144 ఊసుపోక పొట్టి కూడా పొడుగే

(ఎన్నెమ్మకతలు 144)

అని ఎందుకంటున్నానంటే ఎవరైనా ఎవరినైనా అడిగితే నువ్వెంత పొడుగు అని అడుగుతారు కానీ నువ్వెంత పొట్టి అని అడగరు. ఇంతవరకూ నన్నెవరూ అడగలేదు మరి. ఇది చూసేక, అడగడం మొదలుపెడితే నేనేం చెప్పలేను.

నిజానికి పొట్టివాణ్ణిగురించి మాటాడితే, పొట్టివాడు గట్టివాడు, పొట్టివాడికి పుట్టెడు బుద్ధులు అంటారు కదా. నాకు తెలిసి ఒక్క సామెత కూడా లేదు పొడుగువాళ్ళని మెచ్చుకునేవి. కాకపోతే మహాకవులు ఆజానుబాహుడు వంటివి ప్రచారంలోకి తెచ్చేరు కానీ అది అతిశయోక్తే కదా. పైగా అది సెక్సిస్టు కూడాను. ఆడవాళ్ళని ఆజానుబాహువులనడం వినలేదు నేను. అసలు ఎవరికైనా చేతులు జానువులవరకూ ఉండగా చూసేరా, చోద్యం కాకపోతే. ఇంకా కేశసంపద మోకాళ్ళవరకూ ఉండడం చూసేం కానీ పొడుగుచేతులు ఎక్కడా చూడలేదు. అసలు అదైనా వానరులు నరులుగా మారుతున్న సంధిసమయంలో వాడుకలోకి వచ్చిందని నా అనుమానం.

అలాగే చక్కగా ఏపుగా నభోమండలంలోకి చొచ్చుకుపోగల మహా వృక్షాలకి సైతం తల్లివేరు కత్తిరించేసి, గుమ్మటంలా తయారు చేయడం ఒక కళ అయిపోలేదూ? (చాటుగా చెప్తాను – నాకు అదేమంత ఆనందదాయకం కాదు. సృష్టిలో పొడుగు మొక్కలని పొడుగ్గా ఎదగనివ్వడమే న్యాయమని నా నిశ్చితాభిప్రాయం. పొట్టి మొక్కలు ఎలాగా ఉన్నాయి పచ్చగడ్డి మొదలుకొని.)

సృష్టిలో అన్నిటికంటే పొడుగైన తాటిచెట్టు నీడ “తనకీ లేదు, ఒకరికీ లేదు”. నేను చిన్నప్పుడు కంఠతా పట్టిన పద్యం ఒకటి గుర్తస్తోంది. కేవలం నా ధారణమీద ఆధారపడి రాస్తున్నాను కనక తప్పులుండొచ్చు. అంచేత పాఠకులు కవిగారి అభిప్రాయాన్ని మాత్రమే గుర్తించమని కోరుతున్నాను.

ధర ఖల్వాటుండొకండు

సూర్యకరసంతృప్త ప్రధానాంగుడై

తాళవృక్షచ్ఛాయం జేర

తాటిపండు పడి తలపగిలి చచ్చె

బట్టతలాయన బహుశా రోహిణి కార్తెల్లో కావచ్చు, ఏ విజయవాడలోనో కాబోలు మాడు మాడిపోతుంటే భరించలేక ఎదట కనిపించిన తాటిచెట్టువార చేరేడుట నీడకోసం. నెత్తిమీద నాలుగు వెంట్రుకలుంటే కాస్త నయం అని రచయిత అభిప్రాయం అనుకుంటాను. అంచేతే పని గట్టుకుని బట్టతల అని చెప్పేడు. నిజానికి కాకిగూడులాటి కబరీభరం ఉంటే తప్ప, తలవెంట్రుకలు ఏమాత్రం ఆదుకోగలవు కనక తెలుగునాడు ఎండలకీ, తాటిపండు ఉరవడికీ.

