కె.యన్. కేసరిగారి చిన్ననాటి ముచ్చట్లు

కె.యన్. కేసరిగా సుప్రసిద్ధులయిన కోట నరసింహంగారి(1875-1953) పేరు వినగానే చాలామందికి గుర్తుకొచ్చేది కేసరికుటీరం, గృహలక్ష్మి స్వర్ణకంకణం. 1952కి పూర్వం గృహలక్ష్మి, ఆంధ్రజ్యోతి మాస పత్రికలలో ధారావాహికంగా ప్రచురించిన వ్యాసాలు ఈ పుస్తకంగా 1953లో ప్రచురించేరు. మళ్లీ 1989 నవంబరునుంచి 1991 జులైదాకా జగతిలో ప్రచురించేరుట. కేసరికుటీరం శతజయంతి సందర్బంగా 1999లో ప్రచరించిన రెండవ ముద్రణ ఈ చిన్ననాటి ముచ్చట్లు.

రచయిత ఈ పుస్తకాన్ని చిన్ననాటి ముచ్చట్లు అన్నారు కానీ ఇది వారి చిన్ననాటి ముచ్చట్లకే పరిమితం కాలేదు. తమ 73 ఏళ్ళ జీవితశేషాలూ ఉన్నాయి ఇందులో. స్వగ్రామం ఒంగోలు తాలూకాలోని ఇనమనమెళ్ళూరు. కేసరిగారి 5వ ఏట తండ్రి మరణించారు. ఆయనా, తల్లీ ఉదరపోషణార్థం చాలా కష్టపడవలసివచ్చింది. తాను విస్తరాకులు కుట్టడం, తల్లి రవికెలు కుట్టడంవంటి పనులు చేసేవారుట పూట గడవడానికి. ఆయన ఆనాటి జీవితం వర్ణిస్తుంటే, వాటితోపాటు ఇప్పుడు మనకి తెలీని కొత్తవిషయాలు ఎన్నో తెలుస్తాయి. ఉదాహరణకి –  పొలాల్లో రైతులు కందిమొక్కలు నరికేసినతరవాత మొండికొసళ్ళతో దుంపలు భూమిలో వదిలేస్తారు. అవి మళ్లీ విత్తు నాటడానికి ఆటంకమే అయినా తామై తవ్వకానికి పూనుకునేవారు కారు. ఊళ్లో ఆడవాళ్ళు వెళ్ళి అవి తవ్వుకుంటాం అంటే రైతులు తవ్వుకోనిచ్చేవారు. కేసరిగారి తల్లి కూడా వెళ్ళి ఆ దుంపలు తవ్వి తెచ్చి ఎండబెట్టి పొయ్యిలో వంటచెరుకుగా వాడుకునేవారుట. ఇలా ఏవో దుంపలు వంట చెరుకుగా ఉపయోగపడతాయని నాకు ఇది చదివేకే తెలిసింది.

తల్లి అవస్థలు చూడలేక, కేసరిగారు 11వ ఏట బయల్దేరి కాలినడకన మద్రాసు చేరుకున్నారు. అక్కడ అనేక కష్టనష్టాలకోర్చి, చదువుకుని, సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులుగా జీవితం కొనసాగించారు. స్కూల్లో చదువుకుంటున్నరోజులలోనే కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడం ఆయనకి అలవడింది. అనేక సంఘసేవా కార్యక్రమాలు చేపట్టారు. పదవీ విరమణ తరవాత వారు దేశయాత్ర చేసేరు. అంచేత ఈ పుస్తకం వారి పూర్తి జీవిత చరిత్ర అనే అనాలి.

కేసరిగారు వైద్యంలోనూ, సాంఘికసంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంలోనూ మాత్రమే కాక, కథ చెప్పడంలో కూడా సిద్ధహస్తులే అనిపిస్తుంది ఈ ముచ్చట్లు చదువుతుంటే. నొప్పి కలిగించే సంగతులు చెప్తున్నప్పుడు కూడా హాస్యరసం గుప్పించడానికి అవకాశం ఉంటే వదిలుకోరు ఆయన. ధర్మరాజువంటి మేనమామ ఎదురింట్లో ఉన్నారు కానీ భార్య గయ్యాళిగంప అవడంమూలాన ఆయన ఏమీ సహాయం చేయలేకుండిరిట. ఆ అత్తగారు “ఎవరినైనా తిట్టదలుచుకుంటే తిట్టిన తిట్టు తిట్టకుండా రెండు మూడు గంటలకాలము తిట్టగల శక్తి ఆమెకు గలదు” అంటారు!

