అనువాద సమస్యలు -2

అనువాద సమస్యలు అప్పుడప్పుడు చర్చిస్తూనే ఉన్నాను. ఇప్పుడు నాకు ఎదురైన సమస్యలు ఇతఃపూర్వం నాకు ఇంతవరకూ తోచనివి.

సందర్భం ఏమిటంటే – గత రెండు నెలలుగా శ్రీ మునిపల్లె రాజుగారి కథలు అనువదించడానికి పూనుకున్నాను.  వస్తువుదృష్ట్యానూ, వాక్యనిర్మాణందృష్ట్యానూ సంక్లిష్టతరమైన కథలు అస్తిత్వనదం ఆవలితీరాన సంకలనంలోవి. ప్రతి వాక్యమూ ఎంతో ఆలోచింపజేసేదిగా ఉండి, కథ చదవడం కూడా ఒక తపస్సే అనిపింపజేస్తున్నాయి. నిజానికి ఇలాటి కథలు నేను ఇంతవరకూ చదవలేదనే చెప్పాలి.

ప్రస్తుతం నేను ఆ కథలు అనువదించడానికి ప్రయత్నిస్తున్నాను. ఈకథల్లో పదవిన్యాసంమూలంగా నాకు చాలా సందేహాలు వస్తున్నాయి. నేను ఇంతవరకూ ఇటువంటి కథలు అనువాదం చెయ్యలేదు. నామటుకు నాకు ఇది నా అనువాదాల్లో ఉత్తమయినదిగా తీర్చి దిద్దాలని నాఅభిలాష. నిజానికి, వీటిలో నాఅనువాద సరళి కూడా కొంచెం మార్చుకున్నాను ముఖ్యంగా, ఈ కథలలో వస్తువులు పాఠకులకి పరిచితమే అన్నది ఒక ప్రాతిపదికగా.

అందుచేత నా విన్నపము – మీలో ప్రతి ఒక్కరూ అనేకానేక పనుల ఒత్తిడులలో ఉంటారు కనక ఏ ఒక్కరినీ ప్రత్యేకంగా అడగలేను కానీ మీలో ఎవరైనా ఒకటి, రెండు అనువాదాలు పరిశీలించి చూసి మీ అభిప్రాయాలు చెప్పగలగితే, రాజుగారి కథలకి న్యాయం చేకూర్చడంలో సహాయం చేసినవారు కాగలరు. మీకు ఆసక్తి ఉంటే వ్యాఖ్యలో తెలియజేయండి. మీకు విడిగా వ్యక్తిగత మెయిలులో పంపగలను.

మీ సహాయానికి ముందే కృతజ్ఞతలు చెప్పుకుంటూ …

మాలతి

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.