హాస్యప్రసంగాలు, ఇతర కథలు

మునిమాణిక్యం అనగానే, నోట్లో మాట నోట్లో ఉండగానే, కాంతంకథలు అనేస్తారు చాలామంది అదేదో అసంకల్పప్రతీకారచర్యలాగ. పదిరోజులకిందట నరసింహారావుగారి ఇతరరచనలు కొన్ని దొరికేయి. వాటిలో హాస్యంతోపాటు ఇతరరసాలు కూడా చిప్పిల్లి నన్ను ముప్పిరిగొనేలా చేసేయి. కొన్ని చోట్ల ఆశ్చర్యపోయేను ఆయనే ఈయనా అని. మరికొన్ని సందర్బాలలో ఆశ్చర్యం ఇతరకారణాలవల్ల. అవధరించండి, వివరిస్తాను.

ఈ పదిరోజుల్లోనూ ఇతరవ్యాపకాలు చూసుకుంటూ, చదివిన పుస్తకాలు తొమ్మిది. అవి – యథార్థదృశ్యాలు (1945), తగూ నెంబరు త్రీ (1950, మంచివాళ్ళు- మాటతీరు (1955), కాంతం వృద్ధాప్యం (1955), హాస్యప్రసంగాలు (1956), జానకీ-శర్మ (1956), రుక్కుతల్లి (1955, పునర్ముద్రణ 1958), ఇల్లు–ఇల్లాలు (1980), దాంపత్యజీవితం (రమణీయ ఘట్టాలు) (తేదీ లేదు). అన్నీ చిన్న చిన్న పొత్తములు. నాకే పుస్తకానికి గంటా, గంటన్నర సరిపోయిందంటే మనోవేగపఠితలకి పోపులో కూరముక్కలు ఉడికేలోపున, కప్పు కాఫీ తాగేలోపున అయిపోతాయన్నమాట. ఒక్కొక్క బుక్కుకి పావుగంట ఎక్కీ తొక్కీ అన్నమాట.

వీటిలో నాకు అమితానందాన్ని కలగించిన పుస్తకం హాస్య ప్రసంగాలు. అందుచేత దానితోనే మొదలు పెడుతున్నాను. ఈ పుస్తకంలో నరసింహారావుగారూ, ప్రచురణకర్తలూ కూడా ఊహించని ఏప్రిల్ ఫూల్ తరహా హాస్యం ఒకటి ఉంది. అది మొదట చెప్తాను.

పుస్తకంమొదట్లో విషయసూచిక ఇదీ – 1. కాంతం పుట్టుపూర్వోత్తరాలు, 2. హెడ్ మాష్టర్, 3. చుట్ట, 4. వృథాప్రయత్నము “రహస్యము బయట పెట్టకూడదు.”, 5. జ్యోతిషం, 6. చమత్కార సంభాషణ.

ఇది చూడగానే, మొట్టమొదట దేనికోసం చూస్తాం? కాంతం పుట్టుపూర్వోత్తరాలకోసమే కదా? చాలామంది అవునవునవునంటారనే అనుకుంటున్నాను. ప్చ్. జీరాక్స్ చేసినవారు అలా అనుకోలేదు. అంచేత ఆ భాగం వదిలేసేరు! ఆపైన రెండో అధ్యాయంలో హెడ్ మాష్టర్ చరిత్రలో ఏమనుకున్నారో కానీ అక్కడ కూడా మొదటిపేజీ వదిలేసేరు.

సరే, హాస్యకథలు ఎక్కడయినా మొదలు పెట్టొచ్చు అని త్వరితగతిని ఒక నియమం నాకో చేసేసుకుని, చదవడం మొదలు పెట్టేను. గొప్ప హాస్యం విరజిమ్మేరు అంటూ నేను నరసింహారావుగారికి కితాబు ఇవ్వఖ్ఖర్లేదు. కేవలం నాకు అమందానందం కలిగించిన కొన్ని అంశాలు కొన్ని స్పృశించి వదిలేస్తాను. ఆపైన మీకు మీరే చదువుకుని ఆనందించవచ్చు.

