ఏనుగుల వీరాస్వామయ్యగారి కాశీచరిత్ర – ఒక చరిత్ర పాఠం.

యాత్రాకథనాలు, జీవితచరిత్రలు – వీటిమీద సరదా నాకు తక్కువే కానీ ఏనుగుల వీరాస్వామయ్యగారి కాశీ యాత్ర గ్రంథానికి సాహిత్యచరిత్రలో గల స్థానం కారణంగా  చదవదలుచుకున్నాను.

సూక్ష్మంగా శ్రీ ఏనుగుల వీరాస్వామయ్యగారి వివరాలు – వారిజననంగురించి నిర్ధారణగా తెలీదు కానీ 1780 అయిఉండవచ్చని వారిమిత్రులు కోమలేశ్వరపురం శ్రీనివాసపిళ్ళగారి అంచనా. జీవితకాలం 1836 అక్టోబరు 3 వరకూ.

వీరాస్వామయ్యగారు “1830లో మే 18వ తేదీన బయలుదేరి 15 మాసముల 15 రోజుల 30 నిముషాలు” సాగించిన కాశీయాత్రా విశేషాలు ఆయన మిత్రులు కోమలేశ్వరపురం శ్రీనివాస పిళ్ళగారికి రాసిన ఉత్తరాలే ఈ గ్రంథం. తొలిముద్రణ తేదీ దొరకలేదుట. రెండవ ముద్రణ కోమలేశ్వరపురం శ్రీనివాస పిళ్ళగారి ప్రోత్సాహంతో 1838లో వెలువడింది. ఈ ముద్రణకి పీఠిక రాస్తూ శ్రీనివాస పిళ్ళగారు ప్రస్తావించిన ఒక విషయం గమనార్హం. తమకోరికపైనే వీరాస్వామయ్యగారు ఉత్తరాలరూపంలో వారి ప్రయాణ అనుభవాలు ఎప్పటికప్పుడు వ్రాసి పంపేరుట. అవన్నీ ఒక చోట చేర్చి ప్రచురించాలన్న సంకల్పం మాత్రం మొదటిసారిగా కలిగింది తెలుగువారికి కాకపోవడం ఆశ్చర్యం! (పిడియఫ్ పుట 43). అడిగింది ఆయనే అయినా, తొలి ప్రచురణ కరకరంబాటి పోస్టాపీసులో గుమాస్తాగా పని చేస్తున్న పనయూరి వెంకు మొదలారి గారు తమిళంలోకి అనువదించి ప్రచురించేరని శ్రీనివాస పిళ్లగారు తమ పీఠికలో రాసేరు. ఏ సంవత్సరం అన్నది స్పష్టంగా లేదు కానీ ఈ పీఠిక తేదీకి ముందే అనుకోవాలి. వీరాస్వామయ్యగారు 1831లో సి.పి. బ్రౌన్‌కి తమపుస్తకాన్ని ప్రచురించమని కోరుతూ ఉత్తరం వ్రాసారు. లాభం వస్తే తాను తీసుకోనని, నష్టం వస్తే తానే భరిస్తాననీ కూడా చెప్పేరు (పు. 10). వీలు పడదని బ్రౌన్ జవాబిచ్చేరు. ఆ ఉత్తరంలో కూడా ఈ తమిళ గ్రంథం ప్రస్తావన లేదు. అంటే తమిళ గ్రంథం 1932-1938 మధ్యకాలంలో వచ్చిందనుకోవాలి. త్యాగరాజకృతులలాగే, ఈ కాశీయాత్ర గ్రంథంవిలువ మొదట గుర్తించినది తమిళులు! ఆ తరవాత “అనేక తెలుగు ప్రభువులు కోరడంచేత” శ్రీనివాస పిళ్ళగారు తెలుగులో ప్రచురించడానికి పూనుకున్నామని పీఠికలో రాసేరు. (పు.43).

ప్రస్తుతం మనకి అందుబాటులో ఉన్నది 1941లో శ్రీ దిగవల్లి వేంకట శివరావు గారి సంపాదకత్వంలో ప్రచురించిన మూడవ ప్రచురణ. “గ్రంథకర్తను గురించీ, ఆయనకాలంనాటి భారతదేశ రాజకీయ సాంఘిక పరిస్థితులను గురించీ, గ్రంథంలోని విషయాలకు సంబంధించిన తప్సీలు, వివరణలు, విశేషాలు, సమకాలీన వాఙ్మయంలోనుంచి సమకూర్చి సందర్బానుసారంగా ఇందులో చేర్చబడినవి” అని లోపలి ముఖపత్రంలో (half title page) రాసేరు వెంకట శివరావుగారు.

