మిత్రభావము సేసి -2

మొదటి భాగం ఇక్కడ

తమిళ ఆచార్యులుగారి , “నిజమైన స్నేహితుడు నీకు ఒక్కడు దొరికినా నీజీవితం ధన్యమైనట్టే,” అన్న సుభాషితానికి అర్థం ఇప్పుడు నాకు బాగా అవగతమవుతోంది. గత ఆరు దశాబ్దాలలోనూ నాజీవితంలోకి స్నేహంపేరున వచ్చి పోయినవారందరూ బొమ్మలపుస్తకంలో పేజీ తరవాత పేజీ తిరగేసినట్టు ఒకొకరు నామనఃఫలకంమీద మెదులుతున్నారు. చెప్పేను కదా ఈ స్నేహాలేవీ నేను ప్రారంభించినవి కావని. ప్రతిసారీ వాళ్లే మొదలు పెడతారు. వాళ్లే అంతం చేస్తారు. … కాదేమో, గట్టిగా ఆలోచిస్తే నేను మొదలు పెట్టకపోయినా అంతం చేసినవి లేకపోలేదు!

ఈ మిత్రవ్యవహారం తలుచుకున్నప్పుడల్లా, నాయనమ్మ నామనసులో మెదులుతుంది. అప్పుడు నాకు పదేళ్లుంటాయేమో, అదే తొలిసారి ఆవిడని చూడడం నేను. బరంపురంలో మా చిన్నాన్నగారింట్లో ఉండేదావిడ. చిన్నినాజీవితంలో మైత్రీభావానికి మధురమైన నిర్వచనం తెలుసుకున్నది ఆవిడదగ్గర్నుంచే. ఆవిడకి ఒక “నేస్తం” ఉండేది. బరంపురంలో “నేస్తం కట్టడం” అని ఒక ఆనవాయితీ ఉందిట. గుళ్ళో దేవునిఎదుట జరుగుతుంది ఈ నేస్తం కట్టడం. అప్పట్నుంచీ ఒకరినొకరు నేస్తం అనే పిలుచుకుంటారు. మీరు, మీరు అని ఒకరినొకరు సంబోంధించుకుంటారు. జీవితాంతం ఒకరికొకరు నేస్తంగానే మెలుగుతారు. పెళ్ళిలాగే అంది నాయనమ్మ. ఇప్పుడయితే పెళ్ళిలా అనడానికి లేదు. పెళ్ళికి విడాకులున్నాయి కానీ ఇలా కట్టిన నేస్తానికి తిరుగు లేదు మరి! మళ్ళీ రెండోసారి నాకాలేజీదినాల్లో నేస్తం అన్న ఆ రమ్యమైనపదం వినడం తటస్థించింది. మాక్లాసులో ఒకమ్మాయికి కూడా అలాటి నేస్తమే ఉండేది. మరి వాళ్ళిప్పుడు ఎక్కడున్నారో, ఆ కట్టిన నేస్తం ఎలా సాగుతోందో తెలిస్తే బాగుండనని ఉంది కానీ తెలుసుకునే అవకాశం లేదు.

