మల్లాది వసుంధరగారినవల నరమేధము

నరమేధము నవలలో ప్రధానాంశం విష్ణుకుండినరాజయిన మాధవవర్మ అనేక యజ్ఞయాగాదుల చేసినతరవాత  నరమేధము తలపెట్టడము. ఈ నరమేధము రెండు స్థాయిలలో జరుగుతుంది ఈ కథలో.

యజ్ఞసన్నాహాలతో ప్రారంభించిన ఈ నవలలో ఆద్యంతాలా ఈ నరమేధం ఎందుకు అన్న ప్రశ్న తల ఎత్తుతూనే ఉంటుంది. విష్ణుకుండినులు శౌర్యశీలురు. వేదధర్మనిష్టాతులు. రాజసూయాశ్వమేధాధి యజ్ఞములు ఎన్నో చేసినవారు. అన్ని చేసినతరవాత, తమరాజ్యంలో ప్రజలు సుఖంగా ఉన్నప్పుడు, మళ్ళీ మరొక యజ్ఞం, నరబలి కోరే యజ్ఞం తలపెట్టడం ఎందుకు అన్న ప్రశ్నకి నిజంగా సమాధానం లేదు.   

“అన్ని యజ్ఞములతీరు వేరు, ఈ మహాయజ్ఞముతీరు వేరు” అంటారు కథకులు. ఈ యజ్ఞమునకు నియమములు ఎక్కువ. ఇక్కడ “యజ్ఞపశువుగా మానవుడు వరణీయుడు. యజ్ఞపశువు కాదగినవటుడు కొన్ని విశిష్టలక్షణములు కలిగి పరిపూర్ణారోగ్యవంతుడై, విద్యావంతుడై, యజ్ఞయాగాది క్రతువులందు ఆదృతి కలవాడై, యజ్ఞపశువగుటకు తానై సమ్మతించవలెను” (పు.8).

మహరాజే స్వయంగా వెళ్ళి తనకోరికమేరకు యజ్ఞదత్తశర్మని నరమేధంకోసం తనతో పంపమని ఆ పిల్లవాడి తండ్రి నరసింహశర్మని కోరినప్పుడు మళ్ళీ ఆ ప్రశ్న వస్తుంది. నరమేధం ఎందుకు చెయ్యడం? అంటే చరిత్రలో నరమేధము చేసిన రాజులు ఉన్నారు.  హరిశ్చంద్రుడు నరమేధము చేసేడు కదా. కానీ ఆ నరవధ జరగబోయేముందు విశ్వామిత్రుడు కలగజేసుకుని, శునశ్శేఫుడికి వరుణమంత్రం ఉపదేశించి, ఆయనకుమారుని ప్రాణాలు నిలబెడతాడు. అంచేత ఆ నరమేధం నరవధ లేకుండా ముగిసింది. నరసింహశర్మ అనేక విధాల రాజుని ఆ నిర్ణయంనుండి మరలించడానికి ప్రయత్నిస్తాడు. దానికోసం ఇలా తమ ఏకైక సంతానం, వృద్ధిలోకి రావలసిన బాలుడు, వృద్ధాప్యంలో తమ ఆలనా పాలనా చూడవలిసినవాడు, అతనిని యజ్ఞపశువుగా బలి చేయడం తగునా? మాధవవర్మ మహరాజు ఇవ్వగల ధనకనకవస్తువాహనములు వారికి అవుసరం లేదు. వారిజీవికకు సరిపడు మాన్యములు వారికి ఉన్నాయి. (పు. 15).

మాధవవర్మ వాదం – తాను ప్రభువు, తాను తలపెట్టిన కార్యం పౌరులక్షేమంకోసం. నృసింహశర్మ పాలితుడు కనక ఆ క్రతువుకు కుమారుని త్యాగం చేయడం అతనిధర్మము. అంతే కాదు, తాను బలవంతంగానైనా ఆ బాలుని తీసుకుపోవడానికి సంసిద్ధుడు, సమర్థుడు. మాధవవర్మ ఇలా ఓ పక్కన వాదిస్తున్నా, మనసులో మాత్రం మధన లేకపోలేదు. “తానీ నరమేధమునెందుకు సంకల్పించినట్లు? పూర్వులెవ్వరు జేయని దానిని తాను నిర్వహించితినను తృప్తి ననుభవించుటకా? లేక తన యాధిక్యమును వెలయించుటకా? హయమేధరజసూయాది మహాధ్వరములకన్న నిది యధికతర ఫలదాయినియైనదా? తనకే సమగ్రముగ తెలియుట లేదు,” అనుకుంటూ, ఆ సదసద్సంశయములో కొట్టుమిట్టాడుతూనే, “ఇంత జరిగినది గనుక మిగిలినది జరుగవలెను”  అని నిశ్చయించుకుంటాడు. ఈ సంశయం మహరాజుని చివరివరకూ వెన్నాడుతూనే ఉంటుంది. ఈ రెండు దృక్పథాలూ అలా ఉండగా, మానవనైజమైన మరొక కోణం కూడా కనిపిస్తుంది.  యజ్ఞదత్తశర్మని చూస్తున్నంతసేపూ మహరాజుకి  యువరాజు గోవిందవర్మ స్ఫురిస్తున్నాడు. యజ్ఞదత్తశర్మ “బాల్యము వీడుటకిష్టము లేనట్లున్న పాలు పొంగారు బుగ్గలు, నూనూగు మీసములు పొడసూపని మోము, సుదృఢమైన శరీరముతో మకరాంక మనోజ్ఞమూర్తివలె” ఉండి, గోవిందవర్మని తలపిస్తున్నాడు. తనకుమారుని తను బలి పెట్టలేడు. మరోవైపు, ఆ చిన్నవాడు “తాను ఆచరించబోయే మహాక్రతుఫలము రూపుగొని తనయెదుట సాత్కాక్షరించినట్టు” కూడా ఉన్నాడు.

