అనువాద సమస్యలు -3

ఈమధ్య నేను చేపట్టిన మునిపల్లె రాజుగారి కథలఅనువాద ప్రణాళికతో నాకు ఇంతఃపూర్వం రాని సందేహాలు చాలా వస్తున్నాయి. ఈవ్యాసంలో ఉదాహరించినవి ఎక్కువభాగం మునిపల్లె రాజుగారి కథలే అయినా, ఇది వారికథలమీద వ్యాసం కాదని గమనించాలి. కేవలం అనువాదసమస్యలకే పరిమితం.

ఇంతకు పూర్వం నేను చేసిన అనువాదాలకంటే ఈ మునిపల్లె రాజుగారి కథలు భిన్నంగా ఉన్నాయి. వస్తువులో, వాక్యనిర్మాణంలో, పదవిన్యాసంలో, కొంతవరకూ శిల్పంలో కూడా చెప్పుకోదగ్గ తేడాలు కనిపిస్తున్నాయి ఈ కథల్లో. అందుకే ముందే మనవి చేసుకుంటున్నాను ఇది కథలమీద విమర్శలా కనిపించే అవకాశం ఉన్నా, నాదృష్టి అనువాదంమీద మాత్రమేనని.

మొదట వాక్యనిర్మాణం తీసుకుందాం. వాక్యం నిడివి తీసుకుంటే, రెండు విధాలు కనిపిస్తాయి. కర్త, కర్మ క్రియ అంటూ వాక్యంలో సాధారణంగా ఉండగల వ్యాకరణవిశేషాలు కాక, పొడి పొడిగా ఒకటో రెండో పదాలతో పూర్తి చేసిన సందర్భాలు కనిపిస్తాయి. ఉదాహరణకి,

asampurna vakyamఈ ఐదు లైనుల్లో ఇద్దరి జీవనసరళి చెప్తున్నాడు కథకుడు (నిశ్శబ్దం ఒక పదం కాదు). మొదటిలైను ఇద్దరూ కలిసి చేసేది. రెండూ, మూడూ లైనులలో మిశ్రాగారి జీవితచరిత్ర, నాలుగూ, ఐదుల లైనుల్లో కథకుడి దైనందిన కార్యక్రమం. ఈవిషయం కథకుడు మాటల్లో స్పష్టంచెప్పకపోయినా, తెలుగు పాఠకుడికి తేలిగ్గానే అర్థమవుతుంది. నేను అనువాదాలగురించి ప్రస్తావిస్తున్నప్పుడు విదేశీయులకోసం అంటూ వస్తున్నాను. కానీ తెలుగువారిలో ఈనాటిపాఠకులు ఇటువంటిరచనకి ఎలా స్పందిస్తారో తెలుసుకోవాలని ఉంది నాకు. నేను ఈ విషయం ప్రత్యేకంగా ఇక్కడ ప్రస్తావించడానికి కారణం ఈమధ్య Facebookలో “మంచి కథ ఎలా ఉండాలి,” “ఎలా ఉండకూడదు” వంటి అంశాలమీద చర్చలు జరుగుతున్నాయి. అక్కడ చర్చ కేవలం ఆ పేజీపాఠకులకే పరిమితం కనక ఇక్కడ రాస్తున్నాను ఎక్కువమంది చదివి స్పందించగలరన్న అభిప్రాయంతో.
ఇంతకీ ఇటువంటి వాక్యనిర్మాణంమూలంగా కథకి ఏమైనా హాని జరిగిందా? ఈభాగం ఇలా ఉండడంవల్ల ఎవరికైనా అసంతృప్తిగా అనిపించిందా? నిజానికి, ఈ వాక్యాలు ఇలా విడిగా తీసి ఎత్తి చూపితే గందరగోళం అనిపిస్తుందేమో కానీ మొత్తం కథ ఆద్యంతాలా చదివేసమయంలో అసలు ఈ సమస్య తలెత్తకపోవచ్చు కూడా.
అలాటిదే మరొక ఉదాహరణ నిష్క్రమణద్వారం కథ నుండి.

