కథాలహరి (సంకలనం)

­­­­­తల్లావఝ్ఝల శివశంకరస్వామి (శివశంకరశాస్త్రిగారు)గారి “సంకలిత సంపాదితము” అన్నపేరుతో, ఆంధ్రప్రచారిణి వారు 1943లో వెలువడిన ఈ సంకలనంలో 16 లబ్ధప్రతిష్ఠులయిన రచయితల కథలున్నాయి. అందరిపేర్లూ ఈనాటి పాఠకులందరికీ సుపరిచితం కాకపోవచ్చు. ఈవిషయం చివర్లో ప్రస్తావిస్తాను. సంకలనం లింకు కింద ఇచ్చేను.

ఈ సంకలనంలో ఘనంగా చెప్పుకోవలసినది శివశంకరస్వామిగారి పీఠిక. భారతీయ సాహిత్యంలో చిన్నకథ చరిత్ర, స్వరూపస్వభావాలు  ఆయన ఈ పన్నెండు పేజీల్లో ప్రస్ఫుటంగా వివరించేరు. “రచనలో వైవిధ్యము భరతఖండము ప్రపంచానికి ప్రసాదించింది” అని ప్రారంభించి “సారస్వతచరిత్ర సక్రమముగా గ్రహించనివారు కధావిధానాన్ని పరదేశాలనుంచి మనము ఎరువు తెచ్చుకొన్నామని భ్రమ పడతారు” అంటారు. అది వారికి సమ్మతము కాదు. ఆయన వేదసంహితలు మొదలుకొని అనేక ప్రాచీనగ్రంథాలలో కథలు ఉన్నాయని చెప్పి, ఆకథల్లో భాష, వాక్యరచన, వర్ణన, సంభాషణ, ఉపసంహారములు ఉజ్వలంగా ఉన్నాయనీ కథాగమనము వివిధ రీతుల విప్పారిల్లిందనీ సోదాహరణంగా వక్కాణించేరు. జాతకకథల్లో ధర్మాలు, నీతులు, లోకవ్యవహారాలు కమనీయంగా చెప్పేరంటారు. కథాక్రమము సహజమూ, సరళమూ. ప్రతికథా గాధతో ముగుస్తుంది. గాధ ఒకవిధమైన పద్యముట. “కథారచనలో ఆంధ్రులది అందె వేసినచెయ్యి” అంటూ ఆయన బృహత్కథలు మొదలుకొని అనేక గ్రంథాల్లోనుండి అనేక ఉదాహరణలు ఎత్తి చూపిస్తుంటే, ఇవి మనం ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటాం కానీ మనసులో నాటుకోలేదు అనిపించింది. తమకి భారతీయకథలే స్పూర్తినిచ్చేయని ప్రకటించిన పాశ్చాత్యులని కూడా ఉదహరించేరు శాస్త్రిగారు.

50వ దశకంలో కొడవటి కుటుంబరావు, వల్లంపాటి వెంకటసుబ్బయ్యవంటి రచయితలు ప్రస్తావించిన కథ ఉపాంగాలు మనకి పరిచయమే. వారికంటె ఒక దశాబ్దంముందే ఆ ఉపాంగాలగురించి ఈ పీఠికలో శివశంకరశాస్త్రిగారు ప్రస్తావించినా, అవి మనకి పూర్వకాలంనించీ మనసాహిత్యంలోనే ఉన్నాయంటారు. వారి మాటల్లోనే “కథాత్మలో వస్తువు, తద్విశేషాలు, భావాలు, భావపర్యవసన్నత, రసప్రతీతి – ఇవి లక్ష్యములో ఉండాలి. రచయితల రసికతనుబట్టి హృదయంగమత్వము గానీ, ధీప్రతీతి గానీ ఉద్దీప్తమై ఉంటుంది.”

సూక్ష్మంగా ఒక్కమాటలో కథలు ఎలా రాస్తారన్న సంశయం గల ప్రతి రచయితకి ఈ పన్నెండు పుటలు చాలు కథా కమామీషు తెలుసుకోడానికి. నాకయితే మొత్తం పీఠిక అంతా ఇక్కడ మళ్లీ పెట్టేయాలన్నంత ఉత్సాహంగా ఉంది కానీ మీకు మీరే చదివి తెలుసుకోవాలని ఇక్కడితో ఆపుతున్నాను.