ఇంతకీ నేననేది – పొడుగుదనం ఉన్నంతమాత్రాన పనికొస్తుందని దాఖలాలేమీ లేవని. పాపం ఆ బట్టతలాయనకి తోచలేదేమో కానీ – అదేలెండి నీట ములిగిపోతున్నప్పుడు గడ్డిపోచననైనా పట్టుకున్నట్టే – తాటిచెట్టు ఇవ్వగల కిటికీ చువ్వలాటి నీడే చాలనుకుని ఆ చెట్టువార చేరినట్టుంది.

అమెరికాలో పొడుగూ, ఎత్తూ, పెద్దా – అన్నిటిలోనూ “అమితం”కి “పే…ద్ధ” పీట వేస్తారు. రాను రాను రాసికున్న విలువ వాసికి లేకుండా పోతోంది, హుమ్. సుదీర్ఘంగా నిట్టూరుస్తున్నాను. ఇది మాత్రం దీర్ఘమే.

నేను అమెరికాలో ఖచ్చితంగా చాలా పొట్టిదాన్నే కానీ మనదేశంలో ఉన్నప్పుడు కనీసం నాకాలంలో నాకలా అనిపించలేదు. నాకంటే పొట్టివారిని పోకెట్ ఎడిషన్ అని నేను వెక్కిరించిన సందర్భం కనీసం ఒకటి నాకు ఇప్పటికీ గుర్తుంది. (స్నేహితురాలా, క్షమించమని, కొంచెం ఆలస్యంగానైనా ఇప్పుడు మనఃస్పూర్తిగా వేడుకుంటున్నాను.). నిజానికి నేను అట్టే పొడుగు లేకపోవచ్చు కానీ పొట్టి కాదనే నా నమ్మకం. హీహీ. కానీ అందుకు నేను విచారించడం లేదు కూడా.

భూమికి జానెడు కాకపోతే, బారెడు అనుకోండి అలా ఉన్నందువల్ల లాభములేమిటో ముందు చూదాం.

  1. గుంపులో సాధారణంగా చాలామంది మనని ముందుకి తోస్తారు. అంచేత చూడబోయే వింతలకి మరెవరితలో మనకళ్ళముందు నీటిలో బంతుల్లా తేల్తాయన్న బాధ లేదు.
  2. ఒకవేళ అలా జరిగినా, అమ్మా, లేదా బాబూ, మీ కబరీభరము లేక క్రూకట్ మాత్రమే నాకు అని చెప్పుకుంటే, ఎంతటి ధీరులూ అత్యంత రూక్షణంగా వెనుదిరిగినా మనమొహం చూసి పక్కకి తప్పుకుంటారు. నీఖర్మ అనేవారు ఏ కోటికో ఒకరుండొచ్చు కానీ సర్వసాధారణం మాత్రం కాదు.
  3. మంద బొమ్మల్లో సరే సరి, మొదటి వరసలో మధ్యనో మధ్యనించి మూడోదో కుర్చీ మనదే.

కొన్ని హాస్యరస పోషక సన్నివేశాలు.

  • అమెరికాలో కారు కొనడానికి వెళ్తే, అమ్మకాలరాయుడు ముందు నిలబడితే, సాధారణంగా నేను తల బాగా పైకెత్తి, అతని గడ్డంకిందభాగం చూస్తూ మాటాడవలసి వస్తుంది. కాస్త దూరంనించి చూసేవాళ్లకి నేను అతనిపాంటు జేబులో ఉన్నట్టు కనిపిస్తుందన్నమాట. అలాటి సమయాల్లో అతను కారులో తలకీ, కాళ్లకీ ఎంత విశాలంగా ఉందో అదేపనిగా వివరిస్తుంటే నవ్వు రాదూ? నాక్కావలసింది కాళ్ళకి బోలెడు జాగా కాదు, పెడలందితే చాలు, నేను కారులో ఉన్నానని రోడ్డుమీద జనాలు గమనించగలిగితే చాలు అని శతవిధాల వివరించడానికి ప్రయత్నిస్తాను.