ఇలా ఒక సన్నివేశాన్ని వివిధకోణాలనుండి పరామర్శించడంద్వారానూ, ఒక వ్యక్తి మనసులో తలలెత్తే వివిధ భావాలూ, విరుద్ధభావాలూ  ఆవిష్కరించడంద్వారాను కథనం విశేషంగా మూర్తిమంతమై పాఠకులలో ఉత్సుకత రేకెత్తిస్తుంది.

నరమేధము పూర్తి అయి చాలాకాలం అయినతరవాత కూడా మహరాజుకి “క్రతువు సాకల్యముగా నెరవేరినదను” తృప్తి కలుగలేదు. క్రతుసమయంలో యజ్ఞదత్తుని రూపం ఆయనమనఃఫలకంమీద చెరగని ముద్ర వేసింది. “నిరీహుడై, నిర్మముడై, అంతర్ముఖుడై, యూపస్తంభమునకు కట్టినప్పుడు ఏ విధమైన ప్రాతికూల్యమును ప్రదర్శింపక స్థిరుడై నిలిచాడే కానీ బలిపశువులా గింజుకోలేదు.” (పు. 44) ఆ బాలునితల్లి ఏడ్పులు మహరాజు శ్రవోరంధ్రముల మార్మోగుతూనే ఉన్నాయి చాలాకాలంతరవాత కూడా. అసలు ఈ యజ్ఞం ఎందుకు తలపెట్టనట్టు అని మళ్ళీ మళ్ళీ ప్రశ్నించుకుంటూనే ఉంటాడు చివరివరకూ.

మంత్రి పినాక భట్టారకునితో మరొకమారు సంప్రదిస్తాడు. “నరమేధమన్నచో మాకు స్పష్టార్థము గోచరించుట లేదు. సృష్ట్యాదినుండి సంగ్రామములు జరుగుచున్నవి. అసంఖ్యాకములుగ జనులు నిహతులగుచున్నారు. … దేవ-దానవ, రామ-రావణ, కురు-పాండవ మహాహవములనెంత నరమేధము జరిగినది! … అట్టివేళల మామనస్సున బాధాలేశము కలుగకపోగా నుత్సాహము దీపించెడిది. … కాని నాటి యధ్వరమున యజ్ఞదత్తుడు బలిపశువై మరణించుచుండ నామనస్సురలిపోయినది. … ఎంత విచారించినను మామనస్సు సమాధానము కుదురకున్నది.” (పు. 55).

భట్టారకునికి కూడా మొదట్లో ఈవిషయమై సందేహం ఉంది. ఎన్నో క్రతువులు మహరాజు చేసేరు కదా మళ్ళీ ఇదెందుకు అని ప్రశ్నిస్తాడు. కానీ ఇప్పుడు మహరాజు మళ్ళీ అదే ప్రశ్న తననే వేస్తే, జవాబు చెప్పక తప్పదు కదా. వారి పూర్వులు ఈ నరమేధము చేసి యశఃకాయులయేరని సమర్థింప చూస్తాడు. ఈ మాధవవర్మ ముత్తాతగారి తాత చేసేరు. ఇంకా ఎవరో చేసేరనే విన్నాడు. యజ్ఞాలు, యాగాలు రాజులు లోకకల్యాణార్థం చెయ్యాలి. ఏ కార్యం చేసినా అందులో తాము అభిలషించినదానితో పాటు అవాంఛనీయమైనది కూడా ఉంటుంది – ఇలా అందీ పొందని సమాధానం చెప్పి మహరాజుకి ఊరట కలిగించడానికి ప్రయత్నిస్తాడు.

మళ్ళీ మహరాజుకి ఈవిషయంలో తీవ్రమైన ఆందోళన కలిగింది యువరాజు గోవిందవర్మకి మరణశిక్ష విధించవలసినవచ్చినప్పుడు. పుత్రప్రేమతో యువరాజు ప్రాణాలు కాపాడడమా, మహరాజుగా న్యాయమైన తీర్పు ఇచ్చి ధర్మరక్షణ చేయడమామా? న్యాయంగా మరణశిక్ష విధించి, యజ్ఞదత్తశర్మ తల్లిదండ్రులు ఆనాడు పడిన క్షోభ తలుచుకుంటాడు. ఇది వారి శాపఫలమేనన్న సందేహం కలుగుతుంది. తాను నరమేధము తలపెట్టకుండ ఉండవలసిందని కూడా అనుకుంటాడు.

