వెనకటి నేను 6 – అసలైన విషాదం (కథ)

3-28-1973 ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురించిన కథ.
———-  Asailaina

నాకు మనుషులంటే సరదా.

అతిథి వస్తోందని మూడు రోజులనించి గది సర్దుతున్నాను. మరో గంటలో తను రావచ్చు. మరోమారు చుట్టూ చూశాను – చివరితీర్పులేవేనా అవసరమేమోనని. అఖ్ఖర్లేదు. చాలా బాగుంది. కిటికీలోంచి చూశాను. రూంవెనక ఉన్న పేరు తెలీని చెట్టు విరగబూసింది. వానకి తడవడంచేత పచ్చని ఆకులు మరీ పచ్చగానూ ఎర్రని పూలు మరీ ఎర్రగానూ మెరుస్తున్నాయి. వర్ణసమ్మేళనం దేవుడికే బాగా తెలుసేమో అనిపించింది ఆ దృశ్యం చూస్తూంటే.

తలుపు చప్పుడైతే వెనక్కి తిరిగి చూశాను. వాచ్‌మన్ ఓ సంచి లోపల పెట్టి వెళ్ళిపోయేడు. గుమ్మంలో సందిగ్ధంగా నిలబడిన ఆవిడని లోపలికి రమ్మన్నాను. బస్సు టైము నాకు తప్పు చెప్పినట్టున్నారు. అనుకున్నదానికంటే ముందే వచ్చేసింది. ఆమెని చూడగానే నాలో కలిగిన అసంతృప్తికి కారణం తెలీలేదు.

ఆ అసంతృప్తిని కప్పి పుచ్చుకుని, “వేణ్ణీళ్ళున్నాయి¸ స్నానం చెయ్య”మన్నాను.

“అబ్భ ఇంత చలిలో స్నానం చెయ్యడం ఎలాగండి. ఈవేళ స్నానం చెయ్యను,” అంది ఆవిడ చేతిరుమాలుతో ఒంటిమీద పడిన వానచినుకులు తుడుచుకుంటూ.

ఫ్లాస్కులో ఉంచిన కాఫీ గ్లాసులో పోసి ఇచ్చేను.

“థాంక్సండీ,” అంది ఏమాత్రం స్పందన కనిపించని స్వరంతో.

ఇంచుమించు నావయసే ఉంటుంది. బాలనెరుపు కాబోలు తలలో తెల్లని వెంట్రుకలు చాలా కనిపిస్తున్నాయి. చేయెత్తు మనిషి అయినా హుందాతనం కనిపించడం లేదు. విశాలమైన కళ్ళే అయినా చిర్నవ్వులు విరియడం లేదు. మంచి రంగే కానీ మొహంలో స్నిగ్ధత్వం లేదు. కొందరి తత్త్వమే అంత అనుకున్నాను. లింకన్ కాబోలు నలభై ఏల్ళు దాటినతరవాత ప్రతివాడు తన ముఖలక్షణాలకి తనే బాధ్యుడు అన్నాడు. “నలభై దాటిన తరవాత” అంటూ మెలికెందుకు పెట్టాడో?

“రమ మిమ్మల్ని అడిగినట్టు చెప్పమంది. మీరు సరిగ్గా ఉత్తరాలు రాయడం లేదుట. కోపం వచ్చిందని చెప్పమంది.”

ఆవిడ అంతకుముందు ఏం చెప్పిందో నేను వినలేదు. “కోపం వచ్చిందిటా?” అన్నాను నవ్వుతూ, “ఏం చేస్తుందిటా?”

ఆవిడ నామాట వినిపించుకోలేదు. “ఛీ. ఏం వానండీ. అక్కడా ఇంతే ఒకటే వానలు ఒదలకుండా చిన్నపిల్లలు చొంగ కార్చుకుంటున్నాట్టు.”

ఫక్కున నవ్వాను, “బాగా చెప్పారు,” అంటూ. నవ్వుతూ కూచుంటే నాపనో? నేను లైబ్రరీకి వెళ్ళిపోవాలని, డూప్లికేట్ తాళంచెవి తనకిచ్చేను.

