వెనకటి నేను! – ప్రతి ధ్వనులుసంకలనంమీద సమీక్ష

వెనకటి నేను!

1969nm

ఈ శీర్షికలో నేను గతంలో రాసిన కొన్ని – ప్రచురించనవీ, ప్రచురించినా పదిమంది కళ్ళా పడనివి – మళ్ళీ ఇక్కడ పెట్టాలనుకుంటున్నాను. వాటిమీద ఈనాటి నావ్యాఖ్యలు చేరుస్తాను అవసరమనుకున్నచోట.

వెనకటి టపాలో ప్రస్తావించిన “కథానిలయం నాకు చేసినమేలు” కోవలోకే వస్తుంది ఇది. వారి సైటు చూసినప్పుడు నా ఉత్సాహం ఇనుమడించింది. అక్కడ నాపేరుతో నేను ప్రచురించలేదనుకున్నవీ, మరిచిపోయినవీ కూడా ఉన్నాయి. దాంతో నావెనకటి రాతలన్నీతవ్వి తిరిగి చూసుకుంటుని మళ్లీ ఇక్కడ ప్రచురించాలని మొదలు పెట్టేను. నారాతలెవరు చూస్తారులే అనుకునే వర్తమాన రచయితలకీ వర్థమాన రచయితలకీ కూడా పనికిరావచ్చు. మనం రాసినవి ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోడంలో నష్టం లేదు.

ఈ ధారావాహినిలో మొదటిది నేను రాసిన ఒక సమీక్ష.


గ్రంథావని (ఆంధ్రజ్యోతి 24-3-1973)

ప్రతిధ్వనులు కథాసంకలనం

ప్రచురణ, విశాఖ సాహితి.

విశాఖ సాహితివారు ప్రచురించిన మూడవ సంకలనం ఇది. ఇందులో ఉన్న 14 కథలలో ఎక్కువ భాగం వృద్ధిలోకి వస్తున్న యువరచయితలవే.

ఈనాటి యువకులలో ఈ లోకం ఎందుకిలా ఉందన్న ఆవేదన, ఏదో చెయ్యాలన్న తపన, ఏం చెయ్యగలం అన్న నిర్వేదం, ఎలాగైనా పరిస్థితులు మెరుగైతే బాగుణ్ణన్న ఆశ – ఈ కథలలో ప్రస్ఫుటమవుతాయి.

వరద వచ్చి స్వంత ఊరు కొట్టుకుపోతే ఆ అవకాశం వినియోగించుకుని, స్వంత భవనం లేపుకున్న మంత్రిగారు (ఉభయకుశలోపరి), ఆపీసులో ఫైల్స్ మాయం చేయడంకోసం మాలక్ష్మిలాటి గావుని బందిలదొడ్డికి మళ్ళించిన ఇంజినీరూ (పశు బుద్ధి), డ్రైవరూ మనిషేనని గుర్తించని (గుర్తించిన?) ఆఫీసరూ (కారడవిలో గంధపుమాను), కష్టమర్లని సొంతమనుషుల్లా ఆదరించి ఆ ఖరీదు బేరరుని కట్టమన్న హోటలు మేనేజరూ (రెండో వేపు) – ఏరోజయినా ఎక్కడయినా తారసపడేవాళ్ళు. వీళ్ళు మారరా? ఎమో!

“ఎందుకు?”, “ప్రతిఫలం” కథలనడం కన్నా స్కెచ్‌లనడం బాగుంటుంది. “ప్రతిఫలం” లో దైనందిన జీవితంలో అబ్బాయిలు చేసే చిన్న చిన్న సహాయాలకి అందని అభినందనలు అమ్మాయిలయితే అందుతాయన్న ఎత్తిపొడుపు ఉంది.

“ఎందుకు?” లో తొమ్మిదేళ్ళకుర్రాడు లవ్ ట్రయాంగిల్ లో లజ్జుగుజ్జులు ముదిరేక వైతరణినదిలాటి సమాజంమీద కథ రాయాలని ఆవేదన చెందడంలో, “ఉదయం” కథలో గాలిలో దీపం పెట్టి చెతులు కట్టుకు కూచుని దేవుడా నీదే మహిమ అనే రోజులు పోయేయన్న జ్ఞానోదయం కలిగిన రాజులో ఈ రచయితలకి రేపటి ప్రపంచంమీద ఉన్న నమ్మకం తెల్లమవుతోంది.

“బ్లడ్ బాత్”లో పిరికివాడె వెనకదారుల్లో స్వకార్యసాధన కలవాటు పడిన కథానాయకుడు పైలిస్ ఫైరింగ్‌లో గాయపడిన బాలుడి రక్తస్పర్శతో పునరుజ్జీవితుడై పోలీసుల కెదురుగా గుండె ఒడ్డి నిలచిన కథనం బాగుంది. “ఇంకా తెల్లవారలేదు” కథలో తరాలుగా మట్టిముద్దల్లా పడి ఉన్న జాతిలో తప్పక తెల్లవారుతుందన్న ఆశ కనిపిస్తాయి.

“ఇదే (దేం) న్యాయం”లో మనిషికో న్యాయాన్ని గర్హిస్తారు రచయిత. “నల్లగీతలు”, “నిట్టూర్పు” కథల్లో కోర్టు పక్షుల కథలు చూస్తాం. శైలి చాలా బాగుంది.

