ఊసుపోక – ఏదో సామెత చెప్పినట్టు

(ఎన్నెమ్మకతలు 132)

ముందు ఒక టపా రాసేను సామెతలగురించి. అసలు సామెతలు ఎందుకు వాడతాం అంటే అదొక ఆమోదముద్ర కనక. నామాటకి మరొకరి మద్దతు ఉంది. చాలామంది ఇలాగే అనుకుంటారు అని దృఢపరుచుకోడానికి వాడతాం. మనకి మాట తోచనప్పుడు కూడా వాడొచ్చు. అందుకే ఏ సామెతా తోచకపోతే, సామెత్చెప్పినట్టు అనడం అనేసి తప్పుకుంటాం. ముందు టపాలో సామెతల అనువాదాలగురించి చర్చతో మొదలు పెట్టేను. అదే తూలక.నెట్ ఫేస్బుక్కు పేజీలో పెట్టేక, చాలా విషయాలు తెలిసాయి. ఇక్కడ నేను ఫేస్బుక్ ప్రచారం చేయబోవడం లేదు కానీ అక్కడ మనం మనపేజీ జాగ్రత్తగా సెటప్ చేసుకుంటే, లాభదాయకమేనని ఇప్పుడు అర్థమయింది. అక్కడ ఖాతా లేనివారికోసం, నేను అక్కడ గ్రహించిన కొన్ని సంగతులు ఇక్కడ పెడుతున్నాను.

మొదట చెప్పుకోవలసింది ఫేస్బుక్కులో చర్చ అనువాదాల పరిధి దాటి, వివరణలపరిధిలోకి చొచ్చుకుపోవడంతో మరింత అర్థవంతమయింది.

లలిత గూడ ఒక సామెతకి నాఅనువాదం ఏమిటి అని అడగడంతో మొదలయింది. లలిత సూచించిన సామెత పొమ్మనలేక పొగ పెట్టినట్టు అని.

నేను starting fire to make him leave or fuming the room to make him leave అనొచ్చు అన్నాను.

మరో సూచన ఏల్చూరి మురళీధరరావుగారు నేను నిడుదవోలు వెంకటరావుగారిగురించి రాసిన వ్యాసంమీద వ్యాఖ్యానిస్తూ, వ్యక్తులపేరులతో ఏర్పడిన కొత్త సామెతలు ప్రస్తావించేరు.

వాటిలో కొన్ని –

“నీకు తెలియకపోతే నిడుదవోలు వారిని అడుగు” అని నిడుదవోలు వేంకటరావు గారిని గురించి ఆ రోజులలో సామెత.
“విస్సన్న చెప్పిందే వేదం” అని మహామహులైన ఇంద్రగంటి విశ్వపతిశాస్త్రులు గారి గురించి ప్రసిద్ధిలోనికి వచ్చిన సామెత.

“బులుసు లేని యజ్ఞం, పులుసు లేని పాకం” వేదస్వరూపులైన బులుసు పాపయ్యశాస్త్రి గారిని గురించిన సామెత.
“రెంటికి చెడ్డ రేవడు” వంటివి వ్యక్తుల పేర్లమీద ఏర్పడిన తొలినాటి సామెతలు.

సువర్చల చింతలచెరువు వీటికి మరిన్ని చేర్చేరు, “ఏల్చూరి మురళీధరరావుగారి సామెతల పోస్ట్ చూశాక.. ఇలా వ్యక్తుల పేర్లతో ఉన్న జాతీయాలను కూడా పోస్ట్ చేయొచ్చుకదా అనిపించింది. మీకూ తోచినవి పంచుకుంటారుకదూ?” అంటూ  –

ఆకాశరామన్న
ఆషాఢ భూతి
ఆత్మారాముడు
అరుంధతీ దర్శనం
కంచిగరుడ సేవ
చిదంబర రహస్యం
తిక్క శంకరయ్య
త్రిశంకుస్వర్గం
దరిద్రనారాయణుడు
దారినబోయే దానయ్య
నలభీమపాకం
నలుగురితో నారాయణ
పరమానందయ్య శిష్యులు
పరశురామప్రీతి
పానకాలరాయుడు
బోళా శంకరుడు
బ్రహ్మచెముడు
బ్రహ్మముడి.

