మద్దిపట్ల సూరిగారి స్వయంసిద్ధ

మణిలాల్ బెనర్జీ (బందోపాధ్యాయ బెనర్జీ)రచించిన స్వయంసిద్ధ నవలకి మద్దిపట్ల సూరిగారి అనువాదం ఇది. తెలుగుదేశంలో బెంగాలీ నవలలంటే చటుక్కున గుర్తుకొచ్చేబెంగాలీరచయితలు శరత్, టాగోర్. అసలు తెలుగు దేశంలో శరత్ ప్రాచుర్యం చూస్తే, శరత్ తెలుగువాడే అనిపించిందన్నా తప్పు లేదు. కానీ మనం మరొకటి మర్చిపోకూడదు. ఆ నవలలు అంతగా తెలుగుపాఠకులను ఆకర్షించి ఆకట్టుకున్నాయంటే ఆ అనువాదకులప్రతిభే అన్నది.

నేను అనువాదరచనని సమీక్షించడం ఇదే మొదలు కనక స్థూలంగా అనువాదాలగురించి ఒక మాట ముందు చెప్పాలి.

సాధారణంగా నవలలో పాఠకులని ఇతోధికంగా ఆకర్షించేవి ఇతివృత్తం, పాత్రచిత్రణ, పరిష్కారం లేక ముగింపు. అనువాదాలగురించి ఆలోచిస్తున్నప్పుడు, అనువాదకుడు మూలకథ యథాతథంగా ఉంచుతాడు కనక, ఉంచాలి కనక, ఇతివృత్తంవిషయంలో అనువాదకుడు చేయగలిగిందేమీ లేదు. ఆయన తన ప్రతిభ చూపించగలిగింది ఏ భాషలోకి అనువదిస్తున్నాడో ఆ భాషలో తనకు గల శక్తత ఉపయోగించుకుని అనువాదాన్ని పరిపుష్టం చేయడం.

విద్వాన్ విశ్వం, మద్దిపట్ల సూరి, సూరంపూడి సీతారాం – ఈ పేర్లు తలుచుకుంటే నాకు ఇప్పటికీ, అంటే 50, 60 ఏళ్లతరవాత, ఏ వారపత్రికపేజీవో నాకళ్లముందు మెదులుతుంది. అది వారి అనువాదప్రౌఢిమకి తార్కాణం. వారికథనం అచ్చమైన తెలుగుకథ చదువుతున్నంత హృద్యంగమంగా ఉండడం.

మద్దిపట్ల సూరిగారు అది సాధించేరు ఈ నవలలో విజయవంతంగా. స్వయంసిద్ధ చదువుతుంటే, ఇది బెంగాలీనవల అని మనకి తెలియజెప్పేవి కొన్ని సందర్భాలు ఉన్నాయి. వాటిగురించి తరవాత చెప్తాను. కానీ ప్రధానంగా ఆ నవలలో భాష మనం దినదినం చదివే పుస్తకాల్లో చూస్తున్నభాషే.

స్థూలంగా కథ – సామాన్య గృహస్తు, ఆయుర్వేదవైద్యుడు అయిన కరాలీ ఛటర్జీ కూతురు చండీ. ఆ అమ్మాయికి ఐదేళ్ళ వయసప్పుడు మాతామహుడు చూసి ముచ్చటపడి, తనతో పంజాబ్ తీసుకెళ్తాడు తండ్రిఅనుమతితో. ఆయన వ్యాయామశిక్షకుడు, బహుభాషాకోవిదుడు, సకల శాస్త్రాలు చదివినవాడు. ఆయన తనవిశ్వాసాలప్రకారం చండికి ఆరోగ్యశిక్షణ, విద్యాశిక్షణతోపాటు ఆత్మగౌరవాన్ని కాపాడుకోడం కూడా నేర్పి పరిపూర్ణురాలిని చేస్తాడు. ఆమె యౌవనదశ ప్రవేశించేవేళకి ఆరోగ్యం, అందంతోపాటు అనేక విద్యలలో అనవద్యమైన మేధ కూడా సంపాదించుకుని, తాతగారు దివంగతులయేక తిరిగి తండ్రిఇంటికి వస్తుంది. అప్పటికి ఆమెవయసు పన్నెండు.