ఈ రెండో పేజీలో అరిస్టాటిల్ syllogism ప్రాతిపదికగా హెడ్ మాష్టర్ తత్వవిచారణ ప్రారంభించి, హెడ్ మాష్టరుకి మరణం ఉందని నిరూపించి, హెడ్ మాష్టరు మళ్ళీ హెడ్ మాష్టరుగానే పుడతాడు అన్న జగదీశ భట్టాచార్యుని మతము ఉటంకించి, ఆ తరవాత మహా భారతకాలం, బౌద్ధులకాలం, బ్రిటిష్ వారికాలంలో “హెడ్ మాష్టరు” రూపులో క్రమక్రమంగా వచ్చిన భేదప్రభేదాలు సంపూర్ణంగా ఆవిష్కరించేరు. ఇది నేను పొడి పొడి ముక్కలు నాలుగు చెప్పి ముగించేస్తే మూలరచయితప్రతిభకి అన్యాయం చేసినదానిని కాగలను. అంచేత అది మీకే వదిలేస్తాను.

అలాగే చుట్ట కూడా ప్రాచీనకాలంనుండి ఉందని నరసింహారావుగారి మతము. భారతం, కళాపూర్ణోదయంవంటి కావ్యాలలో, ప్రబంధాలలో, ధర్మరాజు, భీముడు, కళాపూర్ణోదయంలో కళాపూర్ణోదయుడు (ఎవరో నాకు తెలీదు, ఇది రచయితపదం), కలికాలంలో కాటూరి వెంకటేశ్వరరావుగారూ, దేవులపల్లి కృష్ణశాస్త్రిగారూ వీరందరూ చుట్ట తాగేవారేనని సహేతుకంగా ఋజువు చేసేరు. యత్ర యత్ర ధూమః తత్ర తత్ర అగ్నిః అన్న శాస్త్రాన్ని తిరగేసి, అగ్ని లేనిచోట పొగ ఉండదు అని కూడా నిర్ధారణ చేసేరు. కానీ ఈ పొగ తర్కం దగ్గరికొచ్చేసరికి కాంతంగారిదే చివరిమాటట. ఇలా కాంతంగారిని బరిలోకి లాగిన సందర్బాలు మాత్రం అట్టే లేవు ఈ పుస్తకంలో.

ఇందులో మనని అట్టహాసంగా నవ్వించేసే మరో రచన చమత్కార సంభాషణ. ఛలోక్తి అన్నపదం విన్నాను కానీ ఛలోక్తి అంటే ఛలముతో కూడుకున్నది అనీ, ఛలము అని వేరే పదమనీ నాకు తెలీదు. అలాగే ఛలోక్తి అంటే హాస్యరసపూరితవాక్యము అనే అనుకున్నాను కానీ ఛలము అనేకరూపములలో ఉంటుందని ఇప్పుడే తెలసింది. వృత్తిరీత్యా మాష్టరు కనక నరసింహారావుగారు ఈరచనలో కూడా అసమాన ప్రజ్ఞాపాటవాలు గల మాష్టరుగా కనిపిస్తారు. తర్కము, న్యాయదర్శనము వంటి ప్రాచీనగ్రంథాలూ, ప్రముఖ ఆంగ్లరచయితలరచనలూ చక్కగా పరిశీలించి, నావంటి సామాన్యులకి అర్థమయేరీతిలో మూడు రకముల ఛలములనూ సోపపత్తికంగా మనముందు ఉంచేరు. ఛలస్వరూపానికి జల్పవితండానికి భేదం కూడా గుర్తిస్తే ఛలస్వరూపాన్నిగురించి పూర్తిగా తెలుసుకొనినవారమవుతాముట. వితండమంటే ఎదుటివారి వాక్యమును నిరాకరణ చేయటము, ఛలము అంటే అర్థాంతరకల్పనచే వాదివాక్యాన్ని ఆక్షేపించి హేళన చేయడముట. చదువుతున్నప్పుడు నవ్వకుండా ఉండలేం. ఆ తరవాత ఆలోచించకుండా ఉండలేం.

