దృష్టి మార్చుకుంటే దృశ్యం మారుతుంది

(మార్పు 57 )

కిటికీలోంచి ఎండ మొహంమీద పడి, ఉలికిపడి లేచేను. కిందకొచ్చేసరికి, పెద్దక్కయ్య, లీల  వంటింట్లో ఉన్నారు. కాఫీ వాసనలు ఘుమఘుమ ఇల్లంతా కమ్ముకున్నాయి.

“రా. బాగా నిద్ర పట్టిందా?” అంది పెద్దక్కయ్య నన్ను చూసి.

“మహా బాగాను. ఆలస్యం అయిపోయినట్టుంది,” అన్నాను. వాళ్ళిద్దరూ నాకంటే ముందే లేచేరని నాకు సిగ్గేసింది.

“ఆలస్యానికేముంది, మనకేం ములిగిపోయే రాచకార్యాలు లేవు కదా. రోజంతా పడుకున్నా అడిగేవాళ్లు లేరు మనకి,” అంది పెద్దక్కయ్య నవ్వి.

నేను కూడా నవ్వేను.

బల్లమీదున్న కప్పులో కాఫీ పోస్తుంటే, లీల పాలు తెచ్చి అందించింది. అరవింద కనిపించలేదు. కనీసం నాకంటే ఆలస్యంగా నిద్రపోతున్న మరోమనిషి ఉందనుకుంటే కాస్త ఉపశమనం. “అరవింద లేచినట్టు లేదు?” అన్నాను లీలవేపు చూస్తూ. వాళ్ళిద్దరూ ఒకగదిలో పడుకున్నారు. నేను మూడోగదిలో పడుకున్నాను.

“లేదు. అర్థరాత్రి లేచి వెళ్ళిపోయింది,” అంది లీల.

“అదేమిటి?” అన్నాను. వాళ్ళిద్దరిమధ్యా ఏదైనా వాదన జరిగిందేమో అనుకుంటూ. వాళ్ళిద్దరూ చాలా సన్నిహితంగా ఉంటారని తెలుసు. విషితో విడిపోయి, వేరే ఒకరిద్దరిని డేట్ చేస్తోందని చూచాయగా చెప్పింది ఆమధ్య ఎప్పుడో. ఇప్పుడు కానీ అలాటిదే మళ్ళీ జరిగి, లీల ఏదైనా సలహా ఇవ్వబోతే, ఆ అమ్మాయికి కోపం వచ్చి వెళ్ళిపోయిందేమో …

“పిల్లలు కదా. మనకి సూర్యోదయంతో తెల్లారుతుంది కానీ వీళ్ళకి చంద్రోదయంతో తెల్లారుతుంది. వీళ్ళ వ్యాపకాలన్నీ రాత్రులే కదా.”

“పార్టీకి వెళ్ళిందా?”

“పార్టీ అనే కాదు. నలుగురు కబుర్లు చెప్పుకోడానికి ఏ రెస్టారెంటులోనో సినిమాదగ్గరో  కలుస్తున్నారుట. ఇద్దరం మంచంమీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే ఫోనొచ్చింది.”

“వెంటనే లేచి వెళ్ళిపోయిందా?” అన్నాను నవ్వి. అలాటివి చాలానే చూసేను నేను.

లీల తల అడ్డంగా ఆడించింది. “లేదు, అలా ఠకీమని లేచిపోలేదు. నేనే వెళ్ళమన్నాను. పాపం, నాకోసం ఆ అమ్మాయి సరదాలెందుకు మానుకోవాలని. ఎలాగా మరో  పది నిముషాల్లో నిద్రకొరుగుతాం కదా” అంది లీల, కాఫీకప్పులోకి చూపులు సారించి.

పెద్దక్కయ్యవేపు చూసేను. ఆవిడ సీరియస్‌గా ఉల్లిపాయముక్కలు పక్కన పెట్టి, కత్తి కడిగి, పచ్చి మిరపకాయలు అందుకుంది తరగడానికి.

