మధురాంతకం రాజారాంగారికథల్లో జీవనమాధుర్యం!

మధురాంతకం రాజారాంగారి కథలగురించి కొత్తగా చెప్పేదేముంది అని మీకనిపిస్తే ఆశ్చర్యం లేదు. చాలాకాలంతరవాత మళ్ళీ చదువుతుంటే నవ్యనూతనంగా భాసించేయి. మరొకమారు అద్భుతమైన అనుభవం ఇది. మీరు చదువుతారో మానుతారో అన్నది మీయిష్టం.

నాకు చాలాకాలంగా రావిశాస్త్రిగారు అభిమానరచయిత. ఎవరైనా నన్ను మంచికథకులెవరని అడిగితే రావిశాస్త్రిగారిపేరే మొదట చెప్తాను. తరవాత మల్లాది రామకృష్ణశాస్త్రీ, మధురాంతకం రాజారాంగార్ల పేర్లు చెప్తాను. ఇప్పుడు రాజారాంగారిపేరు మొదటికి తీసుకొస్తున్నాను. అంటే నేను తెలుగు సాహితీక్షేత్రంలో వారిస్థానాలు నిర్ణయిస్తున్నానని కాదు. వారు ముగ్గురూ దిగ్దంతులు. భావుకులు. తెలుగుకథకి వన్నెచిన్నెలు అలదిన మేధావులు నిస్సంశయంగా. అయితే, వీరిలో కొన్ని తేడాలున్నాయి. నామటుకు నాకు రావిశాస్త్రిగారికథలు చదువుతుంటే, అవి ఆయన స్వగతాలలా, తనలో తను చెప్పుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఎదుట పాఠకుడు ఉన్నాడన్న స్పృహతో కథ చెప్తున్నట్టుండదు. రామకృష్ణశాస్త్రిగారికథల్లో ఒకరకమైన ఆరూఢి స్ఫురిస్తుంది. “ఇదుగో అబ్బాయీ, నీకు తెలీదు కనక చెప్తున్నాను” అన్నట్టుంటుంది ఆయనకథనరీతి. రాజారాంగారు వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. ప్రవృత్తిరీత్యా కూడా ఉపాధ్యాయులుగానే ప్రత్యక్షమవుతారు ఈ కథల్లో. మునిమాణిక్యం నరసింహారావుగారు కూడా వృత్తిరీత్యానూ ప్రవృత్తిరీత్యానూ ఉపాధ్యాయులే. అలాగే భమిడిపాటి కామేశ్వరరావుగారు కూడా వృత్తిరీత్యాను ప్రవృత్తిరీత్యాను ఉపాధ్యాయులే. అయితే, వీరు ఆవిష్కరించిన కోణాల్లో వ్యత్యాసం ఏమిటంటే వీరిద్దరూ బడిలో ఆనాటి చిన్నపిల్లలప్రవర్తన చిత్రించేరు హాస్యరసస్ఫోరకంగా. ఆ సందర్భంలోనే ఉపాధ్యాయులయందు లుప్తమైన గౌరవం కూడా కొంతవరకూ కనిపిస్తుంది వీరికథల్లో. వీటికి భిన్నంగా, రాజారాంగారికథల్లో “జిత్తెడు నిక్కర్లపైన జానెడు చొక్కాలు తొడుక్కున్న ఒకనాటి బుల్లి విద్యార్థులు పెరిగి పెద్దవాళ్ళయిపోయి మీసాలతో, గడ్డాలతో ఏ బజారులోనో … నమస్కారమండీ అంటూ పలకరించడం” చూస్తాం (మా బొంబాయి ప్రయాణం పు.270). ఆ గురుశిష్యులమధ్య చిన్నతనంలో నాటుకుని, దరిమిలా కాలక్రమంలో ననలు తొడిగి, ఫలపుష్పభరితాలయిన ఆత్మీయతలు, అభిమానాలు చోటు చేసుకుంటాయి. నామటుకు నాకు రాజారాంగారికథలు చదువుతుంటే, ఆయన మనతో సమస్థాయిలో ఆదరించి మాటాడుతున్నట్టు ఉంటుంది. కొండొకచో కథకుడు వినయంగా కూడా కనిపిస్తారు. రాజారాంగారి తొలికథల్లో “తాను వెలిగించిన దీపాలు” వారిని మేలుబంతి రచయితగా సుస్థిరం చేసిన కథ. కథ నాకు బాగా గుర్తు లేదు కానీ అందులో వస్తువు మాత్రం ఈ గురుశిష్యుల అనుబంధమే.

