స్థానాపతి రుక్మిణమ్మగారి దయ్యం కథలు

రాక్షసులు, దయ్యాలు, మాయలమరాఠీకథలు, ఏడు మల్లెపూలఎత్తు రాజకుమారి కథలు మనమందరం మాటలు రాకముందునించి విన్నవాళ్ళమే. పెరిగి పెద్దయేక మనంతట మనం చదువుకోడం వచ్చేక కూడా ఈ అభూతకల్పనలతో కూడిన కథలు చదివి ఆనందించేవాళ్లు చాలామందే ఉన్నారు. సైన్స్ ఫిక్షన్ కథలు అలాటివే. వాటిలో అవాస్తవం ఉన్నా చదువుతారు. బహుశా సైన్సు అనగానే, ఇవాళ కాకపోతే ఇలా జరగడానికి అవకాశం ఉంటుందన్న నమ్మకం ఉంటుందేమో. దయ్యాలకథలలో అపనమ్మకం వాటిని తక్కువగా చూసేలా చేస్తుందేమో నాకు తెలీదు. కానీ ఈ దయ్యాలకథలు చదువుతుంటే విసుగనిపించకుండా, ఇంకా చదవాలనిపించే గుణం ఉంది కనక నాకు నచ్చేయి. కథకి ప్రధానంగా మొట్టమొదట కావలిసింది అదే – అప్పుడేమయింది, ఆ తరవాతేమయిందంటూ మనని ఆరాటపడేలా చెయ్యడం.

Sthanapati Rukminammaరెండు రోజులక్రితం అనుకోకుండా నాకు దయ్యాల కథలపుస్తకం దొరికింది. పుస్తకం పేరు దయ్యాలు. రచయిత్రిపేరు స్థానాపతి రుక్మిణమ్మగారు. ఆమె జననం 1915లో. ఈ కథలపుస్తకం 1937లో ప్రచురించారు. ఈ పుస్తకం ప్రచురించేనాటికి ఆమె వయసు 22. పుస్తకంగా రాకముందే ఈ కథలన్నీ విశాఖపత్రిక, సత్యవాణి, ఆంధ్రవిద్యార్థి వంటి పత్రికలలో ప్రచురించబడ్డాయి.

రుక్మిణమ్మగారు ఈకథలన్నీ తాను తన పతినుండీ వారిమిత్రులనుండీ విన్నవిట. ఘనాపాఠి కథతో వినోదార్థం రాయడం మొదలుపెట్టి క్రమంగా ఒకొకటే రాస్తూ వచ్చి, అన్నిటిని ఒక్కదగ్గర చేర్చడమే ఈ పుస్తకం ఉద్దేశం అని సవినయంగా చెప్పుకున్నారు తమ “విన్నపం”లో. కథలన్నీ విద్యాధికులనుండి గ్రహించినవే అని కూడా స్పష్టం చేసేరు.  ప్రతిబింబాలు కథ సుప్రసిద్ధాధునిక జాతీయకవులు బ్రహ్మశ్రీ మంగిపూడి వెంకటశర్మగారు చెప్పినది.” కవి అన్న కథ శ్లోకరూపంలో ప్రచారం ఉన్నదే తీసుకుని కథగా మలిచేరుట. కథల్లో పాత్రలపేర్లు, స్థలాలపేర్లు కొన్ని కల్పితాలు, కొన్ని యథార్థాలూ అన్నారు.

రుక్మిణమ్మగారికథల్లో ఈనాడు మనం చెప్పుకునే శైలి, శిల్పం కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నాయి. కథ ఆద్యంతం చకచక సాగిపోతుంది. ముఖ్యంగా కొన్ని కథల్లో ఆమె ఎత్తుగడలు ఈనాడు చేయి తిరిగినరచయితలస్థాయిలో ఉన్నాయి. ఉదాహరణకి ఆమె శైలి చూడండి

ghanapati page

ఇలా సరళమైన జానుతెలుగులో చిన్న చిన్న వాక్యాలలో, కదాచితుగా చమత్కారం చొప్పించి , మనని అలరించే ఈకథలు 1920-30 దశకాలలో రాసేరంటే ఆశ్చర్యం కలగకమానదు. ఆవిడే చెప్పుకున్నట్టు వినోదాత్మకంగానే అనిపిస్తాయి కానీ దయ్యాలున్నాయా లేదా, ఇది వాస్తవమవునా కాదా, ఈమె దయ్యాలున్నాయని నిరూపించబోతున్నారా అన్న ప్రశ్నలు తోచవు.