రాణి చంద్రమతీదేవి పుత్రశోకంతో కృంగి, కృశించి మరణించింది. కోడలు సుదర్శనాదేవికి భర్తృవియోగంతో మతి భ్రమించింది. “యజ్ఞదత్తుని బలిపశువుగ చేయకుండ నుండవలసినది. ఆ పుణ్యదంపతుల శాపములు తన కుమారునికి తగిలినవేమో” అన్న సందేహం మహరాజుని పట్టి పీడిస్తుంది. శత్రురాజులు సంకల్పించిన దండయాత్రలు మరింత కృంగదీస్తాయి ఆ మహరాజుని. రాజ్యంతే నరకమ్ ధృవమ్ అని ఆర్యోక్తి. (పు. 201).

ఇలా చివరివరకూ తాను చేపట్టిన ఒక మహత్కార్యంగురించిన సందేహాలతో మాధవవర్మ సతమతమవడం ఈ కథలో ఒక ముఖ్య భాగం.

                                                000

ఈ నరమేధంలో రెండోభాగం పల్లవరాజు మూడవ కుమారవిష్ణువు మనువరాలయిన త్రిలోచన పల్లవిని తనతరఫున విష్ణుకుండినవంశజులమీద పగ తీర్చుకోమని నియమించడం.  దక్షిణాపథంలో పల్లవరాజులు ఎదురు లేని మహారాజులు, శూరులు, బ్రాహ్మణ ప్రభువులు. వారిలో మూడవ కుమారవిష్ణువు గతంలో దక్షిణాపథమంతా గెలుచుకుని, తూర్పున విష్ణుకుండినులతో యుద్ధం చేసి, ఓటమిని అంగీకరించవలసివచ్చింది. ఆ ఓటమి ఆయనకి ఎదలో ముల్లై ఆమరణాంతం బాధించింది. వారి మనుమడు కుమారవిష్ణువు, మనుమరాలు త్రిలోచన పల్లవి.

త్రిలోచన పల్లవి వారి కులదేవత అయిన కామాక్షీదేవి అవతారము అని తాత విశ్వాసము. అంచేత త్రిలోచన పల్లవిమీద తన ఆశలన్నీ నిలుపుకుని, అన్నతో సమంగా క్షాత్రవిద్యలు నేర్పించాడు. ఇక్కడ మూడవ కుమారవిష్ణువు మనుమడిని కాదని, మనుమరాలయిన పల్లవిని  పగతీర్చుకోడానికి నియమించడం గమనార్హం. ఆవిషయం త్రిలోచన పల్లవికి స్పష్టం చేస్తాడు కూడా. “ఎచట గాంచినను స్త్రీపాత్ర నాధారము చేసికొని ప్రళయాంతకమైన యుద్ధములు సాగినవి. స్త్రీబుద్ధిః ప్రళయాంతకః అని నానుడి”. భారతంలో ద్రౌపది, రామాయణంలో కైకేయి, ఇలా ఎక్కడ చూసినా స్త్రీలే పగ సాధించడానికి మూలాధారం. ఆమె కారణజన్మురాలు. అందుకే విష్ణుకుండినవంశం నిర్వంశము చేయవలెనని, అది త్రిలోచన పల్లవే చేయాలనీ ఆయన ఆకాంక్ష( పు. 31).

ఈ కాంక్షలో కూడా మాధవవర్మ నరమేధములాగే కొంత అనుచితం ఉంది. అన్నగారయిన కుమారవిష్ణువు త్రిలోచన పల్లవితో ఆవిషయం ప్రస్తావిస్తాడు కూడా. తాతగారే విష్ణుకుండినరాజుమీదకి యుద్ధానికి వెళ్ళేరు కానీ అటునించి ఇటు కాదు. త్రిలోచన పల్లవి కూడా ఆవిషయమై మధనపడిన సమయాలున్నాయి. మాధవవర్మ నరమేధానికీ, ప్రతిజ్ఞ నేరవేర్చుకునే నెపంతో తాను తలపెట్టిన విష్ణుకుండినవంశనిర్మాలనానికీ ఏమిటి తేడా? తాను పన్నబోయే వ్యూహంలో జరగగల ప్రజానాశనం కూడా నరమేధమే కాదా? మాధవవర్మలాగే త్రిలోచన పల్లవి కూడా ఈ తర్కానికిది సమయం కాదని, విరుద్ధబావాలను పక్కన పెట్టేసి, తాను తలపెట్టిన కార్యాన్ని సాధించడమే పరమావధిగా ముందుకు సాగుతుంది. అదే చాణుక్యనీతి అని సమర్థించుకుంటుంది.

