వెనకటి నేను 7 – పాము

అముద్రితం నాకు గుర్తున్నంతవరకూ! రచనాకాలం 1966-69 మధ్య సుమారుగా.

పగటివేషాలు(నాటిక) ప్రచురించిన ఉత్సాహంలో రాసి ఉండొచ్చు.

పాత్రలు

శ్రీనివాసరావు – తండ్రి. 45 ఏళ్ళు. పంచె, లాల్చీ, కళ్ళజోడు ధరిస్తాడు.

సీతమ్మ – తల్లి. 40 ఏళ్ళు. మంచి చీరె, బొట్టు, ఒంటినిండా నగలతో ఉంటుంది.

కామమ్మ – శ్రీనివాసరావు అక్క. దాదాపు 50 ఏళ్ళవయసు. తెల్ల చీరె గానీ, లేత కనకాంబరంరంగు చీరె గానీ కట్టుకుంటుంది. నుదుట విభూతి. కొంచెం నెరసిన తల.

గోపీ – కొడుకు. 14 ఏళ్ళుంటాయి. పొట్టి చేతుల చొక్కా, హవాయి చెప్పులు, చేతికి గడియారం అతడి అలంకారాలు.

రాధ – కూతురు. 12 ఏళ్ళవయసు. పరికిణీ జాకట్టు, ఒంటిజడ, మెళ్ళో గొలుసు, గాజులు.

చంద్రం – గోపీ స్నేహితుడు. సుమారు అంతే వయసు. చొక్కా, పాంటు, హవాయి చెప్పులు, చేతికి గడియారం.

పాముల గురవయ్య – 40-50 మధ్య వయసు. పంచె, తలపాదా, మీసాలు, శాలువా, నాగస్వరం, పాములబుట్ట, భుజాన సంచీ.

డాక్టరు – 25-30 మధ్య వయసు. Full suit, stethoscope, leather bag, కళ్ళజోడు.

సమయం – ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలవేళ.

స్థలం – శ్రీనివాసరావుగారింట్లో హాలు. ఓ పక్క మూడు కుర్చీలుంటాయి. గదిలో ఓమూల రేడియో. ఓ కుర్చీలో శ్రీనివాసరావు పేపరు చదువుతూంటాడు. కామమ్మ ఓవార కూర్చుని రామాయణం చదువుతూంటుంది. ఆవిడకి కొంచెం దూరంగా సీతమ్మ ఓ ప్లళెంలో చిక్కుడుకాయలు విరిచి నార తీసి ముక్కలు మరోగిన్నెలో పడేస్తుంటుంది.

గోపీ స్టేజిమీదకీ లోపలికీ తిరుగుతూ, రేడియో తిప్పుతూ తిరుగుతూంటాడు.

రాధ కూచుని పువ్వులు దండ కడుతూ ఉంటుంది. కట్టడం పూర్తయింది. దండ చేతిలోకి తీసుకుని ఓమారు అటూ ఇటూ తిప్పి చూసి నీళ్ళగిన్నెలో పడేస్తుంది. పనికిరాని మొగ్గలూ, తొడిమలూ చేతిలోకి ఎత్తుకుని లోపలికి వెళ్ళి పారేసి వస్తుంది. రెండు నిముషాలపాటు ఊరికే కూచుంటుంది.

రాధ: (విసుగ్గా) ఛీ. ఈ ఆదివారం వస్తే ఇంతే. ఏం తోచి చావదు.

గోపీ: ఎలా తోస్తుంది (రేడియో తిప్పుతూ ఉంటాడు) అలా పనీ పాటూ లేకుండా కూచుంటే.

రాధ: నేను కూచుంటే నీకేం?

గోపీ: అమ్మకి ఆ చిక్కుడుకాయలు ఈనెలు తీసి ఇవ్వకూడదూ?

రాధ: నన్నెవరూ ఇప్పుడు సలహా అడగలేదు.

గోపీ: అయితే తోచడంలేదనకు.

రాధ: నేన్నీతో అన్నానా?

