ఊసుపోక – పేరులో పెన్‌నిధి?

(ఎన్నెమ్మకతలు 128)

పేరులో ఏముంది అంటారు కొంతమంది కానీ పేరులోనే నిధులున్నాయని అంతరాంతరాల అందరం నమ్ముతాం. పేరు పెట్టడం మనచేతుల్లో ఉన్నప్పుడు మంచిపేరుకోసం పడే ఆరాటం అంతా ఇంతా కాదని పేరు పెట్టే అవకాశంగలవారందరికీ అవగతమే కదా. మనం పెట్టే పేరెలా ఉండాలి? అమ్మా నాన్నా పెట్టినప్పుడు కారణాలు ఒకరకంగా ఉంటాయి. పిలో పిల్లాడో …అంత గొప్పవాడు కావాలి, అంత ఉత్తముడు కావాలి, అంత ఘనుడు కావాలి అన్నది ఒకరకం. విశాపట్నంచుట్టుపట్లయితే, అప్పలస్వామి, వరాహనరసింహమూర్తి, తిరపతిలో తిరపతయ్య, వేంకటేశ్వరశాస్త్రి, వెంకన్న, ఏడుకొండలు, విజయవాడయితే, కనకదర్గ, సీతామహాలక్ష్మి.  మరోరకం మరొకవ్యక్తి ముఖ్యంగా పూర్వీకులమీద గౌరవం తెలియజేసేది. ఇలా పెట్టినపేర్లు సాధారణంగా నిలవవు. తాతగారిపేరో, భర్తపేరో అయితే, ఆ పేరు పెట్టి పిలవడం బాగుండదని, మరో ముద్దు పేరు పెడతారు. చిట్టి, పొట్టి, చిన్నా పొన్నా అంటూ ఆ తరవాత కూడా ఆ పేర్లు మార్చడం కూడా జరగొచ్చు స్కూల్లో చేర్చేవేళకి. మరో తరం గడిచేక, స్వాతంత్రలక్ష్మి, రాజ్యలక్ష్మి, లవణం, బాపూ, గాంధీ లాటి పేర్లకి పేరొచ్చింది. అంతలో బెంగాలీనవలలు తెలుగుదేశం ఆక్రమించేసి, శరత్చంద్ర ఛటర్జీలూ, రవీంద్రముఖర్జీలూ వాళ్ల ఇంటిపేర్లతో సహా తెలుగుముంగిళ్ళలోకి చొచ్చుకొచ్చేసేరు. ఆతరవాత షోకైనపేర్లకి గిరాకీ తగిలింది. పేరు ఎంతో ముచ్చటగా ఉండాలి, పిలిచేవారినోట నాజూగ్గా తిరగాలి. కాయితంమీద కనిపిస్తే  కంటిని ఆకట్టుకోవాలి. దరిమిలా వాడు గొప్ప డాక్టరో ఇంజినీరో ఆర్థికతత్వవేత్తో అయిపోతే బోర్డుమీద కొట్టొచ్చినట్టు కనిపించేదయి ఉండాలి. సకలప్రపంచం తేలిగ్గా గమనించి, గుర్తించి, గుర్తు పెట్టుకునేదయి ఉండాలి.

పూర్వకాలంలో దేవుళ్ళపేర్లు పెట్టేవారు పిల్లాడిని పిలిచినప్పుడల్లా ఆ స్వామిని కూడా తలుచుకున్నట్టు ఉంటుందని. అంటే ఒక్కబాణంతో రెండు పిట్టల్ని కొట్టినట్టు, స్వామికార్యం స్వకార్యం అయిపోతాయి ఆ ఒక్కపిలుపుతోనూ. ఎటొచ్చీ కోపం వచ్చి తిట్లు లంకించుకున్నప్పుడు ఆ తిట్లు స్వామివారికి తగలకుండా, చాటుగా లెంపలేసుకుంటారేమో … మ్… కనుక్కోవాలి.

రోజు రోజే ఏ పేరెట్టి పిలిచినా అని ఆంగ్ల బారుడు ప్రవచించేడని సకలజనులూ కోటుతారు. ఈవాక్యానికి అర్థం ఏ పేరుతో పిలిచినా గులాబీ గులాబీయే అని ఇంగ్లీషు రచయిత చెప్పేడని.

