ఊసుపోక – పనసపొట్టు కూర

(ఎన్నెమ్మకతలు 136)

 పనస అనగానే మీకు గబుక్కున గుర్తొచ్చేదేమిటి? అదేలెండి సింహాచలం సంపెంగతోటలతరవాతే. అన్నట్టు ఇది కూడా మనసులో మెదులుతోందా?

తండ్రి గరగరా

తల్లి పీచు పీచు

బిడ్డలు రత్నమాణిక్యాలు

మనుమలు బొమ్మరాళ్ళు.

అయితే మీకు పనసకాయ తెలుసన్నమాట. కాకపోతే నేనేం చెయ్యలేను. మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి. ఏమోలెండి, ఇది చదివేక, మీకేమైనా తోస్తుందేమో.

పనసకాయా, అరటి చెట్టూ – ఈరెంటికీ తెలుగుఇళ్ళలో ప్రత్యేకస్థానం ఉంది ఎందుకో తెలుసా? మిగతా కూరలూ, కాయల్లా ఈ రెండూ వండుకుతినడానికి మొదలు పెడితే పారేసేదేమీ ఉండదు దాదాపుగా. అంటే పనసకాయ పైపొర – గరగరలాడే ములుకులూ, అరటిచెట్టు వేళ్ళూ తినం కానీ మిగతా అన్ని భాగాలూ ఏదో విధంగా ఆరగించడమే. అరటిచెట్టు కథ తరవాత చెప్తాను. ఇవాళ కబుర్లు పనసకాయకే పరిమితం.

ఇంతకీ అసలు ఈ కథంతా ఎందుకు మొదలయిందంటే – చెప్పేను కదా నేనూ ఇశాపట్టంలోనే పుట్టి పెరిగేనని పాతికేళ్ళు దాటేవరకూ. అంటే చాలా చాలా బోల్డు సంవత్సరాలు అయిపోయేయి కదా. మళ్లీ ఇదుగో ఇవాళ బజారుకెళ్తే, యిన్ని సంవత్సరాలు అయిపోయేక, నిజ మరియు తాజా పనసకాయ ముక్కలు కనిపించేయి.

వాటికి గజం దూరంలో నిలబడి అట్టే చూస్తూ నిలబడిపోయేను కలయో వైష్ణవమాయయో అనుకుంటూ. కళ్ళు నులుముకుని మళ్ళీ చూసేను. హాచ్చెర్యమ్! ఆ తరవాత నోరూరింది, కళ్లు చెమ్మగిల్లేయి. ఆపకుండా చదివేవారిఇంటిముందు పుస్తకాలదుకాణం వెలిసినట్టు, బట్టలదుకాణంలో 80 శాతం తగ్గింపు ధరలబోర్డు దర్శనమయినట్టు, రైలెక్కబోతుంటే కండక్టరు రారమ్మని పిలిచి టిక్కెట్టు అరచేతిలో పెట్టినట్టు. సరీ..ఘ్ఘా.. వాన పడ్డప్పుడే గొడుగు ఎదుట ప్రత్యక్షమయినట్టు, పేస్భుక్కులో నా టపాకి మూడువందల లైకులూ, ముఫ్ఫైయారువందల పొగడ్తలూ రాలినట్టు. వేయేల, నా గత సప్తజన్మల సుకృతములూ కూడగట్టుకుని పనసకాయ ముక్కయి నాముందు నిలిచినది.

పనస ముక్క
పనస ముక్క

ఆహా, ఓహో అనుకుంటూ ఓ ముక్క కొనుక్కుని, ఆనందమామానందమాయె అని పాడుకుంటూ ఇంటికొచ్చేను. ఏరాగమా? ఏమో, ఏ పంజాబీ భంగ్రాలాగో పాడొచ్చేమో. రేపు ఫేస్బుక్కులో కనుక్కుని చెప్తాను.

పాటకులారా! దయచేసి మీకు తెలిస్తే, ఆనందమానందమాయే ఎలా పాడొచ్చో చెప్పండి.

పాఠకులారా! ఇప్పుడు ఈ పనసకాయ ముక్కతో కూర ఎట్లు చేయవలెనో చెప్పండి, ఆవ పెట్టా? కొబ్బరికోరు దండిగా దట్టించా? ఆమాత్రం తెలీదా అనకండి. ప్రస్తుతం నేను రెండో బాల్యంలో ఉన్నాను కదా. అంతా మొదటినుండి మళ్ళీ నేర్చుకుంటున్నాను.

పాతకులారా! ప్చ్. నాచేతి కూర మీ పాపములకు నిష్కృతి కావచ్చు.

(మార్చి 26, 2014)

 

 

 

  

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

8 thoughts on “ఊసుపోక – పనసపొట్టు కూర”

 1. నారాయణస్వామి గారు,Istand corrected.pine apple అంటే అనాసపండే .పంపరపనస వేరు.మా ఎదురింట్లో ఉన్నదికూడా.పనసకూరలు తినడమే కాని మగవాణ్ణి కాబట్టి వండేవిధానం తెలియదు.కొందరు రుచికోసం కొబ్బరికోరు కూడా వేస్తారని తెలుసును .మీరన్నట్లు పనస చెట్లు కోస్తా జిల్లాలలో అంతా పెరుగుతాయి.మా జిల్లాలో ఉద్దానం ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తాయి.