సీతమ్మ: ఎందుకర్రా అస్తమానం అలా కాట్లకుక్కల్లా దెబ్బలాడుకుంటారు.

రాధ: వాణ్ణి చూడు మరి.

గోపీ: దాన్నే చూడు.

శ్రీని: అబ్భబ్బ ఎవరూ ఎవర్నీ చూడఖ్ఖర్లేదు. ఒరే గోపీ నువ్వవతలికెళ్ళు.

గోపీ: మధ్య నేనేం చేసేనండీ నన్ను పొమ్మంటారు?

శ్రీని: ఏఁవీ చెయ్యలేదు. ఇక్కడ ఊరికే గొడవ చెయ్యొద్దు అంటున్నాను. అంతే.

గోపీ: సరే. నేను పోయి పడుకుంటాను.

రాధ. ఇప్పుడే కదా లేచేవు. మళ్ళీ నిద్రా?కుంభకర్ణుడురా తండ్రీ.

గోపీ: నేనేం చేస్తే నీకేం?

సీత: (రాధతో) మళ్ళీ ఎందుకు వాణ్ణలా ఎద్దేవా చేస్తావు? (గోపీ లోపలికెళ్తాడు). వెళ్ళి బుట్ట పట్రా. ఈ చిక్కుడుకాయలు చాలేట్టు లేవు.

(రాధ లోపలికెళ్ళి కూరలబుట్ట తీసుకొస్తుంది.)

(గోపీ స్నేహితుడు చంద్రం వస్తాడు.)

చంద్రం: గోపీ ఉన్నాడాండి?

సీత: రావోయ్ చంద్రం రా. (లోపలికి చూస్తూ) ఒరేయ్ గోపీ, చంద్రం వచ్చేడు చూడు.

శ్రీని: ఏవోయ్. ఊర్నించి ఎప్పుడొచ్చేవు?

చంద్రం: నిన్న వచ్చేనండి.

శ్రీని: అందరూ బావున్నారా?

చంద్రం: బావున్నారండి.

గోపీ: (లోపల్నించి వస్తూ ఏఁవిరా కిందటివారమే వస్తానన్నావు.

చంద్రం: (మెల్లిగా నవ్వుతూ) మామాఁవయ్య రానియ్యలేదు.

రాధ: మరేఁ పిల్లనిచ్చే మాఁవగారు కదూ.

గోపీ: ఆ పెద్దమాటలే వద్దన్నాను.

చంద్రం: నువ్వేం చేసేవు శలవుల్లో?

రాధ: పెద్దగుర్రాలకి పళ్ళు తోమేడు.

గోపీ: (కోపంగా) మళ్ళీ అను.

సీత: అబ్భబ్భ ఎందుకర్రా అలా కీచులాడుకుంటారు?

గోపీ: అదేనా నన్ను ముందన్నది!

రాధ: (గోపీతో) మరి నన్నస్తమానం చిన్నదానివి చిన్నదానివి అంటూ దెప్పడం ఎందుకూ?

శ్రీని: అసలు ఇద్దరూ వాదించుకోకుండా ఉండలేరు.

చంద్రం: పదవోయ్ అలా పార్కుకెళ్దాం. ఏం తోచడం లేదు.

రాధ: అన్నట్టు చంద్రం! నువ్వెళ్ళేముందు తీసిన ఫొటోలు వచ్చేయి చూస్తావా?

చంద్రం: ఎలా వచ్చేయి?

రాధ: మా అన్నగారు తీసినవాటితో పోలిస్తే అద్భుతం.

గోపీ: ఆ ఊసెత్తొద్దని చెప్పానా?

రాధ: నేను చంద్రం తీసిన ఫొటోలగురించి కదా మాటాడింది.

గోపీ: నీకు నేను తీసిన ఫొటోలు బాగులేవూ?

రాధ: (వేళాకోళంగా) ఆఁహాఁ! ఎందుకు బావులేవూ. కోతిలా ఉన్నాను వాటిలో.