అన్ని పుస్తకాల్లో కాదు కానీ రెండు పుస్తకాలకి పీఠికలు ఉన్నాయి. రచయిత తన పుస్తకంలో “అశ్లీలాలు లేవు. శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు ఉన్నవి. ధ్వని కావలిసినంత ఉన్నది. ఆనందవర్ధనుడికే హడలు పుట్టించేటంతటి ధ్వని పౌష్కల్యం ఉన్నది అంటారు. అంతే కాదు.  వెనకటి కవులందరూ ప్రపంధ పరమేశ్వరుడని ఒకరూ, ఆంధ్రకవితాపితామహుడని ఒకరూ నేనంతవాణ్ణి ఇంతవాణ్ణి అని చెప్పుకున్నట్టుగానే తాను కూడా చెప్పేరుట. “నారచనలో ధ్వని ఉంది, ఔచిత్యముంది, ఉదాత్తత ఉంది, ఉపమానాలు, ఉత్ప్రేక్షలు లేకపోతేనేమి, ఊపులున్నవి. వక్రోక్తులు లేకపోయినా వంపులున్నవి. నేను హాస్యవిష్ణువును” అంటారు. ఎంచేతంటే, బ్రహ్మ వేరే ఉన్నారుట.ఆఖరికి ఏది లేకపోయినా “అది” ఉందిట. “అది” అనగానే మల్లాది రామకృష్ణశాస్త్రిగారు చెప్పిన “అది” గుర్తొచ్చింది కానీ మునిమాణిక్యంవారిదృష్టిలో “అది” అంటే పాఠకుణ్ణి పుస్తకం చివరిదాకా లాక్కుని వెళ్ళేగుణము అని. కరుణకీ, శృంగారానికి ఇచ్చిన గౌరవమూ, ఆదరణా హాస్యానికి కూడా ఇయ్యవలసి ఉన్నదని వక్కాణించేరు. హాస్యం తేలిక అయినదనీ, బరువు లేదనీ అంటారు. బరువు లేకపోతేనేమి, బంగారంలాటి సరుకు ఉన్నది అన్నారు. అది మనం ఒప్పుకోక తప్పదు.

తనకి బిరుదులూ, ప్రభువుల ఆదరణా, సమ్మానాలూ లేకపోయినా, ప్రసిద్ధులైన కవులు, పండితులు, అయినవారి స్నేహమే తనకు గల మహా భాగ్యము అన్నారు. వారిస్నేహాలు మనకి మహాప్రసాదం. శివశంకరస్వామివారు, కాటూరివారు, విశ్వనాథ, మొక్కపాటి, భమిడిపాటి మొదలైనవారంతా తమకి గురువులూ, మిత్రులూనుట. ఆ మిత్రులందరి చతురభాషణలు నరసింహారావుగారు ఏమర్మమూ లేకుండా హాయిగా మనతో పంచుకున్నారు. మచ్చుకి రెండు చెప్తాను. ఒక సినిమాహాలుకి రెండు దోవలు ఉన్నాయి. ఒకదానిమీద పెద్దమనుషులు అనీ రెండోదానిమీద స్త్రీలు అనీ రాసేరు. శాస్త్రిగారు రెండూ చూసి, “మనని ఎవరూ పెద్దమనుషులుగా చూడడంలేదు. అంచేత పెద్దమనుషులం కాదు కాబట్టి తర్కరీత్యా స్త్రీలమే అయినాము,” అని అటు నడిచేరుట (హాస్య ప్రసంగాలు). గిడుగువారు ఇంట్లో సవరభాష మాటాడడం మూలంగా భార్యతో పోట్లాటలు లేవు (ఇల్లు – ఇల్లాలు).

ఈ కవిపుంగవులు మొత్తం తొమ్మిది పుస్తకాల్లోనూ సందర్భానుసారం దర్శనమిచ్చి ఈరచనల ఉద్దీపనం ద్విగుణీకృతం చేసేరు. పుస్తకం చదువుతుంటే ఒక పరిహాసకుడు వరసగా చెప్పుకుపోతున్న చతురోక్తులలా కాక, పదిమంది పండితులమధ్య కూర్చున్నభావం కలుగుతుంది మనకి.