నిజానికి గులాబీ అందమైన పేరు. పంకజం కూడా అందమైనపేరుగానే మనం గుర్తిస్తాం బురదలో పుట్టినా. నిజానికి పరీక్షగా చూస్తే ఒకొక కాలంలో ఒకొక వరస పేర్లు ప్రాచుర్యంలో ఉన్నట్టు కనిపిస్తుంది. విష్వక్సేనుడు, దుష్టద్యుమ్నుడు, ప్రద్యోతనుడు, శూర్పణఖ, అష్టావక్రుడు, రావణాసురుడు, కైకేయి, మంథర వంటి పేర్లు ఉన్నాయని పురాణాలు చెప్తున్నాయి. పురాణాలు నిజమవునా కాదా అని నేను వాదించబోవడంలేదు. అవి కథలే అనుకున్నా ఆపేర్లున్నాయి కదా. విక్రమార్కుడు అని కాకపోతే విక్రమ్, రావణాసురుడు కాకపోతే రవన్ వాడుకలోకి వస్తున్నట్టే కనిపిస్తోంది. అలాగే వరలక్ష్మి, సీతామహలక్ష్మి, వెంకటశివుడు లాటి పేర్లు కొంతకాలం చాలామంది తల్లితండ్రులకి ప్రేమపాత్రమయిన పేర్లయి రాజిల్లేయి. ఇక్కడ మనం గుర్తించవలసింది ఆ పేర్లు ఆ పిల్లలు ఎంచుకున్నవి కాదు. పాపం. వాళ్ళమ్మా నాన్నా తమ ఇష్టాయిష్టాలు తేటతెల్లం చేసుకోడానికి పిల్లలకి పెట్టినపేర్లు అవి.

అలాగే జవహర్లాల్ నెహ్రూలూ మహాత్మాగాంధీలు కూడా మనలో అవతరించేరు. బాపూ, గాంధీ అన్నపేర్లు పెట్టుకున్న … కాదు, కాదు, పెట్టబడిన పేర్లు గలవారు దరిమిలా మావో పుస్తకాలో చార్వాకుడిపుస్తకాలో చదివి మావోయిస్టులో నాస్తికులో అయినతరవాత కూడా ఆ పేర్లే పెట్టుకుని కథలూ వ్యాసాలూ రాస్తే కొంచెం గందరగోళంగా ఉండదూ? ఈశ్వరుడూ, అల్లా ఒక్కరు కాదు అన్నవ్యాసం కింద రచయితపేరు గాంధీ అని ఉంటే సరే. స్వామి జ్ఞానానంద భవతారకసూక్తులు పుస్తకంమీద రచన మావో అని ఉంటే నాకు అయోమయంగానే ఉంటుంది.

కొన్ని రష్యనుపేర్లూ, మార్క్సిస్టు పేర్లూ – ఇవి మాత్రం పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయింతరవాత తమతమ అభిరుచులప్రకారం మార్చుకున్నపేర్లే అనుకుంటాను. ఎందుకంటే లవణం అమ్మానాన్నలు పెట్టినపేరే. ఓల్గా కాదు.

ప్రస్తుతం కొత్తపేర్లు కొత్తదనం వెల్లివిరిసే పేర్లు పెడుతున్నారు. రచన, నవీన, లాటిపేర్లు ఆడపిల్లలకీ, హలంతాలతో వినయ్, ప్రవీర్ లాటి పేర్లు మగపిల్లలకీ సర్వసాధారణం.

అంచేత పేరులో పెన్నిధి మాట ఎలా ఉన్నా పేరుకి ఒక ప్రత్యేకత ఉందని నేను గట్టిగా నమ్ముతున్నాను.