ప్రతి ఒక్క విషయమూ క్షుణ్ణంగా పరిశీలించి, అనేక కోణాలను చక్కగా పరిశీలించి ఆవిష్కరిస్తున్నట్టుంటాయి ఆయనకథలు. కథ ఎత్తుగడలో, పాత్రచిత్రణలో, సన్నివేశాలు ఆవిష్కరించడంలో, ముగింపులో – ప్రతి పదంలోనూ ప్రతి అక్షరంలోనూ రాజారాంగారి ముద్ర కనిపిస్తుంది. వన్నె తరగని, చెక్కు చెదరని ముద్ర అది. ఇతివృత్తాల్లో వైవిధ్యం, పాత్రచిత్రణలో పరిపూర్ణత, కథనరీతిలో అసదృశమైన పోకడలు – రాజారాంగారికథలని తెలుగు కథాసాహిత్యంలో ప్రత్యేకంగా, విడిగా నిలబెడతాయి. మౌలికమైన భారతీయాత్మని ఎంతగా అభిమానిస్తారో అభ్యుదయభావాలని అంతగానూ అభినందిస్తారు.

ఇతివృత్తం తీసుకుందాం. రాజారాంగారు 300 కథలు రాసేరుట. ఈ సంకలనంలో 37 కథలున్నాయి. వీటిలో వైవిధ్యం వారి ఉపలబ్ధికి సాక్ష్యం. పల్లెజీవితాలు- పట్టణపు పోకడలు, స్వదేశీజనాలు-విదేశీయులు, రైతులు-వ్యాపారులు, ఉపాధ్యాయులు-ఆఫీసుల్లో మేనేజర్లు, దొంగలు-దొరలు, చంపవచ్చినవారికైనా అతిథిసత్కారంలో లోపం చేయని ఉత్తమురాలెంతో, ఆత్మనిగ్రహంతో తనదారి తను చక్కదిద్దుకున్న సబల కూడా అంతే. ఆధునికయుగంలో కులాంతర, మతాంతర, విజాతివివాహాలు, కుటుంబనియంత్రణలు అన్నీ ఆయనకి కథావస్తువులే. తమకి ఇబ్బంది కలిగించే అంశాలు –అసభ్యసాహిత్యంవంటివి- తీసుకోక మానరు కానీ అది తమకి అప్రియమని తెలియజేయడానికి వ్యంగం వాడుకుంటారు. “కామినీ, బట్ట విప్పుకుని పైకి వచ్చేస్తున్నట్టుండే మోహినీ పిశాచాలు, తతత దయ్యాలు, తలపుర్రెలు, కంకాళాలు, రాక్షసరతులు, సమిష్టి సంభోగాలు … ఇదే తిండీ, నీళ్లూ … పరమార్థము అయినట్టు వ్యవహరించే వల్లకాటి నాగరికతకి అద్దంపడుతూ రుద్రభూమి”లాటి పుస్తకాలుషాపు … చూస్తే కథకుడికి “ఒళ్ళంతా చెమటలు పోశాయి. కళ్ళు తిరిగేయి. ఉన్నట్టుండి శవాలజాతరలో పీనుగుల కుంభమేలాలో ఆటవికదిగంబరుల పాశవికప్రవృత్తులనడుమ చిక్కుపడిపోయేనం”టాడు. “ఇంకా నేలమాళిగలో ఎంతో నమ్మకమయినవాళ్ళకు గాని చూపించనివి కూడా ఉన్నాయి” కానీ ఆయన అక్కడ నిలవలేక పారిపోతాడు.

