ఊసుపోక – ఎవరీమె?

(ఎన్నెమ్మకతలు 135)

­­­­­­రాయడానికింకేం లేదు అనుకున్నప్పుడల్లా కొత్తవిషయం కళ్లముందుకొస్తుంది. స్వర్ణకంకణము గురించి రాసేసింతరవాత సర్వేజనాః సుఖినో భవంతు అనుకుని, పడుకున్నాను. నిద్ర పట్టలేదు. అదే ఒక హెచ్చరికగా గుర్తించి, తెలుగు వికిపీడియాలో ఏముందోనని తవ్వకం మొదలు పెట్టేను. అవును. తవ్వకాలరాణి వేరే ఉంది కానీ ఈమధ్య ఆవిడ చాలా చాలా బిజీ అయిపోడంచేత తాత్కాలికంగా నేనే చేపట్టేను తవ్వకాలఉద్యమం.

డిజిటల్ లైబ్రరీవారు కినుక వహించేరో, కునుకు తీస్తున్నారో కానీ నాకు మాత్రం ఏ పుస్తకం తీయబోయినా ఒల్లను గాక ఒల్లనంటోంది. మోహనరావుగారిచ్చిన కిటుకు కూడా పని చెయ్యలేదు. బహుశా అది నాలాపుటాపు లోపము కానోపు.

సరే, పోనాంపోచ్ అనుకుని తెలుగు వికిపీడియామీద పడ్డాను. రచయిత్రుల సమాచారం చూస్తే, వస్త్రం సమర్పయామి అని అక్షతలు చల్లినట్టు నామమాత్రంగా ఓ పాతిక పేర్లున్నాయి. నాకు తెలిసినవాళ్ళే వందమంది దాకా ఉన్నారు. ఆమధ్య ఎవర్నో అడిగితే 300 వందలదాకా ఉంటారన్నారు. ఇంకా వాళ్ళకి తెలీనివాళ్ళు బ్లాగుల్లోనూ, హైదరాబాదులో మహా రచయిత్రులకళ్ళముందు తచ్చాడుతూ తమపేర్లు పేపర్లలోనూ, ఉపన్యాసాలలోనూ ఎక్కించుకోలేనివారూ మరో వందమందయినా ఉంటారు.

ఇవన్నీ ఆలోచించి కళ్ళు పొడుచుకు చూసేను. ఓ మోస్తరు పేరు తెచ్చుకున్న రచయిత్రులు లేరు. నేను కని విని ఎరుగని పేర్లు కొన్ని ఉన్నాయి. అందులో ఆశ్చర్యం లేదులే. గత 30 ఏళ్లలో ప్రచురింపబడి బహు బహుమతులు పొందిన ఆధునిక కథలు చదవలేదు కనక నాకు తెలీనివారుండడంలో విచిత్రం లేదు. కానీ అంతో ఇంతో పేరు తెచ్చుకున్నవారిపేర్లు లేవు. దాంతో నాకు ఎక్కళ్ళేని హుషారు పుట్టుకొచ్చి, వాళ్లందరిమీదా రాసేయబోయి, ముందు అక్కడ ఎవరిగురించి ఏ సమాచారం ఇచ్చేరో చూదాం అని ఒకొక పేరుమీద క్లికు చేసేను. అట్టి నాపరిశోధనలో నేను గ్రహించిన బ్రహ్మరహస్యం కె. రామలక్ష్మి అను రచయిత్రిగురించి.

ప్రముఖ రచయిత, అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు అయిన ఆరుద్ర అర్దాంగి మరియు రచయిత్రి.

హెచ్చరిక. నేను వికిపిడియావారికృషిని కించపరిచే ఉద్దేశంతో రాయలేదిది. వారందరూ ఉచితంగా తమసమయం వెచ్చించి సాంకేతికవిజ్ఞానం ఉపయోగించి సాహిత్యసేవ చేస్తున్నారు. అలాటి మహోన్నతకృషిలో వేలు పెట్టదలుచుకున్నవారు కూడా ఆ బాధ్యతని బాధ్యతగానే తీసుకోవాలి కదా అని. పై వాక్యంలో రచయిత్రిగురించి రచయిత్రిగా తెలిసింది ఏముంది?