“యూనివర్సిటీ ఆఫీసు ఎక్కడండీ?”

ఆవిడని కిటికీదగ్గరికి పిలిచి, కనిపిస్తున్న టవర్ క్లాక్ చూపించి, “అక్కడికి ఎలా చేరుకోవాలో విడమరిచి చెప్పాను. చాలా మెల్లిగా నడిస్తే మూడు నిముషాలు పట్టవచ్చు.

“ఎలాగండీ? నాకు చచ్చే భయం. మీకు నాతో రావడానికి వీలవదా?”

“నాకు లైబ్రరీలో పనుందండి. లీవు పెట్టడానికి వీలు పడదు. ముఖ్యమైన బిల్లులున్నాన్నాయి. అర్జంటుగా పాస్ చెయ్యాలి,” అన్నాను.

అది ఇంకెవరిచేతనైనా చేయించకూడదా? పోనీ, పర్మిషన్ అడక్కూడదా?వేరే ఏదైనా పని ఉండి ఉంటే ఏం చేసేవారు? ఇదే రమ అయితే ఏం చేసి ఉండేవారు?

ఆఖరిప్రశ్నతో నాకు ఒళ్ళు భగ్గున మండింది. పుణ్యానికి పుట్టెడు ధాన్యం కొలిస్తే పిచ్చకుంచంతో కొలిచేవని పోట్లాట పెట్టుకున్నట్టుందీ వరస.

“నేను ఇక్కడ లేకపోతే మీరు మాత్రం ఏం చేసేవారు?” అన్నాను శాంతంగానే.

“ఏమోనండీ. నేను మాత్రం ఒక్కదాన్నీ ఎక్కడికీ వెళ్ళలేను. ఎవరితో మాటాడలేను. మాఊళ్ళో ఉంటే మా చెల్లెలే అన్నీ చూసుకుంటుంది.”

“సరేలెండి,” అనేసి నేను లైబ్రరీకి బయల్దేరేను.

దారిపొడుగునా “వెళ్ళొచ్చంటారా? వాళ్ళు మాటాడతారా? నువ్వెవరమ్మా అసలు యమ్. ఏ. చదివిన మొహంలా లేదే అంటూ పొమ్మనరు కదా” అంటూ పదే పదే ప్రశ్నించిన ఆవిడమొహమే గుర్తుకు రాసాగింది. నేను కూడా వెళ్ళి కనీసం ఎక్కడ ఇంటర్వ్యూ జరుగుతుందో చూపించి వచ్చేసి ఉండవచ్చు. వెళ్ళి ఉండవలసింది. తనని రమతో పోల్చుకుని “ఇదే రమ అయితే” అని ఉండకపోతే బహుశా వెళ్ళి ఉండేదాన్నేమో! తన ఉద్యోగానికి అప్లికేషన్ ఫారమ్ తెప్పించడందగ్గర్నించి పోస్టు చెయ్యడంవరకూ – ఒక్క సంతకం మాత్రం – అదీ చెల్లెలు ఎక్కడ పెట్టమంటే అక్కడ – అంతా చెల్లెలే చేసిందనీ, కనీసం నాకైనా చెప్పకుండా ఉంటే బాగుండేది. దాదాపు ఏడు సంవత్సరాలనుంచి ఉద్యోగంలో ఉన్న వ్యక్తి ఒక భవనంలోకి వెళ్ళి “ఇంటర్వ్యూ జరిగేది ఇక్కడేనాండి?” అని అడిగే ధైర్యం సంతరించుకోలేకపోయిందంటే, ఇక ఆమనిషికి వ్యక్తిత్వం ఏమిటి?ఆ కిటికీదగ్గర కూచుని ఆ టవర్ క్లాక్ వేపు చూస్తూ ఎలా చేరుకోడంరా భగవంతుడా అనుకుంటూ ఉంటుందేమో! గోళ్ళు గిల్లుకోడం పూర్తి చేసి ఉంటుందా? పొద్దున్నే తీరికూచుని మరో పని లేనట్టు బల్లమీద బ్లేడు కనిపించేసరికి, కాళ్ళు మంచంమీద దన్ను పెట్టి గోళ్ళు తీసుకుంటుంటే అన్నాను, “మంగళవారం గోళ్ళు తీయకూడదని ధర్మశాస్త్రాలూ, బ్లేడుతో కొయ్యకూడదని వైద్యవిజ్ఞానమూ చెబుతున్నాయండీ” అని. ఆవిడ వెంటనే బ్లేడు బల్లమీద పడేసింది. నిజంగా ఆవిడకా మాత్రం తెలీదా?ఎవరేం చెప్పితే అదే వినడం అలవాటా? అయినా నేను ఆ విషయం అదేదో అంతర్జాతీయ సమస్య అయినట్టు తర్కించడం అసలే బాగులేదు!

