కవి తిలక కాంచనపల్లి కనకాంబగారు

కాంచనపల్లి కనకాంబగారిపేరు చాలాకాలంగా నాకు సుపరిచితమే అయినా, ప్రత్యేకించి వారి  రచనలకోసం ఎప్పుడూ వెతకలేదు. నాలుగు రోజులక్రితం అనుకోకుండా ఆమె రచించిన కావ్యం అమృతసారము దొరికింది. సాధారణంగా నేను వేదాంతగ్రంథాలజోలికి పోను కానీ చిన్న పుస్తకం, 544 పద్యాలు,  కనుకనూ, కాంచనపల్లి కనకాంబగారి పేరు సుపరిచితంకనకనూ చూదాం అనిపించింది. ఈ వ్యాసంలో కనకాంబగారు ప్రస్తావించిన వేదాంతంపై ఏ వ్యాఖ్యానం చేయడం నా శక్తికి మించిన పని. కానీ ఆవిషయాలు తెలిసినవారు మాత్రం తప్పక ఈ కావ్యాన్ని చదివి ఆనందించగలరని చెప్పగలను.

అలవాటు ప్రకారం, ఆశయము (పీఠిక) అన్న శీర్షికతో శ్రీ కాశీ కృష్ణాచార్యగారి వాక్యాలు, శ్రీ చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారి వాక్యాలు చూసేను. అవి చదివినతరవాత నాకు ఆసక్తి ఇనుమడించింది. “ప్రస్థానత్రయ శాంకర భాష్యాదులఁ జదివిన వారికన్న నీగ్రంథము చదివినవారు త్వరలో వేదాంతులు కాగలరని చెప్పవచ్చును” అన్నారు శ్రీ కాశీ కృష్ణాచార్య గారు తమ ఆశయములో.

చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారు ఆమె రచనావైదగ్ధ్యాన్ని ప్రశంసిస్తూ, “గురుముఖమువలన నప్పుడప్పుడు వినిన సంగుతులను నొకచో లిఖించుకొని యా సంగతులకుఁ తనయనుభవమును సహాయపఱచి వీలైనంత సులభముగా జిజ్ఞాసువులకుఁ తెలియవలెనని పూర్తిగా ప్రయత్నించినది” అని రాసేరు. అయితే విషయం అంత సులభసాధ్యమయినది కాదు కనక వివరణలు కూడా ఇచ్చి ఉంటే బాగుండేదని కూడా జోడించేరు. అందుకు ఉదాహరణగా

“దాసిసుతునిఁదెచ్చి తగరూపుమాయించి

ఆది బ్రఙ్మసుతుని నందు చేర్చి”

అన్న పద్యము వైద్యశాస్త్రములోనిదిట. అటువంటి విషయాలు ఈనాటి పాఠకులకి తెలియకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అది రాసినది 1936లో. ఇప్పుడు ఆ అభిప్రాయానికి మరింత బలమని నేను అనుకుంటున్నాను. నిజానికి వీరద్దరే కాక ప్రచురణకర్తలు కూడా ఈ అమృతసారము కావ్యములో విశిష్టతలు అనేక విధాల వివరించడంతో నాకు చదివి చూదాం అనిపించింది. అందుకు శ్రీమతి ఊటుకూరి లక్ష్మీకాన్తమ్మగారు తమ ఆంధ్రరచయిత్రులు గ్రంథంలో శ్రీమతి కనకాంబగురించి రాసిన వ్యాసం కూడా కారణం.

లక్ష్మీకాన్తమ్మగారి పుస్తకంలో ఇచ్చిన వివరాలు ఇక్కడ ఇస్తున్నాను.