ఇక్కడ సుధారాణి ఆకాశరామన్న కి ఇచ్చిన వివరణ కూడా నాకు కొత్తే. ఆమె వాక్యాల్లో, “ఆకాశరామన్న
తెలుగులో కొన్ని జననిరుక్తులు అంటూ తూమాటి దొణప్పగారు రాసిన వ్యాసంలో ఈ పదం గురించి వివరించారు. అజ్ఞాత వ్యక్తి కృతాలయిన రాతలను ఆకాశరామన్న ఉత్తరాలు అని చెప్పుకుంటాం.
ఈ పదానికి కారణం ప్రజలలో కోదండరామ, కల్యాణరామ, అయోధ్యరామ ఇలా వ్యక్తినామాలలోని రామ శబ్దానికి ఉన్న ప్రాచుర్యం వలన ఈ పదబంధం అవతరించింది. ఆకాశ నామ్న అంటే ఆకాశం పేరిటవాడు అని భావం. ఆకాశం అంటే శూన్యం అనీ అభావం అనీ అంటారు కదా. ఆకాశకుశుమం వంటి పదాలలోని అభావం అంటే లేనిది అనే అర్థంతోనే పేరు లేని వ్యక్తి అనే అర్థంతో వ్యవహృతమవుతోందని దొణప్పగారు వివరించారు.”

మరి కొన్ని పేరులతో కూడీన సామెతలు

ఓడ ఎక్కేదాకా ఓడమల్లయ్య – ఓడ దిగిన తర్వాత బోడి మల్లయ్య-
కాళిదాసు కవిత్వం కొంత – నా పైత్యం కొంత అన్నట్లు-
తగవు తీర్చరా సింగన్నా అంటే దూడ, బర్రె నావే అన్నాట్ట –
తిండికి తిమ్మరాజు – పనికి పోతరాజు-

భగీరథ ప్రయత్నం-

భోజునివంటి రాజుంటే కాళిదాసువంటి కవీ వుంటాడు-
రంగడికీ లింగడికీ స్నేహం – రొట్టె దగ్గర గిజగిజలు-
శాస్త్రులవారింట పుట్టాను, సోమయాజుల వారింట మెట్టాను,
లవణమంటే దూడ రేణమని తెలీదా నాకు అన్నదట-
వ్యాస ప్రోక్తమా? పరాశర ప్రోక్తమా?-
సంజయ రాయబారంలాగా-
సీతాపతీ! నీకు చాపేగతి-

ఆ తరవాత, మరొక పోస్టులో సువర్చలగారే రాసేరు – “ఓరకంగా సాధ్యమే కానీ..నిజంగా ఇవి చేయనివి కదా! సందర్భాలకు అన్వయించే ఇలాంటి భావనలు ఎన్నో మన భాషలో! ఇలాంటివి మీరూ పంచుకోండి మరి!” అని ఇచ్చిన మరి కొన్ని సామెతలు
బుట్టలో పడెయ్యటం!
ముగ్గులో దించటం!
మునగ చెట్టు ఎక్కించటం!
గుండెల్లో గుడి కట్టటం!
కళ్లల్లో వత్తులు వేసుకోవటం!
కళ్లు కాయలు కాయటం!
కడుపులో కళ్లు ఉండటం!
కళ్లు నెత్తిపైకి రావటం!
నోరు కట్టుకోవటం!
కాళ్లకు బలపాలు కట్టుకోవటం!(బలపాలు అరిగేలా తిరిగారు..అంటుంటాం కదా!)

ఇందులో నాకు “కడుపులో కళ్ళుండడం” అంటే ఏమిటో తెలీలేదు. వివరణ అడిగితే, సువర్చల సమాధానం – “కడుపులో కళ్లుండటం అంటే అన్ ఫెయిర్ గా ఉండేవాళ్ల చూపు వేరు. వారి పరిశీలన అలా ఉంటుంది. మనకు తెలియదు వాళ్లే వ్యూ లో చూస్తున్నారో అని! ఏమైనా ఇది నెగెటివ్ చాయలున్నదే! 

