పరకాంతలెదురైన మాతృభావము సేసి మరలిపోయేవాడుట ప్రహ్లాదుడు. నన్ను చూస్తే కూడా చాలామంది మరలుతారు … నావేపుకే … మిత్రభావము సేసే!
ఈవిషయంలో అట్టే తికమక లేదు. ఇదంతా గతితార్కికభౌతిక సిద్దాంతము ప్రకారము జరుగును అనుకుని నిరామయంగా స్వీకరిస్తూ వచ్చేను. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే దానికి ప్రధానకారణం నేను మెతగ్గా కనిపించడం అనుకుంటాను. ఈ మొహం చూస్తే ప్రమాదమేమీ కలిగేట్టు లేదు, ఏ తంటాలూ తెచ్చేట్టు లేదు అని వాళ్ళకి అనిపిస్తుందేమో. ఏనాటి బంధమో అన్నట్టు కబుర్లలోకి దిగిపోతారు అనతికాలంలోనే. ఒకొకప్పుడు ఎంతో ఆత్మీయమైన సంగతులు కూడా ఏ అరమరికలూ లేకుండా ఏనాటిబంధమో అన్నట్టు చెప్పుకుపోతారు. చిన్న చిరునగవ్వుతో మొదలెట్టి, అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలకథలు కూడా వినిపించేస్తాయి కదాచితుగా.
బంధుత్వాలు భగవద్దత్తం, స్నేహాలు స్వయంకృతం అంటారు కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే అందులో సగమే నిజం అని తోచకమానదు. నామిత్రుత్వాలేవీ నేను కోరీ వేడీ తెచ్చుకున్నవి కాదు. నమ్మండి, నమ్మండి, అవి కూడా యాదృచ్ఛికాలే. నాకు నేనై నీతో స్నేహం చెయ్యాలనుంది అంటూ చెయ్యి చాచిన సందర్భాలు లేవు. అంటే అదేదో ఘనమైన విషయం అని కానీ, నాకేదో అతిశయం అని కానీ అనుకోవద్దు. నాకు నేనై ఎవరినీ పల్లెత్తి పలకరించకపోవడానికి కారణం కేవలమూ నా పిరికితనమే. అవతలివారికి నాతో మాటాడ్డం ఇష్టం ఉంటుందో ఉండదో అన్న భయంతో వారే కదిలించేవరకూ ఎదురు చూస్తూ ఊరుకుంటాను. వారికి వారై కదిలించినప్పుడు కూడా అడగడుగునా ఉలికిపాటే. నేనెంతో జాగ్రత్తగా ఉన్నాననుకుంటాను కానీ నామాటలకి నొచ్చుకుని ఆ స్నేహాలకి పులిస్టాపు పెట్టేసిన లేదా పెట్టివేయబడినసందర్భాలు కూడా ఉన్నాయి. అందుచేత నాకు మాటాడడం చేతగాదని కూడా అనుకుంటాను. అంచేత కూడా నాకు నేనై ఎవరినీ పలకరించను. ఇంతకీ –
ఇదంతా ఎందుకొచ్చిందంటే, నాలుగరోజులక్రితం సునంద నన్ను వాళ్ళింటికి భోజనానికి పిలిచింది. సాధారణంగా నేను ఎవరింటికీ వెళ్లడానికి ఇష్టపడను. అంచేత ఆవిడ వాళ్ళింట్లో పెద్దపార్టీవేళ కాక, ఆ మర్నాడో మూడోనాడో పిలుస్తుంది నన్ను. ఆ రోజు మాత్రం నాతోపాటు మరో కుటుంబం కూడా ఉంది. మరొక్క కుటుంబమే కదా అనీ, వాళ్ళు చాలా మంచివాళ్లనీ, నేనేమీ అనుకోను అని వాళ్ళని కూడా పిలిచిందిట. మరి అంత చెప్పింతరవాత నేనేమీ అనుకోలేను కదా. ఏమాటకామాటే చెప్పుకోవాలి. నిజంగానే వారేమీ నన్నేవిధంగానూ నొప్పించలేదు.
