ఏ కాలం కథ?

ఈమధ్య నాకు చరిత్రమీద చారిత్రకకథలమీద ఇష్టం శుక్లపక్షచంద్రుని మాడ్కి పెరిగిపోతోంది. దానికి కారణం ఏమిటా అని నన్ను నేనే ప్రశ్నించుకుని సమాధానాలు రాసుకోడం మొదలు పెట్టేను. అవే ఇవి!

చరిత్రాత్మక కథల్లో వస్తువు నన్ను ఆకట్టుకుంటోంది. రుద్రమదేవి, ఏకవీరవంటి నవలల్లో ఆనాటి స్త్రీల సాహసం, చాతుర్యం, జాణతనం ఇవి ఉపశాంతినిస్తున్నాయి. ఈనాటి కథల్లో కూడా ఆ జాణతనం, తెలివితేటలు ఉన్నా, అందులో నాకు తెలీనివీ, నేను విననవీ, చదవనివీ కనిపించక, ప్చ్ అనిపిస్తోంది. కొన్ని దశాబ్దాలపాటు అలాటి కథలు చదివేక, ఇంక కొత్తగా నాకు తెలిసేదేమీ లేదనిపిస్తుంది. అంచేత ఈనాటి కథలు నేను అట్టే చదవడం లేదు. అంటే మంచి కథలు రావడం లేదని కాదు. నన్ను ఆకట్టుకునే కథలు రావడం లేదనే. రెండోది చారిత్రకకథల్లో, ఆనాటి సంప్రదాయాలు తెలుస్తాయి. భాష కొత్తగా ఉంటుంది. కొన్ని మాటలకి మారిపోతున్న అర్థాలు, ఎన్నడు కని విని ఎరుగని పదాలు, ఉపమానాలు – ఇవన్నీ సరదాగా ఉన్నాయి.

ఎప్పుడయితే ధర్మగ్లాని జరుగుతుందో, అప్పుడు ధర్మాన్ని పునరుద్ధరించడానికి సద్ధార్మాలని ప్రజలకి ఉద్బోధించడానికి సాహిత్యం పుట్టుకురావాలి అని నన్నయ మహాభారతం రాయడానికి ఉపక్రమించేడుట. అంటే ఒక సాహిత్యప్రయోజనం ప్రజలకి ధర్మోపదేశం. అది తాత్కాలికం, ఆ కాలానికి మాత్రమే వర్తించేది. మరొక ప్రయోజనం భావితరాలకి ఈనాటి సామాజిక పరిస్థితులు అవగాహన కలిగించేదిగా ఉండడం. నేను మొదట చెప్పిన చరిత్రాత్మక కథల్లో నా ఆసక్తికి కారణం ఇది. అప్పటివారికి ఇప్పటి నేను భావితరమే అని.

సూక్ష్మంగా, కథలు ఎందుకు రాయడం అంటే పాఠకులకి కర్తవ్యబోధ చేయడం, భావితరాలకి చరిత్రపాఠాలుగా ఉపయోగపడడం అని నిర్ధారణ అయింది.
అంచేత రచయితలు ఎంచుకునే కథాంశాలు కూడా అలాగే ఉంటాయి. మామూలుగా భావి తరాలవారు ఇప్పుడు మనం ఎలా జీవిస్తున్నామో నాకథ చదివి తెలుసుకుంటారు అన్న స్పృహతోనే ప్రతి రచయితా రాయకపోవచ్చు. మీరు ఏ రచయితనైనా ఏమిటి రాస్తున్నారు అంటే సమకాలీనసమాజాన్ని ప్రతిబింబించే కథలు రాస్తున్నాం అనే జవాబు వస్తుంది కద, కనీసం నూటికి తొంభై శాతం. ఇందులో రాజకీయాలు, సినిమాలు, హాస్యం, కోపతాపాలూ, కష్టసుఖాలూ అన్నీ ఉంటాయి. సమాజంలో ఉన్న సమస్త కోణాలూను.

అలా కాక వెనకటి జీవితాన్ని స్మరించుకునేవి కొన్ని. ఆ మధ్య చింతలచెరువు సువర్చలగారి కథ చదివినప్పుడు నాకనిపించింది ఇది. అలాగే మళ్లీ ఇవాళ గొర్తి సాయి బ్రహ్మానందంగారి కథ చదివినప్పుడు అదే తోచింది. కానీ, పూర్తిగా గతకాలం కథలా రాయలేదు. అంచేత నేను మరింత ఆలోచించవలసివచ్చింది.