మళ్ళీ సునందఇంట్లో కనిపించిన పాప జ్ఞాపకం వచ్చింది. సాధారణంగా స్నేహాలకి ఏదో ఒక ఉభయసామాన్యమైన ఆలోచనో, ఆసక్తో, ఆశయమో, ఆదర్శమో, ఇష్టమో, కోరికో ఉండాలి. ఒకొకప్పుడు విపరీతభావాలు – కోపం, కక్ష, ద్వేషంలాటివి కూడా ఇద్దరిని ఓ దరికి చేర్చవచ్చు. ఆ పైన, నివాసాలు, ఉద్యోగాలూ, సాంఘంలో స్థానం, రాజకీయాలూ … ఇలా మరి కొన్ని కూడా స్నేహం కట్టడానికి దోహదం చేస్తాయి సందర్భానుసారం. వాటిల్లో కొన్ని కలకాలం నిలవొచ్చు కూడాను. అంటే ఇళ్ళూ, ఊళ్ళూ మారిపోయినా వారిమధ్య ఉదయించిన సుహృద్భావం ఎడతెగక పారు ఏరులా నిరంతరం సాగిపోవచ్చు. ఉద్యోగాలు వదిలేసినా ఆనాటి మిత్రులని పదిలంగా పదిలపరుచుకోవచ్చు. యాదాలాపంగా బజారులో కనబడి మనవాడిలా ఉన్నాడే అని పలకరించి, పరమాప్తులయినవారు కూడా లేకపోలేదు. కానీ ఆ పాపకీ నాకూ ఎలా దోస్తీ కలిసింది అంటే మాత్రం చెప్పలేం. అది “తదితర” విభాగంలోకి వస్తుందనుకోవాలి. లేదా, ఆ పాప ప్రదర్శించింది స్నేహంకిందకి రాదు అని కూడా అనుకోవచ్చు. అది ఒక మనిషిని చూడగానే మరొక మనిషిలో కలిగిన స్పందననీ తద్వారా ఉదయించిన ఆత్మీయతనీ స్ఫురింపజేసి, అందులోని స్నిగ్ధమాధుర్యం చవి చూపడం అన్న కోవలోకి వస్తుంది. అది ఆ క్షణానికే కావచ్చు, కలకాలం నిలిచిపోయేది కావచ్చు. ఆ క్షణానికే అయినా అప్పటికి మాత్రం నూటికి నూరు పాళ్ళూ నిజమైన స్పందనే అనుకుంటాను.

నాతలలో తలపులు ఇలా వివిధరీతుల సాగిపోతుంటే, నా కాళ్ళు రంగులబంగళాముందు ఆగిపోయేయి. నేనిలా చెప్పా పెట్టాకుండా వచ్చేయడం బాగుండదేమో అని సందేహిస్తూనే మరో రెండడుగులు ముందుకి వేసేను. అట్టే శ్రమ లేకుండానే సంద్రాలు కనిపించింది మేపుల్ ఛాయలో సిమెంటు చప్టామీద. ఓ పక్కన నీటిపాయలు మూడు చివ్వున అడుగున్నర ఎత్తు గాలిలోకి లేచి, విలాసంగా ఒంపులు తిరిగి కిందనున్న రంగులరాళ్ళమీంచి జారిపోతున్నాయి నిర్విరామంగా గలగల చిరుసవ్వడి చేస్తూ.

నేను నెమ్మదిగా మరో నాలుగడుగులేసి పరీక్షగా చూసేను ఏం చేస్తోందో అనుకుంటూ. సంద్రాలు తలొంచుకుని ధ్యానముద్రలో ఉన్న మునీశ్వరుడిలా తన చుట్టూ ఉన్న సమస్త చరాచర ప్రపంచాన్నీ మరిచిపోయి, ఉడకపెట్టిన పచ్చి వేరుశనగ కాయలు వొలుచుకు తినడంలో నిమగ్నమయి ఉంది.
నేను బాగా దగ్గరకొచ్చే, అలికిడి విని తలెత్తి చూసి, “ఏటిలా వెల్పొచ్చీసినావు ఓ పాలిట్రా అని ఆణ్ణించే కేకేకండా,” అంది కళ్లు చికిలించి చూసూ, బల్లమీద ఓ పక్కకి జరిగి గుప్పెడు వేరు శనక్కాయలు నా చేతిలో పోస్తూ.

అబ్భ ఎంతకాలం అయింది నిన్ను చూసి, రా రా అంటూ ఆప్యాయంగా పలకరించాలి కానీ ఎందుకొచ్చేవని అడగడం ఏమిటి? నేను చిన్నబుచ్చుకుని అదే మాట అడగబోయేను కానీ ఓపిక లేకపోయింది. పైగా ఆమె అన్నమాట కూడా నిజమే. ఎప్పుడు సంద్రాలుతో ఊసులాడుకోవాలనిపించినా మా మాడాబామీంచే కేకేస్తూ వచ్చేను ఇంతవరకూ.

“ఇవెక్కడివీ?” అన్నాను, సంద్రాలడిగిన ప్రశ్న వదిలేసి.

“దొరబాబు అదేదో దుకానంల కనిపిచ్చినయ్యని తెచ్చినాడు. నివ్వే ఎందలకొచ్చినవని అడిగ్తే సెప్పవేటి?” అంది మళ్లీ వదలకుండా.

“అస్తమానం నేను నిన్నలా కేకేసి పిలవడం మర్యాద కాదని, అప్పుడప్పుడు నేను కూడా వస్తూ ఉండాలని తోచి వచ్చేను,” అన్నాను అతితెలివికి పోతూ.

