వెనకటి నేను 2 – బాలతార (కథ)

(42 ఏళ్ళ వెనక!)
“ఏరోజు పేపరు చూసినా చచ్చిపోయినవాళ్ళూ, తప్పిపోయినవాళ్ళూ, ఏక్సిడంట్లూ, ఎడ్వర్టైజుమెంట్లూను,” రామకృష్ణ విసుగ్గా పేపరు కింద పడేశాడు.
అసలు పేపరు మధ్యాహ్నంపూట రావడంవల్లనే నాకు సగం చచ్చిపోయింది పేపరు చూడాలన్న కోరిక ఆనందపురం వచ్చేక. కాకపోతే ఏ రోజుకారోజు ఇంకొక్క ఇరవై రోజులు, ఇంకొక్క పందొమ్మిది రోజులు – ఇంతకీ ఇక్కడికి వచ్చింది వరసకి మేనత్తకొడుకైనా చిననాటి చెలికాడు రామకృష్ణతో సరదాగా శలవులు గడపడానికి కదా – అనుకుని నన్ను నేనే బుజ్జగించుకుంటూ వస్తున్నాను. దానికి తగినట్టు రోజూ ఆ పేపరు రాగానే మొట్టమొదట తీసుకోవడమూ , “ఇది విన్నావా జానకి చెబుతోంది – ఎల్లప్పుడూ తనకి మేలయినదే కావాలిట – అదే వీవా – చూడు, చూడు నీకు జుట్టు నెరుస్తోందా – హెలెన్ కర్టిస్ వారి తయారీ. నరసింహులు చెట్టియార్ హృద్రోగంతో మరణించేడుట, ఆయనకి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారుట” అంటూ ఈధోరణిలో ఏమాత్రమో మిగిలి ఉన్న సరదాని సమూలంగా నాశనం చేసేవాడు.
“నీకు సంబంధం లేనివి నువ్వెందుకు చూస్తావు? నీతల ఇప్పుడప్పుడే నెరవదు. ఆ నరసింహులు చెట్టియార్ ఎవడో నీకు తెలీదు. కాని భారతపౌరుడిగా ఇందిరమ్మ ఏ ఏ రూళ్ళు అతిక్రమిస్తోందో, ఏ ఏ మంత్రులు ఆవిడకి వేడుకచెలికాళ్ళలా ప్రవర్తిస్తున్నారో తెలుసుకోవలసిన బాధ్యత నీది కాదా?” వాటికి తగిన డోసిచ్చేననుకుంటూ వాడు కింద పారేసిన పేపరు అందుకున్నాను.
వాడు చెప్పింది పూర్తిగా అబద్ధం అనడానికి ఆస్కారం లేదు – సినిమాలవి, ఇతరమైనవి ప్రకటనలు తీసేస్తే మిగిలిన పత్రిక చాలా కొద్ది. అదే తిరగేస్తూ వాడిలాగే నేనూ ఫొటోలు చూడసాగాను. నాదృష్టిని ఆకట్టుకున్న ఫొటో అయిదోపేజీ మొదటికాలంలో ఉంది. ఎక్కడ చూశానో గుర్తు చేసుకోడానికి రెండు నిముషాలు పట్టింది.
“కనపడుట లేదు.
వయసు 14 సం. ఎత్తు 5’ 2”. చామనచాయ, ఎడమచెంపమీద పుట్టుమచ్చ. ఉంగరాలజుత్తు. ఆచూకి తెలిపిన లేక ఇంటికి తెచ్చి ఒప్పచెప్పినవారికి తగిన పారితోషికమివ్వబడును.
బాబూ, నీవు ఇల్లు వదలి వెళ్ళినదగ్గిర్నుంచి అమ్మ మంచినీరు త్రాగలేదు. ఎక్కడ ఉన్నను వెంటనే ఇంటికి రావలెను. నిన్ను ఏమీ అనము. డబ్బు కావలసినచో ఉత్తరము వ్రాసేది.
ఇట్లు
మిన్ను రాధయ్య
చింతాలపేట పోస్టు, కడప జిల్లా.”
