(ఎన్నెమ్మకతలు 127)
ఐదున్నరేళ్లయింది నసాంకేతికాలు అన్న (ఊసుపోక 3) రాసి. అప్పట్లో చెప్పేను ప్రోగ్రామరులు “నిరంతరం ప్రోగ్రాములు రాయడమో, పాతవి తిరగరాయడమో చేస్తూ సకలజనులకు వెలుగు చూపుతారు. అందువల్ల నాలాటివారికి కాస్త ఇబ్బందే కాని అది తరవాత చెప్తాను” అని. ఆ ఇబ్బంది రాసే సమయం ఆసన్నమయింది. ఆలస్యమయినందుకు పాఠకులు పెద్ద మనసు చేసి మనన్నించగలరని ఆశిస్తున్నాను. నిజానికి ఇది నావ్యక్తిత్వంలో లోపం. నాజీవితంలో బోర్లాపడ్డందగ్గర్నుంచీ చదువు, ఉద్యోగాలూ, పెళ్లీ, పిల్లా అన్నీ ఆలస్యమే. చావొక్కటే ఆలస్యం అయేట్టు లేదు. అవకూడదని ఆశిస్తున్నాను. ఆ కథ తరవాత చెప్తానులెండి.
ఈ సాంకేతకయుగంలో మనం, కనీసం నేనెంత యాంత్రికం కావలసి వస్తోందో చెప్తాను. అవే నాఇబ్బందులు.
నసాంకేతికం టపాలో నాకేం తెలీదో తెలియజెప్పుకున్నాను. ఇప్పుడు నాకేం తెలుసో తెలియజేసుకోవలసిన అగత్యం కనిపిస్తోంది. హతవిధీ అనుకోవాలి తమరు.
నాకేం తెలుస్తోందంటే – యాంత్రికయుగంలో తెలిసినదానికంటే ఎక్కువ తెలుసుననుకునేవారే ఎక్కువ. వారితో మనకి పని పడితే, అంటే మనింట్లో ఏదో వస్తువు పని చేయకపోతే, ఈ ఎక్కువతెలుసనుకున్నవారిని మనం కూడా అదే విధముగా గౌరవించాలి. వారు చెప్పినది మనము వినడమే కానీ మనము చెప్పినది వారు వినడము జరగదు. అంటే యంత్రాలు మనుషులని యాంత్రికం చేస్తున్నాయి. ఈ ఉరవడిలో మన విద్యుత్ గాడ్జటుని రిపేరు చేయగలవారూ వారిచే రిపేరు చేయించుకోవలసిన అవుసరం కలవారూ కూడా యంత్రవతుగా కాలయాపన చేయడం జరుగుతుంది. అదే నాగరిత అనిపించుకుంటోంది. గుళ్ళో రాతిబొమ్మలనీ, వాకిట్లో చెట్లనీ, ఊళ్లో పుట్టలనీ పూజించడం అనాగరికత అని హేళన చేసేవారు ఈ లోహశకలాలకీ, ప్లాస్టిక్ తునకలకీ, ప్లాస్టిక్ ముసుగులో లోహతీగెలకీ ఇస్తున్న గౌరవం అసమానం, అమేయం, అద్వితీయం, అఖండం. …
ఎలా అంటారా?
పది రోజులక్రితం నా సర్వరేశుడికి (TV, Internet service providers) మూలాధారమైన బాటరీ కీం, కీం అని మూలగడం మొదలెట్టింది. ఇక్కడినించి మొదలయింది నా సాంకేతివిద్యని అప్డేటు చేసుకొను విధానము. కారయితే మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళాలి కానీ ఇంట్లో చాలా వస్తువులకి బాటరీలాటివి మనమే మార్చేసుకోవచ్చు. హాయిగా అని కూడా అనొచ్చు కొన్ని సందర్భాలలో. ఇంతకీ ఆ డబ్బానేం అనాలో తెలీడంలేదు కనక బేటరీ డబ్బా అందాం.. సరే నా డబ్బాలో బేటరీ మార్చవలసిన సమయం వచ్చింది. మీలో ఎంతమందికి అనుభవమో కానీ మామూలుగా ఈ ఇంటర్నట్, టీవీ, ఫోనూ సర్విసు ఇచ్చేవారిని పిలిస్తే ఆ ఫోనులో మనిషిని పట్టుకోడం మరో యజ్ఞం అంత తతంగం అవుతుంది.