ఇంకోటి కడుపులో ఎలుకలు పరిగెత్తటం!(ఆకలైతే దీన్ని వాడుతామని అందరికీ తెలిసిందేగా!)”

దానిమీద, సుధారాణి వ్యాఖ్య – “కడుపులో కళ్ళు ఏమో కానీ, కడుపులో కాళ్ళు పెట్టుకుని పడుకోవడం విన్నాను నేను. చాలా తట్టుకోలేని ఆకలి బాధని వివరించే సందర్భంలో. కడుపులోకి కాళ్ళు ముడుచుకుని పడుక్కోవడం అన్నమాట. బహుశ చాలామంది కథకులు మూడంకెవేసుకుని పడుకుంది అని వాడడం చదివే ఉంటారు. దానికి కూడా ఇదే అర్థం కదా.”

ఆ పైన మరో రెండు ప్రశ్నలు తలెత్తేయి. జాతీయం, సామెత – ఈ రెంటికీ తేడా ఉందా, రెండూ ఒకే అర్థాన్నిస్తాయా అని. చర్చ విస్తృతంగానే జరిగింది.

“పెళ్ళిళ్ల పేరయ్య” అన్నది జాతీయం కాదంటారు సువర్చల చింతలచెరువు. “జాతీయం ప్రథమలక్షణం మరోదానితో పోల్చటం! సామెతకు, జాతీయానికీ చాలా దగ్గర లక్షణాలుంటాయి! రెండింటి లక్ష్యం పోల్చటమే! పెళ్లిళ్ల పేరయ్య అనే వ్యక్తి రియల్ గా ఉన్నాడు కదా!”

సురేష్ కొలిచాల ఇలా అన్నారు: “జాతీయం ప్రధమ లక్షణం మరోదానితో పోల్చటం” అన్న వివరణ సరైనది కాదేమో. ఒక జాతి ప్రజల సంభాషణలో స్థిరపడిపోయిన పదబంధ ప్రయోగాలను జాతీయాలు అంటారని నా అభిప్రాయం. సాధారణంగా పదాలకు ఉండే మౌలికార్థాల ఆధారంగా కాకుండా ఈ పదబంధాలకు ఒక ప్రత్యేకమైన అర్థం వాటి చారిత్రక ప్రయోగాల ద్వారా ఏర్పడి ఉంటే అది జాతీయం అవుతుంది. ఇంగ్లీష్ లో వీటిని idioms అంటారు.
నా దృష్టిలో పెళ్ళిళ్ళ పేరయ్య అనేది జాతీయమే. మీరేమంటారు?

నాళము కృష్ణరావు రాసిన ఈ జాతీయాల పుస్తకం చూడండి.
https://archive.org/details/TeluguJaateeyamuluPartI

ఆ మీద మరో సందేహం “పరశురామ ప్రీతి” అన్న సామెతలో పరశురాముడు ఎవరు అన్నది. ఏల్చూరి మురళీధరరావు గారు పరశురాముడు ఒక వ్యక్తి కాదంటూ పెద్ద వివరణ ఇచ్చేరు, “వేదవ్యాసుడు, విశ్వామిత్రుడు, పరశురాముడు మొదలైనవి enduring legends గా పురాణవాఙ్మయంలో స్థిరపడిన నామాలనుకొంటాను. అవి వ్యక్తుల పేర్లు మాత్రమే కావని, విద్యాధ్యయనబోధనరతులైన మహనీయుల సంస్థాప్రతీత నామాలని శ్రీపాద అమృతరావు డాంగే గారు గతశతాబ్దిలో చాలా వ్యాసాలను ప్రకటించారు. సంప్రదాయ విద్వాంసులు వాటిని కొట్టిపారేస్తారు. 

