తెన్నేటి సూరిగారి చిన్నకథలు, కవితలు

తెన్నేటి సూరిగారిపేరు ఏమాత్రమైనా పరిచయం ఉన్నవారికి మొట్టమొదట స్ఫురించేవి వారి ప్రతిష్ఠాత్మక నవల చెంఘిజ్ ఖాన్, ఆనవలతో ప్రతిభావ్యుత్పత్తులలో సరి తూగగల అనువాదం రెండు మహా నగరాలు (మూలం Charles Dickens నవల A Tale of two cities). ఇది ఆంధ్రపత్రిక సారస్వతానుబంధంలో ధారావాహికగా ప్రచురించిన రోజుల్లో ఆవురావురంటూ వారం వారం పత్రికకోసం ఎదురు చూసిన వందలాది (వేలాది కూడానేమో) పాఠకులలో నేను సైతం ఉన్నాను :).

అందుచేత, ఇంతకాలం అయేక, పదిరోజులక్రితం హఠాత్తుగా http://www.new.dli.ernet.in/  సైటులో తెన్నేటి సూరిగారి పేరు కనిపించగానే ప్రాణం అహో సుదినం అనిపించింది.

నేను ఈవ్యాసం మొదలు పెట్టడానికి కారణం ఆ సైటులో సూరిగారి పుస్తకాలు రెండు దొరకడం. మొదటి పుస్తకంలో మహోదయం పేరుతో ప్రచురించిన సంకలనం. 1959లో ప్రచురణ. ఇందులో రెండు కథలు, ఒక కాల్పనిక నాటిక, 8 కవితలు ఉన్నాయి.

మొదటికథ వీణ మహావిద్వాంసురాలయిన కల్యాణి తానే వీణయి, సంగీతసుధాలహరిలో మమేకమయి వినేవారిని సైతం ఆ మాధురీఝరులలో ఓలలాడించగల ప్రతిభావంతురాలు. ఆమె సంగీతప్రావీణ్యానికి ముగ్ధుడయి ఆ సంగీతాన్ని ఆస్వాదిస్తూ అలౌకికానందాన్ని అనుభవించే తండ్రి, బి.కాం. పట్టా ఉండీ ఉద్యోగం దొరక్క టైపిస్టుగా చేరి, ఆ పట్టామూలంగా సాటి ఉద్యోగులఎత్తిపొడుపులు తట్టుకోలేక మనోవేదనకి గురైన భర్త చంద్రశేఖరరావు – ఈ ముగ్గురితో, రచయిత తనదైన ప్రత్యేకశైలిలో గొప్పభావుకతతో, అద్భుతమైనభాషాపటిమతో ఆవిష్కరించేరు. సంగీతవిశేషాలు తెలిసినవారికి ఈకథ చదవడమే ఒక రసాస్వాదనానుభవం కావచ్చు.

రెండోకథ బూరె ముక్కలులో కన్నతల్లి అనారోగ్యంకారణంగా దాదిపాలు తాగుతూ ఆమెతో పెంచుకున్న అవ్యాజానురాగం. దాదే ఆ పిల్లవాడి సర్వస్వం. తల్లి తనని సతాయిస్తే, ఆవిడకేం అధికారం ఉంది నామీద అనుకునేపసివాడిని చూస్తే పాఠకుడిమనసు కూడా పల్లవిస్తుంది. తల్లి సర్వవిధాలా ఇద్దరినీ ఆదరిస్తున్నా, ఆ పిల్లవాడికీ దాదికీ మధ్య గల అనుబంధం వారికి మాత్రమే వేద్యం. ఆ పిల్లవాడికోణంలోనుండి చెప్పిన ఈకథ ముగింపులో దాది కోణం మెరుపులా ఝళిపించి కథకి కొత్త అందాన్ని చేకూర్చింది.

