ఊసుపోక – తిలకాష్ఠ మహిషబంధనము అను నాగ్రంథాలయచరిత్ర!

(ఎన్నెమ్మకతలు 138)

ఈరోజు మీకు నా గ్రంథాలయచరిత్ర చెప్పబోతున్నాను. అవధరించండి, కాఫీలు, సిగరెట్లూ, ఇంకా ఏ ఏ అలవాట్లుంటే వాటన్నిటితోనూ.

గ్రంథాలయచరిత్ర అంటే అయ్యంకి వెంకటరమణయ్యగారో వెలగా వెంకటప్పయ్యగారో రాసినట్టు రాస్తున్నాననుకోకండి. ఇది నాగ్రంథాలు అంటే మాయింట గల గ్రంథసంపదకు మాత్రమే పరిమితం. అదేమంత పెద్దది కూడా కాదులెండి. అంచేత ఈ హరికథ చీకటి పడకమున్నే ముగిసిపోతుంది. నాసైటు తూలిక.నెట్ ముఖాన చూసేరు కదా. అంతకంటె మరో మూడు అరలు ఉండేవి కానీ పుస్తకాల్లో ఉన్నది కూడా విద్యే కనక పుస్తకదానం కూడా విద్యాదానంలో భాగమనుకుని, దశదానాల్లో చేరుతుందని నిశ్చయించేసుకుని, పంచిపెడుతూ వచ్చేను. అరువిచ్చిన బుక్కు తిరిగి చూడ్డం గొప్ప లక్కు అని ఆరుద్రగారికైతేఉండొచ్చు కానీ నేను మాత్రం పుస్తకాలు అలా ఇంటింటా తిరగాలనే కోరుకుంటాను. ఒకట్రెండు పుస్తకాలవిషయంలో మాత్రం తిరిగి పుచ్చుకోవలసివచ్చింది. అది వేరే కథ. అయినా ఈరోజుల్లో ఎవరు మాత్రం ఏం చేసుకుంటారు కనక ఈ పుస్తకాలు. పూర్వం అయితే పకోడీపొట్లాలు కట్టుకోడానికేనా పనికొచ్చేవి కానీ ఇప్పుడావసతి లేదు. వస్తుభ్రమణం చేస్తున్నాం అంటారు కానీ మా వీధిలోనే చూసేను గాలికి కొట్టుకుపోయేవీ, వీధిపక్కన పారే కాలువల్లో కొట్టుమిట్టాడుతున్నవీ ఎన్నో …

ఇంగ్లీషువారు “నీస్నేహితులెవరో చెప్పు, నువ్వెలాటివాడివో చెప్తాను,” అంటారు కానీ నేనది అంగీకరించలేను. ఎందుకంటే నాస్నేహితులని చూసి ఎవరైనా నన్ను అంచనా వేస్తే తప్పులో కాలేయడం ఖాయం. అసలు అట్నుంచి ఇటు – నాస్నేహితులు అనిపించుకుంటున్నవారిని కూడా చాలామంది అడుగుతారుట, “నీకు ఆవిడతో స్నేహం ఏమిటి? ఏం చూసి స్నేహం చేస్తున్నావు,” అని. మనలోమాట – నాక్కూడా అనిపిస్తోంది ఈమధ్య నాలో ఏం చూసి వీళ్లు నాస్నేహాన్ని ఆహ్వానిస్తున్నారని. అంచేత నేను ఆ ఆంగ్లవాక్యం మార్చి, “నువ్వే పుస్తకాలు చదువుతున్నావో చెప్పు. నువ్వెలాటివాడివో చెప్తాను,” అని స్థిరం చేసుకుంటున్నాను. అంటే శవసాహిత్యం చదివేవాళ్ళంతా హంతకులనీ, ప్రాచీనసాహిత్యాభిమానులకీ అభ్యుదయభావాలకి చుక్కెదురనీ అర్థం కాదు. హస్తసాముద్రికం, ముఖసాముద్రికంలాగే గ్రంథసాముద్రికం కూడా ఒకటి ఉందనీ, లేకపోతే అలాటిదొకటి సృష్టించాలనీ నాఅభిమతము.