కథ బాగుంది. నామటుకు నాకు ఇది ప్రధానంగా స్వేచ్ఛగురించే అనిపించింది. చివరలో నాయనమ్మ బంగారుగాజులు మరొక స్నేహితురాలికి అవుసరమయినప్పుడు వాడుకోమని ఇవ్వడంలో స్త్రీకి అర్థబలం ఎంత అవుసరమో ఆమెకి తెలుసు అనిపిస్తుంది. అయితే డబ్బు ఉండడం మాత్రమే చాలదు. అది ఉపయోగించుకోగల స్వేచ్చ కూడా ఉండాలి. ఆ స్వేచ్ఛ ఆమెకి లేకపోవడంచేతే స్నేహితురాలికి రహస్యంగా ఇచ్చింది. కథకుడిని ఇంట్లో దొంగగా గుర్తించినప్పుడు అతడు దొంగ కాదని చెప్పలేకపోయింది. నిజానికి ఈకథలో ఇది చాలా బలమైన అంశం. ఈనాటికీ సంపాదన గల ఎంతోమంది స్త్రీలకి తమసంపాదనని తమ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకునే వీలు లేదు. ఇక్కడ వీలు అన్నది నేను తెలిసే అంటున్నాను. ఎందుకంటే, మనదేశంలో కుటుంబవ్యవస్థ అలాటిది. ధర్మంపేరుతో, బాధ్యతపేరుతో, ఆత్మీయతలపేరుతో, ప్రేమపేరుతో, అనేకరకాలుగా పీటముళ్ళు వేసుకు ఉంటాయి సమస్త విషయాలూను. నిజానికి ఇది కొంతవరకూ మొగవారికి కూడా వర్తిస్తుంది. అంచేత, ఈ ఆర్థకపరమైన ముళ్ళు విడదీయడానికి ఉపాయాలు ఆలోచించాలి.
రచయిత కథపేరు శిరోముండనం అని పెట్టేరు కనక అదే ప్రధానం అనుకోవాలి. అంచేతే ఈ వ్యాసం పని గట్టుకు రాయాల్సొచ్చింది.

ఈ సంప్రదాయం ఇప్పుడు లేదు. నాకు రెండు తరాలముందే, అంటే మానాయనమ్మకాలంనాటికే మారడం మొదలయింది. మానాయనమ్మ జుత్తు తీసేయడం (అందులో మళ్ళీ సంస్కృతం ఎందుకులెండి) జరిగింది కానీ, ఆవిడ చెల్లెలు మాచిన్నాయనమ్మకి జుత్తు ఉండేది. అంటే నాకు రెండు తరాలముందే ఈ సంప్రదాయానికి ఉద్వాసన మొదలయిందనుకోవచ్చు. ఇప్పడున్న యువతరం నాకు రెండు తరాలవెనక. అంటే ఈ జుత్తు తీయించేయడం అన్నది అయిదు తరాలకిందటిమాట. నిజానికి పద్ధెనిమిదో శతాబ్దం చివర తరిగొండ వెంకుమాంబగారు కూడా అభ్యంతరం చెప్పేరు ఇది అర్థరహితమైన సంప్రదాయం అని. ఇంతగా ఎందుకు చెప్పుకొస్తున్నానంటే ఈకథలో ఈవిషయం ప్రస్తావించడంవల్ల రచయిత ప్రత్యేకంగా సాధించిన అధిక లాభం ఏమిటి అని. ఇది ఈనాటి సమాజానికి వర్తించదు. ఆస్తులవిషయంలో, స్త్రీలకి ఆస్తి పంచిస్తే అంగీకరించలేని కొడుకులు, అన్నదమ్ములు ఇప్పటికీ ఉన్నారు కానీ కేశఖండనం చేయించాలని పట్టు పడుతున్నవాళ్ళు ఇప్పుడు లేరు కదా. వెనకటిసంగతులు ప్రస్తావిస్తున్నారనుకుంటే, కథాకాలం కూడా పూర్తిగా ఆనాటిదే అయి ఉంటే కథకి బలం చేకూరేది. అంటే అర్వాచీన చరిత్ర అనుకోడానికి ఆస్కారం ఉండేది.

నా అభిప్రాయంలో కథలో ఏం చెప్తున్నాం అని మాత్రమే కాక, ఎందుకు చెప్తున్నాం, ఎవరికోసం చెప్తున్నాం అని ఆలోచించుకోడం కూడా అవుసరమేనేమో అనిపిస్తోంది ఇలా ఆలోచిస్తుంటే.

తాజాకలం. గొర్తి సాయి బ్రహ్మానందంగారి వాఖ్య ఈకథకి ప్రయోజనంమీద కూడా తప్పక చదవమని కోరుతున్నాను.