నరమేధానికి మాధవవర్మ తమని ఆహ్వానించడం తనపథకానికి అనుకూలం అయింది. క్రతుసమయంలో యజ్ఞదత్తశర్మ తల్లిదండ్రులు అనుభవించిన నరకయాతన, మాధవవర్మ కాఠిన్యమూ చూసేక అది అగ్నికి ఆజ్మమయి ప్రతిజ్ఞాపాలనాకాంక్ష మరింత బలపడింది.

ఆ సమయంలోనే త్రిలోచన పల్లవికి అనుకూలించిన మరొక సంఘటన. మాధవవర్మ నాల్గవ కొడుకు అయిన సునీతవర్మ, త్రిలోచన పల్లవి – అప్పట్లో ఎవరు ఎవరో ఇద్దరికీ తెలియకపోయినా ఆకర్షితులవడం. ఆ పరిచయం కూడా త్రిలోచన పల్లవికి నరమేధంలాగే  పరస్పర విరుద్ధమైన భావాలకి దారి తీస్తుంది. వారిమధ్య జనించిన అనురాగాన్ని పగ తీర్చుకోడానికి ఉపయోగించుకోడం కథలో మరో మెలిక.

క్రతువు ముగిసినతరవాత తమదేశం వెళ్ళిపోయి, తిరిగి చెలికత్తెతో పురుషవేషాలు ధరించి విజయవాటికకి వచ్చి, చాకచక్యంతో అంతఃపురం ప్రవేశించి, రాజకుటుంబంలో అందరి అభిమానాన్ని చూరగొనడం ఒక యెత్తైతే సునీతవర్మతో ప్రణయం సాగించడం, వారిద్దరి మధ్య జరిగిన వాగ్వివాదాలు మనోరంజకంగా, నాటకీయంగా ఉండి పాఠకులని అలరించడం మరొక యెత్తు. రచయిత్రి ఇటువంటి సన్నివేశాల్లో కథ నడిపినతీరు మెచ్చకోక తప్పదు.  

వారిమధ్య ఆకర్షణ అధికమవుతున్నకొద్దీ పల్లవికి మరొక చిక్కు సమస్య – సునీతవర్మమీద అనురాగం ఒకవైపు, తాతగారికిచ్చిన మాట మరొకవేపు. సునీతవర్మతో వివాహం తనపథకానికి అనుకూలంగా మలుచుకోవచ్చు కానీ వివాహం చేసుకుని విష్ణుకుండినులని నిర్వంశం చేయడం నమ్మకద్రోహం. ఇలా అనేకానేక ఆలోచనలతో సతమతమవుతూనే, తన పథకం నెరవేర్చుకోడంలో అసమాన ప్రతిభ చూపుతుంది త్రిలోచన పల్లవి.

  అంతఃపురంలో రాణుల ఆదరాభిమానాలు పొంది వారిమధ్య ఈర్ష్యాసూయలు రేకెత్తించడం,  పొరుగు సామంతరాజులని తిరుగుబాటుకి ప్రోత్సహించడం – ఇవి సాధించడంలో త్రిలోచన పల్లవి రాజకీయపరిజ్ఞానం పాఠకులని ముగ్ధులని చేస్తుంది. ఆ సమయంలో పల్లవిలో చెలరేగిన అంతస్సంఘర్షణ కూడా శక్తిమంతంగా నిర్వహించేరు రచయిత్రి.

ముగింపుగురించి కొంత ఆలోచించవలసివచ్చింది. త్రిలోచన పల్లవి తన ప్రతిజ్ఞ నెరవేర్చుకుంది. విష్ణుకుండినులవంశం నాశనమయింది.

ఈ నవలకి పరచయంలో రచయిత్రి “ఏదియయిన యొక కర్మను ఫలాపేక్షతో చేసిన నది ఫలించును. నీ సంకల్పమునుబట్టి యాఫలము నావిధముగ దీపించును. మహారాజుగ చేసిన నరమేధఫలితము రాజ్యమునకు సౌఖ్యఫలదాయినియై వైయక్తియై మాధవవర్మకు విపరీత ఫలదాయినియై పుత్రఘాతి యైనది.”