“పన్నెండుకి వెళ్ళింది కదా, ఏ రెండు కాకపోతే మూడు గంటలకి వచ్చేస్తుందనుకున్నాను,” అంది లీలే మళ్ళీ.

“అంత రాత్రప్పుడు వచ్చి మనని లేపడం ఎందుకని అక్కడే ఏ స్నేహితులఇంట్లోనో పడుకుందేమో.”

“తెల్లారేకైనా రావొచ్చు కదా. నేను రేపు వెళ్ళిపోతాను. మళ్లీ కలవడం అవుతుందో అవదో.”

“ఇంకా ఇప్పుడు ఎనిమిదే కదా అయింది. వస్తుందేమోలే,” అంది పెద్దక్కయ్య.

నేను బల్లమీదున్న how to make friends అందుకున్నాను, “ఇంతకీ స్నేహాలు ఎలా చేసుకోవాలో, ఎలా నిలుపుకోవాలో ఏం చెప్పేరేమిటి ఇందులో?”

“మనకి పనికొచ్చేవి కాదులే.”

“అంటే?”

“అహ, పనికిరావడం కాదు. ఎవరికి తెలీనివిలే అనబోయేను. ఎవరు చెప్పినా అవే కదా. అవతలివాడిమాట వినాలి. కోపం తెచ్చుకోకూడదు. వాడికి నచ్చేట్టు చెప్పాలి. వాడికి అర్థమయేట్టు చెప్పాలి, నిదానంగా ఒప్పించాలి …” అంది తేలిగ్గా.

***

అరవింద రెస్టారెంటుకి చేసేసరికి మిత్రబృందం ఎదురు చూస్తున్నారు తనకోసం. అరవిందని చూస్తూనే ఎందుకాలస్యమయిందంటూ ప్రశ్నలు గుమ్మరించేరు. ఒకమ్మాయి దగ్గరకొచ్చి అక్కున చేర్చుకుని ఏదైనా ప్రమాదం జరిగిందేమోనని భయపడిపోయేం అంది. ట్రాఫిక్కా అంది మరొకమ్మాయి. అరవింద ఒకొకరికీ తగు సమాధానాలిచ్చి, మరో కుర్చీ లాక్కుని కూర్చుంది. చాలాకాలంగా చూడని ఒక స్నేహితురాలు ఊళ్ళోకొస్తే తనతో గడుపుతూ టైము చూసుకోలేదంది. ఆ కబురూ, ఈ కబురూ మాటాడుతుంటే సినిమాలమాట వచ్చింది. బెటీ తను ముందురోజు రికార్డు చేసిన ప్రోగ్రాం ఉంది, చూదాం అంటూ వాళ్ళింటికి పిలిచింది. సరే అంటూ అందరూ బెటీ ఇంటికి చేరుకున్నారు. అదయేసరికి మూడున్నరయింది. ఇప్పుడేం వెళ్తావు ఇక్కడ పడుకో, రేపు పోవచ్చు అంది బెటీ అరవిందతో. తనకి కూడా అదే నయమనిపించింది అంత రాత్రి అక్కడికి వెళ్ళి లీలనీ, పెద్దక్కయ్యనీ లేపడం కన్నా. సరేనని ఆగిపోయింది ఆరాత్రికి. మిగతావారు శలవు తీసుకున్నారు. వీళ్ళద్దరూ పజామాల్లోకి మారి మంచాలెక్కేసరికి నాలుగున్నర.

తెల్లారి తొమ్మిదవుతుంటే, ఫోనొచ్చింది. బెటీ స్నేహితుడు కెవిన్ పిలిచేడు ఆరోజు ప్రోగ్రాంకి వేళ అయిపోతోందని చెప్పడానికి. అతనికో చెల్లెలుంది, ఆ అమ్మాయి ఆటిస్టిక్.