మనం ఫోను చేసేక అవతల మరో యంత్రం బదులు పలికి, మన పిలుపుకి ఆనందం వెలిబుచ్చి, నీకొచ్చిన ఆపద తొలగించడానికే మేం ఇక్కడున్నాం అని ధైర్యం చెప్పి, this call may be monitored for quality purpose అని మనకి విదితం చేసి, అలా చెప్పుకోవలసిన అవుసరం ఉన్నందున, ఆ తరవాత మొదలు పెడతారు. మనం ఎందుకు పిలిచేమో కనుక్కోడం. దానికి మరో పది నిముషాలు పడుతుంది. ఇది కూడా యంత్రగాత్రమే అని మరిచిపోకండి.
… అయితే … 1 నొక్కు
… అయితే … 2 నొక్కు
ఈ వరస క్రమం అంతా ఇక్కడ రాయను. మీలో చాలామందికి ఇది తెలిసే ఉంటుంది. తెలీకపోతే విడిగా చెప్తాను.
ఇలా మరో పావుగంట గడిచేక, ఈ కాలు తెగిపోతే మళ్ళీ పిలవడానికి వీలుగా మీ సెల్ నెంబరివ్వండి అని అడుగుతారు ఎంతో మర్యాదగా.
నాకు సెల్ లేదు. ఈ నెంబరే పిలవండి అంటాను. అలా మరో పావుగంట దాగుడుమూతలయేక, ఓ మనిషి దొరుకుతాడు.
అతను అడిగే ప్రశ్నలన్నీ రాయను కానీ కొన్ని మాత్రం ఆమాత్రం తెలీదా అనిపించేలా ఉంటాయని చెప్పడానికి చింతిస్తున్నాను. ఉదాహరణకి,
నీ ఎకౌంటు చూస్తున్నాను ఈలోపున కొన్ని ప్రశ్నలు అడుగుతాను
సరే
నీటీవీ పని చేస్తోందా?
ఇప్పుడు పని చేస్తోంది.
మరి ఎందుకు పిలిచేవు?
బేటరీ మార్చాలి.
ఇంటర్నెట్ పని చేస్తోందా?
చేస్తోంది.
ఫోను పని చేస్తోందా?
మీతో మాటాడుతున్నాను కదా.
మరి ఎందుకు పిలిచేవు?
చెప్పేను కదా బేటరీ మార్చాలని
నువ్వెందుకు బేటరీ మార్చాలనుకుంటున్నావు?
కీం కీం అని అరుస్తోంది.
సరే
నీకేం ఫరవాలేదు. నేను చెప్తాను.
ఇక్కడినించి నాచిన్నప్పుడు రేడియోలో డాన్స్ పాఠాల్లా ఉంటాయి ఆ పెద్దమనిషి సలహాలు.
ఆ డబ్బా బేటరీ ఎక్కడుందో తెలుసా?
తెలుసు.
ఆ డబ్బానుండి కేబులు వాల్ అవుట్ లెట్ కి కనెక్టయిందా?
అయి ఉంది.
అది తీసేయ్?
తీసేశాను.
ఇప్పుడు పని చేస్తోందా?
చూడు బాబూ, నాక్కూడా ఆ స్టెప్పులన్నీ తెలుసు. నా నిజబాధ ఆ బేటరిని దాచిన తలుపు తెరుచుకోడంలేదు.
తలుపు తెరవడానికి స్క్రూడ్రైవరు కావాలి.
అది కూడా తెలుసు. కానీ ఆ బోల్టుకి గంటు లేదు.
మరో స్క్టూడ్రైవరు వాడి చూడు.
నాకు విసుగొచ్చి, అక్కడికి ఆ సంభాషణ ముగించేస్తాను.
ముందొకసారి ఇంటర్నెట్ పని చెయ్యడం లేదని ఫోను చేస్తే, మా వెబ్సైటు చూడు, అక్కడ వివరాలున్నాయంది ఆ జవాబులడబ్బా! ఆయనే ఉంటే మంగలెందుకన్నట్టు లేదూ?
అంతర్జాలంలో ఏమైనా జవాబులు దొరుకుతాయేమోనని. నా గ్రహాలన్నీ తమ తమ స్థానాలలో ఉన్నందున అనుకుంటాను ఓ విడియో వెంటనే దొరికేస్తుంది. మా సర్వరేశులు పెట్టినదే.
