శ్రీ మునిపల్లె రాజుగారు “కథాకథనసంవిధానంలో ప్రయోగాలు చేసేర”ని ప్రసిద్ధ కథకులు శ్రీపతిగారు అన్నారు ఒక ఇంటర్వూలో. రాజుగారిని “కథకులకథకుడు” అన్నారు అక్కిరాజు రామాపతిరావు (మంజుశ్రీ)గారు. “కథాఋషి” అన్నారు మధురాంతకం రాజారాంగారు.
70 ఏళ్ళకి పైగా తెలుగుకథ ఎలా రాయాలి అన్న ప్రశ్నతో కుస్తీలయేక, ఇటీవల కథలు ఎలా రాయకూడదన్న చర్చ ప్రారంభమయింది.
గత ఆరునెలలుగా మునిపల్లె రాజుగారికథలు నేను అక్షరం అక్షరం, పదం పదం, వాక్యం వాక్యం చూసుకుంటూ(!) చదివినందున పైరెండు ప్రశ్నలగురించి తీవ్రంగా ఆలోచించేను. కథలు ఇలా ఉంటేనే ప్రచురిస్తాం అని (మంకు?)పట్టు పడుతున్న సంపాదకులూ, ప్రచురణకర్తలూ ఓపక్కా, రచయితలు నూతన ప్రయోగాలు చెయ్యడం లేదు, మంచికథలు రావడంలేదంటూ పాఠకులు మరోపక్కా మహోధృతంగా ఆక్రోశిస్తున్న నేపథ్యంలో రాజుగారికథల్లో పైరెండు ప్రశ్నలకీ సమాధానంగా నేను గమనించిన, “ప్రయోగాలు”గా గుర్తించదగ్గ అంశాలు ప్రస్తావించే ప్రయత్నం ఇది.
“కధని అనుసరించు, కథకుడిని కాదు,” అని రాజుగారే శలవిచ్చేరు కనక ఆకోణంలోనుండే ఈ వ్యాసం. అంటే ఇది కేవలం కథలమీద చర్చే కానీ రాజుగారి ప్రతిభాపాటవాలవిమర్శ కాదని గ్రహించాలి.
పై సమాచారం దృష్టిలో పెట్టుకుని, వస్తువులోనూ, శైలిలోనూ, శిల్పంలోనూ రాజుగారు చేసిన ప్రయోగాలు, లేదా, ఈనాడు కథామేధావులు నిర్ణయించిన మంచికథ లక్షణాలకి భిన్నంగా ఉన్నభాగాలు ఏమిటి అంటే –
వస్తువు తీసుకుంటే రాజుగారే ఒక ఇంటర్వూలో చెప్పేరు. ప్రధానంగా ఈనాడు యుద్ధాలూ, మరణాలూ, భీభత్సం, సమాజంలోనూ, ఇంట్లోనూ సంఘర్షణలూ ఈనాటి జీవితంలో ఇతోధికంగా కనిపిస్తున్నాయి. అందుకు భిన్నంగా భారతీయవేదాంతం, మతగ్రంథాలూ శాంతిని బోధిస్తాయి. నిరీక్షణని ప్రోత్సహిస్తాయి. ఈ వైరుధ్యాలమధ్య మానవీయవిలువలని ఆదరించి మనిషి మానసికంగానూ, సమాజజీవిగానూ ఔన్నత్యాన్ని సాధించడానికి దోహదం చేయడం కథలలక్ష్యం అంటారాయన. అంచేత ఈ కథలు ఆ విశాలదృక్పథం పరిధిలో జీవితాన్ని అనుభవించి, పరిశీలించి చిత్రించినవి.
“మానవఔన్నత్యం, మానవ పరిణతి కథలో చిత్రిస్తే, ఆకథ సామాజికఅనుబంధాలలో, కుటుంబంలోవారితో అనుబంధాలలో సమస్యలని తట్టుకునే శక్తి ఇస్తుంది.” అంటారు.