కేసరిగారి హాస్యచతురత మరో మెట్టు పైన ఉంది వారు మద్రాసులో ఉండగా “అరవ గృహలక్ష్మి”  “తెలుగు గృహలక్ష్మి” (ఈరెండు పేర్లు, అరవతల్లి, తెలుగుతల్లి ఆయన వాడిన పదాలే) ఆచరణలో పెట్టే ఆచారవ్యవహారాలు  వరసగా వర్ణించినప్పుడు. ఈ భాగం చదువుతుంటే, నేను నవ్వి నవ్వి, కళ్ళనీళ్ళొచ్చి, అరనిముషం ఆగి, ఆ తడి ఆరేక మిగతాది చదివేను. అరవ గృహలక్ష్మి(పు. 37-42) యిల్లు శుభ్రంగా ఉంచుకుంటుంది. వస్తువులు పొదుపుగా వాడుకుంటుంది. వంటకాలు ఆరోగ్యకరమైనవి. అరవవారి అలవాట్లూ, ఆచారాలూ ఎన్నో తెలుస్తాయిక్కడ. తరవాత తెలుగు గృహలక్ష్మి (పు. 43-50) విషయం ఆయన సీదాగా చెప్పుకుపోతున్నట్టే కనిపిస్తుంది కానీ ఆ విషయాలు  పట్టలేనంత నవ్వు తెప్పిస్తాయి. తెలుగు వంటకాలు వర్ణస్తుంటే ముందు కొంచెం నవ్వుకుని తరవాత కొంచెంసేపు బాధ పడ్డాను. ఎందుకంటే నా వంటా, తిండీ కూడా అలాగే ఉంటాయి మరి! తలస్నానాలు, గిన్నెలు తోమడానికి ఉపయోగించే వస్తుసంచయం, భోజనాలయినతరవాత ఎవరేం చేస్తున్నారు – ఇలా సాధారణంగా మగవాళ్ళు పట్టించుకోరు అనుకున్నవన్నీ కేసరిగారు విపులంగా వర్ణించేరు. కావేరీతీరవాసులు చన్నీళ్ళతో స్నానం చేస్తారు. అంచేత జుత్తు మృదువుగా నిగనిగలాడుతూ ఉంటుంది. తెలుగు తల్లులు అత్యుష్ణము అయిన కుంకుడుకాయ నురుగు వాడడంచేత తల వెంట్రుకలు వరిగడ్డివలె గరగరనుండును అంటారు. ఆయన ఆడవాళ్ళనీ, వంటింట్లో వారిచేతలనీ అంత సూక్ష్మంగా పరిశీలించడం నాకు ఆశ్చర్యమనిపించింది. మాయింట్లో మగవారికి గరిటేదో గిన్నేదో తెలిసేది కాదు ఆరోజుల్లో -:).

అలాగే అరవవారు తెలుగు నేర్చుకోడం కూడా. అరవలాయర్లు తెలుగు లాయర్లకంటే త్వరగా వృద్ధిలోకి రావడానికి కారణం ఆ లాయర్లూ, వారి భార్యలూ కూడా తెలుగు నేర్చుకుని తెలుగు వాళ్ళవ్యాజ్యాలు తేలిగ్గా సంపాదించుకోడం. మొత్తమ్మీద కేసరిగారు అనేక విషయాల్లో అరవవారిపద్ధతులు మెచ్చుకుంటారు. తమ పనులు సాధించుకోడంలో వారికి వారే సాటి అంటారు. నిజమేనేమో కూడా. తమిళులయి పుట్టి తెలుగుభాషకి అపారమైన సేవ చేసినవారు అప్పుడే కాదు ఇప్పటికీ ఉన్నారు కదా మరి.