ఘనాపాఠి, కవి కథల్లో ప్రధానంశం పండితులు విద్యాదానం చేయనందున కలిగే దుష్ఫలితాలు. నాకు ఈ కథలు ప్రత్యేకంగా నచ్చేయి. మనకి అనాదిగా విద్యాదానం ఒక ప్రాథమికవిలువ. తమకి గల విజ్ఞానాన్ని ఇతరులకి పంచిపెట్టమని మన శాస్త్రాలు చెప్తున్నాయి. నిజానికి ఏ కథ అయినా చేసేది, చెయ్యవలసినది అదే కదా. వాస్తవంలో ఇది జరగగలదా అని కాక, ఈకథద్వారా రచయిత ఇస్తున్న లేదా ఇవ్వదలుచుకున్న సందేశం ఏమిటి అని. ఇలా ప్రశ్నించుకుంటే మనకి ఈకథలు అర్థవంతంగా స్ఫురిస్తాయి.

శైలిపరంగా చెప్పుకోవలసిన మరొక అంశం సంభాషణలద్వారా కథ నడిపించడం. రాజమ్మ కథ సంభాషణలరూపంలో మొదలుపెట్టి మూడొంతులు కథ నడిచినతరవాత కానీ కథకుడు ప్రవేశించడు. అంచేత అక్కడికి వచ్చేవరకూ పాఠకుడు పాత్రలని సంభాషణలద్వారా తానే మనోఫలకంమీద చిత్రించుకోవాలి. తరవాతి దశకంలో శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారి విమానం ఎక్కబోతూనూ కథలో కూడా చూస్తాం ఇలా పాత్రలమాటలద్వారానే పాత్రచిత్రణ సాగడం.

రెండు రోజులక్రితం కుటుంబరావుగారి దయ్యాలకథగురించి చర్చ పేస్బుక్కులో చూసేను. కుటుంబరావుగారు దయ్యాలకథలు రాసేనాటికి ఆయనవయసు కూడా సుమారుగా రుక్మిణమ్మగారు ఈకథలు రాసేనాటివయసుకి దీటుగానే ఉంది. ఆయన దయ్యాలకథలు రెండు చదివేను కానీ ఆ రెండుకథలు కూడా శిల్పం దృష్ట్యా పేలవంగానే అనిపించేయి. నిజానికి ఆ కథలు కుటుంబరావుగారు కాక మరొకరు రాసి ఉంటే అవి ఈనాడు చర్చలదాకా అఖ్ఖర్లేదు ప్రచురణకే నోచుకునేవి కావు. అదే సాహిత్యాభిమానులబలం అనుకోవాలి. :p.

ఈనాడు చాలామంది రుక్మిణమ్మగారిపేరు విని ఉండరు. అమె సుబ్రహ్మణ్యశాస్త్రిగారికంటే, కొడవటిగంటి కుటుంబరావుగారికంటే ముందుతరంవారు. రుక్మిణమ్మగారికి పైరచయితలవంటి గుర్తింపు రాకపోవడానికి కారణం ఏమయి ఉంటుందో?

స్థానాపతి రుక్మిణమ్మగారు కథలే కాక కవనంలో ఉత్తమశ్రేణికి చెందినవారు అంటారు ఊటుకూరి లక్ష్మీకాన్తమ్మగారు. శ్రీమతి స్థానాపతి రుక్మిణమ్మగారి గురించిన వివరాలు ఆంధ్రరచయిత్రులు గ్రంథంలో (ప్రచురణ 1980) ఇలా వివరించేరు (పు. 268-275) –

