చెప్పులకి సంబంధించినంతవరకూ నేనింకా పాతరాతియుగంలోనే ఉన్నాను. అమ్మదేశంలో ఉన్నన్నాళ్ళూ ఏ రెండేళ్ళకో ఓమారు ఓ చెప్పులజత కొంటే సరిపోయేది. కంతిరిబజారులో గానుగచెట్టుకింద దుకాణం పెట్టుక్కూచున్న గొడారికి ఆది ఇచ్చి కుట్టించుకున్నరోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు అమెరికాలో వాటిని కస్టమ్మేడంటారు. అన్నాక వాటి ధర మూడు రెట్లు చెప్తారు. మాకాలంలో మాఊళ్ళల్లో అవే కారుచవక.
అమెరికా వచ్చేక మారే ఋతువులతోపాటు పాదరక్షలు కూడా మార్చుకోవాల్సిందే ఇష్టం ఉన్నా లేకున్నా. వీధుల్లో తిరిగినప్పుడే కాక ఇంట్లో కూడా చెప్పులఅవసరం ఉంది.
ఇంతకీ కాలిఫోర్నియాలో చలి తక్కువా, షోకులెక్కువా (ధరలమాట సరేసరి) అని తెలిసికొనినదానినై, ఇక్కడికి వచ్చేముందే కాలానికీ, మాఅమ్మాయిస్థాయికీ తగినజోళ్ళు కొనుక్కోవాలని నిశ్చియించుకున్నాను. మాఅమ్మాయిస్థాయి అంటున్నాను కానీ నిజానికి అమెరికాదేశం అంతటా ఉంది ఈ నఖశిఖపర్యంత పరీక్ష. అంటే మనం ఎదురు పడగానే, జోళ్ళు బాగున్నాయి, శిఖ అందంగా ఉంది అనకుండా సంభాషణ మొదలు పెట్టడం అరుదే.
000
ఓ జోళ్ళదుకాణం ప్రాంగణంలో నిలబడి నేను ధరించగలిగినవి ఇక్కడ ఉంటాయా అని చూస్తున్నాను.
“జోళ్లు చూస్తావా?” అంది అమ్మకాల చిన్నది.
“చూస్తున్నాను.”
“ఎలాటి జోళ్ళు?”
“వేసవి చెప్పులు.”
“యోగా చెప్పులా?”
అహో, నా హిండూమోము చెప్పకయే చెప్పును, అది జగద్విదతము అనుకుంటుంటే మరో ఆలోచన ఉదయించింది. యోగాభ్యాసానికేవో పద్ధతులూ, నిబంధనలున్నాయని విన్నాను యోగాకి వేరే చెప్పులు అని తెలీదు.
“యోగా చెప్పులా?”
“యోగాచాపలాగే. చెప్పులు కూడా ప్రత్యేకపద్ధతిలో తయారుచేస్తాం.”
“చూపించు. ముందు నేను చూడాలి. చూసి కాని చెప్పను.”
“ఇది భారీ ఉత్పత్తి కాదు. ప్రతి వ్యక్తికీ వారి ప్రవృత్తికి అనుగుణంగా తయారు చేస్తాం. ఇటురా. ఇక్కడ కూర్చుని ఈ ఫారం పూర్తి చేయ్యి ముందు.”
ఈ ఫారం పూర్తి చేయడానికి కూర్చునేముందు కూర్చోడానికి కూడా ఏదైనా ప్రత్యేకపద్ధతి ఉందేమోనని ఆ పిల్లమొహంలోకి చూసేను. కానీ అలాటి సూచనలేమీ లేవు. సరే.
యోగసాధన చేసినా చెయ్యకపోయినా జ్ఞానసముపార్జన కాగలదని ఎంచి, ఆమె చూపిన కుర్చీలో కుదురుగా సుఖాసీనురాలినై ఫారం చదవడం మొదలు పెట్టేను. పేరూ, ఊరూ, ఇంటి చిరునామా, కంటిరంగూ, ఒంటి రంగూ, కేశసంపద రంగూ … … నాకు అనుమానం వచ్చింది. నా అస్తిత్వం దోచుకోమని, చూస్తూ చూస్తూ సర్వస్వామ్యకలితముగా ఇచ్ఛాపూర్వకంగా వారికి రాసిచ్చేస్తున్నట్టుంది ఆ ఫారం చూస్తుంటే. తలెత్తి ఆపిల్లవేపు చూసేను.