ఇంతకీ నా గ్రంథసంచయం – తూలిక ముఖపత్రంమీద షోగ్గా అయితే పెట్టేను కానీ మీరు చూసేరో లేదో వాటిలో పావులావంతు నేను పుట్టించినవే! తల్లి భారతికి అదే నాఉపచారం, కొందరు అపచారం అనుకోవచ్చు, దానికి మనఁవే చెయ్యలేఁవనుకోండి. మిగతావాటిల్లో కూడా సగం నిఘంటువులు, తత్సంబంధమే కదా. నిజానికవేవీ నేను తిరిగి చూడ్డమే లేదు. ఎందుకంటే ఇప్పుడు అన్నీ అంతర్జాలంలో దొరుకుతున్నాయి. పైగా గత ఇరవైఏళ్లలోనూ భాష మాయావటుడివలె వృద్ధి చెందిపోతోంది కదా. కొత్తపదం సృష్టించనివారిది పాపం. బ్లాగాడువారు, లైకరులు, కామెంటువారు వంటివి మనకెక్కడ దొరుకుతాయి అంతర్జాలంలో కాకపోతే? ఈ భాషాభివృద్ధికి ఏ సంప్రదాయవాదులూ ఆనకట్ట కట్టలేరు. ఏ ముద్రణాలయాలూ వీటితో కీపప్పు చేయలేవు. ఇంతకీ చెప్పొచ్చేదేమిటింటే అంతర్జాలంలో భాష మూడు పువ్వులూ ముప్ఫైయారు కాయలూగా వృద్ధి పొందేస్తుంటే, ఆ ధాటికి ఈ ఇక్ష్వాకులనాటి నిఘంటువులు తట్టుకు నిలబడగలఆస్కారం లేదు గాక లేదు.

ఇంతకీ (ఈ పదం పదే పదే వస్తున్నందుకు మన్నించాలి), పుస్తకం అనబడు వస్తువు ఎంత పెద్దదిగా ఉండాలి, ఎంత చిన్నదయి ఉండాలి అన్న యావ నాకు ఈమధ్య ఎక్కువయిపోయింది. ఈకాలపు కుర్రవారికి తెలియకపోవచ్చు కానీ కంప్యూటరు పుట్టినరోజుల్లో అది మన పల్లెల్లో పచారీకొట్టు అంత పరిమాణంలో ఉండేదిట. ఇప్పుడు అరచేతిలోకి వచ్చేయి కదా. ఇంకా చేతిగడియారం, వేలిఉంగరం పరిణామంలో కూడా వస్తున్నాయని విన్నాను. కాలిమట్టెలలో కంప్యూటరు కూడా వస్తాయేమో. అప్పుడు మగవారికి కూడా మట్టెలు తొడిగి, వాటిని యూనిసెక్స్ వస్తువుగా చేసేయొచ్చు.

ఇంతకీ, -:), ప్రస్తుతానికి వచ్చేస్తాను. నేనిప్పుడు పెద్దసైజు పుస్తకాలు అట్టే ఇష్టపడడంలేదు. లైబ్రరీకి వెళ్తే, కూడా నా ఎంపిక – మొదట పుస్తకం లావూ, బరువూ చూస్తాను. చిన్నిచేతిలో చిక్కగలపుస్తకమే చక్కనిపుస్తకం అనే అభిప్రాయానికొచ్చేసేను. లావొక్కింతయు లేకపోతేనే చేతిలోకి తీసుకుంటాను. నేను ఎడంచేత్తోనైనా తాకని గ్రంథరాజానికి ఇదుగో ఇదొక ఉదాహరణ.

DSC01885

నిజానికిది ఒక్కచేత్తో ఎత్తలేం, బస్కీలు తీసేవారికీ, కండ పెంచుకోడానికి బరువులెత్తేవారికీ పమరపురాని మనీషి వెంకటరమణయ్య

ఈ గ్రంథరాజంలోపల బొమ్మలయితే బాగున్నాయి కానీ అక్షరాలు చదువుకోడానికి భూతద్దం కావాలి.