“సొల్లు కబుర్లు సెప్పమాక. ఏదొ పని బడ్నాది, వొచ్చినవు. ఏటయిందేటి?” అంది సంద్రాలు నావంక పొడిచేసేలా చూస్తూ. సంద్రాలు మాట ఉంచుకోదు. మాట మిగలనివ్వదు. కంప్యూటరులో వెతుకు అంటూ కీ కొడితే ఆ పదం ఉన్న ప్రతి స్థానము కనిపించినట్టుగానే, సంద్రాలు జవాబులు కూడా. డొంకతిరుగుడుమాట పొసగదు ఆవిడదగ్గర.

“నీతో మాటాడాలనే వచ్చేను,” అన్నాను ఇహ ముసుగులో గుద్దులాట ఎందుకులెమ్మని.

“అత్తెలస్తనే ఉన్ది. ఏటయినాదేటి?” అంది.
నాచేతిలో పోసిన వేరు శనక్కాయలు వొలుచుకుని ఒక్కొక్క గింజే నోట్లో వేసుకు నములుతూ కొన్ని క్షణాలు గడిపేను. తరవాత నెమ్మదిగా అన్నాను, “ఏంటో సంద్రాలూ, నాకు ఈ స్నేహాలన్నీ రోజురోజుకీ అయోమయం అయిపోతున్నాయి. ఓ పక్క కావాలనీ ఉంటుంది. మరో పక్క విసుగ్గానూ ఉంటుంది,” అన్నాను దిగులుగా. ఇలా చెప్తూ, నామీద నాకే జాలి పుట్టి నాదిగులుని రెట్టింపు చేసేసుకున్నాను.

“నీకు సేయితాలు పడవంతవు గద, మల్ల ఉప్పుడిదేటి?”

“అదే నేనంటున్నది కూడాను. ఇవాళ్టికి ఇవాళ ఏమయిందో తెలుసా. ఎవరితోనైనా మాటాడితే బాగుండు అనుకుంటూ బయల్దేరేను. ఎవరో ఒకామె నన్ను రోడ్డుమీద ఆపేసి తనగోడు మొదలెట్టింది. మరి అవి మాటలే కదా, నేను మాటాడాలనే బయల్దేరేను కదా, మరి ఎందుకు నాకు చిరాకేసింది అనీ?”

“నీకసలు బుర్ర నేదు.”

“ప్చ్. అందుకే కద నీదగ్గరకొచ్చింది. నీ బుర్ర ఉపయోగించుకుని అర్థం చేసుకుందాంవని.”

“ఓసోస్, ఆ మాతరం నీకు తెల్దదని.”

నాకు తెలీదని ఒప్పుకోడం కూడా చిన్నతనంగానే అనిపించింది. “కాదులే, ఒకొకప్పుడు తెలిసినసంగతులు కూడా మరొకరు చెప్తే మరింత బాగా చక్కగా స్పష్టంగా తెలుస్తాయి,” అన్నాను.

“సరి, ఒకొకరి సంగతి సెప్పు. ఏటయినాదో నాన్సెప్తను,” అంటూ లేచింది.

“అదేమిటి, కథ చెప్పమంటూ లేచిపోతున్నావు?”

“సెనిక్కాయ్లయ్పోనాయి. నీలు తెస్తనికెల్తన్న.”

పెద్ద కూజాతో తిరిగొస్తున్న సంద్రాల్ని చూస్తే నాకు నవ్వొచ్చింది. నేను చెప్పబోయే హరికథకి అదే చాలు, మరి వేరే వ్యాఖ్యానం అఖ్ఖర్లేదు.

