2014కి వీడ్కోలు చెప్పుకొను శుభసమయంలో!

గతకాలము వచ్చు మేలు వచ్చుకాలము కంటే అన్న కవిగారి సందర్భం వేరు కానీ సుమారుగా అలాటి ఆలోచనకి దీటు రాగల మరో ఆలోచన వస్తోంది నాకు. అంచేత ఈ 2014 వీడ్కోలు. ఒక వయసు వచ్చేక (కనీసం నాలాటి కొందరికి) వచ్చే కాలం లేదు పోయేకాలమే కానీ అనిపిస్తుందనుకుంటాను.

2014లో నామటుకు నాకు గొప్ప మలుపు అనిపించే సంఘటనలు జరిగేయి.

ఈ పిల్ల పెళ్ళి చేసుకోదు (క్రియాపదం గమనించాలి. చేయు కాదు. చేసుకొను) అన్న ఆలోచనకి అలవాటు పడ్డాక, తాను కోరుకున్న వరుడు దొరికేడని ప్రకటించి, ఆ యింటి కోడలయిపోయింది.

13 ఏళ్ళపాటు విజయవంతంగా కాకపోయినా ఫరవాలేదన్నట్టు నడుపుకొస్తున్న నాసైటు, తూలిక.నెట్ యాజమాన్యం సౌమ్యకి తరలించుట ముగిసింది. ఈ తరలింపు 2013లోనే మొదలయినా, కొత్తయజమానిగారి సర్వరులో ఒకొక ఫైలూ ఎక్కించడం – ఆ పైలు లో ప్రతి లైనూ దిద్దుకోవలసి రావడంతో- ఈ కార్యక్రమం ఏడాదికి పైనే పట్టింది. అంచేత 2014 కార్యక్రమంకిందే లెఖ్ఖ. నా తదనంతరం సైటు ఎలా నడుస్తుందోనన్న బెంగ లేదు ఇంక. నేనుండగానే ఆ వ్యవహారం ఎలా నడుస్తోందో చూసే మహద్భాగ్యం కూడా కలిగింది!

వెనకటి నేను” ధారావాహికగా నా తెలుగు తూలికలో ప్రచురించిన టపాలకి స్ఫూర్తి కథానిలయంవారి శ్లాఘనీయమైన కృషి. నేను మరిచిపోయినవీ, ప్రచురించేరని నాకే తెలియనివీ నాకథలు తవ్వి తీసి, కన్నులపండువగా పిడియఫ్ చేసి వారిసైటులో పెట్టి నాకొక మార్గం చూపించేరు. ఈవిషయంలో కథానిలయం సైటు నిర్వాహకులకి, ముఖ్యంగా రమణమూర్తిగారికీ, శ్యామ్ నారాయణగారికీ అనేకానేక కృతాంజలులు. అలాగే ఈ ధారావాహికని ఆదరించిన పాఠకులకి కృతాంజలి ఘటిస్తున్నాను.

పోతే నావేపునించి చెప్పాలంటే – నా సాహిత్యప్రస్థానం ఎక్కడినుండి ఎక్కడికి సాగిందో చూసుకోడానికి పనికొచ్చేయి ఈ కథలు. నాకు అర్థమయిన విషయాలు – ఇతివృత్యాలదృష్ట్యా, నాభావజాలంలో మానవతా సంబంధాలగురించిన అభిప్రాయాలు – ఒక కుటుంబంలో వ్యక్తులని తీసుకున్నా ఇద్దరు మిత్రులని తీసుకున్నా – ఆద్యంతాలా అప్పటికీ ఇప్పటికీ ఒక్కలాగే ఉన్నాయి. ఆ కథ ఇప్పుడు రాస్తే ఎలా రాసేదాన్ని అన్న ప్రశ్న అఖ్ఖర్లేదు. మిత్రత్వం విషయంలో నా ఆలోచనలు నా చివరి టపా “లోతు తెలీని ఈత”కి నామాట లో వివరించేను.

భాషలో కూడా అట్టే తేడా లేదు కానీ, ఆనాడు ప్రాచుర్యంలో ఉన్న ఇంగ్లీషుపదాలు బాగానే వాడేనని తెలిసింది. ఇప్పుడు తెలుగుపదాలు మరిచిపోతున్నవి జ్ఞప్తికి తెచ్చుకునయినా వాడాలన్న తపన ఎక్కువయింది.