కెవిన్, అతని అన్నదమ్ములూ మరో ఇద్దరూ స్నేహితులూ కలిసి autism awareness day అని ఒక రోజు ప్రోగ్రాం పెట్టుకున్నారు. బెటీ ఆ కార్యక్రమంలో సాయం చేస్తానని కెవిన్‌కి మాటిచ్చిందిట.

ఈకథంతా చెప్పి, నువ్వూ రారాదూ అంది అరవిందతో. అరవింద రెండు నిముషాలాలోచించి, “వస్తాను కానీ ఎక్కువ సేపుండను. మాస్నేహితురాలు ఎదురు చూస్తూ ఉంటుంది,” అంది.

“నీయిష్టం. నీకెంతసేపుండాలనుంటే అంత సేపుండి వెళ్ళిపో,” అంది బెటీ.

అరవింద లీలకి ఫోను చెయ్యనా కొంచెంసేపాగి చెయ్యనా అని అలోచిస్తుంటే, బెటీ, పద, పద, ఇప్పటికే ఆలస్యం అయిందంటూ తొందర పెట్టింది. అరవింద సరే కాస్త తీరిక అయినప్పుడు పిలవొచ్చు అనుకుని గబగబ కాఫీ తాగేసి, బయల్దేరింది. అక్కడ ఏం చేస్తారు, ఎవరొస్తారు అంటూ వింతలూ విశేషాలూ కనుక్కుంటూ.

“మన నాయకుల్ని చూస్తుంటే, వీళ్ళకి కూడా మెదళ్ళు ఏదో ఒక భాగమే పని చేస్తున్నట్టుంది కదా” అంది అరవింద. ఇద్దరూ నవ్వుకున్నారు.

వాళ్ళు టౌన్ హాలు చేరేసరికి కెవిన్ మరో నలుగురు స్నేహితులతో బల్లలు అమర్చి రకరకాల ఆటలూ, ఆటిజం వివరించే కాయితాలూ, ఆటిస్టిక్ పిల్లలు ఇంట్లోనూ సమాజంలోనూ నలుగురితో కలిసి మెలగడానికి మనం ఎలా తోడ్పడగలం అన్నవి వివరించే కాయితాలు బల్లలమీద పేరుస్తున్నారు.

సూక్ష్మంగా చెప్పాలంటే ఆటిజం వ్యాధి కాదు. మెదడులో కొన్ని నరాలు భిన్నంగా ఉండడంచేత ఆ పిల్లల పెరుగుదల, ప్రవర్తన భిన్నంగా ఉంటుంది. అది అర్థం చేసుకుని వారిని కనీసం కొంత వరకూ సమాజంలో మనమధ్య మామూలుగా ఉండేలా చెయ్యొచ్చు అని జనానికి వివరించే ప్రయత్నం అది. అక్కడ కొందరు ఆటిస్టిక్ పిల్లలు వేసిన బొమ్మలు ప్రదర్శనకి పెట్టేరు. పియానో వాయించగల పిల్లలు ఇద్దరు పియానో వాయిస్తున్నారు ఓ గదిలో. కొందరు తమ పిల్లలగురించి కథలు చెప్తున్నారు. ఒకావిడకి కొడుకు పుట్టేవరకూ తనకి ఆటిజం ఉందని తెలీనే లేదుట.

 

అరవిందని కెవిన్ ఒక బల్లదగ్గర నిలబడమన్నాడు. ఆ బల్లమీదున్న కాగితాలలో ఏముందో గబగబ నాలుగు ముక్కల్లో చెప్పి, ఆ పైన ఎవరైనా ఇంకా ఎక్కువ వివరాలడిగితే, తనకి తెలీకపోతే నన్నుపిలవు అని చెప్పేడు. అరవింద సరేనని చెప్పి, ఆ కాయితాలు చదువుతూ, చుట్టూ ఉన్నవారిని చూస్తూ కూర్చుంది. మరో గంటకి నెమ్మదిగా ఒకరొకరే వచ్చి, సందేహిస్తూ కాయితాలు చూస్తున్నారు. కొందరు అరవిందకే ఏదో అంటరాని జబ్బున్నట్టు దూరంగా నిల్చుని, పలకరిస్తే జవాబివ్వగలదో లేదో అన్నట్టు తప్పుకుంటున్నారు. అరవిందకి అది చూస్తే నవ్వొచ్చింది. మొదటి గంటన్నరలోనూ బెటీ ఒకట్రెండుసార్లు వచ్చి పలకరించింది కానీ అరవింద బాగానే జరుపుతోంది అని అర్థం అయేక తన బల్లదగ్గరికి వెళ్ళిపోయింది.

