145 ఊసుపోక – మాయరోగాలు

అపార్థం చేసుకోకండి. మాయరోగం అంటే తిట్టులా ఉంటుందనే బహువచనం చేసేను.

మామూలుగా నేను వైద్యదర్శనాలకి సంసిద్ధురాలిని కాను. వైద్యో నారాణో హరిః అన్న సుజనవాక్కు విన్నాను కానీ నాకు అర్థం తెలీదు. వైద్యుడు నారాయణుడివంటివాడే అనా? వాడే వీడు అనా? రెండోదే నిజం అనుకుని, నారాయణుడిదర్శనానికి వెడలిపోయినప్పుడే వైద్యనిదర్శనం కూడా అయిపోతుందన్న నిర్ణయానికొచ్చేను తరుచూ వైద్యులని సంప్రదించవలెనన్న అభిప్రాయానికి భిన్నంగా. అంటే ఇట్నుంచి అటు కాక అట్నుంచి ఇటు అన్నమాట. కానీ కదాచితుగా (జనాంతికంగా ప్రాణాంతకం అన్నఅర్థంలో) అయినప్పుడు ఇలలోనే ఆ దర్శనం కానిచ్చుకుంటాను. అలాటి ప్రాణాంతకాలు సాధారణంగా నాకు పుష్కరానికోమారు తగులుతాయి. గోదావరి పుష్కరాలా కృష్ణాపుష్కరాలా అంటే సరిగా చెప్పలేను కానీ సాధారణ మానవఅనుభవాల్లో కాలో చెయ్యో విరగ్గొట్టుకోడంలాటివి జరిగినప్పుడు ఈ భూమ్మీదే వైద్య ఉరఫ్ నారాయణదర్శనం చేసుకోడం జరుగుతుంది. అంతే గానీ మందులవ్యాపారులు చెప్పినట్టు, ముందు ముందు ఏజబ్బో రాకపోతుందా అనుకుంటూ ఇప్పట్నించే ఆ మందులపరంపర భోజనం చే సి లేనిజబ్బులు అక్షరాలా “కొని” తెచ్చుకోను. (ఈ అలవాటు గలవారికి నా క్షమాపణలు). మీరూ వినే ఉంటారు ఆంగ్లజాతీయం – సకాలంలో ఒక కుట్టు తరవాత తొమ్మిది కుట్లపెట్టు అని. అలా అని ఒక కుట్టు కూడా అవసరంలేని చోట తొమ్మిది కుట్లు వేసుకోడం మాత్రం ఏం సబబు అని నా ప్రతివాదన.

ఇంతకీ పైన ఉటంకించిన రెండు పుష్కరాల వ్యవధికి కొంచెం అటుగా కాక ఇటుగానే వచ్చేసింది. సరే, దేవుడా, ఇంత చేసేవా అనుకుని, ఊళ్లోనే ఉన్న మా చిట్టితల్లిని పిలిచి, బెరుకుబెరుకుగా “ఓ మాటు డాట్రారుని చూస్తే బావుంటుందేమో” అన్నాను. అసలు మాఅమ్మాయితో సంభాషణే ఒక కత. ఉదాహరణకి ఇలా సాగుతాయి –

“నీస్నేహితులని లంచికి పిలుస్తానన్నావు కదా. సరే పిలువు.”

“సరే”

పదిరోజులయేక, నేను “నీస్నేహితులని పిలువు అన్నాను కదా. ఆ ఆహ్వానానికి కాలదోషం పట్టిపోయింది.”

“సరే.”

దాంతో సంభాషణ కూడా అయిపోతుంది. అయిపోయింది.

ఆఖరికి నేనే అడిగేను, “ఎందుకు అని అడగవేం?”

“నీఇష్టం కదా. సరే, అడగమంటున్నావు, కనక ఎందుకు, చెప్పు.”

అప్పుడు చెప్పేను, మీ ఊళ్ళో డాక్టరునోమారు చూస్తే బాగుంటుందేమోనని నాకు అనిపిస్తున్నట్టు అనుమానంగా ఉందేమో అని నేను అనుకుంటున్నాను అని.