padaaluఇలాటివాక్యాలను అనువదిస్తున్నప్పుడు అనువాదకుడు సందర్భానుసారం క్రియాపదాలు సృష్టించుకోవలసి వస్తుంది. క్రియ తీసుకుంటే కాలనిర్ణయంఅవసరం కూడా ఉందని వేరే చెప్పఖ్ఖర్లేదు కదా. “మందులు”, “కాషాయకిరీటాలు” వంటి పదాలమూలంగా సందర్భం తెలిసినవారికి బాధ లేకపోవచ్చు కానీ మనసంస్కృతితో పరిచయం లేనివారికి కష్టమే. అసలు ఇంగ్లీషులో వ్యాకరణపరంగా సంపూర్ణం కాదు. అంటే ఇంగ్లీషులో ఇలాటి ప్రయోగం లేదని కాదు. ఇంగ్లీషుకథల్లో కూడా ఉంటాయి కానీ అది చదివే ఆంగ్లపాఠకులకి అదొక అభ్యంతరం కాదు. తెలుగుకథని ఇంగ్లీషుపాఠకులకోసం అనువాదం చేస్తున్నప్పుడు మాత్రం ఈకోణం గుర్తించవలసిన అవుసరం ఉంది. విదేశీ పాఠకులు “ఈ సంస్కృతి మనకి తెలీదు” అన్న ఊహతో, “ఈవాక్యాలమూలంగా వీరిసంస్కృతినిగురించి మనకి ఏం తెలుస్తోంది?” అన్న జిజ్ఞాసతో చదవడం ప్రారంభిస్తారు (నా అమెరికన్ స్నేహితులకి నా అనువాదాలు చూపి, వారి ప్రశ్నలు విన్నతరవాత కలిగిన అభిప్రాయం ఇది). అంచేత, వారికి తేలికగా అర్థమయే పదాలు ఎన్నుకుని, వాక్యనిర్మాణానికి పూనుకొనడం అనువాదకుడిబాధ్యత. అంటే మూలంలో లేకపోయినా అవసరాన్నిబట్టి వాక్యవిస్తరణ జరగాలి.

అలాగే, అసమాపకక్రియలతో వాక్యం నిడివి పెంచుకుంటూ పోయినప్పుడు కూడా – ఇంగ్లీషులో ఆ వాక్యం యథాతథంగా అనువదించాలంటే, “after eating breakfast, drinking coffee, locking up the door …” అని రాసుకుంటూ పోవలసివస్తుంది. లేదా “ate breakfast, drank coffee, locked the door …” – ఇలా సంపూర్ణవాక్యాల కామాలతో ఆపుకుంటూ పూర్తి చేయవలసివస్తుంది.

మనం ఎంచుకునే పదాలు కూడా ఎలా చెప్తే, విజాతీయులకి (నిజానికి తెలుగు చదవడం రాని ఎవరికైనా) ఎలా అర్థమవుతుందో అన్న ఊహ ప్రాతిపదికగా సాగాలని నాఅభిప్రాయం. ఇక్కడ మరోసమస్య తెలుగుమూలంలో క్రియాపదం చివర ఉంటుంది. దానికి ముందు కొన్ని విశేషణాలు ఉండొచ్చు. మిగతా అసమాపకక్రియలతో కూడిన వాక్యాలు విశేషణాలు కావచ్చు, మరి కొన్ని సంపూర్ణవాక్యాలు కావచ్చు. అవి జాగ్రత్తగా చూసుకుని ఏవి విశేషణాలు, ఏ అసంపూర్ణవాక్యాలు ఒక వరసలోకి ఎలా తెచ్చుకోవాలి అన్నది అనువాదకుడే పరిష్కరించుకోవలసిన సమస్య. ముందొకసారి, పురాణం సుబ్రహ్మణ్యశర్మగారి వాక్యం ఒకటి, అనవసర దాంపత్యం అన్నకథలోనిది ఉదహరించేను నా ఊసుపోక టపా ఉభయతారకం లో.  కథని నేను అనువదించినప్పుడు,  పైన చెప్పినట్టు అసమాపకక్రియలకి భూతకాలరూపం అన్వయించుకుని, వాక్యాలు పూర్తి చేసేను. (నా అనువాదం ఇక్కడ చూడవచ్చు.).
ఈనాడు మనకి కొత్త అనిపిస్తున్నపదాలు నిజానికి చాలా పాతవి కావచ్చు. కదాచితుగా కొన్ని పదాలు రచయితలు కల్పించినవి కావచ్చు (బ్లాగాడేవారికి ఇది అనుభవం కదా). వెనకటి రచయితలకథలలో ఇప్పుడు మనకి తెలియని పదాలు, నుడికారాలు విరివిగానే ఉంటున్నాయి. మల్లాది రామకృష్ణశాస్త్రిగారు, కాళీపట్నం రామారావుగారు, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారు – వీరికథల్లో చూసేను. స్త్రీలరచనల్లో ఇవి తక్కువే మాండలీకాల్లో రాస్తున్నవారిని తప్పిస్తే.