రాజు గారు ఇచ్చిన పూర్తి ఇంటర్వ్యూ ఇక్కడ చూడండి. యూట్యూబులో సెర్చి పెట్టెలో రాజుగారి పేరు టైపు చేస్తే, ఇంకో మూడు ఇంటర్వూలు కూడా కనిపిస్తాయి.
అంటే ఈ అంతర్లోకం, అంతర్మథనం, ఆత్మపరిశీలన ఇతరకథల్లో కనిపించవని కాదు కానీ రాజుగారికథల్లో ఉన్నంత తీవ్రంగా లేవనే అనుకుంటాను. చాలావరకు ఈనాటి పత్రికలు సంఘర్షణలచిత్రణని బాగానే ప్రోత్సహిస్తున్నాయి. అందుకు సందేహం లేదు. కానీ రాజుగారికథలలో ఆ సంఘర్షణ అంతస్సంఘర్షణగా, ఆ సంఘర్షణమూలంగా పాత్రలో కలిగిన పరివర్తనా ప్రధానంగా సాగుతాయి. బంగాళాఖాతంలో వాయుగుండంలో చిక్కుకున్నంత ఉధృతంగా మనసు అల్లోకల్లోలం అయిపోయినప్పటి ఆత్మఘోష రాజుగారికి వస్తువు. అంచేత కథల్లో దుష్టపాత్రలు ఉన్నా వాటిప్రస్తావన సూచనప్రాయంగా మాత్రమే చిత్రితమవుతుంది.
ప్రధానపాత్ర మనసులో అల్లకల్లోలం ఎలా చిత్రితమవుతుందంటే భాషద్వారాను, పదాలు ఎంచుకోడంలోనూ, వాక్యనిర్మాణంలోనూ కనిపిస్తుంది.
ఒకొకచోట కొన్ని పదాలు మనని గందరగోళపెడతాయి. అక్కడిక్కడ చదవడం ఆపి, పాత్ర, తద్వారా కథకుడు ఏం చెప్తున్నారో ఆలోచించుకోమంటాయి.
ఉదాహరణకి “నిశ్శబ్దం ఒక పదం కాదు” అన్న చిన్నకథలో కథానాయకుడు నిశ్శబ్దాన్ని ఆశ్రయిస్తాడు. ఆయన ఆలోచనలు పాఠకులకి సూచనప్రాయంగా మాత్రమే విదితమవుతాయి. ఈ కథలో “తన” పదం ఉపయోగం విచిత్రంగా ఉంది. ప్రధానపాత్ర రావుగారికి ఆయింట్లో గల స్థానం ఏమిటి అన్నది అయోమయం చేస్తుంది ఈ “తను” వచ్చి.
“మనసులో ఏముందో తెలీదు. … ఎప్పుడూ తనవాళ్ళగొడవే. ఇంట్లో సంగతి చిన్నమెత్తు పట్టదు” (భార్య మాటలు).
“వాళ్ళనాన్నగారి తద్దినమని అన్నారు. ఇంట్లో కుదరదు. మఠంలో పెట్టుకోండని అత్తగారన్నారు” (కోడలి మాటలు).
“తనవాళ్ళని ఎవరికైనా ఉంటుంది” (కొడుకు మాటలు).
ఈ వాక్యాలు చూసినప్పుడు నాకు కలిగిన సందేహం ఆఇంట్లో ఉన్నభార్య, పిల్లలు “తన” వాళ్ళు కారా? కాకపోతే, మరి ఈ “తన”వాళ్ళు ఎవరు? కథలో ఎక్కడా ఆ “తన”వారు కనిపించరు. అంటే పాఠకులఊహకి వదిలిపెట్టిన అంశం ఇది. మరి పాఠకులు దీనిని ఎలా అర్థం చేసుకుంటారు?
వాక్యనిర్మాణంలో రెండు రకాలవాక్యాలు విలక్షణమైనవిగా కనిపిస్తాయి. మొదటిది పొడి పొడి వాక్యాలు, పదబంధాలు సంపూర్ణవాక్యాలకి బదులు వాడడం కనిపిస్తుంది. ఉదాహరణకి,
“తెల్ల కాన్వాస్ షూ, ప్రభాత ఫేరీలాంటి కాలనీ పరిభ్రమణం, మూడు కిలోమీటర్లు.”