ఈ సంకలనంలో నన్ను ప్రత్యేకంగా ఆకట్టుకున్న అంశాలు ఇతివృత్తాల్లో వైవిధ్యం, ప్రతి ఒక్క రచయితకీ గల ప్రత్యేకమైన శైలి. సంపాదకులు ఈ శైలిలో ప్రత్యేకతలను పట్టుకుని తదనుగుణంగా కథలు ఎంపిక చేసుకోడం కనిపిస్తుంది. దానితోపాటు అన్నికథలకీ ఉపాదేయంగా అంతస్సూత్రంగా సర్వసామాన్యమైన తెలుగుజాతివెలుగులు ప్రతిఫలించేయి ఈ సంకలనంలో. రెండు కథలు మాత్రం నాకు వేరుగా తోచేయి. వాటిగురించి చివరలో ప్రస్తావిస్తాను.

మొదటికథ గాదె (తల్లావఝ్ఝల శివశంకరశాస్త్రి) లో పాఠాలు పేరుమీద నరకం చూపించే పంతులుగారి చెరనించి తప్పించుకోడానికి ప్రయత్నించే అబ్బాయి కథ. కుటుంబరావుగారి చదువు నవలలో సుందరం చిన్నప్పటి స్కూలు అనుభవంలాటిదే ఇది కూడా. ఈకథలో పిల్లవాడు పంతులుగారు కొట్టే దెబ్బలు భరించలేక, గాదెలో దాక్కోడం, తరవాత అమ్మమ్మ వచ్చి పంతులుగారిని చీవాట్లు పెట్టి, ఆ బాలుని ఆదుకోడం –మనసుకి హత్తుకునేలా చిత్రించేరు రచయిత పిల్లవాడికోణంనుండి.

అరిసె ముక్కలు (వఝ్ఝ బాబూరావు) శిల్పందృష్ట్యా నన్ను ప్రత్యేకించి ఆకట్టుకున్న కథ. ఇది కూడా ఉత్తమపురుషలో పదేళ్ల అమ్మాయి సుందరి చెప్పిన తనపెళ్లి కథ. తనకి పదేళ్లొచ్చేవరకూ ఆ పిల్లపెళ్లిమాటే తలపెట్టలేదు తండ్రి అంటూ మొదలవుతుంది కథ. మరో రెండేళ్లకి పెళ్లి కుదిరింది. మేనబావ రాముడు ఉన్నాడు కానీ ఏణ్ణర్థం మాత్రమే తేడా, మరో రెండేళ్లు తేడా ఉంటే వాళ్లిద్దరికీ పెళ్లయి ఉండేదంటుంది అమ్మమ్మ. పెళ్లిమాట తలపెట్టిన మరో రెండేళ్ళకి పెళ్లి నిశ్చయమవుతుంది. “పెళ్ళికొడుకు కుదిరేదాకా నాకూ మనశ్శాంతి లేదు. వైశాఖమాసములోగా సంబంధము కుదిరితే సరే. లేకపోతే, దోవను పోయ్యేవాడిని పిలిచి నాలుగెకరాలు గట్టుపెట్టి ముడివేస్తా! అని మానాన్న ఒకసారి అన్నప్పుడు నాప్రాణము చివుక్కుమన్నది” అంటూ ఆరాటపడుతూ ఉంటుంది. మొత్తమ్మీద పెళ్ళి కుదిరింది. తీరా లగ్గంవేళకి మొగపెళ్లివారు రామన్నారు. కారణం పిల్ల మేనమామతమ్ముడు సీమకు వెళ్ళివచ్చినవారితో కలిసి భోజనం చేసేడని! అంచేత ఆయనకి వెలి, ఆయన్నిబట్టి వీరికీ వెలి, అంచేత మొగపెళ్ళివారు ఈ సంబంధం అక్కర్లేదన్నారు! విదేశాలకి వెళ్లినవారే కాదు వారితో సహపంక్తి భోజనాలు చేసినవారిని కూడా వెలి వేస్తారని నాకు ఈ కథ చదివేకే తెలిసింది. ఆ తరవాత ఆ మామ చెప్పిన మాటలు ఇంకా బావున్నాయి­­­­­ – “ఆ దొంగముండాకొడుకులు రామన్నారని కార్యం మానుకుంటామా ఏమిటి? వాళ్ళమొహంమీద కొట్టినట్టు ఈ లగ్గంవేళకే వివాహం చేయించకపోతే నియోగపువాణ్ణి కాను” అని ఆయన శపథం చేస్తాడు. పెళ్ళి జరుగుతుంది. ఎలా చేసేరో నేను చెప్పను కానీ మనం అవసరసమయాల్లో సంప్రదాయాలకి ఎలా అర్థనిర్ణయాలు చేసుకుని, ఆచరణలో పెడతామో మరోమారు తెలుస్తుంది.  ఈవిషయంలో మనం సాధించిన ప్రగతిగురించి సంతోషించకతప్పదు. సంప్రదాయాలని మూకవుమ్మడిగా విమర్శించేవారు నిత్యజీవితంలో వాస్తవంలో మనం కార్యం ఎలా సాధించుకుంటామో ఇలాటి కథలు చెప్తాయి. ఈకథలో మరో చిన్న వివరం – పెళ్ళి కాకముందు బావని నువ్వు అంటూ ఏకవచనంలో సంబోధించే సుందరి పెళ్ళయినతరవాత మావారు అంటూ కథనం సాగించడం. నిజజీవితంలో ఏంచేస్తారో అని నాకు ఇప్పుడు ఆలోచన వస్తోంది. కథ పొడుగునా ఆరోజుల్లో చాకలివాడిచేత లగ్నపత్రిక పంపడంలాటి చిన్న చిన్న వివరాలు అనేకం ఉన్నాయి. నాకు అంచేత కూడా ఈకథ నచ్చింది.