 సమవాకారం అన్న కాల్పనిక నాటికలో సమకాలీనకవులని పాత్రలుగా తీసుకుని వారివే కొన్ని కవితలు తీసుకుని గొప్ప హాస్యం కురిపించేరు సూరిగారు. సూత్రధారుడుగా గిరీశం ప్రవేశించిన తరవాత, కొల్లూరి ధర్మారాయకవిగారి చాకిరేవు కవితతో ప్రారంభించి ఒకొక కవిని రంగంమీదికి తెచ్చినవిధానం మన మనసులని ఆకట్టుకుంటుంది. తెన్నేటి సూరిగారి హాస్యం, వ్యంగ్యం నామాటల్లో చెప్పలేను. పార్కర్ పెన్ బాకులా పుచ్చుకుని విశ్వనాథ సత్యనారాయణగారూ, ఆకుపచ్చ టపేటా శిల్కు లాగూ, ఎర్ర టపేటా బుష్ కోటూ తొడుక్కుని ఎర్రజండా పుచ్చుకుని శ్రీ శ్రీ, తాటాకుగొడుగుకింద కవితాసామగ్రి తో దుకాణం పెట్టుకు కూర్చున్న కాటూరి వెంకటేశ్వరరావుగారూ, పింగళి లక్ష్మీ కాంతంగారూ, ముళ్ళకిరీటంతో కృష్ణశాస్త్రిగారు, ఎత్తైన తక్తుమీద స్వామి శివశంకరశాస్త్రిగారూ, ఇంకా ఆరుద్ర, రుక్మిణీనాథశాస్త్రి, కవికొండల వెంకటరావు, రాయప్రోలు సుబ్బారావుగారు – ఆనాడు ప్రసిద్ధులయిన కవులందర్నీ ఒకచోట చేర్చేరు సూరిగారు ఈనాటికలో. ఇది చదువుతున్నప్పుడు మీకు నవ్వు రాకపోతే, ఇంక మిమ్మల్ని ఎవరూ నవ్వించలేరనే అనుకోవాలి.

ఈపుస్తకంలో చేర్చిన కవితలు అరుణరేఖలు పుస్తకంలో కూడా ఉన్నాయి కనకి ఆ పుస్తకమే ప్రస్తావిస్తాను. ఇందులో 16 కవితలున్నాయి. ఇది 1946లో ప్రచురించినట్టు digital library of india సైటులో ఉంది కానీ ఏ కవిత ఎప్పుడు రాసేరు, ఏ రచన ఎప్పుడు ఎక్కడ తొలిసారి ప్రచురించారు అన్న సమాచారం లేదు. ఈవిషయం ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నానంటే, కొన్ని కవితలు చదువుతుంటే, ఇప్పుడు బహుళ ప్రచారంలో ఉన్న శ్రీ శ్రీ, ఆరుద్ర, దేవులపల్లి కృష్ణశాస్త్రివంటి వారి రచనలు మనకి స్ఫురణకి వస్తాయి. బహుశా స్థూలంగా ఆకాలంలో అటువంటి రచనలు చేసేరు అనుకోవాలేమో. లెండోయ్, పతితజీవనులార, బానిస ప్రజలార (మహోదయం), కూలిమాటడగండిరా, అన్నాలు చాలవని చెప్పండిరా (కీలు గుఱ్ఱం), కప్పతల్లీ లేచి, గబగబలు సేయ, కాకమ్మగూటిలో కళవళించిందీ (కన్నీటి కాలువ), తెల్లదొరా! మల్లుదొరా! … అన్నదమ్ముల చీలదీశావా? తల్లిపిల్లల కెడము చేసావా? (క్విట్ ఇండియా), ఇలా చాలా చోట్ల మనకిప్పుడు బాగా అలవాటయిపోయిన పదజాలం కనిపిస్తుంది. ఆనాటి సమాజంలో భావజాలానికి అనుగుణంగానే, దేశభక్తి, స్వాతంత్రోద్యమఛాయలు, దేశాన్ని ఉద్దరించమంటూ మేలుకొలుపులు కనిపిస్తాయి ఈ కవితల్లో. ఉదాహరణకి రెండు కవితలు ప్రస్తావిస్తాను.  మహోదయం కవితలో

ధర్మగోమాత తా తరలివచ్చింది,

బందెవెల్వడి మంచి పాలు చేపింది

సత్యవత్సము తల్లికుత్సవముగాగ

చెంగు చెంగున దూకి చేరుకున్నాది … భ.

