ఊసుపోక – కేబిను జొరం

(ఎన్నెమ్మకతలు 131)

మూడ్రోజులుగా మంచూ గాలీ ఎత్తి పోస్తున్నాయి టెక్సనుల దృష్టిలో. కారులు ఇల్లు వదల్డం లేదు. వదిల్తే రోడ్డుమీద బోల్తా పడుతున్నాయి. విమానాలు ఎగరడం లేదు. విమానాల్లో విహరించబోయినవారు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయి దిక్కులు చూస్తున్నారు. దీన్నే దిగ్భ్రాంతి అనొచ్చా. ఏమో మరి. స్కూళ్ళు లేవని చాలామంది సంతోషిస్తున్నారు. వారి అమ్మలూ నాన్నలూ మాత్రం సంతసిస్తున్నట్టు లేదు.

నేను కూడా మూడ్రోజులయింది గడప దాటి. అంచేత నాకు కేబిను జొరం వచ్చినట్టుంది. అలా అనడానికి మొహమాటంగా కూడా ఉంది. ఎందుకంటే, నేను విస్కాన్సినునించి వచ్చేను. అక్కడ కేబిను ఫివరు రావడానికి అంగుళన్నర మంచు చాలదు. అంగుళంన్నర మంచు పడితేనూ, టెంపరేచరు ఇరవైలలో ఉంటేనూ విస్కాన్సిను పురజనులకి ఆనందంగానే ఉంటుంది. ఫరవాలేదు అనుకుంటారు. అక్కడ మామూలుగా మంచు అడుగుల్లో చెప్పవలసివస్తే, విండ్ చిల్ ఫాక్టరు మైనస్ అంకెలలోనూ ఉంటాయి. అప్పుడన్నమాట స్కూళ్ళూ ఆఫీసులూ మూత పడడం, జనులు ఇల్లు కదలకుండా ఉండడం. మంచు విపరీతంగా కురిసి, స్కూళ్లూ ఆఫీసులూ మూత పడిపోతే, ఇల్లు కదలడానికి వీల్లేకపోతే ఇంట్లో కూర్చోలేక పిచ్చెత్తిపోయినట్టుంటే, ఒకొకరికి కలిగే అవస్థని cabin fever అంటారు. దాని ప్రదానలక్షణం అదే – పిచ్చిత్తిపోయినట్టుండడం! అంటే మూలుగులు మునపట్లాగే భోజనాలు ఎప్పట్లాగే.

మూడ్రోజులుగా టెక్సస్, ఇంకా కుదించి చెప్పాలంటే డలస్ ప్రాంతంలో చలి, మంచు మూలంగా కార్లు నడవడం లేదు. విమానాలు ఎగరడం లేదు. షాపులు మాత్రం తెరిచే ఉండొచ్చు.  ఎందుకంటే వాళ్ల ఆలోచన ఆఫీసులూ స్కూళ్ళూ మూత పడిపోతే, జనులు కాలక్షేపానికి దుకాణాలమీద పడతారని. స్కూళ్ళకీ ఆఫీసులకీ వెళ్ళలేనివారు బజారులకి ఎలా వెళ్తారు అని అడక్కండి. నాకూ తెలీదు. ఆ తరవాత అవుసరం ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి కొంటారు.

ప్రస్తుతం ఇక్కడ టెస్కస్‌లో స్కూళ్లు మూసేసినందుకు పిల్లలకి ఆనందంగా ఉంది. దేవుడా, మరో రెండు రోజులు పొడిగించు ఈ మంచుకొండలు అని ప్రార్థిస్తున్నారు. దేవుడా ఈ పిల్లల్ని ఏం చెయ్యాలో నువ్వే చెప్పు అని వేడుకుంటున్నారు తల్లులు, తండ్రులు.

నాకు ఆఫీసు, స్కూలు, పిల్లలు – ఏవీ లేవు కనక నాకేం చెయ్యాలో తోచడంలేదు. మొదటి రెండు రోజులూ ముసురు పట్టి, గదిలో వెలుగు లేకపోతే ముడుచు పడుకోగలిగేను కానీ ఇవాళ కాస్త తెరిపిచ్చింది.