కనకాంబగారు కాంచనపల్లి రంగారావు, రంగమ్మదంపతులకు పల్నాడులోని దివి గ్రామంలో 1893లో జన్మించేరు. బాల్యంలోనే వైధవ్యం సంభవించగా, పుట్టింటిలోనే పెరిగారు. చిన్నతనంలోనే తండ్రి కూడా మరణించగా, 1906లో పెదతండ్రి మంగు రామానుజము పంతులుగారు, పంగనామాల వెంకటరంగారావుగారు నెల్లూరికి తీసుకుని వెళ్ళేరు కనకాంబగారిని తల్లితో సహా. రామానుజముగారు పసితనములోనే కనకాంబగారు ప్రదర్శించిన ప్రజ్ఞావిశేషములు గమనించి, చదువు చెప్పించేరు. ఆ తరవాత ఆమె మద్రాసు వెళ్ళి విద్వాన్ పరీక్షలో ఉత్తీర్ణురాలయి, బి.ఎ. (ఇంగ్లీషు) పట్టభద్రురాలయి, క్వీన్ మెరీస్ కాలేజీలో తెలుగు ఉపన్యాసకురాలి పదవి చేపట్టేరు. ఆమె తన 11 ఏట ప్రారంభించిన కవితావ్యాసంగం కొనసాగించేరు. మద్రాసు యూనివర్సిటీ పరీక్షాధికారి పదవి, తెలుగు పాఠ్యగ్రంథ నిర్ణాయక సంఘ సభ్యత్వము పొందేరు. శ్రీకేసరిగారిచేతులమీదుగా స్వర్ణకంకణము అందుకున్నారు. విజయవాడకు చెందిన శ్రీ చుండూరి వెంకటరెడ్డిగారి పిలుపున, తమ గురుదేవులయిన శ్రీ అమృతానందస్వామి ఆదేశానుసారము త్రిలిఙ్గవిద్యామహాపీఠము నెలకొల్పేరు. “ఆమె పట్టి విడువని సారస్వతశాఖ లేదు. చేసి విడువని కావ్యభేదము లేదు. అనుభవింపక వదలిన గౌరవపదవి లేదు. ఆహరింపక వదలిన ఆధికపదము లేదు” అంటారు లక్ష్మీకాన్తమ్మగారు ఆంధ్రకవయిత్రులు గ్రంథంలో. (పు. 151).

ఆమె తెలుగు, ఇంగ్లీషు, సంస్కృతమే కాక, కన్నడ, మళయాళం వంటి ఇతర దక్షిణాది భాషలలో కూడా ప్రావీణ్యం సంపాదించేరు. మాక్స్‌మిలన్ కంపెనీకి అనేక పుస్తకాలు తయారు చేసి ఇచ్చేరు. 11వ ఏటనే కవితలల్లిన కనకాంబగారు అనేక ప్రక్రియలలో కృషి చేసి నిష్ణాతులనిపించుకున్నారు. కనకాంబగారు ప్రచురించిన పుస్తకాల జాబితా ఈవ్యాసం చివర చేర్చబడింది.

వీరేశలింగంగారికాలం చివరిదశలో జన్మించిన కనకాంబగారు అప్పటికి ఆయన ప్రాచుర్యంలోకి తెచ్చిన స్త్రీవిద్య, సంఘసంస్కరణాభిలాష వంటివి ఆకళించుకుని, తన రచనలలో సమయానుకూలంగా, చమత్కారయుక్తంగా చొప్పించిన విదుషి.

స్త్రీలమేధ గురించి ఆమె రాసిన ఈ పద్యం చూడండి అమృతసారం లో.

చదివిన పండితులగుదురు,

విదితము గాకున్న యపుడు వెఱ్ఱులె పురుషుల్;

చదివిన జదువ యున్నన్,

ముదితలు విద్వాంసురాండ్రు పుట్టువుచేతన్.

స్త్రీమేధస్సుని ఆమె గౌరవించినా, “మహిళల నేటి విసృంఖలవృత్తిని” గూర్చి లక్ష్మీకాన్తమ్మగారు కనకాంబగారి పుస్తకంలోనుండి ఉదహరించిన పద్యం –

చదువ జదువ సంసారమా లేదు,

వంట లేదు, కడుపుపంట లేదు,

మంట మగని జూడ, మహిళాసభల నుంట

చదువునకు ఫలమగు శాంతి లేదు.