నిన్న అమెరికనాటగాడు 43 ఏసెస్ కొట్టి ఓటమి సాధించినసందర్భంలో నాకు తోచింది పొడుగ్గా ఉండడం కూడా ఏమంత ఘనం కాదని. ఇస్నర్ ఆరడుగుల పదంగుళాలనీ, పొడుగ్గా ఉన్నవారికి ఏస్ కొట్టడం తేలిక అనీ నాకు నిన్ననే తెలిసింది.  అసలు టెనిస్‌లో ఏస్ కొట్టినప్పుడు ఒక్కడే ఆడుతున్నట్టుంటుంది. నాకు ఇప్పటికీ గుర్తే పీట్ సాంప్రస్ వరసగా నాలుగు ఏసెస్ కొట్టి గేం గెలిచేడు. అదేం గెలుపు? ఎదటివాడు ఆడడానికి వీల్లేకుండా ఆట ఆటెలా అవుతుంది. నన్నడిగితే, ఛాలెంజిలాగే ఏస్ కూడా ఇన్ని కంటే కొట్టకూడదని నియమం పెట్టాలి.

ఇంతకీ ఈ పొట్టిదనంమీద నా చివరి మాట చెప్పేసి ముగించేస్తాను. ఇక్కడ మనం భౌతికశాస్త్రంలోని ఒక ప్రాథమిక సూత్రం మననం చేసుకోవాలి. ఒక వస్తువు మీదనించి కిందకి పడుతున్నప్పుడు దూరం ఎక్కువయినకొద్దీ వేగం పుంజుకుంటున్నది సూత్రం.

నేను తరుచూ కాకపోయినా పడడం జరుగుతుంది. ముఖ్యంగా మంచులో నడుస్తున్న రోజుల్లో కనీసం వారానికోమారు అదొక ఆనవాయితీ అయిపోయింది కానీ నాకెప్పుడూ కాళ్ళూ చేతులూ విరగలేదు. ఒక్కసారి అయింది కానీ చాలా చిన్న ప్రమాదం అంచేత పెద్ద ప్రమాదం లేదు. ఇక్కడ నావాదన ఏమిటంటే – నేను శరీరభాగాలు భూమికి దూరంగా ఉండవు కనక విరిగిపోడానికి కావలిసిన వేగం పుంజుకునేలోపున ఆగిపోతానని.

అలా కాక పొడుగువారయితే, వారి తలా, భుజాలూ అవన్నీ ఎక్కువ దూరం పయనించాలి కదా భూభాగాన్ని చేరుకునేముందు. ఆలోపున వేగం పుంజుకుని. …

అలాగే గరిమనాభి స్థానం తప్పడానికి కూడా పొడుగువారివిషయంలోనే అవకాశాలు ఎక్కువ. ఆమధ్య ఒక స్నేహితురాలు, “నాపాదాలు చిన్నవి” అంటే నాకు అదే అనిపించింది. గరిమనాభి స్థానం తప్పకుండా నడవడం ఆ అమ్మాయికి ఎంత కష్టమో అనిపించి, అయ్యో అని కూడా అనుకున్నాను. కాస్త ఒళ్ళు గలవాళ్లయితే మరీ అంత ప్రమాదం లేదు.

ఏతా వాతా నా ఘనాపాఠీ అభిప్రాయం ఏమిటంటే ఎలా చూసినా పొట్టివారే గట్టివారని!!

000

(సెప్టెంబరు 1, 2014)

 

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

3 thoughts on “144 ఊసుపోక పొట్టి కూడా పొడుగే”

  1. “సంధిసమయం” – ఇదే నానమ్మకంకూడా.
    “తాటిపండు” – ఇదిమరీ(కవి)చోద్యం! ఎండలు మండే వేసవిలో ముంజెకాయలేకాని రాలే పళ్ళెక్కడుంటాయి!!

    మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s