చిన్నకథలో పాఠకుడి పాత్ర

నూటయాభై ఏళ్ళక్రితం Edgar Ellen Poe తయారు చేసిన ప్రమాణాలతో మొదలయి, చిన్చకథ లక్షణాల చర్చ ఇంకా సాగుతూనే ఉంది. తెలుగుదేశంలో 20వ శతాబ్దం మొదట్లో చిన్నకథలస్వరూపంమీద  డి.ఎ. నరసింహంగారు, అక్కిరాజు రామాకాన్తము గారివంటి రచయితలు వెలిబుచ్చిన  అభిప్రాయాలకి మూలం ఆ పాశ్చాత్యసంప్రదాయాలే. నిన్నా మొన్నటి వల్లంపాటి వెంకటసుబ్బయ్యగారు కథాశిల్పంలో సూచించిన ప్రమాణాలూ అవే. సూక్ష్మంగా చిన్నకథ లక్షణాలు – ఒకే ఒక అంశం, ఆ ఆంశం ఆవిష్కరించడంకోసం పాత్రలు, సన్నివేశాలు, వాతావరణం కల్పించడం జరుగుతుంది. చిన్నకథలో పొదుపు  ప్రధానం. రచయిత సందేశమో ప్రశ్నో పాఠకుడి మనసులో ముద్ర వేయడానికి తగిన భాష దోహదం చేస్తుంది. రచయిత తనకి పరిచితమైన జాతీయాలూ, ఉపమానాలూ, ఇతర కళలు సంగీతం, చిత్రలేఖనం, నాట్యం లోగల ప్రవేశం వాడుకుని కథని మరింత ఆకర్షణీయం చేస్తాడు. ఫలశృతి – కథ చదవడం పూర్తయేవేళకి పాఠకుడికి మంచి కథ చదివేనన్న తృప్తి కలగాలి. ఆ తరవాత, దాన్నిగురించి ఆలోచించుకోడానికి అవకాశం ఇవ్వాలి. పొదుపుమూలంగా వదిలేసిన చాలా అంశాలు పాఠకుడు ఆలోచించుకోవాలి. అంచేతే చిన్నకథ రాయడం కష్టం అంటారు. నవలలో అనేక విషయాలు పుస్తకాల్లోంచీ, జాలంలోంచి సేకరించి, పొదగవచ్చు, చిన్నకథకి కార్ఖానా పాఠకుడి మేధే!

నిజానికి మన అమ్మమ్మలు, తాతయ్యలూ, వాళ్ళ అమ్మమ్మలూ, తాతయ్యలు కథలు చెప్పినప్పుడు ఇందులో పాత్రచిత్రణ ఎలా ఉంది, కథలో లోతుందా, నీతుందా అంటూ చర్చలు చెయ్యలేదనే అనుకుంటున్నాను. ఇప్పుడు కూడా అనేకమంది ఏ పుస్తకాలూ చదవకుండా, ఏ కథలబడిలోనూ పాఠాలు చెప్పించుకోకుండా కథలు రాస్తున్నారు. అవి ప్రచురణ అవుతున్నాయి. అందులో కొన్నయినా పదిమందిచేత శభాషనిపించుకుంటున్నాయి.

ఈ నేపథ్యంలో అసలు చిన్నకథని ఎలా చదువుతాం, దానిమీద మనకి అభిప్రాయాలు ఎలా ఏర్పడుతున్నాయి, అవి ఎలా ప్రకటితమవుతున్నాయి అన్న అంశాలు పరిశీలించడానికి ప్రయత్నిస్తాను.