“అది కాదు. మాఆఫీసులో ఒకావిడ ఉందని చెప్పేనా. రోజుకి నాలుగుసార్లు పిలుస్తుంటుంది. నిన్న ఏదో తెలుగు సినిమా ఊళ్ళోకొచ్చింది, వస్తావా అంది. నాకు సినిమాలసరదా లేదు కానీ ఆవిడ పిలిచింది కదా అని సరేనన్నాను. తీరా అక్కడికెళ్ళింతరవాత, ఆవిడా వాళ్లాయనా “పక్క హాల్లో మరో ఆటకెల్తాం, నువ్వు ఈ ఆట చూడు. రెండు ఆటలూ అయింతరవాత ఇక్కడ కలుద్దాం” అంది. నేనొక్కదాన్నీ ఆట చూడాలనుకుంటే నేను వెళ్ళలేనూ, ఆయమ్మ నన్నెందుకు పిలిచినట్టు? దంపతులిద్దరూ సరదాగా సినిమాకి పోదలుచుకుంటే నన్నెందుకూ పిలవడం?” అన్నాను భట్టి విక్రమార్కుడిని ప్రశ్నించిన భేతాళుడిగొంతు అరువు తెచ్చుకుని.

“ఏదో ఆల గొడవలాలకుంతయి.”

“సరే. మరోకథ. నేనీదేశం రాకముందునించి తెలిసిన మిత్రసత్తమురాలు వాళ్ళఊరు పిలుస్తుండేది. ఇక్కడికి కారులో ఆగకుండా పోతే మూడున్నరగంటల్లో చేరిపోతాం. సరే అని వెళ్ళి తలుపు తట్టేను. తలుపు తీస్తూనే ఆవిడగారన్న మొదటి వాక్యం ఏమిటో తెలుసా?”

“ఏటన్నదేటి?”

“రమ్మనగానే వచ్చేసేవేమిటి అంది.” అన్నతరవాత అనిపించింది, ఇందాకా సంద్రాలు అన్నమాటకి అది దీటుగానే ఉందని. కాదులే, అది వేరు అని నాలో నేనే సరిపెట్టుకున్నాను. సంద్రాలు మరి నన్ను పిలవలేదు కదా.

“చాన్నాల్లగ స్నేయితం అంతన్నవ్ గద. ఆసికాలకనుంటది. నివ్వలగ సీటికి మాటికి. పెతి మాటకి తప్పడ్తవేటి, మల్ల సేగితిం ఉందన్నదంటవ్. నీదే తప్పు.”

రత్నంతో పదేళ్ళ స్నేహం. పదే పదే రమ్మంటోందని వెళ్తే, గుమ్మంలోనే అలా అనడం బాగుందా? మాటకి మాట అనుకునే స్నేహితులమే కనక నేను హాస్యంగానే తీసుకోవచ్చు. నిజానికి ఆనాడు నవ్వేసి ఊరుకున్నాను కూడా. కానీ ఇప్పుడు తలుచుకుంటే కొరతగానే ఉంది!

“నీబుద్ది బుగ్గయిపోతన్నది నానాటికి.”

నాక్కోపం వచ్చిందామాటకి. మొహం ముటకరించుకున్నాను వీధివేపు చూస్తూ. అంతరాంతరాల్లో ఏమూలో ఆమాట నిజమే కదా అంటోంది నా still small voice within కానీ విననట్టు నటించేను.

సంద్రాలే మళ్ళీ అందుకుంది. “ఆ యమ్మెవురో నీకు సెయ్యిరిగినప్పుడు రెన్నెల్లపాటు ఇంటెట్టుకుని సెప్పలేనంత సాకిరి సేసిందని నివ్వే అన్నవు గద. ఈరోజల్ల ఎవురు సేస్తరల్లాగ. నాల్రోజులున్నిస్తే గెనం.”
నిజమే. వరలక్ష్మి నన్ను రెండున్నర నెలలపాటు ఇంట్లో పెట్టుకుని చేసిన సేవకి నాచర్మం చెప్పులు కుట్టించిచ్చినా చెల్లు కాదు. తోబుట్టువులే “వస్తున్నాం” అంటే ఎన్నాళ్ళుంటావు అని అడిగి కానీ రావచ్చో రాకూడదో చెప్పరు. ఇప్పుడు కాదు అప్పుడు కాదు, ఈ ఏడు కాదు, వచ్చేయేడు అంటూ రావద్దని వాయిదాలరూపంలో చెప్పేవారికి లేఖ్ఖే లేదు. అయినా నాకు సంతృప్తిగా మాత్రం లేదు. ఏదో అసంతృప్తి. రెండేళ్ళు వరలక్ష్మిని చూసినతరవాత నాకు అర్థమయింది. తనకి నేననే కాదు ఎవరో ఒకరు దురవస్థలో ఉండడం కావాలి. ఎవరికి ఎప్పుడు అవుసరం వస్తుందా అని ఎదురు చూస్తున్నట్టుంటుంది ఎప్పుడు పిలిచినా. ఎవరికీ ఏ అవుసరమూ లేనిరోజున నీరసపడిపోతుంది. అది కూడా ఒక దురవస్థ అనడం మర్యాద కాదు కానీ … నాకు అలా అనిపిస్తుంది.