“ఏంటి, ఏమైనా సందేహాలా?”
“కంటిరంగుకీ కాలిజోడుకీ సంబంధం ఏమిటనీ?”
“నాకు తెలీదు. పూర్తి చేసి ఇయ్యి. అంతే.”
“నాకు జవాబు తెలుసుకోవాలని ఉంది.”
“ఆ ఫారం నేను తయారులేదు. కంపెనీయజమానులు తయారుచేసిన ఫారం అది. ఆఫారం నీకివ్వడం, నీచేత పూర్తి చేయించి, తీసుకుని మాకార్ఖానాకి పంపడంవరకే నా పని.”
“ఈ ఫారం పూర్తి చేయడానికి నేను అభ్యంతరం చెప్తే ఏమవుతుంది?”
“నీ చెప్పులజతకి జీవితకాలం భీమా ఉండదు.”
“ఎవరి జీవితకాలం? నాదా, చెప్పులదా?”
“ఎవరు ముందు పోతే వారిజీవితకాలం. నువ్వు పోయినా చెప్పులుంటాయి. చెప్పులే ముందు పోతే మేం సరికొత్త జత తయారుచేసి ఇస్తాం ఉచితంగా.”
(హ్మ్. ఇలాగే దిగుతాం గోతిలోకి. అయినా నేను పోయేక చెప్పులు ఉంటే ఎంత, పోతే ఎంత?).
విజ్ఞానమే నాధ్యేయం కనక మౌనముద్రాంకితురాలినై ఫారం పూర్తిచేసిచ్చి భక్తిప్రమత్తులతో ఆమెకి అందించేను. ఆ అమ్మాయి నిరామయంగా ఆఫారం అందుకుని, అటూ ఇటూ తిప్పి చూసి, మరో ఫారం ఇచ్చింది.
“ఇదెందుకూ?”
“ఇది “కర్మా అప్పు” ఫారం.”
“నాకు అప్పు అఖ్ఖర్లేదు. డబ్బిచ్చేస్తాను.”
“అయినా అప్పుపత్రం పూర్తి చెయ్యాలి.”
“ఎందుకూ?”
“చెప్పేను కదా జీవితకాలం భీమా ఇస్తున్నాం అని. అది అప్పుకిందకే వస్తుంది. రివాల్వింగ్ అప్పన్నమాట.”
“ఫారం పూర్తి చేయడం అయిందా?”
“లేదు. ఏం రాయాలో నాకు తెలీడం లేదు. కుడికాలు కొలతలూ, ఎడమకాలు కొలతలూ, బరువులూ – ఇవేమిటి? కాలు బరువు ఎలా తెలుస్తుంది కాలు కొట్టేసి తూస్తే తప్ప.”
“ఆ కొలతలు నేను తరవాత తీసుకుంటాను. మాదగ్గర ప్రత్యేకంగా మిషన్లున్నాయి.”
“అబ్భ. మీదేశం ఎంత అభివృద్ధి పొందిందీ! కానీ నారెండు కాళ్ళూ ఒక్కలాగే ఉన్నాయి. వాటికి విడివిడిగా కొలతలు లేవు.”
“అలా కాదు. ఏకాలుగుణాలు ఆకాలివే. వేలిముద్రలలాగే కాలి ముద్రలు కూడాను.”
నాకు చిరాకు కలిగింది. నాబాధ ఆ కొలతలకోసం నాకాలు ఊడదీస్తుందేమోనని. “అలా కాదు. నా రెండు కాళ్ళకీ ఒకే గుణం. అది దుర్గణం. అది అతిగా తిరగడం” అన్నాను విసురుగా.