నాతరం, తరవాతితరంలో కూడా పత్రికలు కథలకి స్థానం కల్పించేయి. ఆరోజుల్లో పాఠకులు తమ అభిప్రాయాలు సంపాదకులకి ఉత్తరాలద్వారా తెలియజేసేవారు. చేత్తో రాయడం, పోస్టులో పంపడం, సంపాదకులు వాటిని చదివి ప్రచురణకి అర్హమవునో కాదో నిర్ణయించుకోడం – ఇవన్నీ జరగడానికి మూడు నాలుగు వారాలు పట్టేది. ఒకొకప్పుడు ఆ అభిప్రాయాలు దుడుకుగా ఉంటే, సంపాదకులు కత్తెర వేసేసేవారు. అంచేత, ఆరోజుల్లో వ్యాఖ్యరచన ఈనాటివారితో పోలిస్తే తక్కువే. అయినా బొత్తిగా లేకపోలేదు. పాఠకులవ్యాఖ్యలకి రచయితలు జవాబు కూడా ఆ పత్రికలోనే ప్రచురించేవారు. అంటే మరో 3,4 వారాలమాట అదీ వారపత్రిక అయితే. మాసపత్రిక అయితే ఈకాలయాపన చెప్పఖ్ఖర్లేదు కదా.

మహారచయితలు వాదోపవాదాలు, వైయక్తికంగానూ వస్తుపరంగానూ కూడా వాదించుకోడం తరతరాలుగా ఉంది. ఆధునిక సాహిత్యమే తీసుకుంటే, వీరేశలింగంగారూ, కొక్కొండ వెంకటరత్నం పంతులుగారూ తమతమ పత్రికలలో ఒకరినొకరు బాగానే హేళన చేసుకున్నారు. అలాగే నిడుదవోలు వెంకటరావుగారు ఆరుద్రగారిని ఏదో అని, తరవాత “ఏదో పెద్దవాళ్ళం అంటాం, యువకులు మీరు అవి పట్టించుకోకూడదు” అన్నారుట, పరోక్షంగా క్షమాపణ చెప్పుకోడం అది.

రెండురోజులక్రితం అనుకోకుండా yabaluri.org సైటులో 1939నాటి త్రివేణి పత్రికలు కనిపించేయి. అందులో తెలుగుకథమీద శ్రీశ్రీ వ్యాసం, దానిమీద యమ్. సచ్చిదానంద శర్మగారు సంపాదకులకు రాసిన లేఖ, ఆలేఖకి శ్రీశ్రీ జవాబు చూసేక, ఈ టపా రాయాలనిపించింది. త్రివేణి మాసపత్రిక కనక ఈ ఉత్తరప్రత్యుత్తరాలు జరిగే సమయంలో రచయితలకీ, వ్యాఖ్యాతలకీ కూడా చిరాకులూ పరాకులూ చప్పపడిపోయి, ఆ వాదోపవాదాలు అట్టే కాలం కొనసాగించలేదనుకుంటాను.

yabaluri.org వారికి కృతజ్ఞతలతో, శ్రీశ్రీ వ్యాసం, దానిమీద వ్యాఖ్యానం, శ్రీశ్రీ జవాబు, లింకులు ఇవిగో –http://yabaluri.org/TRIVENI/CDWEB/TheShortStoryinTeluguaug39.htm

http://yabaluri.org/TRIVENI/CDWEB/ALettertotheEditorsnov39.htm

సుప్రసిద్ధ రచయితలు వైయక్తికస్థాయిలో అధిక్షేపణలు ఎన్ని చేసుకునే సాంప్రదాయం ఉంది కానీ నాలాటి సామాన్య పాఠకులు మాత్రం రచయితలని ప్రశ్నించడం తక్కువే ఆ రోజుల్లో. అప్పట్లో మేం ఒక పుస్తకమో ఒక కథో చదివితే, మాకెంత అర్థమయిందో, దాన్నించి ఏం గ్రహించేమో చూసుకోడమే కానీ రచయితలని మీరలా ఎందుకు రాసేరు, ఇలా ఎందుకు రాయలేదు అని ప్రశ్నించేవాళ్ళం కాదు. నిజానికి చిన్నకథకి సంబంధించినంతవరకూ అలా ప్రశ్నలు సమంజసం కాదనే అనిపిస్తోంది. ఈ విషయానికి మళ్ళీ వస్తాను.

ఇప్పుడు చాలా మార్పులు వచ్చేయి. రచయితలసంఖ్య పెరిగింది. పాఠకులసంఖ్య పెరిగింది. పాఠకులు చదవడం ఎక్కువయింది. వారి ఆలోచనాధోరణిలో పెద్ద మార్పులే వచ్చేయి. వీటన్నిటితోపాటు ప్రచురించే అవకాశాలు పెరిగేయి.