మద్రాసులో వివిధ కట్టడాలు, వీధులపేర్లు, నీటి ఎద్దడి, నీటికరువుమూలంగా 1779లో కలరా వ్యాపించడం, జననష్టంలాటి చారిత్రకవిషయాలు, అద్దెఇళ్ళలో మృతి చెందితే, వారి కుటుంబం కర్మ చేయడానికి పడే అగచాట్లువంటివిషయాలు ఎన్నో ఉన్నాయి ఈ పుస్తకంలో. వ్యక్తగతస్థాయిలో బీద విద్యార్థులు భుక్తికోసం, వాసంకోసం పడే అవస్థలు, వారిని ఆదుకునే ఉదారులు, తిండి పెట్టే తల్లులు – ఇవన్నీ మనసున నాటుకునేలా చెప్పేరు కేసరిగారు. అలా తనకి భోజనం పెట్టిన తల్లులు, భుక్తికోసం తనతల్లి పడిన బాధలూ కారణం ఆయన స్త్రీ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడానికి అన్నారు. అలాగే అనారోగ్యంతో బాధ పడే స్త్రీలు, నాటు వైద్యం పేరుతో వారిని  కుటుంబసభ్యులు, ఊళ్లో జనం పెట్టే హింసలూ చూసి కేసరి కుటీరం ప్రారంభించి మందులు తయారు చేసి వైద్యం చెయ్యడం ప్రారంభించేరుట. ఆయన మొదట్లో ఇచ్చిన మందులు కూడా ఏవో మూలికలు నూరి తయారు చేసినవే అంటే మరి అవి శాస్త్రీయమేనా అన్నది నాకు స్పష్టంగా అర్థం కాలేదు.

కేసరిగారి వైద్యవిద్య సాంప్రదాయకపద్ధతిలో సాగనూ లేదు, తేలిగ్గానూ పూర్తి కాలేదు. ఆరోజుల్లో మద్రాసులో ఆయుర్వేదం నేర్పే కళాశాలలు లేవుట. వైద్యం చేస్తున్నవారిదగ్గర చేరి, వారికి సేవలు చేస్తూ వైద్యం నేర్చుకున్నారు. మొదట ఒకరిదగ్గర చేరి, అక్కడ వెట్టి చాకిరీయే తప్ప నేర్చుకునేదేమీ లేదని తెలుసుకుని వారిని వదిలేసి, మరొకరిదగ్గర చేరేవారుట. ఆ అనుభవాలు చదువుతుంటే వారికి ఆ వైద్యవిద్యయందు గల పట్టుదల విశదమవుతుంది. తరవాత కేసరి కుటీరం ప్రారంభించడం, అందులో ఒడిదుకులు, స్నేహంగా దగ్గర చేరి, కేసరిపేరు వాడుకుని దొంగమందులు అమ్ముకోడం, ఎదుర్కొని, కోర్టుకి కూడా ఎక్కి, తమ పేరు నిలుపుకుని జీవితాన్ని సార్థకం చేసుకున్నారు. కేసరి కుటీరం వివరాలు బాగానే ఉన్నాయి కానీ 1928లో  గృహలక్ష్మి పత్రిక ప్రారంభించడం, స్వర్ణ కంకణం స్థాపనకి సంబంధించిన వివరాలు అట్టే లేవు. గృహలక్ష్మి 1928లో ప్రారంభించడం, కనుపర్తి వరలక్ష్మమ్మగారు సంపాదకవర్గంలో ఉండడం, 1934లో స్వర్ణ కంకణం అందుకున్న తొలిమహిళ ఆమెయే కావడం వంటి విషయాలు కేసరిగారు వివరంగా చర్చించి ఉంటే బాగుండేదనిపించింది.

మద్రాసునించి ఇనమనమెళ్ళూరు పడవలో వెళ్తున్నప్పుడు వంటలూ, పాటలు సరదాగా ఉన్నాయి.