“మన ఊరువాడే్న్రోయ్,” అన్నాను రామకృష్ణకి ఆ ప్రకటన చూపిస్తూ. ఇంతకీ నాకూ కనపడని కుర్రకుంకకూ ఉన్న బాదరాయణం – నేను నాజానెడు పొట్ట పోషించుకోడానికి చింతాలపేట స్కూలులో లెక్కలటీచరుగా ఉండడం, అదే స్కూల్లో మాస్టర్ కిరణ్ అనబడే బాలహీరో మూడోఫారంలో చేరడం – బాలహీరో అనడంలో కేవలం వాగాడంబరం కాక ఔచిత్యముంది – కిరణ్ గత ఎనిమిదేళ్ళలోనూ ఒక పాతిక చిత్రాలలో నాయక, ప్రతినాయక, ఉపనాయక పాత్రలు – ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆ పాత్రల చిన్నప్పటి పాత్రలు ధరించి ప్రజల, దర్శక నిర్మాతల మన్ననలందుకున్నాడు. మొదట్లో ఆడపిల్లలా వేసినా తర్వాత్తర్వాత హీరో రోళ్ళకి ఎదిగిపోయేడు. ఏదో ఒక బాలనేరస్థులకి సంబంధించిన చిత్రంలో అతడే ప్రధానపాత్ర కూడాను. గత సంవత్సరంలో బాగా పొడుగెదిగి, మొహం కోలనై, గొంతు విడి, నూనూగు మీసఛాయలు ముఖాన తేలి, అటు బాలహీరోగానూ ఇటు పూర్తి తారగానూ పనికి రాకుండా పోవడంతో మూల పడిన స్కూలు పుస్తకాలు మళ్ళీ వెతికి తీసేడు. అప్పట్లో ఒక బాలపత్రిక అతడి మూడు నెలలనాటినించి ఫొటోలతో ఒక ప్రత్యేక సంచిక వేసింది. ఒకసారి రేడియోవారు పిల్లలకై ప్రత్యేక కార్యక్రమంలో పరిచయం ఏర్పాటు చేశారు. బొత్తిగా కథానాయకుల అభిమానసంఘాల్లా ఆ కుర్రాడిపేరుమీదుగా అభిమానసంఘాలు బయల్దేరకపోయినా చాలామంది ప్రేక్షకులు – “వీడీ సినిమాలో ఉన్నాడే- బలే హుషారుగా ఉంటాడు – పదండి చూదాం,” అంటూ చిత్రానికి వాడివునికిని ఒక ఎసెట్‌గా లెఖ్క కట్టుకునేవారు.
ఇహ కుర్రాడిపరంగా చెప్పవలసింది – మంచి చురుకైనవాడు. ఆ చురుకుకారణంగా ప్రక్కవాడికి ఒక్కొక్కప్పుడు చురక పడడం కూడా కద్దు. ఆ స్కూల్లో కుర్రవాడిని చేర్చడానికి వస్తూనే వాడితల్లి వాడిప్రతిభ వివరించింది. వాడికి నటన అంటే మహాభిమానం. కనక స్కూలు వార్షికోత్సవాలలోనూ, విద్యేతర కార్యక్రమాల్లోనూ ఓపినంత ఉత్సాహం చూపి పాఠశాలకే వన్నె తేగల చిరంజీవిగా అభివర్ణించింది. అతడు ఏ ఏ సినిమాల్లో ఏ ఏ పాత్రలు ధరించిందీ, వాటికి ఏ ఏ మహామహులు ఏ ఏ విధంగా ప్రశంసలందించిందీ అలనాటి ఫొటోలు అన్నీ వివరించింది. హైదరాబాదులోనే ఉంటే చదువు సాగకుండా ఉందని, ఇక్కడికి తీసుకొచ్చినట్టు ఆఖరిమాటగా చెప్పింది. హెడ్ మాష్టరుగారు అన్నీ చిర్నవ్వుతో విని ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేటు మాత్రం అడిగి తీసుకుని అబ్బాయిని క్లాసుకీ, ఆ తల్లిని ఇంటికీ పంపించేశారు.