మునిపల్లె రాజుగారికథల్లో ఇలాటిపదాలు బాగానే కనిపిస్తున్నాయి. కొన్ని పదాలకి నాలుగు నిఘంటువులు చూసినా దొరకలేదు. కొన్ని పదాలు సాహితీమిత్రులనడిగి తెలుసుకున్నాను. ఇంకా కొన్ని పదాలకి అర్థాలు ఇంకా వెతుకుతూనే ఉన్నాను. (అచ్చుతప్పులు కూడా ఉండొచ్చనుకోండి, అది వేరే సంగతి). ఒకొప్పుడు ఒకే పదానికి వేరు వేరు ప్రాంతాల్లో వేరు వేరు అర్థాలు కూడా ఉండవచ్చు. ఇవన్నీ కూడా అనువాదం క్లిష్టతరం చేస్తాయి. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, అనువాదం చెయ్యడం అనుకున్నంత తేలిక కాదని.

ఒకొకప్పుడు వస్తువు వాక్యనిర్మాణాన్ని నిర్ధారిస్తుంది. అస్తిత్వనదం ఆవలితీరాన లో –

వాక్యనిర్మాణమఈ పేరాలో కథానాయకుడి అంతర్మధనం వ్యక్తమవుతుంది. గంభీరమైన వాక్యాలు రాసినప్పుడు తీవ్రమైన వేదనని చిత్రించినప్పుడు పెద్ద పెద్ద సమాసాలూ, సంస్కృతపదాలు వాడడం చాలామంది రచయితలు చేస్తున్నదే. బహుశా తెలుగులో ఈ సుదీర్ఘవాక్యాల, అసమాపకక్రియలఉపయోగం ఇదేనేమోయ – శ్రోతదృష్టినాకట్టుకుని, అతడిలో ఉత్కంఠని కలిగించడం, పెంచడం. రెండోది, మనసులో అలివి కాని ఆవేదన పేరుకుని మనసంతా అతలాకుతలం అయినప్పుడు, పదాలు వరదలా వచ్చి పడిపోతుంటాయి కానీ పదోతరగతి కాంపొజిషన్ క్లాసులోలా వ్యాకరణంమీదికి దృష్టి పోదు. ఆ ఉత్కంఠ, ఆ మానసికవేదన, ఆ క్షోభ అటువంటి భాష వాడడం కూడా కద్దు. నిష్కామ అనుభూతి, నిరీహస్పృహ, నిస్సంకల్ప సిద్ధియోగం … ఒక ఉద్ఘీత ప్రథమచరణం, అద్భుతగానం, ఒక మహానిరీక్షణ, ఒక సంభ్రమవాతావరణం – లాటి అనేకఊహలు కలగాపులగంగా ఏకకాలంలో మనసులో మెదులుతున్నాయి అన్న మానసికస్థితిని మరొకభాషలోకి ఎలావదిస్తాం? ఇది అనుఒకరకంగా stream of consciousness శైలిలాటిదే.

