మూగనోము లేక మౌనవ్రతం ఉంది!

ఈమధ్య నాకు మూగనోము ఎవరు ఎలా చేస్తారా అన్న బృహత్సంశయం కలిగింది. మామూలుగా నాకు సందేహాలూ, సంశయాలూ రావు. వస్తే మాత్రం వాటి కథా కమామీషు ఆసాంతం తెలుసుకునేవరకూ తోచదు. అనేక విషయాలు తెలిసేయి. మూగనోము విధిగా పాటించేవారున్నారు.

హెచ్చరిక – ఇక్కడ వెలిబుచ్చిన అభిప్రాయములు కాపీ చేసేసి ప్రచురించేసుకోకండి. ఇవన్నీ నాఅభిప్రాయాలూ, నేను సేకరించిన అభిప్రాయాలూ కూడా విస్తృత పరిశోధన చేసి, ఋజువూ, సాక్ష్యాలతో నిరూపింపబడినవి కావు. అంచేత, ఎవరైనా ఈ అభిప్రాయాలను తమతమ టపాలలో పెట్టేసుకుంటే నాబాధ్యత లేదు.

పై హెచ్చరికకి మినహాయింపు – తెవికి, తెలుగువన్.కాం నుండి సంగ్రహించిన సమాచారానికి ఆయా మూలములను చూడవలసినదిగా కోరుతున్నాను.

ఆంధ్రభారతిలో నోము అంటే వ్రతము చేయు అని ఉంది కానీ నోములకీ వ్రతాలకీ సూక్ష్మమైన తేడా కొంత ఉన్నట్టుంది. నోములు స్త్రీలు నోచేవనీ, లింగబేధం లేకుండా సకల జనులూ చేసేవి వ్రతాలు అనీ ఒక అభిప్రాయం. నాక్కూడా ఇది సమంజసంగానే తోస్తోంది.

పోతే, మూగనోము మగవాళ్ళు ఆడవాళ్ళని ఆరళ్ళు పెట్టడానికి వాడే ఆయుధం అని మరొక అభిప్రాయం. నాఅభిప్రాయము – ఆడువారు కూడా ఈ ఆయుధాన్ని ఉపయోగించుటలో మేటివారేనని. అసలు సదరు మూగనోము ఆడవాళ్ళతోనే పుట్టిందని జనశ్రుతి. గాంధీగారి సత్యాగ్రహమునకు ప్రేరణ స్త్రీలేనని ఎక్కడో చదివేను.

నిత్యవ్యవహారంలో కోపం ఒక్కటే కాదు ఇతరవాడుకలు అనేకం ఉన్నాయి. ఉదారహణకి, నిరసనకీ, మాట తోచనప్పుడు, మాటల్లేవనుకున్నప్పుడు, “ఏదో పెద్దవారు పాపం” అని, “పోనిద్దూ పాపం చిన్నవాడు లేక చిన్నది” అని, చెప్పినా వినిపించుకోరని, ఎదటివారిని క్షుణ్ణంగా అపార్థానికి తావులేనంతగా “అర్థం చేసుకున్న”ప్పుడు – ఇలా ఎన్నో సందర్భాల్లో మౌనమే శరణ్యం అవుతుంది. జవాబు చెప్పకపోతే, పిల్లల్ని “మాటాడవేం, ఒళ్ళు కొవ్వెక్కిందా,” అని గదమాయించడం కూడా ఈకోవలోకే వస్తుంది.

­­­­­ఈ హాస్యాలూ, అపహాస్యాలూ, కోపతాపాలప్రకటనలూ అలా ఉంచి, పరిశీలించి చూస్తే మనది ప్రధానంగా ఆధ్యాత్మికదేశం కావడం ఒక కారణం అనిపిస్తుంది. దగ్గినా తుమ్మినా కూడా మనవాళ్ళు ఏదో శాస్త్రం చెప్పి, నానా డొంకలూ తిప్పి దానికి ఆధ్యాత్మికమైన టీకాతాత్పర్యాలు చెప్తారు. ఏతావాతా చెప్పొచ్చేదేమిటంటే, ఈ మూగనోము లేక మౌనవ్రతమునకు ఆధ్యాత్మికమైన అనుబంధం ఉందని ద్యోతకమయింది కొంత పరిశోధనలు జరిపిన తరవాత. నేను తెలుసుకున్న మౌనవ్రతము లేక మూగనోముకు సంబంధించిన విషయం సంగ్రహంగా ఇదీ.

ఈ నోము లేక వ్రతానికి భూమిక ఏదో ఒక కార్యం నిర్వహిస్తామని సంకల్పించుకుని, విజయవంతంగా పరిసమాప్తి కావించుట. సాధారణంగా స్త్రీలు చేసేవి నూటికి తొంభై పాళ్లు

భర్త ఆయురారోగ్యైశ్వరముల అభివృద్ధికే అయినా, వాటన్నటికీ ఆమె కూడా పరోక్షంగా లాభము పొందగలదు. వ్రతములు – సత్యనారాయణవ్రతంవంటివి అందరూ చేస్తారు లింగ వయో కులబేధాలు లేకుండా.