వరసగా చదువుకుంటూ పోతుంటే, రాజారాంగారు చూడని లోకం లేదేమో అనిపించింది ఈ 37 కథల్లోనే. మొత్తం 300 కథలు చదివితే ఇంకా ఎంత చూస్తామో నాఊహకందడం లేదు.

పాత్రచిత్రణ తీసుకుంటే – సాధారణంగా రచయిత పాత్రలని పరిచయం చేసేవిధానంలో రెండు స్థాయిలు ఉన్నాయి. ఒకటి అక్షిగోచరమైన రూపాన్ని వర్ణించడం, రెండోది పాత్రల ఆంతర్యాలను సూచనప్రాయంగా తెలియజేయడం. మొదటి తరహా వర్ణనకి మచ్చు – బండలాంటి బట్టతలకు ఓ తుండుగుడ్డ చుట్టుకుని, రిపేర్లతో తలమునకలైన చెప్పుల్లోనుంచీ పాదాలను ఊడ్చుకుంటూ వీధుల వెంటతిరగే మిఠాయి బేరగాడు …. (సుడిగుండం. పు. 32). చీరె కట్టుకున్న చెరుకుగడలా అమ్మాయి … గుబురుగా పెరిగిన చెరకు సోగలకుమల్లే శిరోజాలను గూళ్ళుగూళ్ళుగా … ” (సుడిగుండం. పు. 41). శేఖరంగారు బాగా పొడుగరి. స్థూలం కాదుగానీ సొరకాయలా జజ్జుబారిన శరీరం ఆయనిది. … రోజులతరబడి సంస్కారానికి నోచుకోని క్రాపింగుతో, నలిగిపోయిన దుస్తులతో, ఏదో మందకొడితనం గూడు కట్టుకున్న ముఖంతో, అప్పుడే నిద్రపడకనుంచి లేచినట్టుగా … (సుడిగుండం పు.35). మాసిపోయిన నాలుగు మూళ్ళపంచె, గోనెపట్టాలా వున్న నీలిరంగు అరచొక్కా, పొట్టి వెంట్రుకల గుండ్రటి తల. కోపంతో కందగడ్డలా జేవురించిన ముఖం. అతడిపేరు కోదండం. (మసి మరక. పు. 175.). దయ్యాన్ని చూచి జడుసుకున్నట్టుగా తలవెంట్రుకలు నిక్కబొడుచుకుని గాలిలో కదులుతున్నాయి. (ఉన్నదీ కోరుకున్నదీ. పు. 48).

రెండోపద్ధతి పాత్రచిత్రణకి ఉదాహరణ – ఒకానొక సామూహిక చిత్రంలో… బాల్యాన్ని అధిగమించి, యౌవనంలో కాలుబెడుతున్న చంద్రం … కళ్ళల్లో కాంతులు నింపుకుని చిరునవ్వుని మరీ అంత స్వేచ్ఛగా పారిపోకుండా పెదవుల చివళ్ళలో త్రొక్కిపట్టి వెలుగుతూన్న కాకరపువ్వొత్తిలా కనిపించేడు. ఆ చూపులేవో ప్రగల్భ భావాల్ని వెలార్చుతున్నాయి. కొంచెంగా కుంచించుకపోయిన కనుబొమలు మనిషిలోని ఆలోచనను, నిశ్చలత్వాన్నీ లీలగా ప్రకటిస్తున్నాయి. …పెడదారివెంట పరుగెత్తీ పరుగెత్తీ పొరపాటు తెలిసి రాగానే ఆగిపోయి వెనుదిరిగి వెళ్ళడానికీ మనస్కరించక, ముందుకు వెళ్ళడానికీ సాహసంలేక ఇసుక తుఫానులో చిక్కి బిక్కరిస్తున్న ప్రయాణీకుడిలా … (సుడిగుండం. పు. 34)