“సాయం చేసినమాట నిజమే. కానీ అది నేను చెప్తున్నలాటి స్నేహం కాదు,” అన్నాను.

“ఎందుగ్గాదు?”

“ఎందుక్కాదంటే ఆపదలోనున్నవారిని ఆదుకోడం ఆ అమ్మాయికి సహజగుణం కర్ణుడి కవచకుండలాలలాగ పుట్టుకతో వచ్చినవి. అందరికీ చేసినట్టే నాకూ చేసింది. నేను ఆమెకి తిరిగి చేయగల సాయం కూడా ఏమీ లేదు. ఇప్పుడు, నా అవసరం తీరిపోయినతరవాత, నాకు మరో అవసరం లేనప్పుడు, తనయితే పిలిస్తుంది కానీ తీరా వెళ్తే మాకు మాటాడ్డానికేం ఉండదు. కాగా ఆమెనించి సాయం పొందవలసినదుస్థితిలో నేను పడ్డందుకు నాకు మరింత బాధగా కూడా ఉంటుంది,” అన్నాను. స్నేహితులు ఆపద్బాంధవులు కావచ్చు కానీ స్నేహం అంటే ఆపదలో ఆదుకోడం మాత్రమే కాదు అంటూ ఆ రెండు అవస్థలమధ్య తారతమ్యం విశదీకరించేను.

“అసలదే నిజఁవేన సెయితంవంటె. నీకు సేసేను నాకు ఏటి సేస్తవనకండ సేసింది. నివ్ తప్పట్టంవేం మరియాద?” సంద్రాలు కసురుకుంది.

మొత్తం మాయిద్దరిమధ్యా జరిగిన సంభాషణ అంతా చెప్పను గానీ సూక్ష్మంగా నాకెందుకు బాగులేదో చెప్తాను. జ్ఞానేశ్వరి ఏవో తన ఈతిభాధలు చెప్పుకుపోతూ ఉంటుంది కనిపించినప్పుడల్లా. నేనేదైనా చెప్పబోతే మధ్యలోనే కత్తిరించేస్తుంది. మధురగోపాలం తాను చూసిన సినిమాల్లో హాస్యఘట్టాలన్నీ నటించి చూపించేస్తుంటాడు. నాకందులో హాస్యం కనిపించదు. సౌగంధిని పాకశాస్త్రప్రవీణ. కనిపించినప్పుడల్లా తాను చేసిన కొత్త కొత్త ప్రయోగాలన్నీ నాకు ఒప్పచెప్పుతూంటుంది నామొహమ్మీదికి ఒంగి కళ్లూ, చేతులూ రకరకాల భంగిమలలో ఉంచి. అది చూస్తుంటే, ఆవిడ నాకు నాట్యశాస్త్రం నేర్పుతోందో పాకశాస్త్రం నేర్పుతోందో స్పష్టం కాదు. నేను చేయగలిగిందల్లా ఎప్పుడయిపోతుందా ఈ ప్రదర్శన అని ఎదురు చూస్తూ కూర్చోడమే. గోవర్ధనరామావధానులకి నేత్రావధానం నేర్చుకోవాలన్న తాపత్రమయితే ఉంది గానీ దానికి కావలసిన శ్రద్ధ, దృఢచిత్తము, ధారణ, నైపుణ్యము, వైదుష్యము ఆ ఆరడుగుల మూడంగుళాల దేహంలోనూ ఇముడుతున్నట్టు కనిపించదు అంజనం వేసి చూసినా. ఇంక నాకత్యంతం ప్రీతపాత్రమైన సాహిత్యంసంగతి తీసుకుంటే, నేను ఎదురుపడ్డప్పుడు నేనుఎంతో ఘనంగా సాహిత్యసేవ చేస్తున్నానంటూ నామొహంమీద మెరమెచ్చు కబుర్లు చెప్పేవాళ్లే కానీ నిజంగా నేనేం చేస్తున్నానో, చేసేది సాహిత్యసేవ అవునో కాదో చెప్పగల విద్వద్వరేణ్యులు నాకింతవరకూ తటస్థపడలేదు. నేనీమాట చిత్తశుద్దితో ప్రమాణపూర్తిగా చెప్తున్నాను. నేను ఏదైనా పనికొచ్చేది చేస్తున్నానా లేదా. నేను చేస్తున్నదానివల్ల ఎవరికైనా ఏమైనా ఉపయోగం ఉందా అని నాకు తెలుసుకోవాలని ఉంది. … అవునౌను. సభలు చాలానే పెట్టేరు, శాలువాలు చేరేయి రెండు పెట్టెలు నిండుకు. లేదు, లేదు, ఇక్కడ “నిండుకు” అంటూ నిండుకున్నాయి అన్న విపరీతార్థంలో కాదు. పెట్టెలనిండా ఉన్నాయనే అర్థం. వాస్తవంలో, ఆ సన్మానాలన్నీ అవి ఏర్పాటు చేసిన సంస్థల, సభాపతుల, కార్యకర్తల ప్రచారార్థము మాత్రమే అని తెలిసేసరికి నాసాహిత్యజీవితంలో ముక్కాల్‌ వాసి మురిగిపోయింది. ఒకరిద్దరు నామొహమ్మీదే ఏ సందేహాలకీ ఏమాత్రమూ అవసరం లేకుండా చక్కని భాషలో స్పష్టం చేసేరు నేనెలా ఉంటానో చూడ్డానికొచ్చేరు కొందరని. అదే, పంతులుగారొగ్గీసిన ఆడమనిషి ఎట్టుంటదో సూణ్ణానికి అన్నమాట. ఇంకా కొందరేమో వారు సృష్టించిన పుస్తకరాజములు నేను అమెరికాలో ప్రచారం చేసిపెట్టగలనేమో అనిట. అవ్విధమున నా సాహిత్యసేవ పవమానసుతుడు బట్టు పాదములకు చేరిపోయింది. … …