గ్రంథం ప్రారంభంలో ఆనాటి కుంఫినీ పాలన, వారిపాలనలో ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు, వీరాస్వామయ్యగారి మిత్రుల సాంఘికసేవ, హిందూ లిటరరీ సొసైటీ, వీరాస్వామిగారు బ్రౌను దొరగారికి రాసిన ఉత్తరంవంటి అమూల్యమైన విషయాలు అనేకం పొందు పరిచేరు. విషయసూచిక ప్రకరణలవారీగా విపులంగా ఉంది. నిజానికి విషయ సూచిక, దాని వెన్నంటి ఇచ్చిన “ప్రసంగతాత్పర్యములు” చాలు వీరాస్వామయ్యగారు ప్రస్తావించిన విశేషాలేమిటో స్థూలంగా తెలుసుకోడానికి అనిపించింది నాకు.  ప్రసంగతాత్పర్యములో సంపాదకులు వీరాస్వామయ్యగారిరచనలో అనేకవిషయాలను విపులంగా సమకూర్చి మనకి అందించేరు (పు. 47-51). ఈ విషయంలో సంపాదకులు తీసుకున్న అధికశ్రమ శ్లాఘనీయం. ఈనాటి సంపాదకులకి ఆదర్శం కాదగ్గది.

శ్రీనివాస పిళ్ళగారు రాసిన వీరాస్వామయ్యగారి జీవిత చరిత్ర (53-61), మళ్ళీ మూలపాఠం ముగిసినతరవాత చివర ఇచ్చిన అనుబంధములో విషయసూచిక, సౌరమాన చాంద్రమాన మాసములు అధిక క్షయమాసములు, సవరణల పట్టిక (తప్పొప్పుల పట్టిక), చెన్నపట్టణం ప్రాచ్యలిఖిత భాండాగారంలో ఉన్న వ్రాతప్రతిలోనించి తీసుకున్న  కొన్ని మచ్చు పుటలు, కొన్ని పదములకు అర్థములు, అకారాది విషయసూచిక, ప్రచురణకర్తల వ్యాపారప్రకటనలు అన్నీ కలిపి 80 పుటలకి పైనే ఉన్నాయి. ఇలా లెక్కలు వేసి చూసుకుంటే, మూలగ్రంథం 347 పుటలు (పు. 63-410 పిడియఫ్‌లో). శ్రీ వెంకట శివరావుగారు ఈ మూడవ ప్రచురణని సిద్ధాంతగ్రంథం అనలేదు కానీ ఈనాడు వస్తున్న కొన్ని సిద్దాంతగ్రంథాలతో పోలిస్తే, ఒక మెట్టు పైనే ఉందనాలి.

ఈ గ్రంథంలో కేవలం ఊరు తరవాత ఊరు చెప్పుకుంటూ పోవడం కాక, ఆనాటి సామాజిక, భౌగోళిక, రాజకీయ, చారిత్రక అంశాలనెన్నిటిలో ఎంతో విపులంగా చర్చించేరు రచయిత. నాకు మొదటి 90 పేజీలు సామాన్యంగా అనిపించేయి కానీ, కడప దాటినతరవాతినించీ కథనం ఆసక్తికరంగా సాగిపోయింది. ఆనాటి నాణేలు, వంట దినుసులవంటి సామాన్య విషయాలతోపాటు ఆచారవ్యవహారాలూ, శీతోష్ణ స్థితిగతులు, ఆ శీతగాలులూ, ఊష్ణోగ్రతలమూలంగా ప్రజలలో వ్యక్తమయే భిన్న ప్రకృతులూ – ఒకటేమిటి ఆయన స్పృశించని అంశం లేదేమో అనిపించింది.