రాజ్యమునకు సౌఖ్యఫలదాయిని అయినభావం కలగలేదు నాకు పుస్తకం పూర్తి చేసి, ఆలోచిస్తే. ప్రజలు సుఖంగా ఉన్నారంటూ ఆవిష్కరించిన సన్నివేశాలుగా రెంటిని చెప్పుకోవచ్చు. మొదటిది మహరాజు యువరాజుకి మరణశిక్ష విధించినప్పుడు. యువరాజు అమితోత్సాహంతో అత్యంతవేగంతో నడుపుతున్న రథంక్రింద ఒక చిన్నవాడు పడి చనిపోతాడు. ప్రజలు న్యాయం కోరతారు. మహరాజుయువరాజుకి మరణధండన విధించి, తనధర్మనిరతిని ఋజువు చేసుకుంటాడు. ప్రజలకి న్యాయం జరిగిందన్న తృప్తి కలిగింది. రెండో ఘట్టం – యువరాజు శిరచ్ఛేదన అయిన వెంటనే, “దుర్గాంబ మాధవ వర్మ ధర్మనిర్ణయమునకు సంప్రీతురాలై సువర్ణవృష్టిని గురిపించినది. మహారాజు ధర్మబుద్ధిని పొగడుకొనుచు ప్రజలెల్ల రానాణెముల నేరుకొనిరి!” (పు. 196). అంటే ప్రజలకి సంపద లభించింది. అంతకుమించి, జనసామాన్యం జీవనవిధానం, శ్రేయస్సుగురించి వివిరంచినదేమీ లేదు. అయితే ఆ కనకవర్షంతో ప్రజలజీవనం సుఖమయిపోయిందా? సిరిసంపదలకీ సుఖజీవనానికీ సంబంధంలేదని చెప్పడానికి మాధవవర్మ, చంద్రమతీదేవి, కోడలు సుదర్శనాదేవి జీవితాలే నిదర్శనం.

ఈ రెండు సంఘటనలూ మొత్తం నవల చదివినతరవాత నామనసులో పడిన మారణకాండతాలూకు ముద్రలను చెరిపివేయగలిగినంత బలంగా లేవు.

                                                000

ఇంతకుముందొక టపాలో వసుంధరగారి మరో రెండు నవలలగురించి సూచనప్రాయంగా ఒకటి, రెండు మాటలు చెప్పేనూ.  అంతకంటే స్పష్టంగా ఇక్కడ మరొకసారి ప్రస్తావిస్తున్నాను.

సాంఘిక నవలలు కోకొల్లలుగా వచ్చిన 50వ దశకంలో  క్లిష్టతరమైన చారిత్రక నవల రాయడానికి పూనుకున్న రచయిత్రిగా వసుంధరగారికి ప్రత్యేకస్థానం ఉంది ఆధునిక సాహిత్యచరిత్రలో.

వసుంధరగారి తొలి నవల తంజావూరు పతనము ఆంధ్రాయూనివర్సిటీవారు ఇంటర్మీడియట్ విద్యార్థులకి ఉపవాచకంగా ఉపయోగించుకోడానికి రచయితలని ప్రోత్సహించే ఉద్దేశంతో నడిపిన ఈ పోటీలో మల్లాది వసుంధరగారి తంజావూరుపతనము ప్రథమ బహుమతి పొందింది. అప్పటికి ఆమె వయసు 17 సంవత్సరాలంటే ఆమె ఉపజ్ఞ గ్రహించవచ్చు.

చరిత్రరచనలలో సాధారణంగా రాజులు, రాజ్యాలు,  రాజ్యవిస్తరణ కాంక్షని ప్రస్ఫుటంచేస్తూ వారి జయాపజయాలు ఆవిష్కరింపడతాయి. అందుకు భిన్నంగా చారిత్రక నవలలో, ఆ రాజులు, రాణులు, వారి జయాపజయాలవెనక వారి అంతర్మధనలు మరింత ప్రస్ఫుటంగా ఆవిష్కరింపబడి, వారిలో మానవీయకోణాన్ని మనముందు ఉంచుతాయి. తంజావూరు పతనంలో విజయరామరాజు రాజ్యకాంక్షకంటే భోగభాగ్యాలు (ఉదాహరణకి ఆయన స్నానవిధులు, భోజన విశేషాలు), సౌందర్యపిపాస (స్త్రీలోలుత) ఎంతో విపులంగా ఆవిష్కరించడం జరిగింది. అవి చదువుతుంటే ఆహా రాజభోగం అంటే, అష్టైశ్వరాలంటే ఇవీ అనిపిస్తుంది.

మరొక ఉదాహరణ – ప్రబంధాలు చదవని పాఠకులకి కూడా పరిచితమయిన, రంగాజమ్మ రచించిన పద్యం –

ఏ వనితల్ మముందలుపనేమిపనో తమరాడువారుగా
రో, వలపించునేర్పెరుగరో,తమకౌగిలిలోననుండగా,
రావదియేమిరా విజయరాఘవ యంచిలుదూరి
బలిమి మై, తీవరకత్తెనై, తీసుకవచ్చితినా తలోదరీ.

ఈపద్యంలో రంగాజమ్మ ఆత్మవిశ్వాసం, పాండితీప్రౌఢిమతోపాటు ధిక్కారం కూడా సుస్పష్టం. అయితే ఈపద్యాన్ని ఈకథలో ఒక ప్రధానాంశంగా మలచడం రచయిత్రిస్ఫూర్తికి తార్కాణం.  విజయరామరాజు తనయందు సంపూర్ణంగా రాగబద్ధుడు అన్న అవగాహన ఉంది రంగాజమ్మకి. ఆమె చంద్రమతికి ఎటువంటి సవాలు పంపనఖ్ఖర్లేదు. కానీ ఆమె తన విద్వత్తునీ, విద్యావతిగా తనకు గల గర్వాన్ని ప్రదర్శించుకోగల సమయం వృథా పోనీయ మనసొప్పలేదు. ఆచంద్రతారార్కం నిలిచిపోగల చక్కని చాటువు రచించి తనప్రజ్ఞని ఋజువు చేసుకుంది.

