ఊసుపోక – నా భాషభక్తి

(ఎన్నెమ్మకతలు 129)

గంటక్రితం ఫేస్బుక్కులో నాభాషాభిమానం తేటతెల్లం చేసుకున్నతరవాత, ఆ అంశంమీద మరి కొన్ని ఆలోచనలు వచ్చేయి. గర్వపడుతున్నానని చెప్పలేను, కానీ నేనే మారిపోతున్నానన్న స్పృహ.

ఇంకా వెనక్కి అంటే గంటకంటే కొన్నినెలల, బహుశా కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే, నేనే ఒకసారి పుస్తకం.నెట్ లో ప్రశ్నించేను వ్యాఖ్యలు తెలుగులో ఎందుకు లేవని.

ఆ తరవాత క్రమంగా చాలా విషయాలు తెలిసేయి. ఆఫీసుల్లోనూ, ఐపాడుల్లోనూ, మరో సాధనంలోనూ తెలుగు టైపు చేసే వసతి లేకపోవడం కావచ్చు. తెలుగు చదవడం వచ్చు కానీ రాయడం రాదు, రాయడం వచ్చు కానీ కంప్యూటరులో ఎలా రాయడమో తెలీదు … ఇలా అనేక కారణాలు.

ఇప్పుడు నేను ఫేస్బుక్కులో ఇంగ్లీషులో రాస్తున్నాను 😦 . మరి మీరు రాయొచ్చా అని మీరు అడగక్కపోవచ్చు కానీ నాకే తెలుస్తోంది. ఎందుకిలా చేస్తున్నాను నాకే ఆలోచన వచ్చింది. అలాగే అమెరికాలో తమిళపిల్లలు తమిళం మాటాడినట్టు తెలుగు పిల్లలు తెలుగు ఎందుకు మాటాడలేకపోతున్నారు? అని కూడా ప్రశ్నలు వస్తున్నాయి.

మా అమ్మాయి 9, 10 ఏళ్ళవరకూ తెలుగు చక్కగా మాటాడేది. ఒకసారి మేం ఇండియా వెళ్తే 15 రోజులపాటు ఒక్క ఇంగ్లీషు మాట వాడకుండా తెలుగు మాటాడి, రికార్డు సృష్టించింది. :)). గుంటూరులో నాస్నేహితురాలు విజయలక్ష్మీ, జార్జి గారింటికి వెళ్ళి రెండురోజులున్నాం. జార్చి మాఅమ్మాయిచేత ఇంగ్లీషు మాటాడించాలని బ్రహ్మప్రయత్నం చేసేరు. ఆయన ఇంగ్లీషులో మాటాడుతుంటే, సరయు తెలుగులో జవాబులు ఇస్తూ వచ్చింది. ఆఖరికి, ఆయన నావేపు తిరిగి, what’s she talking about? I don’t understand అన్నారు. సరయు నావేపు తిరిగి, ఆయనేం అంటున్నారు, నాకర్థం కాడం లేదు అంది. :)).

ఆ తరవాత క్రమంగా ఇంట్లో తెలుగు, స్కూల్లో ఇంగ్లీషు మాటాడేది. ఆ తరవాత కొంతకాలానికి నేను తెలుగులోనూ తను ఇంగ్లీషులోనూగా సాగింది కొంతకాలం. ఆ తరవాత … నేనే gave up :p.

నేను ఫేస్బుక్కులో ప్రవేశించేక, వారం రోజులయేకనుకుంటాను, ఒక స్నేహితురాలిని అడిగేను నువ్వు తెలుగులో రాయడం లేదేం అని. అక్కడ ఇంగ్లీషు మాత్రమే తెలిసిన స్నేహితులకోసం అంది. అలాగే టెక్నికల్ విషయాలు రాసినప్పుడు కూడా ఇంగ్లీషే సౌకర్యం.

క్రమంగా తెలిసింది నాక్కూడా.

