ఈరోజుల్లో సాహిత్యంలో చౌర్యం బహుముఖం!

విశ్వనాథ సత్యనారాయణగారి రచనలను అనుమతి లేకుండా ప్రచురించుకోడం, అనువాదాలు చేసుకోడంగురించి చర్చ ఫేస్బుక్కులో సాహిత్యం పేజీలో విశ్వనాథ సత్యనారాయణగారి మనుమడు, విశ్వనాథ సత్యనారాయణ పోస్ట్ లో వివరంగా ఉంది.

అక్కడ చూడనివారికోసం ఇక్కడ రాస్తున్నాను నాఅభిప్రాయాలు మరింత వివరంగా.

విశ్వనాథ సత్యనారాయణవంటి మహామహులు కావచ్చు, నావంటి సామాన్యులు కావచ్చు. ఎవరివస్తువు కానీ మరొకరు వాడుకునేముందు వారినో, వారివారసులనో అనుమతి కోరడం కనీసమర్యాద. అలాగే ప్రచురణకర్తలూ, పత్రికలవారూ వచ్చిందే చాలని ప్రచురించేయడం కాక దీనికి హక్కులెవరివి, ఎవరికైనా ఉన్నాయా, వారిఅనుమతి కోరడం అవుసరమా, అనుమతి కోరడానికి వారి సమాచారం ఎక్కడ దొరుకుతుంది అన్నది తరిచి చూసుకోవడం చాలా అవసరం. వారసులమాట ఎందుకు చెప్తున్నానంటే, మనదేశంలో రచయితలవారసులందరూ అంత తేలిగ్గా దొరకరు. కొందరు పట్టించుకోరు. నేను చాలాసార్లు ప్రయత్నించి ఊరుకోవలసివచ్చింది ఇలాటి సందర్భాలలో.

విశ్వనాథ సత్యనారాయణగారివిషయం అలా కాదు. సాహిత్యంతో ఏమాత్రం పరిచయం ఉన్నవారికైనా తెలుసే ఉంటుంది. విశ్వనాథవారిసంతతి వారిసాహిత్యంవిషయంలో చాలా శ్రద్ధ చూపుతున్నారని. 2004లో విశ్వనాథ పావనిశాస్త్రిగారితో మాటాడే అవకాశం నాకు కలిగింది. అంచేత ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను ఈమాట. అనువాదం బాగా చేసినవారికి అనుమతి ఇవ్వడానికి మాకేమీ అభ్యంతరం లేదు అని చెప్పేరాయన. ఆయన అనుమతితోనే విశ్వనాథ సత్యనారాయణగారి జీవునిఇష్టము నేను అనువాదం చేసేను.

వేయి పడగలు వంటి అత్యంత ప్రముఖనవలని ఎవరితోనూ సంప్రదించకుండా అనువాదం చేయడం, అందులోనూ ఒక యూనివర్సిటీ ప్రొఫెసరు, ఎకాడమీ బహుమతిగ్రహీతకి తెలీలేదంటే అది కేవలం నిర్లక్ష్యమే అనుకోవాలి. ఈవిషయం ప్రచురించినవారు కూడా గమనించకపోవడం కూడా తెలుగు సాహిత్యక్షేత్రంలో రచయితలపట్ల వీరికి లేని ఆదరణని ఎత్తి చూపుతోంది.

తూలిక.నెట్ లో ప్రచురణార్థం నాకు వచ్చే కొన్ని అనువాదాలు చూసినప్పుడు మూలరచయితపేరుతో తమపేరు కలుపుకుని ప్రచురించుకునేసరదా మాత్రమేనేమో అనిపిస్తుంది. అదే నిజమైతే అంత కన్నా హీనం లేదు. ఇది అనువాదం చేసే సరదాగలవారందరికీ మేలుకొలుపు కావాలి. మీకు ఎంత ఉత్సాహంగా ఉన్నా, ప్రాథమికంగా అది మీ వస్తువు కాదన్నసంగతి మరిచిపోకండి. వారికీ మీకూ కూడా అప్రతిష్ఠ తేకండి, మరియు, తెచ్చుకోకండి.