“మిశ్రాగారికి భార్యావియోగం, కోడలితో కొన్ని సమస్యలు, నిశ్శబ్ద ఉషఃకల్యాణలావణ్యంలో ఒక ఆక్రందన పరిభాష.”
సాధారణంగా కథల్లో పాత్రని పరిచయం చేసినప్పుడు ఆపాదమస్తకం వర్ణించడం ఒక పద్ధతి. ఒకొకప్పుడు గుణగణాలని చేర్చడం కూడా జరుగుతుంది. మధురాంతకం రాజారాంగారికథల్లో చూస్తాం ఈ పద్ధతి. మల్లాది రామకృష్ణశాస్త్రిగారూ, రాచకొండ విశ్వనాథశాస్త్రిగారూ సూచనప్రాయంగా కొన్ని లక్షణాలు మాత్రం ఉటంకిస్తారు. చలం, కుటుంబరావు, పేరు చెప్పి సంఘటనలు వివరించుకుంటూ కొనసాగిస్తారు. పాఠకులు ఆ పాత్రల మాటలనుబట్టీ ప్రవర్తనలనుబట్టీ పాత్రల రూపురేఖలు ఎవరికి తోచినట్టు వారు ఊహించుకోవచ్చు. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారి విమానం ఎక్కబోతూనూ కథలో అసలు పేర్లు లేవు.
పైన ఉదహరించిన నిశ్శబ్దం ఒక పదం కాదు కథలో మిశ్రా తెల్ల కాన్వాస్ షూ వేసుకున్నారని మాత్రమే మనకి తెలుస్తుంది. ఆ పైన పాఠకుడు ఊహించుకోవాలి ఆపాత్ర రూపురేఖలు. ఒక పాఠకుడికి తనకి తెలిసినవారెవరైనా తెల్ల కాన్వాస్ షూ వేసుకున్నవారుంటే, బహుశా ఆ వ్యక్తిరూపం చూచాయగా పాఠకుడిమనసులోకి రావచ్చు. లేదా కేవలం షూ ఇలాటిది వేసుకుంటే, మనిషి ఇలా ఉంటాడని ఊహించుకోవచ్చు. అలాగే మిగిలిన పదబంధాలు కూడా పాఠకుడి ఆలోచనలని అనేక వైపులకి నడుపుతాయి. కంటికి కనిపించే బాహ్య రూపురేఖలు అనవసరమనేమో.
రెండో రకం వాక్యం – అసమాపకక్రియలతో సుదీర్ఘ వాక్యనిర్మాణం. ఇంగ్లీషులో సుదీర్ఘమైన వాక్యాలు ఉండవని కాదు కానీ, ఈమధ్య “కథలు ఇలా రాయాలి” అనేవారిలో చాలామంది చిన్న చిన్న వాక్యాలు రాయాలనే సూచిస్తున్నారు. సరళాతిసరళమైన పదాలతో, స్పష్టాతిస్పష్టంగా కూర్చిన చిట్టి పొట్టి వాక్యాలకే పెద్ద పీట కథలబడులలో ఈనాడు. నిజానికి అలా రాసి మెప్పించగల రచయితలు లేకపోలేదు మనకి. అటువంటి రచయితల్లో నేనయితే రావిశాస్త్రిగారికే అగ్రాసనం ఇస్తాను. ఆయనకథల్లో ఈనాటి పాఠకులకి తెలియని పదం ఒక్కటి కూడా లేదేమో. అలాగే మధురాంతకం రాజారాంగారు ఒకొక సన్నివేశాన్ని బాగానే పొడిగించినా, పదాలు సాదారణంగా మనకి తెలీనివి ఉండవు. అక్కడక్కడ చిత్తూరు ప్రాంతం పదాలు నాకు తెలీనివి కొన్ని ఉన్నా, చాలావరకూ సాఫీగానే సాగిపోతుంది ఆయనకథ. అలాగే, చలం, కొడవటిగంటి కుటుంబరావు, … ఇంకా చాలామంది అతిసాధారణమైన భాషలో బలమైన భావాలు పొదిగినవారు ఉన్నారు.