కిరణ్ క్లాసులోకి అడుగు పెడుతూనే నేటి సినిమాహీరోలా చిన్నప్పటి చూపొకటి అందరిమీదా పారేసి నాలుగోవరసలో సర్దుకున్నాడు. అక్కడ్నుంచి మేష్టరుకి కనపడకుండా చుక్కలాట ఆడొచ్చు. కాగితపు బాణాలు, వాటికి దీటు రాగల చూపులూ విసరొచ్చు. ఏవిధంగానూ లాభసాటి కానప్పుడు లేచి చక్కా పోవచ్చు. మూడవఫారం విద్యార్థులు అభిరుచులివీ అని నేను వక్కాణించబోను కాని కిరణ్ బాబు ధోరణి నాకలా అనిపించిందని మాత్రమే మనవి చేసుకుంటున్నాను. నాకెందుకో అతడిని అతడిఖర్మానికి వదలి, పాఠం చెప్పుకుపోవడమే ఉభయతారకంగా తోచింది. దరిమిలా స్టాఫ్ రూంలో ఇంకొక ఇద్దరు ముగ్గురు మేష్టర్లు కూడా అదే అభిప్రాయం వెలిబుచ్చడం కేవలం యాదృచ్ఛికం.
పువ్వు పుట్టగానే పరిమళిస్తుందనీ, పుండు పుట్టగానే సలుపుతుందనీ పెద్దలు శలవిస్తారు. ఇంచుమించు యిదే అర్థవివరణతో వర్డ్సువర్తు దొర మనిషికి తండ్రి పిల్లవాడు అని ప్రవచించేడు. కిరణ్ బాబు మొత్తంమీద చింతాలపేటలోని మానవాళికంతటికీ మార్గదర్శకుడై మెలగదల్చుకున్నపోకడలు పోసాగాడు. “చూచావటమ్మా యశోదమ్మా!” అంటూ అలనాటి గోపికాబృందం యశోదమ్మ ముంగిట మొర పెట్టుకున్నచందాన కిరణ్ బాబులీలలు కథలు కథలుగా ప్రచారం పొందేయి. అయితే సామ్యం అంతవరకే.
పోలికాపుగారి మామిడితోట గుత్తకి తీసుకున్న చింతాలు కాయలు సంతకి తోలి సొమ్మయినతర్వాత డబ్బు జమ చేస్తానన్నాడుట. పోలికాపుగారు డబ్బు జమ అయితేనే గానీ కాయలు కొయ్యడానికి వీల్లేదని కబురు పెట్టారు. ఈ సంగతి ఎలా తెలిసిందో కిరణ్ బాబుకి తెలిసింది.
“డబ్బుంచుకుని లేదంటున్నాడు. దొంగవెధవ. గట్టిగా నాలుగు దులిపితే వాడే రాలుస్తాడు,” అని పోలికాపుగారూ, “వూరికే ఆ బాబలా అంటారు కానీ కాలా యేలా బడితే ఆయనే పల్లకుంతరు. ఏరే ఎందుకు దీయాలా, ఆ కాయమ్మి ఆ సొమ్ములోంచే ఇత్తే పోలా,” అని చింతాలూ ఆలోచనలు చేస్తూనే ఉన్నారు – అదేదో లాంఛనప్రాయమైన డైలాగయినట్టు. కిరణ్ బాబుకి ఈ ద్వితీయార్థం తెలీలేదు.
ఫలితం రాత్రికి రాత్రి మామిడితోటంతా దుంపనాశనం! ఆ తర్వాత అటు చింతాలు గోడు కానీ ఇటు పోలికాపుగారి వ్యధగాని పట్టించుకునేవాడే లేకపోయేడు. వూరి వ్యవహారాలు ఇలా ఓ పక్క చక్కబెడుతూనే ఉన్నాడు. మరో పక్క మామూలుగా స్కూలికి హాజరవుతూనే ఉన్నాడు అందులోనే సందు చేసుకుని.
నవంబరునాటికి స్కూల్లో విశేషకార్యక్రమాలు పెట్టి వీలయితే చందాలు వసూలు చేసి ఆ డబ్బుతో చాచా నెహ్రూపేరుమీదుగా ఇంకేదైనా చేసి తనకీ మాలాటి అల్పజ్ఞులకూ ఉండుకున్నట్టి దేశభక్తి, మన జాతీయనాయకునిపట్ల అనురక్తి తేటతెల్లం చేయాలని ఓ దుమారం లేవదీశాడు ఓ సుప్రభాతాన. చాలామందికి అదొక అద్భుతమైన, ఆచరణీయమైన ఆశయంగా భాసించేందేమో హెడ్ మాష్టరుగారితో సహా అందరూ సై అంటే సై అన్నారు.
