ఊసుపోక – నవ్వెప్పుడొస్తుందో

(ఎన్నెమ్మకతలు 143)

నవ్వుగురించి బోలెడు పుస్తకాలున్నాయి. నవ్వులు ఎన్ని రకములో, నవ్వెలా వస్తుందో, నవ్వు లక్షణాలేమిటో, వాటిని ఎలా గుర్తించాలో చాలామందే చెప్పేరు. అంచేత నేను మళ్ళీ

హాస్యం ఎట్లు జనించును అంటూ మొదలెట్టను. అట్లు నవ్వును విశ్లేషించిన పెద్దలందరికీ ఓ నమస్కారం పెట్టి, ఈమధ్య “ఆసికాలంటే ఏంటి” అని వచ్చిన సందేహం ఎందుకు వచ్చిందో మనవి చేసుకోబోతున్నాను. ఒకరకంగా పై పాఠాలకి ఇది అప్డేడు అనుకోవచ్చు. ఇలాటివి మీకు కూడా తటస్థపడ్డాయా అని ప్రశ్నించడమే నా ధ్యేయం.

“నడివీధిలో నువ్వు బోర్లా పడితే హాస్యం, నేను పడితే విషాదం” అన్నది సాధారణనియమం.

“నువ్వు బుద్ధిహీనంమాటలు ఆడితే నాకు నవ్వొస్తుంది. ఆమాట అందరికీ చెప్పి నవ్వుతాను కూడా. అదే నామాట అయితే నువ్వు నవ్వినందుకు నాక్కోపం వస్తుంది” అన్నది కూడా అలాటిదే.

కొంతకాలంక్రితం కొన్ని కార్టూనులు చూసినప్పుడు నాకు వచ్చిన ఆలోచన. హాస్యయుత చిరు సంభాషణకీ కార్టూనికీ తేడా వీరు గ్రహించలేదా అని.

చాలాకాలం క్రితం ఒక కార్టూను చూసేను. బాపుగారిదే అని నాకు గుర్తు. తల లేని ఒక మొండెం చేతిలో పళ్ళెం, ఆ పళ్ళెంలో తల ఉంటాయి. ఎదురుగా భార్య ఉంటుంది. “ఇంత గంజి పెట్టొద్దని చాకలికి చెప్పమని చెప్పేనా?” అని వాక్యం.

ఈమధ్య సాంఘికమాధ్యమాలలో స్నేహబృందాలు విస్తారంగా ప్రాచుర్యంలోకి వచ్చేక, కొన్నివేల మైళ్ళదూరంలో, కొన్ని తరాలతేడా ఉన్నా, “దగ్గర” అయిపోతున్నారు. దగ్గరివారయేక, మరి దానికి అనుగుణంగా దగ్గరివాళ్ళలాగే కబుర్లూ, కాకరకాయలూ, హాస్యాలూ, అపహాస్యాలూ, కదాచితుగా తిట్టుకోడాలూ… నీలితెరమీద సాగదు కనక కొట్టుకోడం ఒక్కటే తక్కువ. మరి స్నేహం అంటే అదే కదా. అరమరికలు లేకుండా, హాయిగా మనసులో మాట నోటా లేదా కీలా (కీలు కొట్టి) వెలువరించేయడం. అందులో అపార్థాలకీ, అనర్థాలకీ, అంతరార్థాలకీ, విపరీతార్థాలకీ తావు లేదు. ఉండరాదు.

నిజానికి హాస్యం నిత్యజీవితంలో భాగం. చాలా పెద్ద భాగం. సాహిత్యంలోనూ అంతే. అందుకే విషాదాంతనాటకాల్లో కామిక్ రిలీఫ్. మనవీధి నాటకాల్లో కేతిగాడూ బంగారక్కా ప్రవేశం. ప్రజలు విషాదంలో పడి కొట్టుకుపోకుండా, కాస్త తెరిపి ఇవ్వడానికే ఇవి. అష్టావధానాల్లో అప్రస్తుతప్రసంగం కేవలం సభికులనలరించడానికే కాక, అష్టావధానం నిర్వహిస్తున్నవారిప్రజ్ఞ చాటడానికి కూడాను. మహా ఘనతవహించిన పండితులు కూడా వెనకటిరోజుల్లో పత్రికలలో ఒకరినొకరు హేళన కూడా చాలానే చూసేం కదా. ఇంకా ముందు కవులు కూడా అంతే. అల్లసాని పెద్దన అమవసనిశి అని రాసినందుకు తెనాలి రామకృష్ణుడు ఎమి తిని కపితము చెపితివి అంటూ మరోపద్యంతో వెక్కిరించడం సకలపాఠకులకూ సువిదితం. అయినా, వీటన్నిటిమధ్యా ఆసికాలకి కూడా వేళా పాళా ఉన్నాదనే నేను నమ్ముతాను. ప్రతిసారీ నప్పదేమో అనే అనిపిస్తుంది. హాస్యం, వ్యంగ్యం, హేళన, చమత్కారం – ఇవన్నీ కూడా సమయానుకూలంగా ప్రయోగిస్తే రాణిస్తాయి. ఎవ

ఒకరు తమకి కలిగిన కరక్కాయలాటి సమస్యని ఎత్తుకుని మీరేమంటారు అని సాటివారిని అడిగితే, ఆ ప్రశ్నదారు ఏ ఉద్దేశ్యంతో అడిగేరో చూసుకుని అక్కడ హాస్యం, వ్యంగ్యం, హేళన, చమత్కారం వంటి రసపోషణకి అవకాశం ఉందో లేదో గమనించవలసిన అవుసరం జవాబులిచ్చేవారికి ఉందని నా దృఢ అభిప్రాయం.

