ్బు పంపేయాలి. ఎలా నమ్మడం, వాడు డబ్బు తీసుకుని వస్తువు పంపకపోతే ఏం చెయ్యడం? ఇలాటి కథలు కూడా వింటూనే ఉన్నాం మరి. నిజానికి నేనొచ్చినకొత్తలో, అదే ఆ పిహెచ్.డీ బాబు పరిచయం కాకముందు ఒకటి ఆర్డరు చేసేను. తీరా వచ్చినవస్తువు చూస్తూ, వాడు టీవీలో చూపినదానికి నాకు చేతికొచ్చినదానికీ ఎక్కడా సంబంధమే లేదు. మ్.

రెండోరోజు చిన్నచీటీమీద “జాగ్రత్త, ఈకత్తి పదును” అని రాసి కళ్లముందు గోడకి అంటించి, దాన్ని చూస్తూ ఉల్లిపాయ తరగడం మొదలు పెట్టేను. ఉల్లిపాయ మంచి ఘాటుగా ఉందేమో కళ్ళలో మళ్ళీ నీళ్లు, ఆ నీటిపొరలమధ్య నాచీటీ మసకమసకగా కనిపిస్తోంది. కటింగుబల్లమీద ఎర్ర ఉల్లిపాయరంగు పాకినట్టు కనిపిస్తోంది. ఎర్ర ఉల్లిపాయరసం ఒకొకసారి తెల్లటిబల్లమీద జీరలుజీరలుగా కనిపించడం మామూలే కానీ ఈ ఎరుపు కొంచెం ఎక్కువగా ఉంది. చటుక్కున ఉల్లిపాయ వదిలేసి, వేలు విదిలించేను.

ఆవిదంగా కౌంటరమీదే కాక, కింద కబర్డుతలుపుమీదా, వెనక ఫ్రిజిమీద, నాచుట్టూ గోడలమీదా రకరకాల డిజైనులు మన టయ్యెండ్రై చీరెల్లా అలుముకున్నాయి. నయనానందంగా కాదులే. కళ్లు తిరిగి పడిపోడానికిది సమయం కాదని, నిలదొక్కుకుని, మళ్లీ చెయ్యి కొళాయికింద పెట్టేను కొంచెంసేపు. నాలుగు నిముషాలకి రక్తధారలు తగ్గినట్టే అనిపించి, అక్కడ చెదురుమదురుగా కనిపిస్తున్న రక్తపుచారలు తుడవడం మొదలు పెట్టేను. తుడుస్తూంటే మళ్లీ వేలునించి తడి తగిలింది. ఆధునిక తెలుగుకథలా గంటు లోతుగానే ఉంది కాబోలు అనుకుని హడావుడిగా పక్కగదిలోకెళ్ళి ప్రథమచికిత్స సరంజామాకోసం చూస్తే, అక్కడ తెగినవేలుకి కట్టు కట్టడానికి పనికొచ్చేదేమీ కనిపించలేదు. అవును మరి, పిల్లలున్న ఇల్లయితే అస్తమానం కాలో చెయ్యో గీరుకుపోయిందంటూ వస్తారు, అలాటివి తప్పనిసరిగా సిద్ధంగా ఉంచుకోవాలి, అంతేగానీ నాకెందుకూ, నేను కూర్చుంటే లేవడమే కష్టం, ఇంక పడడం ఎక్కడ, మోకాలో మోచెయ్యో చీరుకుపోడం ఎక్కడ? …

హాహహా. ఈ కబుర్లకేం గానీ ఆ చెయ్యి చూసుకుందూ ముందు, కార్పెట్మీద రక్తం చిందితే మేనేజరు మొత్తం కార్పెట్టు మార్చమంటాడు నీ సొంత ఖర్చులతో.

వేలు మళ్ళీ చూసుకున్నాను, ఇహ లాభం లేదు, ప్రథమచికిత్స సరంజామా కొనక తప్పదు అంటూ వీధిచివరనున్న దుకాణంలో ఏ బాండెయడో దొరక్కపోతుందా అని బయల్దేరబోయేను. తలుపు తీయబోతుంటే, తలుపుమీద ఎర్రగా వేలుముద్రొకటి పడి, జాగ్రత్త అని కళ్ళెర్ర జేసింది. మరోసారి గుర్తు తెచ్చుకున్నాను నేను అతిజాగ్రత్తజనులమధ్య ఉన్నాను. నేనిలా రక్తసిక్తహస్తంతో బయటికి వెళ్ళేనంటే, ఏమైంది అని నన్నడగడానికి ముందే తొమ్మిదీపదకొండు కొట్టేస్తారు. ఆ వెంటనే ఓ ఆంబులెన్సూ, రెండు ఫైరుట్రక్కులూ, ముగ్గురు బీటు పోలీసులు వచ్చేసి నాముందు నిటారుగా నిలబడి, నిదానంగా ప్రొసీజరు ప్రశ్నలేస్తారు, “ఇంగ్లీషొచ్చా,” “ఒక్కదానివే ఉన్నావా?” “కళ్ళు కనిపిస్తాయా?” “చెవులు వినిపిస్తాయా?”