చెప్పేదేఁవుంది – దాదాపు అన్ని వినోదకార్యక్రమాల్లోనూ కిరణ్ బాబు ఉండడమే కాకుండా – అదొక గర్వకారణంగా ప్రచారం ఇవ్వబడింది. వివిధ కార్యక్రమాల్లో ఒక అయిటమ్‌గా తెలుగు మేష్టరుగారు ఒక చిన్న మూకాభినయం ఏర్పాటు చేయనుంకించేరు. ఘట్టం సీతారాముల వనవాసం. సీత మాయలేడికై మనసు పడడం, శ్రీరాముడు సీతకి నచ్చజెప్పబోయి విఫలుడై మాయలేడిని వెంబడించడం, ఆర్తనాదం, సీత లక్ష్మణుని పంపడం, రావణుడు మాయభిక్షువై సీతకొరకు రావడం – ఇంతే. అంతా కలిపి ఒక పది నిముషాలు పడుతుంది స్టేజిమీద.
ఇందులో పంతులుగారు చేయదల్చుకున్నది సంభాషణలు తీసెయ్యడం – కేవలం అభినయంతో నడపదల్చుకోడం. ముఖ్యంగా కథ అందరికీ తెలిసిందే కనక మూకాభినయం రాణిస్తుందనుకున్నారాయన. అదీఁగాక ముందే వివరించినట్టు అన్నట్లో కిరణ్ బాబే కనక సంభాషణలన్నీ కంఠస్థం చేయడం, సులభసాధ్యం కాదని ఆయన అభిప్రాయపడి వుండొచ్చు.
అయితే చలనచిత్రక్షేత్రంలో రజితోత్సవం జరుపుకున్న బాలహీరో కిరణ్ బాబుకి అటువంటి అభిప్రాయం అవమానకరంగా తోచింది. సంభాషణలుండితీరాలనీ, తనకి కనీసం నాలుగు పద్యాలైనా యివ్వాలనీ రిట్ పడేశాడు. మోనోయాక్షనునించి ఇంగ్లీషుడ్రామావరకూ అన్నిట్లోనూ మాటలున్నాయి! మాటలు లేకుండా ముఖంలో ఎక్స్‌ప్రెన్స్ చూపడం కష్టతరం. అదీకాక సంభాషణలుండే సీత వేషం వేస్తానన్న సావిత్రి వెనక్కి తగ్గుతోంది. ఆడపిల్లల్లో ఆమాత్రం ముందుకొచ్చేవాళ్లు దొరకడం కష్టం వంటి వాదనలతో హెడ్ మాష్టరుగారిదగ్గర్నుంచి సావిత్రివరకూ నచ్చజెప్పగా ఒప్పుకున్నాడు. నామటుకు నేను “నువ్వఖ్ఖర్లేదు పోవోయ్” అందామనుకున్న మాట మింగేసి మరోపన్లోకి పోయేను.
అనుకున్ననాటికి అన్నీ సిద్ధం అయేయి. మొదట లేడికి బదులు లేడిచర్మం కప్పి యిద్దరు కుర్రనాగమ్మలని రంగంమీదకి తోలుదాం అనుకున్నారు గానీ ఒక ఘటికుడు నిజమైన లేడిపిల్లని -¬ బంగారం కాదనుకోండి – తీసుకొచ్చాడు. ప్రేక్షకులు ఆసక్తితో చూస్తున్నారు. సీతారాములు రంగంమీదకి ప్రవేశించేరు. మాయలేడి ఒక సైడువింగులోంచి ఎదురు సైడువింగులో కనిపిస్తున్న గడ్డిమేటుమీదకురికింది. సీత దానిని తర్జనితో చూపిస్తూ తనకు కావాలన్నట్టు అంగన్యాసకరన్యాసాలతో విన్నవించుకుంది. ఆ క్షణంలో తెరవెనుక వున్నవారూ, రంగస్థలానికి కుడిపక్కన వున్నవారూ, ఎడమప్రక్క వున్నవారూ, ఎదుట ప్రేక్షకులూ ఏఁవిటేఁవిటని రిచ్చ పడేటట్టు శ్రీరామచంద్రులవారు
“కంటివె లక్ష్మణా ధరణికన్యక
కున్ గల జింకయాస, మున్గంటిమె
యిట్టి రూపమున్ …”