ఈసందర్భంలోనే నేను ఇంతకుముందు రాసిన యాంత్రిక అనువాదాలగురించి మరొకసారి చెప్తాను. గూగుల్ అనువాదం యాంత్రికంగా చేసేయడానికి అవకాశం కలిగించడం కూడా నిజానికి ఈకోవలోకే వస్తుంది. ఆ అనువాదాలు ఏమాత్రమూ అర్థవంతంగా లేవని అందరూ ఒప్పుకుంటారు. అది ఇంకా అర్థవంతమైన అనువాదం అందించగల స్థాయికి చేరుకోలేదు. ఆ స్థాయికి వచ్చేవరకూ, అనువదించుకోండి అంటూ బాహాటంగా ప్రకటించుకోడం సాహిత్యానికి తీరని ద్రోహం చేయడమే.
కొంతకాలంక్రితం జరిగిన కథ ఇది. తూలిక.నెట్‌కి రిఫరర్లు ఎవరో చూద్దాం అన్న దుర్బుద్ధి పుట్టింది. అలా రిఫర్ చేస్తున్నవాళ్లలో translate.google.com కనిపించింది. ఇది ఇంతకుముందు చూశాను కానీ నా హోం పేజీ మాత్రమే పెట్టేరనుకున్నాను. నిన్న చూస్తే, నాసైటులో మొత్తం కథలూ, వ్యాసాలూ అన్నిటినీ నేనెప్పుడూ కనివిని ఎరగని భాషలోకి తర్జుమా చేసి పెట్టేసుకున్నారు! హౌరా, అనుకుని, వాళ్ల సైటులో contact us అని ఎక్కడయినా వుందేమో కనుక్కోడానికి ప్రయత్నించి, విఫలయత్నురాలినయి, నాసైటులోనే ఒక ప్రకటన ఇచ్చేను. ఇవాళ మళ్లీ చూస్తే నాకు నవ్వాగలేదు. ఎందుకంటే, నాకిప్పుడు మరి కొన్ని విషయాలు అర్థమయేయి. ఆసైటు ఎవరో ఘనటెక్ పండితులే నడుపుతూ వుండాలి. నేను నాసైటు అప్‌డేట్ చేసినప్పుడల్లా, వెనువెంటనే అది అక్కడ అప్‌డేట్ అయిపోతుంది ఆటోమేటిగ్గా. అందువల్ల ఏం జరిగిందీ అంటే నేను నాసైటులో పెట్టిన నాప్రకటన “మీరు నాకాపీరైటుని ఉల్లంఘిస్తున్నారూ, నావ్యాసాలూ, కథలూ నాఅనుమతి లేకుండా ప్రచురించుకుంటున్నారూ, ఇది మహా నేరం” కూడా ఇప్పుడు వాళ్ల సైటులో వుంది. దడిగాడు వానసిరా అని ఓ జోకుంది చూశారూ అలాగన్నమాట.

జనవరి 11. 1980 ఆంధ్రజ్యోతి లో ఒక కార్టూను వచ్చింది. అది రచయిత్రుల బుద్ధిహీనతని హేళన చేస్తూ. నిజానికి అది కార్టూను కాదు. ఎందుకంటే అందులో జోకు మాటల్లోనే ఉంది కనక.
ఆయన – మీరేం రాశారు?
ఆవిడ – రామాయణ కల్పవృక్షం
ఆయన – విశ్వనాథ సత్యనారాయణగారి పేరు విన్నారా?
ఆవిడ – ఇదేమన్నా వింతా ఏం? నేను వేయిపడగలు రాసినప్పుడు కూడా ఇలాగే అన్నారు!

నిజానికి రచయిత్రులే కాదు, రచయితలు, ప్రచురణకర్తలు, అనువాదకులు, వివాదకులూ (ఒఠ్ఠినే వివాదాలకి దిగేవారు) – ఎవరు చేసినా విచారించాల్సినవిషయమే. ఏదో విధంగా తమపేరు కలకాలం నిలిచిపోవాలనుకుంటే, ఇది మరొక మార్గమేమో నాకు తెలీదు :p.

