వెనకటి నేను 9 – ఛాయా (వి)చిత్రాలు

ఛాయా (వి)చిత్రాలు
శారదా పత్రిక 15-8-171లో ప్రచురించబడింది.

సినిమాలమోజుతో సరిసమానంగా ఫొటోలమోజులు పెరిగిపోతుంటే పోనీ పాపం అనిపించినా, ఉద్యోగ ప్రదాతలు కూడా చదువుల కొలమానాలూ, వంశక్రమంతోపాటు బొమ్మ కావాలనడంతో మహో చిక్కొచ్చిపడింది.

“ఫొటోగ్రాఫీలో ఏఁవుంది? ఆ నల్లడొక్కులో రీలుముక్క దూర్చేసి షట్టరు టప్ టప్మనిపించేస్తే, అదే వచ్చేస్తుంది, అదీ ఓ కళేనా?” అని అక్క ఎన్ని సార్లంటే, అన్ని సార్లూ చిన్న “నీకేం తెలుసు ఫొటోగ్రఫీ అంటే. లైటు చూసుకోవాలి, దూరం చూసుకోవాలి, కోణం చూసుకోవాలి. అసలు సినిమాతీరలందరూ అంత అందంగా కనిపించడానికి కారణం ఏఁవిటీ? లక్స్ టాయిలట్ సోప్ అనుకుంటావు నువ్వు. కానే కాదు తెలుసా ఫొటోగ్రఫీ అంటే. కావలిస్తే నిన్నిప్పుడు హేమమాలినిలాగా తియ్యగలను …” ఇలా సాగదీస్తాడు, అక్క ఏడ్చావులే పొమ్మనేవరకూ.

“కుఠోలు దిగితే పిల్లలు చిక్కిపోతార”ని బామ్మలు మొత్తుకునేరోజులు పోయేయి.
ఫోటోఫోబియా – వెర్రి వెయ్యి విధాలు – స్టిల్ ఫొటోగ్రాఫర్లు – బహు మంచివాళ్ళు. చెయ్యి విరిగిన కుర్చీ, మూడు కాళ్ళబల్ల, ఎండిపోయిన బెండకాయ, బోర్లించిన చెంబుమీద నిలబెట్టిన గుళ్ళూ – ఇల్లా జడప్రపంచం లో ప్రతి వస్తువుని ఛాయాచిత్రీకరించుకుంటూ పోతారు. ప్రాకృతేయులు (ప్రకృతిని ప్రేమించువారు) కూడా ఫరవాలేదు – ఇరుసంజలా మంగలిపొదిలా కెమేరా మెళ్ళో తగిలించుకుని ఇంట్లోంచి పారిపోతారు – వీళ్ళవల్ల ఎడిషనల్ ఎడ్వాంటేజీ ఏదైనా ఉందంటే, “కాఫీ చల్లారిపోతోంది లేవండర్రా, మళ్ళీ నేను మడి కట్టుకోవాలీ” వంటి ఉదయగానాలు తప్పిపోవడమే.

ఇంకొంతమంది అదేదో స్టడీ అంటారు – పళ్ళూడిపోయిన ముసలిమొహాన్నీ, కళ్ళు లేని గజ్జికుక్కనీ ఆర్టుపేపరుమీద కెక్కించేస్తారు. వీరితో రవంత బాధ – మనఖర్మానికి మనం కూచుని వ్రాసుకుంటూనో చదువుకుంటూనో ఉన్నప్పుడు – “ఇటు చూడు,” “తల కొంచెం వంచు”, “ఈపక్కకి” “అటు…” – అంటూ కెమెరాని తుపాకిలా ఉపయోగిస్తూ ప్రాణం తీస్తారు. అది పదహారెమ్మెమ్మయితే మరి అడక్కండి. ఒకటో అరో స్నాపులు కావాలని రీలెక్కించడం, మిగిలిన ముప్ఫైఒకటో ఇరవైయారో స్నాపులకోసం దిక్కులు చూడడం. కొత్తలో ఒక మూడు కాకపోతే ఏడు – పోనీ పదనుకోండి – రీల్స్ కేమీ ఫరవాలేదు. తర్వాతదొక పెద్ద బోరయిపోతుంది – అన్లెస్ – టూరింగ్ టాకీస్‌లాగ వారొక ట్రావెలింగ్ ఫొటోగ్రాఫరయితే తప్ప.