రెండున్నర గంటలకాలం అన్నపానీయాలూ, పిచ్చాపాటీ కబుర్లతో అయిందనిపించి, వస్తాను మరి అంటూ లేచేను. లేచి నిల్చున్నాక, “ఇలా రా,” అంది చిన్ని చేతులూపుతూ నాకెదురుగా నిల్చుంది వాళ్ళ పాప. నేను అటుతిరిగి, దగ్గరికెళ్లి ముందుకు వంగి, నామొహం ఆ చిన్నారిమోముకి చేరువగా పెట్టేను ఏ బ్రహ్మరహస్యమో వినడానికి ఉద్యుక్తురాలినై. ఉత్తరక్షణం నేనెంత పొరపాటు బడ్డానో నాకు అవగతమయిపోయింది. ఆ చిన్నారి మునిగాళ్లమీదకి లేచి, మెడ ఉన్నంతలోనే రిక్కించి, నామొహం మరింత దగ్గరకు లాక్కుని నాచెంపమీద చిన్న ముద్దు పెట్టి గిరుక్కున తిరిగి వాళ్ళమ్మదగ్గర చేరి, ఆవిడవొళ్ళోకి వాలి నావేపు చూడసాగింది, రవంత సిగ్గుతోనూ, మరింత కొంటెతనంతోనూ. లేతగులాబీరేకులలాటి పెదాలమధ్య వస్తా వస్తానంటున్న నవ్వుని వద్దు వద్దంటూ ఆపేసింది.
నేను క్షణకాలం నివ్వెరపోయి చూస్తూ ఉండిపోయేను. నాకేం చెయ్యాలో, చెప్పాలో కూడా తోచలేదు. “నువ్వు ఆ పాపకి నచ్చేవు,” అంది సునంద. నేను ఆ పాపవేపు మళ్లీ చూసేను. ఆరముగ్గిన టొమేటోలాటి మొహం, పాలబుగ్గలూ, నీలికళ్ళూ, నుదుటిమీదకి లాగి నీటుగా కత్తిరించిన తేనెరంగు జుత్తూ కన్నులపండువగా ఉంది. నాలుగేళ్లుంటాయేమో. వీళ్లపిల్లలు విశాఖపట్నం జైలు వంకాయల్లా బొద్దుగా పెరుగుతారు కనక నిజవయసు చెప్పడం కొంచెం కష్టమే. పిల్లలేమిటి, పెద్దలూ అంతే. తెల్లారి లేస్తూనే గంటన్నరకాలం వెచ్చించి చేసుకునే ముస్తాబుమూలంగా వీరి నిజవయసు తెలుసుకోడానికి కూడా ఆ పుట్టించిన బ్రహ్మ దిగి రావాలి. అయినా ఆ పులుముకునే రంగులకంటే జాతి కూడా అనుకుంటాను. నేను అమెరికా వచ్చేక కనుక్కున్న వాస్తవాల్లో ఇదొకటి. ఒకజాతివారి వయసు మరొకజాతివారు అంత తేలిగ్గా అంచనా వేయలేరు.
అక్కడ ఉన్నంతసేపూ ఆ పాపతోనే ఆడుకున్నానని చెప్పలేను కానీ మధ్య మధ్యలో ఇదేమిటీ అదేమిటీ అని నన్నడిగినప్పుడు జవాబులు మాత్రం విధిగా చెప్పుకుంటూ వచ్చేను. ఆ తల్లి పాపని “ఆమెని అలా వేధించకు” అంటూ మర్యాదలు మప్పబోయినప్పుడల్లా నేను అంత మర్యాదగానూ ఫరవాలేదంటూ ఆమెకి భరోసా ఇస్తూ వచ్చేను. అదే కాబోలు ఆ పిల్లకి నచ్చింది. ఆ పాప సునందదగ్గరకి అంత చనువుగానూ వెళ్ళలేదు మరి. .
సునంద మళ్లీ ఏదో అనడంతో ఉలికిపడి, నా ఆలోచనల్లోంచి తేరుకుని, ముక్తసరిగా జవాబు చెప్పి అప్పటికి ఆ అధ్యాయం ముగించేను.