శైలివిషయంలోకూడా ఇలాటి క్లిష్టపరిస్థితులే ఎదుర్కొంటాం ఒకొకప్పుడు. నాకు తొలిసారిగా అనుభవమయింది కాళీపట్నం రామారావుగా యజ్ఞం కథ అనువాదం చేస్తున్నప్పుడు. అక్కడ భూతకాలం వర్తమానం పడుగుపేకల్లా అల్లుకుపోయిన సమయాలు ఉన్నాయి. అప్పల్రాముడు పంచాయితీలో పది నిముషాలసేపు మాటాడితే, అందులో మూడు సార్లు గతకాలపు కథ వస్తుంది. అసలు ఇంగ్లీషు, తెలుగు భాషల్లో కాలం ప్రయోగంలో తేడా ఉంది. ఈ భాగం అనువాదం చేస్తున్నప్పుడు ఈ వాక్యాలని పాత్రపరిచయదశకి కాకపోతే, కనీసం ఆ మూడు కథనాలని ఒక చోట చేర్చవచ్చునా? అప్పట్లో కాళీపట్నం రామారావుగారిని సంప్రదిస్తే, ఆయన ఆ నిర్ణయం నాకే వదిలివేశారు. అంచేత అప్పల్రాముడి ఉపన్యాసంలో మూడు చోట్ల ఉన్న వెనకటి ఉదంతాలన్నిటినీ ఒకచోటికి చేర్చేను. (ఇప్పుడు మళ్ళీ మునిపల్లె రాజుగారు కూడా నానిర్ణయానికే వదిలేశారు! ఇందువల్ల నాబాధ్యత మరింత క్లిష్టతరమైయింది!) అయినా నాకు ఇప్పటికీ సందేహమే. అలా చెయ్యవచ్చునా? అందువల్ల తెలుగుకే ప్రత్యేకమైన కథనరీతికి నేను అన్యాయం చేస్తున్నానా? ఈ కాలనియమాలను పక్కకి పెట్టి, ఉన్నది ఉన్నట్టుగా అనువాదం చేసి, “ఇది మా తెలుగువారి కథనరీతి” అని మనం సగర్వంగా ఎందుకు చెప్పుకోకూడదూ? పాశ్చాత్యులు చెప్పిన సిద్ధాంతాలనే అనుసరిస్తూ కథలు ఇలాగే రాయాలని విమర్శకులూ, సంపాదకులూ నిర్ణయాలు చేస్తుంటే, కథలలో మనదైన ప్రత్యేక శైలిని నిర్లక్ష్యం చేసినట్టు కాదా? అసలు ఇలా కొట్టినపిండే కొడుతూ, వారు చెప్పిన మార్గాలలోనే రాస్తుంటే, కొత్తప్రక్రియాస్వరూపాలు ఎలా ఏర్పడతాయి?

అలాగే చోట్ల ముక్కస్య ముక్కః అనువాదాలు ఎక్కడ నప్పుతాయి అన్నది కూడాను. సాధారణంగా ముక్కస్య ముక్కః చేస్తున్నామా అన్నది తెలుగుమూలం కూడా పక్కన పెట్టుకు చూసినవారికి తప్ప తెలియకపోవచ్చు, ఇంగ్లీషులో తెలుగువాక్యానికి సమానార్థకంగా ఇంగ్లీషుపదాలు కూడా ఉపయోగించగలిగితే. రెండోది సందర్భాన్ని బట్టి కూడా అనుకుంటాను.
ఉదాహరణకి,water for hungerPNGఇందులో కథకుడికి అతడెవరో తెలీదు. ఒక్క రైల్వే వారంటుతోనే వచ్చి ఉంటాడు అంటూ మొదలుపెట్టి, అతన్నిగురించి ఊహిస్తున్నాడు కథకుడు. “నీళ్లతో కడుపు నింపుకుంటున్నాడు” అదే తొలిసారి చూడడం. నిజంగా అతను రోజూ అలాగే చేస్తున్నాడో లేదో కథకుడికి అప్పట్లో తెలీదు. అంచేత చూసింది చూసినట్టు వచ్చిన ఆలోచన “he is drinking water to squash his hunger” అన్నది. అటువంటి సందర్భంలో నేనయితే ఇలాగే అనువదిస్తాను.