చండి అపూర్వగుణగణాలు  విని చండప్రచండుడైన బాశులి జమీందారు హరినారాయణబాబు, శ్యామాపురానికి తానే స్వయంగా వచ్చి ఆమెని కోడలిగా చేసుకోడానికి నిశ్చయించుకోడం కథలో ప్రధానఘట్టం. కథలో ఆయువుపట్టు అయినఘట్టం – చండి శోభనంరాత్రి పెళ్లికొడుకు గోవిందుడు జడుడని గ్రహించి, అచంచలమైన ఆత్మవిశ్వాసంతో అతనిని విద్యావంతుడిగా చేయడానికి పూనుకోడం. అక్కడినుండి కథలో ఉత్కంఠ పుంజుకుని కథనానికి మంచి ఊపునిస్తుంది. తనధ్యేయం సాధించేలోపున అత్తవారింట చండి సవితిఅత్తగారి ఉదాసీనత, సవితిమరిది ధూర్తత్వం తట్టుకు నిలబడి, తన అస్తిత్వాన్ని ఋజువు చేసుకున్నతీరు ప్రశంసనీయం. అవసరమైనప్పుడు మామగారిని సైతం ప్రశ్నించడానికి వెనుదీయదు. మరిది చేసిన ఫిర్యాదులు నిరాధారమైనవని కమిషనరు, కలెక్టరులఎదుట నిరూపించకోవలసివచ్చినప్పుడు కూడా అద్భుతమైన సంయమనం చూపుతుంది. కమిషనరు గోవిందునిమానసికస్థితిని గురించి ప్రశ్నించినప్పుడు, గోవిందునిలో “ఒక ప్రత్యేక లక్షణమున్నట్టు గ్రహించి నేను శాయశక్తులా ప్రయత్నించి వారిని ఒక ఆదర్శపురుషునిగా చేయవచ్చుననే ఉద్దేశంతో వివాహం చేసుకున్నాను,” అన్న జవాబు రచయిత కథనచాతుర్యానికి మచ్చుతునక అని నాకనిపించింది. నవల ప్రారంభంలో గోవిందుని బుద్ధి వికసించలేదని గ్రహించినప్పుడు చండి ఈమాట వాచ్యం చేయలేదు. నవల పొడుగునా ఎక్కడా ఆమె “నేనిలా చేస్తాను, ఈ సమస్య ఇలా పరిష్కరించుకుంటాను,” అని చెప్పదు. అది ఆమె ప్రవృత్తిలో లేదు. అవి పాఠకుడు ఆమెచర్యలద్వారా తెలుసుకోవలసిందే. మరొకలా చెప్పాలంటే, అనవద్యమైన చిత్తస్థైర్యంతో, స్వకీయమైన సామర్థ్యంమీద మాత్రమే ఆధారపడి కార్యం సాధించుకోడం కార్యశీలురపద్ధతి. చండి అది ఎంత సమర్థవంతంగా నిర్వహించిందంటే, ఆమెనే ఆశ్చర్యపరుస్తాడు గోవిందుడు వికసించిన మేధతో. అది ఎప్పుడు జరిగిందంటే,

నవల చివరిఘట్టంలో హరినారాయణుడు అనారోగ్యంతో మంచంలో ఉండి, కోడలిని రమ్మని కబురు పంపినప్పుడు. చండి గోవిందుని కూడా రమ్మంటుంది. అతని విద్యాభివృద్ధి మామగారు తెలుసుకుని సంతోషించగలరన్న ఊహతో. గోవిందుడు “అస్వస్థతగా ఉన్నప్పుడు దుఃఖవార్తలలాగే సంతోషకరమైన వార్తవల్ల కూడా చెఱుపు జరగవచ్చునని” తానెక్కడో చదివేననీ, అంచేత ఆసమయంలో ఆవిషయం తండ్రికి తెలియజేయడం మంచిది కాదనీ అంటాడు. జడుడుగా ఉన్న పూర్వపరిస్థితినుండి అర్థవంతమైన ఆలోచనలు చేయగల పరిపూర్ణవ్యక్తిగా అతను ఎదిగినట్టు చూపడం జరిగిందక్కడ.

చండి తరవాత పరిపూర్ణంగా చిత్రింపబడిన పాత్ర జమీందారు హరినారాయణబాబు. ఈ పాత్ర కూడా అడుగడునా పాఠకుని సందేహాలలో ముంచెత్తుతుంది. ఉదాహరణకి ప్రధానం సమయంలో, “నేను మీఅమ్మాయిని ఎలా పరీక్షించి తెలుసుకున్నానో, అలాగే మీరు కూడా మీజమీందారు బిడ్డని చూచుకోవటం మంచిదనుకుంటాను,” అంటూ కరాలి ఛటర్జీకి గోవిందునిగురించి తెలుసుకోడానికి అవకాశం ఇస్తాడు. కరాలీ ఛటర్జీ అవసరంలేదనగానే ఊరుకుంటాడు కానీ గోవిందుని నిజపరిస్థితి చెప్పడు. పాఠకులకి ఆవిషయంలో హరినారాయణబాబు పూర్వకథ చదివినప్పుడు కొంత వివరణ కనిపిస్తుంది. అలాగే స్వేచ్ఛావిహారీ, అభిమానవతి అయిన చండి గోవిందునిగురించి మొదట్లోనే తెలిసి ఉంటే ఈ వివాహానికి అంగీకరించి ఉండేదా? ఈప్రశ్నకి సమాధానం కూడా పాఠకులఊహకే వదిలివేయబడింది. చండి చివరలో తనమీద నేరారోపణలు విచారణ చేయడానికి వచ్చినప్పుడు ఈప్రస్తావన లేదు. ఆయన గోవిందునితల్లికి ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోలేదని మాత్రమే ఆయనని ప్రశ్నిస్తుంది.