శలాకలా నాజూగ్గా ఉన్న సుందరొకతె మొహానికి మరిన్ని రంగులు పులుముకుని, ఒయ్యారాలు పోతూ, అలవోకగా ఆ backup box లో బేటరీ మార్చేయడం కన్నులపండువుగా నటించి చూపించింది. చెప్పొద్దూ బొమ్మలాటంత తేలిక అనిపించింది. అయినా ఎందుకేనా మంచిదని మరో మూడుసార్లు చూసేను ఆ విడియో.
ముందు గోడమీద outlet నించి unplug చేయి.
బాక్స్ ఎడంవేపు తలుపు తెరు.
బాటరీని యూనిట్ కలుపుతూ పంగలకర్రలాటి మూడు తీగెలుంటాయి. అవి లాగేయి.
పాత బాటరీ తీసేయి.
కొత్త బాటరీ పెట్టు.
మూడు కొనల తీగెలు వాటి వాటి స్థానాలలో అమర్చు.
అంతే. చిటికెలో పని.
అది చూసినతరవాత నాకు కొన్ని అనుమానాలొచ్చేయి. నేను కూడా సన్నగా, నాజూగ్గా శలాకలా ఉండాలా? మొహానికి అన్ని రంగులేసుకోవాలా, ఒకటో రెండో వేసుకుంటే చాలా? ఆ రంగులెక్కడ దొరుకుతాయో? అని కొంత తర్కించుకుని, ముందు రంగులేసుకోకుండా, ఏ మేకప్పు లేకుండా చేసి చూదాం, అది పని చేయకపోతే తరవాత చూద్దాం అనుకుని కొత్త బేటరీకి ఆర్డరు పెట్టేను.
ఆహా ఎంత సుళువు చేసేరు అంటూ ఇప్పుడే చప్పట్లు కొట్టడం మొదలెట్టేయకండి.
బేటరీ వచ్చేలోపున నాకష్టాలు ఎమెజాన్.కాంలో పెట్టేను. అక్కడ జవాబులిచ్చేవారు అనుభవజ్ఞులు. తాము స్వయంగా చేసి చూసినవారు సాఫ్టువేరు చదువుకున్నవారు కాకపోవచ్చు కానీ వాళ్ళసమాధానాలు మాత్రం తప్పకుండా పని చేసేవిగానే ఉంటాయి. అందుకు వారిని అబినందిస్తున్నాను. లోపాయికారీగా మనలో మాట – చదువుకున్నవాడికంటే చాకలివాడు మేలని ఊరికే అన్లేదు కదా. ఇక్కడ చాకలివాడు అన్నపదం గౌరవవాచకంగానే గ్రహిస్తున్నాను. మనచదువులు లోకజ్ఞానం ప్రసాదించడం లేదన్నది జగమెరిగిన మరియు మన విశ్వవిద్యాలయాలు పట్టించుకోని పరమసత్యం.
ఆఖరికి తేలిందేమిటంటే, ఆ విడియోలో రెండు తలుపులున్న పెట్టెగురించి మాటాడుతున్నారు. నాముందున్నది మూడు తలుపులున్న పెట్టె!
ఇంతకీ నా సందేహం అప్డేటులగురించి. గూగుల్ అనువాదాలు చూడండి. నిన్న జిమెయిలులో టపా చూస్తూ, పైన కనిపించిన translate this అన్న సందేశం చూసి, సరదాగా దానిమీద నొక్కేను. అక్కడ వచ్చిన అనువాదం చూసి నవ్వొచ్చి, అందరితో పంచుకోవాలనిపించి, నా వ్యక్తిగత టపాకి బదులు, మరో నాలుగు వాక్యాలు కొట్టి, అనువదించేను మీతో పంచుకోడానికి.
నావాక్యాలు –
యంత్రాలు వచ్చి మానవత్వాన్ని మంట గలిపి మనబతుకుల్ని తారుమారు చేసేస్తోందని గోలెత్తిపోతున్నవారిని తిరోగమనవాదులని ఎత్తిపొడిచే సాంకేతికనిపుణులని హేళన చేసే సంప్రదాయవాదులని … సూక్ష్మంగా వారిని వీరూ వీరిని వారూ దులుపుకోడం కనిపిస్తోంది.
గూగుల్ అనువాదం
The machines come in and manipulation of humanity burning galipi manabatukulni cesestondani గోలెత్తిపోతున్నవారిని tirogamanavadulani ettipodice సాంకేతికనిపుణులని conservatives who mocked … In short, they do viru them is dulupukodam.