నాసీట్లో కూచుని ఫైల్స్ తీసేసరికి మిగిలిన విషయాలన్నీ మనోవీధిలోంచి నిష్క్రమించాయి. తలతో పని మొదలుపెట్టేను.

మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు చూస్తే ఆవిడ ఇంకా రాలేదు. డైనింగ్ హాలుదగ్గర కావేరిని అడిగేను – నా అతిథిదైవ ఇంకా రాలేదా అని. రాలేదట. నాపక్క రూంలో తమిళలెక్చరరు సాయం వెళ్ళిందిట. ఇంతవరకూ ఇద్దరూ రాలేదు. నేను భోజనం చేసేసి, రూంకొచ్చి పది నిముషాలు విశ్రాంతి తీసుకుని, బయల్దేరబోతూంటే ఆవిడ వచ్చింది.

“బాగా చేసేరా?” అడిగేను లాంఛనప్రాయంగా.

“ఏదో చేసేను,” అంది నీరసంగా.

“అదేమిటండీ అలాగంటారు. నిజానికి ఇంటర్వ్యూ చేసేవాళ్ళని చూస్తే నాకు జాలేస్తుంది. మనం ఏం చెపితే అదే వినాల్సిందే కదా వాళ్ళు. వాళ్ళు ఏం ప్రశ్నలేసినా మనం చెప్పదలుచుకున్నది మనం చెప్పేస్తాం. పోన్లెండి. భోజనం చేద్దురు గాని, రండి,” అని ఆవిడకి ధైర్యం చెప్పి, డైనింగ్ హాలుకి పిల్చుకు వెళ్ళేను.
ఉద్యోగం ఇస్తాడంటారా? ఇంకా చాలామంది ఉన్నారు కానీ, తనకున్న అర్హతలు వాళ్ళకి లేవు. తనకీ కొన్ని ఇతర అర్హతలు ఉన్నాయి కానీ అవి పనికొచ్చేవి కావు. అది వేరే సంగతి. అవి కనీసం తన తెలివిని తేటతెల్లం చేయవూ? నలుగుర్ని మూడు నిముషాల్లో పంపించేశారు. తనని పదిహేను నిముషాలు రాచి రంపాన పెట్టేరుట. అసలు మీటింగు గదిలో అడుగు పెడుతుంటే ముచ్చెమటలూ పోసేయి. చేతులు వణికేయి. మంచినీళ్ళు తాగి వస్తే బాగుండును అనిపించింది. తనవంతు వచ్చేసరికి తనకి ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది – అవిడ చెప్పినమాటలు అర్థం కాకపోయినా ఆవిడ జవాబులు ఆవిడకి సంతృప్తికరంగానే ఉన్నాయని అర్థమయింది నాకు.

“మీగదికి వెళ్ళి వచ్చేను. కాళ్ళూ చేతులూ కడుక్కుని వచ్చేసరికి ఆలస్యం అయింది,” అంటూ కూడా వెళ్ళిన లెక్చరరు వచ్చారు.

“ఆవిడ పిలిస్తే వచ్చేశాను,” అంది నా అతిథివేపు నావేపు చూపించి. నేను తెల్లబోయేను. ఏం చెప్పను?తనని భోజనానికి పిలవలేదని చెప్పనా?ఆవిడ కూడా వెళ్ళిందని నాకు తెలీదని చెప్పనా?