(ఏప్రిల్ 13, 2014)

గ్రంధకర్త మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

6 thoughts on “ఈరోజుల్లో సాహిత్యంలో చౌర్యం బహుముఖం!”

 1. శ్రీ ఏల్చూరి మురళీధరరావుగారికి, నమస్కారం. కాపీరైటు నిబంధనలు క్లిష్టతరమైనవి. ఒక దేశానికీ మరొక దేశానికీ, అనువాదాలకీ, ఉన్నదున్నట్టు పునః ప్రచురించడానికీ, అడిగో అడక్కుండానో ప్రచురించుకోడానికీ … ఇలా చాలా చిక్కులున్నాయి. ప్రధానంగా మనదేశంలో ఈ హక్కులగురించిన ధ్యాస ఎవరికీ లేదు. నాకథలు వ్యాసాలు నాకు చెప్పకుండా ప్రచురించుకున్నవి నాదృష్టిలోకి కనీసం 8 వచ్చేయి అంతర్జాలంలోనూ ప్రింటు పత్రికలలోనూ. ఒకరిద్దరిని అదేమని అడిగితే, మాకు నచ్చేయని వేసుకున్నాం, మేం డబ్బు చేసుకోడంలేదు అంటారు. మీరన్నట్టు అదీ ఒకరకం ప్రచారమే అని ఊరుకున్నాను. ఎటొచ్చీ బాధ ఎప్పుడంటే, అందరూ చేస్తున్నారని నేను కూడా అలా చేస్తే, నామీద ఎవరైనా దావా వేస్తే, అందరూ చేస్తున్నారు కదా అన్న వాదన నిలవదు. సిడీ పైరసీవిషయం కూడా అంతే. అభ్యంతరాలు చెప్పేవారు చెబుతూనే ఉన్నారు, చేసేవారు చేస్తూనే ఉన్నారు. కోర్టులకెక్కడానికి కావలసిన స్తోమతు, సమయం అందరికీ ఉండదు కదా.

  ఇష్టం

 2. నిడదవోలు మాలతి గారికి
  నమస్కారములతో,

  జీవితుడైన రచయితకు తెలియకుండా అనువాదాన్ని ప్రకటించటం సమంజసం కాదు. రచయిత జీవించి లేనప్పుడు, తత్కుటుంబసభ్యుల వివరాలు తెలియనప్పుడు – అనువాదకార్యాన్ని నిలిపివేయక చేసినదానిని యథోచితంగా ప్రకటించటమే మేలని నాకనిపిస్తున్నది. అనువాదకునికి ఆర్థికంగా లబ్ధి చేకూరినట్లయితే అందులో చట్టప్రకారం ఎంత ఇవ్వవలసి ఉంటుందో అంతా కుటుంబసభ్యులకు ఇవ్వటం సముచితం. అనువాదకునికి కీర్తిలాభమే తప్ప ఆర్థికలాభం లేనప్పుడు మూలరచయిత రచనకు కూడా ఆ అనువాదం వల్ల మళ్ళీ ఒకసారి పాఠకలోకంలో ప్రచారం, ఆదరణ లభిస్తాయి కనుక అటువంటి అనువాదాన్ని ప్రోత్సహించటం మేలే అవుతుంది. మూలరచయిత పేరు చెప్పి, ఆయన వివరాలను ఇచ్చి, అనువాదాన్ని ప్రకటిస్తే అది చౌర్యం క్రిందికి రాదేమో.
  కాపీరైటు ఉల్లంఘన, భావచౌర్యం, వస్తుచౌర్యం అన్నవి వేర్వేఱు నేరాలనుకొంటాను. విదేశాలలో, భారతదేశంలో వాటిని గుఱించిన వస్తుతత్త్వావగాహన ఒకటి కాదేమో.

  అసలు కాపీరైటు రిజిస్ట్రేషన్ అన్నదే లేని రచనను అనువదిస్తే అది కాపీరైటు ఉల్లంఘన అవుతుందో లేదో నాకు తెలియదు.

