తెలుగుకథలకి ఇంగ్లీషు అనువాదాలున్నాయా!

శుక్రవారం, సెప్టెంబరు 12, సాక్షి పత్రికలో ప్రచురించిన వార్త.

ఒక సాహిత్యసభలో ఇంగ్లీషుపాఠకులకి తెలిసిన తెలుగు రచయితలు ఎవరు అన్న ప్రశ్న వచ్చిందిట. తెలుగుకథలకి ఇంగ్లీషు అనువాదాలు లేవు అన్న నిర్ణయం కూడా జరిగిపోయినట్టుంది పరోక్షంగా. ఆ పైన యజ్ఞం కథ ఇంగ్లీషులోకి ఎందుకు అనువాదం కాలేదన్న ప్రశ్న వచ్చింది.

http://www.sakshi.com/news/opinion/telugu-author-who-is-known-to-english-readers-166194

దినపత్రికలు నెట్ లో అట్టే కాలం ఉండవు కనక, ఇక్కడ ఆభాగం ఉదహరిస్తున్నాను.

yajnaminenglish

ఆవాక్యం చదవగానే నవ్వాలో ఏడవాలో నాకు అర్థం కాలేదు. అంటే యజ్ఞం కథ అన్నదొకటుందని ఈ సాహితీవేత్తలకీ, అసిస్టెంటు ప్రొఫెసరుకీ తెలిసినందుకు ఆనందం. ఆ తరవాత మౌనం ఎందుకు? అది సాహిత్యసభ కానీ సంతాపసభ కాదు కదా అని తికమక.

వీరు సాహితీవేత్తలూ, యూనివర్సిటీ ఫ్రొఫెసర్లూ అయితే, మరి సాహిత్య ఎకాడమీగురించి వినలేదా? విన్నారనే అనుకుందాం. అందరూ పదే పదే అనే మరో దంపుళ్ళపాటలాటిది – సాహిత్యఎకాడమీ ఎంచుకున్నవారిలో తెలుగురచయితలు చాలా తక్కువ అని. మరి ఆసంగతి తెలిసినవారు ఆ సభలో ఆమాట అడగొచ్చు. కానీ అలా అడిగేముందు, సాహిత్య ఎకాడమీ, హైదరాబాదులో సి.పి. బ్రౌన్ ఎకాడమీలాటి సంస్థలు ఏం ప్రచురించేరో, అందులో తెలుగురచయితలకి గుర్తింపు ఎంత ఉందో సమాచారం సేకరించి, తెలుగు కథలు అనువదించవలసిన అవుసరం ప్రస్తావిస్తే, భాషకి సేవ చేసినట్టయేది. అంతే కాదు, యజ్ఞం కథ అనువాదమయింది అని కూడా తెలిసేది! నాకు తెలిసి రెండు అనువాదాలు వచ్చేయి. అందులో ఒకటి నాఅనువాదమే. రెండు పుస్తకాలూ కేంద్ర సాహిత్యఎకాడమీ ప్రచురించినవే.

Sakshi comment

పోతే, కారణంప్రస్తావన కూడా ఉంది కనక అది కూడా చూదాం. పైవ్యాసంలో చినవీరభద్రుడుగారు, నిఖిలగారు – వీరిద్దరిదృష్టికి రాలేదు ఈ పుస్తకాలు. నాకయితే వారిద్దరూ కూడా యజ్ఞంమాట ఎత్తకుండా ఉంటే బాగుండేదనిపించింది. మొదటి కారణం, అది అనంతమూర్తిగారి సంస్మరణసభ కనక.

రెండోది, తెలుగుకథలకి ఆంగ్లకథల అనువాదాల ప్రస్తావన, సమాచారం పూర్తిగా లేనప్పుడు అనవసరం కనక.

నిజానికి ఈవిషయమే గాదు, ఏవస్తువయినా ఉందని ఋజువు చెయ్యడం కన్నా, “లేదు” అని ఋజువు చెయ్యడం కష్టం కదా.

నాకు ఆసభలో ఆశ్చర్యం కలిగించిన మూడోవిషయం – మొత్తం సభికులంతా “మౌనం” వహించేరా? అని. వాళ్ళలో కూడా ఎవరికీ తెలీదా? అసలు ఈ ఉపన్యాసాలు ఎవరూ వినలేదా?