అప్పుడు మాపిల్లకి కొంచెం చురుకు పుట్టింది. “ఏమైందేమైయింద”ని కొంచెం ఆతృత చూపుతూ అడిగింది.

“మోకాలు నొప్పెడుతోంది,” అన్నాను.

“ఎప్పట్నించీ, నాకు ఇంతవరకూ ఎందుకు చెప్పలేదు, ఎందుకు …”

… ఇలా ఓ అయిదు నిముషాలు సాగింది.

డాక్టరుని పిలుస్తానని చెప్పి, ఆ తరవాత మరోగంటకి ఓ చిన్న సంచి పుచ్చుకుని వచ్చేసింది.

ఏమిటంటే, మామూలుగా ఏ నొప్పికైనా సర్వరోగనివారిణిలాటి లేహ్యాలు తనదగ్గర ఉన్నవేవో తీసుకొచ్చేసింది, డాక్టరుని చూసేలోపున వాడమని.

ఆతరవాత వెళ్ళిపోయి,మరో రెండుగంటల తరవాత పిలిచి, “ఇదుగో, డాక్టరుని చూడ్డానికి, అదేలే నిన్ను డాక్టరు చూడడానికి నాలుగురోజులు పట్టేట్టుంది, అంచేత ఎమర్జన్సీ రూంకెళ్దాం. నేను మరో పావుగంటలో వస్తున్నాను నిన్ను తీసుకెళ్ళడానికి.”

“అయ్యయ్యో ఇది ఎమర్జన్సీ కాదు, నాకాలింకా ఉండవలసిన స్థానంలోనే ఉంది. ఇంకా లేచి తిరుగుతున్నాను. కాలూ చెయ్యీ కూడా ఆడుతున్నాయి,” అని ఆపిల్లని నమ్మించడానికి నేను పడ్డ అవస్థలు పరమాత్మడికెరుక, నాకు విజయం మాత్రం చేకూరలేదు.

మరో అరగంటలో అమ్మాయీ, అల్లుడూ కూడా వచ్చేసేరు నన్ను అత్యవసరవైద్యసన్నిధికి చేర్చడానికి.

ఇంతకీ ఈ కథ మొదలు పెట్టడానికి కారణం – నేను ఈదేశంలో నాలుగు దశాబ్దాలు ఉన్నా, ఎమర్జన్సీ గదిమీద నాకు సదభిప్రాయం ఏర్పడలేదు. పేరుకు అత్యవసరమైనా, అది ఎవరు ముందొచ్చేరు అని కాక ఎవరిపరిస్థితి అత్యంతవిచారకరం అన్నపద్ధతిమీద వైద్యులు రోగులని చూస్తారు. ఇందులో తప్పేమీ లేదు కానీ, నాపరిస్థితి, అదే నా మొహం చూస్తే అత్యవసరపరిస్థితిగా ఎవరూ పరిగణించరు ఖర్మ. అసలు నువ్వు అత్యవసరగదికి రావడమేమిటి అని అనుకుంటారని కూడా నాకు అనుమానం.

అంచేత నేను …

తీరా వెళ్ళినతరవాత నాకు ఎంత ముచ్చటేసిందో చెప్పలేను. నిజానికి మళ్ళీ ఏదో ఒకవంక పెట్టుకుని అక్కడికే వెళ్ళాలని ఏదో ఓ మూల మనసులో పీకుతోంది కూడాను!

ఇంత మంచి వైద్యసేవలు ఎక్కడా చూడలేదు. నాకెంత ఆశ్చర్యం వేసిందో . మామూలుగా ఎమర్జన్సీ అంటే ఎమర్జన్సీ అనే అర్థం అనుకున్నానిన్నాళ్లూను. అంటే హడావుడిగా ఆనొప్పో దెబ్బో తగ్గడానికి తాత్కాలికంగా చేసే సేవ అని. ఓ కట్టు కట్టో, రెండు కుట్లు వేసో, తెల్లారేక ఇంకా తగ్గకపోతే మీ సొంత డాక్టరుని పిలు అని చెప్పే డాక్టరువరులని.