“సారీ,” అన్నాను నవ్వి.

“నేను బాగానే చేసేనంటారా?ఉద్యోగం నాకు వస్తుందంటారా?” ఆవిడవేపు తిరిగి ప్రశ్నించింది.

“బాగానే చేసేనంటున్నారు కదా. మీకే ఇవ్వచ్చులెండి. అయినా ఉద్యోగాలు దైవాధీనాలు. ఇంత గొడవ అయినతరవాత ఎవర్నీ తీసుకోకుండా ఊరుకోవచ్చు కూడా,” అంది తమిళ లెక్చరరు తాటిమీద నడుస్తున్నట్టు.

“పోన్లెండి. ఊరు చూడ్డానికొచ్చేననుకుంటాను. గంటసేపు ప్రశ్నలేసి చంపారు. స్పెషలిస్టు సంతృప్తి పడ్డట్టే కనిపించాడు,”

నాకు టైమయిపోతూందని చెప్పి అక్కడినించి తప్పించుకున్నాను. అసందర్భంగానే రమ జ్ఞాపకం వచ్చింది. అసందర్భం అని ఎందుకంటున్నానంటే రమకీ ఈ మనిషికీ ట్విస్టు డాన్సులకీ భరతనాట్యానికీ ఉన్నంత భేదం ఉంది. దేవాలయంలో నాట్యభంగిమలో ఉన్న యక్షిణీశిల్పం జ్యోతిలక్ష్మి క్లబ్ డాన్సు గుర్తు చేయగలదా?

సాయంత్రం లైబ్రరీనుంచి వచ్చేసరికి ఆవిడ సర్దుకుని ప్రయాణానికి సన్నిద్ధమై ఉంటుందనుకున్నాను. మంచంమీద పడుకుని ఏదో ఆలోచిస్తూంది. కాఫీ, టిఫినూ తీసుకుందిట. సాయంత్రం బజారుపని కొంచెం చూసుకుని మరునాడు పొద్దున బయల్దేరుదాం అనుకుంటూందిట. నేను కూడా కాఫీ, టిఫిను తీసుకున్న తరవాత బయల్దేరాం.

సవరమూ, గాజులూ, పూసలూ కొంటానంది. నఖములూ, నరులూ, కేశములూ స్థానభ్రంశము పొందిరేని రాణించవు అంటారు. కానీ కేశములకి ఎక్కడలేని గిరాకీ వచ్చేసింది కలికాలంలో గదా! రోజూ సరిగా తల దువ్వుకోనివాళ్లూ వారానికోసారి తలంటుకోనివాళ్ళూ కూడా ఈ ఎరువుజుట్టుకోసం ఎంత తాపత్రయపడుతున్నారో!!

ఆవిడ సవరం ఎంపిక ఒక్కటే విడిగా ఓ కథ రాయొచ్చు అనిపించింది. నాకు ఎదురుగా లేని వ్యక్తిజుత్తుకీ చేతిలో ఉన్న సవరం పొత్తు కుదురుతుందో లేదో పదే పదే నన్ను ప్రశ్నించడంలో గల తర్కం నాకు బోధపడలేదు. అవతలిమనిషి జూత్తు మరీ పలచనైతే ఈవిడ సవరం తీసుకెళితే జడ చేత్తో పట్టుకు తిరగవలసివస్తుందన్న సామాన్యసూత్రం అవిడకి అర్థమయేలా చెప్పలేకపోయేను. అది ఎంచడం అయింతరవాత అడిగేను, “మీరు తీసుకోరా?” అని.

“ఆఁ. నాకదొక్కటే తక్కువ,” అంది.

“ఏవఁడీ అలా అంటారు,” అన్నాను లేచి బయటికి వస్తూ.

రోడ్డుమీదకి రాగానే, “నష్టం లేదు కదండీ,” అంది పదమూడోసారి.

దూసుకుపోయిన కారును చూస్తూ అన్నాను, “ఇక్కడ రోడ్డుమీద చాలా జాగ్రత్తగా నడవాలండీ,” అని.

“ఆఁ. పోనిద్దురూ.”