మరొక మనోజ్ఞమైన మలుపు ప్రధానంసమయంలో చండికి కాబోయే మామగారు బంగారు కొరడా ఇచ్చి, వారింట్లో “ఒక అలివిమాలిన గాడిద ఉన్నాడు. వాడిని నువ్వు అదుపులోకి తీసుకురావాలి,” అని చెప్పినతరవాత, చండి దానిని వినియోగించుకున్న విధానం. మామగారికోరికమేరకు కొరడాఅవుసరం లేకుండానే గోవిందుని ఆదర్శపురుషుడిని చేస్తుంది. ఆ కొరడా ఉపయోగించలేదు కానీ ఎవరివిషయంలో ఉచితమో, “గాడిద” అన్నపదం ఎవరికి అన్వయించడం ఉచితమో అన్న విషయాలలో చండి చాతుర్యం బహునైపుణ్యంతో చిత్రించడం జరిగింది. ఇవి చాలనుకుంటాను మద్దిపట్ల సూరిగారు ఈనవలని అనువాదానికి ఎందుకు ఎన్నుకున్నారో చెప్పడానికి.

అనువాదం విషయం తీసుకుంటే, సూరిగారు చక్కని తెలుగు నుడికారాన్ని వాడుకున్నారని చెప్పకతప్పదు. “గోవిందుడు ఒఠ్ఠిదద్దమ్మలా, వెర్రిబాగులవాడి”లా ఉంటాడు. “బెడదలొచ్చి పడ్డాయి”, “తైతక్కలాడలేదు,” లాటి వాక్యనిర్మాణం కనిపిస్తుంది.

శ్రీ ఏల్చూరి మురళీధరరావుగారు మద్దిపట్ల సూరిగారి శైలిగురించి, “ఏ కోశాన చూసినా నిరుష్టమైన భాష, రచనమంతా వెల్లివిరిసేసరసమైన ఆత్మీయత, బెంగాలీ భాషనుంచి తెలుగు చేసేటప్పుడు బెంగాలీ సంస్కృతంపోకడలో గాక తెలుగుతనం చెక్కుచెదరని శైలి, సరళభాషలో వ్రాస్తున్నామహాపండితుని రచన ఇది తెలిసివచ్చే రచన సూరిగారి ప్రచురణలకు DNA ముద్రలు :)” అని వ్యాఖ్యానించేరు. ఈవ్యాఖ్యానం చాలు స్వయంసిద్ధ తెలుగులో ఎందుకు అంత ప్రాచుర్యం పొందిందో చెప్పడానికి.

ఈనవలలో ఆనాటి బెంగాలీనవలలకి వచ్చిన అనువాదాలలో సర్వసాధారణమైన కొన్ని పదాలు లేకపోలేదు. అవగుంఠనం, పాదధూళి స్వీకరించడం, అశ్రురుద్ధ నేత్రాలు, పాపిట సింధూరంవంటివి. ఇవి బెంగాలీనవలలకి తెలుగు అనువాదాల్లో మాత్రమే కనిపిస్తున్నాయంటే అవి సంస్కృతిపరమైన విశేషంగానే భావించాలి. అలాగే, నాకు ప్రత్యేకంగా కనిపించిన మరొక అంశం కుటుంబంలో ఒకరిమీద మరొకరు ఫిర్యాదు చేసినప్పుడు, జమీందారు హరినారాయణబాబు ఆ ఫిర్యాదుని న్యాయస్థానంలో విచారించినట్టు విచారించడం. అక్కడ వాడిన భాష కూడా న్యాయస్థానంలో ప్రయోగించేభాష కావడం – బెంగాలీకుటుంబాల్లో కుటుంబసమస్యలు పరిష్కరించుకున్నప్పుడు అలా చేస్తారేమో నాకు తెలీదు. లేదా అది జమీందారీకుటుంబాల్లో ఆనవాయితీ కూడా కావచ్చు.