ఇలా ఇరవై నిముషాలపాటు గానం చేసేను నా సోది. ఇలా చెప్తుంటే నామటుకు నాకే హాస్యాస్పదంగా నాచెవుల్లో ప్రతిధ్వనిస్తోంది. ఏ పదహారేళ్ల పడుచుపిల్లో ఇలా కథనం సాగిస్తే, వైనీ అనో వింప్ అనో అంటారు. నాబతుకు మూడొంతులయిపోయినతరవాత నేనూ అంతే!

సంద్రాలు కనుబొమలు ముడిచి, తీక్షణంగా నామొహంలోకి తేరి చూసి, విసురుగా తలాడించింది. నీఖర్మ అనో, నీకింక పుట్టగతులుండవనో నాకయితే సరిగా అర్థం కాలేదు.

అంచేత మళ్ళీ అడిగేను. “ఇదుగో, నువ్వేదో నా ప్రాణస్నేహితురాలివనీ, నన్ను అర్థం చేసుకున్నదానివనీ, చేసుకోగలదానివనీ, అపార్థం చేసుకోనిదానివనీ ఇక్కడికొచ్చి, నామనసులో మాట ఉన్నదున్నట్టు, ఎంత వెగటయినా సరే, వెళ్ళగక్కేను. నువ్వేమో హరికథ విన్నట్టు విని, ఆ హరికథ రక్తి కట్టలేదన్నట్టు తలాడిస్తే ఏమనుకోమంటావు?” నాకింక గోదారే గతేమోనని అని కూడా అనుకున్నాను, పైకి అనలేదు కానీ.

సంద్రాలు మరోసారి తల పంకించి, చిన్ముద్ర పట్టి, “నీజాతికంల సేయితం నేదు,” అంది.
నేను తలాడించేను నాక్కూడా అదే అనుమానంగా ఉందన్నట్టు. ఆ తరవాత, ఓ గ్లాసెడు మంచితీర్థం పుచ్చుకుని సంద్రాలు నా వాదనలన్నీ ముక్కకి ముక్క పూర్వపక్షము చేయడం మొదలు పెట్టింది. మళ్ళీ ఆ కచేరీ అంతా ఇక్కడ పెట్టను కానీ, సూక్ష్మంగా సంద్రాలు అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.