గోపీ: (వెక్కిరింతగా) సరే. తమరిమొహం తీరే అంత. నేనేం చెయ్యను?

రాధ: చూడమ్మా, నన్ను కోతి అంటున్నాడు.

చంద్రం: (గోపీతో) తీసుకురారా ఆ ఫొటోలు. నేం చూసి చెప్తాను.

సీత: నువ్వు వాడిని అంటే వాడు నిన్నన్నాడు.

గోపీ: అలా బుద్ధి చెప్పమ్మా దానికి.

రాధ: (నాలిక బయట పెట్టి గోపీని వెక్కిరిస్తుంది. చంద్రంవేపు తిరిగి) ఉండు చంద్రం. నేను (తెస్తాను.

గోపీ: (చంద్రంతో) నువ్వు తీసిన కొన్ని స్టిల్స్ చాలా బాగా వచ్చేయి.

చంద్రం: (నవ్వుతూ) స్టిల్ లో కనీసం ఒక సుళువుంది. సబ్జక్టు కదలదు కదా.

 

(రాధ లోపల్నుంచి అమ్మో అంటూ గట్టిగా అరుస్తుంది. రంగంమీద అందరూ ఏమిటేమిటంటూ గబగబ లోపలిగుమ్మంవేపు వెళ్తారు. రాధ ఒణికిపోతూ ఏడుస్తూ వచ్చి సీతమ్మచేతుల్లో వాలిపోతుంది.)

రాధ: (ఏడుపుమధ్య) అన్నయ్య … ఆఁ … అన్న పెట్టెలో .. పాం … కరిచింది (వగరుస్తూ పడిపోతుంది.)

సీత: అయ్యో, అయ్యో పాముటండీ.

శ్రీని: ఆఁ, పామా?

చంద్రం: పామే!

కామమ్మ: అయ్యో పామొచ్చిందే ఇంట్లోకి?

చంద్రం: ఒరే కర్ర తే.

శ్రీని: (రాధమీదకి వంగి చూస్తూ, సీతమ్మతో) ఓ గుడ్డముక్క తీసుకురా. గట్టిది.

(సీతమ్మఒళ్ళో రాధ ఉండడంచేత ఆమె లేవదు.

ఇక్కడినుండి చివరివరకూ రాధ అమ్మో, బాబో, నొప్పి, అంటూ అనేకరకాలుగా బాధ పడిపోతూ ఉంటుంది.)

 

కామమ్మ: నాగుమయ్యా! లా చేసేవేం తండ్రీ!

సీత: పాములవాణ్ణి పిలవరా.

శ్రీని: గోపీ, పరుగెత్తుకెళ్ళి డాక్టర్ని పిలుచుకు రారా. (కామమ్మతో) అక్కయ్యా, ఓ గుడ్డపీలిక తీసుకురా గట్టిది తొందరగా.

చంద్రం: ఏదీ, పామెక్కడుందో చూడనివ్వండి.

సీత: ఒద్దు నాయనా చంద్రం అది విషప్పురుగు. దానిజోలికెళ్ళకు.

(కామమ్మ లోపల్నించి గుడ్డపీలిక తెచ్చి శ్రీనివాసరావుకి ఇస్తుంది. ఆయనరాధ జబ్బమీద ఆ గుడ్డపీలిక కడతారు.)

శ్రీని: (గోపీతో) అలా గవస్తంభంలా నించుంటావేరా?

సీత: పాములవాణ్ణి కేకెయ్యరా. మంత్రం వేయించాలంటుంటే.

చంద్రం: అసలు పామేదండీ.

శ్రీని: (గోపీతో) డాక్టర్నిరా.

సీత: పాములవాణ్ణి పిలిపించమంటుంటే.

కామమ్మ: ప్రతిసంవత్సరం పుట్టలో పాలు పోస్తున్నాం. ఈ సంవత్సరమే అవలేదు. అలిగేవా తండ్రీ.

గోపీ: ఓసే రాధా, ఎక్కడే కరిచింది?