తెలుగు తూలిక నాకు సంతృప్తిగానే ఉంది. వర్డ్ ప్రెస్ వారిచ్చిన వార్షిక నివేదిక సంతృప్తిగా ఉంది. నాబ్లాగుకి చోపుదారులలో కూడలి తరవాత ఫేస్బుక్కు, మాలిక, జల్లెడతో పాటు పి. సత్యవతిగారి వ్యక్తిగత బ్లాగు ఉండడం నాకు పరమానందం కలిగించింది. సత్యవతిగారూ, ధన్యవాదాలు.

నారాయణస్వామీ! వ్యాఖ్యాతలపట్టికలో మీపేరు ప్రథమస్థానంలో ఉంది. నాటపాలకి వ్యాఖ్యానాలు రాస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. traffic TEపత్రికలని పంపమని కొందరు అభిమానులు సూచించినా, నా బ్లాగులోనే ప్రచురించుకుంటే గల అదనపు సౌఖ్యం నాకు హాయిగా ఉంది. నాకు కొత్త ఆలోచన వచ్చినప్పుడూ, అచ్చు తప్పులు కనిపించినప్పుడూ దిద్దుబాట్లూ సర్దుబాట్లూ చేసుకోవచ్చు. సుప్రసిద్ధ రచయితని కాకపోవడంవల్ల, మొదటి ప్రతిలో ఇలా రాసేరు రెండో ప్రతి అలా రాసేరు అని ఈకలు పీకే అవకాశం లేదు. అదొక సంతృప్తి.

ఎక్కడ ఉన్నా మంచి రచన అయితే ప్రాచుర్యం పొందుతుందనడానికి నిదర్శనం తెలుగు తూలికలో కొన్ని వ్యాసాలకి తగిలిన చూపులలెఖ్ఖలే. కనుపర్తి వరలక్ష్మమ్మగారి విశిష్ట వ్యక్తిత్వం వ్యాసానికి నా బ్లాగులోనే 2300కి పైగా చూపులు కనిపిస్తున్నాయి. ఈవ్యాసం మొదట పుస్తకం.నెట్‌లో వచ్చింది. అక్కడి పాఠకులని ఈ లెఖ్ఖలో కలపకుండానే. అది ప్రచురించి 7 ఏళ్ళయినా ఇప్పటికీ ప్రతిరోజూ ముగ్గురో నలుగురో చూస్తూనే ఉన్నారు ఆ వ్యాసం. అలాగే ఆచార్య నాయని కృష్ణకుమారిగారు జానపదసాహిత్య విదుషీమణి వ్యాసం చూపుల సంఖ్య 1100 దాటింది. మహా కవయిత్రి ఆతుకూరిమొల్ల వ్యాసం (2 భాగాలు) మరో మూడో నాలుగో సైటులలో చోటు చేసుకుంది నాకు తెలిసి. ఈవ్యాసం ఇంగ్లీషు పాఠం (తూలిక.నెట్ లో­) కూడా ఇతర సైటులలో కనిపిస్తోంది. నాకథలకంటే వ్యాసాలకే ఎక్కువ ఆదరణ లభిస్తున్నట్టు కనిపిస్తున్నా, నాకథాసంకలనాలు ఇ-పుస్తకరూపంలో చూడబడతున్న సంఖ్య కూడా చిన్నదేమీ కాదు. అందరూ అన్ని సంకలనాలూ, ప్రతి సంకలనంలో అన్ని కథలూ చదివి ఉంటారన్న భ్రమ నాకు లేదు కానీ 2700కి పైగా చూపులు కనిపిస్తున్నందున ఫరవాలేదనే అనే అనిపిస్తోంది. పాఠకులని “అది కాదు ఇది నచ్చింపించుకోవాలి” అంటూ మొహమాట పెట్టలేం కదా! వారికి ఏది నచ్చితే అదే చదువుతారు.