ఈ కథల్లో మనని సూదంటురాయిలా ఆకర్షించి, ఆనందడోలలలో ఊపిరాడకుండా ఊపేసే మరో సుగుణం రాజారాంగారి కవితాత్మ. “మంచులో తడిసిన తర్వాత నీరెండలో నిగనిగలాడుతున్న గులాబీపువ్వులా ఉంటుంది.” (ఉన్నదీ కోరుకున్నదీ. పు. 48). “ఆషాఢమాసంలో ప్రథమ దివసంలాంటి రోజు. నీలాంబరాన కాలాంబుదాలలముకున్నాయి. ఉదయం పదిగంటలు కావస్తున్నా వానవాసనతో మిళితమై హేమంతకాలపు శీతలపవనం కిటికీగుండా లోపలికి వీస్తోంది.” (వైరాగ్యంతో సరాగం. పు. 52). “దిక్కులవరకూ పచ్చని తోటలు, కెంపులు, పచ్చలు, యింద్రనీలాలు గుప్పిళ్ళతో తీసి వెదజల్లినట్టున్న పుష్పగుచ్ఛాలు. మెల్లగా కదలిపోతున్న నీలిమబ్బులు, ఆకాశాన మేఘాంచలాలకు మెరుగులు దిద్ది క్రిందికి దిగివచ్చి సర్వప్రపంచంపైన వసంతాలు చల్లుతున్న సువర్ణకాంతులు. భువనమోహనంగా ముస్తాబైంది సంధ్యాసుందరి. పచ్చని పావడా కట్టి పువ్వుల కంచుకాన్ని తొడిగి, సరిగంచు వచ్ిచన వీలిరంగు వలువను పమిటగా కైసేసి నృత్యానికి సిద్ధమైన రాజనర్తకిలా సంధ్య ఒయ్యారాలు పోతోంది.” (ఉన్నదీ కోరుకున్నదీ. పు. 47).

రాళ్ళసీమగానూ, రత్నాలసీమగానూ పేరుబడ్డ రాయలసీమ పల్లెపట్టులని వర్ణించినవిధానం రాజారాంగారివంటి పుట్టు రైతుబిడ్డకే చెల్లు. “అప్పట్లో అది బంగారుకాలం అనుకోవాల. తలుచుకోగానే వానలు పడి చెరువులు, సముద్రాలమాదిరిగా అంచులదాకా పొంగివచ్చి, ఏడాదికిరుగార్లు పంటలు పండితే రైతు ఆ భూభారమంతా చిటికెనేలితో మోసెయ్యడా సార్! వరసగా అయిదారేండ్లు సరిగా వానల్లేక, పంటలు చేతికందక పోయేటప్పటికి ఏటిలో బోర్లేసేసిరి, ఏటి గట్లలో బోర్లేసేసిరి. నీటిజల అడుగంటిపోయె …” ఆ తరవాత మామిడిచెట్లు నాటి, “మాంగోనగర్” అయిపోతుందావూరు. తీరా ఆ “మాంగో”వ్యాపారంకారణంగా ఇద్దరు శిష్యులు తగువు పడితే, తగువు తీర్చమని ఈ చిన్ననాటి గురువుగారిదగ్గరకే రావడం పాఠకుడికి కూడా ఆర్ద్రతతో కూడిన అనిర్వచనీయమైన

అనుభవం. ఆ తీర్పు బొంబాయిలో వర్తకుడు తోతారాం సమక్షంలో జరగాలి కనక ఆయన్ని బొంబాయి తీసుకువెడతారు. అదీ మాబొంబాయి ప్రయాణం కథ. ఈకథలో నాకు మరోవిషయం స్ఫురించింది. శీర్షిక బొంబాయిప్రయాణం అని చూసినప్పుడు ఆ ప్రయాణానికి ఇల్లాలు కట్టే మూటలో, ఇరుగూ పొరుగూ బొంబాయిలో మరెవరికో చేర్చమని ఇచ్చే మూటలో అనుకున్నాను. కానీ ఈకథలో మనం చూసేది ఆ ప్రయాణం ఏ సందర్భంలో చేయవలసివచ్చింది అని మాత్రమే. నేనిక్కడ చెప్పదలుచుకున్నది ప్రతిభావంతుడైన రచయిత ఒకకథకి శీర్షిక పెట్టినప్పుడు పాఠకుడిని ఎలా తికమక పెట్టగలడో చూడమని. ఇది ఒకవిధంగా నాకు కొత్త పాఠం కూడా అయింది – కథలకి శీర్షికలు ఇవ్వడంలోనూ, వాటిని ఎలా అన్వయించుకోవాలో గమనించడంలోనూ.