తరవాతికాలంలో ఆయన దేశాటనం వివరాలు ఎక్కువగానే ఉన్నాయి. కొన్ని చోట్ల ఆయన ఊరు తరవాత ఊరు చెప్పుకుపోతుంటే, నాకు చిన్ననాడు రైలుప్రయాణంలో స్టేషను తరవాత స్టేషను చూస్తూ కూర్చున్న దృశ్యం పొడగట్టింది, ఒక స్టేషనుకీ మరో స్టేషనుకీ అట్టే తేడా ఉండదు, ఏ ఒక్కటీ ప్రత్యేకంగా మనసున గట్టిగా నాటదు. కొన్ని స్టేషనులు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.

కేసరిగారు వర్ణించిన కోటప్ప కొండ, అక్కడ సంబరాలు, ఎద్దులపొంకం, ముచ్చటగానూ, విజ్ఞానదాయకంగానూ ఉన్నాయి. ఆ ఎద్దులకి రైతులు చేసే అలంకరణలు, పెట్టే ఆహారం చదివి తీరాలి. ఆ ఎద్దులు అలంకారాలతో వయ్యారాలు పోతూ పెళ్ళి కొడుకులా నడుస్తుంటే కన్నులపండువగా ఉండునుట.  అవి వేయు రంకెలు శంఖారావమువలె శ్రావ్యముగా ఉండునుట. “సంగీతశాస్త్రమునందు ఈ రంకెనే రెండవదియగు ‘రి’ అని నిర్ణయించిరి. ఈ స్వరముచే వీరరసము, అద్భుతరసము, రౌద్రరసము వెల్లడి యగునని చెప్పబడినది,” అంటారు. ఈ ప్రాంతాలలో స్త్రీలు మంచి అంగసౌష్ఠవంతో, స్వాతంత్రప్రవృత్తులై, దైర్యసాహసాలతో ఉంటారుట. స్థానికంగా చెప్పుకునే ఒక కథ – సంబరాలసమయంలో పోలీసులు వచ్చి ఎద్దుమీద తుపాకి పేలిస్తే, ఒక “రెడ్డి సోదరి కోక విరిచికట్టి, గండ్రగొడ్డలి చేతబట్టి ముందుకురికింది”ట. అలాగే కేరళ. కేరళ స్థలపురాణం – ఎలా ఏర్పడిందో చెప్పి, ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకంటే ఎంత భిన్నమో చాలా విపులంగా వర్ణించేరు. అక్కడ కూడా స్త్రీలు స్వతంత్రప్రతిపత్రి కలిగి ఎన్నో విషయాల్లో ఎంతో ముందు ఉన్నారని సోపపత్తికంగా ఋజువు, సాక్ష్యాలతో చెప్పేరు.

ఆనాటి సంగీతం, నాటకరంగాలు, లలితకళలు – వీటిల్లో తమకి గల ఆసక్తిని వెల్లడిస్తూ, ఆయా రంగాల్లో ప్రముఖులగురించి చదువుతుంటే ఈనాటికీ మనందరికీ తెలిసిన పేర్లు కొన్ని, ఏనాడూ వినని పేర్లు కొన్ని – తెలిశాయి. నాటకాలగురించి రాస్తూ, ఒక ఆచారంగురించి చెప్పేరు. సత్యభామ వేషధారి తెరవెనకనుండి జడ ముందుకు వేసి, సభలో ఎవరైన భాగవతవిషయమై ప్రశ్న అడిగితే జవాబు చెప్పగలనని సవాలు చేస్తుందిట. భాగవతమే కాదు సకలశాస్త్రములను తెలిసినదై యుండును అన్నారు. ఆయుర్వేదరీత్యా పిండోత్పత్తిమొదలు శిశుపోషణ వంటి విషయాలు, నాయికానాయకులక్షణాలు, ఇలా ఒకటిరెండు రాత్రిళ్ళు ఉపన్యసిస్తారుట. బోగంవారు విదుషీమణులని మనం వింటూనే ఉన్నాం.  వెనకటి రోజుల్లో రంగాజమ్మ, ఆధునికయుగంలో వీణ ధనమ్మ, బెంగుళూరు నాగరత్నమ్మవంటివారి పేర్లు అప్పుడప్పుడు వింటాం. ఇంకా వినని పేర్లు ఎన్నో ఉండవచ్చు. ఈ విషయంలో శాఖాచంక్రమణమే అయినా నాఅభిప్రాయం మరొకసారి ఇక్కడ చెప్పాలనిపిస్తోంది. మనసంఘంలో ఒక తరగతి స్త్రీలని ఎంతగా చర్చకి పెట్టేరో, ఎందుకు పెట్టవలసివచ్చిందో అని ఆలోచించినప్పుడు తోచిన ఆలోచన – వీరేశలింగంగారు వేశ్యలని కులకాంతలుగా చేయడానికి ప్రయత్నిస్తే, చలం కులకాంతలని వేశ్యలుగా మార్చేరు. లత మాత్రమే వేశ్యలని మామూలు మనుషులుగా చిత్రించేరు. ఇప్పుడు మళ్ళీ కేసరిగారు వేశ్యలని విదుషీమణులుగా, కళాస్రష్టలుగా ఎత్తి చూపించేరు. చారిత్రకంగా వరస – వీరేశలింగం, కేసరి, చలం, లత!