పల్లెల్లో సామాన్యుల జీవితాలను కళ్ళకి కట్టినట్టు వర్ణించిన కథలు చిన్న (చింతా దీక్షితులు), మట్టెలరవళి (కవికొండల వెంకటరావు) . ఇందులో మొదటికథ చిన్న మధ్యతరగతి జీవితాన్ని చిత్రిస్తే, రెండోకథ జాలరి జంట జీవితాన్ని చిత్రిస్తుంది.

చిన్న కథలో ప్రధానంశం చిన్నపెళ్ళి. పిల్ల మిరియపుగింజలా చురుగ్గా పనిపాటలు చేస్తూ ఉంటుంది. పులు గడిగిన ముత్యంలాగ ఉన్నది. ఎర్రగా మాతాబాలాగ ఉంటుందని పెళ్లి యీడుకుమాళ్ళ తల్లులు అనుకోడం కద్దు. ఇలా సాగుతుంది కథ.   తల్లి చనిపోయేక, తండ్రి, అమ్మమ్మలు పెంచుతూ, ఆమెకి పెళ్ళి చేయడం ప్రదానాంశం. కథ ఉత్తమపురుషలో ఆ అమ్మాయికోణంలో సాగుతుంది. “బావను పెళ్లాడుతావుటే?” అని తండ్రి సుబ్బయ్య వాకిట్లో ముగ్గు పాములు, తీగలు, పద్మములు, పువ్వులు, లతలు గీస్తున్న పదేళ్ళ చిన్నని ప్రశ్నించడంతో మొదలవుతుంది. పెళ్లిమాటతో వికసించిన మొహం బావమాటతో ముడుచుకుంది. “జుట్టూ లేదు ఏమీలేదు, నాకక్కర్లేదు,” అని ముగ్గుబుట్ట అక్కడ పారేసి పారిపోయింది. సుబ్బయ్య గట్టిగా నవ్వుకున్నాడు. పాశ్చాత్యనాగరికపుస్పర్శ తగలని ఒక పల్లెటూరి వృత్తాంతమిది. ఆ తండ్రికి ఒకే కూతురు కావడంవల్ల ఆ పిల్లకి తెలుగు కావ్యాలు, లీలావతీగణితమూ, మల్లన్న గణితమూ చెప్పించేడు. భాషవిషయంలో ఆయన పూర్వాచారపరాయణుడు. కూతురు నామకరణకాలములో పురోహితుడు మహలక్ష్మి అని రాస్తే, కళ్ళెర్ర చేసి, హా కి దీర్ఘం పెట్టి తిరగరాయించేడు. కూతురికి కూడా తనని పెళ్ళాడేవాడి విషయంలో అంతటి నిర్దుష్టమయిన అభిప్రాయాలూ ఉన్నాయి. బావ రామారావుకి కాకినాడలో కాలేజీ చదువుకి వెళ్లినప్పుడు నవనాగరికపుదెబ్బ తగిలింది. క్రాపు చేయించినాడు. బొట్టు పెట్టుకోవడం మానేసినాడు. పంచె మాని షరాయి తొడుగుతున్నాడు, పాశ్చాత్య అనుకరణ పరాయణత్వమహిమ! చిన్నకి అది పనికిరాలేదు. ఇక్కడ గమనించవలసిన విషయం – తండ్రి “బావని చేసుకుంటావా” అంటే “జుట్టూ లేదు, ఏమీ లేదు, నాకక్కర్లేదు,” అని స్వేచ్ఛగా చెప్పగల చనువు తండ్రిదగ్గర ఆ పిల్లకి ఉండడం. నవ్వుకుని ఊరుకోగల వాత్సల్యం తండ్రికి ఉండడం.  కాలేజీచదువుకి కాకినాడ వెళ్లిన రామారావు, అక్కడివాతావరణానికి అనుగుణంగా జుత్తు కత్తిరించుకున్నాడు. చిన్న తనని అక్కర్లేదందని విని, తనకి ఏది ముఖ్యమో వితర్కించుకుని, ఓ నిర్ణయానికి వచ్చి, జీవితాన్ని ఓ కొలిక్కి తెచ్చుకున్నవైనం చింతా దీక్షితులుగారి అభ్యుదయభావాలకి నిదర్శనం.