సీత: (గట్టిగా అరుస్తూ) వెళ్ళరా త్వరగా. పాములవాణ్ణి పిలుచుకురమ్మంటే నీక్కాదూ.

శ్రీని: (గోపీని గుమ్మంవేపు తోస్తూ) డాక్టర్ని తీసుకురా.

చంద్రం: గోపీ, కర్రెక్కడుందో చెప్పి వెళ్ళు.

కామమ్మ: (చంద్రంతో) ఒద్దు బాబాూ, నట్టింట నాగమయ్యని చంపరాదు. నువ్వూరుకో.

సీత: పాములవాణ్ణి ఎవరైనా పిలుస్తారా లేదా?

శ్రీని: డాక్టర్నంటుంటే

గోపీ: అబ్భబ్బ ఏమిటండీ మీరేమో డాక్టరంటారు. అమ్మేమో పాములవాడంటుంది. వాడేమో …

శ్రీని: అసలు ముందిక్కడ్నుంచి కదులు.

సీత: గౌరమ్మ కల్లుపాకదగ్గరుంటాడు, పరిగెట్రా.

గోపీ: వెళ్తున్నా. (చంద్రంతో) నీమాట మాత్రం కొట్టెయ్యడం ఎందుకు? వెనకవసారాలో ఉంది చేపాటికర్ర.

సీత: తొందరగా వెళ్లరా బాబూ.

శ్రీని: డిస్పెన్సరీలో ఆయన లేకపోతే కాంపౌండరునేనా రమ్మను వెంటనే.

(గోపీ సరే సరే అంటూ వెళ్ళిపోతాడు.)

సీత: (ముక్కు తుడుచుకుంటూ) రామచంద్రా, నాబిడ్డని దక్కించు తండ్రీ.

కామమ్మ: (సీతమ్మతో) ఆపదమొక్కులూ సంపదమరుపులూ అంటారు. ఏ మొక్కైనా మొక్కి మరిచిపోయేవేమో జ్ఞాపకం తెచ్చుకో తల్లీ.

సీతమ్మ: (నీరసంగా తల అడ్డంగా ఆడిస్తూ) లేదండీ. నేనేమీ మొక్కుకోనూ లేదు మరిచిపోనూ లేదు.

(శ్రీనివాసరావు రాధకి పేపరుతో విసురుతూ నుదురు తుడుస్తూ ఆదుర్దాగా గుమ్మంవేపు చూస్తూ ఉంటాడు.)

చంద్రం: అసలు రాధ ఏగదిలోకి వెళ్ళిందండీ?

సీతమ్మ: మధ్యగదిలోకి. నువ్వటు వెళ్లకు బాబూ.

చంద్రం: ఫరవాలేదండీ. ఓసారి కుడితే పాముకి మళ్ళీ అంత వెంటనే విషం సమకూరదు.

కామమ్మ: చంద్రంబాబూ నువ్వు కాస్త ఆగు నాయనా.

శ్రీని: చూడు చంద్రం గోపీ వస్తున్నాడేమో.

కామమ్మ: ఏమో ఏ పుట్టలో ఏపాముందో అని … నేనే రెండు చెంబులు నీళ్ళు గుమ్మరించుకుని సుబ్బారాయుడికి దణ్ణం పెట్టుకుని వస్తాను. (చంద్రంతో) నువ్వు మాత్రం మధ్యగదిలోకి వెళ్ళకేం. (లోపలికి వెళ్తుంది).

చంద్రం: (గుమ్మంవరకూ వెళ్ళి చూసి) గోపీ వస్తున్నాడండి.

సీతమ్మ: పాములవాణ్ణి తీసుకొస్తున్నాడా?

శ్రీని: డాక్టరు కూడా వస్తున్నాడా?

చంద్రం: గోపీతో వస్తున్నవాడు డాక్టరులా లేడండి.

సీతమ్మ: (నిట్టూరుస్తూ) హమ్మయ్య, అమ్మా, రాధమ్మా ఎలా ఉందే (రాధమొహంలోకి చూస్తుంది ముందుకి ఒంగి).