ఈనాటి ఆవరణ తీరు – ఇప్పుడు కలం పుచ్చుకుని తీరిగ్గా కూర్చుని రాయాలన్న సరదా లేదు, రాయడానికి సమయమూ లేదు. ఆఫీసులోనూ, కాఫీషాపులోనూ, కార్లోనూ కూర్చుని ఐఫోనులో రోమనులిపిలో కొట్టేస్తున్నారు. చూసేరా రాయు అన్న క్రియకి వచ్చిన మార్పు! ఆవరసలోనే ఆలోచించడం తగ్గిపోయినట్టనిపిస్తోంది. ముఖ్యంగా వ్యాఖ్యలు రాసేటప్పుడు, ఓ కథో వ్యాసమో చదవగానే ఆనందంతోనో ఆవేశంతోనో కావేషాలతోనో తమ స్పందన టకటక కొట్టేస్తున్నారు. అందరూ అలా కాదని ఒప్పుకుంటాను. బ్లాగులు, ఫేస్బుక్కులు, లింక్డిన్లు, ఇంకా నాకు తెలీని మరేవో జాలవేదికలన్నిటిలోనూ ఈ సౌకర్యం ఉంది కదా. నాలుగిళ్ళచావిళ్ళలోనూ, వాకిట్లో వేపచెట్టుకిందా, ఊళ్లో రచ్చబండమీదా చెప్పుకునేలాటి కబుర్లు చెప్పుకోడానికి ఈ అంతర్వేదికలమీద అవకాశం ఏర్పడింది. ఆవాతావరణంలో ఉండే ఆత్మీయతలు కూడా అలాగే ఏర్పడుతున్నాయి. ముఖాముఖీ కలవకపోయినా, అమ్మవంకో అబ్బవంకో ఏ బంధుత్వాలు లేకపోయినా, అంతటి ఆత్మీయతలు ఏర్పడుతున్నాయి. దానివల్ల లాభం బీరకాయపీచు సంబంధాలలాటి సంబంధాలు కలుపుకుని, అరమరికలు లేకుండా మంచీ సెబ్బరా హాయిగా మాటాడేసుకోడం. అక్కా, అన్నా అంటూ వరసలు కూడా కలుపుకునేస్తున్నారు ఈ జాలచక్రంలోనే. ఇది ఆనందించదగ్గ అంశం. అంటే ప్రపంచీకరణపేరుతో దూరం అయినవాళ్ళు మరోరకంగా దగ్గరవడానికి అవకాశం ఏర్పడుతోంది.

నష్టం ఏమిటంటే – ఇంకొంచెం వివరంగా చెప్పాలి. ఇలా చుట్టరికాలు కలుపుకుని అరమరికలు లేకుండా మాటాడేసుకోడం బాహాటంగా చేస్తున్నారు. అలా ఇద్దరు ఒకరితో మరొకరు తమాషాకో వేళాకోళానికో, తమ తెలివితేటలు ప్రదర్శించుకోడానికో కాస్త దురుసుగా మాటాడితే, ఆ ఇద్దిరమధ్య అనుబంధాలు తెలీని మిగతావారికి అది కటువుగా కనిపిస్తుంది. దాంతో వారు పూనుకుని మరో పాఠం పెడతారు. రెండో నష్టం, కొందరు కథమీద కాక తాము చదివిన సిద్ధాంతాలు మనసులో పెట్టుకుని వ్యాఖ్యానించడం. ఇది కూడా ఆచరణీయం కాదు.

ప్రతి చర్యకి ప్రతిచర్య సమానస్థాయిలోనూ ప్రతికూలంగానూ ఉంటుందని ఒక సిద్ధాంతం. సాహిత్యంలో మాత్రం ప్రతిక్రియలు ఒకొకప్పుడు పైస్థాయిలోకి పోతున్నాయి. దాంతో రచ్చ అవుతోంది.

ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నానంటే, ఇది నావిషయంలో జరిగింది. ఇంకా కొందరికి కూడా అనుభవమయి ఉండవచ్చు. ఏ ఇద్దరిమధ్య ఎలాటి స్నేహం ఉందో అంతర్జాలంలో కనిపించదు. వారిద్దరూ అలవాటుయిన ధోరణిలో రాసుకుంటే, మూడోవారు కలగజేసుకుని తప్పులు పట్టడం, దానిమీద రచ్చ జరగడం కూడా సాగుతోంది. నెట్మర్యాదలు పాటించమని చెప్పినమాటలు గాలికి పోతున్నాయి.

ఈ నేపథ్యంలో మనం రాసే వ్యాఖ్యలు, విమర్శలు, సమీక్షలు, పుస్తకపరిచయాలు మరొకసారి తరిచి చూసుకోవలసిన అవుసరం కనిపిస్తోంది. ఇవి రాసేవారందరూ కూడా చాలామటుకు రచయితలే కనక కూడా అర్థవంతమైన వ్యాఖ్యలు, విమర్శలు చేస్తే బాగుంటుంది.

ఈమధ్య రాసిన మార్పు గురించి పాఠకుడు “మనం ఇండియనులం” అన్న ఒక్కవాక్యంకోసం  మిగతాదంతా రాసి బోరు కొట్టించేసారు అన్నారు. ఆవ్యాఖ్యకి నాకు అభ్యంతరం లేదు కానీ మిగతాదంతా ఒదిలేసి, ఆ ఒక్కవాక్యం రాస్తే ఏమర్థమవుతుంది. ఆకథలో ఆవిష్కరించదలుచుకున్నది అమెరికనిండియనులకి కూడా మనలాగే కుటుంబవ్యవస్థమీద గౌరవం. వాళ్ళు కూడా అరమరికలు లేకుండా సర్దుకుపోతారు అని చెప్పలేదు. అది పాఠకుడిదృష్టికి ఆనలేదు.

ఇక్కడ మరోవిషయం కూడా ప్రస్తావించాలి. పాఠకులు తమ అభిప్రాయాలు చెప్పేక, రచయిత తన అభిప్రాయం వివిరించడానికి కూడా అవకాశం ఉండాలి. అప్పుడే మంచి చర్చకి దారి తీసి, రచయితకీ పాఠకుడికీ కూడా తమ తమ ఆవగాహనలు మెరుగు పడే అవకాశం కలుగుతుంది.

ఈనాటి వ్యాఖ్యాతలలో ఈ దృష్టి తక్కువగానే ఉంటోంది. అది విచారకరం.

“రూడ్‌గా అంటున్నానని ఏమనుకోకండి” అంటే చాలదు. కేవలం వస్తువుమీదే దృష్టి పెట్టి, అందులో తామనుకుంటున్న లోపం ఏమిటో, ఎందుకు అలా అనుకుంటున్నారో స్పష్టం చేస్తే రచయితకి ఉపయోగకరం.

అలాగే అబ్బరాజు మైథిలిగారి కథ క్షీరసాగరం లో నిజానికి చెప్పనిది తక్కువే. అయితే శైలి ఆకర్షణీయంగా ఉంది. అంతా తీపే అని కొందరికి అనిపించిందంటే ఆ శైలి మూలంగానే! ఆకథలో చేదు ఉంది. ప్రవల్లిక అలా ముడుచుకుపోవడానికి కారణం ఆమె పెరిగిన వాతావరణం, తన మంచిచెడ్డలు గమనించని తల్లిదండ్రులు –  “కాస్త ఊహ వచ్చినప్పటినుంచీ ఆ ఇల్లు నరకానికి చిరునామా.” కథంతా తీపి అంటే రచయిత్రి తన శైలితో పాఠకుడిని ఆభాగం మరిచిపోయేలా చేసేరనుకోవాలి.

