నేలటూరి వెంకటరమణయ్యగారి చారిత్రక రచన, వ్యాసాలు

 నేలటూరి వెంకటరమణయ్యగారు సుప్రసిద్ధ సాహిత్య, చారిత్రక పరిశోధకులు. దాదాపు 70 సంవత్సరాలపాటు అవిరళంగా అనేక తాళపత్రాలనూ, శాసనాలనూ, వాఙ్మయాన్ని తరిచి చూసి, అనేక వ్యాసాలు ప్రచురించేరు.

మామూలుగా చరిత్ర అంటే రాజుల యుద్ధాలూ, జయాపజయాలూ, ఆ మీదట చెరువులు, బావులు త్రవ్వించెను, సత్రములు కట్టించెను, చెట్లు నాటించెను అని. నాస్కూలుచదువులో నాకు గుర్తున్నదంతే.

వెంకటరమణయ్యగారి చారిత్రకరచనలు లేక చారిత్రకవ్యాసములు అన్న పుస్తకం డియల్ఐలో కనిపించినప్పుడు చరిత్రరచన అన్న మాట ఆ శీర్షికలో లేకపోతే తీసుకునేదాన్ని కాదు. నోరి నరసింహశాస్త్రిగారు రాసిన చారిత్రకనవలలు రాయడంగురించి రాసింది ఇంకా మనసులో అలాగే ఉన్నందున ఈ శీర్షిక కూడా నన్ను ఆకట్టుకుంది. ప్రధానంగా నేను ఈపుస్తకంలో చూడదలుచుకున్నది వీరు చారిత్రకరచనలగురించి ఏం చెప్తారనే. నాఆశలు వమ్ము కాలేదు. పై పుస్తకంలో మొదటివ్యాసం (35 పుటలు)లో ఇచ్చినవివరాలకి చాలా ప్రాముఖ్యత ఉంది.

ఆ వ్యాసం రెండు రకాలుగా మనం ఆలోచించుకోడానికి ఉపయోగపడుతుంది. 1. ప్రచురణకర్తలు చెప్పినట్టు, మొదటివ్యాసము చరిత్రరచనకి కావలసిన సామగ్రిని, చరిత్రరచనావిధానమును విశదీకరిస్తుంది. మిగతా వ్యాసాలు ఆయాసాధనసామగ్రితో చరిత్రను పునఃనిర్మించు విధానం చెప్తుంది. మొదటివ్యాసంలో వెంకట రమణయ్యగారు మనచరిత్రని మనం ఆంధ్రులం పరిరక్షించుకునేవిధానం, నిర్లక్ష్యం చేస్తున్నవిధానంగురించి ఆయన ఎత్తి చూపిన అంశాలు – వీటిగురించి మనం తీవ్రంగా ఆలోచించికోవాల్సిన అగత్యం ఉంది. “ఆంధ్రపండితులు చరిత్రకారులుగాను చరిత్రకారులు భాషాపండితులుగాను ఏర్పడుచు, చరిత్రజ్ఞానము లేని భాషాపాండిత్యమును, భాషాపాండిత్యము లేని చరిత్రనిర్మాణమును పనికిరావని తెల్లమగు నీకాలమున నాటిని నేటినింగలుపు నాణెపువంతెనగా ఉభయసామాన్యముగా” ఈ గ్రంథమును ప్రకటించుచున్నామని ప్రచురణకర్తలు (వేదం వెంకటరాయశాస్త్రి) చెప్పేరు. అది 1948లో. ఆసందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని చదివితే ఈ మొదటివ్యాసంలో ఇప్పటికీ చరిత్రపట్ల మనధోరణులకి అన్వయించుకోగల విషయాలు కనిపిస్తాయి.

మనకి చరిత్ర గ్రంథస్థం చేయడం అన్న అభ్యాసం మహమ్మదీయులతో వచ్చిందిట. మహమ్మదీయులు మనదేశం ఆక్రమించుకున్నతరవాత చరిత్ర పార్సీలోనూ ఉర్దూలోనూ రాయడం ప్రారంభించేరు. మహమ్మదీయప్రభువులప్రోత్సాహంతో మనవాళ్ళు కూడా చరిత్ర రాయడానికి పూనుకున్నారు కానీ పార్సీ, ఉర్దూ భాషల్లోనే రాస్తూ వచ్చేరు! హిందూ సంస్థానచరిత్రలు కానరావు అన్నారాయన. అలాగే ఆంగ్లేయులపాలన వచ్చేక, ఇంగ్లీషులో రాయడం సాగించేరు. మన రాజభక్తి అలాటిది అనుకోవాలి!