త్రేతాయుగంలో క్షత్రియులను సంహరించిన పరశురాముడే – చిరంజీవి కనుక – ద్వాపరంలో ద్రోణునికి విద్య నేర్పిన గురువు అన్నది సంప్రదాయభావన.
(1) సంప్రదాయం, (2) విశ్వాసం, (3) చారిత్రిక పరిశోధన అన్న వేర్వేరు పరిమితులకు లోబడి ఆలోచించినప్పుడు ఇవి తలకొక్క తీరున కనబడతాయి. వాటన్నిటిని ఆధునికదృష్టితో సమన్వయించాలని ప్రయత్నించటం సాధ్యమయే పనికాదు.
ఒకటి మాత్రం నిజం: పరశురామ ధనుర్వేదం, పరశురామ కల్పసూత్రానుసారం అగ్న్యారాధనం అన్నవి కేరళలో ఇప్పటికీ సజీవంగా ఉన్న సంప్రదాయాలు. పరశురాముని అగ్నిచయనవిధిని గురించి Frits Staal గారి మహాగ్రంథం Agni ఉందనే ఉన్నది.” మురళీధరరావుగారు వివరించిన ఇంకా చాలా విషయాలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి.

అలాగే, నాకు తోచిన మరో కోణం – కులాలని చర్చకి పెట్టడం నాఅభిమతం కాదు కానీ, కులప్రసక్తితో కూడిన సామెతలు కూడా ఉన్నాయి.

పనిలేని మంగలి పిల్లిబుర్ర గొరిగినట్టు

చదువుకున్నవాడికంటె చాకలివాడు మేలు

కమ్మల్ని, తుమ్మల్ని నమ్మరాదు

నల్ల బ్రాహ్మణులని నమ్మరాదు

రాచనేతికి కొంగు పట్టమని

రెడ్డొచ్చె మొదలాడు

కొండమీద గోలేమిటంటే కోమటోళ్ళ రహస్యాలు
– లాటివి. నామటుకు నాకు ఇవి ప్రజలు తమకులములను సగర్వంగా చెప్పుకునే రోజుల్లో వచ్చేయేమోనని.

నిన్నరాత్రి – అక్షరాలా అర్థరాత్రి నాకు తోచిన మరో కోణం – మనం తరుచూ ఇంగ్లీషులో వాడుతున్న సామెతలకి సాటిగా తెలుగు సామెతలు సృష్టించగలమా అని.

నేను ఫేస్బుక్కులో అడిగేను square peg in a round hole అన్న నానుడికి తెలుగు సామెత ఏమైనా ఉందా అని.

జవాబుగా వచ్చినవి –

లంఖణాలపూట శోభనాల ముచ్చట్లు (జె.కె. మోహనరావుగారు)

గుండ్రని బెజ్జానికి చదరపు గూటంలా (కొలిచాల సురేష్ గారు)

నాకు తోచినది – గుండుకంతకి చదరపు చెక్క.

ఇంతకీ నేను చెప్పేది సామెతలు మన భాషకి పెట్టని కోటలు. అలరించే అలంకారాలు. వాటికి అస్తిత్వం మన నాలుకలమీదే.

ఇప్పుడింతా ఎందుకంటే ఏం చెప్పను ఏదో సామెత చెప్పినట్టు … 🙂

తా.క. ఇంకా, వెంకట్ టేకుమళ్ళ, లక్ష్మీ దేవి, లక్ష్మీ వసంత తదితరులు ఉత్సాహంగా చర్చలో పాల్గొనడంమూలంగా నాకు ఎన్నో కొత్త విషయాలు తెలిసేయి. అంచేత ఫేస్బుక్కుగురించి నాఅభిప్రాయం కొంత మారింది 🙂

(డిసెంబరు 15, 2013)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

2 thoughts on “ఊసుపోక – ఏదో సామెత చెప్పినట్టు”

  1. బాగుంది. సావెజ్జెపినట్టు అని మీరంటే ఇటీవలే చదివిన మునెమ్మ నవలిక గుర్తొచ్చింది. అందులో తరుగులోడని ఒకడుంటాడు. వాడికిది ఊతపదం. ఆహా, వాడేంఇ గొప్ప సామెత చెబుతాడో అని మనం ఎదురు చూస్తూ ఉంటామా, ఇంతకీ అక్కడి సందర్భానికి ఎమీ సంబంధం లేకుండా ఏదో పిచ్చి సామెత చెబుతూ ఉంటాడు వాడు.

    మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s