నాకేమో అరవాలనిపిస్తుంది, “వాటన్నిటికీ ఇంగ్లీషులోనే జవా బులు తరవాత చెప్తాను, ముందు నావేలికి బేండయిడుంటే ఇయ్,” అని. కానీ నేనలా అరవడం ప్రొజీజరు కాదు. అంచేత ఓపిగ్గా జవాబులివ్వాల్సొస్తుంది. ఈలోపున నావేలినుంచి రక్తం మరింత చిమ్ముతుంది …

అలాటి ప్రొసీజరుకి ప్రతిబంధంగా నావేలికి చేతికందిన రుమాలొకటి తడిపి చుట్టి, దానిమీద మరో రుమాలు చుట్టి, దానికి ఓ ప్లాస్టిక్ సంచీ తగిలించి, ఆ చెయ్యి ఎవరికీ కనిపించకుండా పేంటుజేబులోకి దోపి, రాజు వెడలే అన్నట్టు బయల్దేరేను నేను కొనబోయే రెండు డాలర్ల బాండెయిడులకోసం.

తిరిగొచ్చేక, వేలు నరుక్కోకుండా కూర తరుగుట ఎట్లు అన్న పాఠాలు నేర్చుకోడానికి ఆన్లైను కోర్సులేమైనా ఉన్నాయేమో చూడాలి. లేదా ఏ జ్యోతిగారింటికో వెళ్ళిపోయి, కానున్న కుర్రడాక్టరులా రెసిడెంసీ లేక ఇంటర్షిప్పు చేయాలి. అదేదైనా జరిగినప్పుడు మిగతా కథ చెప్తాను.

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

13 thoughts on “ఊసుపోక – ఈ ఆడాళ్ళు కూరెలా తరుగుతారో :(”

 1. జిలేబీ, పైన మరోవ్యాఖ్య చూడండి. మూడు తరాలుగా మగవాళ్ళే తరుగుతున్నారంటున్నారు. అయినా నేను మాటాడుతున్న విషయం అది కాదనుకోండి. శ్రవ్యగారు కూడా అలాగే అంటున్నారు. వారెవరూ మీరన్న అర్థంలో కాదు మరి.

  మెచ్చుకోండి

 2. అబ్బే,

  అస్సలు కత్తి లేకుండా నే ‘ఆండోళ్ళు’ మగవాళ్ళని తరుగు’ తుంటారు – ఇక కాయ గూరలు ‘తరగడం’ (కాకుంటే కోసేయ్యడం) కష్టమా మరి !!

  ( జ్యోతి వారే చెప్పాలి ఇక సమాధానం!)

  మెచ్చుకోండి

 3. సున్నా, మీరు చెప్పేక చూస్తే, స్పాంలో ఉంది. సరే, ఇప్పుడు ఆమోదించబడింది కనక శాంతించగలరు. ఆడలేడీస్ అనడం నాకిష్టం లేదు. మీరంటే మీయిష్టం. వేలు అంత ప్రమాదమేమీ లేదండి. ఏదో ఊసుపోక రాయడానికి పనికొచ్చిందంతే.

  మెచ్చుకోండి

 4. మా ఇంట్లో ఆనవాయితిగా మూడు తరాలుగా
  కురగాయలు కోసే పని మగవారిదే!
  కూరగాయలు కోసేటప్పుడు
  నోప్పి లేకుండా రక్తం వచ్చేటట్లు వేళ్ళు
  కోసుకుంటున్నారంటే ప్రమాదమే,
  డాక్టర్ని సంప్రదించండి సెన్సేషన్స్ పరీక్షించుకోండి, please.

  మెచ్చుకోండి

 5. కూరగాయలు ముందు మైక్రోవేవులో పెట్టి తరువాత శుబ్బరంగా చేత్తో తరుక్కోవడమే.
  ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలు, క్యారట్లు వంటివి.
  గోరుచిక్కుడుకాయలు అయితే చేత్తో తుంపుకోవడమే, బీన్స్ కూడా.
  బెండకాయలు వంటివి కత్తికి వేలు బాగా దూరం పెట్టుకొని తరుక్కోవచ్చు.
  కొన్నింటివిక స్పూన్ వాడవచ్చు.

  మెచ్చుకోండి

 6. హెడింగ్ తప్పు పెట్టేరు. ఈ “ఆడ లేడీస్” అని ఉండాలి మన సినిమా సాహిత్యం ప్రకారం. అమెరికా వచ్చిన నలభై ఏళ్ళకి మొత్తానికి చేయి కోసుకున్నారు. ఇంకా నయం ఒకటి కన్న ఎక్కువ వేళ్ళు కోసుకుపోతే బ్లాగులో రాయడానికి ఇంకో వారం ఉండాల్సి వచ్చేది కదా? ఇప్పుడు పాత పుస్తకాలు తీసి దుమ్ము దులపండి చదవడానికి. దుమ్ము వేలు కోసుకున్న చోట పడితే సెప్టిక్ అయ్యి వేలు తీసేస్తారు తర్వాత. చెప్పలేదని తర్వాత నా మీద ఎగుర్తారు మరి. 🙂

  [చి. తోక: ఇంతకీ ఏం తిన్నారు వేలు కోసేసుకున్నాక? పాత చింతకాయ పచ్చడి లేదా జాడీలో? కావాలంటే చెప్పండి నేను పంపిస్తా :-). ఇంత పోపు వేసుకుని లాగించేయడమే.]

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.