అని పద్యం మొదలుపెట్టేరు. హెడ్ మాష్టరుగారు అవాక్కయిపోయేరు. తెలుగు పండితులవారు పళ్ళు నూరడం ప్రేక్షకులలో ముందు మూడు వరసలకి వినిపించి ఆ తరవాత కలకలంలో కలిసిపోయింది. ఆ వెనువెంటనే “బోర్ బోర్” అనో “వన్స్ మోర్” అనో తెలియకుండా కేకలు వినిపిస్తూనే వున్నాయి. నాటకం రసాభాసం అయిందనీ నేనూ, తెలుగు మేష్టారూ, మరొక నలుగురూ అనుకున్నామేమో కానీ చాలామంది అలా అనుకున్నట్టు కనిపించలేదు. అదొక హర్షదాయకమైన కొత్తదనంకింద తీసుకున్నారు. కిరణ్ బాబు సంగతి సరే సరి. నాలుగు తరాలకి లబ్ధప్రతిష్ఠుడై విరాజిల్లిన ¬- ఇంతవరకూ కర్ణాకర్ణిగా మాత్రమే తెలివిడి అయిన తన ప్రతిభను సాధికారికంగా నిరూపించుకున్న నిజమైన వీరునివలె రొమ్ము విరుచుకు తిరిగాడు. అంతే కాదు- తనచర్యకు చిన్నెలుగా – మహా నటులు అదే విధంగా ప్రవర్తిస్తారనీ, అవే ప్రతిభావ్యుత్పత్తులనబడతాయనీ – అవుసరం అనుకుంటే ఫలానా సినిమాలోని ఫలానా సీనులో నటుని బాధ్యత ఎంత వుందో, దర్శకునిబాధ్యత ఎంత వుందో ఆ నటునికి వ్రాసి తెలుసుకోవచ్చనీ తెలియజేశాడు. అయితే కిరణ్ బాబుయొక్క ఈ అసంబద్ధపుచర్యవల్ల తనపాత్ర దెబ్బ తింది అని బాధ పడి అతడిని ఆ మాటే అడిగిందిట సావిత్రి.
ఈ తగవులు ఎక్కడికి దారి తీసేవో కానీ హెడ్ మాష్టరుగారు తొందరగా క్రిష్టమస్ శలవులు ప్రకటించేరు. సదరు శలవుల్లోనే నేను రామకృష్ణ ఇంట్లో మకాం ఏర్పరుచుకున్నదీ, “కనపడుట లేదు” అన్న ప్రకటనక్రింద కిరణ్ బాబు ఫొటో కన్నదీను. అర్థసంవత్సరానికి పెట్టిన పరీక్షపేపర్లు దిద్దుకోవాలి నేను పోతానని శలవులు సగం అవుతూనే తిరుగుప్రయాణం పెట్టేను. రామకృష్ణ కూడా చదువుకోవలసింది చాలా ఉందని పట్నానికి ప్రయాణం కట్టాడు. రవంత చుట్టు తిరుగైనా కొంతసేపు రామకృష్ణతో గడపవచ్చన్న పేరాశతో నేనూ రైల్లోనే బయల్దేరాను సరాసరి బస్ వదులుకుని. దానివల్ల సాయంత్రం నాలుగ్గంటలకి చేరవలసిన వూరు రాత్రి తొమ్మిదిగంటలకి చేరుతానంతే.
నాయుడుపేటలో రైలు చాలా‌సేపు ఆగింది.
“ఎదుర్కోలు కాబోలు,” అన్నాడు రామకృష్ణ విసుగ్గా.
ఇద్దరమూ దిగి ప్లాట్‌ఫారంమీద పచార్లు చేస్తున్నాం. విదియచంద్రుడు ఓమారు తొంగి చూసి తప్పుకున్నాడు. “తెప్పవోలె చంద్రబింబం తేలిపోతూందం”టూ రామకృష్ణ కూనిరాగం తీస్తున్నాడు. వస్తున్నది పెద్ద బండి కాబోలు మా కోచి షటిల్లోకి మారి దారివ్వడానికి కదిలింది.
కన్నుమూసి తెరిచేలోగా రామకృష్ణ నాచెయ్యి విదిలించుకుని మాయిద్దరికీ మధ్యగా నిలబెట్టాడు – నేను తెప్పరిల్లి చూసేసరికి నావేపు బెదురు చూపు చూస్తూ, “మాష్టారూ! “ అంటూ నన్ను చుట్టేసింది సావిత్రి!