DSC01887

లావూ, బరువూ నాకు అనుకూలంగా ఉన్నాయని నమ్మకం కలిగేక, పుస్తకం పేరు చూస్తాను. మనిషిలాగే పుస్తకానికి పేరు కూడా నాదృష్టిని ఆకట్టుకోగలిగేదయి ఉండాలని నా ప్రగాఢవిశ్వాసం. ఇంగ్లీషు పేర్లు పెట్టిన తెలుగు పుస్తకాలు, తెలుగుపేర్లు గల బెంగాలీ పుస్తకాలూ (లేవనుకోండి, ఉంటే మాట) నాకు రుచికరము కావు. ఆ తరవాత, అంటే ఈ రెండు నియమాలూ అనుకూలించేక, పుస్తకం తెరిచి చూస్తాను.

DSC01583

ఇలాటి పుస్తకాలు అట్టే కనిపించలేదు కానీ ఇందులో నాకు గొప్ప సౌలభ్యం కనిపించింది. పుటలమీద పుటలు టకటకమని గబగబ తిరిగిపోతాయి. అసలు స్పీడురీడరులకైతే కళ్ళు తిరిగిపోతాయేమో కూడా. పైగా ఆ రాసినవారు రాసినతీరు మనకి నచ్చకపోతే, అక్కడికక్కడే మనం మరో కథ రాసుకుంటూ పోవచ్చు ఆఖాళీజాగాలో. వేరే కాయితాలు వాడనవసరం లేదు కనక పర్యావరణపరిరక్షణ కూడా అయిపోతుంది. అంచేత ఇది ఉత్తమ ప్రచురణపద్ధతి. అన్నట్టు, ఒక హెచ్చరిక – అది లైబ్రరీ పుస్తకం అయితే మాత్రం మీకథ అక్కడ వ్రాయుట నిషిద్దము. తస్మాత్ జాగ్రత్త. మిమ్మల్ని చట్టవిరుద్ధమైన నేరములకు నేను ప్రోత్సహించుట లేదని ఇందుమూలముగా తెలియజేయడమయినది.

ఇంతకీ, (ఇదే ఆఖరు) అసలు విషయానికి వస్తాను. ఇప్పుడు నా గ్రంథాలయం నాఅరచేతిలోనే ఇమిడిపోయేలా ఏర్పాటయిపోయింది, (సాంకేతికవిజ్ఞానాభివృద్ధికి జేజేలు), ముచ్చటగా గూటిలో గువ్వపిట్టలా, జేబులో బొమ్మలా, అరచేతిలో ఆమలకంలా … ఇంకా ఇంకా ..లా …లా …లా …లా.

DSC01879

ఈనాటికి నాఅరచేతిఆమలకంలో గ్రంథపట్టికవివరాలు ఎలా ఉన్నాయంటే –

32 కథా సంకలనాలు

43 నవలలు

15 కవితాసంకలనాలు

22 వ్యాససంకలనాలు (వీటిలో వస్తువైవిధ్యం చూసి తీరవలసినదే.)

35 సాహిత్య చరిత్ర, విమర్శ

12 వేదాంతం

నాఅభిరుచులు కూడా ఈవరసలోనే. అంటే వేదాంతందగ్గరకొచ్చేసరికి చాలా కాలం పట్టవచ్చు.

ఈ హస్తలైబ్రరీలోవన్నీ digital library of India, archive.org వారి సౌజన్యంతో నాకు అందుబాటులోకి వచ్చినవే. వీటిలో కొన్నిటిని నాకు అందించిన పుస్తకప్రదాతలు వి.బి. సౌమ్య, రమణమూర్తిగారు.

ఆయా సైటులకి, సైటు నిర్వాహకులకి, డిజిటల్ పుస్తకప్రదాతలకి కృతజ్ఞతాశతములు.🙂

 

(మే 6, 2014).

 

 

గ్రంధకర్త మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

1 thought on “ఊసుపోక – తిలకాష్ఠ మహిషబంధనము అను నాగ్రంథాలయచరిత్ర!”

టపాలో చర్చించిన అంశంమీద వ్యాఖ్యానాలు తెలుగులో రాసిన వ్యాఖ్యలు మాత్రమే అంగీకరింపబడతాయి. తెంగ్లీషులో రాసిన వ్యాఖ్యలు కూడా నాకు సమ్మతం కాదు. కోరుతున్నాను

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s