అయితే ఇది ఏ గ్రంథంలోనించి తీసుకున్నారో, సందర్బం ఏమిటో తెలియడంలేదు నాకు. అదే పుస్తకంలో “మంత్రి మగవారిని గురించి” ఇలా అన్నాడుట

చదివినాడు గాని, సంశయమా పోదు,

చదువ చదువ తెలివి సన్నగిల్లె

పిదప జూడ వీడు మొదటనే పోలుగా

గుణము కుదుర దేమి కొట్టుకొందు?

“ఈమె పుణ్యాన వీని నింతలో వదిలినది. చదువుకన్న మేలు చాకితనము అని పంచపాదింజేసి యీ యాటవెలదిచే నీ చతుష్పాత్తును నాడించి విడిచినది కాదు అని యొకరు చేసిన సమీక్ష బాగున్నది” అని పునః వ్యాఖ్యానించేరు లక్ష్మీకాన్తమ్మగారు.

కనకాంబగారు ఉపయోగించి ఉపమాద్యలంకారాలు కూడా అనిదంపూర్వములు (ఇంతకు పూర్వం చెప్పనివి), అన్యస్పృష్టములు (ఇతరులు స్పృశించనివి) అని, ఆమె ఉదహరించిన పద్యాల్లో ఇవి చూడండి.

గురుజనముల సేవింపక

పరమార్థముకొఱకు గ్రంథభాండాగారం

బరయుట వీణె, మృదంగము

గరమర్థించెడు గతి గద గానంబునకై.

ఆమె రచనల్లో కేవలం పాండిత్యమే కాక లోకరీతిని గమనించి, పఠితలదృష్టిని ఆకట్టుకోగల చాతుర్యం కనిపిస్తుంది. అలాగే కుహనాపండితులగురించి చెప్పినప్పుడు కూడా సమకాలీనసమాజంలో ప్రబలమవుతున్న కుహనాపాండిత్యరీతులమీద వ్యాఖ్య కనిపిస్తుంది.

హితపధమునఁ తా నడువక

హిత మితరుల కూఁది చెప్పనిల దుర్మతి, తా

మితిమీఱి, వారు తనయెడ

హితవృత్తిన్ మెలఁగ రంచు నెగిరి పడుఁగదా.

మరొక పద్యం –

నిజము చాటుచేసి నీచుఁడబద్ధముల్

పల్కుచుంట గొప్ప ప్రజ్ఞయంట

ఘనతకెక్కు వెనుకఁ దనదోషముల నెన్ను

కొనుట తలఁపఁ గీర్తికొఱకుఁ గాదొ

ఇలాటి పద్యాలు సర్వకాలీనం, సార్వజనీనం కదా.

సకలవేదాంతగ్రంథాల సారము ఈ చిన్నపుస్తకంలో సంగ్రహంగా సామాన్యులకి అర్థమయేలా ఆమె రచించినది అని చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారు ఆశయము (ముందుమాట)లో చెప్పేరు. ఇందులో అన్ని పద్యాలూ నాకు అర్థమయేయి అని చెప్పలేను కానీ నన్నుఆకర్షించిన ఒక పద్యం లెక్కల్లో సున్నా విలువ.

గణితసూత్రం లో సున్నవిలువ

ఎన్ని సున్నలైన నేలెక్కకునురావు

కొన్ని యెంకెలున్నఁ గొదువసుమ్ము

అంకె లాశ్రయించి యాదియందుంచిన

నొకటి కొకటి పూర్తినూతనిచ్చు

ఈత నేర్చుకోవాలంటే నీటిలోకి దిగాలి కానీ గట్టున కూర్చుని పాఠాలు చదివితే రాదు. అలాటి ఉపమానమే ఈ కిందిపద్యంలో కనకాంబగారు హృద్యంగమంగా చెప్పేరు.

తాటిచెట్టు కాల్వదాఁటుటకై వేయ

దానిమీద నడచు తరుణమందు

స్వాస్థ్యము నిలబెట్టు సహజంబుగాఁగాక

దానినెట్లు చెప్పఁ బూనునొరుఁడు

మరి కొన్ని ఉదాహరణ, ఎటు పడితే అటు మాటాడేవారిగురించి –

అనుబంధ చతుష్టయమున

కనుకూలము లేనియట్టి యాచారంబున్

గనుగొని లౌల్యం బనియెద

రనుకూలంబైన, ధర్మమనియెద రార్యుల్.