శ్రీని: కాస్త దానికి ఊపిరాడనియ్ (సీతతలని వెనక్కి తోస్తూ)

సీతమ్మ: నేనేం చేసేనండి.

(గోపీ పాములవాడితో ప్రవేశిస్తాడు.)

సీతమ్మ: వచ్చేవా గురవయ్యా. చూడు బిడ్డని నాగుబాము కాటేసింది.

పాములవాడు: దండాలమ్మగారూ. దండాలు బాబూ.

సీతమ్మ: ముందు పిల్లని చూడరా.

పాములవాడు: మరేం బయంనేదమ్మగోరూ. నాను మంతరంఏసినానంటే ఎసుమంటి ఇసంవైనా ఇట్టే దిగిపోవాల.

శ్రీని: డాక్టరుగారేరిరా?

గోపీ: (రాధమీదకి ఒంగి చూస్తూ) ఎలా ఉందమ్మా? (తండ్రితో) వస్తున్నారండీ. ఇప్పుడే పది నిముషాల్లో వస్తానన్నారు.

శ్రీని: అర్జంటని చెప్పలేదుట్రా.

గోపీ: చెప్పేనండీ (రాధతో) ఎలా ఉందే?

సీతమ్మ: తొందరగా మంత్రం వెయ్యిరా.

పాములవాడు: బయ్యంనేదమ్మగోరూ. నామంతరానికి నల్లతాసు ఇసంగూడ నీరయిపోతాది (సంచీలోంచి చిన్న చ్న్న సంచులు తీస్తాడు.)

శ్రీని: (గోపీతో) ఏమిట్రా ఇంతసేపేమిటి ఆ డాక్టరుగారు రావడానికి.

చంద్రం: (పాములవాడితో) నిజంగా నువ్వెప్పుడేనా నల్లతాచుకాటుకి మంత్రం వేసేవా?

గురవయ్య: (సీతమ్మతో) బాబుగోరికి నమ్మకం నేదు. (చంద్రంతో) నిజింవే బాబూ. ఇదిగో ఈ శాలువ. కల్లేపల్లి రాజావోరి బొట్టెడికి పురుగు కుడ్తే మంతరంఏసినాను.

సీతమ్మ: ఒరేయ్, కథలు చెప్తూ కాలక్షేపం చేస్తావేంటి. పిల్లని చూడరా ముందు.

గురవయ్య: పర్వానేదమ్మగోరూ. ఇదిగ ఈస్సరేరు. కాసింత పసుపులో దారం ముంచి అమ్మాయిగోరిసేతిక్కట్టండి. నాను పాంని మంతరం ఏస్తను. (చంద్రంతో) ఆ బొట్టెడు నాను మంతరంయేసీసరికి ఇట్టె లేసి కూసున్నడు. రాజావోరు గుమ్మయిపోయి తీస్కొర అని పైమీని శాలువ నామీదికి ఇయిరేసినారు.

చంద్రం: (నవ్వుతూ) మంత్రాలకి చింతకాయలు రాల్తాయంటావు.

గురవయ్య: (నవ్వుతూ) బాబుగోరికి నిదర్సనం గావాల. పాంవేగదిలో సూసినారమ్మా?

శ్రీని: ష్ ష్. నేనే వెళ్ళి చూసొస్తాను ఆ డాక్టరు మహానుభావుడెక్కడున్నాడో. (బయటికి వెళ్ళిపోతాడు).

సీత: మధ్యగదిలో ఉంది, పద అటూ …

(పాములవాడు సీత చూపినవేపు నడుస్తాడు నాగస్వరం తీసుకుని.)

కామమ్మ: ఒరే, అయ్యయ్యో అటు వెళ్ళకురా. నడవలో ఒడియాలు ఎండ ఒరే, అయ్యయ్యో అటు వెళ్ళకురా. నడవలో ఒడియాలు ఎండబెట్టేను.