  తెలుగులో కనీసం నాలుగు తరాల పాఠకులకు కనువిప్పును కలిగించిన ఇంగ్లీషు, రష్యన్, బెంగాలీ, హిందీ, ఒరియా రచనానువాదాలన్నీ కాపీరైటు చట్టాన్ని అనువర్తింపజేస్తే ఈనాడు నిషేధింపదగినవే అవుతాయి. చౌకగా మార్కెట్లో దొరికే పైరేటెడ్ సిడిలు, పైరేటెడ్ పుస్తకాలు, మందుల పేటెంట్లు, బిటి విత్తనాలు, కాపీరైటు ఉల్లంఘన వంటి విషయాల ఔచిత్యానౌచిత్యాలపై జరిగే వాదవివాదాలు తృతీయ ప్రపంచదేశాలలోనూ, అభివృద్ధి చెందిన దేశాలలోనూ ఒకతీరున ఉండవనుకొంటాను.

  సప్రశ్రయంగా,
  ఏల్చూరి మురళీధరరావు

  ఇష్టం

 3. “Translate this page అని బాహాటంగా పెట్టేరు కదా. వారు ఆ వసతి ఉపయోగాలకి పరిమితులు ఏమీ పెట్టలేదు కదా. అలా పెట్టకపోవడంచేతే తూలికలో మొత్తం కథలు, వ్యాసాలు మరొకభాషలోకి స్వేచ్ఛగా అనువాదించుకోడానికి అవకాశం ఏర్పడింది.”
  -దానికి యాంత్రిక అనువాదానికి సంబంధం లేదని నా అభిప్రాయం. అది మనుషుల సంస్కారాన్ని బట్టి ఉంటుంది. పర్మిషన్ లేకుండా అనువదించేవాళ్ళకి యాంత్రిక అనువాదం ఉంటే ఏమిటి? లేకపోతే ఏమిటి? మీసైటు కాకుంటే ఇంకో సైటు. మీ వ్యాసం చూశాక యాంత్రిక అనువాదాలు బాగా అభివృద్ధి చెందితే కాపీరైట్ చట్టాలు ఏమవుతాయి? అన్న విషయమై రాసిన ఒక వ్యాసం చదవడం మొదలుపెట్టాను. పూర్తి చేశాక వివరాలు పంచుకుంటాను.

  యాంత్రిక అనువాదం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి, సాహిత్యానికి ఆవలి జీవితంలో. ఇందాకే అనుకోకుండా నా స్నేహితురాలిని కలిశాను. ఆమె ప్రస్తుతం అనువాదాలు చేసే ఒక కంపెనీలో పనిచేస్తోంది, క్వాలిటీ అసెస్మెంట్ విభాగంలో. వాళ్ళు అనేక భాషల నుండి అనేకభాషలకి అనువాదాలు చేయడంలో సిద్ధహస్తులు (యాంత్రికంగా‌కాదు… నిజం మనుషులతో!). అందులో అనువాదకులు కూడా యాంత్రిక అనువాదం సాయం తీసుకుంటారట రోజూవారి పనుల్లో. నేనిలా‌మీ వ్యాసం చదివి వ్యాఖ్య రాసి బయటకి వెళ్ళడం, ఆమెని కలిసినపుడు వాళ్ళ ఆఫీసు ప్రస్తావన వచ్చి ఇదంతా తెలుసుకోవడం ఆశ్చర్యంగా అనిపించింది నాకు.