“ఇదేఁవిట్రా. ఈ అమ్మాయిని నీకు తెలుసా?” అన్నాడు రామకృష్ణ.
“అవును. ఈ అమ్మాయి చింతాలుపేట రైతు కుటుంబానికి చెందింది. మాస్కూల్లో సెకండు ఫారం చదువుతోంది,” అని వాడికి సమాధానం చెప్పి, సావిత్రిని అడిగాను, “ఇక్కడికెలా వచ్చేవు? ఎందుకొచ్చేవు?” ఒక్క క్షణం ఆగి, “ఇంత అజాగ్రత్త ఏవిఁటి – మావాడు చూడకపోతే నిష్కారణంగా చచ్చి వుండేదానివీపాటికి,” అన్నాను మేష్టర్లకలవాటైన దర్పంతో.
సావిత్రి సన్నగా ఏడవడం తప్ప సమాధానం చెప్పలేదు.
“మీవాళ్ళతో వచ్చి తప్పిపోయేవా?” రామకృష్ణ అనునయంగా అడిగేడు.
లేదన్నట్టు తలూపింది.
“అంటే తప్పిపోలేదనా?మీవాళ్ళతో రాలేదనా?” రామకృష్ణ మళ్ళీ అడిగాడు.
ఈసారి ఆమాత్రం అంగవిన్యాసానిక్కూడా మేం నోచుకోలేదు.
ఇంకా విద్యార్థిదశనే అనుభవిస్తున్న రామకృష్ణ చిరాకు పడడంలో ఆశ్చర్యం లేదు. బి.ఎ. కాగానే చదువుకి స్వస్తి చెప్పి బడిపంతులుగా స్థిరపడ్డ నేను అప్పటికే చాలా జీవితం చూసిన అనుభవం గడించుకున్నానేమో వాడితో అన్నాను, “ఒరేయ్, కలికాలంలో జీవుడు అన్నగతప్రాణిగా పేర్కొనబడ్డాడు. ఈ అమ్మాయిమొహం గుడ్డివెలుగులో కూడా ఆకలితో నకనకలాడుతున్నట్టు స్పష్టంగా తెలుస్తూనే వుంది. నేనలా స్టాలువేపు వెళ్ళి ఈ అమ్మాయికి ఏమైనా పెట్టించి తీసుకువస్తాను. నువ్వు రైల్లో కూర్చో,” అని చెప్పి స్టాల్‌వేపు తీసికెళ్ళాను సావిత్రిని.
బన్, రెండు బిస్కెట్లు తిని ఓ కప్పు టీ తాగినతరవాత ఆ అమ్మాయిలో కొంచెం తేరుకున్న లక్షణాలు కనిపించాయి. ఇంతలో రైలు బయల్దేరబోతున్నానని కేకేసి పిలిచింది. సావిత్రి చెయ్యి పట్టుకుని, “రా, రా” అంటూ బండివేపు లాగబోయేను.
సావిత్రి చెయ్యి విదిలించుకుని, “నేను రానం”టూ పరుగెత్తసాగింది. నేనూ గబగబ నాలుగడుగులు వేసి సావిత్రినయితే పట్టుకోగలిగాను కానీ రైలు అందలేదు. వెనుదిరిగి చూచేసరికి గార్డు తన కాబిన్‌లోకి పోతూ కనిపించేడు. ఈ ట్రైన్ తప్పిపోతే కనెక్షన్ దొరకదు కనక రామకృష్ణ వెళ్ళిపోయాడు. నాకేముంది ఇక్కడైనా బస్ ఎక్కవచ్చు.
“ఎందుకు రావూ?” సావిత్రిని ప్రశ్నించాను. కావలిసినంత సావకాశం ఇప్పుడు.
కాని సావిత్రిదగ్గిర విషయం రాబట్టడం అంత సుళువు కాదని తెలుసుకోడానికి నాకెక్కువసేపు పట్టలేదు. చెప్పడం ఇష్టం లేదనడం కన్నా ఎలా చెప్పాలని మధన పడుతోందేమో అనిపించింది. ఇంటిదగ్గిర ఆపిల్లని ఎవరూ ఏమీ అనలేదు. మరెందుకు భయం?
ఒక అరగంటసేపు కమ్మెచ్చులో పెట్టి సాగదీసినట్టు సాగదీయగా కిరణ్ బాబు పేరు బయట పడింది. మధ్య వాడిపేరెందుకు?