చివరలో ఆముక్త, ఆమె కుటుంబం ప్రవల్లికని మళ్ళీ రమ్మనమని ఆహ్వానించడం కూడా మన సంప్రదాయంలో భాగమే కదా. ఎవరింటికైనా మనం వెళ్తే, మళ్ళీ రండి అంటారు. మనం కూడా తప్పకుండా వస్తాం అంటాం. నిజంగా వస్తామో లేదో, ఆయింటివారు మళ్ళీ పిలుస్తారో పిలవరో – ఇవన్నీ తరవాతి కథ. ఈకథకి మాత్రం సంప్రదాయపరంగానే ముగిసింది. నిజంగా అది ప్రవల్లికలో మార్పు అనుకోడానికి లేదు.

రెండోది ఏ ప్రక్రియమీద ఆప్రక్రియకి అనుగుణంగానే ఉండాలి వ్యాఖ్య. కొట్టినపిండిలా, లోతు లేదు, పాత్రచిత్రణ బలంగా లేదు, తగినన్ని సన్నివేశాలు లేవు వంటి వ్యాఖ్యలు చిన్నకథమీద రాసి ఒప్పించడం కష్టం. చిన్నకథకి ప్రధానలక్షణం పొదుపు. ఎంత సూక్ష్మంగా చెప్తే అంత మంచి కథ అవుతుంది. అంటే, పాఠకులఊహకి వదిలిపెట్టేసేది ఎక్కువ.

చిన్నకథ లక్షణమే అది. కథలో చెప్పేది తక్కువా పాఠకుడు ఆలోచించుకోవలసింది ఎక్కువా. ఉదాహరణకి, రావిశాస్త్రిగారి జరీఅంచు తెల్లచీర కథలో విశాలాక్షి “అందరూ కనకారావులే” అంటుంది. విశాలాక్షి అన్నగారి స్నేహితుడు కనకారావు తనమీద జరిపిన అత్యాచారం కూడా రచయిత పేరాలకి పేరాలు వర్ణించలేదు. కనకారావువ్యక్తిత్వాన్నిరచయిత వర్ణంచకపోయినా ఆ ఒక్కవాక్యంలో పాఠకుడికి అర్థమయిపోతుంది విశాలాక్షి అంతర్మథనం. అర్థమవాలి. కార్నర్ సీటుకథలో పచ్చకోటువాడు రైలుకింద పడి చచ్చిపోతే, ఓ ఆడమనిషి గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది. ఆయన నీకేమవుతాడంటే, “ఎవురు మాతరం ఏటవుతారు బాబూ” అంటుంది. సాటిమనిషి అన్నది అవ్యక్తం. ఆమాట రచయిత చెప్పలేదు. మనం అర్థం చేసుకోవాలి.

ఇంకోలా చెప్పాలంటే, చిన్నకథ కవితలాటిదే. రెండూ పాఠకుడిమనసుని తాకి, అనుభూతిలోంచి ఆలోచనలలోకి తీసుకుపోతాయి. అందుకే చిన్నకథకి “అయిపోవడం” అంటూ ఉండదు. చిన్నకథ పాఠకులకి రచయిత అందించిన ముడి సరుకు.

చివరిమాటగా, పాఠకులూ రచయితా కూడా మంచి చర్చలవల్ల లాభం పొందుతారు. చర్చ అంటే రెండు వైపులా కనక, రచయితలు పాఠకులు కూడా తమ అభిప్రాయాలు వెలిబుచ్చే అవకాశం ఉండాలి. అయితే ఆ చర్చ కథాంశంమీద కేంద్రీకృతమయినప్పుడే. పాఠకులు తమ తెలివితేటలు ప్రకటించుకోడానికి అది వేదిక కాకూడదు.

(అక్టోబరు 15, 2013)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

12 thoughts on “చిన్నకథలో పాఠకుడి పాత్ర”

