కలకత్తా ఆంధ్రసంఘం, త్రయోదశవార్షిక సంచిక, 1966 లో ప్రచురించబడింది.
నామాట – ఈ శీర్షిక ఈ కథతో సమాప్తం.
ఇదొక గొప్ప కథ అనను కానీ ఇందులో ఇతివృత్తం నాకు చాలా వైయక్తికం. నాజీవితంలో నాకు చాలామందే “ఆప్తమిత్రులు” తటస్థ పడ్డారు. కొన్ని సంవత్సరాలు ఏవిధమైన సంపర్కం లేకపోయినా ఎక్కడో తటస్థపడి మామూలుగా పలకరించుకోడం కూడా జరిగింది కొన్ని సార్లు. అయినా, నాకు మిత్రత్వంగురించి కొంత అసంతృప్తి ఉంది. ఇంతకాలం అయినతరవాత తిరిగి చూసుకుంటే ఇదీ నాకు తోచిన అభిప్రాయం.
పితరులు, దారాపుత్రులూ – ఋణాలు తీర్చుకోడానికే అంటారు విజ్ఞులు. నాకు మిత్రులు కూడా అంతే అనిపిస్తోంది. రక్తబంధువులఋణం ఆర్థికం అయితే, మిత్రులఋణం సమయసంబంధి. కాలానుసారం, తటస్థపడతారు, మహోజ్జ్వలంగా, మహోత్సాహంతో ఆషామాషీగా, ఆత్మీయంగా, ఎడతెగకుండా మొదలయిన కబుర్లు ఆంతరంగికం అయిపోతాయి. “నీకు మాత్రం చెప్తున్నాను. మరెవరికీ చెప్పకు” అన్నప్పుడు, నాకు ఏదో ప్రత్యేకత అనిపిస్తుంది. ఆ తరవాత కొంతకాలానికి క్రమంగా ఇతర కార్యకలాపాలలో, ఉద్ోగాలతో, సంసారాలతో ఈ సంభాషణలు చల్లారిపోతాయి.
నేను సరిగా చెప్పలేదేమో. ఏమైనా దారాపుత్రులలాగే స్నేహితులు కూడా ఋణానుబంధమే, ఏదో సమయంలో అప్పులు తీరిపోడంగానే కనిపిస్తుంది.
– మాలతి