మూడంగుళాలమందం చొక్కాలు, కోట్లూ, సాకులూ బూటులూ చుట్టబెట్టుకుని, దసరాల్లో  ఎలుగుబంటివేషం వేసుకున్నట్టు తయారయి అంగుళం అంగుళం అడుగులో అడుగేస్తూ బితుకుబితుకుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని, చేపాటికర్ర (ఊసుపోక చేపాటికర్ర) తలుపు తీసి చూసి, గుండె చిక్క బట్టుకుని మళ్లీ అడుగులో అడుగు వేస్తూ మెట్లు దిగేను. కానీ మెట్లు దిగింతరవాత అడుగు పడలేదు. అందుకంటే గడ్డ కట్టుకుపోయిన మంచు అద్దంలా మెరుస్తోంది. దానిమీద చేపాటి కర్ర పెడితే, అది కూడా పాదరసంలా జారిపోతోంది. కర్రతో సహా నేను మిషల్ క్వాన్‌లా పది గజాలు జారిపోయే ప్రమాదం కళ్ళముందు కదిలింది. పడితే కాలో చెయ్యో విరుగుతుందన్న భయం కన్నా నన్నాదుకోవలసిన స్నేహితురాలికి మరింత ఇబ్బంది కదా అని నాబాధ. అంచేత మళ్ళీ అత్యంత జాగ్రత్తగా వెనుదిరిగి ఇంట్లోకొచ్చి పడ్డాను.

దాంతో మొదలయింది కేబిను ఫివరు. కానీ నాకిది హాస్యాస్పదంగా కూడా ఉంది. నిజంగా ఇక్కడ పడ్డ మంచు రెండంగుళాలు. విస్కాన్సిన్‌లో మోకాలెత్తు మంచులో కూడా నేనూ, నాకారూ కూడా హాయిగానే తిరిగేం. మరి ఇక్కడ రెండంగుళాలకే స్కూళ్ళు మూసేయడం ఏమిటి అని నేను హాహాహాహాహహాహా అని విరగబడి నవ్వుకున్నాను కూడా నిన్న.

ఆ ఊపులో ఇలా మంచుపోతగా రాతలు కూడా గిలికి పారేస్తున్నాను ఫేస్పుక్కులోనూ, బ్లాగులోనూ కూడా. ఇంకా ఎక్కడయినా సదుపాయం ఉంటే చెప్పండి. అక్కడికి కూడా రెండు రాతలు రవాణా చేసేస్తాను.

(డిసెంబరు 9, 2013)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

One thought on “ఊసుపోక – కేబిను జొరం”

 1. మీకు స్నో పడ్డాక ఏమి చెయ్యాలో తెలియదని తెల్సిపోతోంది. విస్కాన్సిన్ లో అంతకాలం ఉండీ తెలియదంటే ఏమనుకోమంటారు?

  ఇలా చేయండి. మధ్యాహ్నం రెండుదాటాక శనగపిండీ, బియ్యప్పిండి కలిపి వేడివేడిగా పకోడీలు తయారుచేయండి. మీ స్నేహితుల్ని పిలవండి, ఇలా పకోడీలకి వస్తారా అని. స్నో, మేము రాము అని ఎవరైనా అంటే వాళ్ళు మీకు పనికొచ్చే స్నేహితులుకారని వెంఠనే తెల్సిపోయినట్టే. వాళ్ళతో ఖటిఫ్ చేసుకోండి.

  అయిందా? ఇప్పుడు వేడి పకోడీలకి కొంచెం హంట్స్ కెచప్పూ, వేడి వేడి టీ (కాఫీ పనికిరాదు) పెట్టుకుని మాయాబజార్ సినిమాలో వివాహ భోజనంబు పాట పెట్టుకోండి. కిటికీలు, అన్నీ వేసి ఉండాలండోయ్ మరి. మర్నాడు కూడా స్నో పడితే ఈ సారి చల్లట్లు, పకోడి బదులు. చల్లట్లు పిండి కలిపేసి రడీగా ఉంచుకుంటే మజా ఉండదు. అప్పటికప్పుడు కలపాలి.

  ఇంకా మీకు కంప్యూటరూ ఫేసు బుక్కూ గుర్తుకొస్తున్నాయా? అయితే మిమ్మల్ని ఎవరూ రక్షించలేరు. మీ తెలుగుతనం పుర్తిగా పోయినట్టే. ఇలాంటప్పుడు కూడా ఊతకర్ర పట్టుకుని బయటకెళ్ళేరంటే కాళ్ళు విరిగితే ఫర్వాలేదు అతుక్కుంటాయి కానీ మోకాళ్ళు విరిగితే ఇంక అంతే సంగతులు.

  చివరి తోక: కినిగే వారు, అ.టా వారు కొన్ని నవలల గురించి ప్రకటనలు ఇచ్చేరు. వాటికో నవల రాసి పంపించండి. ఇంకా టైం ఉంది. లేకపొతే మీ ఐడియాలు నాకు ఇవ్వండి. నేను వాటిని కాపీ కొట్టేసి నవల రాసి డబ్బులు సంపాదిస్తా. నాకు ప్రైజ్ వస్తే మీకు పకోడీ పార్టీ. డీలా నో డీలా? 🙂

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s