 1. పూర్ణిమా, మీ అభిప్రాయాలు మళ్లీ చదివేను. రచయితకి లేని పరిమితులు పాఠకులకి మాత్రం ఎందుకు అంటున్నారు. నేను పాఠకుల వ్యాఖ్యలు ప్రత్యేకంగా ఏవో నిబంధనలకి కట్టుబడి ఉండాలని కాదు నేనన్నది. కనీస సాంఘిక మర్యాదలు ఎందుకు పాటించకూడదు అన్నది ఒక ప్రశ్న. రెండోది, విమర్శలు రచయిత తన రచనలని మెరుగుపరుచుకోడానికి ఉపయోగపడతాయన్న ఒక భ్రమ కూడా ఉంది కదా. పొగడ్తలమాట వదిలెయ్యండి. ఈ తెగడ్తలు ఏమైనా ఉపయోగపడేలా ఉన్నాయా? కథలకి సాంఘికప్రయోజనం ఉండాలని అంటున్నారు కదా. చెత్తగా ఉంది అన్న వ్యాఖ్య ఎవరికి ఏవిధంగా ఉపయోగం. మీరన్నట్టు యాంకరమ్మ చీర చెత్తగా ఉందంటే, ఆవిడ చీరె మార్చుకోవచ్చు అది ప్రదర్శనలో భాగం కనక. మీరన్నట్టు కథ వదిలేసి, రచయిత జీవితాన్ని తూర్పారబడితే, దానివల్ల రచనలు మెరుగుపడతాయా? రచయిత should learn to adjust to the challenges అన్నది బాగానే ఉంది. పట్టించుకోడం మానేస్తాను. కానీ దానివల్ల నిజంగా నాకథకి ఏమైనా విలువ ఉందో లేదో అన్నది మాత్రం తెలీదు కదా.

  మెచ్చుకోండి

 2. పూర్ణిమా, చాలాకాలంతరవాత వచ్చినా, రెండు వ్యాఖ్యలలోనూ వెరసి గుప్పెడు మంచి వాదనలు ఎత్తి చూపేరు. అవును, నడుస్తున్నచరిత్ర అదే. If you don’t like the way things are, change the way you think అని కదా సుజనవాక్కు థాంక్స్.

  మెచ్చుకోండి

 3. అన్నట్టు.. మీకీ సమస్య ఎదురయ్యిందో లేదోగానీ.. కొందరు పాఠకులు కథనూ, కథలోని పాత్రల్ని వదిలేసి, ఏకంహా రచయిత జీవితాన్ని ఊహించేసుకొని, వాటిపై సైకో-అనాలిసిస్‍లు చేసేసుకొని, prescriptionతో సహా రచయితను కలుస్తారు. ఓ వెయ్యిపదాల అల్లికను బట్టి రచయిత ముప్ఫై-నలభై-యాభై ఏళ్ళ జీవితాన్ని వీరు అవలీలగా summarize చేయగలరు. వీరు ముందుగా, “మీరు చాలా బా రాస్తారు. అందులో అనుమానమే లేదు. అన్యధా భావించకండి..” అని అంటూ మొదలెట్టి, రచయిత మీద విపరీతమైన generalizationలు గుప్పిస్తారు. Folks who actually rip apart the story and trash it are hundred times safer than these pseudo-caretakers. Writers, beware of such readers!

  మెచ్చుకోండి

 4. చాన్నాళ్ళ బట్టి ఇట్లాంటి చర్చలకు దూరంగా ఉంటున్నాను. ఈవేళ ఎందుకో రాయాలనిపిస్తుంది, బహుశా, మీ బ్లాగన్న ధీమా ఉన్నందుకేమో!

  ఈ బ్లాగులూ, ఫేసుబుక్కులూ, in ways, are forced onto us అని అనిపిస్తూ ఉంటుంది. అసలు మా తరం వాళ్ళకే ఇవ్వన్నీ ఒక ఐదారేళ్ళగా అలవాటు. అంతకు ముందు ఓ విషయం “చెప్పేవాళ్ళం”, ఇప్పుడు “రాస్తున్నాం”. ఈ చెప్పడం నుండి రాయడానికి మారాల్సిన అగత్యం వల్ల కొన్ని నష్టాలూ, కష్టాలూ ఓర్చుకోవాల్సి వస్తుంది. వాటిలో కొన్నింటిని మీ వ్యాసం చాలా చక్కగా చెప్పుకొచ్చింది. అందుకు థాంక్స్!

  నేను చెప్పబోయే పోలిక కొందరికి నచ్చకపోవచ్చు. చిరాకూ వేయవచ్చు. కానీ నాకదే సబబుగా తోస్తోంది. ఓ కథ రాసి అచ్చువేయడమంటే ఓ కళని ప్రదర్శించటమే కదా? ఇప్పుడు అది కూచిపూడి నృత్యమో, లేక సోది టివిలో సోది మాటల ప్రోగ్రామ్ కి ఆంకరింగ్ చేయటమో.. ఏదైనాగానీ, బేసికల్లీ, స్టేజి ఎక్కి, “జనులారా! నేను మీకో కథ చెబుతాను. వినుడు..” అని వాళ్ళ అటెన్షన్ కోరినప్పుడు, వాళ్ళు మనకా అటెన్షన్ ఇచ్చినప్పుడు, వాళ్ళల్లో నానారకాల మనుషులూ ఉంటారు. ఆంకరమ్మ ఏం చెప్తోంది అనేదానికి సంబంధం లేకుండా ఆమె పలువరుస గురించో, చీరకట్టు గురించో కామెంట్స్ వస్తుంటాయి. అలా రాకూడదని ఆశించటం impractical thinking. స్టేజి అంటూ ఎక్కాక, చప్పట్లకే కాదు, రాళ్ళదెబ్బలకు సంసిద్ధంగా ఉండాలి.

  పెద్ద ఆలోచన లేకుండా, ఏమీ విశ్లేషించకుండా పాఠకులు కామెంట్స్ రాస్తుంటే, నేను అంతకన్నా హడావుడిగా “థాంక్స్”లు చెప్తున్నాగా పొగడ్తలకు? అంతకన్నా ఆవేశంగా జవాబిస్తున్నాగా తెగడ్తలకు? ఏం? “మీ కథ సూపర్ అంటే సూపర్… ఇంతకు మించిన గొప్ప కథ” లేదన్నప్పుడు ఎందుకు నేను ఓ నిముషం ఆలోచించకూడదు? ఇది కేవలం ముఖస్తుతికి అంటారు అని అనుకొని వదిలేయకూడదు? అలానే, ఎవరన్నా నచ్చలేదనో, ఫలానాది నప్పలేదనో అన్నప్పుడు, అవసరమైతే ఆలోచించి, అనవసరమనిస్తే వదిలెయచ్చుగా నేనైనా, కనీసం? చేస్తున్నానా? కథ నచ్చితే కథ నచ్చినందుకు కారణాలేంటి, ఆ నచ్చినదాన్ని విశ్లేషించండి అని అడుగుతున్నానా? మరి, నచ్చనివాళ్ళు మాత్రం ఎందుకు “పనికొచ్చే” విషయాలు చెప్పాలి? వాళ్ళూ పాఠకులేకదా? Or are we confusing them with editors or critics? అసలు చదవడమే ఎక్కువైనప్ప్పుడు, మళ్ళీ ఇవ్వన్నీ ఎందుకు పాఠకుని మీద extra baggage? ఏన్నో కోట్లు పెట్టి, వేలమంది కష్టపడి సినిమా తీస్తుంటే, రెండు గంటలు దాన్ని చూసినందుకు ప్రేక్షకునికి , సాహిత్యాన్ని చదివే పాఠకునికీ తేడా ఉందీ, Reader should be more responsible, because he is elite and blah.. ! అని మొదలెడతారేమో?!

  “రాముడు ఫలానాను పెళ్ళిచేసుకున్నాడు.” అన్నది కథ ముగింపు వాక్యమైతే నాకు తెలుస్తుంది రాముడు ఫలానాను పెళ్ళిచేసుకున్నాడని. కానీ ఒకవేళ రాముడు ఎవర్ని పెళ్ళి చేసుకున్నాడన్నది నా ఊహకు వదిలేస్తే, నా ఊహా, నా ఇష్టం కదా! ఊహల్లో తప్పొప్పులు, సాధ్యాసాధ్యాలకు తావు లేదు కదా! ఏమో, అందర్ని తప్పించేసి, రాముణ్ణి నేనే పెళ్ళి చేసుకోవచ్చు కదా, ఊహల్లో! How can you prove me guilty over there, your honour?! 🙂

  If you’re agreeing that a writer-reader share the process of a short story creation, and if the writer can write anything that his imagination and his logic permits, why any sorts of constraints on the reader, who has to do exactly the same thing?