నేను వెనకటిదశాబ్దాలలో వచ్చిన కథలు చదివినప్పుడు అది ఈనాటిసమాజానికి ఎలా వర్తిస్తుంది, వర్తింపజేసుకోడానికి అనువుగా ఉందా అని కూడా చూస్తాను. ఏదో ఒక విధమైన పాఠం మనకి ఇవ్వలేని కథలు నాకు అంతగా రుచించవు. మరి 1946లో అనువదించింది అంటే ఇంకా ముందే రాసి ఉండాలి – ఈ నవల ఈనాటి సమాజానికి ఎలా వర్తిస్తుంది? అందరు స్త్రీలు చండిలా వ్యాయామం చేసి దేహదారుఢ్యం, మనోదారుఢ్యం కలిగినవారయే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అంటే లేదనే అనుకుంటున్నాను నేను. కానీ స్త్రీలలో అటువంటి ఆత్మవిశ్వాసం కలిగించే విద్య కావాలని మాత్రం నా ప్రగాఢవిశ్వాసం. స్త్రీలని స్వమేధమీద ఆధారపడగల, అలా తీరిచి దిద్దగల సమాజం రావాలి. ప్రతివారూ చండి అంత మేధావులు కాకపోవచ్చు కానీ తగిన వనరులు సమకూర్చి గోవిందునివలే ఒక మంచిమనిషిగా చేయడానికి ప్రయత్నించవచ్చు.

చివరిమాటగా, అనువాదాలగురించే మరొకమాట కూడా చెప్పాలి. ఎందుకంటే, తెలుగుకథలు ఇంగ్లీషులోకి అనువదించినప్పుడల్లా, ఎవరో ఒకరు అనడం వింటూనే ఉన్నాను – జానుతెలుగు సొగసులు అనువాదంలో లేవని. ఇలా వ్యాఖ్యానించే తెలుగువారు ఏ బెంగాలీనవలో రష్యన్‌నవలో తెలుగులోకి అనువదించినప్పుడు ఆ మూలభాషలో ఉన్న సొగసులు ఈ అనువాదంలోకి వచ్చేయా లేదా అని చూసుకోనూ చూసుకోరు, అడగనూ అడగరు. అంటే, చేతనున్న నవల ఆకర్షణీయంగా ఉంటే చదువుతారు, లేకపోతే లేదు. ఆసమయంలో అనువాదంలో భాషకే ప్రాముఖ్యం. తెలుగు భాషలో ఉన్న స్వారస్యం అలాటిది అనుకోవచ్చు. లేదా ఎవరి మాతృభాష వారికి అలాగే ఉంటుంది అని కూడా వాదించవచ్చు.

అనువాదాలగురించి ఇంతగా చెప్పడం మద్దిపట్ల సూరిగారు చేసిన ఈ అనువాదం స్వీయరచన అంత శక్తిమంతంగానూ ఉందని చెప్పడానికే. ఎందుకంటే, మూలగ్రంథంలో కథకి కావలసిన కొన్ని హంగులు అమర్చి ఉంటాయి. అనువాదకుడి పని ఆమూలకథని తీసుకుని అనువదించినభాషలో అంత సౌష్టవంగానూ ఉండేలా చూసుకోడం. అది మద్దిపట్ల సూరిగారు నిర్ద్వంద్వంగా సాధించి, మనకొక మంచి నవల అందించేరు. అందుకు వారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి.

 

(ఏప్రిల్ 9, 2014)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

5 thoughts on “మద్దిపట్ల సూరిగారి స్వయంసిద్ధ”

 1. ఈ నవల కథ పూర్తిగా తెలియదు కానీ ఇదే కథ అర్ధాంగి చిత్రానికి ఆధారమని తెలుసు. ఆ చిత్రాన్ని గురించి ఇదివరకూ బ్లాగ్ లో రాసిన లింక్..
  http://maacinemapegi.blogspot.in/2010/08/1955.html

  మెచ్చుకోండి

 2. పింగుబ్యాకు: వీక్షణం-79 | పుస్తకం
 3. శ్రీమతి నిడదవోలు మాలతి గారికి
  నమస్కారములతో,

  ఆధునికాంధ్రసాహిత్యంలో ఉత్తమోత్తమమైన అనువాదనవల ‘స్వయంసిద్ధ’ను హృదయంగమంగా పరిచయం చేసి, శ్రీ మద్దిపట్ల సూరిగారి యశోవల్లరికి ప్రాణంపోశారు. అందులోని మఱపురాని సన్నివేశాలను మీరు నెమరుకు తెచ్చిన తీరు చాలా బాగున్నది.

  మీ సమీక్ష కారణంగా శ్రీ సూరిగారికి ఈ తరంలో మళ్ళీ కొంతమంది అభిమానులు ఏర్పడి ఒకనాటి మంచి తెలుగు రచనలకు ఆదరణ లభిస్తుందని ఎంతో సంతోషం కలిగింది. మీ యీ వరివస్యకు హార్దిక ప్రణతి!

  సప్రశ్రయంగా,
  ఏల్చూరి మురళీధరరావు

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.