అలాగే, పల్లెల్లో వెనకటిరోజుల్లో ఉత్తరాలు బట్వాడా చెయ్యడానికి తిరిగే చిన్నాయన పాత్రచిత్రణ అద్వితీయం. “పాకాలనుంచి దక్షిణాదిగా కాట్పాడివైపు వెళ్ళేరైల్లో ప్రయాణం చేసినవాళ్ళు పూతలపట్టు, చిత్తూరు, రామాపురం, బొమ్మసముద్రంలాటి ఊళ్ళపేర్లు వినివుంటారు. … చిన్నాయన ఉత్తరాల సంచి బుజాను వేసుకుని సుఖమా మనరాజ్యమెల్ల సుఖమా అన్నంత దర్పంగా పల్లెలపైకి బీటు వెడలేవాడు. … ఆయనవెంట ఊళ్ళు తిరగడమంటే భలే ఖుషీగా ఉండేది.” (ఆగని వేగం 257). లెక్కలటీచరు అయిన కథకుడు చిన్నాయన ఉద్యోగకాలంలోనూ ఇతరత్రా నడిచిన దూరం మొత్తం నాలుగు లక్షల కిలోమీటర్లు అంటూ లెక్క కట్టి చూపించేరు. ఈకథలో కూడా ఆ ప్రదేశాలు, చిరుతిళ్లు, నడిచిన దూరాలు, ఆడుకున్న కబుర్లు – ఇలాటి ప్రపంచం ఉండేదా ఒకొప్పుడు అని అనిపించకమానదు ఈనాటి పాఠకుడికి.

ఒక సామెతని యదాలాపంగా కథలో చొప్పించడం ఒక ఎత్తు. దాన్ని కథలో ఒక ప్రధానాంశంగా మార్చుకోడం మరొక ఎత్తు. “ఒక ఆడబిడ్డకు వివాహ సంబంధం కుదర్చాలంటే మునుపు ఏడు జతలజోళ్ళు అరిగిపోయేవిట.” (అనామకుడు పు. 134). రాజారాంగారు సామెత ఉదహరించి వదిలేయడం కాక, దాన్ని వెంటనే కథకి అనుగుణంగా ఆధునీకరిస్తారు. “కాలేజీలెక్కువై అబ్బాయిలు అమ్మాయిలు పరస్పరం ప్రేమించుకోడమంటూ ఒకటి ప్రారంభమైన తరవాత ఇప్పుడా బెడద చాలావరకు తగ్గిపోయినట్టే ఉంది…” (135) – ఇది కథలో ఒక కీలకమయిన అంశమని మనకి చివరికి గానీ స్పష్టం కాదు. మొత్తం కథంతా ఈ అంశంమీద కేంద్రీకృతమై, పాఠకుడిని తీవ్రమైన ఆందోళనకి గురి అయేలా చేస్తుంది ఆఖరికి. అంటే రాజారాంగారు ప్రేమకథలకి వ్యతిరేకి అని కాదు నేను చెప్తున్నది. మానవసంబంధాలు ఆధునికయుగంలో ఎలా మార్పుకు లోనయేయో, వాటి ఫలితాలేమిటో చిత్రించడమే రచయిత చేసింది.