పబ్లిక్ ఫంక్షనులలో గ్రేటెస్ట్ న్యూసెన్స్ ఎవరని నన్ను ఎవరైనా అడిగితే తడుముకోకుండా చెప్పేస్తాను మాన్ విత్ ది బాక్స్ అని. స్పీకరుకి కొంచెం కొత్తనుకోండి. కుర్రాళ్ళప్రెసిడెంటు చాలా ఉత్సాహవంతుడు. అందుచేత కొత్తసూటు ఎక్స్‌ట్రా ఇస్త్రీ చేయించి, లాక్టోకాలమైన్ యార్డ్లీలతో ధగద్ధగాయమానంగా విజయం చేస్తాడు. సభాపతి మాత్రం పగలంతా పని చేసి ఏడుప్మొహంతో, కాలే కడుపుతో గోధూళివేళ ఇలు చేరబోయే దిగంబరకవుల గుమాస్తాలాగా నిర్లిప్తంగా కూచుని ఉంటాడు. అదేపనిమీద ప్రత్యేకంగా ఆహ్వానించబడిన వక్త మూడ్రోజులు ముందుగా తయారు చేసుకున్న స్పీచీలో వేయవలసిన జోకులు మరిచిపోకుండా జాగ్రత్త పడుతుంటాడు. బల్లమీద పూలదండలూ, కుండీలూ, ముగ్గురికీ ఉమ్మడిగా రెండు మైకులూ ఉంటాయి. శ్రోతలలో రెస్ట్‌లోస్‌నెసు కనిపించినట్టనిపించి జోకు వేద్దామని స్పీకరు మహాశయుడు మైకుదగ్గర నోరు పెడతాడు. సరిగ్గా అదే సమయానికి క్లిక్ మంటుంది ఓ మూల. స్టేజంతా మెరుస్తుంది ఓ క్షణం. పాపం స్పీకరు తేరుకుని స్పీచి కొనసాగించడానికి పది క్షణాలు పడుతుంది – ఆ అనుభవం కొత్త కాకపోతే. మరొక ఔత్సాహిక కళాకారుడు మరొక మూలనించి షూట్ చేస్తే వారిచిత్రంలో వీరూ, వీరిచిత్రంలో వారూ – అదొక అందం.

అటుపిమ్మట ఓ డాన్సో డ్రామానో ఉంటే మరీ విజృంభించిపోతారీ చిత్రవీరులు. ఓ వేపు విశ్రాంతిగా వెనక్కి జారబడీ, పక్కలకి ఒరిగీ కబుర్లు చెప్పుకుంటున్న శ్రోతలందరూ ప్రేక్షకులై నిటారుగా సర్దుకుంటారు. ఫరెసెంకడ్ టైము మీకు నీరసం ఆవహించి, తెర తీయగ రారేమో అనుకునేవేళకి తెర తీస్తారు. కుందనపు బొమ్మవంటి చిన్నదొకతె సర్వాభరణభూషితయై సాంప్రదాయకపద్ధతిలో సభకి వందనం చేసి నిలబడతుంది. అయ్యా! అప్పుడు తమరికి కనిపించేదేమిటి? ముద్దులొలుకు చిన్నారి అందాలమోము కాక – మీకు మూడు గజాలకి ముందుగా నీటిలో బంతిలా సమ్మర్ క్రాపొకటి లేస్తూ కనిపిస్తుంది. వైర్ వర్కుమీద లాగినట్టు ఆ తల ననుసరించి, ఓ టెర్లిన్ షర్టు – ఓకుర్చీ మీదెక్కిన టెర్లిన్ పాంటూను. ఆ క్షణంలో వారిని చీల్చి చెండాడాలని మీకు ఉన్నా, అందమైన అమ్మాయిని ఆ వ్యూఫైండరులో ఫోకస్ చేస్తున్న ఆ అదృష్టవంతుడి పృష్ఠభాగాన్ని తిలకిస్తూ పళ్ళు నూరుతూ ఉండిపోతారు మీరు. మరీ విసుగెత్తినప్పుడు ముందున్నవారిని పొడిచి ఆ ముందున్నవారితో అతడిని కాస్త తప్పుకోమని చెప్పమని ఆ ముందున్నవారితో … ఇలా గొలుసుకట్టుగా ప్రారంభించిన మీ వార్త ఆ మానవుడికి చేరేసరికి మొదటిరంగం ముగిసిపోవచ్చు. లేదా ఆ వార్తనందుకున్న ఫొటోగ్రాఫరుడు ఓ మారు వెనుదిరిగి అలవోకగా తల విసిరి తనపనిలో మగ్నడయిపోవచ్చు.