  ఇష్టం

 4. @ vbsowmya, సాఫ్టువేరు ఇంజినీరు అని నేను అనలేదు. కానీ ఆ సాఫ్టువేరు తయారుచేసినవారు గూగుల్ కి ఇవ్వబట్టే కదా వారు ఉపయోగించుకోగలుగుతున్నారు. Translate this page అని బాహాటంగా పెట్టేరు కదా. వారు ఆ వసతి ఉపయోగాలకి పరిమితులు ఏమీ పెట్టలేదు కదా. అలా పెట్టకపోవడంచేతే తూలికలో మొత్తం కథలు, వ్యాసాలు మరొకభాషలోకి స్వేచ్ఛగా అనువాదించుకోడానికి అవకాశం ఏర్పడింది.
  ఆ మరొక భాష రష్యన్ లా ఉందని నువ్వే ఆ టపాకింద వ్యాఖ్య రాసేవు. టపా “హక్కులు దోచేసుకుంటున్నారు”. ఈవ్యాసానికి సంబందించిన బాగం ఇక్కడ కోట్ చేసేను కనక లింకు అక్కర్లేదనుకుని, ఆ వాక్యం తొలిగించేను.
  నేను గూగుల్ కి నా అభ్యంతరం తెలిపినతరవాత, వారు ఈ తూలిక.నెట్ ని బ్లాక్ చేసేరు అలా అనువదించుకోడానికి వీలు లేకుండా. అంటే వారు కూడా పరోక్షంగా అంగీకరించినట్టే కదా.

  ఇష్టం

 5. Please read the sentence: “నాకు తెల్సినంత వరకు ఇక్కడ కాపీరైట్ ఉల్లంఘన చేస్తున్నది ఆ సాఫ్ట్వేర్ వాడుకరి కానీ సాఫ్ట్వేర్ కానీ, అది రూపొందించిన సంస్థ కానీ కాదు.” as “నాకు తెల్సినంత వరకు ఇక్కడ కాపీరైట్ ఉల్లంఘన చేస్తున్నది ఆ సాఫ్ట్వేర్ వాడుకరి. ఆ సాఫ్ట్వేర్ కానీ, అది రూపొందించిన సంస్థ కానీ కాదు.” Sorry for the confusion.

  ఇష్టం

 6. ఆవకాయ వెబ్సైటులో అనువాదం నేను చదవలేదు కానీ చూశాను. అనుమతులతో చేస్తున్నారు అనుకున్నాను, ప్రముఖులు చేస్తున్నారు కనుక.

  ఇక గూగుల్ ట్రాన్స్లేట్ విషయం:

  ఆ స్థాయికి వచ్చేవరకూ, అనువదించుకోండి అంటూ బాహాటంగా ప్రకటించుకోడం సాహిత్యానికి తీరని ద్రోహం చేయడమే.
  – గూగుల్ ఎక్కడా సాహిత్యాన్ని దీనితో అనువదించుకోండి అని ప్రకటించిన దాఖలాలు లేవు, నాకు తెలిసి. మీకు తెలిసి ఎక్కడన్నా ఉంటే తెలుపగలరు. ఇదివరలో కూడా నేను ఒకట్రెండు చోట్ల రాశాను – యాంత్రిక అనువాదం తాలూకా ప్రయోజనాలు వేరే. సాహిత్యాన్ని అనువదించడం కనీసం ఇప్పటి లక్ష్యాల్లో అయితే లేదు, నాకు తెలిసినంత వరకు.

  ఇక కాపీరైట్ విషయం – నాకు తెల్సినంత వరకు ఇక్కడ కాపీరైట్ ఉల్లంఘన చేస్తున్నది ఆ సాఫ్ట్వేర్ వాడుకరి కానీ సాఫ్ట్వేర్ కానీ, అది రూపొందించిన సంస్థ కానీ కాదు. మీరు చెప్పిన అనుభవం మట్టుకు మీరన్నట్లు నవ్వు తెప్పించేలాగానే ఉంది. లంకె ఇక్కడ అన్న చోట లంకె ఇవ్వలేదు. ఇవ్వగలరు. అయినా కాపీరైట్ల ఉల్లంఘన తెలుగువారి జన్మహక్కనుకున్నా నేను. మీరు చెప్పింది వింటే ఆ ఇంకో భాష వాళ్ళెవరో మన హక్కులు లాగేసుకుంటున్నారల్లే ఉంది!

  ఇష్టం

టపాలో చర్చించిన అంశంమీద వ్యాఖ్యానాలు తెలుగులో రాసిన వ్యాఖ్యలు మాత్రమే అంగీకరింపబడతాయి. తెంగ్లీషులో రాసిన వ్యాఖ్యలు కూడా నాకు సమ్మతం కాదు. కోరుతున్నాను

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s