ఊసుపోక – నీటపా మేలు మేలు, కాకున్న ఓ చిరు లైకు

(ఎన్నెమ్మకతలు 142)

దాదాపు ఆరేళ్ళక్రితం ఒక టపా రాసేను. బ్లాగుప్రపంచంలో తొలి అడుగు వేసిన రోజుల్లో. నేనేదో నాకు తోచింది నాపాట్న నేను రాసుకుపోతుంటే, అలా కాదండీ అని బ్లాగు పండితులు కొన్ని సూచనలు చేసేరు. అందులో ఇతరబ్లాగరుల దృష్టినాకట్టుకొనుట ఎట్లు అన్నది ఒకటి. అంటే మరీ అంత చాదస్తంగా చెప్పలేదనుకోండి. అదే పరస్పర భుజములు చరుచుకొని పద్దతి. అప్పటికింకా నాకు ఈ “ఆదానప్రదానాల”సంప్రదాయంలో లుకలుకలు అట్టే తెలీవు.

అందులో ఒక ముఖ్య వేడుక లింకులిచ్చుకోడం. లింకులివ్వడం మొదలెట్టాను శ్రద్ధగా.

ఇది మళ్ళీ ఎందుకు మొదలు పెట్టేనంటే, ఫేస్బుక్కులో నాఅనుభవాలు కూడా ఇలాగే ఉన్నాయి. “నీ స్నేహము కోరుచున్నాము” అని వార్త వచ్చినప్పుడల్లా సరేననేస్తాను. పాపం, వాళ్లకి నేనివ్వగల మడిమాన్యాలు లేవు, అమెరికాకి ఆహ్వానించే తాహతు లేదు. పాపం, సరేనంటే నాసొమ్మేం పోయిందని.

వారిలో హేయ్ వాట్సప్ లాటి వార్తలు వస్తే, వద్దని చెప్తాను. ఇంకా వై, నీసొమ్మేం పోయింది అని దబాయింపుల్లోకి దిగితే, తాడు తెంపేస్తాను (అదే మిత్రసూత్రం). ఆటలాడుకుందాం రా అంటే కూడా అంతే. లేదు, లేదు, లేదు, కాదు, కాదు, నావల్ల కాదు … ఇంత పాడఖ్ఖర్లేదులెండు, టర్నాఫ్ కొట్టేస్తే చాలు. ఇంకా కావలిస్తే, రిపోర్ట్ స్పామ్. హుమ్. కొందరికి ఆటలాడడం కాలక్షేపం. వాటిని కాదనడం నా కాలక్షేపం!

పోతే, చెన్నాపట్నం చెరుకుముక్క, నీకో ముక్క, నాకో ముక్క లాగే – లైకులు కూడా అని గ్రహించడానికి నాకు కొంతకాలం పట్టింది. అది జరగదు నావిషయంలో. నేను స్పృశించే అంశాలు మీకు నచ్చినంతమాత్రాన, మీరు చర్చించే అంశాలు నాకు నచ్చుతాయని రూలు లేదు. ఈవిషయంలో ఈఊరికి ఆఊరెంత దూరమో ఆఊరికి ఈవూరు అంతదూరం కాదు. మాగ్రూపుని మెచ్చుకోండి అని అడిగినవారందరూ నాగ్రూపుని వాళ్ళపేజీలో పెట్టుకోడం లేదు కదా. ఇదీ అంతే.

అలాగే భళీ భళా అంటూ చెప్పుకునే మెచ్చుకోళ్ళూనూ. నాకు నచ్చినది మీపేజీలో ఒకటో, పావో ఉండొచ్చు. ఈసిద్ధాంతానికి విపర్యయమున్నూ సత్యమే.

ఇంతకీ ఇదంతా ఫేస్బుక్కులోనే పెట్టక ఇక్కడ ఎందుకు పెడుతున్నానంటే, ఇక్కడ చాలారోజులుగా ఏమీ రాయలేదని ఒకటీ, రెండోది, ఇంత రగడమధ్య కూడా ఫేస్బుక్కులో కాస్తో కూస్తో కొత్త విషయాలు తెలుస్తున్నాయి. కోకొల్లలుగా పెట్టుకునే సొంత ముఖాలమధ్య చూసి ఆనందించగల మంచి కళ, కుప్పలుతిప్పలుగా కలబోసుకుంటున్న స్వసంగతులమధ్య తప్పనిసరిగా, ఆహో నాకు ఇంతవరకూ తెలీనే తెలీదు అనుకుని ఆనందించగల సంగతులూ కూడా కనిపిస్తున్నాయి. సాహిత్యంలో మంచి అభిలాష గలవారు కూడా అక్కడ రాస్తున్నారు అని చెప్పడానికే.