మరొక పద్యం –

ఇంటిమీద రాళ్ళవెన్నైనఁ బడనిమ్ము

సుప్తుఁడైన నరుఁడు సుఖమునుండు

మేలుకొన్న యప్పుడాలించు నల్లాడు

బొరుగువారిఁ బిలుచు బొబ్బలిడుచు.

కొండ ఎంత ఎత్తుగా లోయ అంత లోతుగా కనిపిస్తుందిట –

దండితనము వైరిదర్పంబు తెలుపును

గొండయెత్తులోయ కొలఁది తెలుపు

శాంతి కలిమిఁదెలుపు సంగరాహిత్యంబు

మంత్రమహిమఁ దెలుపు మౌనముద్ర

చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారు చెప్పినట్టు, ఇందులో వేదాంతం తెలుసుకోడం అంత సుళువు కాకపోవచ్చు కానీ చదవడానికి, అర్థమయినంతవరకూ ఆనందించడానికీ తగిన కావ్యమే అని చెప్పగలను.

చిన్న పుస్తకమే కనక ఎవరైనా పూనుకుని సూక్ష్మంగా కొంత వివరణలో మళ్ళీ ఈ పుస్తకం ప్రచురిస్తే బాగుంటుంది.

అలాగే శ్రీమతి కనకాంబగారు 1988 వరకూ జీవించి ఉన్నారు. అంటే, ఆమె కథలు కూడా ఎక్కడో అక్కడ దొరకడానికి అవకాశం ఉందనే అనుకుంటున్నాను.

శ్రీమతి కాంచనపల్లి కనకాంబగారి రచనలు –

 1. 1905లో సింహపురీనాధుడు రంగభర్తపై చెప్పిన రంగశతకము. కనకాంబగారి తొలి రచన.
 2. 1907- అమృతవల్లి నవల. పండిత నటేశన్ శాస్త్రిగారి తమిళ నవల దిక్కొట్రయరు కొళందైగళ్ కి అనువాదము.

 3. గౌతమబుద్ధచరిత్రము (గద్యకావ్యము)

 4. పాండవోదంతము (గద్యకావ్యము)

 5. 1915 – కాశీయాత్రాచరిత్రము

 6. 1919 – జీవయాత్ర (ఆధ్యాత్మిక కావ్యము)

 7. మహావిద్యానాటకమను నామాన్తరము గల హంసవిజయము (వైదాంతికనాటకము)

 8. 1927 – పద్యముక్తావళి

 9. 1928 – కాళిదాస కృతికి అనువాదముగ శాకున్తల నాటకము

 10. 1931 – రామాయణసథాసంగ్రహము (సంస్కృతగద్యము)

 11. 1935 – అంబాస్తవము

 12. శైలి (5000 పద్యములు గల కావ్యము)

 13. అమృతానందబోధసారము

 14. ఆనందసారము

 15. చక్కని కథలు

 16. తోమాలియ (ప్రాస్తావిక పద్యసంపుటి)

గమనిక: ఈవ్యాసంలో ప్రధానాంశాలు అన్నీ శ్రీమతి ఊటుకూరి లక్ష్మీకాన్తమ్మగారి ఆంధ్ర కవయిత్రులు గ్రంథంనుంచీ, అమృతసారము కావ్యములోంచి తీసుకున్నవే కనక ఇందులో నా ప్రజ్ఞ ఏమీ లేదు. ఇక్కడ సూత్రప్రాయంగా కనకాంబగారి ప్రతిభావిశేషాలు మరొకసారి ఈనాటి యువతకి పరిచయం చేయడమే నా ఉద్దేశం. ఆసక్తి గలవారు దయ చేసి ఊటుకూరి లక్ష్మీకాన్తమ్మగారి పుస్తకం, కనకాంబగారి పుస్తకాలు చదవవలసినదిగా మనవి.

Amrutha_Saramu – లింకు. DLI సైటు వారికి కృతజ్ఞతలు

(డిసెంబరు 19, 2013)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s