ఈ గేయం చదువుతుంటే నాకు చిలకమర్తివారు స్వతంత్రం రాకముందు రాసిన పద్యం గుర్తుకొచ్చింది.

భరతఖండంబు చక్కని పాడియావు
హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ
తెల్లవారను గడుసరి గొల్లవారు
పితుకుచున్నారు మూతులు బిగియగట్టి.

చిలకమర్తివారు స్వాతంత్ర్యం రాకముందు మన కర్తవ్యం బోధిస్తే, సూరి గారు స్వతంత్రం వచ్చేక మనధర్మం గుర్తు తెచ్చుకోమంటున్నారు. ధర్మ గోమాత బందె వెల్వడి మంచి పాలు చేపుతోంది, సత్యవత్సము చెంగు చెంగున దూకుతోంది తల్లికుత్సవము కాగ. ఇది ఎప్పుడు రాసేరో తెలీదు కానీ సుమారుగా 1947-1958 లో అయి ఉండాలి కదా. మరి 60 ఏళ్ళతరవాత  పరిస్థితులు ఏమైనా మారేయా, మాకిప్పుడు అలా చెప్పఖ్ఖర్లేదండీ అనగల స్థితిలో ఉన్నామా? ఈనాడు ఈ ధర్మగోమాత మోరలెత్తి ఏదిక్కులు చూస్తోంది? అంటే జవాబు లేదనే అనిపిస్తోంది. కనీసం గర్వపడదగ్గ సమాధానం లేదు.

ఈనాటికీ మారని మరో కఠోరసత్యం నీ కవి అన్న కవితలో కనిపిస్తుంది.

నీకవిని బ్రతికించుకోవాలిరా!

నీవు మనిషనిపించుకోవాలిరా!

బ్రతికియున్నన్నాళ్లు పట్టెడన్నము నిడవు

అతడు చచ్చినవెనుక అందలాలంటావు … నీ.

పేర్లు చెప్పుకోడం మనకే సిగ్గుచేటు కనక పేర్లు చెప్పను కానీ బ్రతికిఉండగానే చివరిరోజుల్లో డబ్బుకి ఇబ్బంది పడిన మహారచయితలు ఉన్నారు మన తెలుగుదేశంలో. ఈరోజుల్లో సాహిత్య సభలు, శాలువాలు, జ్ఞాపికలంటూ పలకలు, వీటికోసం అట్టహాసంగా పెట్టే ఖర్చులు చూస్తే, అందులో కనీసం సగం రచయితలు పరువుగా బతకగల ఏర్పాటు  చేయకూడదా అనిపిస్తుంది నాకు. బహుశా ఇలాటి ప్రణాళిక ఏదైనా మొదలు పెడితే అందులో కూడా అయినవాళ్లకి ఆకుల్లోనూ కానివాళ్ళకి కంచాల్లోను అన్నధోరణిలోనే సాగుతాయేమో. మన ఖర్మ అనుకోవాలి!

రెండు మహానగరాలు నవల వివరాలకోసం Facebookలో అడిగితే, సర్వశ్రీ జె.కె. మోహనరావు, సురేశ్ కొలిచాల, రమణమూర్తిగారలు ఇచ్చిన సమాచారం ఇది – రెండు మహానగరాలు 26.03.1952 సంచికలో ప్రారంభమై, 07.01.1953 సంచికలో సమాప్తమైంది. జూన్ 1953లో నవల పుస్తకరూపంలో వెలువడింది. ఇంత విలువైన సమాచారం అందించిన మిత్రులకు నాహృదయపూర్వక ధన్యవాదములు.