సీత: అదేఁటండీ. ఒడియాలు మైల పడిపోతాయని పాముని నట్టింట్లో పెట్టుక్కూచుంటామా వదినా? (గురవయ్యతో) పద, పద, చూడు ఆ పామెక్కడుందో.

కామమ్మ: ఆగరా వెధవా. కనీసం ఆ వడియాలు అక్కడ్నించి తీసిందాకానైనా ఆగు. (ఆదరాబాదరా లోపలికి వెళ్ళిపోతుంది.)

గురవయ్య: బయ్యంనేదమ్మగోరు. నేం పడతగంద.

గోపీ: అదుగో మాటలోనే డాక్టరుగారు వచ్చేరు.

డాక్టరు: సారీ ఆలస్యమయింది. అర్జంటు కేసొకటొచ్చి పడింది.

శ్రీని: (కోపం దాచుకోడానికి ప్రయత్నిస్తూ) ఫరవాలేదులెండి. అమ్మాయి ఇందాకట్నుంచీ అల్లల్లాడిపోతోంది. త్వరగా చూడండి.

సీత: ముందు వాణ్ణి మంత్రం వెయ్యనియ్యండి.

డాక్టరు: What nonsense. ఈ మంత్రాలూ చింతకాయలూ అంటూ మనవాళ్ళు పట్టుకు వేళ్ళాడ్డం మానకపోతే దేశం ఎలా బాగుపడుతుందండీ?

కామమ్మ: (లోపల్నించే) ఎవరి నమ్మకాలు వాళ్ళవి నాయనా. ఈ సూదిమందులు ఇప్పుడొచ్చేయి కానీ మన పూర్వులంతా నమ్మకాలమీదే బతికేరు. వారికేం తక్కువయిందనీ.

గురవయ్య: (గుమ్మంలోకి తొంగి చూస్తూ) అమ్మగోరూ, లోనికి రావొచ్చా?

కామమ్మ: ఉండరా. అలా కదం తొక్కితే ఎలా. మడి కట్టుకోవాలా, ఇవన్నీ దాగరలోకి తియ్యాలా.

సీత: వీళ్లవాదనలతోనే నాబిడ్డ ఆయుష్షు తీరిపోతుందో ఏమో (సన్నగా ఏడుపు మొదలు పెడుతుంది. లోపలికి తొంగి చూస్తూ). వదినా కాస్త త్వరగా కానిద్దురూ. పిల్ల ప్రాణం కడ బట్టిపోతోంది.

డాక్టరు: (రాధ చెయ్యి పట్టుకుని నాడి పరీక్షిస్తూ) ఎంత సేపయింది పాము కాటేసి?

సీత: గంటకి పైనే అయింది.

శ్రీని: గంటెక్కడ, మహా అయితే ఓ అరగంటయి ఉంటుంది.

చంద్రం: లేదండి. నేను వాచీ చూస్తూనే ఉన్నాను. పది నిముషాలయిందంతే.

సీత: (బొంగురుగొంతుతో) ఆవాచీ తిరుగుతోందా నాయనా?

డాక్టరు: సరేలెండి. Anti-snake venom injection ఇస్తాను.

శ్రీని: ప్రమాదం లేదు కదండీ.

సీత: (గురవయ్యతో) ఇంకా అలా నిల్చుంటావేమిటి. లోపలికెళ్ళి చూడరా ఆపామేమూల నక్కిందో.

కామమ్మ: (లోపల్నించి) అయింది, రమ్మను.

(గురవయ్య లోపలికెళ్తాడు. సీతమ్మ బెరుగ్గా అతని వెంబడిస్తుంది).

డాక్టరు: ఇంజెక్షనిస్తున్నాను. fluids ఫాలో అప్ అవసరం అనుకోను. (సంచీ తెరిచి సరంజామా తీస్తాడు.)

సీత: ఏరా గురవా, పాము దొరికిందా?

గురవయ్య: (లోపల్నించి) వస్తున్నా తల్లీ. పాం కనిపిచ్చింది. ముద్దుగ మూల ముడుసుకు పడుకున్నాది.