మధ్యాన్నం రెండయేవరకూ జనం బాగానే వచ్చేరు. అంతమంది వస్తారని తను అనుకోలేదు కూడాను.

కెవిన్ వచ్చి ఇక్కడ మరొకరిని పెడతాను, వెళ్ళి లంచి తినిరా అన్నాడు.

అరవింద సరేనని చెప్పి వెళ్ళబోతుంటే, కొంచెందూరంలో గొడవ వినిపించింది. రాబీ రాబీ అంటూ ఒకావిడ అరుస్తూ అటూ ఇటూ గాభరాగా దిక్కులు కలయజూస్తోంది. రాబీని ఎవరైనా చూసేరా అని కనిపించిన ప్రతివారినీ అడుగుతోంది. అరవింద పరుగులాటి నడకతో ఆవిడదగ్గరికి వెళ్ళి రాబీని గురించి అడిగింది. తొమ్మిదేళ్ళుట. ఆటిస్టిక్ కుర్రాడుట. తల్లి గాభరా పడుతోంది ఏమైపోయేడో అని.

“ఎలా ఉంటాడు? చొక్కా, పాంటు ఏమైనా గుర్తులు చెప్పగలరా?”

“పీలగా ఉంటాడు, పేకర్స్ కేప్, నీలంరంగు గళ్ళ చొక్కా, …”

నలుగురూ నాలుగు దిక్కులా రాబీ రాబీ అంటూ అరుస్తూ తిరగసాగేరు.

అరవింద హాల్లోంచి వెళ్తుంటే తలుపులు వేసున్న ఒకగదిలోంచి నలుగురైదుగురు మాటాడుతున్నట్టు వినిపించింది. ఇక్కడెవరు ఎందుకుంటారు చెప్మా అనుకుంటూ తలుపు తట్టింది. ఎవరూ తెరవకపోయేసరికి అనుమానం. ఏం చెయ్యడమా అని ఆలోచిస్తుంటే కెవిన్ వచ్చేడు. ఇద్దరూ కలసి తలుపు తీస్తే, పీలగా, పేకర్స్ కాప్‌తో అబ్బాయి ఓ మూల ముడుచుకు కూచున్నాడు. వీళ్ళిద్దర్నీ చూడగానే మరింత ముడుచుకుపోయి గోడవేపు మొహం తిప్పుకున్నాడు.

కెవిన్ అరవింద మొహమొహాలు చూసుకున్నారు. ఒక్కడే కనిపిస్తున్నాడు మరి అన్ని గొంతులు వినిపించేయేమిటి అని.

“రా, మీఅమ్మ నీకోసం వెతుకుతోంది,”

“రాను.” “నేను కూడా వెళ్ళను.” “నాక్కూడా ఇక్కడే బాగుంది.” “పోనీ నువ్వెళ్ళు.”

అరవింద ఆశ్చర్యానికి అంతు లేదు. రాబీ ఒక్కడే రకరకాల గొంతులతో మాటాడుతున్నాడు! కెవిన్ వివరించేడు ఆటిస్టిక్ పిల్లల్లో అలాటి ప్రత్యేకమైన కళలు ఉండడంలో ఆశ్చర్యం లేదు. అసలు ఈ ప్రోగ్రాం ధ్యేయం అదే కదా, ఈవిషయాలు అందరికీ తెలియడం కోసమే అని అరవిందకి చెప్పి, రాబీని నెమ్మదిగా నడిపించుకుంటూ బయటికి తీసుకొచ్చేడు. అరవింద, రాబీ పక్కనే నడుస్తూ, “హాయ్, నాపేరు అరవింద.” అంది. “ఎవీడా” అన్నాడు రాబీ.