“పోనివ్వడం ఏమిటి? ప్రాణం పోతుంది,” అన్నాను.

“ప్రాణం పోతే మాత్రం ఏం?” అంది.

ఆవిడధోరణికి ఏం చెప్పాలో నాకర్థం కాలేదు. ప్రతిదానికీ పోనివ్వండి, ఎలా ఉంటే ఏం, ఏమైతే ఏం, బ్రతికి సాధిస్తున్నదేమిటి? అంటూ తిరుమంత్రం జపిస్తున్న మనిషిలో ఏమాత్రం బలం ఉన్నట్టు? వీళ్ళలో ఈ వైరాగ్యం ఏ థర్మామీటరుతో కొలవడానికి వీలవుతుంది?

“జాగ్రత్త” అంటూ మరోసారి ఆవిడని పక్కకి లాగి అన్నాను, “లాభం లేదండీ. మిమ్మల్ని నిరపాయకరంగా హాస్టలుకి చేర్చే ఒకమార్గం మిమ్మల్ని వెంటనే రిక్షా ఎక్కించేయడమే. మరే పద్ధతిలోనూ మిమ్మల్ని రక్షించలేను,” అని.

ఆవిడ నవ్వుతుందనుకున్నాను. నవ్వలేదు. చాలా సీరయస్‌గా మొహం పెట్టి, “నిజంగా చెపుతున్నానండి నేను చచ్చిపోతానన్న భయం మీకఖ్ఖర్లేదు. ఇప్పటికి మూడు ఎక్సిడెంట్లయేయి. నేను చెక్కు చెదరలేదు. పైగా, నాకు చచ్చిపోవడం చాలా ఇష్టం కూడాను. ఈ ఇరవైఆరేళ్ళ జీవితంలో నాకు సంతోషం కలిగించేది ఒక్కటీ జరగలేదు. అందుకే రోజూ ఉదయం లేవగానే తండ్రీ ఈరోజయినా ఈ జీవితాన్ని అంతం చెయ్యి అని దణ్ణం పెట్టుకుంటాను,” అంది.

నాకు మనసు మొద్దు బారిపోయింది. ఆమెమీద జాలి పుట్టుకొచ్చింది. ఏ పరిస్థితులు ఈవిణ్ణి ఈ నిరాశలోకి దించేయో? ఏ మృగాలు దగా చేసి ఉంటాయో?

“ఉండండి.”

ఉలిక్కిపడ్డాను.

ఓ మెడికల్ షాపుదగ్గర నన్ను ఆపి. ఏదో కొనుక్కుని వచ్చింది. ఏమిటవని నేను అడిగితే, తలనొప్పిగా ఉందని ఏవో మాత్రలు కొన్నట్టు చెప్పింది. కొంతదూరం వెళ్ళి మళ్ళీ అలాగే మరో షాపుదగ్గర ఆగింది. ముందుషాపులో తనడిగిన మాత్రలు లేవన్నారంది. మూడోషాపులో మళ్ళీ ఏదో తీసుకుంది. మొత్తంమీద హాస్టలుకి చేరేసరికి ఎనిమిదయింది.

భోజనం అయినతరవాత ఓ గంటసేపు మా వింగ్‌లో వాళ్ళందరూ కూర్చుని కబుర్లు చెప్పారు. నేను కింద పడుకుంటాననీ, ఆవిడని మంచంమీద పడుకోమన్నాను. “వద్దు, ఇద్దరం కిందనే పడుకుందాం,” అంది ఆవిడ.

పక్క వేసి లైటు తీసేశాను.

“నేనీ ఉద్యోగం ఎందుకు కోరుకుంటున్నానో తెలుసాండి?” అంది ఆవిడ.

“చక్కని భవిష్యత్తుకోసం. ఇక్కడుంటే రిసెర్చికి రిజిస్టర్ చేసుకోవచ్చు,” అన్నాను పొడుపుకథ విడుపు తెలిసిన పిల్లాడిలా తేలిగ్గా.

“కాదండీ నాకు మాఊళ్లో ఉండడం ఇష్టంలేదండీ.”