మంచి తెలుగు కనిపించడం లేదు అనడం లేదు. కొన్ని తెలుగులోనే బాగుంటాయి. తెలుగులోనే చెప్పడం తేలిక. అలాగే కొన్ని తప్పనిసరిగానూ, కొన్ని ఫరవాలేదుగానీ, కొన్ని ఇదే నయం గానూ …

ఇప్పుడు నాక్కలిగిన సందేహం, ఒక్క నావిషయంలోనే Am I fighting a losing battle?!

(నవంబరు 30, 2013)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

7 thoughts on “ఊసుపోక – నా భాషభక్తి”

 1. నరసింహారావుగారూ, అవునండీ ఆ రోజుల్లో అందరం భాషమీద అభిమానంతోనే సంస్కృతం చదివేం. ఇప్పుడందరూ మీరు చెప్పినకారణంతోనే కావచ్చు. పోతే మీరు క్షమాపణలు చెప్పఖ్ఖర్లేదండీ. ఆ చదువు ఇప్పుడు ఇలా కథలు చెప్పుకోడానికి మాత్రమే పనికొస్తోంది. అంతా మర్చిపోయేను. ఏమో లెండి, ఈ భాష ఏ తీరాలకి చేరుతుందో కాలమే చెప్పాలి.

  మెచ్చుకోండి

 2. (మీ 12.44 pm సమాధానం మీద) మీరు వ్రాసిన Bilingual Kid చదివాను కాని, Bilingualism in Andhra Pradesh అనే వ్యాసం ఇప్పుడు మీరు చెప్పిన తర్వాతే చదివాను. మీరు చెప్పినట్లు మొదట కలోనియల్ ప్రభావం, తర్వాత అమెరికన్ సంస్కృతి ప్రభావం (కొందరు దీన్ని neo-colonialism అంటారనుకుంటాను).
  ముందు మీకు sorry – మీరు సంస్కృతం చదివారని తెలియదు. Sorry, no offence meant.
  మీరు సంస్కృతం మీద అభిలాషతో కాలేజ్ లో ఆ సబ్జెక్ట్ తీసుకున్నారని నమ్ముతున్నాను. కాని ఈతరంలో మాత్రం విద్యార్ధులు స్కూల్ రోజుల నుంచే తెలుగు వదిలేసి గొర్రెదాటు పద్ధతిగా మార్కుల కోసమే సంస్కృతం వైపు పరుగులు పెట్టటం కూడా తెలుగు భాషా పతనానికి ఒక బలమైన కారణమే అని నాకు అనిపిస్తూనే ఉంటుంది.

  మెచ్చుకోండి

 3. బాగా చెప్పారు. అందుకే గదండీ సంస్కృతాన్ని “మృత భాష”అంటున్నారు.

  మీరు చెప్పినట్లుగా తెలుగులో చక్కగా వ్రాసేవారు, తెలుగు సాహిత్యంగురించి చెప్పేవారు, పద్యాలల్ల గలిగేవారు కొద్దిమంది బ్లాగుల్లో కనిపిస్తున్నారు. కాని అలాంటివారిలో సింహభాగం ఈతరం వారు కాదని నా అనుమానం / నమ్మకం. ఈతరం వారు ఒకరిద్దరున్నా వారు exceptions క్రిందే వస్తారు. మరి ఈనాటి యువతే కదండీ రేపటి భవిష్యత్తు, అందుకే ఆందోళన. చివరికి తెలుగుని pidgin స్ధాయికి దిగజార్చకుంటే చాలు.

  మెచ్చుకోండి

 4. ఆలోచిస్తుంటే, అచ్చ తెలుగు వ్యవహారంలో తగ్గిపోతోంది కానీ ప్రాచీన సాహిత్యం చక్కగా చదువుకున్నవారు, టీకా తాత్పర్యాలతో వివరించగలవారూ బ్లాగుల్లోనూీ, ఫేస్బుక్కులాటి సోషల్ మీడియాలోనూ బాగా కనిపిస్తున్నారు కనక, తెలుగుకి సంస్కృతం స్థాయి వస్తుందేమో. అంటే మాట్లాడడం ఉండదు కానీ పుస్తకాలలో మాత్రం క్షేమంగా వర్థిల్లవచ్చు. ఏమంటారు.