రాబీ తల్లి దూరంనించి చూసి పరుగెత్తుకుంటూ వచ్చింది.

రాబీ అరవింద చెయ్యి పట్టుకుని తనతో రమ్మన్నట్టు లాగేడు. తల్లి “he likes you” అంది.

నాక్కూడా నువ్వంటే ఇష్టమే అంది అరవింద రాబీతో.

కెవిన్ అరవిందకి మళ్లీ గుర్తు చేసేడు లంచి తిని రమ్మని. రాబీ చెయ్యి వదల్లేదు. తల్లి అది చూసి, మేం కొంటాం నీలంచి, రా అంది. అరవింద అవసరం లేదు అంది కానీ రాబీ చెయ్యి వదలకపోవడంతో సరే పదమంది. ఓ వంద గజాలదూరంలో ఫుడ్ స్టాలులు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి తలో బురీడో తీసుకుని కాస్త నీడ ఉన్న బల్లదగ్గర కూర్చున్నారు. అరవింద తనకి తెలిసిన కార్టూను కేరక్టర్లు చెప్తుంటే రాబీ ఉత్సాహంగా వాటిని అనుకరించేడు. తల్లి చాలా ఆనందించింది ఆ పూట రాబీకి అంత ఆనందంగా గడిచినందుకు. అరవిందకి పదే పదే థాంక్స్ చెప్పింది.

ఆ తరవాత చాలాసేపు రాబీ అరవిందతో పాటు ఆ బల్లదగ్గరే ఉన్నాడు. తల్లి కూడా పక్కనే ఉంది. ఆ పూట అరవింద చాలా విషయాలు తెలుసుకుంది రాబీగురించి. 5 గంటలకి ప్రోగ్రాం ముగిసింది. రాబీ అరవిందని వదల్లేదు. వాళ్ళింటికి రమ్మని పిలిచేడు. వాళ్లమ్మ ఇబ్బందిగా మొహం పెట్టి, అపార్థం చేసుకోవద్దని వేడుకుంది.

అరవింద మనసు ఏదో చెప్పలేని మధురానుభూతితో పరితప్తమయింది. రెండేళ్ళకిందట ఇండియా వెళ్ళినప్పుడు తన మేనమామ కొడుకు జ్ఞాపకం వచ్చేడు. అతను కూడా ఇలాగే ఏదో లోకంలో ఉన్నట్టుండేవాడు. అన్నం తినడానికీ బట్టలేసుకోడానికీ కూడా ఎవరో ఒకరు చెయ్యాల్సిందే. ఎప్పుడూ ఏదో మూల కూర్చుని శ్యామలాదండకం, లలితాసహస్రనామం చదువుతూ ఉండేవాడు. అవి మాత్రం అతనికి ఎలా వచ్చేయో అని అరవిందకి ఆశ్చర్యంగా ఉండేది. ఇప్పుడు తెలుస్తోంది. పాపం, అతనికి కూడా ఇలా చేసేవాళ్ళుంటే ఎంత సుఖంగా ఉండేవాడో అని ఇప్పుడనిపించింది అరవిందకి.

***

మేం కబుర్లు చెప్పుకుంటూ కాఫీ ఉప్మా ముగించేసరికి తొమ్మిదయింది. నేను వెళ్తానంటూ లేచేను. లీల కూడా నాతో బయల్దేరబోతుంటే, “ఆదివారమే కదా. వెళ్ళేం చేస్తారు. ఉండండిద్దరూ. రేపు వెళ్ళొచ్చు” అంది పెద్దక్కయ్య.

లీల కూడా ఉండడానికే మొగ్గు చూపుతోందని నాకు అర్థమయింది. మిగిలింది నేను. కొంచెం సేపు అటూ ఇటూ ఊగి సాయంత్రం వరకూ ఉండడానికి ఒప్పుకున్నాను.