“కాదండీ! ఆరోజు డ్రామాలో నాకు సంభాషణలు లేవని చెప్పి, అతను పద్యాలు చెప్పాడు కదా. నాకూ మాటలు పాటలు పెడితే నేనూ అంతకంటె గొప్పగానే చేసి వుండేదాన్ని అన్నానండీ. దానికి ‘నన్ను ఛాలెంజి చేస్తావా’ అని నాజడ పట్టుకున్నాడు. ఈసారి జడ పట్టుకో మానాన్నతో చెప్తే నీతాట ఒలిచేస్తాడన్నాను. అలాగా అన్నాడు. ఆ మర్నాడు సాయంత్రం …”
“సాయంత్రం” అందిస్తున్నట్టు అన్నాను.
“సాయంత్రం … “ సావిత్రి స్వరం జీర బోయింది.
“సాయంత్రం,” ముందుకి వంగి వెన్ను నిమిరేను.
“సాయంత్రం అతనూ మరొకడూ కలిసి … నన్ను …”
నేను ఊహించుకోలేకపోతున్నాను. క్రమంగా మాటకీ మాటకీ ఎడం హెచ్చవుతోంది.
“అతనూ … మరొకడూ … నన్ను ఒక క్లాస్ రూంలో పెట్టి … తలుపు …”
సావిత్రి ఇంక చెప్పలేనన్నట్టు కూలబడిపోయి నాకాళ్ళు చుట్టేసింది. నేనలా స్థాణువునై ఎంతసేపున్నానో తెలీదు.
సావిత్రికి శతవిధాల నచ్చచెప్పి ఇంటికి తీసుకొచ్చాను. ఊళ్ళో అందరూ కిరణ్ బాబు పరారీ గురించి పరిపరివిధాలా అనుకుంటున్నారు. కారణం ఎవరికీ తెలియదట. ఇంట్లో కూడా ఏమీ సంఘర్షణలలాటివి జరగలేదట. మద్రాసో హైదరాబాదో వెళ్ళాడేమోనని వాకబు చేసారట కానీ ఆచూకీ ఏమీ దొరకలేదు. ఆ ఆకతాయి అభిరుచులకనుగుణంగా పాఠశాల లేదనీ, అందుకే కుర్రవాడు అలా మాయం అయిపోయాడనీ ఆ తల్లిదండ్రులు పాఠశాలపై నేరం ఆరోపించారు.
యాధార్థమైన నేరం మాత్రం జీవితపు గతుకుల్లో మరుగున పడిపోయింది.
000
నామాటగా – ఈకథ జనవరి 1972 తరుణ మాసపత్రికలో ప్రచురణ అయింది. చాలాకాలంగా వ్రాతప్రతి చూస్తున్నాను కానీ కథానిలయంలో చూసేవరకూ ఇది ప్రచురించినట్టు తెలీదు. నాకు అట్టే సినిమాలపిచ్చి లేకపోయినా, ఆరోజుల్లో సినిమాలు బాగానే చూసేననుకుంటాను. అప్పట్లో పిల్లలని సినిమాల్లో పెట్టినప్పుడు, ఆ పాత్రలప్రభావం వారిమీద ఎలా ఉంటుందన్న ఆలోచనలకి రూపకల్పన ఇది.
కొంతకాలం క్రితం ఎక్కడో చదివేను గాంధీ సినిమాలో ప్రధానపాత్ర ధరించిన Ben Kingsley ఆ పాత్ర తనని నిత్యజీవితంలో ప్రభావితం చేసిందని అన్నాడు. మాఅమ్మాయి పిల్లలని సినిమాల్లో పెట్టడం ఉచిత కాదని అంది. ఎంచేత అని అడిగేను. వాళ్ళజీవితాలు నాశనం అవుతాయి అంది. హాలివుడ్‌లో అందరూ అనలేను కానీ కొందరు బాలనటులుగా ప్రసిద్ధులయి తరవాత ఎందుకూ కొర గాకుండా పోతున్నారు. ఆత్మహత్యలకి పాల్పడినవారు కూడా ఉన్నారు.

ఈకథ రాసినప్పుడు నాకు ఇవన్నీ తెలీవు కానీ ఇప్పుడు మాత్రం ఈకథలో అనౌచిత్యం లేదనే అనిపిస్తోంది.

(నవంబరు 27, 2014)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s