నా ఫేస్బుక్కు అనుభవాలు చెప్పుకోకుండా ఈ వీడ్కోలు పూర్తి కాదు. 15 ఏళ్ళక్రితం ఒకాయన నన్ను ఈ ఫేస్బుక్‌ జాలంలోకి లాగడానికి ప్రయత్నించేడు కానీ సఫలీకృతుడు కాలేదు! ప్రధానంగా ఆ ప్రపంచంలో ప్రజలకి నేను సమకాలీనురాలిని కానని గట్టిగా నమ్మి ఆయనసలహాని అక్కడే వదిలేసేను. నా సమవయస్కులు కూడా నా సమకాలీనులు కారని గమనించాలి. ఎందుకంటే వారికి ఈనాటి సమాజంలోని రాజకీయాలూ, వినోదకార్యక్రమాలూ, సాంఘికసమస్యలూ కూడా సుపరిచితం. ఆయా విషయాలు సాధికారికంగా చర్చించగలరు. వారెవరూ నాలా నాలుగ్గోడలమధ్య తమని తాము వెలి వేసుకు కూర్చోలేదు. ఆవిధంగా చూసినప్పుడు నేను ఫేస్బుక్కులో అసంబద్ధము అనే చెప్పాలి.

ఇంతకీ, జూన్ 2013లో ఒకావిడ ఏదో సందర్భంలో “ఫేస్బుక్కు ఒక దురభ్యాసంగా మారగల అవకాశాలెక్కువ, అది మొదలు పెడితే చాలా సమయం ఆ కబుర్లలోనే సరిపోతుంది” అని చెప్పేక, నాకు కుతూహలం కలిగింది. చాలామందిలాగే “అటు వెళ్ళకు” అంటే అటువెళ్ళి చూసే అలవాటు నాక్కూడా ఉండడంచేత (కుర్రతనం అంటారు దీన్ని), ఏమవుతుందో చూదాం అని మొదలు పెట్టేను. మరోకారణం – నా తెలుగు తూలిక చూడనివారిదృష్టికి తీసుకురావడం కూడాను. ఇది కొంతవరకూ సాధ్యమయింది. వెనక పరిచయమైన బ్లాగర్లలో కొందరు ఇక్కడ కూడా ఉన్నా, కొత్త పాఠకులు కూడా కనిపిస్తున్నారు. ఫేస్బుక్కులో నేను పరిచయం చేసిన పాత టపాలు మరో నాలుగు చూపులకు నోచుకుంటున్నాయి. (పైన ఇచ్చిన బొమ్మ చూసేరు కదా). అది ఆనందదాయకం.

కానీ మరోవేపు, కాలక్రమాన ఈ ముఖపుస్తకజాల మిత్రులకి నేను సమకాలీనురాలిని కానన్న నా పూర్వపు అభిప్రాయం మరింత బలపడుతోంది కూడా. పదింట తొమ్మిదొంతులు ఆ యఫ్బి పేజీల్లో విషయాలు నాకు అగమ్యగోచరం. ఒకటి రెండు సార్లు ఏవో వ్యాఖ్యలు పెట్టి, నావ్యాఖ్య అసందర్బం అని తెలుసుకొన్నదానినై, వ్యాఖ్య రాయాలన్న ఉత్సాహానికి పగ్గాలు వేస్తూ వస్తున్నాను. మిగతా ఒక వంతులోనూ నాకు అర్థమయినవి వాటిలో అర్థభాగమే. అయితే ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నానంటే, ఆ ఒక వంతులో అర్థవంతు నాకు విజ్ఞానదాయకంగా ఉంది కనక! కొత్త విషయాలు తెలుస్తున్నాయి. నాకు తెలీనివి అడిగితే ఇక్కడ విశదం అవకాశం ఉంది. అలా నా సందేహాలు తీర్చిన సాహితీమిత్రులందరికీ మరోసారి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఈ టపాద్వారా.