నాకు ఆశ్చర్యం వేసింది. సామాన్యంగా జనులు- అందునా ఆడపిల్లలు అల్లాడిపోయేది ఉన్నఊళ్ళో ఉద్యోగం, పుట్టింట్లో కాపురమే కదా! అడక్కుండానే చెప్పింది. తనడబ్బుకి ఆశ పడేవాళ్ళు లేరు. తల్లీ, తండ్రీ అల్లారుముద్దుగా కాకపోయినా కష్టాలు పెట్టకుండానే చూసుకుంటున్నారు. అన్నగారికి పెళ్ళి అయింది కానీ వదినగారితో పేచీల్లేవు. తనకీ సంబంధాలు చూస్తున్నారు కాని తనకే ఇంటరెస్టు లేదు. “ప్చ్” అని చప్పరించి, “ఆఖరిమజిలీ అదే కదండి” అంటుంది చావుగురించి ఎందుకు ఆలోచిస్తారు అని ప్రశ్నిస్తే. కానీ ఆవిడ ఇక్కడున్న పన్నెండు గంటల్లో కనీసం ఇరవైనాలుగు మార్లైనా అని ఉంటుంది చావాలని ఉందని.
ఆఖరికి అన్నాను, “చూడండి మీరు కూడా ఇంగ్లీషువాళ్ళే. అదే ఇంగ్లీషు చదివిన తెలుగువాళ్ళే. మీకూ తెలుసేమో ఈకథ. అయినా మళ్ళీ చెబుతాను. థేమ్స్ నదిలో పడి ఆత్మహత్య చేసుకోడం మహా పాపం బ్రిటిష్ చట్టరీత్యా. అలా ఎవరూ పడకుండా చూడడానికి అక్కడ పోలీసులు కూడా ఉంటారట. అలాటి ఒక పోలీసు అలాటి ఆత్మహత్యాప్రయత్నంలో ఉన్న వ్యక్తిని పట్టుకుని, “ఎందుకు  చచ్చిపోవాల నుకుంటున్నావు?” అని ప్రశ్నించాడట. వాణ్ణి ఏవిధంగానూ ఆపలేక, “సరే అయితే. ఇలా కూచో. ఎందుకు చచ్చిపోవచ్చో నువ్వు చెప్పు. నీవాదన సమర్థనీయంగా ఉంటే నిన్ను చచ్చిపోనిస్తాను,” అన్నాడట పోలీసు. ఓగంటసేపు ఇద్దరూ వాదించుకున్నారు. ఆ తరవాత ఇద్దరూ దూకేశారు ఆనదిలోకి.”

ఆవిడ అటు తిరిగి పడుకుంది. తెల్లవారి లేవగాని రమకి ఏం రాయాలో ఆలోచిస్తూ నేను పడుకున్నాను. సామాన్యంగా పక్కమీద పడుకోగానే నాకు నిద్ర పట్టేస్తుంది. ఎప్పుడో ఓ రాత్రప్పుడు మెళుకువ వస్తుంది. మంచి నిద్రలో ఉండగానే పిలిచినట్టయి ఉలిక్కిపడ్డాను. ఆవిడే! నాఅతిథి నన్ను ప్రత్యేకం లేపి ప్రశ్నించింది,

“నేనిప్పుడు చచ్చిపోతే ఎలా ఉంటుందండి?” అంటూ.

నాకు కోపం వచ్చింది. “రసవత్తరంగా మాత్రం ఉండదు. పైగా ఇప్పుడు ఇక్కడ సదుపాయాలు కూడా లేవు. పడుకోండి. రేప్పొద్దున్న చూద్దాం,” అన్నాను అటు తిరిగి పడుకుంటూ.

“అది కాదండి,” అంది.

“ఏది కాదంటారు. నలుడో మరొకడో దమయంతితోనో మరెవరితోనో చెప్పినట్టు – రజ్జువల్లరిపై ప్రణయంబు కలదేని అంతరిక్షంబేలు హరి వరించు … ఆ తరవాత పద్యం నాకు రాదు. రేపు చూసి చెప్తాను. ఇప్పటికి పడుకోండి,” అన్నాను కరుగ్గా.