చెన్నపట్టణము రూపాయి వేరు, హైదరాబాదు రూపాయి వేరు, నాగపూరు రూపాయి వేరు. నాగపూర్‌దగ్గరకి వచ్చేసరికి మారకంలో రూపాయి తరుగు కూడానుట. అలాగే చెన్నపట్టణంలో ఉన్న దుడ్డు, గవ్వలు ఉత్తరదేశంలో లేవు. గోవులు సొమ్ములుగా చెలామణి కావడం విన్నాను కానీ సముద్రపొడ్డున తేరగా దొరికే గవ్వలకి ఆర్థికవిలువ ఉందని నాకు ఇప్పుడే తెలిసింది (కొండ్రెడ్డి భాస్కర్, సుధారాణి చెప్పేక :)). అలాగే ఆలయాలకీ నదులకీ సంబంధించిన స్థానిక పురాణగాథలూ, ఆయా ప్రాంతాల్లో జనుల ఆచారావ్యవహారాలు ఎలా  పాదుకొన్నాయో వంటి ఎన్నో విషయాలు తమబుద్ధికి తోచిన తాత్వికచింతనతో విచారించి అనేక వాదనలు ప్రస్తావించి తమదైన నిర్ధారణకి రావడం విజ్ఞానదాయకంగా ఉంది. వీటిలో కొన్ని వాదనలు మనకి ఈనాడు అంగీకారం కాకపోవచ్చు కానీ ఇవి చర్చించడంలో వారు ప్రదర్శించిన నిష్ఠ గణనీయం.

యాత్రకి కావలసిన సామగ్రి, తోడుగా వెంట తీసుకువెళ్ళిన సిబ్బంది, దారిలో అవసరమైన సామగ్రి మోయడానికి సవారీలు సమకూర్చుకుని మొదలు పెట్టిన ఈయాత్ర తాము చూసిన ఒకొక ఊరు వర్ణించుకుంటూ పోవడంతో సాగుతుంది. కాశీయాత్ర గ్రంథంలో అధికంగా ఉన్నవేమిటి అంటే మొదట చెప్పుకోవలసింది ఇప్పుడున్న ప్రయాణసౌకర్యాలు ఆ కాలంలో లేవు కనక అంత దూరం ఆయన ప్రయాణం ఎలా సాగించేరన్నది. ఆరోజుల్లో కంపెనీవారు తయారు చేసిన మజిలీ పట్టీలు కూడా ఉపయోగపడలేదుట – కొన్ని గ్రామాలపేర్లు లేవు, ఉన్నాయన్న గ్రామాలు లేవు, గ్రామాలమధ్య దూరం కూడా సరిగా లేదు అని రాసేరు. వీరాస్వామయ్యగారు కాలినడకన రోజుకి ఎన్నిగంటలలో ఎన్ని క్రోసులు నడిచేరు, బాట ఎలా ఉంది, నదులు దాటవలసివస్తే పడవలయితే ఎంత కూలి ఇచ్చేరు, పడవల్లోని చోట మొలబంటినీటిలో నడిచి వెళ్ళవలసిరావడం – ఇవి చదువుతుంటే అయ్యబాబోయ్ నిజంగానే? అని ఆశ్చర్యం కలగక మానదు. ఒకటి రెండు సార్లు దూరం మూడు ఘడియలు, ఆరు ఘడియలు అంటూ కాలమానంలో వివరించేరు. తాము ఆగిన ప్రతి ఊరులోనూ ఎన్ని బ్రాహ్మణగడపలున్నాయి, మొత్తం ఊరి జనాభా ఎంత, అక్కడ దొరికే వంట దినుసులు ఏమిటి వంటివి వివరంగా రాసేరు. వంటదినుసులమాటకొస్తే, పదే పదే కనిపించినవి బియ్యం, చింతపండు, మిరియాలు, తమలపాకులు. బెంగాలులో బ్రాహ్మణులు చేపలు తినడంగురించి ఆయన ప్రశ్నిస్తే మీరు తాంబూలంలో గుల్లసున్నం వాడుతున్నారు కదా అని ఎదురు ప్రశ్న వేసేరుట వారు. వారు అడిగేవరకూ తమకు తోచనేలేదని వీరాస్వామయ్యగారు రాసేరు. ఇక్కడ చదివేవరకూ నాకు గుల్లసున్నం చేపలఎముకలనించి తయారు చేస్తారని నాకు తెలీదు. ఆంధ్రబారతిలో గుల్లసున్నం పదానికి అర్థం నత్తగుల్లలు కాల్చి చేసినది అని ఉంది :). అలాగే డబ్బువిషయంలో తేడాలు కూడా రాసేరు -చెన్నపట్టణం రూపాయి వేరు, హైదరాబాదు రూపాయి వేరు. చెన్నపట్టణంలో వాడుకలో ఉన్న దుడ్డు, గవ్వలు లాటి ద్రవ్యం హైదరాబాదులో లేదు. చెన్నపట్టణంరూపాయలు హైదరాబాదురూపాయలకి మార్చుకున్నప్పుడు లేదు కానీ నాగపూర్లో రూపాయలలోకి మార్చుకున్నప్పుడు కొంత తరుగు పోయిందిట.

నాకు ఆసక్తి రేకెత్తించే విషయాలు ఈ పుస్తకంలో చాలానే కనిపించేయి. వీరాస్వామయ్యగారు అనేకవిషయాల్లో తమకి తాము ఆలోచించుకుని ఏర్పరుచుకున్న అభిప్రాయాలు ఉన్నాయి. పర్వతాలఉపయోగం ఏమిటి అంటే భూగోళము ఉదకబుద్బుదము కనక భూమిని స్థిరంగా ఉంచడానికి అవుసరం అంటారు (పు.89). భోజనసమయంలో బ్రాహ్మణులు చేసే పరిషేచనమువెనక వివేచన ఏమటి, ఎలా వచ్చింది అని చర్చించి నానావిధములైన ఆచారములను ఆయా దేశములకు అనుగుణముగా స్మృతులు ఏర్పరచినాయని తీర్మానించేరు(పు. 126). కొందరు నదీస్నానాలకి మడి బట్ట చేత్తో పట్టుకుని వెళ్తే, మరికొందరు కర్రతో పట్టుకుని వెళ్తారు. దక్షిణదేశంలో సంచీలో పెట్టుకుని  వెళ్తారు. ఇవన్నీ చూస్తే, “ఆచారములన్నీ మనోబంధకములే కానీ వేరే కావని తోచుచూ వచ్చుచున్నది” (పు. 180) అన్నారు ఆఖరికి.

ఉష్ణదేశాల్లో తేలికగా జఠరాగ్ని మందగతిని పొందుటచేత, తేలిగా జీర్ణమయే పదార్థాలు తింటారు. ఆ పదార్థాలు హృత్కమలమునకు పుష్టినివ్వదు కనక వారికి మనోదారుఢ్యము సమకూడదు. శీతలదేశాల్లో భోజనరీతులు, తత్ఫలితాలు పూర్తిగా వ్యతిరేకంట. (పు. 161).

స్త్రీలు మోక్షార్హలు కారు సరికదా నిత్యజీవితంలో సత్కర్మలు ఆచరించడానికి కూడా అర్హులు కారనే నిర్ణయానికి వచ్చేరు ఆయన ప్రయాగలో ఇతర పండితులతో కూడా చర్చించి. హృత్కమలంలో ఊర్థ్వ, అధోగ్రంథులు రెండు ఉంటాయనీ, పురుషులకు ఊర్థ్వగ్రంథులు వికసించుటచేత మేధ వికసిస్తుందనీ, స్త్రీలకు గర్భధారణాది క్రియలకు అనుగుణంగా అథోగ్రంథులు వికసిస్తాయనీ, అంచేత వారు పతిశుశ్రూష, కుటుంబ సంరక్షణ మొదలయిన ఐహికపనులయెడలనే ప్రవష్టలుగా నుండుట యుక్తమనీ తోచుచున్నది అంటారు. (పు. 210-212).

సూక్ష్మంగా ఒక్క మాటలో నాకు అర్థమయింది – స్త్రీలకి సంతానానికి ఉపయోగపడే అంగాలు మాత్రమే వికసిస్తాయి, పురుషులకి మేధ వికసిస్తుంది. నాకు జీవశాస్త్రం తెలీదు. తెలిసినవారెవరైనా చెప్పాలి ఈ వాదంలో సూక్ష్మవిషయాలు. నాకు కలుగుతున్న మరొక ఆలోచన ఏమిటంటే, వీరాస్వామయ్యగారి తరవాతితరంలో వచ్చిన వీరేశలింగంగారి విశ్వాసం కూడా అదే ధోరణిలో సాగింది. నిజానికి వీరేశలింగంగారు మరో మెట్టు పైకి సాగి, స్త్రీలకి స్వతస్సిద్ధంగా ఆ సేవ చేయడం కూడా రాదు అని స్త్రీవిద్య ఉద్యమానికి నాంది పలికేరు. ఇది శాఖాచంక్రమణమే కానీ సమాజంలో స్త్రీలస్థానం ఎవరు ఎలా నిర్ణయిస్తున్నారు అన్న విషయం పరిశీలనకి వస్తే ఈ ఆలోచనావిధానాలు గమనించాలి అని చెప్పడానికి ఇక్కడ ఈ ప్రస్తావన చేసేను.

వీరాస్వామయ్యగారు విస్తృతంగా చర్చించిన అంశం తాత్వికం. ఆత్మ, పరమాత్మ, అంతరాత్మ – వీటిమద్య పరస్పరసంబంధం. ఇంకా , అద్వైత, విశిష్టాద్వైత సిద్ధాంతాలు, పంచద్రావిడులు, పంచగౌడులు, ఇలా అనేకానేక విషయాలు నాకు సంపూర్ణంగా అవగాహన కానివి ఉన్నాయి. అలాగే స్త్రీలలో కామేచ్ఛమీద వాతావరణప్రభావం, దాన్ననుసరించి పురుషుల మనోప్రవృత్తులవంటి విషయాలలో వీరాస్వామయ్యగారు ప్రతిపాదించిన అంశాలు గమనార్హం. సృష్టి, స్త్రీ పురుష అంగనిర్మాణం, ఆత్మ, పరమాత్మ, అంతరాత్మ చర్చలు, మానవశరీరం, జంతు శరీరం నిర్మాణం- అంతరార్థాలు (పు. 301-312) అర్థం చేసుకోడానికి కొంత కాలం వెచ్చించాలి.

ఈనాడు ఆత్మహత్య మహాపాపంగా పరిగణించినా, శాస్త్రాలలోనూ, పురాణగాథలలోనూ మహాత్ములు అనేకులు తమ తపశ్శక్తిద్వారానూ దృఢచిత్తంద్వారానూ ఇచ్ఛాపూర్వకంగా తమకి తాము నిర్ణయించుకున్నసమయంలో పరలోకగతులు కావడంగురించి చదువుకున్నాం. ప్రయాగలో స్వేచ్ఛామరణము అన్న ఆచారము ఉందిట. ఈ కథనంప్రకారం మరుజన్మలో తాము కోరినజీవనం కలగగలదనే విశ్వాసం గలవారెవరైనా ఈవిధంగా జీవితం అంతం చేసుకోవచ్చున్నన్నట్టుగా ఉంది(పు. 196). “ఆత్మహత్య చేసుకుంటే చేసుకున్నావు; ఈశ్వరార్పితమని శ్రద్దతో ఫలాని తావుకు పోయి విధిపూర్వకముగా చేయుము అనేట్టుగా యిక్కడ నియమించినారని నాకు తోచుచున్నది” అన్నారు వీరాస్వామయ్యగారు (పు. 200).

ఆర్యావర్తభూములలో పుణ్యభూమి అయిన మనదేశంలో మహమ్మదీయుల పాలన, ఆంగ్లేయులపాలనవంటి పాలనలు ఎందుకు వచ్చేయంటే వీరాస్వామయ్యగారు హిందువులలో మతము పునః ప్రతిష్ఠ చేయడానికే అంటారు. (339-340).

ఈ పుస్తకంలో భాష గ్రాంథికమే అయినా, ఈనాడు వాడుకలో లేని పదాలు చాలానే ఉన్నా, చదవడం కష్టమనిపించలేదు నాకు. నేను కేవలం నాసరదాకొద్దీ కొన్నిపదాలకి ఆంధ్రభారతి చూసేను కానీ చాలావరకూ సందర్భాన్నిబట్టి అర్థం చేసుకోడానికి వీలుగానే ఉన్నాయి. పుస్తకం చివరలో కొన్ని పదాలకి అర్థాలు ఇచ్చేరు. ఆ పట్టిక చూస్తే ఆ పదాలు 1940లనాటికే అంటే ఒక దశాబ్దంలోనే వాడుకలోనుండి తప్పిపోవడం ఆశ్చర్యం అనిపించింది. నాకు నచ్చిన పదాలు కొన్ని – ఉపపన్నులు (ధనవంతులు), ఒక పొట్లముగా (సమూహముగా?) మిత్రభావము కలిగి, శేఖరం చేసేకొరకు (సిద్ధం చేయడానికి), శృంగారకట్ట (చీపురుకట్ట), ఆసోదా (విశ్రాంతి, మజిలీ), సోబతు (తోడు, సహవాసము). కొన్ని పదాలకి అర్థాలు ఆంధ్రభారతిలో కూడా దొరకలేదు.

