146 ఊసుపోక – నాకల నాకు నిజం

పక్కమీంచి లేచీ లేవకముందే రాత్రి వచ్చిన కల గుర్తొచ్చి గుండె దడదడ కొ్ట్టుకుంది.  హడలిపోతూ పడగ్గదిలో చుట్టూ కలయచూసి, గబగబ హాల్లోకీ వంటింట్లోకీ కూడా వెళ్ళి చూసుకున్నాను. ఎక్కడి సామానక్కడే ఉంది. నా లాపుటాపూ, టీవీ, కొత్తగా కాపురానికొచ్చినప్పుడు తెచ్చుకున్న బూందీ చట్రాలు – నా అపూర్వ వస్తుసంచయం అంతా ఎక్కడిదక్కడే ఉంది. హమ్మయ్య. ఏం పోలేదన్నమాట. రాత్రి దొంగలు పడి నాసమస్త ‌స్థిర చరాస్తులూ దోచుకుపోలేదన్నమాట.

మొహం కడుక్కుని, కాఫీ కప్పు పుచ్చుకుని తీరిగ్గా రాత్రి వచ్చిన కల మళ్ళీ మరోమారు మననం చేసుకున్నాను.

పొరిగింటి పిల్లలు ఇద్దరు అమెరికనులే గాజుబొమ్మల్లా ఉన్నారు. ఎదురుగా నిలబడి తమని తాము పరిచయం చేసుకున్నారు నన్ను పేరు పెట్టి పిలిచి. వీళ్ళకి నాపేరెలా తెలిసిందా అని ఆశ్చర్యపోతున్నాను.

“మేం వాషింగ్టన్నించి వచ్చేం” అంది అమ్మాయి.

“ఆహా” అన్నాను.

“మాఅమ్మకి చెప్పకేం మేం నీకు చెప్పేం అని,” అంది మళ్ళీ ఆ అమ్మాయే. ఎనిమిదో తొమ్మిదో ఉంటుంది వయసు.

పక్కన అబ్బాయికి మరో రెండేళ్ళుండొచ్చు. వాడు మాటాడలేదు కానీ అవునన్నట్టు తలూపేడు.

“అలాగే, నేనెవరికీ చెప్పను” అని హామీ ఇచ్చేను ఇద్దరికీ. నాకలలో నిజానికి ఇది తొలిపాదం. అంటే వాస్తవంలో కూడా నాకు నావయసువారితో కంటే నాకంటె చిన్నవారితోనే స్నేహాలెక్కువ. పిల్లలెందుకో “ఈవిడతో ప్రమాదం లేద”నుకుంటారేమో.

కలలో రెండోపాదం – ఇంటిముందు పెద్ద ట్రక్కుంది. మాయింట్లో సామానంతా దోచేసుకుంటున్నారు. “అయ్యయ్యో, నాసొమ్ము దోచేస్తున్నారు. ఆపండి, ఆపండి,” అంటున్నాను. చుట్టూ జనం పోగయేరు కానీ ఎవరూ ఆ దొంగలని ఆపే ప్రయత్నం చెయ్యడం లేదు. గబగబ ఇంట్లోకొచ్చేను. రెండు గదులూ బావురుమంటూ, ఇల్లు అద్దెకివ్వబడును అని బోర్డు కట్టినట్టు ఉంది. (జనాంతికముగా – టీవీలో హత్యలూ, దొంగతనాలు కార్యక్రమాలు చూడడం తగ్గించాలని హెచ్చరిక కావచ్చు.)

ఇందులో వాస్తవం – నిజానికి ఇది కొంచెం విపులంగా చెప్పాలి. గత రెండేళ్ళూ జలసంపద చూసి ఆనందిస్తూ వచ్చేను. మీరు నాబ్లాగులో ఏరూ, నీరూ, తదితరజలచరాలకి సంబంధించిన బొమ్మలు చాలానే చూసేరు కదా. ఇప్పుడు, అంటే గత 4,5 నెలలుగా మాయింటి పరిసరాల్లో తిరుగుతూ ఇక్కడ తరు సంపద చూసి ముచ్చట పడిపోతున్నాను. ముఖ్యంగా వేళ్లు. దాదాపు ప్రతి చెట్టుమొదలులోనూ బయటికి పొడుచుకొచ్చి కనువిందు చేస్తున్నంతగా వేళ్ళు నేనెక్కడా చూడలేదు. అవి చూస్తుంటే నాకు వాటిమీద కథ రాయాలని కోరిక పుట్టింది. ఆ కథ తాలూకు ఆలోచనలు అనేకం నన్ను చాలా అయోమయస్థితిలో పడేసేయి. అవన్నమాట మాయింట్లో సామాను.

నిన్న కథ పూర్తయింది. ఇల్లులాటి బుర్ర ఖాళీ అయిపోయింది. :p. దాంతో హాయిగా నిద్ర పోయేను తొమ్మిదిగంటలసేపూ.

మరి దొంగలెవరంటే మీరే, పాఠకులు. దొంగలు కాదులెండి దొరలే. మాయిల్లే మీయిల్లనుకోండి అంటారు చూడండి, అలాగే నా ఆలోచనలు మీవి. మీసొమ్ము మీకు అప్పగించేసేనన్నమాట.

హీ, హీ. ఈ సామ్యం బాగులేదనుకుంటా. అయినా కథకి కాళ్ళేమిటి, ముంతకి చెవులేమిటి. ఒకటి మాత్రం నిజం – చాలారోజులతరవాత ఈరోజు మనశ్శాంతి!

కథ ఇంకొంచెంసేపట్లో కథ మీకిచ్చేస్తాను. చదువుకున్నా, పారేసినా మీయిష్టం.

 

(నవంబరు 15, 2014)

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

3 thoughts on “146 ఊసుపోక – నాకల నాకు నిజం”

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు, తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరింపబడును.

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s