“ఎవురైన ఏటి మాటాడ్తరు. ఆల్లకి తెలిసిందె చెప్తరు. చినిమవోలు చినిమలు, యాపారాలోరు యాపారాలు. మనుంవే కతలు సెప్పుకుంటన్నం సీతమ్మోరి కస్టాలు, కిస్ట పరమాతమ సింగారం సెప్పుకుంతన్నంవా నేదా. నివ్ మాతరంవేటి సెప్తన్నవ్, నీకు తెల్సిన కతలు, నివ్వు రాసిన కతలే గద. నీకు తెల్సిందే సత్తెం, ఆరికి తెల్సింది సత్తెం గాదని ఎక్కడున్నది? నీకు బాగనేపోతె గమ్మునుండు. ఆర్ని తప్పు పట్టమాక. నీకు నచ్చనేదు. వొదిలీ. నీకు స్నేయితం గావాలంతె నీకు నివ్వెంతొ ఆరికి ఆరంతె. అవ్వా గావాల బువ్వా గావాలంతె కుదుర్దు.”

ఉలిక్కి పడ్డాను. అదా నేను కావాలంటున్నది? తలొంచుకుని ఓ రెండు నిముషాలు ఆలోచించేను. తరవాత తలెత్తి చుట్టూ చూసేను. సంద్రాలు కనిపించలేదు. కళ్ళు నులుముకు చూసేను. సంద్రాలు లేదు.

అకస్మాత్తుగా, నాకు చాలాసార్లు వచ్చిన కల ఒకటి జ్ఞాపకం వచ్చింది చాలా రోజులతరవాత. ఆ కల కొంతకాలం తరుచూ కనిపిస్తూ ఉండేది. చుట్టూ అనంతపారావారం, దిగంతాలలో నింగిని చుంబిస్తూ అంభోనిధి. రెండు నిలువుల ఎత్తుకి ఎగజిమ్మి, మారీచుసుబాహుల్లా విరుచుకుపడి, మహోధృత వేగంతో నావేపు ఉరుకులు పరుగులుగా వస్తున్నతరంగాలు. నేను పెద్ద బండశిలపైన నిల్చుని చుట్టూ చూస్తున్నాను. కనుచూపుమేర పారావారమే తప్ప, బండశిలమీద నేను తప్ప మరో జీవి కనిపించడం లేదు. నేనెలా అక్కడికి వచ్చేనో, ఈ జలరాసి ఎప్పుడు అంతమవుతుందో అని చూస్తున్నట్టున్నాను.

మెళుకువ వచ్చినతరవాత కూడా నాకు ఆదృశ్యం మనసులో చాలాసేపు మెదులుతూనే ఉంటుంది. ఆరోజుల్లో మా అమ్మ అనేది నీళ్ళు కనిపిస్తే నిధి కనిపిస్తుంది అని. ఆ నిధులకోసం ఎదురు చూస్తూండగానే నా జీవితం ముగింపుకొస్తోంది! ఇది ఏకాంతవాసమందు నాకు గల ఆకాంక్షకి సంకేతమేమో అని అనేకమారులు అనుకున్నాను. ఇప్పుడు మళ్ళీ అలా అనిపిస్తోంది. ఎటొచ్చీ ఇది కల కాదు. ప్రస్తుతం నేను మెళుకువగానే ఉన్నాను. దూరంగా మనుషులు కనిపిస్తున్నారు. చుట్టూ రంగురాళ్లతోపాటు తరులతాగుల్మాదులు జీవకోటి అస్తిత్వాన్ని ఋజువు చేస్తున్నాయి. సంద్రాలు మాత్రం మళ్ళీ కనిపించలేదు.

పొగలుతున్న వగతో విలియం కొపర్ కవిత నాకళ్ళముందు ప్రభవించింది.
How sweet, how passing sweet, is solitude!
But grant me still a friend in my retreat,
Whom I may whisper, Solitude is sweet.

(William Cowper, from Poems by William Cowper of the Inner Temple, Esq. (1782). Retirement.)

సంద్రాలూ, నువ్వే నా పాసింగ్ స్వీట్ ఏకాంతానివి!


అన్నట్టు చెప్పడం మరిచిపోయేను.  సంద్రాలెవరంటే, ఈబ్లాగులో చాలాచోట్ల కనిపిస్తుంది. కనీసం ఈ రెండు చదవాలి.