 

(మార్చి 25, 2014)

 

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

5 thoughts on “ఏ కాలం కథ?”

 1. శిరోముండనం గురించి మీరు ప్రస్తావిస్తే నాకు మా ‘అవ్వ’ మా నాన్న గారి మేనత్త గుర్తుకు వచ్చింది. ఆమె పదేళ్ళ వయసులో విధవరాలైతే, పదమూడు ఏళ్ళకి, పెద్దమనిషి అయ్యాక శిరోముండనం చేసి అత్తారింటికి పంపినారట. ఇది తెలిసి చాల బాధపడ్డాను. ఆమె 86 సంవత్చారాలు జీవించింది..కోరికలకు కూడా siromundanam చేసినట్టేనా అనిపించేది. ఇది ఒక కథగా రాస్తే ఒక పత్రిక పబ్లిష్ చేయడానికి అంగీకరించింది. కథ వచ్చాక మీకు తెలుపుతాను…ఎందుకో ఇది మీతో పంచుకోవాలనిపించింది .

  మెచ్చుకోండి

 2. బ్రహ్మానందంగారూ, మీరు చెప్పేవరకూ నాకు ఈ టైంలైను తోచలేదు. అవును. మనదేశంలో స్త్రీలు పైకి కనిపించకపోయినా, చాలా అభ్యుదయభావాలు కలవారు, ఇతరులని ప్రోత్సహించినవవారూ చాలామందే ఉన్నారు. నేను కూడా అలాటివారిని చూసేను. మంచి పాయింటు కథగా మలిచినందుకు మరొకసారి అభినందనలు.

  మెచ్చుకోండి

 3. మాలతి గారూ,

  మీరు కోనసీమకథల శీర్షికన వచ్చిన శిరోముండనం కథ మీద మీ అభిప్రాయం చదివాక ఇదీ నా వివరణ:

  ఈ కథాకాలం 1970-80 మధ్య జరిగిన ఒక వాస్తవ సంఘటన ఆధారంగా రాసాను. 1975 నాటికి మా అమ్మమ్మకి అరవయ్యేళ్ళు. అంటే ఆవిడ 1915లో పుట్టింది. మా తాత 1949లో పోయాడు. అప్పుడు ఆవిడకి శిరోముండనం జరిగింది. మగ సంతానం లేక మా యింట్లోనే ఉండేది. ఈ ఆచారం నాకు తెలిసీ 1960 వరకూ ఉంది.

  మా ప్రాంతంలో ఇటువంటి ఎంతో మంది వితంతువుల్ని చూసాను. కాలక్రమేణా ఈ దురాచారం పోయింది. ఈకథలో ఈవిషయం ప్రస్తావించడంవల్ల రచయిత ప్రత్యేకంగా సాధించిన అధిక లాభం ఏమిటి అని మీరు ప్రశ్నించారు. ఒకటి ఎవర్నీ అంటే తనకి అండగా ఉండాల్సిన బంధువర్గాన్ని తిరస్కరించలేక, పైకి చెప్పలేక ఆవిడ అది భరించింది. తనలాగే మరో అమ్మాయి జీవితం మొగుడు పోయాక వేరే పంచన చేరి నరకం కాకూడదన్న తపనే ఆవిడ చర్యలకి ప్రేరణ. కానీ పైకి చెబితే చుట్టూ ఉన్నవాళ్ళు భరించలేరు. అందుకే మౌనంగా ఉండిపోయింది. ఆ మాత్రం చెప్పగలిగితే మొగుడు పోయిన వేంటనే ఎదురు తిరిగేది కదా? పాతకాలమ్లో దురాచారాలకి బలయిన స్త్రీలు ఎంతో ప్రొగ్రెసివ్ గా కూడా ఆలోచించేవారని చెప్పడమే ఈ కథకి ప్రేరణ.

  మా అమ్మమ్మ నిజం. ఆవిడ వ్యథ నిజం. మరో స్త్రీకి ఊతం ఇవ్వడం నిజం. చివరది మాత్రం మా అమ్మమ్మపోయిన 17 ఏళ్ళవరకూ మాకెవ్వరికీ తెలియదు. ఆవిడ 1976లో పోయింది. కేశఖండనం చేయించే వాళ్ళు లేరు. ఆచారమూ పోయింది. పాతకాలం నాటి కథ. చివర్న మలుపు మాత్రం తొంభయిల్లోనే జరిగింది. కథలో ప్రొటాగనిస్ట్ ఎవరో మీరు ఊహించుకోవచ్చు.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s