సీత: త్వరగా రా. పిల్లప్రాణం కడగట్టిపోతోంది.

శ్రీని: డాక్టరుగారు ఇంజెక్షనిస్తున్నారు కదా. కోలుకుంటుందిలే. గాభరా పడకు.

సీత: అదేదో త్వరగా కానియ్యండి బాబూ.

శ్రీని: పోనీ, ఆస్పత్రికి తీసికెళ్దామా. అక్కడ వసతులు బాగుంటాయి కదా.

డాక్టరు: ఉండండి. Reaction ఎలా ఉంటుందో పది నిముషాల్లో తెలుస్తుంది. అవసరం అయితే తీసుకెళ్దాం.

చంద్రం: టాక్సీ పిలవమంటారా?

శ్రీని: తీసుకురా. అప్పటికప్పుడు దొరకదేమో.

డాక్టరు: అఖ్ఖర్లేదండి. నేనొచ్చిన టాక్సీ ఉండాలి గుమ్మంలో. అవసరమయితే దాన్లో వెళ్దాం. అన్నట్టు గోపీ వెళ్ళి ఆ డ్రైవరుతో చెప్పు, కాస్త ఆలస్యం అవుతుందని.

శ్రీని: (నోటు ఇస్తూ) ఈ పది రూపాయలూ ఇచ్చి ఉండమని చెప్పు.

(రాధ నీరసంగా కదిలి దాహం అంటుంది.)

సీత: (నిట్టూర్చి) హమ్మయ్య, పిల్ల తేరుకుంటోంది. గోపీ నీళ్ళు తీసుకురా. రామయ్య తండ్రీ బిడ్డని బతికించేవు (పైకి చూస్తూ నమస్కరిస్తుంది)

కామమ్మ: బతికించేవా నాగుమయ్యా. వచ్చే నాగులచవితికి ఉత్సవం చేయిస్తాం.

డాక్టరు: ఇంక ఫరవాలేదండి. ఆస్పత్రికి తీసుకెళ్ళఖ్ఖర్లేదు.

శ్రీని: అంతేనంటారా? నమ్మకమేనా?

డాక్టరు: నమ్మకమేనండి. బాగా భయపడింది కనక ఈరోజుకు విశ్రాంతి తీసుకోనివ్వండి. ఊరికే మీరు ఆరాటపడిపోయి ఆ అమ్మాయిని హైరాన పెట్టకండి.

గోపీ: గ్లాసుతో మంచినీళ్ళు తెస్తాడు.

సీత:(మంచినీళ్ళగ్లాసు రాధనోటిదగ్గర పెట్టి), నిదానంగా తాగు తల్లీ. ఎలా ఉంది ఒంట్లో.

(రాధ రెండు గుక్కలు తాగి మళ్ళీ తల్లిఒడిలో పడుకుంటుంది.)

శ్రీని: రక్షించేరు డాక్టరుగారూ. మీఋణం తీర్చుకోలేం.

డాక్టరు: అదేముందిలెండి. నాఉద్యోగధర్మం.

(లోపల్నించి గురవయ్య నవ్వుతూ పాముని పట్టుకొస్తాడు.)

గురవయ్య: ఇది పాం కాదమ్మగోరు. రబ్బరు బొమ్మ.

శ్రీని: (ఆశ్చర్యంగా) హా. రబ్బరా?

డాక్టరు: ఏంటీ, పాము కాదూ?

సీత: బొమ్మా?

కామమ్మ: సరిగా చూసేవా? నీకు కనిపించలేదేమో.

(గోపీ దొంగలా గుమ్మంవేపు జారుకుంటూ చంద్రంతో పదరా అంటాడు

రాధ నెమ్మదిగా లేచి కూర్చుంటుంది.)

శ్రీని: (గురవయ్యచేతిలోంచి రబ్బరుపాము తీసుకుని, గోపీతో) తమరిపనేనా?

గోపీ మాట్లాడడు.

సీత: (గురవయ్యతో) సరిగ్గా చూసేవా? ఏమూలైనా నక్కి ఉందేమో అసలుపాము?