మట్టెలరవళి కథలో ఆర్ద్రత పరాకాష్ఠ అందుకుంటుంది. మహోధృతంగా ఊరూ నాడూ ఏకంచేస్తూ విజృంభించి విరుచుకుపడుతున్నవరదల్లో కొట్టుకుపోతున్న నాగడు, ఆడ్ని రక్షించాలనే పట్టుదలతో, ఆడికోసం పల్లారుస్తూ ఒడ్డున పరుగులు తీస్తున్న ఆడమనిషి – అంతే కథ. వరదల్లో కొట్టుకుపోతున్న మనిషి మనసులో ఆరాటం, ఆలోచనలు, గట్టమ్మంట పరుగెత్తుతూ ఆడికోసం ఆరాటపడిపోతున్నఆమె తపన గొప్పగా చిత్రించేరు రచయిత. ఈయిద్దరివేదనతోపాటు కథకుడి పరిశీలనాదృష్టి కూడా కనిపిస్తుంది. నీటిలో కొట్టుకుపోతున్నవాడిగురించి కథకుడు అంటాడు, “జంతువుకేదో స్వతస్సిద్దమైన శక్తి సార్థ్యం అనంతమైయింది ఉండవచ్చును. కాని మనిషికి అలాంటిది వున్నట్టు కనిపించదు. మనిషి శరీరనిర్మాణంలో కొమ్ములు లేవు, తోక లేదు, నాలుగు కాళ్ళు లేవు. పోనీ, పడగ లేదు, ముడుచుకుపొయ్యేగోళ్ళు లేవు, ముందుకు వచ్చే కోరలు లేవు. ముళ్ళు లేవు, పొలుసుల్లేవు, వేళ్ళ వేళ్ళమధ్యనూ చర్మం లేదు. ఏదీ లేదు. మనషికేదీ లేదని చెప్పొచ్చు.”

అలాటి దుర్భర క్షోభతో గిలగిల్లాడుతున్నమనిషిని రక్షించేది ఏమిటి అంటే తనబతుకుతో పడుగూపేకలా జమిలిగా కలిసిపోయి, అతడే తానయి, అతడికోసం అంతగానూ గిలగిల్లాడిపోతూ పరుగులు పెడుతున్న ఆడమనిషికాలి మట్టెలరవళి! పాఠకునిచేయి పుచ్చుకుని ఒక మహోన్నత శిఖరానికి తీసుకుపోగల గొప్ప కథ ఇది. అతి మామూలు పదాలతో, విద్యాగంధంలేని ఆ ఇద్దరి మనోభావాలు చెప్పించడంలో రచయితస్పూర్తి అద్వితీయం. శైలబాల (అడివి బాపిరాజు) మరొకస్థాయిలో తమకి సాధారణమైన భావనాలోకంలోకి చొచ్చుకుపోయి రసమయధునిలో ఓలలాడించే కథ. భార్యాభర్తలు ఒకరితో ఒకరు పెనవేసుకుపోయి, జీవితాన్ని రసమయం చేసుకున్న మరో జంట కామకోటి(మల్లాది రామకృష్ణశాస్త్రి) కథలో చూస్తాం. నిరీక్షణ (సురవరం ప్రతాపరెడ్డి) కథలో సముద్రంలో చేపలు పట్టడానికెళ్ళిన మళయాళీ శంకరన్, అతడు చేపలు పట్టుకు తిరిగివస్తాడని జీవితాంతం నిరీక్షిస్తూ గడిపిన కుమారికథ. కుమారిని కన్యాకుమారిగా, దేవతగా ఆవిష్కరించిన ఆర్ద్రతతో కూడిన కథ.