  మెచ్చుకోండి

 2. పొట్టు లాగా తరగడం మాటలు కాదండీ,,,చాలా నేర్పూ, ఓర్పూ కూడా కావాలి.
  పెద్ద పెద్ద ముక్కలుగా తరిగి,కాస్త పసుపు వేసి మిక్సీ ఓ తిప్పు తిప్పెయండి. వండటానికి పనస పొట్టు రెడీ

  మెచ్చుకోండి

 3. పంపర పనస అంటే pineapple కాదు. దబ్బకాయకంటే కొంచెం పెద్దగా ఉండే సిట్రస్ పండు అది. లోపలి తొనలు, బత్తాయిలాగా కొంచెం తియ్యగా, చప్పగా ఉంటాయి. పైనేపిల్ ని తెలుగులో అనాస అంటారు. నాకు తెలిసి పనసకాయలు పళ్ళు కోనసీమ నించీ విశాఖదాకా బాగానే పండుతాయి.
  మీ ఏడుజన్మాల పుణ్యాలు రూపుకట్టడానికి మీరిచ్చిన ఉదాహరణలు చదివి బాగా నవ్వుకున్నాను.

  మెచ్చుకోండి

 4. లక్ష్మి, అబ్భ ఎన్నిరోజులయిందో … అదే నాక్కూడా గట్టిగా తగిలింది 🙂
  ఉషా, మీ సలహాలు పాటిస్తాను. పాట మాత్రం అడక్కండి.
  యం.వి. రమణారావు, పంపరపనస అంటారా. నాకేమో పనసకాయలే గుర్తున్నాయి. నాకూరకోసం ఎదురు చూసే జర్మన్ మిత్రులు లేరులెండి.
  మోహన్, సరే. ఎలాగోలా చేస్తాను.

  మెచ్చుకోండి

 5. సిమ్హాచలంలో సంపెంగకాక ఎక్కువపండించేది మామూలు పనస కాదు;పంపరపనస(pineapple)మీరు ఆవ కొబ్బరి రండూ కలిపి వండితే బాగుంటుంది.ఐనా మరీ ఒకేఒక ముక్కేమిటి?ఓ పదిముక్కలైనాకొని వండి మీ జెర్మన్ మిత్రులకు కూడ ఇస్తే బాగుండేదికదా?

  మెచ్చుకోండి

 6. అపుడపుడు back dates వేసా అవసర కొద్దీ, మీరేవిటీ (మార్చి 26, 2014) తో నా జీవితం లో 5రోజులు తరిగినట్లు భయపెట్టారు, మాలతి గారు? 🙂

  పనస చెక్కని కాస్త పొట్టులా కొట్టాలి (అదెలా అంటే కొత్తిమీర తరగటానికి వాడే బలానికి ఒక వందరెట్లు వాడి, తరగటమే almost like minced meat నేను శాఖాహారినే కానీ వాడక తప్పలా దగ్గరిపోలిక వలన)-

  కొద్దిగా పసుపు పట్టించి కాసేపు ఉంచండలా, సరిపడా నీరు ఎసరు పెట్టి, మెత్తబడేలా ఉదికించి అందులోనే ఉప్పు వెసుకుని, వార్చి, ఆరబెట్టి, దాదాపు పులిహొఋఅ పోపులా వేసి ఈ పనసపొట్టు కలపండి. ఆవ పెట్టండి. నేను కాబీజీ ఇలా కూడా వండుతాను కనుక ఆ అనుభవం ఉపయోగపడింది.

  ఇక ముల్లంగికోరు, కొబ్బరికోరు కలిపిన కూరలానూ చెయ్యొచ్చు…

  మీరు అడగని 3వ విధానం: పెద్ద పెద్ద ముక్కలు కోసి, బాగా నూనేల మగ్గబెట్టి/ఆయిగపెట్టి మసాల కూరలా వండుతారు మా అమ్మగారింట్లో. అది మా పక్క పెళ్ళివిందుల్లో ప్రత్యేక వంటకం కూడా!

  ఆనందమానందమాయే ఇక్కడ విని నేర్చుకోండిక మరి! http://www.youtube.com/watch?v=M4RszdP1G8k Mind you you got to remix with your own lyrics 😛

  త్వరలో నా పాపాలకి నిష్కృతిగా మీ కందిపొడితో సహా ఇయ్యన్నీ తినాలి… 😉

  మెచ్చుకోండి

 7. పనసపొట్టా… అబ్బ ఎన్ని రోజులైందో ఆ మాట విని అసలు. ఏదేమైనా మాలతిగారు, మరి పనసపొట్టుని ఆవపెట్టి వండినా, పులిహోర పోపు వేసినా మరింక అల్లం మిరపకాయ ముద్దతో పోపెట్టినా తిరుగుండదండీ. పనసపొట్టు కొబ్బరికోరు మాత్రం నేనెప్ప్డూ వినలేదు తినలేదు కూడా.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s