దీనికి మరోకోణం, ఆ చరిత్రలో ఏమిటి రాస్తున్నారు లేదా రాస్తున్నాం అన్నది. మనవాళ్లు రాసిన చరిత్రలు కూడా మహమ్మదీయులు, ఆంగ్లేయులూ- వారికోణంలోనుండే ప్రస్తావించడం జరిగింది. ఇదే అభిప్రాయం నోరి నరసింహశాస్త్రిగారి వ్యాసాల్లో కూడా కనిపిస్తుంది. అంటే, మనచరిత్ర నిష్పాక్షికంగా కానీ మనదృష్టితోగానీ రాయడం జరగలేదు.

చరిత్ర పునఃపరిశీలించుకోడానికి అందుబాటులో ఉన్న సామగ్రి ప్రధానంగా రెండు తరగతులుగా విభజించవచ్చు. మొదటిది అనేక రూపాలలో మనకి లభ్యమవుతున్న పురావస్తువులు, రెండోది శాసనాలు. ఈ పురావస్తువులు – రాక్షసగుళ్లు, శిలాగండారాలు, దేవాలయాలు, కోటలు మొదలయినవి.

ఆదిమయుగములో జనులు మృతశరీరనిక్షేపణకోసము నిర్మించిన సమాధులని రాక్షసగుళ్ళు అంటారుట. వాటిలో శవములతో పాతిపెట్టిన వస్తుసంచయం అమూల్యం. అవి చరిత్ర తెలియజేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. వాటివల్ల మత, సాంఘిక, వార్తికపరిస్థితులు కనుక్కోవచ్చు. అటువంటివి ఆంధ్రదేశంలో ఎన్నో ఉన్నాయనీ, వాటిపరిశోధన ఇంకా మొదలు పెట్టలేదనీ అన్నారు వెంకటరమణయ్యగారు. ప్రభుత్వము నామమాత్రంగా అధికారులనయితే నియమించేరు కానీ నిజంగా కావలిసింది ఆ వస్తువులవిషయాలగురించి వివరించడానికి తగిన శాస్త్రపరిజ్ఞానం కలవారయి ఉండాలి.  కళాకారులు అయిఉండాలి. దానికి డబ్బు కావాలి. ఇరుసున కందెన పెట్టక సాగదు కదా అన్నారు రచయిత. కొంధరు సంస్థానాధిపతులు, మహారాష్ట్రులు ఈవిషయంలో మేలు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. వెంకటరమణయ్యగారు అనేక ఉదాహరణలు ఇచ్చేరు మన తెలుగువాళ్ళు మాత్రమే ఈ శిథిలాలని ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారో చూపుతూ.

శిలలని శిల్పాలుగా చెక్కడం కాక, మరొకరకమైన విద్య ఉంది. అది శిలలను ఛేదించి రూపు కల్పించడం –దీన్ని గండారములు అంటారుట. దానికి వేరే రకమైన నేర్పు కావాలి. “ఆ పనివారిని జూచి శిల తన స్వభావసిద్ధమైన కర్కశత్వమును మాని మార్దవము నందినది. వారిచేయి సోకగనే బంకమట్టివలె, మైనమువలె, వెన్నవలె మెత్తనై యేరూపము గమ్మనిన వారి యాజ్ఞను మీరనేరక యారూపమును బొందినది,” అని వ్యాఖ్యానించడంలో వెంకట రమణయ్యగారికి ఈ గండారాలయందు, ఆ కళాకారులయందు గల గౌరవం ద్యోతకమవుతోంది. బాదామీలో మహా బలిపురములో చూస్తే “అవి అనిర్వాచ్యమైన సమ్మోహనపూరమున మిమ్ము ముంచి బహిఃప్రపంచమును మరపించి యొక సౌందర్యలోకమునకు గొనిపోయి యానందబ్రహ్మయందు లీనులజేసి తన్మయత్వము జెందించును. …” అంటారు వెంకట రమణయ్యగారు. విజయవాడ సమీపమున ఉన్న అలాటి గండారపుబొమ్మలను విజయవాడ పౌరశ్రేష్ఠులు బాగుచేయదలచినతరవాత వారు చేసిన పని “చెప్పుటకు నోరాడదు” అంటూ వ్యథ పడుతూ, “ఆ శిల్పాచార్యులవిద్యావైభవము, ప్రతిమలసౌందర్యము, పనితనంపు సొంపు మంట-కాదు, కాదు, సిమెంట-గలసిపోయినవి. ప్రస్తుతమచట గల ప్రిమల వికారరూపములను, అంగవైకల్యమును, లింగాంతరీకరణములును గాంచిన నేపురాతన వస్తుపరిశోధకుని హృదయము రగులుకొనిపోదు?” అన్నారు. అంతే కాదు.  విజయవాడ పురప్రముఖులకు ఆయనవిన్నపము, “అయ్యా, మీపురమందు గల పూర్వనాగరిక చిహ్నములు బాగుసేయ దలపెట్టకుడు,” అని. అలాగే అమరావతి దగ్గర స్తూపాలని ఉద్ధరించేవిషయంలో కూడా “తిరపతి మంగలవాని పద్ధతియైనది” అంటారు. అక్కడ పని చేయడానికి డబ్బులేదంటూ వేలకొలది మాసవేతనములనిచ్చి తెల్లదొరలను, సీమదొరలను రప్పించుట యేలనో అని ప్రశ్నిస్తున్నారు. వారి సలహా, “ఆంధ్రలోకమంతయూ ఏకగ్రీవముగా సర్కారువారిని మందలింపవలయును.” ఇది 1948నాటి మాట. ఇప్పటికైనా మన పురాతనవస్తుశాఖవారు ఏమైనా మారేరా?