నేను ఈదేశం వచ్చి చాలా కాలమే అయినా, నాగదిలో నేను నాకు నేనే విధించుకున్న కారాగారంలో బయటి ప్రపంచంతో అట్టే సంబంధాలు పెట్టుకోకపోవడం చేత, ఈ లాంఛనాలన్నీ నిన్నో మొన్నో ఇక్కడ దిగినంత కొత్తే. మనదేశంలో పెద్దలు పిల్లల్ని ముద్దు చెయ్యడం ఉంది కానీ, పిల్లలు పెద్దలని ముద్దు చెయ్యడం లేదు కదా. అంతగా అయితే వచ్చి ఒళ్లో వాల్తారు. ఎత్తుకోమని చేతులు చాపుతారు. కృష్ణసర్పాల్లా కాళ్లకి చుట్టేసుకుంటారు. కొంగు పుచ్చుకు లాగుతారు. అంతే కానీ, ఇలా రా అంటూ పిలిచి ముద్దులు పెట్టుకోడాలు కనీసం నేనెరగను.
“మామూలుగా ఆ పిల్ల అస్సలెవ్వరిదగ్గరికీ రాదు,” అంది తల్లి.
“ఆహా,” అన్నాను ఇంకేం అనాలో తెలీక.
ఆ తరవాత నాలుగైదు వారాలకి కాబోలు, బుర్రలో ఆలోచనలతో విసిగిపోయి, కాస్త చల్లగాలిలో తిరిగితే, మనసు తేలిక పడగలదని బయల్దేరేను. కాస్త చిరాకు పాళ్ళు ఎక్కువగానే ఉండడంచేత, మామూలుకంటే మరో మైలు హెచ్చించేను.
ఓ యింటిదగ్గర గులాబీరంగు సైకిలు తొక్కుతూ ఆ పాపే మళ్ళీ కనిపించింది. నేను ఇన్నాళ్ళూ చూడనేలేదు వాళ్ళిల్లు ఇక్కడే అని. నావేపు చూసి చిన్నగా నవ్వింది. ఆ పిల్లమీద ఓ కన్నేసి ఆ పక్కనే నడుస్తున్న వాళ్ళనాయనమ్మ నన్ను చూసి పలకరించింది.
నేను కూడా నవ్వి మారుహలో చెప్పి అప్పు తీర్చేసుకుని, ముందుకు సాగబోతున్నాను. ఆవిడ నాతో మరేదో అంది. నేను ఆగేను.
ఆవిడ పిల్లని చూడ్డానికొచ్చిందిట. నాలుగు రోజులుంటుందిట. నేను వింటూ నడుస్తున్నాను. తనకేమో ఈ పిల్లని చూడకపోతే తోచదు. వాళ్లాయనకి అలాటివేం లేవు. కూర్చున్న చోటునించి కదలడు ప్రాణాంతకమైతే తప్ప. దైహికమైన అవసరాలు ఆ ప్రాణాంతకవృత్తిలోకి వస్తాయని చెప్పఖ్ఖర్లేదు కదా. వాటికి కూడా తాను కదలకుండా జరిగిపోయే మార్గం ఈ సైంటిస్టులంతా ఎందుకు కనిపెట్టలేదో అని చిరాకు ప్రదర్శిస్తాడుట. మొదట్లో తనని ఎక్కడికీ వెళ్ళనిచ్చేవాడు కాదు, తనకి జరగదని. ఇప్పుడు పిల్లలు కాస్త చేతికెదిగొచ్చేరు కనక వాళ్ళని హైరాన పెట్టేస్తూ, కావలిస్తే నువ్వెళ్ళు అన్నాట్ట. … నేను వినగలిగినంతసేపు విని, వెళ్ళాలంటూ గబగబ నాలుగడుగులేసేను. ఆవిడ కూడా నడక వేగం హెచ్చించి, ఎక్కడున్నారు, సాయంత్రం మాటాడుకుందాం అంది నావెంట నడుస్తూ. నాకు కొంచెం ఆశ్చర్యమే అయింది. సాధారణంగా ఇక్కడ అంత చనువు తీసుకుని కొత్తవాళ్లతో కబుర్లకి దిగేవాళ్లు తక్కువే అని