ఇతర వివరాలు – కేసరిగారి మొదటిభార్యకి పిల్లలు లేరు. చాలాకాలం అనారోగ్యంతో బాధ పడుతూ ఉండేది. ఆయన 43వ యేట ద్వితీయవివాహం చేసుకున్నారు కేరళయువతి అయిన మాధవిగారిని. ఆమె వైద్యవృత్తికి సంబంధించిన విషయాల్లో నిపుణురాలు. కేసరి కుటీరం నడపడంలో చాలా సాయపడ్డారు. వారికి ఒక కూతురు, పేరు శారదాదేవి. ఆ తరవాత మైసూరులో ఉండగా “చాముండేశ్వరి మాకు మరొక కుమార్తెను ప్రసాదించినది, ఆమె పేరు వసంతకుమారి,” అని రాసేరు. ఈ రెండవ అమ్మాయి పెంపకం అని బ్లాగరు ramv అన్నారు కానీ పైవాక్యంలో అది స్పష్టం కావడంలేదు. ప్రత్యేకించి నాకు ఈ సందేహం కలగడానికి కారణం, ఇంకా కొందరు బాలబాలికలను చేరదీసి, చదువు చెప్పించి, వాళ్ళకో దారి చూపించేరు. వారెవరినీ ఇలా కూతరు, కొడుకు అనలేదు.

కేసరిగారు మరణించిన తరవాత, రెండవ అమ్మాయి వసంతా మీనన్ అన్నపేరుతో ఈ చిన్ననాటి ముచ్చట్లు పుస్తకాన్ని ఇంగ్లీషులోకి అనువదించిందని శ్రీరాంవి. తమ బ్లాగులో రాసేరు. లింకు  http://sriramv.wordpress.com/2008/03/29/dr-kn-kesari-a-profile/#comment-9555.

ఆ టపాలోనే మరొక విషయం – ఈ అనువాదం వసంతా మీనన్ అనువదించగా, వారి మనుమడు కె. బాలకేసరి (శారదాదేవి  రెండవ కుమారుడు) ఎడిట్ చేసేరుట. ఈ ఎడిటింగులోనూ, తరవాత ప్రచురణ వివరాల్లోనూ నాకు కొంత అయోమయం కనిపిస్తోంది. ఈ ఎడిటింగ్ విషయంలో వి.ఎ.కె. రంగారావు శ్రీరాంవి. గారికి చెప్పిన మాట ఏమిటంటే – కేసరిగారు తమ పుస్తకంలో వెలిబుచ్చిన అభిప్రాయములు ఆయనరోజులలో అంగీకారమే అయినా ప్రస్తుతకాలంలో తగనివి అని కొన్ని భాగాలు బాలకేసరి ఎడిట్ చేసేరని. ఈ ఎడిటింగ్ 1970లో రెండవ ముద్రణలో చేసేరు అని కూడా అన్నారు.