  మన రచనలని హైలైట్ చేసుకోవటం కోసం సోషల్ మీడియాకు మించిన వేదికలు లేవు. వెస్ట్ వాళ్ళైతే marketingలో ఈ సోషల్ మీడియాను ఇంటిగ్రల్ పార్ట్ గా వాడుతున్నారు. నాబోటి అనామకులని కూడా ఆయా రచయితలు తమ ఫ్రెండ్ లిస్ట్ లో పెట్టుకుంటారు. వాళ్ళు బ్లాగురాసినా, పుస్తకం మొదలెట్టబోతున్నా, పుస్తకం అచ్చువేయిస్తున్నా నాకన్నీ ఇట్టే తెల్సిపోతాయి. వాళ్ళ పుస్తకాలు నేను కొని చదువుతాను కూడా! చదివాక నచ్చకపోయి, నేను వాళ్ళ గోడల మీద “ఇదో చెత్త పుస్తకమ్రోయ్!” అని నేను రాసినా, “నువ్వుత్త వెధవ్వోయ్..” అన్న జవాబు రాదు! అది పదునైన కత్తిని వాడుకోవాల్సిన విధానం.

  Social media isn’t a bad medium, as such. We aren’t onto it for wrong reasons. The whole challenge is to adjust to the challenges it poses. త్రివిక్రముడు అన్నట్టు, “ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెల్సినవాడే గొప్పవాడు.” ఆ ఛాన్స్ పాఠకులకి ఎందుకు ఇచ్చేయటం? రచయితలే గొప్పోళ్ళు అవ్వచ్చుగా! 😛

  మెచ్చుకోండి

 5. తెరెసా, different ropes – :)) అది కాదండి, అందరూ మహా రచయితలు కాదులెండి నిజమే. కానీ మాట తీరులో సభామర్యాద పాటించవచ్చు కదా అని. మీరెప్పుడూ దురుసుగా రాసినట్టు లేదు మరి. :))
  @ lost cause, probably :))

  మెచ్చుకోండి

 6. పాఠకుడు చిన్నకథ చదువుతూ చదువుతూ బుర్ర గోక్కునేంతలోపల అది చటుక్కున అయిపోవాలి,చదువరి బుర్రలో దీపం వెలిగి అతని ముఖం ఆహ్లాదమయం కావాలి!

  మెచ్చుకోండి

 7. Exactly! Unlike me, some readers are Crisp and Eloquent writers themselves who can offer constructive criticism… and then there are a few who may not sound very courteous with their opinions though well-meant.
  Different ropes for different Folks 🙂
  , వ్యాఖ్యలో ఏదో స్పష్టంగా లేదు అన్నతరవాత రచయిత అది స్పష్టం చెయ్యకూడదంటే ఎలాగండి — Sometimes, that effort is a lost cause, Isn’t it?

  మెచ్చుకోండి

 8. తెరెసా,
  మీకు బాగున్నందుకు సంతోషం. మీ రెండో పాయింటు – భిన్నాభిప్రాయాలకి పుష్కలంగా తావుంది. ఈ వ్యాఖ్యాతలలో చాలా మంది రచయితలు కూడా కదండీ. అంచేత, వ్యాఖ్యలో ఏదో స్పష్టంగా లేదు అన్నతరవాత రచయిత అది స్పష్టం చెయ్యకూడదంటే ఎలాగండి. థిక్ స్కిన్ – హాహా. థాంక్స్.

  మెచ్చుకోండి

 9. Enjoyed your write-up as usual Malathi garu!

  My two cents :

  1. చిన్నకథ పాఠకులకి రచయిత అందించిన ముడి సరుకు.– Yes and the ముడి సరుకు. gets processed in umpteen different ways 🙂

  2.పాఠకులు తమ తెలివితేటలు ప్రకటించుకోడానికి అది వేదిక కాకూడదు.– I think this is where it gets a little foggy and subjective! When a story is thrown to a large Audience, the feedback is just as largely divergent! Thick skin and open mind help here 😉

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s