నాఅభిప్రాయం. పైగా పిల్లని చూడ్డానికొస్తే, పిల్లతోనే కాలక్షేపం చెయ్యొచ్చు కదా. నేను సాయంత్రం ఇంట్లో ఉండననీ, మర్నాడు మరెక్కడికో వెళ్ళాలనీ, రాత్రుళ్ళు త్వరగా పడుకుంటాననీ, రానున్న వారంరోజుల్లో పూర్తి చేయకపోతే నాకొంప గుణ్ణం అయిపోగలదనీ, ఇంటికెవరో వస్తున్నారనీ, నేనెక్కడికో వెళ్ళాలనీ అనేక విధాల ఆవిడకి నచ్చచెప్పి బతుకు జీవుడా అనుకుంటూ ఇంటికొచ్చి పడ్డాను – సాకులే సాకులు. ఏం చెయ్యను? నాకు ఆవిడతో మళ్లీ మాటాడాలని లేదు.
మనసు తేలిక పడగలదన్న ఆశతో బయల్దేరిన నేను కుళ్లిన బూడిదగుమ్మడికాయలాటి తలతో తిరిగొచ్చేను. మనసంతా గజిబిజి అయిపోయింది. మనోజ్ఞమైన చంద్రుడికి మచ్చ, గులాబీకి ముళ్లు, కళకళ మెరిసే గురివింద నలుపు, చాసో చుట్ట, రావిశాస్త్రి మధుపాత్ర, మహాకవికి రెండు మిద్దెలు – సృష్టిలో తీయనిది స్నేహమే కానీ అన్ని స్నేహాలూ ఒకేరకం తీపి కాదు కదా. ఉప్పు కప్పురమే కాదు, తీపుల్లో కూడా వేరు వేరు తీపులు. కొబ్బరినీళ్ళతీపి పనసతొనలకి లేదు. కోవాకజ్జికాయలతీపి అతిరసాలకి రాదు. అంతే కాదు. నేను మరొక గుణం కూడా గుర్తించేను మిత్రమండలిగుణాల్లో. అదేమిటంటే ప్రతి స్నేహానికీ ఓ కొరత కూడా ఉంటుంది. ఆనాడు పాప నాయందు చూపిన స్నేహభావానికి స్పందించి మళ్ళీ పాపనైతే చూడాలనే అనుకున్నాను కానీ వాళ్ల నాయనమ్మ ఆ స్నేహభావాన్ని తగ్గించే కొరతభాగం. కనీసం కొంతకాలంపాటు ఆ పాపమాట మరిచిపోవాలి.
సుదీర్ఘంగా నిట్టూర్చి, కమ్మని, చిక్కటి కాఫీ కప్పున్నరయినా చెల్లిస్తే తప్ప తేరుకోలేననే నిర్ణయానికొచ్చేను. పొయ్యిమీద ఫిల్టరులో కాఫీ పొడీ, నీళ్ళూ పోసి, క్షణాలు లెక్కపెట్టుకుంటూ కూర్చున్నాను. మనసంతాల పెద్దగాలివానకి గల్లంతయిపోయిన జాలారిపేటలా ఉంది. దాదాపు వారంరోజులుగా ఇలాగే ఉంటోంది. ఉండుండి అరవైఏళ్లక్రితం ఒక అరవ ఆచార్యులవారు నాకు బోధించిన మంచిమాటొకటి మనసులో మెదిలింది. “స్నేహం అందరూ అనుకున్నంత సర్వసాధారణం కాదు. నిజమైన స్నేహితుడు జీవితంలో ఒక్కడు దొరికినా అదృష్టవంతుడివే,” అని. ఆవాక్యానికి అర్థం నాకు ఇప్పుడు తెలుస్తోంది, అరవై ఏళ్లతరవాత, ముఖ్యంగా నాకు తగిలిన “ప్రాణమిత్రుల”ని తలుచుకుంటుంటే. హౌరా ఎక్స్ప్రెస్ హోరెత్తి కూత పట్టి ముందుకు సాగిపోతుంటే, ముందుకి సాగిపోతున్న ఒక్కొక్క రైలుపెట్టెని చూస్తూ ప్లాట్ఫారంమీద నిలబడిపోయినవాడిలా ఉంది నామనసు.