ఉదాహరణకి, “మాఅమ్మాయికి అక్షరాలు నేర్పండి చాలు, నవలలు రాసి బతుకుతుంది” అని ఓ తల్లి 5వ తరగతి పంతులుతో అంటుంది. దీనికి బొమ్మ అఖ్ఖర్లేదు. ఇక్కడ హాస్యసంబంధి ఏమిటో మాటల్లోనే తెలిస్తోంది.

అలాటిదే మరో చతురభాషణ –  వెంకయ్య ఇల్లెక్కడా అని.

చిన్న కఛ చెప్తాను.

ఒకాయన వెంకయ్యగారింటికోసం వెతుకుతున్నాడు. దారిలో కనిపించిన కుర్రాడిని అడిగేడు “బాబూ, వెంకయ్య ఇల్లెక్కడా?” అని.

ఆ కుర్రాడు మంచి హాస్యరసపోషకుడు. అంచేత ఎంతో హుషారుగా, “వెంకయ్య పాపం పెద్దవాడు కదండి. ఇల్లు ఎక్కలేడు” అని నవ్వేడు.

మీరే అనుకోండి. ఏ బెజవాడలోనో రోహిణీ కార్తెల్లో రైలు దిగేరు, ఎక్కడా కనుచూపు మేరలో రిక్షాల్లేవు. ఇల్లెక్కడో మీకు సరిగా తెలీదు. స్టేషనుకొచ్చి, మిమ్మల్ని ఏసీ కారులో ఇంటికి తీసుకెళ్తానన్న మేనల్లుడు పత్తా లేడు. ఊసూరుంటూ బయల్దేరేరు కాళ్లీడ్చుకుంటూ. వాళ్ళనీ వీళ్ళనీ అడుగుతూ రోజంతా తిరుగుతున్నారు. కళ్లూ, కాళ్లూ, కడుపూ కూడా మండుతున్నాయి.

అలాటిసమయంలో పైన వచ్చిన జవాబు విని నవ్వగలరా?

మామూలుగా ఏసీ గదిలో చల్లని పానీయం చప్పరిస్తూ, ఈ జోకు వింటే నవ్వుకోడానికి బాగుంటుంది. ఇల్లు ఎక్కడా అని అడిగితే, ఇల్లు ఎక్కడు అని సమాధానం. లేని అర్థం కల్పించి, ఇచ్చిన జవాబు. కానీ పైన చెప్పిన సందర్భంలో మాత్రం చిరాకేస్తుంది కదా.  అదీ నేనంటున్నది.

అలా కాక ఒక చమత్కారభాషణ చొప్పించేస్తే, ఏం జరుగుతుందంటే. అందరికీ హాస్యం ఇష్టం కనక ఆ హాస్యంవెంటబడి మిగతా కబుర్లన్నీ ఆదారినే నడిపించేస్తారు మిగతా హాస్యరసపోషకులు. దాంతో అసలు విషయం పక్కదారి పడుతుంది. మొదటివిషయంమీద నిశ్చితమైన అభిప్రాయాలు గలవారు కూడా ఇదేదో హాస్యానికి రాసినట్టుందని తమకి తెలిసినవిషయాలు కూడా రాయడం మానేస్తారు. పృచ్ఛకుడికి కావలసిన సమాధానం సంగతి ఇంక ఇంతే సంగతులు.

నేనిలా రాసినందుకు నాకు హాస్యరసాస్వాదనగుణం తక్కువనీ, లేదా ఇంగ్లీషులో sense of humor లేదనీ అనుకోకండి. నవ్వొచ్చినప్పుడు, నవ్వదగ్గ సందర్భం అయినప్పుడు నవ్వుతాను. నేను కూడా హాస్యభాషణలు ఆడుతాను. నావి కూడా ఒకొకప్పుడు అసందర్భం అయి నేనే నవ్వులపాలవడం కూడా జరుగుతుంది. కానీ సీరియస్ సందర్భం అయితే సీరియస్సే అని కూడా అనుకుంటాను.

వెనకోసారి నవ్వొచ్చినప్పుడు చెప్పు అని ఓ టపా రాసేను. దానికి ఇది రెండోభాగంగా గ్రహించగలరు.

 

(ఆగస్ట్ 12, 2014)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

7 thoughts on “ఊసుపోక – నవ్వెప్పుడొస్తుందో”

  1. నమస్కారం. “హాస్యం” అంశంపై వచ్చిన పరిశోధనాత్మక పుస్తకాలు,ఇతరముల వివరాలు తెలుపగలరు

    మెచ్చుకోండి

  2. ఇంకోరకం మరిచారు – వెండితెరమీద కమీడియన్ని ఊరకే ఎంత కొడితే అంత ‘హాస్యం’!
    “ఎమి తిని కపితము చెపితివి” అని గుర్తు, గురువులు లెకుండ చెపినడని. టైపారాక్షసమైతే మన్నించగలరు.

    మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.