హుషారుగా కబుర్లు చెప్పుకుంటూంటే కాలం తెలియనే లేదు. ఏం తోచదని ఎందుకంటారో ఎవరైనా అనిపించింది. లీల మాత్రం పదే పదే తలుపువేపు ఫోనువేపు చూస్తోంది.

పెద్దక్కయ్య నవ్వింది, “ఏం పిల్లకోసం బెంగగా ఉందేమిటి?”

లీల కూడా నవ్వింది. “అదేం లేదు కానీ. నేను రేపు వెళ్ళిపోతాను. మళ్ళీ చూడ్డం ఎప్పుడో. ఒకవేళ నేను మళ్ళీ వచ్చినా, ఆ పిల్లకి తీరికుంటుందని నమ్మకమేముంది. ఆ బాయ్‌ఫ్రెండుతో సీరియస్‌గానే ఉంది. బహుశా మరో ఏడాదిలో పెళ్ళి అనుకుంటాను. ఆ తరవాత వరస మామూలే కదా. ఓ పక్క ఉద్యోగం, మరోపక్క సంసారం, ఇల్లూ పిల్లలూ… ఇలా తలుచుకుంటే మరింక చూడడం పడదేమో అనిపిస్తోంది. రాత్రి అక్కడ పడుకుంది సరే, పొద్దున్న లేచి రావచ్చు కదా ఓమారు.”

మేం ఇద్దరం కూడా ఏం మాటాడలేదు. కాస్సేపు బయట తిరిగొచ్చేం.

మధ్యాహ్నం భోజనాలకి అక్కయ్య ప్రయత్నాలు మొదలు పెడుతుంటే లీల, ఇవాళ నేను చేస్తాను. మీరు కూర్చోండి అని ఆవిడకి అడ్డం వెళ్ళింది.

నాకు అలా చొరబడడం చేతకాదు. ఎంత చనువున్నా నాకు పొరుగిల్లు పొరుగిల్లే. మా అమ్మాయి ఇంటికి వెళ్ళినా, తనకి నావంటలు ఇష్టం అని వంటయితే చేస్తాను కానీ ఎక్కడేం ఉన్నాయో తనే తీసివ్వాలి. నాకు ఏం కావాలో అడిగితే అవి తీసిస్తే, వాటితోనే ముగించి పనయిందనిపించుకునేస్తాను.  ఓ గ్లాసయినా కడగనివ్వదు. నేను పూనుకుని కడిగినా మళ్ళీ కడుక్కుంటుంది. నేను కంచం ఓ అరలో పెడితే, తీసి మరో అరలో పెట్టుకుంటుంది.

“వార్తలు చూస్తారా?” అంటూ టీవీ పెట్టింది పెద్దక్కయ్య. ఆరోజు జరగబోతున్న autism awareness dayగురించి టీవీలో వస్తోంది.

“అదుగో అరవింద”

“అవును, అరవిందే. ఏం చేస్తోందక్కడ?”

ముగ్గురం దగ్గరికి జరిగి పరీక్షగా చూస్తున్నాం. ఆరోజు మహోత్సాహంగా జరుగుతున్న autism awareness dayగురించి చెప్తూ, రాబీ అనే అబ్బాయి తప్పిపోతే అరవింద కనుక్కుని తల్లికి అప్పజెప్పిన వైనం వివరిస్తున్నారు. అంతవరకూ ఆ విలేఖరివెనక నిలబడిన అరవింద చిన్నగా నవ్వి చెయ్యూపింది.

“అందుకన్నమాట ఇంటికి రాలేకపోయింది,” అన్నాను లీలవేపు చూడకుండా.

“ఓమాటు ఫోనులో పిలిచి ఆమాట చెప్పొచ్చు కదా.” అంది లీల చిన్నబుచ్చుకున్నట్టు.

“అలాటిచోట ఫోనెక్కడ చేస్తారు అంత గోలలో,” అంది పెద్దక్కయ్య.