ఇక్కడ అలా కాదు – ఎంతో చక్కగా గుండెబలం, కండబలం అన్నీ పరీక్షించేసి, రక్తపరీక్షలు చేసేసి, ముగ్గురో నలుగురో నర్సులూ, డాక్టర్లూ అరగంటకొకరు చొప్పున వచ్చేసి, నాకొచ్చిన రోగం ఏమిటో మళ్ళీ మళ్ళీ అడిగి చెప్పించేసుకుని … మూడు గంటలసేపు కాలవ్యవధిలో నాకు ఆస్పత్రులంటే ఉన్న అభిప్రాయం మార్చేసేరు.

డాక్టర్లు రక్తం పీల్చేస్తారని మీకూ తెలుసు కదా. అలా నాలుగు గొట్టాలు దింపుతున్న మనిషిని చూసి, “ఏంటో ఇంతకాలమైనా నారక్తం ఏరకమో నాకే తెలీదు. అంత రక్తం తీస్తున్నావు, చెప్పగలవా?” అని అడిగేను.

ప్రశ్న వేసినపాపానికి, తత్సంబంధమైన విషయంమీద ఓ చిన్న పాఠం విని తెలుసుకున్నాను. తాను చేస్తున్న రక్తపరీక్ష వేరు. రక్తం ఏ గ్రూపుకి చెందిందో తెలుసుకోవాలంటే డాక్టరు చెప్పాలి. నీకు రక్తం ఎక్కించవలసిన అవుసరమైతే తప్ప చెప్పరు. నువ్వడిగితే చెప్పొచ్చు. అలా అవుసరం అని చెప్పే డాక్టరులు చాలామంది ఉన్నారు. అలాగే మందులు కూడా ఏది కావాలంటే అది రాసిచ్చేసేవారున్నారు. ఆమందులు మీకు సరఫరా చేసే కంపెనీలున్నాయి. అదంతా ఓ పెద్ద మోసకారి ముఠా. …

ఓరినాయనో అనుకున్నాను. అంటే ఇలాటివి ఉన్నాయని నాకు తెలీదని కాదు. ఇలా ఆస్పత్రులలో చెప్పేసేటంత నీతిమంతులు ఉన్నారే అని!

ఆస్పత్రిలో పరీక్షబల్లమీద పడుకుని, నర్సుకీ నర్సుకీ మధ్య, డాక్టరుకీ డాక్టరుకీ మధ్య (నారీ నారీ నడుమ మురారీ) మీనమేషాలు లెఖ్ఖపెట్టుకుంటూనే, మాఅమ్మాయి ఐఫోనువంక దిగులుగా చూడ్డం గమనించేను. వరండాలో ఉన్న మాఅల్లుడేం చేస్తున్నాడో అని … పాపం. ఆగదిలోకి సిగ్నలులు రావడం లేదు. ఇంత అభివృద్ధి సాధించిన దేశంలోనూ, అంతరిక్షంలో అందిరికీ వాసం ఏర్పాటు చేయబూనిన దేశంలోనూ, ఊరు నడిమధ్యన ఐఫోనుకి సైగలంద లేదంటే నవ్వు రాదూ?

నాకు నవ్వొచ్చింది.

“ఎందుకు నవ్వుతున్నావు?”

అది వివరించదగ్గసమయం కాదు కనక కొంచెం విచారం వెలిబుచ్చి, ఇంతకీ… అంటూ ఏదో అడిగేను. వెంటనే ఇద్దరిమధ్య చాలా సంభాషణ సాగింది. ఏం మాటాడుకున్నామో చెప్పడం ఇక్కడ అనుచితమూ, అసందర్భమూ కానీ, … ఇది రెండో కారణం నాకు ఆ అత్యవసరగది మళ్ళీ దర్శించుకోవాలనిపించడానికి అని మాత్రం చెప్పగలను!