అలాగే, దేవాలయాలూ, కోటలూ విఱుగబొడిచి, ఆ రాళ్ళను గృహనిర్మాణానికి తీసుకుపోడం సహజమైపోయినది అంటారు. విజయనగరము, పెనుగొండ, గండికోట, కొండవీడు, యోరుగల్లు, గోలకొండ మొదలగు దుర్గములను గాంచినవారికి వీని ప్రాముఖ్యత స్పష్టము కాగలదు. ఇవన్నీ శిథిలావస్థయందున్నవి. సర్కాహు పి.డబ్ల్యు.డి శాఖవారు వీనిరూపును చెడగొట్టియున్నారు. కొన్నిటిని కచేరీలుగా మార్చి చరిత్రకి ఎంతో నష్టం కలుగజేసేరు. వీటిని పదిలంగా ఉంచుకుని ఉంటే “విజయనగరరాయలు, దక్షిమాత్యాంధ్రనాయకుల, ఆర్కాటు నేలిన మహమ్మదీయప్రభువులు తమ యంతఃపురములయందెట్లు ప్రవర్తించుచుండిరో తెలియుటకవకాశముండేడిది.”

ఈ తప్పులు దిద్దుకోవాలంటే, మనసామగ్రి – శాసనాలు, వాఙ్మయం-ఆంధ్రులకోణంలోనుండి తరిచి చూసుకుని తిరగ రాయవలసిన అవుసరం ఉంది.

ఆ సామగ్రి ఏమిటి, దాన్ని ఎలా మనచరిత్రకి అన్వయించుకోడం అన్నది చాలా విపులంగా చర్చించేరు వెంకటరమణయ్యగారు. స్థూలంగా శాసనాలు, వాఙ్మయం. శాసనాలు రెండు రకాలు – లౌహికములు, శైలికములు అని. లౌహకం – రాగి మాత్రమే కాక వెండి, బంగారాలతో చేసిన శాసనాలు కూడా ఉన్నాయి. యావత్ప్రపంచంలో దక్షిణదేశంలో ఉన్నంత శాసనవాఙ్మయం మరెక్కడా లేదుట. అంత అపురూపమయిన సామగ్రిని మనవారు ఏంచేసేరంటే, హాయిగా స్వంతానికి వాడుకున్నారు. ప్రజలు ఈ   “లౌహికశాసనాలు కంసాలివాని కుంపటియందు అగ్నిప్రవేశము చేసి రూపాంతరము నంది చెంబులు, తపెలలు, తట్టలు మొదలైన పాత్రలుగ మారిపోయినవి.” అలా కరిగించి నగలు గట్రా చేయించుకునో, అమ్ముకుని సొమ్ముచేసుకునో. ఆవిధంగా చరిత్రకి అవుసరమైన, అపురూపమయిన వస్తువులు రూపు లేకుండా పోయేయి చాలామటుకు.

వెంకటరమణయ్యగారు ప్రస్తావించిన మరోవిషయం – మొదట్లో సర్కారు వారు వీటిని మద్రాసు పురావస్తుప్రదర్శనశాలలో భద్రపరిచేవారుట కానీ తరవాతికాలంలో  ఈ “పురాతనవస్తు పరిశోధనశాఖవారికేలనో కలకత్తాలోని బారతీయ వస్తు ప్రదర్శనశాలపై గాఢానురాగ ముదయించినది.”  అంచేత అక్కడికి తరలించేయడం మొదలు పెట్టేరు. అంతే కాదు.