“బీటలు వారిన నేలపైన తొలిముంగారు వానలు కురిసినట్టుగా”, “వలచిన వనిత దొరకడంకన్నా కోరిన ఉద్యోగం దొరకడం కష్టం”, “ఎలాగైతేనేం కోరిన కొండలో వాన కురిసింది.” (వైరాగ్యంతో సరాగం. పు. 59.) లాటివి రాజారాంగారు కొత్తగా కూర్చిన సామెతల్లా ఉన్నాయి. “పెదవి దాటితే పృథివి దాటుంద”ని వాడుకలో ఉన్న సామెత. రాజారాంగారు “పెదవి దాటినతరవాత పెన్ననే లంఘించగలదం”టారు (సంఘజీవి. పు. 13). “తల్లి చనిపోతే తండ్రి దాయాది” (సబల. పు. 66). “ముంతపొగలో ఊపిరి తిప్పుకోలేనంతగా”. (పు. 89). “పోస్ట్ మాన్ కొలువు చేసేది రూకలకు. పార్వతమ్మ ఇల్లిల్లూ తిరిగేది పొద్దు పోకడకు”. (పు. 12). “పాదలేపనంతో అవుసరం లేకుండా త్రిప్పి చూపించగలిగింది ఉద్యోగం” (ప్రజాపతి పు. 72). “ఆమె ముఖాన కృష్ణపక్షం కళలు మార్చుకుంది. చిట్టచివర అక్కడ నిండు అమావాస్య నెల నాటుకుపోయింది.” (పు. 15). ఇలాటి జాతీయాలు కోకొల్లలు.

ఆయనకి సమ్మతం కానీ సందర్భం వచ్చినప్పుడు సంయమనంతోనే అయినా చురుగ్గానే అంటించగలరు. “తన భార్యను తానొక దేవతలా చూచుకుంటాననే వ్యక్తిని నేను స్వయంగా ఎరుగుదును. మొదటితరగతి ఆడఖైదీకి మగ కాపలాదారుకన్నా అతడి వ్యవహారం ఏమంత మెరుగ్గా లేదు” (మట్టి పొయ్యి. 140). మాటకారితనం అంటే ఏమిటో తెలుసుకోవాలంటే ప్రజాపతి కథలో విశ్వపతిని గమనించండి. “పిల్లకాలువ గాదు, జీవనదిలాంటిది విశ్వపతి వాక్ప్రవాహం. అందులో పడి ఎంత దూరం కొట్టుకపోవలసి ఉంటుందో తెలియదు,” అంటాడు కథకుడు. (పు. 82).

నాకు అద్భుతంగా అనిపించిన మరో అంశం – ఈ కథల్లో కథారచనకి సంబంధించిన వాక్యాలు చోటు చేసుకోడం. అవి రాజారాంగారి వ్యక్తిగత అభిప్రాయాలు అవునో కాదో నాకు తెలీదు గానీ కథకుడుగా అక్కడక్కడ వెలువరించిన అభిప్రాయాలు, కాబోయే రచయితలు తప్పకుండా గమనంలోకి తీసుకోవచ్చు –

“మీరెలా రాస్తారండీ” అని అడిగితే, ఆయనజవాబు, “అదెంత పని లేవోయ్ కన్నారావ్! వ్రాయగలిగిన పేనా ఒకటి చేతిలో ఉండాలి. అందులో సిరా ఉండాలి. ఎవరైనా రాసి పారెయ్యొచ్చు.” ఆ తరవాత మాత్రం ఆయనకి చిన్న బెదురు కలుగుతుంది. “ఈ కన్నారావు కరపత్రాలు, ఆకాశరామన్న ఉత్తరాలు మొదలైనవి రాసేవాళ్ళకున్నూ, కథలు, నవలలు మొదలైనవి వ్రాసేవాళ్ళకున్నూ స్వభావంలో తేడా ఏమాత్రముండదన్నట్టు భావిస్తున్నాడు!” అంచేత వెంటనే, “ఏదైనా వ్రాయాలంటే దండిగా చదవాలోయ్, కన్నారావ్.” (రుద్రభూమి పు. 323) అని హెచ్చరిస్తారు.

“గడచిపోయిన అధ్యాయంలో ఒకచోట కనిపించి తనను విస్మయచకితం చేసిన పాత్రయొక్క పునరాగమనంకోసం కుతూహలంతో వేచి ఉండడం పాఠకుడి స్వభావం. ఎంతకూ ఆ పాత్ర కథలోకి రాకపోతే కొంత నిరుత్సాహం తప్పదు.” (ప్రజాపతి. పు. 80.)

“అతనికి నేను కృతజ్ఞుణ్ణి. కథ మొదటినుంచీ చెబుతాను. … (శివానందంతో) పరిచయం ఎలాంటి పరిస్థితుల్లో కలిగిందో చెబుతే, ఈకథలోని ముఖ్యపాత్రల్ని పరిచయం చేసినట్టవుతుంది.” (కృతజ్ఞుణ్ణి! పు. 120).