నేను అమెరికా వచ్చిన కొత్తలో అమెరికనులు నాపేరుతో పట్టే కుస్తీపట్లు చూస్తే నాకు మహ ఆశ్చర్యంగా ఉండేది. బ్రజెన్స్కీని నువ్వు పేరు మార్చుకో అని అడగరు కానీ నన్ను మాత్రం మెలనీ అనో మాలీ అనో మార్చుకోమని చెప్తారు. ఓ పెద్దమనిషి పోనీ మెలవెన్స్కీ అని మార్చుకో అని సలహా ఇచ్చేడు అదేదో తేలిగ్గా పలకేయగల పేరయినట్టు. హీహీ.  మెలనీలో ఒత్తులు లేవు. మాలతిలోనూ లేవు కదా ఎందుకు పలకలేరు అని నా సందేహం. పైగా చిన్నపిల్లలు మాత్రం చిలకల్లా చక్కగా మాలతి అంటారు. అంటే ఏమిటర్థం – ఈ అమెరికన్ పెద్దలు మొదట మననోట ఈపేరు తిరగజాలదు అని నిశ్చయించేసుకుని తరవాత మొదలు పెడతారన్నమాట పలికేప్రయత్నం. దాన్నే ఇంగ్లీషులో మైండ్ బ్లాక్ అంటారు. నాపేరు నాదే, ఈముక్కూ, మొహం, పేరూ, తీరూ – ఇదంతా ఒకే పేకేజీ. అలాగే వచ్చేను, అలాగే పోతాను. ఇష్టమయితే పుచ్చుకోండి, లేదంటే లేదు అని ఖచ్చితంగా చెప్పేను వాళ్లందరికీ. అన్నట్టు, అమెరికావాళ్ళదాకా ఎందుకులెండి, ఇప్పటికీ నాబ్లాగుకి కొత్తగా వచ్చేవారిలో ఎవరో ఒకరు అడక్కుండా పోరు ప్రశ్నలూ జవాబులూ రాసేది మీరేనా అని. నేను నిడదవోలు మాలతిని అని గుర్తించే రోజు ఎప్పుడొస్తుందో అని ఎదురు చూస్తున్నాను 😦

నేనిలా ఆలోచిస్తుంటే తారకం వచ్చేడు, చెప్పనేల ఆవెనకే సంద్రాలు కూడా ప్రవేశించింది.

“రండి, రండి, ఏం తోచక ఛస్తున్నాను. మీరిద్దరూ కూడా కనిపించడం మానేశారు,” అన్నాను నిష్ఠూరంగా.

“నేదమ్మ, ఈమజ్జిన బిజీ అయ్పోనాది. మాదొరబాబు ఏదో కొత్త కంపెని ఎట్టినంక,” అంది సంద్రాలు.

సందేహాస్పదదృక్కులతో సంద్రాలువేపు చూసేను. బిజి అన్నపదం ఆమెవాడకం ఎప్పుడు మొదలయిందా అని ఒకటి, ఏ వంకా దొరకనప్పుడు జనం బిజి అన్నపదం వాడుతారు కదా అదేనా అని రెండు.

“నేను కూడా బిజి. ఒక అనువాదం మొదలు పెట్టేనండి,” అన్నాడు తారకం.

“ఆహా, బాగుంది. ఇతర సంస్కృతులగురించి తెలుసుకోడానికి ఉత్తమ సాధనం,” అన్నాను.

తారకం నావేపు చూసేడు. ఆకళ్ళనిండా బోలెడు సందేహాలు.

“సెప్పు, చల్లకొచ్చి ముంత దాసినట్టు, మాటాడకుంతె ఆయమ్మకెట్ల తెలస్తది,” అంది సంద్రాలు కసుర్తూ.

“దానికేంలే. అనువాదం అంటే మాటలా. సందేహాలు చాలానే వస్తాయి. ఎలా సాగుతోంది?”

“అది కాదండీ. చిన్న రష్యన్ కథ.”

“నీకు రష్యన్ వచ్చా? నాకు తెలీదే.”

“లేదండీ. నాకు రష్యన్ రాదు. ఇంగ్లీషు అనువాదం చూసి నాస్నేహితుడు హిందీలోకి తర్జుమా చేసేడు. అది నేను తెలుగులోకి చేస్తున్నాను.”

“ఆహా, మూడు తడవలు అయిందన్నమాట వడబోత.”