మైసూరు, కర్ణాట ప్రతినిధులు అఖిలభారత శాసనసభలలో ఆయా సభ్యులు వాళ్లమండలాలో శాసనములకు ప్రతిబింబములు తీయించి జాగ్రత్త చేసుకుంటుంటే, మన ప్రతినిధులు మాత్రం చేసిందేమీ లేదు. “ఖొజ్జామగడు ఇంటిలో నున్నను దండులోననున్నను నొక్కటే” యను లోకోక్తి వీరిప్రాతినిధ్యము సార్థకమయినది అంటారు.

చరిత్రని తిరగరాసుకోడానికి ఎంతో సహాయం చేయగల మరొక సాధనం వాఙ్మయం అని అందరూ అంగీకరిస్తారు. ఆంధ్రలో పరంపరగా వస్తున్న వంశచరిత్రలు, పద్యకావ్యములు, అవతారికలు, ఆశ్వాసాంతములు, సీసమాలికలు, రాజుల చరిత్రలు – వీటిలో ఆనాటి కావ్యకర్తలు అనుభవసిద్ధములైన సాంఘికార్థిక విషయములు చేర్చేరు. “ఇగురు కైజీతంపుటెక్టీలు”, “పూదేనెగాసపునల్ల ప్రజ”, “కాలంపువేరి సుంకరి యంబరమున బొడిచిన ముద్ర” – వంటి వాక్యాలు వెంకట రమణయ్యగారు ఉదహరించేరు కానీ వీటికి అర్థాలు నాకు తెలీవు. ఇవి పండితులు పరిష్కరించాలి. “క్రీ.శ. 17 శతాబ్దముల విరచింపబడిన గ్రంథములప్పటి రాజకీయ, మత, సాంఘిక, ఆర్థిక పరిస్థితులనెరుగని వారికి దుర్గ్రాగ్యములు” అన్నారు ఆయనే. ఈ సందర్భంలో, నాకు తోచిన మరొక కోణం, మనం ఈనాటి పరిస్థితులకి అన్వయించుకోవలసినది – వెంకట రమణయ్యగారు చెప్పిన కారణంగానే ఈనాడు రచయితలు, పాత్రికేయులు బాధ్యతతో నిజాయితీగా రచనలు చేయవలసిన అవుసరం ఉంది. తమకి తోచినట్టు రాసిపారేయడం కాక, భవిష్యత్తులో మనచరిత్ర ఎలా చదవబడుతుంది అన్నదృష్టితో రచనలు చేయాలి.

 ఈ శాసనాలలో లిపి కూడా కాలనిర్ణయానికి ఉపయోగపడుతుంది. లిపి కాలక్రమాన మారుతూ వస్తోందన్నసంగతి భాషాశాస్త్రజ్ఞులకి తెలిసు. ఈ పుస్తకంలో ఎలా మారిందో సూక్ష్మంగా సామాన్యులకి అర్థమయేలా వివరించేరు, “తలపెట్టె” వంటి పదజాలం పరిచయం చేస్తూ.

మిగతావ్యాసాల్లో ఈసామగ్రిని వినియోగించుకుని, తాము చేసినపరిశోధనలమూలంగా గ్రహించిన చరత్ర వివరించేరు. వాటిలో చాలా ఉపకథలు చేర్చేరు. ఉదాహరణకి త్రిలోచన పల్లవుడికి త్రినేత్రుడు అన్న పేరు ఎలా వచ్చింది, అతనిని జయించిన చోళరాజు కరికాలుడు సామంతరాజులచేత మట్టితట్టలు మోయించడం, “బాధ” అన్న పేరుతో 18 రకాలు పన్నులు విధించడంవంటి అనేకవిషయాలు విపులంగా చర్చించేరు.

ఒక్కమాటలో, నేలటూరి వెంకట రమణయ్యగారు తెలుగుదేశానికి, సాహిత్యానికి చేసిన సేవ అపారం.  

వెంకట రమణయ్యగారి జననం 1893లో. జన్మస్థలం ప్రకాశంజిల్లాలో నేలటూరు. తల్లిదండ్రులు పాపమ్మ, సుబ్బయ్య. యం.ఏ., పి.హెచ్.డి. చేసారు. 1977 దివంగతులయేరు.

వీరి రచనలు

* చరిత్ర రచన లేక చారిత్రకవ్యాసములు. ప్రథమ భాగము. మద్రాసు. వేదము వెంకటరాయ శాస్త్రి, 1948.