నరసింహారావుగారు దాంపత్యజీవితంలో మధురిమలు ఎంత సూక్ష్మంగా గ్రహించి ఆవిష్కరించేరో, అంత నిశితంగానూ పిల్లలప్రవృత్తులు కూడా అవగాహన చేసుకుని ఈకథల్లో పదిలంగా పొదిగేరు. కాంతవృద్ధాప్యంలో మనుమరాలు శేషు తాతకి గణితశాస్త్రంలోనూ, వ్యాకరణశాస్త్రంలోనూ కూడా పాఠాలు చెప్తుంది. ఆ పిల్లలెక్కప్రకారం మూడుతరవాత పదకొండు వస్తుంది. తాతారు, నాన్నారు అన్నపదాలు సాధువులు. నోరు లేదు కానీ “తాత, నాన్న” పదంబులకు గారు పరంబగునప్పుడు ప్రాయకంబుగ “గ” లోపించి తత్పూర్వాక్షరము దీర్ఘంబగు అని సిద్ధాంతీకరిస్తున్నదన్నమాట” అంటారు.

తగూ నెంబరు “త్రీ”, ఇతరకథలు సంకలనంలో అనంగ అనంగ కథలో పంతులుగారు రాధాయికి గొల్లవాడు, పులి కథ (పులి, పులి అని అరవడం, తరవాత నిజంగా పులి వచ్చినప్పుడు గ్రామస్థులు నమ్మకపోవడం) చెప్తారు. కాంతం తిరిగొచ్చేక, రాధాయి అమ్మకి చెప్పినకథ మనోజ్ఞంగా ఉంది. గొల్లవాడికి గొర్రెని తినాలనిపించింది. గొఱ్ఱెని చంపడానికి పులిని పిలిచాడు … ఇలా సాగిపోతుంది కథ అమ్మకీ నాన్నకీ ఎనలేని ఉల్లాసాన్ని కలిగిస్తూ. ఇది చదివినతరవాత, నిత్యజీవితంలో పెద్దవాళ్లే మనకథనాన్ని ఎంతగా మార్చేస్తారో తలపుకొచ్చి నాకు పట్టలేనంత నవ్వొచ్చింది.

దంపతుల ప్రణయకలహాలూ, హాస్యాలూ, అపహాస్యాలూ ఒక్క కాంతంకథల్లోనే కాదని కూడా ఈ పుస్తకాలు చూసేక తెలుసుకున్నాను. జానకీ – శర్మ, సుందరం బార్య – ఏ పేర్లు పెట్టినా రచయిత సందేశాన్ని ఆ “దరి”కే చేరుస్తారు. అది చాలక, ఈ కథల్లో కిటుకులన్నీ చేర్చి ఒక కుప్పగా పోసి కూర్చిన దాంపత్యోపనిషత్తు ఇల్లూ – ఇల్లాలు. పతంజలి యోగసూత్రాలంత సూక్ష్మంగా కాకపోయినా, అక్కడక్కడ రససిద్ధికోసం చిన్న చిన్న కథలు కలిపి చెప్పినా, మొత్తంమీద వివాహితులందరూ ఆనందమయ మరియు ఆదర్శజీవితం గడపాలంటే నరసింహారావుగారు ప్రవచించిన ఈ మహావాక్యాలు కంఠతా పట్టి, గోడమీద రాసుకుని రోజుకోమారు భక్తిపూర్వకంగా వల్లించుకుని, కళ్ళకద్దుకోవాలని రచయిత అభిమతం కావచ్చు. అన్నట్టు చెప్పడం మరిచేను. ఈ పుస్తకం ఆదిలో గ్రంథావరణప్రశంస ఉంది. రచయిత ఈపుస్తకం ఎప్పుడు ఎలా చదవాలో స్పష్టం చేసేరు. అలాగే కథనం మొదలు పెట్టేక, మహాకవులు, పండితులు, విద్వాంసులు తగువు వచ్చినప్పుడు ఒకొకరు ఏం చేసేరో చెప్పి తరవాత తన సూత్రాలు వివరిస్తారు రచయిత. ఇంతకీ, నాఅభిప్రాయం – ఇది 1980లో రాయడం నాకు కొంత ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే ఈ సూత్రాలు 50వ దశకంలో పనికొచ్చేవేమో కానీ 80వ దశకం వచ్చేసరికి మన తెలుగు ఆడబడుచులు మగవారి ఈ కుట్రలు కనిపెట్టేసి, తదనుగుణంగా తమ ప్రవర్తనలు కూడా తీర్చి దిద్దేసుకున్నారని నా దృఢనమ్మకమ్ము!