లీల మాటాడకుండా how to make friends తీసి పేజీలు తిప్పసాగింది.

“అందులో మనకి కావలిసిన జవాబులు దొరకవు,” అన్నాను.

“మనకి ఏం జవాబులు కావాలేమిటి?” అంది పెద్దక్కయ్య.

“నేననేది ఆ పుస్తకంలో ఇచ్చే సలహాలు నాకయితే ఏం గొప్పగా లేవు. అసలు అదే కాదు ఏ పుస్తకం, ఏ ఉపన్యాసం చూసినా మనం కాస్త టైం తీసుకుని ఆలోచిస్తే మనకే తోచేవిగానే ఉంటాయి.”

“ఇవన్నీ పనికిమాలిన రాతలంటావు.”

“కాదా మరి. ఎదటివాడిమాటలు విను, వాడికి నచ్చేలా చెప్పు, వాడిమాటలు అర్థం చేసుకో … ఈ సుద్దులు నీకు మాత్రం తెలీవూ?” అన్నాను.

“ఆ జ్ఞానం రెండోవాడికి కూడా ఉండాలి కదా. ఎంతసేపూ నేనే వినాలంటే నాబతుకంతా  వినడంతోనే సరిపోతుంది,” అంది లీల. సుందరం మనసులో మెదిలేడేమో! నేను కూడా అలాటివారిని చాలామందినే చూసేను. రెండు చేతులూ కలిస్తేనే చప్పట్లు. ఎదటివారి మనసేమిటో తెలుసుకోవాలనే తపన రెండు వేపులా ఉంటేనే … ఆ తరవాతే ఈ కబుర్లన్నీ.

పెద్దక్కయ్య కిటికీదగ్గర నిలబడి చూస్తోంది.

“ఏమిటి చూస్తున్నావు?” అన్నాను మాట మార్చడానికి.

, “చూసేవా, ఈ కిటికీ పట్టుమని మూడడుగులు వెడల్పు లేదు. కిటికీకవతల కనిపిస్తున్న దృశ్యం ఒకటే అయినా ఈకొసనించి చూస్తే ఒకలా కనిపిస్తుంది, ఆ కొసనించి చూస్తే మరోలా కనిపిస్తుంది.”

“అంటే నేను నాదృష్టి మార్చుకోవాలంటారు,” అంది లీల ముందు జరిగిన చర్చకి వస్తూ.

“మ్. నాకలాగే అనిపిస్తోంది. దృష్టి మార్చుకుంటే దృశ్యం మారుతుంది.”

“దృష్టి మార్చుకుంటే … అంటే మార్చుకోడం అన్నది మన చేతుల్లో ఉందని. దృష్టి దానంతట అది మారడం జరగదా?”

“జరగొచ్చు కానీ అలా జరగడానికి చాలా కాలం పడుతుంది. ఈలోపున నువ్విలా బాధ పడుతూ కూచుంటావా? కనిపిస్తున్న దృశ్యం బాగులేదు నేనే మార్చుకుంటావా అన్నది నీయిష్టం.”

“అందుకే కదా మానవయత్నం ఉండాలి అంటారు,” అన్నాను నావంతుగా.

లీల తలొంచుకుని ఆలోచిస్తూ, “నాకివన్నీ తెలీక కాదు కానీ నాపరిస్థితుల్లో ఏమీ మార్పు లేదు కదా. అంచేత నాకు ఆ దృశ్యం అలాగే ఉండాలనిపిస్తుంది.”

మేం ఇద్దరం మాటాడలేదు. కనిపిస్తున్న దృశ్యం అందరికీ అర్థమయింతరవాత మళ్ళీ చెప్పడానికేం మిగుల్తుంది?

“దృష్టి మార్చుకుంటే దృశ్యం మారుతుంది …” అంది లీల తిరుమంత్రం జపిస్తున్నట్టు.

ఎదురుగా బల్లమీదున్న సెల్ చిన్న శబ్దం చేసింది మెయిలొచ్చినట్టు. లీల దానివేపు రెండు క్షణాలు చూసి, మెల్లిగా తీసుకుని హలో అంది.