“సాయంత్రం గార్డినాల్ మాత్రలు కొని తెచ్చేను,” అంది కాస్త మెత్తబడి.

“మీరు తలనొప్పి మాత్రలు అన్నారు కదా. నిజమే అనుకుని నేను తినేశాను. బాగానే ఉన్నాయి. మీరు దయచేసి పడుకోరూ.”

ఆవిడ మాటాడకుండా పడుకుంది. నాకు మళ్ళీ నిద్ర పట్టడానికి చాలా టైము పట్టింది. ఒక్క క్షణకాలం నాకు ఈర్ష్యలాటిది కలిగింది. At her expense నేను enjoy చేస్తున్నానో నా expenseతో ఆవిడ ఆనందిస్తోందో తెలీలేదు.

మళ్ళీ ఏదో కుదుపు. “ఈరాత్రి నన్ను పడుకోనివ్వరా?” దుప్పటి తొలగిస్తూ అడిగేను.

“రాత్రి కాదండీ. తెల్లారి చాలాసేపయింది. హాస్టల్ అంతా గొడవగా ఉంది. లేవండి,” ఆవిడమొహంలో భయాందోళనలు.

“ఏమైంది?”

“ఎవరో అమ్మాయి చచ్చిపోయిందిట.”

“హాఁ!” నాగుండె క్షణకాలంసేపు కొట్టుకోడం మానేసింది.

కలో నిజమో అర్థం కాలేదు. హాస్టల్ ‌లో ఆత్మహత్య! లేచి హాల్‌లోకి వెళ్ళాను. అంతా గొడవగొడవగా ఉంది. వార్డెన్, హౌస్ కీపర్, పనివాళ్ళు గుంపుగా ఉన్నారు. రకరకాలుగా మాటాడుకుంటున్నారు – ఆ అమ్మాయి ఏరోజు ఏం మాటాడిందో, ఏం చేసిందో. ముందు రోజు ఎవరిదో నోట్స్ తీసుకుందిట. ఎవరికీ అనుమానం రాలేదు. ఉత్తరం వ్రాసి పెట్టింది – వ్రాసిన రెండు పేపర్లు బాగా రాయలేదుట. క్లాసు రావాలని చదివితే పాసయేట్టుగా కూడా లేదుట. ఫెయిలవడం ఇష్టం లేదుట. అందుకని … ఓ నిట్టూర్పు విడిచి నాగదికి చేరుకున్నాను. నా అతిథి ఒణికిపోతోంది. ఆవిడమొహంలో ప్రేతకళ వచ్చింది.

“మీరెందుకు అక్కడికి వెళ్ళారండీ?” అంది నన్ను చూడగానే.

“ఏం?” అన్నాను.

“అలా వెళ్ళకండి. నాకు చచ్చే భయంగా ఉంది. నాకు 12 గంటలకి బస్సుంది. అంతవరకూ నన్ను ఒంటరిగా వదలకండి. నాకు చాలా భయం. ఇంట్లో కూడా మాచెల్లెలు నాపక్కలో పడుకుంటుంది,” అంది ఒణికిపోతూ.

నేను మాటాడకుండా లోపలికి వెళ్ళి ఇమ్మర్షన్ కాయిల్ బకెట్‌లో పడేసి, స్విచ్ ఆన్ చేసి వచ్చాను.

“పాపం, ఆ అమ్మాయికి ఎలాటి బాధలున్నాయో! పరీక్షలని వ్రాసింది కాని అదే అయి ఉంటుందంటారా?”

ఆవిడ ప్రశ్నలతో మళ్ళీ నిన్నటి సానుభూతి పోయి ఆవిడపట్ల ఏహ్యభావం ఏర్పడింది నాలో.

“ఈ చదువులకీ, ఈ డిగ్రీలకీ ఇంత విలువ ఇవ్వడం నాకు నచ్చదండి. నిజంగాఆ అమ్మాయి పరీక్షలభయంతోనే ప్రాణాలు తీసుకుందంటే అది చాలా ట్రాజడీ,” అందావిడ మళ్ళీ.