అయిదోక్లాసులో పరిచయమయిన సూర్యకాంతం మొదలుకొని నిన్నా మొన్నటి సౌభాగ్యం వరకూ ఎన్ని స్నేహాలో. ఎంతమంది వచ్చి పోయేరో తలుచుకుంటే నాకే నమ్మకంగా లేదు. నేను నేనేనా అని. నాకే స్నేహాలూ అక్కరనేదు అనుకున్న నాకే ఇంతమంది ఉంటే స్నేహాలకోసం పాకులాడేవారి మాట చెప్పుకోవాలా?
రింగురింగుమంటూ ఫోను బడిగంటలా మోగడంతో ఉలికిపడి అప్పుడే అయిపోయిందా రీసెస్ అనుకుంటూ దానివేపు చూసేను. మిణుగురుపురుగులా మిణుకుమిణుకుమంటూ వెలుగుతున్న అదే ఆగిపోతుందేమోనని ఆశతో చూస్తున్నాను. ఏ అమ్మకాలరాయుడో నేనేదో అద్భుతమైన పడవప్రయాణం గెలుచుకున్నానని చెప్పడానికి కావచ్చు. లేదా, ఏ కంపెనీవారో నాకు లేనిజబ్బులకి ఉచితంగా వైద్యసలహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారన్నశుభవార్త కావచ్చు. ఏమీ లేకపోతే, నాకు లేని అప్పులు తాము తీర్చేస్తామంటూ నన్నాదుకోడానికి సిద్ధమయిన ఆపద్బాంధవులు కానోపు. ఫోనెత్తకపోతే, వారే విసుగేసి ఊరుకుంటారని నాఆశ. ఇంతలో కాఫీమాట గుర్తొచ్చింది. లేచి, చూసేను డికాషను దిగిందేమోనని.
“ఏంటి, ఇంట్లో లేవా, ఉండి తియ్యడంలేదా?” అవతలినించి శర్వాణి మారాం పెడుతున్నట్టు నిష్ఠురతూపులు ఫోనులోనుంచే వేయసాగింది మీరజాలగలవా నాయానతి పద్ధతిలో. ఈ సరిత్ప్రవాహానికి ఆనకట్ట కట్టలేం అనుకుని లేచేను. నా జవాబులపెట్టె నిముషంతరవాత ఆగిపోతుంది కానీ శర్వాణి ఆగదు. ఆమెవాణి అక్షయతూణీరం.
“నేనిక్కడ లేనిదాననై ఉన్నాను,” అన్నాను ఫోను తీసి.
“ఆహా, I am notకి అనువాదం కాబోలు. ఇంతకీ ఫోను ఎందుకు తియ్యలేదు?”
“పాకశాలలో కాఫీ పచరించే ప్రయత్నంలో చాలా చాలా బిజిగా ఉన్నాను. నువ్వే అయితే ఆసంగతి చెప్తావు కదా. నాకాఫీసేవ అయింతరవాత పిలిచి మాటాడొచ్చు అని ఊరుకున్నా. ఇంతకీ ఎక్కడ కొంపలు ములిగిపోతున్నాయి? ఎవరి కొంపలు ములిగిపోతున్నాయి?”
“నాకొంపే. నాకొంపలోనే.”
“అయ్యో, ఏమయిందేమిటి?” అన్నాను రవంత నొచ్చుకుని. నొచ్చుకున్నా లేకున్నా ఆమాత్రం అక్కర చూపడం న్యాయం. ఎంత చెడ్డా పెదనాన్నగారి కాబోయే కోడలికి పెత్తల్లి మనవరాలు. వాళ్ళు వియ్యమందినతరవాత నాకు అత్యంతదగ్గర బంధువులు అయిపోయే అవకాశం ఉంది.