గానభంగం (నోరి నరసింహశాస్త్రి) కథలో రుక్మిణి భర్త ఇంట్లో లేనిసమయాల్లో పొరిగింట్లో ఉన్న విద్యార్థి రాజగోపాలం పాడుతున్న సంగీతానికి పరవశించి ఆగానరసాస్వాదనలో ఔచిత్యం మరిచి ఒకరికొకరు చేరువ కావడం ప్రధానాంశం. భార్యా రూపవతీ శత్రుః (శ్రీనివాస శిరోమణి) కథలో నీడలు భర్త అపోహలకి దారి తీయడం ఇతివృత్తం. ఒకకథలో అనర్థం, మరో కథలో అపార్థం చిత్రించడం జరిగింది. అలాగే దాంపత్యజీవితజీవితంలో అల్లకల్లోలం చిత్రించిన మరో కథ చిత్తరువు (మొక్కపాటి లక్ష్మీ నరసింహారావు). ప్రధానపాత్ర నారాయణరావుజీవితంలో రెండోభార్యా, చదువు చెప్పించడానికి చేరదీసిన కృష్ణమూర్తి మూలంగా కలిగిన క్లిష్టసమస్యకి మొదటి భార్య చిత్తరువుద్వారా పరిష్కారం గ్రహించుకుని ముగ్గురి జీవితాలని సరిదిద్దుకోడం ప్రధానాంశం. ఈ కథలో కూడా గానభంగం కథలోలాగే స్త్రీపురుషుల నిషిద్ధ సమాగమం కీలకసమస్య.

విశ్వనాథ సత్యనారాయణగారి మక్లీ దుర్గంలో కుక్క కథలో కుక్కలద్వారా వర్ణాశ్రమవివక్షతలలో లోపాలు చిత్రించేరు. వారికథగురించి నేను వేరే చెప్పఖ్ఖర్లేదు కదా. ఈకథలో ఆయన శైలి, భావజాలం, తర్కం స్వతఃసిద్ధంగానే చాలామంది పాఠకులని ఆకట్టుకుంటుంది.

పీఠికలో శివశంకరశాస్త్రిగారు ఈసంకలనంలో కథలగురించి “ఈసంకలనంలో ప్రకృతివర్ణన, పల్లెటూరి జీవితము, పట్నవాసుల భావసాంకర్యము, బాలకుల పాఠశాలానుభావాలు, అరణ్యము, ఆఖేటము (వేట), హస్యోద్దీపకసన్నివేశాలు, ఆకలిబాధ, అధమవర్ణులవ్యధలు, సంప్రదాయసంఘర్షణలు చిత్రముగా వర్ణించి ఉన్నవి. భావవిహారానికి, మానసికోద్దీపనానికీ ఉపకరించే ఉత్తమ కల్పనలు ఉన్నవి. రాగము, రసికత, అసూయ, హృదయనాదానికి పదునెక్కించే పరిస్థితులు ఉన్నవి,” అన్నారు.

మొదట్లో చెప్పేను వీరందరు లబ్ధప్రతిష్ఠులయిన రచయిలతని. అయినా ఈనాటి పాఠకులకి సుపరిచమైన పేర్లు బహుశా తల్లావఝ్ఝల శివశంకరశాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణ, నోరి నరసింహశాస్త్రి, మొక్కపాటి నరసింహశాస్త్రి, అడివి బాపిరాజు, మల్లాది రామకృష్ణశాస్త్రి, మునిమాణిక్యం నరసింహారావు. వీరు కాక, చింతా దీక్షితులు, వేదుల సత్యనారాయణశాస్త్రి, కవికొండల వెంకటరావు పేర్లు కూడా కొంత పరిచయమయేఉండవచ్చు. మిగతావారిలో కొడవటిగంటి వెంకటసుబ్బయ్య (కుటుంబరావుగారి అన్నగారు), శ్రీనివాస శిరోమణి ఎంతమందికి తెలుసో నాకు తెలీదు. సురవరం ప్రతాపరెడ్డి, వింజమూరి శివరామారావు గార్లని కథకులుగా ఎరిగినవారు తక్కువే కావచ్చు. వఝ్ఝ బాబూరావు, వెంపటి నాగభూషణం పేర్లు విననివారే ఎక్కునుకుంటాను.