మహారాజ్ఞి చంద్రావతి జ్ఞానసంపద కూడా ఏమీ తక్కువ కాదు. ఆమె చక్రవర్తి చంద్రగుప్తుని కుమార్తె. విజయనగరసామ్రాజ్యపు పట్టమహిషి. రాజనీతితో పాటు సకలవిద్యలు నేర్చిన విదుషి. షట్కర్మలలో శయనేషు రంభా అయితే చాలదు. కరణేషు మంత్రీ కూడా. రంగాజమ్మ తనఅహాన్ని రెచ్చగొట్టి, తనసామర్థ్యాన్ని కించపరిచింది. స్త్రీగానూ మహరాణిగానూ కూడా తన వ్యక్తిత్వాన్ని ఋజువు చేసుకోడమే కాదు. పట్టమహిషిగా, యువరాజు మన్నారుదాసు తల్లిగా కూడా తనగౌరవం నిలబెట్టుకోవాలి. తన స్థానాన్ని ఋజువు చేసుకునే కార్యక్రమం చేపట్టింది. రాచకార్యాలలో జోక్యం కలుగజేసుకుని, రంగాజమ్మ అహాన్ని కించపరిచేవిధానం ఆలోచించింది. చారులని నియమించి రంగాజమ్మ పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకుంది. ఇది చాణక్యనీతి. రాజ్యరక్షణకోసం మహరాజు స్త్రీలోలుడయి, విందువినోదాలలో కాలం పుచ్చుతుంటే, మహరాణిగా చంద్రవతి ప్రవర్తన సమర్థనీయం. సామాన్యస్త్రీకి ఉండగల ఈర్ష్య మాత్రమే కాదు ఇక్కడ ప్రదానపాత్ర వహించింది. 

కవిసామ్రాట్ నోరి నరసింహశాస్తిగారు శ్లాఘించిన నవల ఇది. ఆయన అభినందనవాక్యాలు చూడండి

  “తంజావూరు పాలించిన ఆంధ్ర నాయకరాజులలో చివరివాడగు విజయరాఘవరాయ యాస్థానములో కవిత్వము, సంగీతము, నృత్యము, శిల్పము పరాకాష్ట నందుట చక్కగా పోషింపబడ్డది. కాని రాజు భోగలాలసత, వేశ్య రంగాజమ్మ యందు వ్యామోహము, ముఖస్తుతి యందు ప్రీతి, ఆస్థానకవులు స్తుతించుచున్నట్లు తాను నిజముగా భగవంతుడనే అనుకొనుట, శ్రీకృష్ణదేవరాయల యంతవాడనని గర్వించుట, తన అష్టమహిషులతో దక్షిణ నాయకత్వము సమర్థింపలేకుండుట, వెంకన్న కుట్ర కననగుట ఏవిధముగా రాజ్యపతనమునకు దారితీసినవో అద్భుతముగా చిత్రింపబడినవి. పరమభక్తుడైన పెద్దిదాసు పాత్ర, అమాయకుడైన ఎల్లు సోమయాజుల రాయబారములు, యువరాజును బంధించినందున కోపోద్దీపితయైన పట్టమహిషి రాజగోపాలాంబిక విజృంభణము, విజయరాఘవనాయకునకు ఉంపుడుకత్తెగా ఉన్న రంగాజమ్మ తనకు సోదరియని చివరకు తెలిసినందున కలిగిన నిర్వేదము, పాఠకుల హృదయములలో చిరకాలము నిలిచిపోవును. ఈ నవల వసుంధర సర్వతోముఖ ప్రజ్ఞకు ప్రతీక.”  (నోరి నరసింహశాస్త్రి సాహిత్యం. 5వ సం. వ్యాసాలు).

ఏ రచయిత్రికి మాత్రం ఇంతకుమించిన ఆమోదముద్ర ఏముంటుంది?