రుక్మిణమ్మగారి జన్మస్థలం నిడదవోలు. తల్లిదండ్రుిలు శ్రీకాకుళపు పురుషోత్తముగారూ, గరుడమ్మగారు. జన్మ సంవత్సరము 1915. ప్రస్తుతము వీరి నివాసము విశాఖపురీ కన్యకాపరమేశ్వరీ ప్రాంగణము. ఆమె వివాహం విశాఖపురీ నివాసులు స్థానాపతి సత్యనారాయణగారితో. ఆమె 17వ ఏట ప్రారంభించి ప్రచురించిన కావ్యపరంపర – పూలమాల, దేవుడు, వత్సరాజు, దూతఘటోత్కచము, దయ్యాలు, ప్రార్థన, ఊర్మిళ, ప్రతిజ్ఞ (నాటకము), చాయ, (నవల), పూర్వగానము (ఖండకావ్యము), లీల (కావ్యము), దేవీభాగవతము (ఆంధ్రానువాదము), కాదంబిని (ఖండకృతుల సంపుటి), చారుదత్త (నాటకము) – ఇవి ముద్రితగ్రంథములు. సప్తశతి, నీలాటిరేవు, యుక్తిమాల – ఇంకను అముద్రితములు అన్నారు లక్ష్మీకాన్తమ్మగారు 1980లో. మరి తరవాత ప్రచురించేరేమో తెలీదు.

రుక్మిణమ్మగారి కవితాపటిమనిగురించి వ్యాఖ్యానించగల పాండిత్యం నాకు లేదు. ఊటుకూరి లక్ష్మీకాన్తమ్మగారి మాటల్లో – “అనన్య సామాన్య ప్రతిభతో నద్వితీయ కవితాప్రకర్షతో కవిత్వమొక యుపాసనగ, రచనమొక పవిత్రదీక్షగ, కావ్యోద్యోగమొక నియత జీవనవిధిగ భావించి, “క్షురస్యధారా నిశితా దురత్యయా దుర్గం పథస్తత్కవయో వదంతి” యను నానుడికి సార్థకత భజించి సరస్వతీ ప్రియసేవికయే తనరారిన మానెచ్చెలి లేఖని యమృతనిష్యంది లేఖినియే.” (పు. 272).

శ్రీమతి స్థానాపతి రుక్మిణమ్మగారిని మార్చి 5, 1953లో శ్రీ కె.యన్. కేసరిగారు స్వర్ణకంకణము ఇచ్చి గారవించేరు.

దయ్యాలు లేవూ కథలు
పూలమాల కవితలు

(ఫిబ్రవరి 6, 2014)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

5 thoughts on “స్థానాపతి రుక్మిణమ్మగారి దయ్యం కథలు”

 1. సున్నా, సంతోషమండీ మీకు నచ్చినందుకు.
  నారాయణస్వామి, నాక్కూడా అదేనండి నచ్చింది సుమారుగా గురజాడ అప్పారావుగారి సమకాలీనురాలే కదా. మరి ఆయన ఇంకా గ్రాంథికంలో రాస్తుంటే రుక్మిణమ్మగారు సరళమైన తెలుగులో చక్కగా చెప్పేరు కథలు.

  మెచ్చుకోండి

 2. యం.వి. రమణారావు, ఆమె సమకాలీనులని కొందరిని ఇప్పటికీ తలుచుకుంటూనే ఉన్నాం కదండి. విమర్శకులు, గ్రంథకర్తలూ ఇటువంటి రచయిత్రులని నిర్లక్ష్యం చెయ్యడమే కదా.

  మెచ్చుకోండి

 3. నిన్ననే నాలుగైదు కథలు చదివాను. భలే రాశారు. ఆవిడ వాక్యాలు ఎంతో కుదురుగా, చక్కగా ఉన్నై. కథ చెప్పే శైలి కూడా హాయిగా ఉంది.

  మెచ్చుకోండి

 4. మొదటి కథ చదివానండి. చాలా బాగుంది. మిగతావి తర్వాత చదువుతా. భలే పుస్తకం సంపాదించేరు మొత్తం మీద. 🙂 రాత్రి భయం వేసిందా మీకు? ఉత్తినే అడుగుతున్నాను లెండి.

  మెచ్చుకోండి

 5. స్థానాపతి రుక్మిణమ్మగారిగురించినేటి తరంవారికి తెలియకపోవడం సహజమే కదా.ఆవిడకాలంలో ప్రసిద్ధ రచయిత్రి,కవయిత్రిగా మంచి పేరు ఉండేది.ఇక దయ్యాల కథలంటే ,మనుషులకు reality తోబాటు fantasy కూడా కావాలికదా.

  మెచ్చుకోండి

నాటపా మీకు నచ్చిందో లేదో చెప్తే చాలు. బాగులేకపోతే ఎందుకు లేదో చెప్పినా సంతోషమే.

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s