దాంపత్యజీవితం లో కాంతం పాత్ర విలక్షణమైనది. నేను నరసింహారావుగారి 25 రచనలూ చదవలేదు కానీ చదివినంతమటుకు, కాంతం పరమసాధ్వి, ఉత్తమాయిల్లాలు, ఊళ్ళో అందరికీ తలలో నాలుక. ప్రతి ఒక్కరికీ ఏదో ఒకరకం బంధువే- అమ్మ, పిన్ని, అత్తయ్య, వదిన. ఈ దాంపత్యజీవితంపుస్తకంలో కాంతం ఇతరఅమ్మలక్కలతో చేరి, కూతురు జయతో ఇంటికి వచ్చిన ఆమెతోడికోడలిని చులకన చేసి మాటలాడగల నెఱజాణ. ఆ అమ్మాయి తనకూతురితో తమఇంటికి రావడమే ఆమెకి నచ్చలేదు. ఆపైన “మగవారితో సమానంగా కూర్చుని మాటాడుతుందిట. కాలిజోళ్ళు వేసుకుని ఊర్లోకి వెడుతుంది …” ఆమె చేసిన ప్రతి పనీ తప్పుగానే కనిపిస్తుంది కాంతానికీ, ఇరుగూపొరుగూ అమ్మలక్కలకీ. ఈ పాత్రచిత్రణ నాకు కొంచెం ఎబ్బెట్టుగానే అనిపించింది.

ఈ పుస్తకాలలో నాకు కొంచెం నిరుత్సాహం కలిగించిన పుస్తకం మంచివాళ్లు – మాటతీరు. ఇది చదువుతున్నంతసేపూ how to make friends and influence people చదువుతున్నట్టనిపించింది. అచ్చంగా అదే అనడం లేదు. నిజానికి ఇంగ్లీషుపుస్తకం వ్యాపారదక్షతకి సంబంధించిన పుస్తకం. ఎదటివాడికి ఏమి వినాలని వుంటుందో అదే చెప్పు అన్నది అందులో నీతి. మునిమాణిక్యంగారు ఎదటివాడిని నొప్పించకుండా మాటాడేతీరు చెప్తున్నారు. కానీ నాకు అందులో మునిమాణిక్యంమార్కు హాస్యం అట్టే కనిపించలేదు. ఈ పుస్తకానికి ఆంధ్ర మహాభారతం నిఘంటువు (1662 పేజీలు) కూర్చిన అబ్బరాజు సూర్యనారాయణగారు పీఠిక రాసేరు. పీఠికలో “చదువుకోనివారికంటె చదువుకున్నవారికే ఈపుస్తకం ఎక్కువ ఉపయోగపడుతుంది” అంటారు. ఎందుకంటే, పుస్తకంలోఉన్న విషయాలన్నీ మనకి తెలిసినవే అయినా, “మనముఖం మనకు తెలిసిందే అయినా అద్దంలో చూచుకొని బాగుందో లేదో సరిచేసికొంటాము. అట్లే ఈ పుస్తకాన్ని అప్పుడప్పుడూ చదువుకుంటూ మనప్రవర్తన సిగా ఉందో లేదో సరిచేసుకుంటాము,” అని వ్యాఖ్యానించేరు. పీఠిక తప్పకుండా చదవాలి.