నరమేధము నవలకి ముందు పరిచయంలో వసుంధరగారు “కథాసంవిధానమునకై కొన్ని విషయములు మార్చుట జరిగినది.” చారిత్రక నవలలో ఇది సర్వసాధారణం. కథనం రక్తి కట్టడానికి రచయితలు చరిత్రలోనుండి కటికరాళ్ళలాటి వాస్తవసంఘటనలు తీసుకుని, మనోరంజకంగా తీరిచి దిద్దుతారు. నోరి నరసింహశాస్త్రిగారు రుద్రమదేవినవల కథాకాలం ఆరు సంవత్సరాలనుండి ఆరునెలలకి కుదించేనని చెప్పేరు. నరమేధంలో రచయిత్రి ఏ చారిత్రకవాస్తవాలను మార్చేరో చెప్పి ఉంటే బాగుండేది. ఈవిషయం నేను ప్రత్యేకంగా పరామర్శించడానికి కారణం – పల్లవులలో త్రిలోచన పల్లవుడు అని ఒక రాజు ఉన్నాడని నేలటూరి వెంకటరమణయ్యగారి చారిత్రకవ్యాసాల్లో చదివేను. కథాకాలం చూస్తే, ఈ త్రిలోచన పల్లవుడు చంద్రగుప్తుడు,  మాధవవర్మల సమకాలీనుడుగా కనిపిస్తున్నాడు. నా సందేహం, వసుంధరగారు ఆ త్రిలోచన పల్లవుడినే త్రిలోచన పల్లవిగా చిత్రించేరా అని. అలా అయితే అది చాలా పెద్ద మార్పు. మిగతా కథ అంతటికీ అది కీలకం. పైన చెప్పినట్టు, చారిత్రకనవలలో మార్పులూ చేర్పులూ అవసరమూ, సహజమూ అయినా, అవి ఏమిటో తెలిస్తే, పాఠకులకు వాస్తవచరిత్రయందు అవగాహన మెరుగు పడడానికి అవకాశం ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. నేను వసుంధరగారి ప్రతిభావ్యుత్పత్తులని శంకించడం కానీ కించపరచడం గానీ చేయడంలేదు. కేవలం కుతూహలంతో మాత్రమే ప్రశ్నిస్తున్నాను.

బాష, శైలి, శిల్పం ఇత్యాదులగురించి రెండు మాటలు చెప్పి ముగిస్తాను.

భాషవిషయంలో “సరళగ్రాంథిమునే వాడితిని,” అన్నారు వసుంధరగారు. ఆమెని విశ్వనాథ సత్యనారాయణగారిశిష్యురాలంటారు సాహిత్యాభిమానులు. నేను విశ్వనాథ సత్యనారాయణగారి సాహిత్యం చదివింది తక్కువే కానీ నేను చూసినంతవరకూ భాషాపరంగా, భాషని ఉపయోగించుకోడంలో సత్యనారాయణగారి ప్రభావం ఈమెమీద ఉందేమో అనిపించింది. శిల్ఫందృష్ట్యా పరిశీలిస్తే, వ్యత్యాసాలు కనిపిస్తాయి. సత్యనారాయణగారినవలలో ఉండే మౌఖికసాహిత్యఛాయలు వసుంధరగారిరచనల్లో లేవు. కథ ఎత్తుగడ, నడక, ముగింపు నీటుగా ఇటుకమీద ఇటుక పేర్చి గోడ కట్టినట్టు సమీకరిస్తారు వసుంధరగారు. ఆధునికరీతిలో మొత్తం నవల అంతా ప్రధానాంశంమీద కేంద్రీకృతమై సూటిగా నీటుగా సాగిపోతుంది.

వసుంధరగారి భాషాపాటవం మనోరంజకం. తంజావూరుపతనంలో మొదటి అయిదు పేజీలలో రచయిత్రి సహ్యజనదీ, నదీతీరంలో తోట, ఆ తోటలో పెద్దిదాసు ఉంటున్న ఆరామం వర్ణిస్తారు. అందులో పదచ్ఛేదం చేసుకోవాల్సిన అవసరం రాలేదు కానీ ఆ తరు, లతా గుల్మాదుల పేరులు చూసి ఆశ్చర్యపోతాం. అందులో  కవితాత్మ ప్రాణం పోసుకుంది. రచయిత్రి ముఖ్యపాత్రలనీ, నాట్యగత్తెలనీ వర్ణించినతీరు పాఠకులని మురిపిస్తుంది. నర్తకీమణులు ధరించిన ఆభరణాలూ, కాసె పోసి చీరె కట్టినతీరూ ఈనాడు ఊహించుకోడం కూడా కష్టమేనేమో.

నేను చదివిన మూడోనవల పాటలి. పై రెండూ చారిత్రకనవలలు అయితే ఇది  చారిత్ర్యకకథా, ప్రేమకథా కూడా. గౌతమీపుత్ర శాతవాహనుడికీ మహారాష్ట్రులకీ మధ్య జరిగిన యుద్ధంచుట్టూ అల్లినకథ. ఇందులో కథానాయిక పాటలి బ్రాహ్మణయువతి. తండ్రి గ్రామణి అనగా గ్రామాధికారిట. ఆయన తన తమ్ముడిని గ్రామసంరక్షణకి నియమిస్తాడు. గ్రామరక్షణకోసం మరి ఆయనకి క్షాత్రం కూడా రావాలి కదా. ఆయన పాటలిని చేరదీసి క్షాత్రవిద్యలు కూడా నేర్పుతాడు. పాటలీ, శాతవాహనుడికొలువులో గూఢచారి అయిన పురందరుడూ వీరి ప్రేమకథ.  ఇందులో పాటలి శక్తిసామర్థ్యాలు చిత్రించినవిధానంలో అద్భుతమైన పాండిత్యప్రకర్ష తెల్లమవుతుంది.