రాజుగారికథల్లో కూడా అలాటివి లేకపోలేదు. ఇద్దరు పిల్లలు కథ అలాటిదే. అందులో కూడా నాకు తెలియని పదాలు తగిలేయనుకోండి, అది వేరేకథ. ప్రధానంగా రెండు, మూడు తరాలవెనకటి జీవితాన్ని, ఆనాటి ఆటపాటలు, వంటావార్పులు, అండీలూ, గుండిగెలులాటివి – ఆనాడు ప్రాచుర్యంలో ఉన్నపదాలు -వాడుతున్నప్పుడు అవి విననందుకో, మరిచిపోయినందుకో నన్ను నేనే తూలనాడుకోవాలి గాని రచయితని అనడానికి లేదు! అదలా ఉండగా, రచయిత తీసుకున్న వస్తువు కూడా భాషని నిర్ణయిస్తుంది కదా.
అలివిమాలిన తన్మయత్వంతో పాటనందుకున్నాడు. ఆర్తితో, ఆవేదనతో, సుడులు తిరిగే నిస్సహాయంతో, ఒక కృతయుగ వేదఘోష, ఒక కలియుగ దుఃఖదేవత, ఒక ప్రణువి, ఒక ప్రణవనాదం, ఒక మధురసంగమం, ఒకమాతృశ్రీ ఆత్మీయవేదన, ఒక అన్వేషణ, ఒక నిర్వేదపరిథలో అతిలోక అనుభూతిపర్వం. … (అదృష్టదేవత).
ఇలాటి వాక్యాలలో పాత్ర ఆత్మవేదన ఎంత బలంగా ఉందో ఎత్తి చూపాలి. అందుకు రచయిత ఎంచుకున్న పదజాలం తోడ్పడుతుంది. బంగాళాఖాతంలో వాయుగుండంలో చిక్కుకున్న చిన్నపడవలాటి హృదయాన్ని చిత్రించాలంటే దానికి తగిన భాష వాడకతప్పదు కదా. “కృతయుగ వేదఘోష”, “కలియుగ దుఃఖదేవత” వంటి నుడికారాలకి మరోరకంగా అర్థం వివరించడం కష్టం. పైవాక్యంలో “ప్రణువి” అంటే మాత్రం అర్థం నాకు తెలీలేదు. ఆంధ్రభారతి,ఆప్టే, బ్రౌణ్యనిఘంటువుల్లో కూడా అర్థం దొరకలేదు. కానీ సుమారుగా, సందర్భాన్నిబట్టి ఊహించుకున్నానంతే.
ఈ కిందివాక్యంలో మరోరకం సందర్బం చూస్తాం.
ఈలోకంలో మానవుడి జీవితగమనాన్ని అరాచకం చేయగల శక్తిని ఈ డబ్బుకు ఎవరిచ్చేరో తెలియక, భద్రతకూ అభద్రతకూ మధ్య అదృశ్యరేఖను క్షణంలో నిర్దాక్షిణ్యంగా చెరిపివేయగల రాక్షసప్రవృత్తి దానికి ఏ ఖగోళంనుండి లభిస్తున్నదో గ్రహించలేక, తనకంత తాత్వికాభినివేశం లేక, ఎవరినీ ఎన్నడూ అప్పుకోసం అర్థంచే నేర్పు లేక, ఇప్పటికే మూడు సార్లు తప్పి నెలరోజుల్లో మళ్ళీ రానున్న పరీక్షల భూతభయన్ని ఎదుర్కోలేక, తన స్వగతాలబరువుతో కదలనంటున్న కాలరథాన్ని కదిలించే మనోబలం లేక, పట్టణవీధుల్లో ప్రోది చేసుకున్న వివిధ విషాదాల ప్రతిశ్రుతుల్ని పారద్రోలుకోలేక, చలనం లేని వెలుగు నివ్వని ఒంటరి దీపస్తంభంలాగా దిగులుతో ముసురుకొస్తున్న చీకటిసంధ్యను తిలకిస్తూ, ఎన్నాళ్ళనుండో వెల్లకోసం వేసారుతూ ఊడలమర్రివలె దృగ్గోచరమవుతున్న తనగది గోడలమధ్య – తనకిష్టమయిన పాటను నెమరువేసుకుంటున్నాడు. (అదృష్టదేవత)