ఇలా ఉంది నాఆలోచనాసరళి శర్వాణి తనకొచ్చిన కష్టాలు చెప్తున్నంతసేపూ. ఊఁ కొడుతూ, మద్య మధ్యలో ఓ, అలాగా, అయ్యో, అంటూ రెండు మూడు అక్షరసముదాయాలు పలుకుతూ కాఫీ చప్పరిస్తూ నేను విన్నకథ సూక్ష్మంగా ఇలా ఉంది – వాళ్ళ ప్రొఫెసరు తను రాసిన వ్యాసానికి బి ఇచ్చేడు. తాను ఆ పది కాయితాలూ సమకూర్చడానికి ఎంత అవస్థ పడిందో, ఎన్ని గంటలు నిద్ర, ఎన్ని గంటలు “సోష”జీవితం అనబడే సోషలైజింగు మానుకోవలసివచ్చిందో, ఎంతమందిఇళ్ళలో పార్టీలకి రానని చెప్పుకోవలసివచ్చిందో … వివరంగా ముప్ఫై తొమ్మిది నిముషాలపాటు ఏకధాటిగా వల్లె వేసింది. వల్లె అని ఎందుకంటున్నానంటే అన్ని విషయాలు అంత విపులంగా అంతసేపు చెప్పగలిగిందంటే, మరో నలుగురికైనా ఈ హరికథ పెట్టి ఉండాలి నా అనుభవంలో. లేకపోతే అక్కడక్కడ ఆగుతారు. మధ్యమధ్య ఆఁ, ఊఁ అంటూ ఆలోచనలో పడతారు. కాస్త తడుముకుంటారు మాట దొరక్క. మా శర్వాణికి మాత్రం ఆ ఆటంకాలేమీ లేకపోయేయి. అంచేత అనుకున్నాను ఇది చాలామందికి చెప్పినకథే అయివుంటుందని. అందులో కూడా ఓ సౌఖ్యం ఉంది. అంతమంది అయ్యో పాపం, ఎంత కష్టమెంత కష్టం అని ఆపసోపాలు పడుతూ, సానుభూతి వెలిబుచ్చి ఉంటారు కనక నేను కూడా అంత ప్రయాస మళ్ళీ పడఖ్ఖర్లేదు. అంచేత, నేను నాఎదుట ఉన్న బల్లమీద ఫోను పెట్టి, ప్రతి ముప్ఫై సెకనులకొకమారు స్పీకరులో ఓ, అయ్యో, ఆ అంటూ కాఫీ చప్పరిస్తూ కాలక్షేపం చేస్తున్నాను. అక్కడికీ శర్వాణి కనిపెట్టేసినట్టుంది, “వింటున్నావా, నాపాట్న నేనేదో వాగుతుంటే నీపని నువ్వు చూసుకుంటున్నావా?” అంది షెర్లక్ హోమ్స్ మేనత్తకూతురయినట్టు.
“వింటున్నాలే. చెప్పేను కదా కాఫీసేవనం కూడా సాగుతోందని.”
మరో పావుగంట ఈ కచేరీ అయేక, “ఇంకేంటి సంగతులు, ఏం చేస్తున్నావు?” అనడగింది. చెప్పొద్దూ. అప్పటికే నా ఓపిక సగం చచ్చింది. ఏమైనా ఉన్నా చెప్పాలనే సరదా పూర్తిగా చచ్చిపోయింది.
“ఏముంటాయిలే,” అని తెర దింపేసేను. ఆపిల్లదగ్గర శలవు పుచ్చుకుని, తేరుకుని నా పనులమీదికి దృష్టి మళ్ళించడానికి మరో పావుగంట పట్టింది. ఏం పనుల్లే. నిజం చెప్పాలంటే నాదృష్టి ఎటూ మళ్ళనంటోంది. అచ్చతెలుగులో అలో లక్ష్మణా అని ఏడుచుకున్నానన్నమాట.