ప్రచురణకర్తలు అరవైమంది కథలు మూడు సంకలనాల్లో వెలువరించాలనుకుంటున్నామని, మూడో సంకలనంలో అన్నీ స్త్రీలరచనలే ఉంటాయనీ రాశారు. మరి ఆ సంకలనాలు వచ్చేయో లేదో తెలీడంలేదు. ఈ కథలు ఎప్పుడు ప్రచురించేరో తెలీదు కానీ రచయితలపేర్లూ, ఇతివృత్తాలూ చూస్తే, సుమారుగా ఒకటి రెండు దశాబ్దాలలో వచ్చినట్టు కనిపించింది నాకు. ఆ దశాబ్దాలలో ఒక పరిమిత పరిధిలో అరవైమందిని ఎంచుకుంటున్నప్పుడు, అవన్నీ మెచ్చుకోదగ్గ స్థాయిలో ఉంటాయని ఆశిస్తాం. నామటుకు నాకు ఆ స్థాయిలో లేవు అనిపించిన కథలు రెండు – కొడవటిగంటి సుబ్బయ్యగారి ఏప్రిల్ ఫూల్, వెంకటి నాగభూషణంగారి ఎండమావులు. మొదటికథ కాలేజీ అబ్బాయిల చిలిపి చేష్టలు. మామూలుగా ఇలాటికథలు స్కూలు పత్రికలలో చూస్తాం. బహుశా శివశంకరశాస్త్రిగారు హాస్యోద్దీపకసన్నివేశం గల కథ అన్నది ఈ కథనేమో కానీ నాఅభిప్రాయంలో ఆ రోజుల్లో ఇంతకంటే ఎక్కవ హాస్యరసస్ఫోరకమైన కథలు వచ్చేయి. ఎండమావులు కథలో చుక్కలే చుక్కలు! ఆ చుక్కలమధ్య పదాలు వెతుక్కుని వాక్యం కూర్చుకుని చదవాలి అనిపించింది. ఈ రెండు కథలూ కూడా మిగతా కథలతో పోలిస్తే పేలవంగానే ఉన్నాయి. మల్లాది రామకృష్ణ శాస్త్రిగారి కామకోటి కథలో కూడా చుక్కలు ఎక్కువే. నిజానికి ఆయన కథల్లో చమత్కారంతో కూడిన మెరుపులు ఎక్కువే గానీ ఇలా ఇన్ని చుక్కలు చూసినట్టు నాకు జ్ఞాపకం లేదు. ఈకథలు చదవకండి అని చెప్పడం లేదు నేను. ఈ కథలని మెచ్చుకునే పాఠకులు ఉండే ఉంటారు. శివశంకరశాస్త్రిగారు ఎంచుకున్నారు కదా.

సంకలనం చివరలో రచయితలగురించి ఇచ్చినవివరాలు చేర్చడం బాగుంది. అలాగే ఈ కథలు ఎప్పుడు ఎక్కడ ప్రచురించేరో కూడ చెప్పి ఉంటే బాగుండేది.

ఇప్పటికే చాలా వ్యాసం పెద్దదయిపోయింది కనక చెప్పడం లేదు కానీ ఇతర కథలు కూడా ఆయా రచయితల ప్రత్యేక శైలిని ఎత్తి చూపుతూ, పాఠకులని అలరించేలా ఉన్నాయి. చిన్నకథలయందు ఆసక్తి గలవారు తప్పక ఈ సంకలనాన్ని ఆదరించగలరనే నాఅభిప్రాయం.

కథాసంకలనం  కథాలహరి పిడియఫ్

(ఫిబ్రవరి 1 Digital Library of India సౌజన్యంతో,9, 2014)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

2 thoughts on “కథాలహరి (సంకలనం)”

  1. పింగుబ్యాకు: వీక్షణం-72 | పుస్తకం
  2. మీరు చెప్పిన కథాసంకలనంలో చేర్చిన కథారచయితలు చాలామంది పేరెన్నిక కన్నవారే.ఇప్పటివారికి అంతగా తెలియకపోవచ్చును.ఏ సంకలనంలోనైనా అన్ని రచనలూ (కథలుగాని ,కవితలు గాని) ఉత్తమంగా ఉండవు.పీఠికలో రాసినట్లు కథ,కథానిక మనం పాశ్చాత్యుల దగ్గరినుంచి అరువు తెచ్చుకున్నదికాదు.మొదటి నుంచి మన సారస్వతంలో ఉన్నదే.ఐతే ఆధునిక కాలంలో format మారివుండవచ్చును.

    మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.