నాకు ముఖ్యంగా నచ్చినవిషయం, నాకు ఏమైనా సందేహాలు వస్తే, ఒకటి రెండు వాక్యాల్లోనో ఒకటి రెండు పేరాల్లోనో అడిగితే, నాకు అక్కడ సమాధానాలు వచ్చినట్టు బ్లాగులో రాలేదు. అక్కడి పాఠకులు, సభికులు (అనొచ్చేమో. చాలామంది ఫ్రెండు అని వాడుతున్నారు కానీ నాకు అంతగా నచ్చలేదు.) వేరు. అంచేత నేను అక్కడ కూడా చూస్తున్నాను.

ఇక్కడ లింకుల్లాగే ఫేస్బుక్కులో లైకులు అని చెప్పేను పైన.

అప్పట్లో ఈవిషయమై నేను రాసినది మరోసారి చదువుకోండి –

రాజు వెడలె రవితేజములలరగ అంటూ నాకత వచ్చెను తెరమీదకి.

అవే బ్లాగ్వరులపేర్లు తిరిగొస్తున్నాయి మరలా మరలా బూమరాంగులవలె.

పాఠకులు చదవడం మొదలుపెట్టి నేనిచ్చిన లింకులుచ్చుకు అటుకేసి వెళ్లిపోతున్నారు. ఒక్కరూ తిరిగొచ్చిన జాడ లేదు. ఎవరూ నాటపా చివరంటా చదివిన పాపాన పోయినట్టులేదు.. ఆబ్లాగ్వరుల ప్రతిభ అలాటిది.

ఇది కాదు పని అని, నేను కూడా ఆ లింకులివ్వబడిన బ్లాగరుల ఇల్లు సొచ్చి, తలో వ్యాఖ్య, వ్యాఖ్యమీద వ్యాఖ్య పెట్టుకుంటూ పోయేను. నా అస్తిత్వాన్ని చెప్పకయే చెప్పుతూ (బ్లాగులోళ్ల గుట్టు నెం. 2.).

ఇలా రెండురోజులపాటు గొలుసులకి గొలుసులు ఎడతెగక తగిలిస్తూ …

కీలు మీద కీలు కొట్టుకుంటూ పోడంతో వేలు వాచిపోయింది.

డాక్టరుదగ్గరికి వెళ్లేను.

“ముదిరిపోయింది, వేలు తీసేయాలి” అన్నాడు.

“అదెలా? నావేలే నాజీవన కీలు” అన్నాను.

“నీకు వేలు కావాలా? కీలు కావాలా?” అన్నాడు.

సరే వేలు తీసేమన్నాను, స్పీచి కీలుతో గడుపుకోవచ్చులే అని.

ఆయన చురకత్తికోసం పక్కగదిలోకి వెళ్లేడు.

“డాట్రారు బాబూ” అంటూ ఓ మీసాలాసామి ఓ కర్రిగేదెని తోలుకొచ్చాడు,

నేను ఎగిరి గెంతేసేను నిష్క్రమణద్వారంవేపు.

డాక్టరొచ్చేడు మేకలు నరుక్కునే కత్తితో.

చివ్వున కత్తి విసిరేడాయన.

కెవ్వుమని కేకేసి లేచి కూర్చున్నాన్నేను.

కల గనక సరిపోయింది. … భయంకరం!

సత్వరమే అమలులోకి వచ్చిన నా ప్రతిజ్ఞ – ప్రసిద్ధ బ్లాగరులకి లింకులివ్వబడవు. దీనికి విపర్యయసిద్ధాంతమున్నూ సత్యమే. అంటే నేను లింకులివ్వకపోతే, వారు ప్రసిద్ధ బ్లాగరులయి వుండాలి.

తాజాకలం – బ్లాగుల్లో లింకుల్లాగే ఫేస్బుక్కులో నన్ను లైకు చెయ్యండి అంటూ వచ్చే అర్జీలున్నూ. వాటికి నాసమాధానం ఇదే – అంతమందిని లైకు చేసే ఓపిక లేదు కనక నేను లైకు చెయ్యకపోతే వారు ప్రముఖ యఫ్బీమహాత్ములుగానే గుర్తింపబడినట్టు లెఖ్ఖ.

  1. మీ టపాకింద నావ్యాఖ్య లేకపోతే, మరొకరిటపా కింద ఉండవచ్చని గ్రహించవలెను. :p

 

(ఆగస్ట్ 6, 2014)

గ్రంధకర్త మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

3 thoughts on “ఊసుపోక – నీటపా మేలు మేలు, కాకున్న ఓ చిరు లైకు”

టపాలో చర్చించిన అంశంమీద వ్యాఖ్యానాలు తెలుగులో రాసిన వ్యాఖ్యలు మాత్రమే అంగీకరింపబడతాయి. తెంగ్లీషులో రాసిన వ్యాఖ్యలు కూడా నాకు సమ్మతం కాదు. కోరుతున్నాను

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s