ఉపవాసం జీర్ణాశయం వంటి అంతర్భాగాలకి విశ్రాంతి ఇవ్వడానికి అయితే మౌనం నోట్లో నాలుకకీ, తదితర నాళాలకీ విశ్రాంతి ఇవ్వడానికి. తాపసులు మౌనం వహించడానికి కూడా అదే కారణం. ఇందువల్ల మానసికారోగ్యం కూడా వృద్ధి పొందగలదు.

మాఘమాసంలో అమావాస్యరోజున మౌనవ్రతం పాటిస్తారు కొందరు. కొందరు నెలపొడగునా పాటిస్తారు. దీపావళి వెళ్ళిన మర్నాడు మొదలుపెట్టి 15 రోజులు మౌనంగా ఉంటారు కొందరు.

తెవికీ.ఆర్గ్ లో ఉన్నదంతా ఇక్కడ మళ్ళీ తిరిగి రాయను కానీ మౌనాన్ని రమణ మహర్షి, వివేకానంద, రామకృష్ణ మహర్షి వంటి మహాజ్ఞానులు కూడా మౌనానికి చాలా ప్రాధాన్యం ఇచ్చేరుట. దైహికంగానూ, మానసికంగానూ కూడా ఆరోగ్యకరం. రమణ మహర్షి అవసరమైతే తప్ప మాటాడేవారు కారుట. అలాగే శ్రీ స్వారాజ్యాశ్రమ వ్యవస్థాపకుల, ప్రస్థానత్రయ భాష్యకారులై జగద్గురువులుగా కీర్తినొందిన బ్రహ్మీభూత, బ్రహ్మలీన, బ్రహ్మశ్రీ జగద్గురు వేదాంతం లక్ష్మణార్యులు మూడు సంవత్సరాలపాటు (1945-47) మౌనవ్రతం పాటించేరుట. వీరి ఆశ్రమం స్వారాజ్యాశ్రమం అంటే 1947లో స్వరాజ్యం మనకి రావడం – ఈ రెంటికీ ఏమైనా అనుబంధం ఉందేమో నాకు తెలీదు.

“చెప్పవలసింది ఏమైనా ఉంటే చెప్పు. అంతేగానీ ఏదోఒకటి చెప్పాలన్న దుగ్ధతో మాటాడకు. అలా వాగితే ఆయుక్షీణం అని మాఅమ్మ అంటూండేది.

తెవికీలో మూడు మౌనములు మూడు విధములు అని ఉంది.

నోరు పెగల్చకుండా పరమనిష్ఠతో మౌనంగా ఉండాలని పెద్దలు భక్తినీ, ఆరోగ్యాన్ని కలిపి ఆచారంగా పెట్టారు. మనం మనకి తోచినప్పుడు విశ్రాంతి తీసుకున్నట్టుగానే శరీరంలో పనిచేసే అవయావాలకి ఆచారాలూ, సాంప్రదాయం పేరుతో పెద్దలు విశ్రాంతినిచ్చారు అంటున్నారు.

మౌనం మూడు విధాలుగా చెప్తారు.

  • వాజ్మౌనం: వాక్కును నిరోధించడమే వాజ్మౌనం. దీనినే మౌనవ్రతం అంటారు. ఇలాంటి మౌనం వల్ల పరుష వచనాలు పలుకుట, అబద్ధము లాడుట, ఇతరులపై చాడీలు చెప్పుట, అసందర్భ ప్రలాపాలు అను నాలుగు వాగ్దోషాలు హరించబడతాయి.
  • అక్షమౌనం: అనగా ఇంద్రియాలను నిగ్రహించడం. ఇలా ఇంద్రియాల ద్వారా శక్తిని కోల్పోకుండా చేస్తే ఆ శక్తిని ధ్యానానికి, వైరాగ్యానికి సహకరించేలా చేయవచ్చును.
  • కాష్ఠమౌనం: దీనినే మానసిక మౌనం అంటారు. మౌనధారణలో కూడా మనస్సు అనేక మార్గాలలో పయనిస్తుంది. దానిని కూడా అరికట్టినప్పుడే కాష్ఠమౌనానికి మార్గం లభిస్తుంది. దీని ముఖ్య ఉద్దేశ్యము మనస్సును నిర్మలంగా ఉంచుట. కాబట్టి ఇది మానసిక తపస్సుగా చెప్పబడినది.

నేను కనుగొన్న మరొక మూలం తెలుగువన్.కాం లో మోచేటి పద్మం మౌనవ్రతం అన్న పేరుతో ఉన్న వ్యాసం. దీపావళి అమావాస్యనుండి కార్తీక పౌర్ణమివరకూ ఆచరిస్తారుట మూడు సంవత్సరాలపాటు. వ్రతవిధానం వివరంగా ఈ లింకులో ఉంది. చూడండి.

http://teluguone.com/devotional/content/mocheti-padmam-mouna-vratam-113-1426.html

మౌనం లేక మూగనోము అన్నది కేవలం అలకలకి మాత్రమే కాదని తెలుసుకున్నాక ఇంక చెప్పడానికేం ఉంది?

ఇంత చదివేక నాకు తోచిందేమిటంటే – అలిగి మాటాడకపోవడం బలహీనత. నోరు మెదపను అని సంకల్పం చెప్పుకుని కొంతకాలం మౌనాన్ని పాటించడం ఆరోగ్యం.

(జనవరి 27, 2015)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

2 thoughts on “మూగనోము లేక మౌనవ్రతం ఉంది!”

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s