అక్షరమ్ పరమమ్ పదమ్ http://wp.me/p9pVQ-5m

సంద్రాలేటంటదంటే – http://wp.me/p9pVQ-HS

(అయిపోయింది.)
(మార్చి 3, 2014)

 

 

 

 

 

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

13 thoughts on “మిత్రభావము సేసి -2”

 1. సృష్టి లోని అన్ని బంధాల్లో స్నేహం పెళ్లి ఈరెండు మాత్రమే మనం వెతుక్కోగలిగిన బంధాలు అక్కర లేక పోతే విడువ తగినవి కూడా…పెళ్లి సంగతి ఏమోకాని స్నేహం అంటే లక్ష్యం ఉండదు చాలామందికి కలుస్తూ వదిలేస్తూ వెళ్తుంటారు..కానీ గాఢమైన స్నేహం నీ అంతరాత్మ లాంటిది అది ఎపుడు నిన్ను వదలదు వదులుకోదు..

  మెచ్చుకోండి

 2. teresa, అందరికీ సంద్రాలిమాటలే బాగున్నాయి. నేనింక రాయడం మానేసి సంద్రాలికి అప్పచెప్పేదాం అనుకుంటున్నాను. సంద్రాలన్నడగండి (మరియు నన్నడక్కండి) అని ఓ శీర్షిక మొదలు పెట్టమంటారేమిటి? :p

  మెచ్చుకోండి

 3. విన్నకోట నరసింహారావుగారూ, కావచ్చు 🙂 నాకొక సిద్ధాంతం ఉంది – రచయితలు తమని పాఠకులు ఎలా చూస్తే వారికి బాగుంటుందో అలా తమని తాము తమ కథల్లో చిత్రించుకుంటారని. సంద్రాలు అలాటి పాత్ర! 🙂

  మెచ్చుకోండి

 4. సంద్రాలు ఇచ్చే వివరణల్లో జీవితాన్ని చూసిన అనుభవసారం కనిపిస్తుంటుంది కదా. అందుకే నాకెప్పుడూ అనిపిస్తుంటుంది మీరు సంద్రాలు alter ego అని. అవునా?

  మెచ్చుకోండి

 5. మాలతి గారు, మీకూ నాకూ మధ్య తరాల అంతరం ఉండి ఉండవచ్చు కానీ మీ టపా మాత్రం మనో దర్పణ దర్శనం చేయించింది, నిజంగా. ఏమీ తోచని ఒక సాయంత్రం వేళ సరదాగా ఒక కప్పు కాఫీతో అల్లిబిల్లి ఊసులు చెప్పుకోవాలని అనిపించినపుడు మనసుకి దగ్గరగా వచ్చిన నేస్తం కోసం ఎక్కడ వెతుక్కోవాలో అర్థం కాదు. వందల కొద్దీ ఉన్న ముఖపుస్తక లిస్ట్ లోనా ఎందుకూ పనికిరాని లింక్డ్ ఇన్ లోనా, ఏమో ఎక్కడా ఒక్కరు కూడా దొరకటం లేదే. ఎంతో భద్రంగా అల్లుకున్న పాత నేస్తపు పందిర్లని గ్రీన్ కార్డులూ, బాంక్ బాలన్సులూ, పొజిషన్లూ నిర్దాక్షిణ్యంగా పీకి పారేసాక వెతుక్కొటనికీ తల్చుకోటానికీ ఏమీ మిగల్లేదు. మనసున మనసై అన్నది నిజానికి జీవిత భాగస్వామి కన్నా మన మనసు ఎరిగిన నేస్తానికే ఎక్కువ ఆపాదించగలం, కానీ అవన్నీ కవితల్లోనే మిగిలిపోయిన భావాలేమొ ఈ తరానికి. పెద్ద కామెంటుని మన్నించెయ్యండి ఈ సారికి.

  మెచ్చుకోండి

 6. brilliant. ఒక్కసారి అద్దంలో చూసుకున్నట్టు అనిపించింది. .. నా మట్టుకి నాకు .. చీకటి మూసిన ఏకాంతములో .. తోడొకరుండిన అదే భాగ్యమూ, అదే స్వర్గమూ .. అనుకుంటూ ఉంటాను.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s