సామెతలు, నుడికారాలగురించి ఇదివరకు చాలానే రాసినా మరోమారు చెప్పాలనిపించిన జాతీయాలు – మన తిట్లు. ఏదో ఒక పదం, వెధవ, చవట, పిచ్చిముండ, ఏబ్రాసిలాటి పదాలకి సుమారైన సమానార్థకాలు దొరుకుతాయి కానీ ఒక పాత్ర తిట్లవర్షం కురిపించినప్పుడు దాన్ని అనువాదంలో ఎలా చేస్తే బాగుంటుందని నాకు సందేహం వచ్చింది. ప్రత్యేకించి, ఈరోజుల్లో వ్యావహారికభాషపేరుతో అపారంగా అసభ్యపదాలవాడుక విజృంభించిపోతోంది కనక. టీవీ పెడితే, బూతుమాట లేకుండా మూడు నిముషాలు గడవదు. ఆఖరికి వార్తల్లో కూడా “ఉపయోగించరాదు” అంటూనే ఓనమాలు రాని పసివాళ్ళకి కూడా అర్థమయేంత చక్కగా అన్యాపదేశంగా చూపిస్తున్నారు! విని విని మనక్కూడా అప్రయత్నంగా మననోట అవే వచ్చేస్తాయేమో అనిపిస్తోంది ఒకొకప్పుడు. ఇంతకీ ఇవన్నీ తల్లినీ, చెల్లినీ తలుచుకునేవే. వారంరోజులక్రితం ఒక తెలుగుకథలో చావుతిట్లు చూసినప్పుడు నాకు సందేహం కలిగింది. తరవాత ఫేస్బుక్కులో అడిగితే, నారాయణస్వామి నాసందేహం తీర్చేరు. ఆడవారు మగవారిని తిట్టే తిట్లు అలా ఉంటాయని. ఇంగ్లీషుసంస్కృతిలో ఈ వ్యత్యాసం ఉందేమో నాకు తెలీదు. పోతే, అనువాదం విషయానికొస్తే, నేను వీటిని ఒక వివరణవాక్యంతో ముగించవచ్చు అనుకుంటున్నాను – “She poured a volley (or torrent) of curses, essentially wishing his death” అని. నారాయణస్వామి కొన్నివాక్యాలకి అనువాదం ఇచ్చేరు. నేనింకా నిర్ణయించుకోలేదు ఏది నాఅనువాదంలో నప్పుతుంది అన్నది.