ఒక్కమాటలో తెలుగుభాషమీద, చరిత్రమీద, తెలుగు సాహిత్యంలో అభిమానం గలవారందరికీ ఒక అపురూపమయిన వరం మల్లాది వసుంధరగారినవలలు.

తాజాకలం –

మల్లాది వసుంధరగారి రచనల పట్టిక

నవలలు

తంజావూరు పతనము (తొలి ప్రచురణ 1953, రెండవ ప్రచురణ 1965) (బహుమతి పొందిననవల)

 • రామప్పగుడి (బహుమతి పొందిన నవల)
 • పాటలి
 • యుగసంధి (1966)
 • సప్తపర్ణి (బహుమతి పొందిన నవల)
 • నరమేధము (1979)

చిన్నకథలు .

* అలుక తీరిన అపర్ణ ఆంధ్రజ్యోతి దీపావళి నవంబరు 10, 1991 సంచికలో ప్రచురించారు.

* అచల భారతి మే 1, 1954లో ప్రచురించారు.

Facebookలో నా విజ్ఞాపనమేరకు, అక్కడ మిత్రులు మరికొన్ని వివరాలు అందించేరు.

శ్రీ ఏల్చూరి మురళీధర రావుగారు అందించిన సమాచారం – ‘మల్లాది వసుంధర చారిత్రక నవలలు – ఒక పరిశీలన’ అన్న అంశంతో పి. ఉషాకుమారి గారికి 1990లో మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్.డి. వచ్చింది. అదే అంశం, అదే శీర్షికతో జె. శ్రీపాప గారికి 1993లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్.డి. వచ్చింది. రెండూ అచ్చుకాలేదు.

డా. అబ్బరాజు మైథిలిగారు అందించిన సమాచారం – వసుంధరగారు 1992-93లో గతించారు.

వారికి నా ధన్యవాదాలు.

(మార్చి 15, 2014.)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

10 thoughts on “మల్లాది వసుంధరగారినవల నరమేధము”

 1. సుశీలగారూ, ఈ నవలలు ఇప్పుడు బజారులో దొరకడం లేదనుకుంటాను. digital library of India వారి సైటులో నరమేధం, తంజావూరు పతనం ఉన్నాయి. చూడండి.

  మెచ్చుకోండి

 2. “ఏదియయిన యొక కర్మను ఫలాపేక్షతో చేసిన నది ఫలించును. నీ సంకల్పమునుబట్టి యాఫలము నావిధముగ దీపించును. మహారాజుగ చేసిన నరమేధఫలితము రాజ్యమునకు సౌఖ్యఫలదాయినియై వైయక్తియై మాధవవర్మకు విపరీత ఫలదాయినియై పుత్రఘాతి యైనది.”—-
  నరమేధం ఇంకా పెద్ద పరిధి లో, ఈ పుణ్య భుమిలో, కొండకచో జరుగుతూనే ఉంది(1984 లో, 2002 లో)
  రాజ పుత్రుల బదులు, భూమి సంతానం, అమాయక ప్రజలను బలి చేస్తున్నారు.

  మెచ్చుకోండి

 3. మాలతి గారూ,

  మీ దగ్గర “తంజావూరు పతనము” నవల వుందా?

  డ్ళీ లో ఉందికానీ, లింకు పనిజేయడం లేదు.

  ఎక్కడైనా “PDF దొరుకుతుందేమోనని చూస్తున్నాను.

  -బ్రహ్మానందం

  మెచ్చుకోండి

 4. పింగుబ్యాకు: వీక్షణం-75 | పుస్తకం
 5. శ్రీధర్ మోతుమర్రి, తంజావూరు పతనము కూడా చదవండి. రామప్పగుడి దొరికితే తప్పకుండా చదువుదాం అనుకుంటున్నాను. మీవ్యాఖ్యకి ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 6. కడిమిచెట్టు అని విశ్వనాథ సత్యనారాయణగారినవల ఉంది. వసుంధరగారు అదే పేరుతో మరొక నవల రాసేరా. మీరు వీలయితే మరొకసారి ధృవపరుచుకుని చెప్పగలరా. కనీసం ఆ విషయం తెలుగు వికిపీడియాలో పెట్టగలను. అలాగే, మీకు వసుంధరగారిగురించి ఏ ఇతరవిషయాలు తెలిసినా, నాకు తెలియజేయమని నా విన్నపము. మీకు నావ్యాసం నచ్చినందుకు నాకు చాలా సంతోషం.

  మెచ్చుకోండి

 7. మీ సమీక్షలు చాలా వివరంగా ,చక్కని భాషతో అలరారుతూఉంటాయి.మూడు నవలల గురించి బాగా రివ్యూ చేసారు.మల్లాదివసుంధరగారు కడిమిచెట్టు అని మరొక చారిత్రక నవల వ్రాసినట్టు గుర్తు.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.