“అలాగే అందరూ చేస్తున్నారండి. లేకపోతే ఎవరికి వస్తాయి అన్ని భాషలు.”

“అంతేలే,” అన్నాను, తెలుగుభాష సొగసులు అనువాదాల్లో రాదని గోలెడుతున్న ప్రముఖులనందర్నీ తలుచుకుంటూ. ఇన్ని వడబోతలయేక మరి మూలభాష సొగసులమాట ఏముంటుంది?

“ఆపేర్లు గుర్తు రాయడం, చదవడం, గుర్తు పెట్టుకోడం కూడా కష్టమేనండీ.”

“కావచ్చు కానీ వాళ్ళపేర్లవి. అవి అలా ఉంటాయని తెలుసుకోడం కూడా అవసరమే కదా.”

“ఇప్పుడు చాలామందికి అసలు మన పేర్లే సరిగా తెలీవు. మాఅమ్మమ్మ అంటుండేది వాళ్ళ తనస్నేహితురాలు ఇందిరాగాంధీ రెండోబ్బాయిపేరు గురించి మాటాడుతూ కీచకుడో ఏదో భారతంలోది అంది. సంజయ్ అన్న పేరు ఆవిడకి తట్టలేదు.”

“అవును, ఆ కథ నేను కూడా విన్నాను. పోన్లే, కనీసం భారతంలోది అని తెలిసింది కదా.”

“ఏటా సుట్టుతిరుగుడు యవ్వారం. అది గాదమ్మా. ఈ బాబు ఆ కతల మడుసులకి తెలుగు పేర్లెట్టినాడు.”

నేను ఉలికిపడి, అవునా అన్నట్టు అతనివేపు చూసేను.

తారకం ఇబ్బందిగా కుర్చీలో కదుల్తూ, “అది కాదండీ. పాఠకులు కథమీద దృష్టి నిలపాలి కానీ ఈ తికమకపేర్లన్నీ గుర్తు పెట్టుకోలేక సతమతమవకూడదు కదా. అంచేత తెలుగు పేర్లయితే చదువుకోడానికి సుఖం అని.”

“ఇంక ఏం సేసినవో సెప్పు.”

“ఏం చేసేవేమిటి?”

తారకం మాటాడలేదు.

“ఆల్లబాసలో ఏదో .. ఏటది?”

“కులిబియాకా.”

“అదేదో సేపలకూరంట.”

నేను చాలా ఓపిగ్గా “ఇంకా ఏం మార్చేవేమిటి?” అన్నాను.

“బక్లజ్వనోయా ఇక్రా – వంకాయకూర.”

“ఇంకేటో గూడ ఉన్నది. నానేఁవో సెజ్జబూర్లని ఎట్టమంతన్న.”

“అది కాదు సంద్రాలూ, నీక్కూడా ఇలాగే బాగుంటుందంటావా?”

నాకెందుకో సంద్రాలు కూడా ఇలా పండితకులంలోకి మారిపోడం నచ్చలేదు. తారకం అంటే మొదట్నుంచీ ఆ సజ్జులో వాడే. అయినా నా వెర్రి కానీ, సంద్రాలు బిజీ అన్నప్పుడే నేను గ్రహించుకోవలసింది.

ఈ లెక్కన కేథరిన్ కేకయ అవొచ్చు. సాండీ శాంత, మేగ్డలిన్‌ మాలతి అవుతుందా? అబ్బే, మాలతి కూడా పాతకాలం పేరే. మేలిమి అనొచ్చేమో కొత్తగా ఉంటుంది. థామస్ తామసిగా మారొచ్చు. మనిషి పేర్లు మారుస్తున్నాం కనక ఊరుపేర్లు కూడా మారిస్తే ఆ ఊపులోనే మరింత సౌఖ్యం కదా. ఆన్ ఆర్బర్ – అనకాపల్లి, షికాగో – సీతక్కమెట్ట, అట్లాంటా – అట్టాడ. పేర్లూ, ఊర్లూ మార్చేక, తినే తిండీ, కట్టే బట్టా కూడా మార్చేస్తే పోలే!