ఛాయాచిత్రాలు తీసే వెర్రి కొందరిదైతే తీయించుకునేవెర్రి కొందరిది. ఏ కాలేజీ గ్రూపుఫొటోనో తీసి చూడండి. మందస్మితవదనారవిందభాసితుడననుకునే ఒక తమ్ముడు సమయానికి చిరునగవు చిందిస్తాడు. మరుక్షణంలో బావురుమని ఏడవబోయేలా పడుతుంది ఫొటోలో. తన ప్రొఫైలు రాజేంద్రకుమార్‌ని జ్ఞప్తికెలయించగలదనుకున్న విద్యార్థి ఠపీమని పక్కకి తిరిగిపోతాడు క్లిక్ మనిపించేవేళకి. ఈ పోజు చూస్తే ప్లెయిన్ సిమెంట్ గోడకిటికీలో మధ్యనుంచి అడ్డంగా తెరుచుకునే షటర్ జ్ఞాపకం వస్తుంది నాకు. ఇంక పొట్టివాళ్ళు పొడుగ్గా కనిపించడానికి మునివేళ్ళమీద చేసే ఫీట్లు, ఆడపిల్లలవెనకనో ప్రక్కనో చేరే ప్లాట్ఫారం హీరోలూ సరే సరి.

నాచిన్నతనంలో మాస్కూలికి ఏ స్కూళ్ళ ఇనస్పెక్టరొచ్చినా, ఆ స్కూలుయొక్క ఏ చరిత్రాత్మక సంఘటన జరిగినా తప్పనిసరిగా ఫొటో ఉండేది. ఆ ఫొటోలో మేష్టర్లూ, జవాన్లతోపాటు మా హెడ్ మాష్టరుగారి బావమరిది కూడా ఉండేవాడు. చాలా ఫొటోల్లో ఇలాంటి అసంబద్ధపు మనుషులను చూసి చాలామంది నవ్వుతారు కానీ నేను జాలి పడతాను.

ఒకొక్కప్పుడనుకుంటాను – ఈ మినిష్టర్లూ, వైస్ ఛాన్సలర్లూ, ఫొటోలన్నీ ఎక్కడ దాస్తారో, ఎలా దాస్తారో అని. వాళ్ళ మనవలూ, మునిమనవలూ ఈ ఫొటోలన్నీ పెట్టుకుని గెస్సింగ్ గేంలాటిది ఆడుకుంటారేమో – ఏ ఫొటో ఎప్పటిదో, అందులో ఉన్నవారెవరో ఆ తాతగారే తడుముకోకుండా చెప్పలేరేమో!


నామాట –

ఇప్పటికీ పరిస్థితి అట్టే మారలేదు. నేను 2009లో హైదరాబాదులో నేను మైకుముందు నిలబడ్డప్పుడు, ఫొటోగ్రాఫరు నాకు రెండడుగులు ఎడంగా నిలబడే అదే పనిగా ఫ్లాష్ కొడుతుంటే నాకు మాట తోచలేదు. భరించలేక చాలు నాయనా, పొమ్మన్నాను.
2. ఇప్పుడు మంగలిపొదిలాటి కెమెరాలకి బదులు చేతిలో ఫోనులోనే ఉంది కనక సౌకర్యం – ఫొటోలు తీసే సరదా అలగే ఉంది.
3. సభల్లో ఎవరిపిల్లలు స్టేజిమీద ఉన్నారో విడియో తీసేవారిని చూసి గ్రహించవచ్చు -:)

(డిసెంబరు 26, 2014)

గ్రంధకర్త మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

టపాలో చర్చించిన అంశంమీద వ్యాఖ్యానాలు తెలుగులో రాసిన వ్యాఖ్యలు మాత్రమే అంగీకరింపబడతాయి. తెంగ్లీషులో రాసిన వ్యాఖ్యలు కూడా నాకు సమ్మతం కాదు. కోరుతున్నాను

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s