వికిపీడియా.ఆర్గ్ లో తెన్నేటి సూరిగారి వివరాలు ఇలా ఉన్నాయి –

తెన్నేటి సూరి (1911 – 1958 అక్టోబర్ 16)ఒక ప్రముఖ తెలుగు రచయిత. అభ్యుదయ కవి, కథారచయిత మరియు నాటకకర్త. ఛంఘిజ్ ఖాన్ నవలా రచయితగా సుప్రసిద్ధుడు. భారతి, ఆంధ్రపత్రికలలో 1945-1957లలో పత్రికా రచయితగా పనిచేశాడు. సూరి 1911లో కృష్ణా జిల్లా తెన్నేరులో జన్మించాడు.[1]

చారిత్రక నవలైన ‘చంఘీజ్‌ఖాన్‌’ మొదట ఆంధ్రపత్రిక సారస్వతానుబంధంలో ప్రచురితమైంది. 13 శతాబ్దాల మధ్యగల ఆసియా ఖండ చరిత్రలో గర్వకారకుడైన మహాపురుషుడు చంఘీజ్‌ఖాన్‌ విదేశీ చరిత్రకారులు అతనిని ఒక సైతానుగా, అధికారదుర్మదాంధుడుగాను నియంతగాను నరరూపురాక్షసునిగాను చిత్రించారు. తెన్నేటి సూరి ఎన్నో శ్రమల కోర్చి యదార్థ చరిత్రను వెలికితీసి, ప్రాచ్య, పాశ్చాత్య గ్రంథాలను అపోశనపట్టి ఎంతో దక్షతతో ఈ నవలను తీర్చిదిద్దాడు. ఆయనకు గల పరిపాలనా దక్షతను, శక్తి సామర్థ్యాలను, తనకింది అధికారుల పట్ల చూపిన ప్రేమాదరాలను చక్కగా వివరించారు.[2]

సూరి 1958, అక్టోబర్ 16న మరణించారు.  తెవికీలో తెన్నేటి సూరిగారి వివరాలకి లింకు ఇక్కడ

అప్రస్తుతమే అయినా ఆంగ్లేయులపాలనలో సృష్టించిన చరిత్ర పుస్తకాలు దోషభూయిష్ఠమని నోరి నరసింహశాస్త్రిగారూ, విశ్వనాథ సత్యనారాయణగారూ వంటి పండితులు ప్రకటించిన విషయాలు మరోసారి ఇక్కడ మననం చేసుకోక తప్పదు. చెంఘిజ్ ఖాన్ జీవితాన్ని ఆవిష్కరించడంలో తెన్నేటి సూరిగారు మరొకసారి ఆవిష్కరించేరు. మన చరిత్ర మనం పునరుద్ధరించుకోవలిసిన అగత్యం ఉంది. అదే దృష్టితో తెలుగువారే రాసిన తెలుగు నవలలు, కథలు చదవాల్సిన అవుసరం కూడా ఉంది.

తెన్నేటి సూరిగారి పుస్తకాలు పిడియఫ్ లో కావాలంటే, కింద లింకులమీద నొక్కండి.

మహోదయం

అరుణ రేఖలు

(ఫిబ్రవరి 12, 2014)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

5 thoughts on “తెన్నేటి సూరిగారి చిన్నకథలు, కవితలు”

  1. పింగుబ్యాకు: వీక్షణం-71 | పుస్తకం
  2. చెంగిజ్ ఖాన్ నవలనై నేను చదివాను.మంగోలియన్ లకు అతడు గొప్ప హీరో.మిగతావారికి మహా హంతకుడు.పాశ్చాత్యత్యులేగాక ముస్లిం చరిత్రకారులు కూడా అలాగే రాసారు.చరిత్ర రాసినవారి దృక్పథం మీద కూడా ఆధారపడి ఉంటుంది.
    మనదేశ చరిత్ర గురించి పాశ్చాత్య చరిత్రకారులు రాసినది తిరగరాయాలంటే సరియైన శాస్త్రీయ ఆధారాలతో రాస్తేగాని అంగీకారం కాదు.

    మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s