  మెచ్చుకోండి

 5. నరసింహా రావుగారూ, మీరు చెప్పిన కారణాలు నిజమే. కానీ అంతకంటే బలమైనవి చారిత్ర్యక కారణాలు. మన రాజభక్తిమూలంగా ఇంగ్లీషువారి హయాంలో వారిభాషని పూజించడం మొదలు పెట్టేం. నిజానికి ఈతరంవాళ్ళకీ ముందు తరంవాళ్ళకీ ఇంగ్లీషు వస్తేనే భుక్తి అని నూరిపోసినవారు అంతకుముందు తరం వారు. ఇంగ్లీషువారు పోతూ పోతూ మనకి పెట్టిన భిక్ష అది. మాదేశం వచ్చి దేశపరిపాలనావిధానాలు నేర్చుకోండి, మీకు స్వతంత్రం ఇస్తాం అన్నారు. అలా వాళ్ళు పోయినా, వాళ్ళ ఆధిపత్యం ఇక్కడ భద్రపరిచి వెళ్ళేరు. ఆ తరవాత అమెరికా వచ్చి దాన్ని దృఢతరం చేసింది. అమెరికాలో బాషాసేవ కూడా అలాగే ఉంది. సభలు పెడతారు. సగం ఉపన్యాసాలు ఇంగ్లీషులోనే ఉంటాయి. నేను తూలిక.నెట్ లో మన దేశంలో bilingualismమీద ఒక వ్యాసం రాసేను, వీలయితే చూడండి. అది ఇతర సైటుల్లో కూడా పెట్టుకున్నారు కొందరు. లింకు – http://wp.me/p3npcR-5p. ఇప్పుడు తెలుగుమీద అభిమానం ఉన్నవారు తెలుగులో లేనిపదాలగురించి పడే తాపత్రయం నిత్యవాడుకలో ఉండగల తెలుగుపదాలు వాడడంలో చూపడం లేదు.
  కానీ, మరొక మాట కూడా ఒప్పుకోక తప్పదు. చిన్న సంఖ్యలోనే అయిన మనసాహిత్యం చక్కగా చదువుకున్నవారు, వివరించగలవారూ కూడా బ్లాగుల్లోనూ ఫేస్బుక్కులోనూ కూడా కనిపిస్తున్నారు. అది కొంతలో
  కొంత నయం.

  మెచ్చుకోండి

 6. ఈమాత్రానికేనా మాలతీ మేడం గారూ? 🙂
  భాష గురించిన మీ తపన అర్ధమవుతోంది, కాని మీరు ఉదహరించినవాటికి కనీసం ఏదో ఒక కారణమైనా ఉంది – ఫేస్ బుక్ ఇంగ్లీష్ లోనే ఉంటుందని; అమెరికాలోని ప్రవాసాంధ్రుల పిల్లల తెలుగు వికసించటానికి వాళ్ళ బయట పరిసరాలు అడ్డంకి అని (నా అభిప్రాయంలో. నాకన్నా మీకే విదేశీ అనుభవం ఎక్కువ).