కొన్ని పదాలకి ఆనాటి గుణింతాలు కూడా వింతగానే అనిపిస్తాయి ఇప్పుడు మనకి,  బ్రాంహ్మణులు లాటివి (అధికంగా సున్నతో). చాలా సరదాగా అనిపించిన నుడికట్టు “తెలుగు మీఱు” తెలివి మీఱు అన్న అర్థంలో! “తోచబడుచున్నది” తమకి తోచుచున్నది అన్న అర్థంలో (301). తెలుగులో బడు ప్రత్యయమే తక్కువ. తోచబడు అన్న పదానికి అర్థం ఉందా? ఆంధ్రభారతిలో నాకు దొరకలేదు. అలాటిదే మరొక నుడికట్టు – భంగము కాకూడకుండా (310). గయలో లిపులు కూడా చాలా రకాలున్నాయిట – ఫార్షీ, సాహుకార్ల లిపి, బ్రాహ్మణి, గ్రంథాలు వ్రాసే లిపి, మార్వాడీలు వాడే మోడి,  మారువాడిలిపి ఇలా (పు. 295).

ఈ పుస్తకంలో గుణింతాలగురించి ఒకమాట చెప్పాలి. ఇవి అచ్చుతప్పులు కావు కానీ మనకి అలవాటయిన అక్షరాలు కావని మాత్రమే చెప్తున్నాను. ముఖ్యంగా అంకెలు ఆరు, న పొల్లు, ర కింద మరొక హల్లు – ఇవి తికమకగా అనిపిస్తాయి. ఈ అక్షరాలు కీబోర్డులో లేవు కనక బొమ్మలుగా చూపుతున్నాను.

అంకెలలో తొమ్మిది

9

ర కింద తావత్తు Krishnamuthini  కృష్ణమూర్తి

మీ తరవాత న పొల్లు, ర కింద  ల వత్తు jamindarlaజమీందార్ల

2 తరవాత ఉన్నది 4 అంకె కాదు. “రెండవ” లో “వ” లాగnth timeరెండవ గంటకు

సామెతలు అట్టే లేవు కానీ ఉన్నవి రమ్యముగా ఉన్నాయి – కలిమెడు చల్లితే తూమెడు పండే పాటి చవుడు కలిగిన భూమి(పు. 174). ఎనిమిదిమంది చేరితే తొమ్మిది పొయిలు (204).

మరొకసారి మనవి చేసుకుంటున్నాను. పైన నేను వెలిబుచ్చిన అభిప్రాయాలు నాకు తోచినవి మాత్రమే. నా అవగాహనలో లోపాలు ఉండవచ్చు, ముఖ్యంగా వేదంతచర్చలు, మతసంబంధమైన వివరాలలోను. దయచేసి మీరు పుస్తకం చదివి, నేను పొరబడితే, చెప్పండి.

వీరాస్వామిగారి జీవితచరిత్ర, తదితర వివరాలు తెలుగు వికిపీడియాలో ఈ లింకు చూడండి  http://te.wikipedia.org/wiki/%E0%B0%8F%E0%B0%A8%E0%B1%81%E0%B0%97%E0%B1%81%E0%B0%B2_%E0%B0%B5%E0%B1%80%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%AE%E0%B0%AF%E0%B1%8D%E0%B0%AF

 

 

 

(జనవరి 28, 2014)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

4 thoughts on “ఏనుగుల వీరాస్వామయ్యగారి కాశీచరిత్ర – ఒక చరిత్ర పాఠం.”

  1. హరి యస్. బాబు, అతి తెలివి, తాను ఎదటివారికంటే తెలివైన వాడు అనుకుని, ప్రదర్శించినప్పుడు తెలివి మీరడం అంటారు. మీరెప్పుడూ వినలేదా ఈ పదం?

    మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s