“మీరిలా మాటాడుతుంటే నాకో కథ తోస్తోంది. చెప్తాను. మీరిద్దరూ విని ఎలాఉందో చెప్పండి.”

“సరే. చెప్పండి. సావధానులమయి వింటాం,” అని ఇద్దరూ కుర్చీలు దిగి, గచ్చుమీద మఠం వేసుకుని కూర్చున్నారు బుద్ధిమంతులలాగ.

నేను కూడా వారికెదురుగా కూర్చుని కథ మొదలు పెట్టేను,

కేకయ, తామసి కలిసి అనకాపల్లిలో సినిమాకి వెళ్ళేరు. దానికి కూడా ఏ బండరాముడులాటి తెలుగుసినిమా పేరే పెట్టేదాం. చక్కగా నట్టింట్లో మనాళ్ళతో కబుర్లు చెప్పుకున్నట్టుంటుంది. కేకయ ధర్మవరంచీరె కట్టి, తలలో మల్లె చెండు తురుముకుంటుంటే, చూడ్డానికి రెండు కళ్ళు చాలవు. తామసి తాంబూలం నవుల్తూ … ఏంటీ రష్యాలో తాంబూలం ఎక్కడొచ్చిందంటారా? లేదనుకోండి. వాళ్ళు వాళ్లకలవాటయినదేదో తిండమో, తాగడమో చేస్తారు. …

అని ఆగేను. “ఇంతవరకూ ఎలా ఉంది నారష్యన్ కథ.”

“హాయిగా తెలుగు పేర్లూ, తెలుగు భోజనాలూ, తెలుగు సినిమా, తెలుగునవల చదువుతున్నంత ఎంతో హాయిగా ఉంది. అన్నీ ఇట్టే తెలిసిపోతున్నాయి. అర్థం కానిదేదో ఉందేమో అన్న ఆరాటం లేదు. అర్థం చేసుకోడానికి పడాల్సిన అవస్థ లేదు. హాయి … హాయి.. . కమ్మని తెలుగుదనం …”

“మరి మనం రష్యన్ జీవితంగురించి ఈనవలలో ఏం తెలుసుకున్నాం?”

“భలే అడిగేరండి, చెత్త ప్రశ్న అంటే మీరు నొచ్చుకుంటారేమో కానీ మనకి కావలసింది కథే కదా. కథ తెలిసింది కదా. అంచేత ఇది రష్యన్ నవలే.”

నేను నిట్టూర్చేను నాయనా, నీచెయ్యి. నీకలం, నీవిజ్ఞానం … అంతే అనుకుంటూ.

(నవంబరు 21, 2013)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

5 thoughts on “ఊసుపోక – పేరులో పెన్‌నిధి?”

 1. పేర్ల ప్రహసనంతో పారంభించి, మొత్తానికి సంద్రాలు లేని కథనిపించకుండా తన్నీ లాక్కొచ్చి,- స్ట్రీమ్ ఆఫ్ కాన్షస్నెస్ శైలిలో ముగించారా!
  బాగుంది.

  మెచ్చుకోండి

 2. @)) ఎన్నెల, సరి మీరొల్లనంతే సరి, నేపోతే మీపేరు vanilla ఔపోతాదమ్మ. మనపేర్లు ఆల్లు తిరిగేసినారో నేదో నాకెరికి నేదుగాని, 50, 60లల ఇక్కడికొచ్చినోలు ఆలకాలే మార్సేసుకున్నరు. ఉపుడంతె మనోల్లు ఎక్కువయిపోనాంక, దయిర్యం వచ్చీసింది గావల అమ్మ అబ్బా ఎట్టినపేర్లు అట్టనె ఉంచీసుకుంతన్నరు. హీహీ

  మెచ్చుకోండి

 3. హాహహా..నా పేరునీ ఇలా ఖూనీ చేత్తానంటె, ఒల్లకాదని ఒగ్గేసానండీ…
  అయినా మన పేర్లు ఆల్లు తిరగేయడం సూసా కానీ, ఆల్ల పేర్లని మననూ తిరగెయ్యొచ్చేటండీ..యమా ఇంటరెస్టింగు సుమీ..!

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s