“ఆ అమ్మాయి జీవితం కాదండీ ట్రాజడీ. ఏదో ఒక ధ్యేయం మనసులో పెట్టుకుంది. కనీసం అంతవరకూ మెచ్చుకోవచ్చు. మీరు¬-¬మీది¬¬-నిజమైన విషాదం. మీరెందుకు బతుకుతున్నారో, ఏం సాధించదలుచుకున్నారో మీకు తెలీదు. చస్తాం, చస్తాం అంటూ నిత్యం మానసికంగా చస్తూ, భౌతికంగా చావగల చేవ లేక, బ్రతకగల నిబ్బరం లేక అయోమయస్థితిలో పడి కొట్టుకుంటున్న మీజీవితం సిసలైన విషాదం.”

ఈమాటలు అన్నానా? అనాలనుకున్నాను అనుకుంటాను.

నామాట –
ఈ కథ కూడా కథానిలయంలో చూసేవరకూ నాకు గుర్తు లేదు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
ఈకథ చదివి నేను ఉలికి పడ్డాను. కారణం ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి. ఇది నిజంగా జరిగిన సంఘటన. 1965లో జరిగింది. నేను తిరపతిలో కొత్తగా లైబ్రరీలో ఉద్యోగంలో చేరి హాస్టల్‌లో ఉన్నరోజులవి.

ఈ కథలో చేర్చని సంగతి, అప్పట్లో నేను విన్నది – వారిది బీదసంసారం అనీ, ఆ అమ్మాయి చదివి తమ్ముళ్ళనీ, చెల్లెళ్ళనీ చదివించి వృద్ధిలోకి తేవాలనీ తల్లిదండ్రులు ఆశిస్తున్నారనీ. అంటే పరీక్ష ఒక్కటే కాక ఆ కుటుంబం ఆమెమీద పెట్టుకున్న ఆశలు కూడా ఆత్మహత్యకి దోహదం చేసేయేమో.
ఆ అమ్మాయి నాకు నేను ఇప్పటికీ గుర్తుంది. కానీ ఇంతకాలం తరవాత మళ్ళీ ఇప్పుడు ఆలోచిస్తుంటే నాకు మరికొన్ని ఆలోచనలు వస్తున్నాయి.

సామాజికపరంగా ఆలోచిస్తే, స్త్రీలకి “చదువు కూడనే కూడదు” అన్న రోజులు పోయి, చదివించే స్థాయికి ఎదిగేం. “స్త్రీధనం తాకరాద”న్న నీతి పోయి, స్త్రీలసంపాదనమీద ఆధారపడే కుటుంబాలు వచ్చేయి. ఇది అభివృద్ధి అవునో కాదో నేను చెప్పలేను. ఈవిషయాన్ని మరింత సూక్ష్మంగా వివిధ కోణాలనుండి పరిశీలించవలసిన అవుసరం ఉంది ఇప్పుడు.

ఈకథలో రెండో అంశం అతిథి పిరికితనం. నాకు పిరికివాళ్ళంటే సానుభూతి లేదు. (అహంకారిని చూసినా లేదనుకోండి. అది అప్రస్తుతం). యం.ఏ. చదివినమనిషిలో ఆమాత్రం బలం లేకపోతే, ఆ చదువెందుకు అని.
కథపరంగా కలిగిన మరొక ఆలోచన – నాకు తెలిసిన ఒక ఆత్మహత్య సంఘటనని ఈకథలో వాడుకున్న తీరు. ఇదివరకోసారి “రచయితలు పాత్రలని ఎందుకు చంపుతారు?” అని ఒక వ్యాసం రాసేను. అది తాము సృష్టించిన పాత్రలగురించి. ఇక్కడ నేను వాడుకున్నది నిజంగా నాకళ్ళెదుట జరిగిన సంఘటన. ఇలా ఈకథలో వాడుకోడం సబబు కాదేమో అనిపిస్తోంది.
మీరేమంటారు?
000

(డిసెంబరు 15, 2014)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

2 thoughts on “వెనకటి నేను 6 – అసలైన విషాదం (కథ)”

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.