ఈ తొమ్మిది పుస్తకాలలోనూ చుక్కల్లో చంద్రునివలె, పూలతోటలో కొబ్బరిమానువలె విడిగా, ఉదాత్తంగా, మహోన్నతంగా హిమవత్ శిఖరమువలె నిలిచేది రుక్కుతల్లి. నరసింహారావుగారి కుమార్తె 14 ఏళ్ల వయసులో అకాలమరణం పొందినవెనుక, ఆమె జీవితాన్ని పరామర్శించుకోడమే ఈ కథ. ఆసాంతం రుక్కుతల్లి సౌశీల్యం, త్యాగనిరతి, దైవభక్తి, తల్లి తనకి ఒప్పచెప్పిన గురుతరబాధ్యత విజయవంతంగా నిర్వహించాలన్న దీక్ష మనని పట్టి కుదిపేస్తాయి. చివరలో రచయిత, “బుద్ది తెలిసిన ఏ పిల్ల అయినా తమ్ముళ్ళను, చెల్లెళ్ళను ప్రేమతో చూడకపోతే రుక్కుతల్లి కథ చెప్పండి,” అంటారు. ఈవాక్యం చదివి కంట తడిపెట్టనివారు ఉండరేమో.

ఈ రుక్కుతల్లి కథలో మరొక విశేషం కథనాన్ని ఒక కథకుడు కాక 7, 8 మంది నిర్వహించడం. ఒక పాత్ర కొంత కథ చెప్పేక, దుఃఖాతిశయంచేత గానీ మరొక కారణంగా కానీ, మరొకరు అందుకుని కొనసాగించడం జరుగుతుంది. ఈ పుస్తకానికి పీఠికలో ఇటువంటి ప్రయోగం ఇదే ప్రథమం అన్నారు. అవునో కాదో నాకు తెలీదు. కానీ ఇటువంటి ప్రయోగంమూలంగా కథనరీతిలో మరికొన్ని ప్రత్యేకతలు సాధించవచ్చు అనిపించింది.

చివరిమాటగా, నన్ను కథలు రాయడం ఎలా అని అడిగేవారికి, ఇదుగో, ఈపుస్తకాలు వాయువేగమనేవేగాలతో కాక, శ్రద్ధగా ఒకొకవాక్యం, ఒకొక సన్నివేశం చదివి, మనసారా నవ్వుకుని, తరవాత ఈయనకి ఎలా వచ్చింది చెప్మా ఇలా రాయడం అని సుదీర్ఘంగా ఆలోచించుకుంటే, పూవులతో గూడిన నారకువలె ఆ పరిమళాలు కొంతైనా అబ్బవచ్చు.

మరొక చిన్న అంశం కూడా మనం గుర్తు పెట్టుకుంటే ఈకథలు ఇంత ఆత్మీయంగా ఎందుకు అనిపించేయో తెలుస్తుంది. మామూలుగా రచయితలు తమఅనుభవాలు, తమయిళ్ళలో సంఘటనలే రాఔసినా, పాత్రలపేర్లు మారుస్తారు. మునిమాణిక్యం నరసింహారావుగారికి అలాటి దాపరికాలు లేవు. ఆ అరమరికలూ లేని అతి సాధారణ మహానుభావులు ఆయన. అందుకే పాత్రలు – పంతులు (తాను), కాంతం, రాధాయి, రుక్కుతల్లి, సుశీ, శాస్త్రి … తమకుటుంబంలో పేర్లు! పాత్రలని సజీవపాత్రలు చెయ్యడానికి ఇంతకంటే ఏం కావాలి?!

లింకులు –

మునిమాణిక్యం నరసింహారావుగారి అమ్మాయి, సిహెచ్. మంగ ఇంటర్వ్యూ ఇక్కడ

తెవికీలో మునిమాణిక్యం నరసింహారావుగారి జీవితం, సాహిత్యం వివరాలు ఇక్కడ

 

(ఏప్రిల్ 15, 2014)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

One thought on “హాస్యప్రసంగాలు, ఇతర కథలు”

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s