శిల్పంవిషయంలో కూడా నాకు అదే విధమైన సందేహం. తెలుగులో మనం చెప్పే పద్ధతి ఒకటుంది. నిత్యజీవితంలో మాటాడుతున్నప్పుడు కాలం అట్టే పట్టించుకోం. తేలిగ్గా ముందుకీ వెనక్కీ వెళ్ళిపోతుంటాం. ఈ పద్ధతి సాహిత్యంలో చోటు చేసుకోడానికి కారణం మౌఖికసాహిత్యమే. పురాణాలూ, హరికథలూ చెప్పేటప్పుడు సందర్భాన్నిబట్టీ ఎదుటనున్న శ్రోతలస్పందననుబట్టీ కథకుడు తనధోరణి మార్చుకుంటూ పోతాడు. అలాగే రాస్తున్నప్పుడు ఎదురుగా పాఠకుడు ఉన్నాడు అనుకుని రాస్తే, ఆ వచోవిభవమే దర్శనమవుతుంది. మల్లాది రామకృష్ణశాస్త్రిగారి కథల్లో చూస్తాం ఇలా మనతో మాటాడుతున్నట్టు రాయడం. మునిపల్లె రాజుగారికథల్లో ఒకొకప్పుడు ఎదురుగా ఉన్న మనిషితో మాటాడుతున్నట్టు, ఒకొకప్పుడు తనలో తను మాటాడుకుంటున్నట్టు ఉంటాయి. ఈ రెండో పద్ధతిలో పాఠకుడే కథకుడిహృదయంలోకి చొచ్చుకుని పోయి, కథ గ్రహించాలి.
సాధారణంగా కథ “చెక్కిన శిల్పం”లా ఉండాలంటే, ప్రతివాక్యమూ ముందువాక్యముతోనూ తరవాతివాక్యముతోనూ సమన్వయం కావాలి. ఇలాటి రచనకి పెట్టింది పేరు రాచకొండ విశ్వనాథశాస్త్రిగారు. ఆయన ప్రతిపదం శిల్పిలాగే చెక్కుతారని ప్రతీతి. మునిపల్లె రాజుగారికథల్లో కొంచెం గందరగోళం కనిపిస్తుంది. ఇది కాళీపట్నం రామారావుగారికథలో కాలపరంగా ముందుకీ వెనక్కీ వెళ్ళడంలాటిది కాదు. రామారావుగారికథలో ఈ కాలనిర్ణయం – కథలో కథలా కనిపిస్తుంది. మునిపల్లె రాజుగారి కథల్లో ఒకవిషయంలోనుంచి మరోవిషయానికి మారిపోవడం జరుగుతుంది. silpamPNG

ఇక్కడ కథకుడు సప్తతి మహోత్సవం కథలో సీతారాం అన్న మహోన్నత వ్యక్తిత్వంగల ఆదర్శమూర్తి సీతారాం గురించి చెప్తున్నాడు. ఆయనగురించి ఇదే ప్రథమ పరిచయం కాదు కథలో. సగానికి పైగా కథ అయినతరవాత, ఆయనగారి సాహసచర్యలు చెప్తూ మధ్యలో ఆయన ఏకసంతగ్రాహి, హిందీ, సంస్కృతంలో అమోఘమైన పాండిత్యం ఉంది అన్నవాక్యాలకి స్థానం లేదు. అవి మొదట్లో ఆపాత్ర పరిచయం చేస్తున్నప్పుడు చెప్పవలసినవిషయాలు కదా.

ఇక్కడ మళ్లీ నేను పైన అడిగిన ప్రశ్నే అడుగుతున్నాను. ఈ రచయితశైలి ఇదీ అని ఉన్నదున్నట్టు అనువదించడమా, అప్రస్తుతం అనిపించిన వాక్యాలు ముందుకో వెనక్కో తరలించడమా? అలా తరలించడం న్యాయమేనా?

మీ అభిప్రాయాలు తెలియజేయగలరు.

(జులై 16, 2014)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

2 thoughts on “అనువాద సమస్యలు -3”

  1. యం.వి. రమణారావుగారు క్షమించాలి మీ వ్యాఖ్యకి ఆలస్యంంగా స్పందిస్తున్నందుకు. నిజమేనండి. అనువాదాలు యథాతథంగా ఎప్పుడూ సాధ్యం కాదు. ఎటొచ్చీ, మనం వేరేవిధంగా ఆ అనువాదభాషలో చెప్పి మూలరచయితని ఒప్పించడానికి ప్రయత్నించినప్పుడే వస్తున్నాయి చిక్కులు.

    మెచ్చుకోండి

  2. అనువాదంలో విభిన్నరీతులు ఉన్నాయి.ప్రతీ వాక్యమూ యథాతథంగా అనువదించనక్కరలేదు.అనువాదకులు కొంత స్వతంత్రం తీసుకోవచ్చును.భాషా,సంస్కృతీ భేదాలని గమనిస్తూ అనువదించబడే భాష నుడికారం(idiom)పాటించాలి.కొన్ని చోట్ల అథోజ్ఞాపికలు (foot notes) ఇవ్వవలసిఉంటుంది.ఎలాగైనా అనువాదం కష్టమైన ప్రక్రియే.

    మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.