ఇప్పుడు అసలు కారణానికి వస్తాను. ప్రస్తుతం మనం బాజాభజంత్రీలయుగంలో ఉన్నాం. మనకి మనమేనా వాయించుకోవాలి, ఏ అమెరికా సంఘాలో వాయించాలి. అంచేత, సాహిత్యఎకాడమీ, సి.పి. బ్రౌన్ ఎకాడమీ – వీరు ప్రచురిస్తున్న పుస్తకాలను పాఠకులదృష్టికి తెచ్చే ప్రయత్నం ఇతోధికంగా జరగాలి. సాహిత్య భీష్ములు, తెలుగు బ్రౌనులు, సాహిత్యాభిమానులం అని గుండెలు బాదుకుంటున్నవారందరూ, ఇంతవరకూ వచ్చిన అనువాదాలనిగురించి ఎక్కువమంది పాఠకులకి తెలియజేయడానికి, తేలిగ్గా వారికి అందుబాటులోకి తీసుకురావడానికి వారు ఏం చేస్తున్నారో చెప్పమని అడగండి.

పుస్తకావిష్కరణ సభలు కూడా ఊకదంపుసభలుగానే ఉంటున్నాయి. నాపుస్తకం ఆవిష్కరించినప్పుడు, నేనేం చేస్తున్నానో, నాపుస్తకంలో ఏముందో ఆ కార్యకర్తలకే తెలీదు. ఇహ దాన్నిగురించి మాటాడ్డం ఎక్కడ? విశాఖలో మీటింగంతా ఆ సభ అధ్యక్షుడుగారి పుస్తకం వారి అభిమానులు సంపూర్ణంగా చదివేసేరు. ఇహ ఆ సభకి వచ్చినవారు ఇంటికెళ్ళేక ఆ పుస్తకం చదవనవసరం లేదు.

ఈ సభలు కూడా నిర్వాహకులభజంత్రీలే అని అర్థం అయేక, సభలకి వెళ్ళడం మానుకున్నాను.  ఆమధ్య విశ్వనాథ సత్యనారాయణగారి పేరుమీద జరిపిన సభల్లో చక్కని సాహిత్యవాతావరణం కల్పించేరని విన్నప్పుడు కొంత ఉపశమనంగా అనిపించింది.

ఇంతకీ, తూలిక.నెట్ అనే వెబ్ పత్రిక మొదలు పెట్టి మొన్న జూన్‌కి 13 సంవత్సరాలయింది. అది కేవలం తెలుగు కథలకే పరిమితమైన ఏకైక వెబ్ పత్రిక. ఆ సైటులో బోలెడు తెలుగుకథలకి ఇంగ్లీషు అనువాదాలున్నాయి. తెలుగుకథకులమీద, కథాశిల్పంమీదా వ్యాసాలున్నాయి. 130 దాకా ఉన్నాయి.  తూలిక.నెట్ లో ప్రచురించిన అనువాదాలు ఇప్పటికి 3 సంకలనాలుగా వెలుపడ్డాయి. ప్రచరుణకర్తలు పేరుకలవారు – జైకో, కేంద్ర సాహిత్య ఎకాడమీ, లేఖిని.

నిజానికి, ఈరోజున తూలిక.నెట్ లో తమకథల అనువాదాలు ప్రచురిస్తే చూసీ, చెప్పుకునీ ఆనందించే రచయితలూ, రచయిత్రులూ ఉన్నారు. ఎటొచ్చీ, వారికి కూడా, తమకథ చూసుకోడంవరకే కానీ ఈకృషి అభిలషణీయం, దీన్నిగురించి నలుగురికీ చెబుదాం అన్న ఆలోచన లేదు.

ఉంటే, పైసభలోలాగ, అనువాదాలు ఎక్కడున్నాయి అని ప్రశ్నించి మౌనం వహించవలసిన ఖర్మ పట్టేది కాదు.

నేను ఎ.కె. రామానుజన్ని కాను. దంపుళ్ళపాటలే కానీ క్రియలో ఏమీ చెయ్యని చాలామందికంటే నేను  నయమనే అనుకుంటున్నాను. మీద వానపడితే, కింద చెమ్మ కనిపించదా అని ఒక సామెత ఉంది. మాకు తెలుగంటే ఇష్టం, మేం సేవ చేస్తున్నాం అని సభల్లో హోరు పెట్టడం వేరు. నిజంగా ప్రపంచసాహిత్యంలో తెలుగుకి స్థానం కల్పించడానికి ప్రయత్నించడం వేరు.

యజ్ఞం కథకి నాఅనువాదం లింకు ఇక్కడ

(సెప్టెంబరు 13, 2014)

 

 

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

3 thoughts on “తెలుగుకథలకి ఇంగ్లీషు అనువాదాలున్నాయా!”

  1. పింగుబ్యాకు: వీక్షణం-101 | పుస్తకం

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.