నేను ఈవ్యాసానికి ఉపయోగించుకున్న కాపీ రెండవ ముద్రణ 1999లో ప్రచురించినట్టు లోపలి టైటిలుపేజీ వెనకవేపు ఉంది. ఇందులో 1970 నాటి ముద్రణ ప్రస్తావన లేదు.

మరొక ముఖ్యమైన విషయం – నాఅభిప్రాయంలో ఇలా ఎడిట్ చేయడం ఉచితమూ కాదు, న్యాయమూ కాదు. మనం పూర్వకాలపు రచనలు చదవడానికి ముఖ్యమైన ఒక కారణం ఆనాటి భావజాలం తెలుసుకోడంకోసం. ఎడిటర్లు తమ అభిప్రాయాలని వెలిబుచ్చుతూ విస్తృతమైన సంపాదకీయమో పీఠికో రాయవచ్చు. కానీ పుస్తకంలో అభిప్రాయాలు ఈనాటిపాఠకులకి రుచించవని చెప్పి మార్చడం తగదు. అలా చేస్తే ఆ మూలగ్రంథానికున్న  విలువ తరిగిపోతుంది. మూలగ్రంథకర్తకి అన్యాయం చేసినట్టు అవుతుంది. ఇది అనువాదాలవిషయంలో మరీ ఘోరం. ఎందుకంటే, మూలభాష తెలియనివారు చదువుతారు కనక, వారు అదే వేదం అనుకుంటారు. అసలువిషయం అడుగున పడిపోతుంది.

కేసరిగారి జీవితమూ, సాంఘికసేవావిశేషాలు ఇంగ్లీషు వికిపిడియాలో ఉన్నాయి. ఇంగ్లీషు విభానికి లింకు http://en.wikipedia.org/wiki/K._N._Kesari. తెలుగువిభాగంలో లేవు.

తెలుగు పుస్తకం  archiv.org లో ఉంది. లింకు ఇక్కడ

కేసరి గారి మరో పుస్తకం తులసి, ఆరోగ్యరీత్యా తులసి ప్రాశస్త్యంగురించి కేసరిగారు విపులంగా చర్చించిన పుస్తకం.  లింకు  https://archive.org/details/tulasi00kesasher.

(ఫిబ్రవరి 27, 2014)

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

5 thoughts on “కె.యన్. కేసరిగారి చిన్ననాటి ముచ్చట్లు”

 1. పింగుబ్యాకు: వీక్షణం-73 | పుస్తకం
 2. సారీ! నేను పై వ్యాఖ్యలో ఉన్నికృష్ణన్ రాయబోయి హరిహరన్ అని రాశానండి. అయితే నేనిచ్చిన లింక్ ఉన్నికృష్ణన్‌దే. అయితే ఉన్నికృష్ణన్ మునిమనవడేనని మీద్వారా తెలుస్తోంది. నేను ఇంతకుముందు కర్ణాకర్ణిగా విన్నాను….ఉన్నికృష్ణన్ కేసరిగారి మనవడు అని. ఇప్పుడు మునిమనవడని తెలిసింది.

  మెచ్చుకోండి

 3. తేజస్విగారూ, కేసరిగారికి ఇద్దరు కుమార్తెలు – శారదాదేవి, వసంతకుమారి (వసంత మీనన్). శారదాదేవిగారి సంతానం – పెద్ద కుమారుడు రాధాకృష్ణుడు, రెండవకుమారుడు బాలకేసరి, మూడవకుమార్తె మధుమాధవి, చిన్నకుమారుడు జయచంద్రుడు అని ఈ చిన్ననాటి ముచ్చట్లు పుస్తకంలో ఉంది. రాధాకృష్ణన్ గారి కుమారుడు హరిహరన్ అయితే మునిమనుమడు కదా.

  మెచ్చుకోండి

 4. మాలతిగారూ! ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు, సినీ గాయకుడు హరిహరన్ కేసరిగారి మనవడే. అతని తల్లిదండ్రలు హరిణి, రాధాకృష్ణన్. మరి కేసరిగారి కుమారుడి కుమారుడో, కుమార్తె కుమారుడో తెలియదు.
  ఈ లింక్ చూడండి – http://en.wikipedia.org/wiki/Unnikrishnan

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: