వేరు

రెండు చేతులా సాగినంతమేరకి బార చాపి ధరణితల్లిని ఆప్యాయంగా ఆలింగనము చేసుకుంటున్నట్టు ఆ వేళ్ళు! ఆత్మానందంకోసం అంగలారుస్తున్నాయో, మరింత దూరం సాగాలని పరితపిస్తున్నాయో కానీ చూపరులకు మాత్రం ఆ వేరులతీరు కన్నులపండువుగా ఉంది.  ఏ కావ్యకన్యక శిరోభాగముననో చెలువొందు కురుసంపదవలె గంగమ్మజాతరనాటి జనసందోహంవలె ఉక్కిరిబిక్కిరిగా గర్భకుహరాలలోకి విస్తరించిన వేళ్ళు ఇటువైపునా, ఎక్కు పెట్టిన బాణాల్లా వినువీధిఎద లోలోపలికి చొచ్చుకుపోతున్న కొమ్మా రెమ్మా, వాటినంటి చివుళ్ళూ, ఆ చివుళ్ళకి సుకుమారమైన నిగారింపు చేర్చి మిలమిల మెరుస్తున్న వెలుగురేఖలూ అటువైపునా!

DSC02112

వేళ్ళు మిత్తిలోనికి చొచ్చుకుపోయి అణిగి మణిగిపోతున్నాయి సవినయంగా ఊర్ధ్వముఖంగా ఎగసి పరుగులు పెడుతున్న కొమ్మలనీ రెమ్మలనీ నిలబెడుతూన్న సంతృప్తితో. బడుగు పుల్లల్లా కనిపిస్తున్న ఆవేళ్లబలం ఎంత ఘనం. వాటిలో ఎంత వినయం. ఏహంగూ రంగూ పొంగూ లేని ఆ వేళ్ళే లేకపోతే ఆ మహావృక్షానికి మనుగడ ఉండునా? మహాపురుషుడినీడలో అక్షిగోచరం కాకనే మెలిగే కోట్లాది అనామకులూ, అంగుష్ఠమాత్రులలా ఆవేళ్ళు!

వేళ్ళని కాపాడడానికి కాబోలు కాంక్రీటు కాలిబాట పొందిగ్గా వేసినట్టున్నారు. బహుశా ఏ ఉక్కుచట్రమో వేసి, దానిమీద కంకరపోసి ఆపైన కాలిబాట కట్టి ఉండాలి. ఎంతటి ఆలోచన!

ఒక్కొక్క తరుమూలంలో ఒక్కొక్కతీరు ఈ వేరుసంపద! యాజులుగారు ఒక్కొక్క చెట్టుదగ్గరే ఆగి ఆ వింతసోయగాలు పరికించి చూస్తూ, ఇంటివారు ఏమైనా అనుకోగలరేమోనని సందేహిస్తూ అటువేపు ఓ చూపు విసిరి ముందుకు సాగేరు.

ఒత్తుగా పెరిగిన చెల్లాయిజుత్తు ఒక్కజడ వేయడానికి లొంగదని రెండు పాయలు తీసి, ఒక్కొక్క పాయ మూడు పాయలు తీసి అమ్మ జడ వేయడానికి కుస్తీ పడుతుంటే, చెల్లి కదులుతుంటే, అమ్మ అలా మెడ తిప్పకు జడ వదులయిపోతుంది అంటూ కసుర్లు … ఈ వేళ్ళు చక్కగా అల్లుకుని రెండు కాదు ఎనిమిది జడల్లా మూలంచుట్టూ పరుచుకుని అష్టదిక్కులా అలవోకగా సాగిపోతున్నాయి. అట్టే పరికించి చూస్తే, కొన్ని వేళ్ళు పిల్లికి దొరకకుండా పరుగులు పెడుతున్న ఎలుకపిల్లవలె కనిపించి ఉల్లాసం కలిగించేయి ఆయనకి.

మరో నాలుగడుగులేస్తే, సంక్రాంతిపొద్దు వాకిట్లో పెద్దక్కా, చిన్నవదినా వేసిన రథంలా గళ్ళుగా గళ్ళుగా, గుళ్ళు గుళ్లుగా మల్లెపొదలా సుళ్ళు తిరుగుతూ మరిన్ని వేళ్లు.

యాజులుగారు అట్టే చూస్తూ నిలబడిపోయేరు. చెట్టుమొదలులోనుండి వెలికి వచ్చిన వేరొకటి జానెడెత్తు గాలిలోకి లేచి, అడుగున్నరదూరం ఉత్తరదిశగా సాగి మంటిలోకి ఒరిగిపోయింది ఒంగి ఒంగి సలాములు చేస్తున్న గులాములా. వొంగిన వేరుతో చిన్న వంతెన కట్టింది.

పైకొమ్మమీంచి బోదెమీదుగా కిందకి జారి హడావుడిగా దిగిపోయిన ఒక ఉడతమ్మ ఆ వేరువంతెనమీదుగా పయనించి అటు చివర నేలమీదకి జారి గిరుక్కున వెనుదిరిగి మళ్ళీ వంతెన కింద దూరి వెనకగా ఉన్నపొదలవేపుకి పారిపోయి ఓ చిన్న సర్కసు ప్రదర్శన ఇచ్చేసింది ఉచితంగా అయాచితంగా యాజులుగారికి.

DSC02108

హమ్మదొంగా అన్నట్టు ఆయనపెదిమలమీద చిరునగవొకటి చిన్నతరగలా కదిలి హృదిలో ప్రతిఫలించింది.

అలవాటయినంతవరకూ నడిచి వెనుదిరగబోతూ కుడివేపు చూస్తే అక్కడ మరో పెద్ద తరువు ప్రత్యక్షమయింది. “అరె ఇన్నాళ్ళూ చూడలేదే” అనుకుంటూ అటు తిరిగేరాయన.

కొడుకులిద్దరూ తనచేతిమీదుగా పెరిగి ప్రయోజకులయేరు, గాలిలో తేలిపోతున్న తరుశాఖలలాగ సగర్వంగా, ఇంకా విరగబాటు అనొచ్చేమో కూడా, తమబతుకులు హుందాగా సాగించుకుంటున్నారు!

కంటబడ్డ తరువుదాపుకి చేరుకునేలోపున మరో తాళవృక్షం కనిపించడంతో ఆగి తలెత్తి చూసేరు. దాదాపు రెండునెలలుగా ఇదే ప్రాంతంలో ఎడమనించి కుడికీ, కుడినించి ఎడమకీ, ఎదురుగానూ, వెనకగానూ – అష్టదిక్కులా తిరుగుతున్నా ఎప్పటికప్పుడు పరగడుపే. ఏ రోజుకారోజు ఏదో ఒక వినూత్న సోయగం. అవి నిన్న లేవా అంటే ఉండే ఉంటాయి. తనదృష్టికి ఆనలేదంతే. ఇవాళే బండి దిగేయి అనుకోడానికి లేదు. అది స్థావరము కానీ జంగమము కాదు కదా.

ధ్వజస్తంభంలా వినువీధిలోకి సాగిపోయిన తాళవృక్షంచివర్న నాలుగాకులు వింజామరల్లా గాలిలో ఊగుతున్నాయి. మట్టిలోంచి లేచిన మొదలు ఓ అడుగున్నర మేర ఏ కొండమంగలో పనిగట్టుకు కత్తిరేసినట్టు, మిగిలిన మొండివేళ్ళతాలుకు ఛాయలు గడ్డం గీసిన మూడోరోజు కనిపించే మొరటు వెంట్రుకలలా నిక్క పొడుచుకుని రవంత వికారంగానే ఉన్నాయి. మొదలులో వేళ్ళు ఉత్తరించేసినందున కాబోలు ఆచివరన మూడే ఆకులు మిగిలి, అవి కూడా కొనఊపిరితో కొట్టుకుంటున్నాయేమో. ముళ్ళపూడివారి ఫ్రెంచికట్టు మీసకట్టుమీద చతురభాషణలా – “మూతిమీద ఈగ వాలినట్టు మూడే వెంట్రుకలు” … ఈ తాళవృక్షపు పత్రసంతానం కూడా మూడే!

000

కోడలొచ్చేక పెద్దబాబుకి తీరిక లేకుండా పోయింది. తనకు తానుగా రావడం లేదు సరి కదా తానే ఓమారు “కనిపించి పో” అంటే, “ఇప్పుడు కాదు తరవాత, ఇవాళ కాదు రేపు, ఈనెల కాదు, వచ్చే నెల” … అంతే సంగతులు. “నీకు రావడానికి తీరదు, నేనే వస్తానం”టే కూడా దిక్కులేదు. పని, పని, పని, పని, పని. ఆఫీసు పనే కాక, విహారయాత్రలకీ, ఊళ్ళు తిరగడానికీ సరిపోతుంది అతగాడి సమయం. అలాటిదే తనతో ఓ పూట గడపడం కూడా అని తోచదు. “ఆఫీసుపనులతో విసిగిపోయి కాస్త విశ్రాంతికోసం వెళ్తున్నా” లేకపోతే, “ఉద్యోగం నిలబెట్టుకోడానికి ఇలాటిసేవలు అవసరం, నెత్తిమీద బాబుల్ని ఖుషీ చేస్తుండాలి” అంటూ మరో కుంటిసాకు.

చిన్నబాబుకి పెళ్ళి కాలేదు కదా పెళ్ళాంతో తిరిగేసమయం మిగలదా అంటే అదేం లేదు. అతగాడి వ్యాపకాలు అతగాడికీ ఉన్నాయి. “ఒక్కసారి, నువ్వూ నేనూ ఎక్కడికైనా వెళ్దాం, నేనే ఖర్చులు పెట్టుకుంటాను,” అన్నా కూడా, “మీవయసేమిటి, మీసరదాలేమిటి, మీరు మాలా తిరగ్గల్రా?” అన్నాడు. పదేళ్ళకిందట, “మాదగ్గరకొచ్చేయండి” అన్నప్పుడు కూడా తామిద్దరివయసులో తేడా అంతే అని ఎందుకు తోచలేదో మరి. యాజులుగారు సుదీర్ఘంగా నిట్టూర్చేరు. మనసులో మరోపక్క వాళ్ళవాదనలో వాస్తవం ఆయనకి కనిపించకపోలేదు. వాళ్ళఅభిరుచులకీ తన అభిరుచులకీ సహస్రాంతం తేడా! అది ఆయనకి సంతృప్తికరంగా లేదంతే, తనకి సాంత్వన కలిగించడంలేదు.

యాజులుగారు తలెత్తి తాటిచెట్టువంక చూడబోయేరు. అదక్కడ లేదు. హా. తాటి చెట్టు అక్కడే ఉంది కానీ తానే ముందుకి సాగి మలుపు తిరిగి మరోచెట్టు ఎదుట ఉన్నారు, ఆ స్పృహ లేకపోయిందంతే.

కట్టెదుట మహావృక్షం ఆకాశానికి గొడుగు పట్టినట్టు, మూడంకణాలఇంటిమీద బెంగుళూరుపెంకుల కప్పులా ఒత్తుగా చీమలు దూరని చిట్టడివిలా పరుచుకున్నాయి పచ్చని ఆకులు పసుపురంగు ఆకులు దానిమ్మగింజరంగుకి మారుతూ. చెట్టుబోదె పదడుగులు కనిపిస్తోంది కానీ ఆ మీదట ఆకులే తప్ప శాఖలు కనిపించడంలేదు. బోదె అడుగున్నర విస్తృతితో దిట్టంగా కోటబురుజులా ఉంది. బెరడు రాలిపోయిందో ఇంటివారు పని గట్టుకు గీకేసేరో కానీ నున్నగా మెరిసిపోతోంది. పెద్దవాడి బారసాలతరవాత సున్నాలెరుగనిగోడల్లా వెలవెలబోతున్నా నయనానందంగానే ఉంది ఆయనకి.

నిన్నా మొన్నటివరకూ మాటామంతీ లేకుండానే ఎంతసేపైనా పక్కన కూర్చోగల పిల్లలిద్దరికి ఇప్పుడు పన్నెత్తి పలకరించడానికి, ఫోను తీసి ఏం చేస్తున్నావని అడగడానికి కూడా తీరుబడి లేదు. తీరడం లేదు.

తాతమూకుడు తరతరాలా అంటారు. “రేపు నీపిల్లలు ఇలాగే మాటాడితే?” అని అడగగలడా తను? లేడు. అడగలేడు. అడిగితే అది “వేరు” అంటాడు మలిసంతానం. తొలిసంతానం మరో ఆకు ఎక్కువ చదివేడు. “మీరే అలా అంటే నేనేం చెప్పను?” అంటాడు సమరసభవం ఒలకబోస్తూ దిగాలు పడిపోతున్న మోముతో. సూక్ష్మంగా చెప్పాలంటే ఆ భాషకి కూడా అదే తాత్పర్యం – వేరు, వేరు, వేరు …

ఆ “వేరు”సంస్కృతిలోనే వీరిద్దరికీ జీవనము. తనలా ఆలోచించలేరు. ఆలోచించవచ్చేమో అన్న స్పృహ కూడా లేదు. సమసమాజానికి సర్వులూ పాటుపడాలి అంటూ ఉపన్యాసాలు ఇచ్చేవారూ, సమాజసేవపేరున దేశాన్ని దుక్కీ దుక్కీ దున్నేసేవారూ కూడా ఇంట్లో ఉన్న మనిషి కూడా ఆ సమాజంలోని లక్షలమనుషుల్లో ఒక మనిషి అని గుర్తించరు.

ఈవేళ్లు అలా ఆలోచిస్తాయా? కాలగతిలో ఈ వేళ్ళకి తనలా ఆలోచించే సమయం ఆసన్నమవుతుందా? వీటికి చలనం లేదు. ఉందేమో. అడయారులో ఉన్నమర్రిచెట్టు కాశీనించి అడయారుకి తరలివచ్చేసిందని చెప్పుకుంటారు. తాను వెడలదలచుకున్న దిశగా కొత్త ఊడలు వేసుకుంటూ వెనక ఊడలు మాడ్చేసుకుంటూ సాగిపోయిందిట. కట్టు కథే కావచ్చు కానీ మర్రి ఊడలు వేస్తుంది కనక అసాధ్యం కాదేమో. మరి తనపిల్లలు కూడా అలాటి ఊడలే పరీక్షగా చూచుకుంటే. ఎక్కడ బయల్దేరి ఎక్కడ తేలేరూ! వాళ్ళతోపాటు తనూను, ఆశ్చర్యమ్!

ఎదుట మిన్నాగులాటి వేరొకటి మూడుగజాలు పశ్చిమదిశగా సాగి నేలలోకి ముడుచుకుపోయింది. కింద వేరు విస్తరించినంత మేరా మీద కొమ్మలు విస్తరిస్తాయంటారు. యాజులుగారు ఒక్కక్షణం ఆగి చూస్తున్నారు.

యింటి యజమాని కనిపించేడు వాకిట్లో ముళ్ళకర్ర పుచ్చుకు రాలినఆకులూ, కొమ్మలూ పోగు పెడుతూ. ఆ తరవాతెప్పుడో చెట్టుసర్విసువారు వచ్చి మిగతా కొమ్మలు నరుక్కుపోతారుట.

నెలరోజులక్రితం “ఆ కొమ్మలు వాయుమండలంలో మాస్థలం ఆక్రమించేయి” అని పొరుగువారు ఆ చెట్టుతాలూకు కొమ్మలు కొన్ని కొట్టేసేరుట. తమచెట్టుసోయగానికి తరుగు అని వీరు కోర్టులో దావా వేసేరుట. కోర్టులో కేసు కోర్టులోనే ఉంది. నాలుగు రోజులక్రితం ఉరుములూ, మెరుపులతో హోరుమంటూ పెద్దగాలివాన ముంచుకొచ్చింది. ఆ మహావృక్షం మొదలంటా పెళ్ళగించుకుని కూలిపోయింది. పిట్టపోరూ పిట్టపోరూ పిల్లి తీర్చేసింది.

కూకటివేళ్లతో సహా పెళ్ళగించుకుని కూలిపోయిన మహావృక్షాన్ని చూస్తూ నిలబడిపోయేరు యాజులుగారు.

మనసంతా వికలమయిపోయింది. మొన్నటివరకూ హుందాగా రాజెవరికొడుకన్నంత ధీమాగా అనిర్వచనీయమయిన ఔన్నత్యంతో ఘనవైభవంతో నిటారుగా నిలిచిన మహావృక్షం గాలికీ నీటికీ లొంగిపోయి కూలిపోయింది!

కాళ్ళీడ్చుకుంటూ ఇల్లు చేరేసరికి, చిన్నబాబు కారు దిగుతూ ఇంటిముందు కనిపించేడు.

“ఏంటి పిలవకుండా వచ్చేసేవు?”

“నేను మిమ్మలనా, మీరు నన్నా?” అన్నాడు చిన్నబాబు చిన్నగా నవ్వి.

“నేను నిన్నుపిలిచేదేమిటి. నువ్వెప్పుడొస్తే కాదన్నాను కనక. నువ్వే వస్తున్నానని చెప్పి కదా వస్తావు.”

“ఇటువేపు వేరేపనుండి వచ్చేన్లెండి.”

యాజులుగారు తలుపు తీసి, గ్లాసులోకి మంచినీళ్ళు ఒంపుకుంటూ, “నీళ్ళు?” అన్నారు కొడుకువంక చూడకుండానే.

“వద్దు,” అన్నాడు.

ఇద్దరిమనసులూ భారంగానే ఉన్నాయి.

“నాన్నగారూ!” అన్నాడు సందేహిస్తూ.

ఆయన తలెత్తి చూసేరు. ఇంతవరకూ గమనించలేదు. బాబు ఏదో వార్త తెచ్చినట్టున్నాడు.

“ఏంటి?”

చిన్నబాబు రెండు క్షణాలు ఆగి, “సుమిత్రక్క ఫోను చేసింది” అన్నాడు ఒకొక్క మాట సాగదీస్తూ.

“సుమిత్రమ్మా? ఎందుకు? గంగాధరం బాగానే ఉన్నాడా?” అన్నారాయన కంగారు పడుతూ.

గంగాధరం తన బాల్యమిత్రుడు. సుమిత్ర ఆయనకూతురు. ఈదేశంలోనే ఉంది కానీ మాటా పలుకూ లేవు. ఎప్పుడో ఆయన ఈదేశం రాగానే ఒక్కసారి పిలిచేడంతే. ఆరోజు ఆ అమ్మాయి కంఠస్వరం విన్నతరవాత మళ్ళీ పిలవబుద్ధి పుట్టలేదు.

చిన్నబాబు అడ్డంగా తలూపేడు.

యాజులుగారు చేతిలో గ్లాసు అక్కడే పెట్టేసి, సోఫాలో కూలబడ్డారు. “ఏమయింది. ఏం చెప్పిది సుమిత్రమ్మ?”

“బాబాయి పోయేర్ట.”

యాజులుగారు అయోమయంగా చూసేరు కుమారునివైపు. ఆయనకళ్ళలో ఇందాకా చూసిన నేల కూలిన మహావృక్షం మెదిలింది. తాను పరాయిదేశం ప్రయాణానికి ఆయత్తమవుతూంటే, పూడుకుపోయిన గొంతుతో “మళ్ళీ చూస్తానో లేదో” అంటున్న గంగాధరం మెదిలేడు.

“ఛ. అదేం మాట. ఈరోజుల్లో అమెరికా అంటే అనకాపల్లిలాగే. ఏడాది తిరక్కముందే రానూ వస్తాలే కనీసం నిన్ను చూడ్డానికైనా,” అన్న తనమాట బోలుగా వినిపిస్తోంది.

000

“ఒక్కరూ ఏం అవస్థలు పడతారు. ఇద్దరం అక్కడే ఉన్నాం. మాతో వచ్చేయండి నాన్నగారూ.”

“ఉన్నఊరూ కన్నతల్లీ అన్నారు. ఈగాలీ, ఈనీరూ నాకు అలవాటయిపోయేయి. మరోచోట ఉండలేనురా.”

“అదేంటి నాన్నగారూ. గాలీ, నీరూ అన్నిచోట్లా అవే. నాకూ, అన్నయ్యకీ అలవాటయినట్టే మీకూ అలవాటయిపోతుంది.”

“నాయనా, నీకు అలవాటవడం వేరు. నాకు అలవాటవడం వేరూ.”

“ఆ, అదేం లేదు. మనం అనుకోడంలో ఉందని మీరే చెప్పేరు.”

“అదెప్పుడూ?”

“నేను ఎనిమిదోక్లాసు చదువుతున్నప్పుడు, మీకు అస్తమానం బదిలీలే. నేను కొత్తఊరికి రానంటే, మీరన్నారు,” చిన్నబాబు నెమ్మదిగానే అయినా సూటిగా ఆరోజులు జ్ఞాపకం చేసేడు.

యాజులుగారు అవాక్కయి చూస్తూ ఊరుకున్నారు కొంతసేపు. తరవాత నెమ్మదిగా అన్నారు, “అది వేరు.”

చిన్నబాబు మళ్ళీ నవ్వేడు. “ఎలా?”

“ఎన్ని ఊళ్లు తిరిగినా, గుడుగుడుకుంచంలా ఆ కుదుట్లోనే మనగడ్డమీదే తిరిగేం. ఇక్కడ నాజీవితం ఈ పరిసరాలతోనూ ఈ మనుషులతోనూ ముడిపడి ఉంది.”

“అమ్మ ఉన్నన్నాళ్ళు ఒకరికొకరు తోడుగా ఉన్నారని ఊరుకున్నాం అన్నయ్యా నేనూ కూడా. ఇప్పుడు ఒక్కరూ ఎలా ఉంటారు? ఏమైనా అయితే ఎలా తెలుస్తుంది?”

“అదే తెలుస్తుంది.”

“తెలిసినా, ఇక్కడికి రావడానికే రెండ్రోజులు పడుతుంది. పైగా మీరేమో ఏదో చిన్న బాధ అని ఊరుకోవచ్చు. అదే ప్రాణాంతకం కావచ్చు.”

యాజులుగారు అర్థమనస్కంగానే అయినా ఒప్పుకోక తప్పలేదు. ఇక్కడికొచ్చేక ఇతర “వేరు”లు అనేకం అర్థమయీ అవనట్టున్నాయి.

000

యాజులుగారికి మసకమసకగా పొగమంచులో క్షితిజరేఖమీద తిరుగాడే నీడల్లా … ఆనీడలు మాటాడుతున్న స్పృహ.

“అన్నయ్యని పిలు. కాల్ 911. ఎగ ఊపిరి”

అయ్యో .. నోరూ ముక్కూ మూసేస్తూ ప్లాస్టిక్ దొప్ప, గుండెలమీద ఎవరిదో చెయ్యి.

క్షితిజరేఖమీద కీకారణ్యం. కాళ్ళు భూమిలోకి చొచ్చుకుపోతున్నాయి. కదిల్చబోతే కదల్డం లేదు. అయ్యో అదేమిటి చేతులు కాండాలలా బలపడి ఇరువైపులకీ సాగిపోతున్నాయి. చిన్న చిన్న రెమ్మలేసి, చివుళ్ళొచ్చి, ఆకులుగా స్థిరపడుతున్నాయి. కాలివేళ్ళు చెట్టువేళ్ళలా నేలలోకి దిగబడిపోతున్నాయి. అడుగు తీసి అడుగు పెట్టలేకున్నాడు. మీద శాఖోపశాఖలుగా పెరిగిపోతోంది చెట్టు.

అంతలోనే మళ్ళీ ఏదో స్పృహ.

“నాన్నగారూ, నాన్నగారూ” చిన్నబాబు పిలుస్తున్నాడు ఆతురతతో. ఆపక్కనే అతని ప్రాణమిత్రులు ముగ్గురు నిలబడి వాళ్ళకీ, తనకీ ధైర్యం చెప్తున్నారు.

యాజులుగారు ఓపికి తెచ్చుకుని కనురెప్పలు ఎత్తేరు గుళ్ళు మోస్తునంత శ్రమతో. మంచంచుట్టూ శ్రేయోభిలాషులు ధైర్యవచనాలు వల్లె వేస్తున్నారు, ఎనిమిదోక్లాసులో పాఠం ఒప్పచెప్పినట్టే.

“ఫరవాలేదు. త్వరలోనే కోలుకుంటారు.”

“ఈ డాక్టరు సుప్రసిద్ధుడు.”

“మీరు ఉక్కుపిండం అని మీఅబ్బాయి చెప్పేడు.”

“ఔనౌనౌనౌను. మీఆరోగ్యానికి తకరారు లేదని డాక్టరు చెప్పేడు.”

“మీకు పట్టుమని గట్టిగా జలుబయినా చెయ్యలేదుట కదా.”

“ఏ పరీక్షలు చేసేడు డాక్టరు?”

“… చెయ్యలేదా?”

“ఏంటది?”

“ఓ, అదేం లేదు. ఫరవాలేదు. … ఉంటే ఈపరీక్ష కూడా చేస్తారు. ఫరవాలేదు. మీనాన్నగారికి అవసరంలేదు.”

యాజులుగారికళ్ళు మళ్ళీ మూతలు పడుతున్నాయి. కనురెప్పలు ఎత్తిపట్టబోతే ఒల్లనంటున్నాయి. చీమలు దూరని చిట్టడివి, కాకులు దూరని కారడవి. కట్టెదుట పెనుభూతంలా మహావృక్షం నభోమండలంలోనికి దృష్టి సారించి, నల్దిక్కులా ఎగబాకుతూ శాఖోపశాఖలు.

“నాన్నగారూ! నాన్నగారూ!” పెద్దబాబు కూడా వచ్చినట్టుంది. ఇద్దరూ పిలుస్తున్నారు అనంతదూరంలో.

అకస్మాత్తుగా సుదీర్ఘమైన నిట్టూర్పు వెలువడింది. వేళ్ళు కదలవు. కానీ అవే జీవనాధారం. కొమ్మలూ, రెమ్మలూ ఊర్థ్వముఖంగా ఎదుగుతూ పోతున్నాయి విశాలవిశ్వంలోకి.

హమ్మయ్య, కాలివేళ్ళు సుతారంగా కదిల్తున్నాయి. పాదాలు భూగర్భంలోకి చొచ్చుకుపోతున్న అనుభూతి. హృదయకుహరంలో మందానిలమొకటి వీస్తూ శాంతివచనాలు పలికింది. వేళ్ళు నీళ్ళందుకుంటాయి. ఆకులు వెలుగు నొల్లుకుంటాయి. వేళ్ళు సుస్థిరంగా ఒకేచోట ఉన్నా అవే జీవనాధారం విశాలవిశ్వంలోకి విస్తరించిపోతున్న కొమ్మలకీ రెమ్మలకీ.

(అయిపోయింది)

వేరుశోభ ఇక్కడ – https://picasaweb.google.com/malathini/Roots

 (నవంబరు 15, 2014)

 

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

7 thoughts on “వేరు”

 1. తల్లిదండ్రులు వేర్లు లేని వృక్షాల్లా – నిజమేనండి. వేళ్ళేప్పుడూ పుట్టినగడ్డమీదే ఉంటాయి. మీ స్పందనకి ధన్యవాదాలు

  మెచ్చుకోండి

 2. చెట్టుకు వేరు వేరుకు నేల నేలకు సూర్యుడు ప్రకృతిలో ఒకదానికి ఒకటి ఆలంబన….పిల్లలకి పసివయసులో తల్లి తండ్రులు ముదిమిలో పెద్దలకి పిల్లలు ఆసరా…బ్రతుకు దెరువు విదేశమయి పోయినవేళ తల్లితండ్రులు వేర్లు లేనివృక్షల్లా అవుతున్నారు..