హో, ఓ, అలాగా, నువ్వేం చేసేవు …

లీల మొహంలోకి చూసేను. లీలమొహమే చెప్తోంది. అవతల్నించి అరవింద ఆరోజు విశేషాలు హుషారుగా చెప్తోంది.

పెద్దక్కయ్య నెమ్మదిగా పక్కగదిలోకి నడిచింది. నేను అనుసరించేను.

(అక్టోబరు 22, 2013)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

6 thoughts on “దృష్టి మార్చుకుంటే దృశ్యం మారుతుంది”

 1. ప్రతి విషయం లోనూ, ప్రతి వ్యక్తీ మీదా మన అభిప్రాయాన్ని కొంచం మార్చుకుంటూ పొతే ఎన్నో కొత్తవిషయాలు కాదు ఎన్నో కొత్త కోణాలు తెలుస్త్తాయి. మనుష్యులు మారరు. ఎవరి అభిప్రాయాన్ని వాలు బలపర్చుకుంటారు. మనమే కొంచం వేరుగా ఆలోచనచేస్తే……దృశ్యం మారుతుంది!

  మెచ్చుకోండి

 2. sunnA, అందులో అర్థం కావడానికేమీ లేదండి. ఆటిజం కాకపోతే మరొకటి, ఈనాటి యువత అనేక కార్యక్రమాలలో పాల్గొనడంచేత వారికి టైము చాలదని. మూడేళ్లనాడు తల్లికొంగు పుచ్చుకు తిరిగే పిల్లవాడు ఇరవైఏళ్ళనాడు కూడా అలాగే తిరగడు కదా. పెద్దలు అది గ్రహించాలని. వెనకటిలా ఎందుకు లేరు అని అడగడం, కోరడం కంటే, తమదృక్కోణం మార్చుకుంటే అర్థం చేసుకోగలరని చెప్పాలనుకున్నాను. బహుశా అది స్పష్టం చేయలేకపోయేనేమో.

  మెచ్చుకోండి

 3. >> అక్కడికి వెళ్ళి తలో బురీడో తీసుకుని
  ఇది అర్ధం కావట్లేదండి ఎన్నిసార్లు చదివినా. ఏదో మిస్సయ్యాను; బుర్రలో లైట్ వెలగట్లేదు.

  ఇంతకీ ఆటిజం గురించా దృష్టి మార్చుకోవాలనేది? లేకపోతే మనసుకి సంబంధించిన వ్యాధులమీదా? ఆటిజం కాస్త అయితే ఫర్వాలేదుగానీ, బాగా ఎక్కువైతే తల్లితండ్రులకి చాలా కష్టం జీవితం. ఒక పాపో బాబో ఆటిజం తో ఉంటే ఆ తల్లితండ్రులకున్న మిగిలిన పిల్లల్ని కూడా అలాగే చూస్తారు. మార్పు అనేది అంత ఈజీగా వస్తుందా?

  ఇండియాలో ఐతే అసలు ఆటిజం టెస్టింగ్ చేయిస్తారా పిల్లలకి? ఏమో! ఇలాంటివి చదువుతుంటే రేప్పొద్దున్న మాకు వస్తాయేమో అని భయం వేస్తూ ఉంటుంది. (ఇలాంటి భయం వల్లే కొ.కు గారి సాహిత్యం ఒకసారి చదివి జీర్ణించుకోలేకపోయేను – ఆయన రాసే యుద్ధం, లోయర్ మిడిల్ క్లేస్ కష్టాలూ ఎట్సెట్రా)

  మెచ్చుకోండి

 4. severemohan, దృష్టి అన్నది దృక్పథం అన్న అర్థంలో వాడేనిక్కడ. మనం ఎదటివారిని ఎలా చూస్తున్నాం అన్నది మార్చుకుంటే ఎదటివారు మరొకలా కనిపిస్తారు అని.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.