సరే, వికిపిడియావారితో సంప్రదించి, ఆ భాగం నేను మార్చేను. ఇప్పుడు మీకు రామలక్ష్మి ఎవరో, ఆమె కృషి ఏమిటో కొంతలో కొంతయినా తెలిసే అవకాశం ఉందని నేను గట్టిగా నమ్ముతున్నాను.

ఇప్పుడు అసలు విషయానికొస్తాను. మనకి ఈ చుట్టరికాలద్వారా, బీరకాయ పీచయినా సరే, ఒక మనిషి అస్తిత్వాన్ని నిర్ణయించుకోడం సంప్రదాయం. గోటేటివారి కోడలు, వంకలపల్లివారి చిన్నవాడు, సుబ్బమ్మగారి అల్లుడు, సీతమ్మమొగుడు, చంద్రన్నగారి పెళ్లాం – ఇలా చెప్పుకోడంలో మనకి ఘనత. ఎందుకంటే మనకి మనిషికంటె వంశం ఎక్కువ. కుర్రవాడు పెద్ద ఉద్యోగం చేసి ఊళ్ళో వంశానికి వన్నె తెస్తాడు. కుర్రది అలాటి కొడుకుని కని వంశం నిలబెట్టడానికి దోహదకారి అవుతుంది. అంతే గానీ నేనింత చేసేనన్న గర్వం మనవాళ్ళమధ్య జరగదు. అచ్చిరాదు. అలా అన్నవాడు అహంకారి. రౌరవాది నరకాల పడిపోతాడేమో కూడా, నాకు ఖచ్చితంగా తెలీదు.

నాకు సాహితీమిత్రులు ఎదురుపడితే, నేను రాసినవో, వారు చదివినవో మాటాడతారనుకుంటాను. కానీ పదిమంది చేరినచోట కనీసం నలుగురైనా ఉంటారు మీవారిని ఇక్కడ చూసేం అనో అక్కడ చూసేం అనో చెప్పేవాళ్ళు, అక్కడికి వీళ్ళని నేను కలుసుకోడం ఆయనగారి ఆరాలు తియ్యడానికే అయినట్టు. అమ్మలారా, అయ్యలారా (అవునండీ, మగవారు కూడా ఉన్నారు ఇలా అనేవారు), నాకు ఆ విషయాలలో ఆసక్తి లేదన్నా సరే. అది కాదండీ అంటూ పొడిగించేవారున్నారంటే, మన సంప్రదాయం ఎంత పటిష్టమో ఊహించుకోండి.

కేవలం రక్త సంబంధాలే ఉండఖ్ఖర్లేదు. ఊరువాడు, పొరుగువాడు, తాతగారి తోడల్లుడి బావమరిదిదగ్గర పని చేసినవాడు, మేనగోడలి క్లాస్మేటు, వేలువిడిచిన తోడికోడలి ఫ్లాటుమేటు – ఇలా ఏదో రకం మనవాడే అని నిరూపించేస్తాం, అవసరమయినప్పుడు మాత్రమే. అయ్యా, అమ్మా, గట్టిగా నోటు చేసుకోండి, దయచేసి. అవసరమైతేనే!! అన్న పదం. ఈ సిద్ధాంతానికి ప్రత్యామ్యాయ సిద్దాంతం – అవుసరం తీరిపోయిన వెనక, తోబుట్టువు కూడా ఎవరీమె? అనే స్థితికొచ్చేస్తుంది. పాత సామెత – అడవిలో అబ్బా అంటే ఎవరికి పుట్టేవురా కుర్రాడా అని. అప్పుడు వీరెవరూ మనం గుర్తుండం.

ఈమధ్య నాపేరు అంతర్జాలంలో విస్తృతంగానే కనిపిస్తోంది కనక నేను ప్రముఖ వాటెవర్ అనే అనుకోవాలి. నాకు ఒకొకప్పుడు వచ్చే టపాలు చూస్తే అలా అనిపిస్తుంది. :p.

(మార్చి 7, 2014)

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.