ఏనుగుల వీరాస్వామి గారి కాశీయాత్ర – విన్నపము

ఈ పుస్తకంగురించి నేను రాసినతరవాత, ఫేస్పుక్కులో కూడా ప్రచురించినతరవాత, వచ్చిన ప్రధానస్పందన – డౌన్లోడ్ సరిగా రావడంలేదు, చదవడం కష్టంగా ఉంది అని. ­­­­­­­

డియల్ఐ సైటువారు పుస్తకాలు డిజిటల్ చేసి పాఠకులకి ఉచితంగా అద్వితీయమైన సేవ చేస్తున్నారు. అందుకు అభినందనీయులే. అయితే ఆ సైటులో పుస్తకం వెతికి పట్టుకోడం, దాన్ని డౌన్లోడ్ చేసుకోడం కూడా అంతకంత కష్టమూను. ఇది చాలనట్టు, డిడిటలైజ్ చేసినవి యంబిపి ఫైలులు. ఇవి జెపిజి ఫైలుకన్నా చాలా ఎక్కువ పెద్దవవుతాయి. రెండోది ఆ పైలు జీరాక్స్ సరిగా చెయ్యకపోవడం, పేజీలు వెనకా ముందూ అవడం, కొన్ని పేజీలు మాయమవడం – ఇలా అనేక ఈతిబాధలు. వీటన్నిటినించి పుస్తకం లభ్యం అన్నవిషయం విలువ సగానికి తగ్గిపోతోంది.

అసలు విషయానికొస్తే, వీరాస్వామిగారి పుస్తకం ఆంగ్లేయులు మనదేశంలో కాలూని, పాదుకుని తమ స్థానం బలపరుచుకుంటున్న సమయం. వారి మతగురువులు మనవారిని అనేక కష్టాలకి గురి చేస్తున్న సమయం. ఆరోజుల్లో వీరాస్వామిగారి ఆంగ్లేయుల సాయం పొందడం విశేషం.

వీరాస్వామయ్యగారు ఆనాడు ప్రాచుర్యంలో ఉన్న అద్వైతం, విశిష్టాద్తైతం, బుద్ధులు, జైనుల ప్రభావం, సమాజంలో స్త్రీస్థానం, ఆవిషయంలో వారు సూక్ష్మంగా పరిశీలించి ఏర్పురుచుకున్న అభిప్రాయాలు, ఈ మతాలతోపాటు ఆంగ్లేయుల అభిప్రాయాలని సమన్వయపరుచుకోడం – ఇవన్నీ  ఎంతో ఆసక్తికరలంగా ఉన్నాయి. అలాగే ఆచారవ్యవహారాలు ఎలా వచ్చేయి అన్న విషయంలో ఆయన ఒకొకటి – మడి, పరిషేచనం – తీసుకుని వారు ఎలాటి నిశ్చయాలకి వచ్చేరో చూస్తే మనం ఒకొక విషయం ఎలా గమనించాలో తెలుస్తుంది. ఇటీవల నేను  ఒకటో రెండో నాస్తికవాద పత్రికలు చూడడం సంభవించింది. వాటిలో నమ్మకాలని అసంభవం అని ఎత్తి చూపడమే జరిగింది కానీ ఆ నమ్మకాలు ఎలా వచ్చేయో, వాటివెనక ఎటువంటి భావాలు ఎంత బలంగా నాటుకుని ఉన్నాయో, వాటిని మూఢనమ్మకాలుగా ఋజువు చెయ్యాలంటే ఎటువంటి వాదనలు అవుసరమో గమనించినట్టు కనిపించలేదు నాకు. అందుకు భిన్నంగా వీరాస్వామయ్యగారు ఒక పద్ధతిప్రకారం తమ అభిప్రాయాలను ఆవిష్కరించేరు. బహుశా ఈ కారణంగానేమో నాకు

ఈ పుస్తకం చదవడం నాకు కష్టం అనిపించలేదు. కాని కష్టంగా ఉంది అన్నవారి కోణం నాకు బాగానే అర్థం అవుతుంది.

ఆనాటి రాజకీయ, చారిత్రక వివరాలు ఎన్నో గ్రంథసంపాదకులు వెంకట శివరావుగారు చేర్చేరు. ఈ కారణాలవల్ల అంటున్నాను ఈ పుస్తకం తిరిగి ప్రచురించవలసిన అవుసరం ఉంది. ఇది తేలిక కాదు నిజమే. ఇప్పుడు వాడుకలోలేని అక్షరాలు మార్చాలి. పునశ్చరణ అయిన పేజీలు తొలగించాలి. చివరలో ఇచ్చిన కొన్ని మాటలకి అర్థాలు ఇప్పుడు అసందర్భం. అది పూర్తిగా తిరిగి రాయవలసి ఉంటుంది. ఇది శ్రమతో కూడిన పనే. కానీ చెయ్యవలసిన అవుసరం మాత్రం తప్పకుండా ఉందని గట్టిగా చెప్పగలను.

నేను ఈ మెయిలు రాస్తుండగానే శ్రీ జోగారావు వెంకట రామ సంభార (చివరిపదం సరి కాకపోతే సరైన పదం చెప్పమని అర్థిస్తున్నాను) గారు ఇది కూర్చడానికి తమ సమ్మతి తెలియజేశారు.

అందుచేత, సాహితీమిత్రులకి మరొకసారి విన్నవించుకుంటున్నాను ఈ పునర్మద్రణ చేపట్టమని.