పై పేరాలో మురళి జీవితకథంతా తెలుస్తుంది. అందులో ఒకొక వాక్యం – డబ్బుకి ఇంత శక్తి ఎలా వచ్చింది, తనకి తాత్త్వికాభినివేశం లేదు, పరీక్ష 3 సార్లు తప్పేడు, పట్టణవీధుల్లో ప్రోది చేసుకున్న వివిధ విషాదాలు – ఇవన్నీ వేరు వేరుగా చిన్నకథలు కావచ్చు. ఈ పేరా చదువుతుంటే, ప్రతివాక్యం దగ్గరా ఆగి ఆ వాక్యంవెంట ఆలోచించుకుంటూ పోవచ్చు. నిజానికి చివరి 4 నాలుగులైనులకి అర్థం చెప్పుకోడానికి కూడా కొంత సమయం పడుతుంది.
మధురాంతకం రాజారాంగారు “మునిపల్లె రాజుగారి కథలు చదివి కథలు ఎలా రాయాలో నేర్చుకున్నాను” అన్నారు. నేను అనుకోడం ఇలా పాఠకులని “ఆలోచించుకునేలా” చేయడంగురించే ఆయన ఆమాట అన్నారేమో అని. ఎందుకంటే, రాజారాంగారి శైలికీ, రాజుగారి శైలికీ మధ్య చెప్పుకోదగ్గ వ్యత్యాసం ఉంది. అందుకే పాఠకుడిని ఆలోచింపజేయడం మాత్రమే అంటున్నాను. నా ఈ ఊహ తప్పు కావచ్చు.
సత్రయాగం, అస్తిత్వనదం ఆవలితీరాన, వేరేలోకపు స్వగతాలు వంటి కథల్లో సంపూర్ణ జీవితంగురించిన తర్కవిచారణ పుష్కలంగా చూస్తాం. వీటిలో అసమాపకక్రియలతో కూడిన సుదీర్ఘమైన వాక్యాలు పాఠకుడిని నిలబెట్టేస్తాయి. ఇటువంటి సుదీర్ఘసమాసాలతో కూడిన వాక్యాలు సాధారణంగా రచయితని అనేకానేక ఆలోచనలు కందిరీగల్లా చుట్టు ముట్టి మూకఉమ్మడిగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పుడు వస్తాయనుకుంటాను. కనీసం అటువంటి భావాన్ని పాఠకుడిలో కలిగించవచ్చు. సాధారణంగా మన దైనందినజీవితంలో కూడా ఆపకుండా మాటాడేవారిని తరుచూ చూస్తూనే ఉంటాం. రాస్తున్నప్పుడు అటువంటి భావాన్ని కలిగించడం కూడా ఒక ప్రయోజనమే మరి.
సంక్లిష్ట పదబంధాలతో కూడిన సుదీర్ఘవాక్యాలలో ఒకొకప్పుడు ఏది విశేష్యమో, ఏది దేనికి విశేషణమో, ఆ రెంటికీ సంబంధం ఏమిటో కనుక్కోడానికి కూడా సమయం కావాలి. పాఠకుడు మళ్లీ ఆలోచించుకోవలసిన తరుణం ఆసన్నమవుతుంది.
“పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు, వీధిమలుపులో అభిశప్తురాలైన అప్సరకన్యగా కనిపించి, తనభర్త అమానుషక్రౌర్యానికి నిత్యమూ బలి అవుతూ కూడా తనను ఆదరించిన చిట్టెమ్మ, హనుమాన్లగుడిలో పెనవేసుకుని జమిలి నాగసర్పాలలాగా తోచే రావిచెట్టూ వేపచెట్టూ చెప్టామీద తపస్సు చేసుకునే అంజన్న తాత …”
“అమ్మ తన పనుల్లో నిమగ్నమై వైశ్యవనిత ఆదెమ్మ ఇంటి వరండాలో తనను విడిచినప్పుడు, ఆమె చెప్పే కథలు వింటూ, నిస్సంతువుగా ఆమె పడ్డ ఆందోళనల అర్థం తెలియక దిగులుపడుతూ, ఎక్కడో అడవి మధ్య అగస్తేశ్వరుడిగుడిలో భర్తతో పాటు దీక్షా మండలాలు ఐదేళ్ళుగా నిర్వర్తించిన అనుభూతుల్తో చకితుడై, అప్పుడప్పుడు హఠాత్తుగా దర్శనమిచ్చే తాపసులు చూపిన మహిమలు కళ్ళకు కడుతుంటే, తన చిరంతన స్వప్నలోకం నిదురకు ఆహ్వానిస్తుంచే లొంగిపోయిన తన శైశవం ఒక స్వర్గలోకం.” (నిష్క్రమణ ద్వారం)
అలాగే ఒక సన్నివేశంలో నప్పవు అనిపించే వాక్యాలు కూడా అక్కడక్కడ తగులుతాయి.
సీతారాం పాత్రని మహోన్నత వ్యక్తిగా మలిచేప్రయత్నంలో చెప్పినమాటలు –
అందరూ చెప్పుకున్నది – గ్వాలియర్ నగరానికి వందమైళ్ళదూరం అడవుల్లోకి బందిపోట్లు అపహరించుకుపోయిన పెళ్ళిబస్సును వెంటాడి, ఎవరికీ హాని జరగకుండా స్త్రీలని ఆభరణాలతోసహా రక్షించేడని. కొందరు దొంగల్ని వినోబాముందుకు తెచ్చి, అస్త్రసన్యాసం చేయించాడని. అమోఘమైన హిందీ వాక్చాతుర్యం కలవాడు. సంస్కృతం సరేసరి. ఏక సంతగ్రాహి. బహుశః వినోబాజీ ప్రేరణతోనే కావచ్చు తనస్వగ్రామ పరిసరాల్లో అశేషంగా ఉన్న – యానాదులనబడే అనాది ఆదిమవాసులసేవకు అంకితమైనాడు. … (సప్తతి మహోత్సవం)
ఇక్కడ ఆ పాత్ర భాషాపాటవంగురించిన సమాచారం అసందర్భం అనిపిస్తుంది. ఒకవేళ తనవాక్చాతుర్యంతో బందిపోటులని మార్చేడు అని చెప్పుకున్నా, సంస్కృతం, ఏకసంతగ్రాహి వంటివిషయాలకి చిన్నకథలో స్థానం లేదనే కథారచన పాఠాలు చెప్పేవారు చెప్పగలరు.
రాజుగారిని కథలఋషి అనీ కథకులకథకుడు అనీ ఇందుకే అన్నారేమో. అంటే పై ఉదాహరణలన్నీ ఆర్ష ప్రయోగాలనో, వ్యాసఘట్టాలనో కాదు కానీ, జీవితంలో అతిముఖ్యమైన, క్లిష్టతరమైన ప్రశ్నలకి సమాధానాలు వెతుక్కుంటూ, వాటిని వ్యవహారికభాషలోకి దింపడానికి యత్నించినప్పుడు రచయిత ఎలాటి, ఎంతటి మానసికక్షోభకి గురి అవుతాడో, భాషతో ఎంతగా కుస్తీ పట్టవలసివస్తుందో ఈ కథలు చదివితే తెలుస్తుంది. మరోలా చెప్పాలంటే, వర్థమాన రచయితలు “రాజుగారిలా రాద్దాం” అని కాక, రాజుగారు తమభావాలని వెలిబుచ్చడానికి ఎలాటి వేదన అనుభవించేరో, మానసికంగా ఎంత క్షోక్ష అనుభవించేరో అంత బలంగా కథ చెప్పడానికి అని గుర్తించడం అవసరం.