మొత్తమ్మీద మంచి కథలున్నాయి. మంచి వర్థమాన రచయితలు కాగల సూచనలున్న కథకులు ఉన్నారు. ప్రతికథకీ ముందు రచయితగురించిన పరిచయ వాక్యాలు ఉన్నాయి. ఆ రచయితలుః అంగర వెంకట కృష్ణారావు, యస్వి రమణమూర్తి & యమ్వీ రమణమూర్తి, ఘండికోట బ్రహ్మాజీరావు, “చిన్న”, మల్లాప్రగడ రామారావు, పావులూరి వెంకటేశ్వరరావు, మహేంద్ర & అంగర వెంకట శివరావు, గణపతిరాజు అచ్యుతరామరాజు, కీర్తిప్రియ, తాతినేని వెంకట నరసింహారావు, యన్. కాశీ విశ్వనాథం, విజయా రఘురామ్, “మానస”.

సామాజిక పరిశీలన, వైవిధ్యం ప్రతిధ్వనిస్తున్న ఈ సంకలనంలో పేజీలు 65-72 వరకూ పేజీలు తిరగేసి కుట్టబడ్డాయి.

 

పాలిష్ భయ్యా మరియు ఇతర నాటికలు.

నాటకకర్తః జి. పూర్ణచంద్రరావు.

ఆనందబాల ప్రచురణలు, గుంటూరు.

ఇందులో, “పాలిష్ భయ్యా, దొంగచదువు, స్ట్రైక్” అనే మూడు నాటికలు ఉన్నాయి. ముగ్గురు పిల్లలు ప్రదర్శించుకోడానికి అనువుగా సులభమైన భాషలో, తక్కువ రంగాలంకరణతో విజ్ఞాన వినోదాల మేళవింపుతో చక్కగా ఉన్నాయి.

తెలుగులో బాలసాహిత్యం అన్నది నల్లపూస. ప్రతిరోజూ ప్రతివారం ఓ పుస్తకమో ఓ పత్రికో వెలువడుతున్నా భావి పౌరులని గుర్తుంచుకుని వారికై రచనలు చేసే రచయితలూ ప్రచురణకర్తలూ బహు తక్కువగా ఉన్నారు. సాహిత్య ఎకాడమీవారు ఏడాదికోమారు ఎనౌన్స్ చేసే బహుమతులు ఎవరి కన్నీరు తుడుస్తున్నాయో కానీ ఏమాత్రం ప్రయోజనకారిగా కనిపించడంలేదు. రచయిత పూర్ణచంద్రరావుగారిని ప్రత్యేకంగా అభినందించాలి ఈవిషయంలో.

పాలిష్ భయ్యాలో నీతివంతుడయిన ఒక పాలిష్ కుర్రాడి కథ. “దొంగచదువు” లో తలకి మించిన కోర్సులూ, తప్పుదారి పట్టిస్తున్న పెద్దలూ పిల్లల్లో నైతికపతనానికి కారణమవుతున్నారన్న అభిభాషణ ఉంది. ఇందులో ఇంగ్లీషు పదాలు తగ్గిస్తే బాగుంటుంది.

అర్థరహితంగా అనుదినం జరుగుతున్న స్ట్రైక్ ల వల్ల ఎంత నష్టమో ప్రతిపాదిస్తారు రచయిత “స్ట్రైక్” లో.

మొదటి నాటిక 8-12 వయసు పిల్లలు, రెండు, మూడు నాటికలు 12-15 వయసు పిల్లలు ప్రదర్శించుకోవచ్చు. ఈ పుస్తకం స్కూళ్ళూ, బాలగ్రంథాలయాలు కొనదగ్గది.

 

  • వకుళమాల

నా ఇప్పటి ఆలోచనలు –

మొదట నాకు ఫక్కున నవ్వొచ్చిన మాట పాలిష్ భయ్యామీద నావ్యాఖ్యానం – “ఇంగ్లీషు పదాలు తగ్గిస్తే బాగుంటుంది” అన్నది. నారాతల్లో కూడా అక్కడక్కడ ఇంగ్లీషు పదాలు దొర్లేయి కనక.

సమీక్షించే తీరులో అట్టే మార్పు ఉన్నట్టు కనిపించడం లేదు.

“డ్రైవరూ మనిషే” అన్న కథమీద గుర్తించిన అని నేను రాసేనా, అచ్చు తప్పా అన్న ఆలోచన కలుగుతోంది. గుర్తించిన అన్నది శీర్షిక చూస్తే సరి కాదేమో అనిపిస్తోంది.

కథల జాబితా, రచయితల జాబితా వేరు వేరుగా కాక, కథ పక్కనే రచయిత పేరు ఇచ్చిఉంటే బాగుండేది అని కూడా అనిపిస్తోంది.

అంగర వెంకట కృష్ణారావుగారూ, ఘండికోట బ్రహ్మాజీరావుగారూ అప్పటికే లబ్ధప్రతిష్ఠులు. కీర్తిప్రియ రాస్తున్నారని నాకు తెలుసు, వ్యక్తిగతంగా పరిచయం ఉంది కనక. మిగతావారు రచనా వ్యాసంగం కొనసాగిస్తున్నారో లేదో తెలుసుకోవాలని ఉంది. కథానిలయంలో కొన్ని పేర్లు వెతికి చూసేను కానీ కనిపించలేదు.

 

(నవంబరు 24, 2014)

 

 

 

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

2 thoughts on “వెనకటి నేను! – ప్రతి ధ్వనులుసంకలనంమీద సమీక్ష”

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.