ఆ పదింట ఒక వంతులో అర్థభాగం వారు ఎంత చదువుకున్నారో చూస్తే కూడా నాకు నూతనంగా ఉత్సాహం పుంజుకుంటోంది. ఇక్కడ ఆదానప్రదానాలు లేవు. ఎంచేతంటే నేను ఇచ్చినది లేదు కానీ పుచ్చుకున్నది చాలా ఉంది. వారికి నా నమోవాకములు. వారిమూలంగా కలిగిన ఉత్సాహంతో నేను కూడా చదవడంలో గడిపేకాలం హెచ్చించాలనుకుంటున్నాను. ఏతావాతా చెప్పొచ్చేదేమిటంటే, నాఫేస్బుక్ పేజీని ఇప్పుడప్పుడే నిర్మూలించను కానీ లైకులూ, వ్యాఖ్యలూ బహుశా తగ్గించుకుంటాను నా పరువు నిలుపుకోడానికే! Facebook ద్వారా పరిచయమైనవారి పేర్లన్నీ రాయలేకపోతున్నాను. నా రచనలు ప్రత్యేకించి అభిమానిస్తున్న మీ అందరికీ మనఃపూర్వక ధన్యవాదాలు.

ఇదే సందర్భంలో విన్నవించుకోవలసిన మరోమాట – చాలామంది అద్భుతం, అమోఘం అంటూ కితాబులు ఇస్తున్న కొన్ని కథలు చదివేను కానీ నాకు అలా అనిపించలేదు. కథానిలయంవారి ధర్మమా అని అక్కడ దొరికిన నాకాలంవారి రచనలు చదువుతుంటే “పుట్టింటికొచ్చినట్టు” ఉంది. కనక అవి చదువుకుంటాను. ఆ పైన నేను చాలా కాలంగా చదవాలనుకుంటున్న కొన్ని పుస్తకాలు ఇంట్లో ఉన్నవి దుమ్ము దులిపి వాటికి మోక్షం కలిగించాలనుకుంటున్నాను.

చివరిమాటగా ఈ బ్లాగుకి అలంకారం – లలిత గూడ ఈ బ్లాగు తెరిస్తే టపాలు కనిపించడంలేదని చెప్పేక, కొంత పరిశోధన చేసి తెలుసుకున్నది బ్రౌజరుని బట్టి ఉంటుందని. కానీ లలిత ఇంతకుముందు కూడా నాబ్లాగు చూస్తున్నారు కనక ఈవాదన సమర్ధనీయంగా లేదు. అయినా WordPress ఫోరంవారిని కాదనడం ఎందుకని నేను IE లో చూసేను. ఆ తరవాత ఏ అలంకారం EI లోనూ Firefox లోనూ కూడా కనిపిస్తుందో, అందులో ఏది నాకు కూడా నయనానందంగానూ, పాఠకులకి అనువుగానూ ఉంటుందో చూస్తున్నాను. ఇంకా ఈ ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. 2015 సంవత్సరం ముగిసేలోపున ఈ అలంకరణ పూర్తవుతుందనే అనుకుంటున్నాను. నాకు శుభాకాంక్షలు కోరేవారందరూ కూడా ఇదే కాంక్షించమని మనవి -:)

ఇవ్విధమున సునిశితదృష్టితో ఆలోచించగా, నా సాహిత్యప్రస్థానం ఈ ఏడాది ముగిసినట్టే అనిపిస్తోంది. అంచేత 2014దగ్గర శలవు పుచ్చుకుని 2015లో అడుగుపెడుతున్నాను సరికొత్త ధ్యేయాలకోసం వెతుక్కుంటూ.

శుభమస్తు.

My father

 

 

 

(డిసెంబరు 31, 2014)

 

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

4 thoughts on “2014కి వీడ్కోలు చెప్పుకొను శుభసమయంలో!”

 1. నా సంవత్సరంతోపోలిస్తే మీ సంవత్సరం బాగా గడిచినట్టే మాలతిగారూ. మీ ఊసుపోక మొదటి సంకలనానికి ముందు మాటే రాసే పని మొదటి అదృష్టమైతే, మీ బ్లాగుకి అధిక వ్యాఖ్యాతగా ఉందడం నా రెండో అదృష్టం.

  మెచ్చుకోండి

 2. మాలతి గారికి ,
  మాలతి గారికి ,
  నూతన సంవత్సర శుభాకాంక్షలు!
  మీరు మీ తూలికలో పెట్టిన స్థానాపతి రుక్మిణ మ్మగారి దయ్యాల కథలు,పాటలి,నరమేధము ,శ్యామలి,స్వయంసిద్ధ నవలలు చదివి ఒక మంచి ఆనందాన్ని పొందాను . మీకు అనేక కృతజ్ఞతలు!
  కిరణ్ కుమారి

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.