చివరిమాటగా, మాజికల్ రియాలిజంగురించి కూడా ఒకమాట చెప్పకుండా రాజుగారి కథలమీద వ్యాసం సంపూర్ణం కాదు. రాజుగారే “మాజిక్ రియాలిజం అనే కథాప్రక్రియా విశేషం అందరూ అనుకుంటున్నట్టు పాశ్చాత్య సాహితీకారులు సృష్టించినది కాదు”.
“భారతీయ జానపద వాఙ్మయంలోనూ, రాయాయణ, మహాభారత, భాగవత పురాణాల్లోనూ దర్శనమిచ్చేది ఈ అద్భుత మాయావాదరసమే. దీన్ని అనితరసాధ్యంగా నిర్వహించిన ఆద్యుడు వ్యాసమహర్షి … … మాజికల్ రియాలిజం సృష్టికర్త వ్యాసులవారిని స్మరించుకుంటూ, ఆధునిక సంక్లిష్ట జీవనసమస్యలపరిధిలో యిముడుస్తూ ఈ కథా రచన సాగింది” అన్నారు తమ అస్తిత్వనదం ఆవలితీరాన సంకలనానికి నాందీప్రస్తావనగా రాసిన రచయిత వివరణలో.
అయితే మరి ఇవి వినూత్న ప్రయోగాలు అవునా, కాదా? నాకు తెలీదు కానీ ఈనాడు వస్తున్న అనేకానేక కథలకి భిన్నంగా ఉన్నాయని మాత్రమే అనిపిస్తోంది.
(ఆగస్ట్ 20, 2014)
రాఘవేంద్రరావుగారూ, మీస్పందన నాకు ప్రత్యేకగౌరవం. నమేనమః
మెచ్చుకోండిమెచ్చుకోండి
మాలతి గారూ నమస్కారం . మునిపల్లి వారి కధలపై మీ వీక్షణా దృక్కోణం, విశ్లేషణా వైవిధ్యం అక్షరమక్షరం .మరో సారి చదవాల్సిన ఆవశ్యకతను కలిగించాయి. ..శ్రేయోభిలాషి ..నూతక్కి రాఘవేంద్ర రావు.
మెచ్చుకోండిమెచ్చుకోండి
ఫణీన్ద్ర పురాణపణ్డ, దివోస్వప్నాలతో ముఖాముఖి గురించి అస్తిత్వనదం సంకలనంలో శ్రీవిహారి రాసేరు కానీ ఆ కథ ఈ సంకలనంలో లేదు. లేదండీ, ఆయనపుస్తకాలేవీ ఇప్పుడు దొరుకుతున్నట్టు లేదు. మన ప్రచురణకర్తలు పూనుకోవాలి.
మెచ్చుకోండిమెచ్చుకోండి
బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్, సంతోషమండి మీకు నచ్చినందుకు.
మెచ్చుకోండిమెచ్చుకోండి
దివోస్వప్నాలతో ముఖాముఖి… కథ నాకు అత్యంత ప్రీతిపాత్రమైన కథ. రాజుగారివి మరికొన్ని కథలు చదివినా… ఎందుకో ఆ కథ బాగా గుర్తుండిపోయింది. ఈయన సమగ్ర సాహిత్యం అందుబాటులో ఉందేమో తెలుసునాండీ?
మెచ్చుకోండిమెచ్చుకోండి
మాలతి గారు, రాజు గారి కథల పై మీ విశ్లేషణ బాగుంది.
మెచ్చుకోండిమెచ్చుకోండి
నారాయణస్వామి, చదివి చెప్పండి. మీకు నచ్చవచ్చు ఈకథలు.
మెచ్చుకోండిమెచ్చుకోండి
ఇహ లాభంలేదు. మీ విశ్లేషణని ఆస్వాదించేటందుకైనా ఈయన కథలు చదవాల్సిందే. మధ్యమధ్యలో మరికొందరు గొప్ప కథకుల్ని ప్రస్తావిస్తూ బేరీజు వేస్తూ సాగిన మీ విశ్లేషణ బాగుంది
మెచ్చుకోండిమెచ్చుకోండి