చెప్పేనో లేదో మా అల్లుడు తెల్లనివాడు, నీలికన్నులవాడు, చేయెత్తు విగ్రహమ్మువాడు, వంకాయలు, బెండకాయలంచు బాసా యాసా నేర్వ మొదలిడినవాడు.” అంచేత, ఆచారాలూ, అలవాట్లూ ఏమిటో అని నాతాపత్రయం.

మొత్తంమీద పరీక్షలన్నీ అయిపోయి, గుండెలు గుడిగంటల్లా కొట్టుకుంటున్నాయనీ, మోకాలులో నీరు చేరలేదనీ, స్నాయులు తమతమ స్థానాల్లో పకడ్బందీగా ఉన్నాయనీ, అంతగా నొప్పి అయితే ఏ మిరపకాయ లేహ్యంతోనో మర్దించమనీ సలహా చెప్పి పంపేసేరు.

అంతసేపు కదలకుండా కూర్చోడంచేత, మోకాలు పట్టేసింది. కుంటుకుంటూ బయటికి వస్తుంటే, “నువ్వు గజ్జెలగుర్రంలా ఉన్నావన్నాడు కదా డాక్టరు. కుంటుతావెందుకూ,” అంది మాపిల్ల.

“తల్లీ, ఆ డాక్టరుకి తెలీదు కానీ కాళ్ళు కదల్చకపోతే, కీళ్ళు పట్టేసి, నొప్పులు వస్తాయి,” అని మరో బ్రహ్మరహస్యం తెలియజేసేను.

దారిలో capsaicin అనబడు మిరపకాయ లేహ్యం కొనుక్కొచ్చేం.

ఆరాత్రి కాలికి ఆ లేహ్యం రాస్తున్నప్పుడు కానీ నాకు తెలీలేదు – కోపం వచ్చినప్పుడు అంటాం ఒంటినిండా కారం రాచుకున్నట్టుందని – అదే అనుభవం ఈ మందుతో కూడా.

మర్నాడు వేణ్ణీళ్ళతో స్నానం చేస్తున్నప్పుడు నిజంగా కళ్ళనీళ్ళొచ్చేయి!!

ఈమాట చెప్తే, ఒకరిద్దరు స్నేహితులు చెప్పేరు – వాళ్ల చిన్నప్పుడు, ఎండుమిరపకాయలు కాలికి గుడ్డతో చుట్టి ఉంచితే, నొప్పి పోయేదని. నాకది ముందే తెలిస్తే, పది డాలర్లు ఆదా అయేది కదా అని ఉసూరుమనుకున్నాను.

ఓ నొప్పి పోవడానికి మరో నొప్పి తెచ్చుకుంటాం.

ఎప్పుడో చిన్నప్పుడు ఓ చిన్నకథ చదివేను. ఓ పెద్దమనిషి జోళ్ళదుకాణానికి వెళ్ళి, ఒక సైజు చిన్నది తీసుకున్నాడుట. ఆ వ్యాపారి, “అయ్యా, అది తమకి చిన్నది. నడుస్తుంటే కాలు నొ‌స్తాది,” అన్నాడు.

“ఫరవాలేదు నాయనా, ఇంట్లో బాధలన్నీ మరిచిపోతాను, ఈకాలు నొప్పితో.”

అన్నట్టు మాయరోగాలు అని ఎందుకన్నానో చెప్పలేదు కదూ. నాకేమో నొప్పిలాగే ఉంది, డాక్టరేమో నీకేమీ లేదంటాడు. మరి మాయ కాదూ?

ఇంతే సంగతులు.

 

(అక్టోబరు 31, 2014)

 

 

 

 

 

 

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

One thought on “145 ఊసుపోక – మాయరోగాలు”

  1. మీ అమ్మాయి అల్లుడూ వచ్చి మిమ్మలిని అత్యవసర చికిత్సకు తీసుకొని
    వెళ్ళడం–ఆ కన్సర్న్ మనస్సుకు చాలా సంతోషాన్ని కలిగించింది,
    అల్లుడి చిరు పరిచయానికి ధన్యవాదాలు మరియూ శుభాకాంక్షలు

    మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.