ఇంక ఈగదిలో ఉండలేను, కొంచెం లేచి ఎటైనా వెళ్ళొస్తే కానీ మతి స్థిమితపడదు అనుకుని, బట్టలు మార్చుకుని వీధిన పడ్డాను. ఇక్కడ మీరు మరొక విషయం గమనించాలి. వీధిన పడదాం అన్నంతవరకే నా సంకల్పం. ఆ తరవాత నాకాళ్ళు మునిసిపాలిటీ ఎద్దులా వాటంతట అవే తీసుకుపోతాయి తమకి తోచిన దిక్కుకి. తోచినచోట ఆగిపోతాయి. నామెదడు నిర్దేశించ పనిలేదు.
ఆవిధంగా నాకాళ్ళు నాశరీరాన్ని పక్కవీధిలో రంగులబంగళాముందుకి చేరేసేయి. అది సంద్రాలున్న రెండస్థుల మహలు. రూపాయల్లో చెప్పుకుంటే కొన్ని కోట్లు విలువ చేయగల “శ్రీ”నివాసం. ఆ దొరబాబు ఇంటిముందు రాళ్ళతోట వేయించి, వాటికి రెండు వందల యాభైయారు రంగులు పులిమించేడు. అంచేత సంద్రాలు ఆ ఇంటిని రంగులబంగళా అంటుంది. అంచేత నాక్కూడా అదే పేరు, నాకు కాదులెండి, నేను ఆ భవంతికి ఉపయోగించుతున్నపేరు.
నడుస్తున్నంతసేపూ, ఏమిటో ఈ స్నేహాలు అని ఆలోచించుకుంటూ నడుస్తున్నాను. ఆ తరవాత స్నేహాలు ఎలా ఏర్పడతాయో అనిపించింది. ఆ తరవాత స్నేహాలు ఎందుకు అనిపించింది.
(ఇంకా ఉంది)
రెండోభాగం లింకు ఇక్కడ
హెచ్చరిక. స్నేహాలన్నీ ఇలాగే ఉంటాయన్న అపోహ నాకు లేదు. ఇది కేవలం నాకు కలిగిన ఆలోచనలు మాత్రమే.
(మార్చి 29, 2014)
థాంక్స్ తెరెసా. 🙂
మెచ్చుకోండిమెచ్చుకోండి
Oh, about మీ వచనంలోని తీపి, I second Nasy 🙂
మెచ్చుకోండిమెచ్చుకోండి
Oh, about , మీ వచనంలోని తీపి i second Nasy.
మెచ్చుకోండిమెచ్చుకోండి
haha, Quite amused at your ‘flight’ response to the little girl’s grandma. I think I catch myself having similar reaction to children these days. ( I am overdosed;) with them )
As much as I enjoy people’s company, I am quite choosy when it comes to making new friends. On quite a few occasions, I’ve had women making quick friends with me -uninvited- and confided their life stories. I quickly realized that they disappear as soon as their need for free counseling sessions is over 🙂
I am blessed with a few wonderful long- time friendships that I cherish.
malti garu, another beautiful, relevant post from you. Thanks.
మెచ్చుకోండిమెచ్చుకోండి
Facebookలో మీ ప్రశ్న చూసి నేను కూడా అదే అనుకున్నా. తెలుగులో రాయండి మొర్రో అని నేను ఎంత మొత్తుకుంటున్నా ఎవరికీ పట్టలేదు అని.
మెచ్చుకోండిమెచ్చుకోండి
brilliant. మొన్న ఫేస్బుక్కులో అందమైన తెలుగు వచనం ఎవర్రాస్తున్నారు అనడిగితే లలితగారనుకుంటా మీ పేరు చెప్పారు. నాకెందుకు స్ఫురించలేదబ్బా అనుకున్నా .. మరోసారి మీ వచనంలోని తీపిని ఆస్వాదించాను .. కజ్జికాయకీ పూతరేకుకీ మధ్యలో ఉంది 🙂
మెచ్చుకోండిమెచ్చుకోండి