“ఆదినుంచీ పూస గుచ్చినట్టు చెప్పాంటే, యిది ‘డూమ్స్ డే చిట్టా’లాంటి ఉద్గ్రంథమై పోయే ప్రమాదం ఉంది. మరైతే ఎక్కడ ప్రారంభించడం? నాపాలిటికిది పెద్ద కృత్యాద్యవస్థ అయిపోయింది. దీర్ఘాలోచన తర్వాత ఒక నిర్ణయానికి రాగలిగేను. కథ ఎక్కడ అయితే అడ్డం తిరుగుతుందో అక్కడినుంచే ప్రారంభించడం, అవసరాన్నిబట్టి వెనక్కి వెళ్లి మళ్లీ ముందుకు రావడం!” (యక్షప్రశ్న. పు. 205)

హాస్యం, వ్యంగ్యం పుష్కలంగా ఉన్నాయి ఈకథల్లో. “గరిమనాభినుంచి వస్తున్న సరళరేఖ ఆధారతలంలో పడడంలేదేమో, ఆమె ఒక్కొక్క మెట్టు దిగినప్పుడల్లా ఒక్కొక్కరకంగా వంపులు తరిగిపోతోంది.” (సుడిగుండం. పు. 41). “నామరూప గుణరహితుడైన భగవంతుడికిమల్లే ఆ వాక్యాల్లో కర్త, కర్మ, క్రియలు లేవు. ఎండమావిలో నీటికి మల్లే ఆ పదాలసముదాయానికి అర్థం లేదు. పటిష్టమైన ప్రభుత్వానికి నోచుకోని దేశంలో చెలరేగే అరాచకాలకుమల్లే ఆ కాగితాల్లో ఎక్కడబడితే అక్కడ కాపిటల్ లెటర్సే! ఎక్కడ చూసినా కామాలే! ఎక్కడ చూసినా ఫుల్‌స్టాపులే! మనవాళ్ళు కవుల్ని నిరంకుశులంటారు. కవులు నిరంకుశులైతే వాళ్ళపాపాన వాళ్లే పోతారు కానీ, ఈ విద్యార్థులసంగతి అలా కాదు. వీళ్ళు మనదుంప తెంచేస్తారు.” పరీక్షల్లో కాపీ కొట్టడంగురించి, “బుర్ర గోక్కుంటే ‘ఎ’ అనీ, ఒళ్ళు విరుచుకుంటే ‘బి’ అనీ … పెళ్ళికూతురికి మల్లే తల బాగా క్రిందికి వంచేస్తే ఆన్సరు ‘డి’ అనీ సుస్థిరంగా ఏర్పడిపోయిన సంకేతాలను..” (అంగరక్షకుడు. పు. 109, 110). ఇది మీలో చాలామందికి తెలిసినదే కావచ్చు నాకు కొత్త. ఒక వైద్యశాలముందు తప్పక దయ చేయండి అని బోర్డు ఉందిట. “ఇంకా నయం. శ్మశానం దగ్గర, సుస్వాగతమన్న బోర్డు కట్టారు గాదు” అంటారు కథకులు. “రోగపీడితులకు మనవి” అంటూ .ఒక హెడ్డింగు తగిలించి ఉంటే ఆ ప్రకటన మరీ అంత అసంగతంగా ఉండి ఉండేది కాదేమో!” … కొంతకాలం అయినతరవాత చూస్తే, “ఒకసారి వచ్చినవారు తిరిగి వెళ్ళలేరు” అన్నవాక్యం జోడించి ప్రకటన పరిపూర్తి గావించాడు!” ఇలా ఎంతైనా చెప్పుకుపోగలను. నాకైతే చదువుతున్నంతసేపూ పట్టలేనంత నవ్వొచ్చింది.