అమ్మకాలపిల్లకి కూడా చిరాకు కలిగే ఉంటుంది. కానీ చాలా శాంతంగా, చిరునవ్వుతో, “మీరూ గమనించే ఉంటారు. మీరు కాలు తీసి కాలు వేస్తూ ముందుకు సాగుతారు. ఏకాలు నేలమీద ఉంటే ఆకాలుమీద మీబరువు ఒకటిన్నర క్షణం ఉంటుంది. దానికి తగ్గట్టు అంటే మీపదఘట్టనకి అనుగుణంగా మేం మీజోళ్ళు తయారు చేసి ఇస్తాం. మీ జోళ్ళు దీర్ఘకాలం మనడానికి గల రహస్యాలలో అదొకటి.”
“ఇంతమంచి సమాచారం తెలుసుకుని రెండు దశాబ్దాలయింది. ఇంకా ఏమైనా ఉన్నాయా?”
“ఈజోళ్ళతో తిరగడం అయినతరవాత మీఇంటి ముఖద్వారం దగ్గర వదులుతారు కదా. ఉదయం తలుపు తెరిచి, కొంతసేపు దక్షిణపుగాలి తగలనివ్వండి. దక్షిణవాయువులు ఇతోధికశక్తినిచ్చి, మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించడానికి తోడ్పడతాయి.”
“మాయింటి సింహద్వారం దక్షిణముఖంగా లేదు,” అన్నాను దిగులుగా.
“అయ్యో, చెప్పరేం. అది చాలా ముఖ్యం జోళ్ళకే కాదు మీక్కూడా. వెంటనే ఇల్లు మారండి.”
కాళ్ళీడ్చుకుంటూ ఇంటికొచ్చేను. ఆ తరవాత జోళ్ళవేట ఆపి ఇళ్ళవేట మొదలు పెట్టి తిరుగుతున్నాను. మూడోరోజున కాబోలు లీల కనిపించింది, “ఈమధ్య కనిపించలేదు. ఊళ్ళో లేవనుకున్నాను.”
“ఊళ్ళోనే ఉన్నాను. జోళ్ళవేటతో మొదలయిన వ్యవహారం ఇళ్ళవేటకొచ్చింది. కాళ్లరిగిపోయేలా తిరుగుతున్నాను, మాపూర్వులు పెళ్ళికొడుకులకోసం తిరిగినట్టే,” అని సూక్ష్మంగా నా పాదరక్షలకథ సాంగోపాంగంగా వివరించేను.
అంతా విని, “నీమొహం,” అని సుతారంగా నా విజ్ఞానాన్ని కొట్టి పారేసి, “గుళ్ళపల్లి మార్కెట్లో చూసేవా?” అని జోడించింది లీల.
“లేదే. అలాటి మార్కెట్టొకటి ఉందనే నాకు తెలీదు.”
“మన హిండూలే లే. ఈమధ్యే తెరిచేరు.”
“మంచి జోళ్ళు దొరుకుతాయంటావా?”
“జోళ్ళూ బీళ్ళూ నాకు తెలీదు కానీ ఈ యోగాపాఠాలూ కర్మాపాఠాలూ ఉండవక్కడ. ఏదో కొంటే తప్ప నువ్వు దుకాణంలోకి ప్రవేశించేవని కూడా గమనించరు వాళ్ళు.”
———
అన్నట్టు చెప్పలేదనకండి – ఈకథ నిజం కాదు. నిజం చెప్పాలంటే నిక్కచ్చిగా అబద్ధం! నేను జోళ్ళకోసం తిరుగుతున్నప్పుడు, ఒకషాపులో ఒక అమ్మాయి యోగా చెప్పులా అని అడిగినమాట మాత్రం వాస్తవం.
(ఫిబ్రవరి 1, 2015)
సంతోషం వెంకట్ సురేష్ గారూ.
మెచ్చుకోండిమెచ్చుకోండి
నవ్వు కొంటూ చదివానండి కథని :). కథనం చాలా బాగుంది
మెచ్చుకోండిమెచ్చుకోండి
Krishnaveni Chari నిజ వాస్తు శాస్త్రం అనుకోకు సుమా. కథలు కథలు …
మెచ్చుకోండిమెచ్చుకోండి
>వెంటనే ఇల్లు మారండి<
జోళ్ళకోసం ఇల్లు మారడం – ఇదేదో వాస్తు శాస్త్రంలా ఉందే!
మెచ్చుకోండిమెచ్చుకోండి