ఈ అనువాదాలు ఇంత దరిద్రంగా ఉంటున్నాయని ఆ వసతి ఏర్పాటు చేసినవారికి తెలీదా? ఏదో ఒకటి చేసేం అంటే చేసేం అని ప్రజలమీదికి ఒదిలేయడమేనా?
ఇది నాకు ప్రత్యేకించి బాధ కలిగించడం నా తూలిక.నెట్లో పెడుతున్న కథలు, వ్యాసాలు ఈ గూగుల్ అనువాదాలతో ప్రచారం అవుతున్నాయని. ఇలాటి అనువాదాలు చదివి ఆ భాషలో పాఠకులు మనకథలగురించి ఏం అనుకుంటారు అని.
భోజనానిక్కూచుంటే, తల్లో ఇల్లాలో సగం ఉడిగిన అన్నం వడ్డిస్తే నోరు మూసుకు తినరు కదా. వడ్డించినవారిమీద అరుస్తారు కదా. మరి ఈ సాంకేతికులు నాలాటి నసాంకేతికులకంటే ఎలా నిపుణులు?
ఇది చాలనట్టు, వారానికోమారు కాకపోతే మూణ్ణెల్లకోమారు నేను వాడే సాఫ్టువేరులో కొత్తవెర్షనులు వస్తాయి. ఇలా కొత్తవెర్షనొచ్చినప్పుడల్లా, అది పాతరాతలతో పని చేస్తుందో లేదో అన్నబెంగతో తల్లడిల్లిపోతాను. కనీసం సగానికి సగం పని చెయ్యవు. వీటికోసం మళ్ళీ కొత్త ప్రింటరు, కొత్త స్కానరు, కొత్త విడియో కెమేరా … ఇలా మార్చుకుంటూ పోవాలి. అప్పుడే నాకనిపిస్తుంది వీళ్ళకేం పని లేదా ఎందుకిలా కొత్త కొత్త వెర్షనులు తయారు చేయడం, ఏదో ఉన్నదాంతో పని అయిపోతోంది కదా అని. అయ్యో! నా తెలివి తెల్లారినట్టే ఉంది. ఔనౌనౌను, వారికి అదే ఉద్యోగం కదా. కొత్త వెర్షను తయారు చెయ్యక్కర్లేదంటే, వారి ఉద్యోగాలకి ఉద్వాసన చెప్పేయడమే. కానీ, నేననుకోడం ఈ కొత్త వెర్షనులు మరిన్ని వసతులతో, సౌఖ్యాలతో అవి కావలిసినవారికి మాత్రమే తయారు చేస్తూ, నాలాటి సగటు జనానికి పనికొచ్చే ఒక limited edition మాత్రం అలా వదిలేస్తే, నా బతుకు తెల్లారిపోతుంది కదా అని.
సూక్ష్మంగా యంత్రయుగం వచ్చేక, ముఖ్యంగా మనదేశంలో రైతులకీ, కూలిపనివారికీ, ఇంకా గృహపరిశ్రమలకీ … ఇలా అనేకరంగాల్లో అదే జీవనభృతి అయినవారికి తిన తిండి, కట్ట బట్టా లేకుండా పోతున్నాయని అందరం గోలెత్తిపోతున్నాం. యంత్రాలని ప్రవేశపెట్టేముందు కాయకష్టం చేసుకునేవారికి తగిన జీవిక కల్పించి, లేదా వారికి ఇతరవిద్యలలో శిక్షణ ఇప్పించి, అప్పుడు యంత్రాలు రంగంలోకి దింపితే అందరం సుఖపడేవాళ్లం.
కంప్యూటర్లొచ్చేక, చేత్తో రాయడం మానేశాం. మరిచిపోతున్నాం. పొల్లులూ ఒత్తులూ – అన్నిటికీ కీలు కొట్టడమే కానీ చేతిలో కలం ఎటు తిరగాలో చూసుకోడం లేదు. ఇలా రాస్తుంటే నేనేదో యంత్రవిరోధిని అని అని మీరనుకుంటారేమో. లేదండీ, తెల్లారి లేచి, పొద్దు పోయేవరకూ ఈ సాంకేతికాభివృద్ధిమూలంగా వచ్చిన సదుపాయాలు ఉపయోగించుకోక నాకు క్షణం గడవదు.
క్షణక్షణముల్ జవరాండ్ర చిత్తముల్ కాదు – సాఫ్ట్వేర్ సంగతుల్ అనుకోవాలి.
(నవంబరు 14, 2013)