చివరిమాటగా, వర్థమానరచయితలకు ఉచిత సలహా – కథ ఎలా రాయాలని బుర్ర గోక్కునేవారికి ఇది గొప్ప పాఠ్యగ్రంథం కాగలదు. అభ్యాసంకోసం ఏం చేయాలంటే, ఆ ధర్మసూక్ష్మం ఇదుగో – రాసుకోండి లేదా చదువుకుని గుర్తు పెట్టుకోండి.

 1. ఒకొక పాత్రని ఎలా పరిచయం చేసేరు? పాత్రగురించి చెప్తున్నప్పుడు ఎటువంటి నుడికారం వాడేరు? ప్రాచుర్యంలో ఉన్న సామెతలు ఏ సందర్భాల్లో ఉపయోగించుకున్నారు? కొత్తవి ఎలా కూర్చేరు? ఒకొక సన్నివేశం వర్ణించడంలో ఏయే సంగతులు చెప్పేరు? ఎన్నివిధాలుగా చెప్పేరు? ముగింపులో కొసమెరుపుకోసం, పాఠకులని కేవలం సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తెయ్యడానికే చమత్కారవాక్యం ఒకటి రాసేరా? కథలో సందేశాన్ని ఒడుపుగా ముక్తాయించేరా? ఇవి జాగ్రత్తగా ఈ కథల్లో పరిశీలించి చూసి, జవాబులు చెప్పుకుంటే, రాజారాంగారికథలంత గొప్పకథలు రాయగలరో లేదో నాకు తెలీదు కానీ మంచి కథ రాయగలరని చెప్పగలను.

రాజారాంగారికి అనేక పురస్కారాలు లభించేయని తెలుసు కానీ ఉత్తమ ఉపాధ్యాయుడుగా వచ్చిందో లేదో తెలీదు. రాకపోతే ఎందుకు రాలేదో కూడా నాకు తెలీదు. కానీ కాగితంమీద వచ్చినా రాకపోయినా, రాజారాంగారు ఉత్తమరచయిత, ఉత్తమ ఉపాధ్యాయుడు, ఉత్తమ రచయితఉపాధ్యాయుడు, ఉత్తమ ఉపాధ్యాయరచయిత.

వారు తెలుగుసాహిత్యాభిమానులకి అందించిన ఈ కానుకకి కృతజ్ఞతాపూర్వక శతసహస్ర నమస్కారాలు చెప్పుకోడమే నేను చేయగలిగింది.

పుస్తకం వివరాలు –

మధురాంతకం రాజారాం కథలు 3వ సంపుటం

విశాలాంధ్ర ప్రచురణ, 2004.

130 రూపాయలు.

 

(ఏప్రిల్ 29, 2014).

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

7 thoughts on “మధురాంతకం రాజారాంగారికథల్లో జీవనమాధుర్యం!”

 1. రాయలసీమలో భూమిలోతులను తడిమితేనే నీటి ఊట!అందుకేనేమో ఆ నేపథ్యంలోని కథలు గుండెలోతులనుండి

  వెలువడే కన్నీటి చెలమలు.చక్కటి వివరణాత్మక విశ్లేషణ మాలతిగారు.

  మెచ్చుకోండి

 2. ఓలేటి వెంకట సుబ్బారావుగారూ, శ్రీరాజారాంగారితో మీపరిచయం వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నాక్కూడా వారితో కొంచెం పరిచయం ఉంది, ఉత్తరాలు లేవు కానీ. రాజారాంగారిలా తాము నమ్మిన సత్యాలని కథల్లోనూ జీవితంలోనూ కూడా ఆవిష్కరించి ఆచరణలో పెట్టిన రచయితలు చాలా చాలా అరుదు. వారికథలు అందుకోసమైనా చదవాలి మళ్లీ మళ్లీ.

  మెచ్చుకోండి

 3. aaptha mitrulu sri madhurantakam rajaram garu- aayana vraasina uttaraalu naa vadda 50 ki paigaane unnayi- -vatini chaduvukuntoo- malleee mallee chaduvukuntoo anandinchadam apoorva anubhavam naaku-maatalalo madhuryaaanni panchadam aayana lo oka pratyekatha- chakkati sameeksha nu andinchina malathi gariki vandanaalu -voleti venkata subbarao ,slough/united kingdom ~

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.