* పల్లవులు, చాళుక్యులు. మద్రాసు. వేదము వెంకటరాయ శాస్త్రి, 1969

* విజయనగర చరిత్ర, 2. సం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, 1977

* కృష్ణదేవరాయలు, హైదరాబాదు, 1972

* త్రిలోచన పల్లవుడు

* కరికాలచోళుడు

* విజయనగర పట్టణ సామ్రాజ్య ఉత్పత్తి

* దక్షిణ హిందూదేశప్రారంభం

* విజయనగర మూడవ రాజవంశములోని పతనములు

* భారతదేశములో మహమ్మదీయుల తొలి విస్తరణ

* విజయనగర చరిత్రకు మరి కొన్ని మూలములు

* పాల్కురికి సోమనాథుడు ఎప్పటివాడు?

* ఆంధ్రప్రదేశమున చరిత్ర పరిశోధన

* ఆంధ్ర వాఙ్మయచరిత్ర

పరిష్కరణలు

* కొమర్రాజు వెంకట లక్ష్మణరావు: మహమ్మదీయ మహాయుగము. 2 సం. పరిష్కర్త. నేలటూరి వెంకటరమణయ్య. 1964.

* నన్నెచోడుని కుమారసంభవము. పరిష్కర్త. నేలటూరి వెంకటరమణయ్య. హైదరాబాదు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య ఎకాడమీ, 1978.

* విజయరాఘవుని రఘనాథాభ్యుదయము. పరిష్కర్త. నేలటూరి వెంకటరమణయ్య

* కంకంటి పాపరాజుయెక్క విష్ణుమాయావిలాస నాటకము. పరిష్కర్త. నేలటూరి వెంకటరమణయ్య.


Facebook లో రమణమూర్తిగారు అందించిన సమాచారం. తిరుమల రామచంద్రగారి మహా మనీషి వ్యాసానికి మరపురాని మనీషి వెంకటరమణయ్య

నేలటూరి వేంకటరమణయ్యగారి కథలు –

మధుమావతి (పెద్ద కథ) [తెలుగు స్వతంత్ర – 27.08.48- 03.09.48]
ప్రతీకారము (పెద్ద కథ) [తెలుగు స్వతంత్ర – 12.11.48- 19.11.48]
ఛత్రగ్రాహి (పెద్ద కథ) [తెలుగు స్వతంత్ర – 10.12.48- 07.01.49 ]
పచ్చడము (కథ) [భారతి – 01.12.56]

రమణమూర్తిగారికి ధన్యవాదమలు.


Publications in English:

* Perur Inscriptions. Andhra Pradesh Textbook Press, 1973

Studies in the history of the ­­­third dynasty of Vijayanaga

University of Madras Press, 1935.

* Vijayanagara: Origin of the city and the empire. New Delhi: Asian Educational Services, 1990

* Rudradeva University of Madras, 1941

==Collaborations==

*Nelaturi Venkataramanayya and P.V. Parabrahma Sastry. Inscriptions of Andhra Pradesh, Nalgonda District. A.P. Department of Archaeology and Museum. . Pub by Government of Andhra Pradesh. 1994.

REFERENCES.

*[[http://www.vepachedu.org/manasanskriti/Nelaturi.html]]

*[[http://www.worldcat.org/search?q=au%3AVenkataramanayya%2C+Nelaturi.&qt=hot_author]]

 

 

3 thoughts on “నేలటూరి వెంకటరమణయ్యగారి చారిత్రక రచన, వ్యాసాలు

  1. పింగుబ్యాకు: వీక్షణం-76 | పుస్తకం
  2. నేలటూరివారు, కొమర్రాజువారు,చిలుకూరివారు ఆంధ్రుల చరిత్ర పరిశోధనకు అపారమైన కృషిచేసి ఎన్నో చారిత్రక విషయాలు వెల్లడించారు.సామాన్యప్రజలసంగతి వదిలేయండి.మేధావులమనుకొనేవారు,ప్రభుత్వము,అధికారులు,ప్రజాసంఘాలు ,ఎవరికిగాని మన చరిత్ర,వారసత్వం,(heritage) గురించి సరియైన అవగాహన ,ఆసక్తి ,ఉన్నాయా?హైదరాబాదు ఎలాగూ పోయింది కాబట్టి,విశాఖపట్టణం ,విజయవాడ,తిరుపతుల్లో వచ్చే ప్రభుత్వం మంచి,పెద్ద మ్యూజియంలను,పరిశోధనా కేంద్రాలని స్థాపించాలి.

    మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.