జి.యస్. లక్ష్మిగారి వ్యాఖ్య చూసినతరవాత నాకు కలిగిన ఆలోచన. కాశీయాత్ర పుస్తకంలో గ్రంథకర్త ఎన్నో సూక్ష్మవిషయాలను శ్రమ తీసుకుని పొందు పరిచేరు. దిగవల్లి వెంకట శివరావుగారు మూడవ ముద్రణలో అనేక విషయాలు అనుబంధంగా చేర్చేరు. ఒక విశ్వవిద్యాలయంవారు చెయ్యవలసింది ఆ పుస్తకాన్ని మరింత విస్తరించి, ఈనాటి పాఠకుల పఠనాసక్తిని పెంచేలా అర్థవివరణలు ఇచ్చి ప్రచురించడం. అందులోను ఒక విశ్వవిద్యాలయం వారు ఆపని చేయడం కూడా శోచనీయం. గత కాలపు సాహిత్యాన్ని పరిరక్షించి మరింత ప్రాచుర్యంలోకి తేవలసిన విశ్వవిద్యాలయాలు ఇటువంటి made easy ప్రతులు తయారు చేసి పంచి పెట్టడం విచారకరం.

 • నిడదవోలు మాలతి

ఫిబ్రవరి 1, 2014.

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

4 thoughts on “ఏనుగుల వీరాస్వామి గారి కాశీయాత్ర – విన్నపము”

 1. లక్ష్మిగారూ, మీకు కష్టం కాలేదంటే సంతోషంగా ఉంది. తప్పకుండా చదవండి. సంక్షిప్తం అంటే ఏ భాగాలు వదిలేసేరో తెలీదు కదా. మూలరచయితమాటలు మారిపోతాయి కూడా కదా. నిజానికి మొదటిభాగం కంటే రెండు, మూడు భాగాల్లోనే వీరాస్వామయ్యగారి భావాలు మరింత విపులంగా చర్చించడం జరిగింది. నాదగ్గరున్నకాపీ మీకు ఇమెయిలు చేస్తాను. ఆ సైటునిండి దింపుకోడం అంత తేలిక కాదు.

  మెచ్చుకోండి

 2. మాలతిగారూ,
  నాకు కూడా చదవడం అంత కష్టమనిపించలేదండీ. అసలు మొత్తం పుస్తకం దొరికితే బాగుండుననిపించింది. మీ లింక్ చూసాక ప్రయత్నించాలనుకున్నాను. ఇంకా చెయ్యలేదు. చెయ్యాలి. యెలాగోలా ఆ పుస్తకం చదవాలనే నా కోరిక.

  మెచ్చుకోండి

 3. జి.యస్. లక్ష్మిగారూ, చాలా సంతోషం ఈ విషయం తెలియచేసినందుకు. ఎంచేతో మరి నాకు కష్టమనిపించలేదు కానీ చాలామంది అదే మాట అంటున్నారు. బహుశా చదివేపద్ధతిలో వచ్చినమార్పులకి ఇదొక ఉదాహరణ అనుకోవాలేమో.

  మెచ్చుకోండి

 4. మాలతిగారికి, నమస్కారములు.
  ఏనుగుల వీరాస్వామయ్యగారి “కాశీయాత్ర చరిత్ర” మూడు ముద్రణల తరువాత, “జనహిత” సంస్థ వారి ప్రచురణ పథకానికి అనుబంధంగా తెలుగు విశ్వవిద్యాలయం ఈ గ్రంథాన్ని సంక్షిప్తీకరించి 1992లో వెలువరించారు. జనహిత సంస్థ నిర్దేశించుకున్న పరిధులకు అనుగుణంగా ఈ బృహత్‍గ్రంథాన్ని శ్రీ ముక్తేవి లక్ష్మణరావుగారు సంక్షిప్తీకరించారు. చెన్నపట్నం నుంచి నాగపూర్ చేరేవరకు శ్రీ వీరాస్వామయ్యగారి యాత్రావిశేషాలు ఈ గ్రంథంలో మొదటిభాగంలో యథాతధంగా వున్నాయి. రెండు, మూడవభాగాలలో యాత్రను సంక్షిప్తీకరించి చెప్పినట్లు ఈ పుస్తక సంపాదకులు శ్రీ ముక్తేవి లక్ష్మణరావుగారు తెలిపారు.
  ఈ పుస్తకానికి అప్పుడు తెలుగు విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షులుగా నున్న ఆచార్య సి. నారాయణరెడ్డిగారు భూమిక వ్రాసారు.
  పూర్తిగ్రంథం దొరకకపోయినా కొంచెమైనా ఈ పుస్తకంయొక్క విశేషత తెలియాలంటే ఈ సంక్షిప్తీకరించిన పుస్తకం చదువుకోవచ్చు. నేను కూడా పూర్తిగ్రంథం చదవలేకపోయాను. శ్రీ ముక్తేవి లక్ష్మణరావుగారు సంపాదకీయం వహించిన ఈ చిన్నపుస్తకమే చదవగలిగాను.
  ఈ పుస్తకం కావాలంటే తెలుగు యూనివర్సిటీ గ్రంథాలయంలో దొరకవచ్చును.
  జి.ఎస్.లక్ష్మి..

  మెచ్చుకోండి

నాటపా మీకు నచ్చిందో లేదో చెప్తే చాలు. బాగులేకపోతే ఎందుకు లేదో చెప్పినా సంతోషమే.

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s