  మెచ్చుకోండి

 3. కథంతా చాలా హాయిగా తనకై తనే వేళ్ళూకుపోయింది.
  చదువుతున్నాకొద్దీ ఇంకొద్దిగా చదవాలనిపించేలా.
  అయితే,అనిల్ గారన్నట్లు ,కథ ముందే తెలిసిపోతున్నా, ఇలా ముగించడం … మీ వంతే!
  ఆ వేళ్ళ అల్లిక ఉపరితలాన్నేనా అనిపించింది. లోలోనికి చొచ్చుకు పోలేదనీ అనిపించింది. !

  “ఒక్కొక్క తరుమూలంలో ఒక్కొక్కతీరు ఈ వేరుసంపద! యాజులుగారు ఒక్కొక్క చెట్టుదగ్గరే ఆగి ఆ వింతసోయగాలు పరికించి చూస్తూ, ఇంటివారు ఏమైనా అనుకోగలరేమోనని సందేహిస్తూ అటువేపు ఓ చూపు విసిరి ముందుకు సాగేరు.

  ఒత్తుగా పెరిగిన చెల్లాయిజుత్తు ఒక్కజడ వేయడానికి లొంగదని రెండు పాయలు తీసి, ఒక్కొక్క పాయ మూడు పాయలు తీసి అమ్మ జడ వేయడానికి కుస్తీ పడుతుంటే, చెల్లి కదులుతుంటే, అమ్మ అలా మెడ తిప్పకు జడ వదులయిపోతుంది అంటూ కసుర్లు … ఈ వేళ్ళు చక్కగా అల్లుకుని రెండు కాదు ఎనిమిది జడల్లా మూలంచుట్టూ పరుచుకుని అష్టదిక్కులా అలవోకగా సాగిపోతున్నాయి. అట్టే పరికించి చూస్తే, కొన్ని వేళ్ళు పిల్లికి దొరకకుండా పరుగులు పెడుతున్న ఎలుకపిల్లవలె కనిపించి ఉల్లాసం కలిగించేయి ఆయనకి.

  మరో నాలుగడుగులేస్తే, సంక్రాంతిపొద్దు వాకిట్లో పెద్దక్కా, చిన్నవదినా వేసిన రథంలా గళ్ళుగా గళ్ళుగా, గుళ్ళు గుళ్లుగా మల్లెపొదలా సుళ్ళు తిరుగుతూ మరిన్ని వేళ్లు.”

  మెచ్చుకోండి

 4. అనిల్ అట్లూరి గారూ, చెప్పొచ్చండి. అవును. ఇదివృత్తంలో ప్రధానంగా వేళ్ళతో – మానవనైజంతో కలపకుండా – రాయాలనే నాకు ఉండింది కానీ తోచలేదు. అంచేత పాతకథతో కలపవలసి వచ్చింది. ప్రధానంగా వేళ్ళని చూసినప్పుడు నాకు కలిగిన ఆలోచనలే రాయాలని మొదలుపెట్టేను.
  మళ్ళీ చివరివాక్యంలో ముగించేను. వంశవృక్షం అన్న పదానికి ఈ అర్థం అన్వయించుకోవచ్చేమో. వెనకటితరాలవాళ్ళు వేళ్ళలా అగోచరంగా ఉంటూనే వృక్షం నిలవడానిికి కారణం అవుతారు. మరో కోణం వేళ్ళు సంస్కృతికి ప్రతీక అని కూడా.

  మెచ్చుకోండి

 5. జీవితాన్ని చెట్టు వేళ్లకి అన్వయించి చూపించండం బాగుంది.
  యాజులు గారికి ఆ మహావృక్షానికి పోల్చిచెప్పండం ఇంకా బాగుంది.
  ఇక్కడ చెప్పొచ్చే లేదో తెలియదు అయినా చెప్పేస్తున్నాను.
  ఈ వాక్యం రానున్నదానిని కొంత సూచించింది.
  పిల్లలు రమ్మనడం..పెద్దవాళ్ళు వెళ్లననడం మాములైపోయింది.
  ఫోటోలు బాగున్నాయి.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s