కామమ్మ: మరేఁ సరిగ్గా చూడు మరోసారి. రబ్బరుబొమ్మకి పిల్ల అలా కడగట్టిపోతుందా?

డాక్టరు: (విసుగునణుచుకుంటూ) సరే. నేను వెళ్ళొస్తాను శ్రీనివాసరావుగారూ.

శ్రీని: సారీఅండి మీకు అనవసరంగా శ్రమ ఇచ్చినందుకు. మీ బిల్లు …

డాక్టరు: ఫరవాలేదులెండి. తరవాత పోస్టులోపంపిస్తాను. (వెళ్ళిపోతాడు).

(గోపీ చంద్రం చెయ్యి పుచ్చుకుని లాగుతూ బయటికి పోబోతాడు)

శ్రీను: (గుమ్మానికి అడ్డం నిల్చుచుని) ఏమిట్రా ఈ వెధవపని?

సీత: (కోపంగా) ఒళ్ళు కొవ్వెక్కి… (లేచి కూరలబుట్ట తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది.)

కామమ్మ: మూడు పొద్దులు రెక్కలు ముక్కలు చేసుకుని పెట్టిన ఒడియాలు నీధర్మమా అని మైల పడిపోయేయి కదరా భ్రష్టుడా! (గోపీబుగ్గమీద పిడికిలితో పొడిచి వెళ్ళిపోతుంది.)

గోపీ: (బెదురు బెదురుగా తండ్రిని చూస్తూ) అది ఏం తోచడం లేదంటే, తమాషాకి చేసేను.

గురవయ్య: దండాలు బాబూ, నానెల్లొస్త.

శ్రీని: ఆఁ. వెళ్ళు. ఉండుండు. ఇదుగో, ఈ రెండు రూపాయలు తీసుకుపో.

గురవయ్య: ఎందుకు బాబూ. పాంని పట్టనేదు గంద.

శ్రీని: ఫరవాలేదులే. వచ్చేవు కదా. తీసుకో.

గురవయ్య: ఒక్క పావలా ఇప్పిచ్చండి. తంవరిపేరు సెప్పుకు టీనీలు తాగుత.

(శ్రీనివాసరావు పర్సు తీసి పావలా అతనిచేతిలో పెడతాడు. గురవయ్య దండాలు పెట్టుకుంటూ వెళ్ళిపోతాడు.

రాధ లేచి గోపీ వీపుమీద ఓ దెబ్బ వేసి, చుర చుర చూస్తూ లోపలికి పోతుంది.)

శ్రీని: (గోపీతో) నువ్వు చేసిన వెధవపనికి యాభై రూపాయలు డాక్టరు బిల్లు, పది రూపాయలు టాక్సీ. మళ్ళీ ఇలాటి వేషాలేస్తే స్టేషనులో మూటలు మోయించి వసూలు చేస్తాను. తెలిసిందా?

గోపీ భయంభయంగా వెనక్కి అడుగేసి తెలిసిందన్నట్టు తలూపుతాడు.

(తెర పడుతుంది.)


ఇది ఇప్పుడు చూస్తూంటే కలిగిన సందేహం నిజమైన పాము కాకపోతే రాధ ఎందుకు అంత ఆర్భాటం చేసిందన్నది. భయంవల్ల కావచ్చు, అందరూ చూపుతున్న అక్కర కావచ్చు, లేదా ఇది గోపీ పనే అని గ్రహించి అన్నగారికి పడబోయే చీవాట్లు తలుచుకుని ఎదురెత్తు ఆడి ఉండవచ్చు.

మరో గమనించవలసిన అంశం – డాక్టరు బిల్లు మామూలే అయినా పాములవాడు మాత్రం డబ్బు పుచ్చుకోడానికి ఒప్పుకోకపోవడం. ఇలాటివి నాదృష్టిని ఆకట్టుకుంటాయి అప్పటికీ ఇప్పటికీ కూడా.

 

 

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.