  మరి ఆంధ్రదేశంలో పుట్టి ఆంధ్రదేశంలో పెరిగిన / పెరుగుతున్న ఇటీవలి తరం వారి తెలుగు వింటే మన భాష పరిస్ధితి ఎంత దయనీయంగా తయారయిందా అనిపిస్తుంది. చాలామందికి తెలుగు వ్రాయటం రాదు; చదివినా కూడా ఏదో నట్లు నట్లుగా చదువుతారు. (1). నా విశ్లేషణ ప్రకారం ఒక తరం మొత్తాన్ని ప్రభావితం చేసి ఈ పరిస్ధితికి దారితీసిన ఒక బలమైన కారణం తోస్తోంది. అదేమిటంటే – మార్కులు బాగా వస్తాయని పిల్లలు స్కూల్ లో సంస్కృతం తీసుకోవటం (తెలుగు బదులుగా !!). మీకు గుర్తుండే ఉంటుంది – మీరోజుల్లో మారోజుల్లో సంస్కృతం సబ్జెక్ట్ గా తీసుకునేవాళ్ళు క్లాసులో మహా అయితే ఒకరో ఇద్దరో ఉండేవారు. మరీ అంత తక్కువమంది మాత్రమే ముందుకు వస్తుండటం కొనసాగితే తమ ఉద్యోగాలకే ఎసరు వస్తుందని భయపడి విద్యార్ధులను ఆకర్షించడానికి సంస్కృతం టీచర్లు తర్వాత కాలంలో ధారాళంగా మార్కులు ఇవ్వటం మొదలుపెట్టారా అని అప్పుడప్పుడు అనుమానం వస్తుంటుంది (ఇది నా అంచనా మాత్రమే. తప్పయి ఉండవచ్చు కూడా). సంస్కృతం పబ్లిక్ పరీక్షలో నూటికి 98 మార్కులు వస్తున్నాయంటే నమ్ముతారా! తెలుగులో అన్నేసి మార్కులు రావు. (2). దీనికితోడు ప్రభుత్వం వారు రాష్ట్రంలోని అన్ని స్కూళ్ళల్లోనూ (ప్రైవేట్ స్కూళ్ళతో సహా) తెలుగు భాషని నిర్భంధం చెయ్యకపోవటం (కర్నాటక, తమిళనాడు వంటి పొరుగు రాష్ట్రాలు చేసినట్లుగా). రాష్ట్రంలో కొన్నిచోట్ల ఎక్కువవుతున్న భాషేతరుల ప్రాబల్యం కూడా స్కూళ్ళల్లో తెలుగుని నిర్భంధం చెయ్యకుండా అడ్డుపడుతోందేమో అనిపిస్తుంది. ఇటువంటి పనుల ఫలితం తెలియాలంటే దాదాపు ఒక తరం పడుతుంది కదా. ఆ ప్రభావమే ఇప్పుడు కనిపిస్తోందేమో.(3). పైగా టీవీ ఛానళ్ళ ప్రభావం కూడా. కొంతమంది యాంకరిణుల తెలుగు భాష వినలేం. ఏదో, దూరదర్శన్ వారు మాత్రం (దూరదర్శన్ అంటే భారతదేశపు అధికారిక టీవీ ఛానెల్) “తెలుగుతోట”, “తెలుగింటి అమ్మాయి” లాంటి కొన్ని కార్యక్రమాలు తయారు చేసి ప్రసారం చేస్తూ తెలుగు భాష కోసం తాపత్రయ పడుతున్నట్లుగా అనిపిస్తుంది. కాని దూరదర్శన్ వారి కార్యక్రమాలు చూసేవారు ఎంతమంది!

  ఏదైనా, కర్ణుడి చావుకి ఆరుగురు కారణం లాంటిదే తెలుగు భాష యొక్క ప్రస్తుత పరిస్ధితి. ఏతావాతా ఆంధ్రదేశంలోనే తెలుగు భాష దాదాపు భూస్ధాపితం అయిపోయే దశకు చేరుతోందా అని భయం వేస్తుంది.

  ఈ సందర్భంగా ఒక సందేహం మాత్రం వస్తుంటుంది – తెలుగు భాషకి సేవ అమెరికాలోనూ ఇతర విదేశాల్లోనే బాగా జరుగుతోందా అని.

  ఇక, “Am I fighting a losing battle?” అని ఎవరైనా అడిగితే, You probably are, if you are on a crusade to save Telugu అనాలేమో ప్రస్తుత పరిస్ధితుల్లో.

  (నా మామూలు ధోరణిలో కొంచెం ఎక్కువ వ్రాసాను కదా. మీ టపాకి నా వ్యాఖ్య కి ఆట్టే సంబంధం లేదనిపించినా కూడా, స్వంత గడ్డ మీదే తెలుగు భాషకు పట్టిన దుస్ధితి గురించిన బాధ ఇది వ్రాయించింది.)

  (అన్నట్లు నాకు ఫేస్ బుక్ ఖాతా లేదండోయ్. తెరిచే ఉద్దేశ్యం కూడా లేదు.)

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s