చక్రవాళ వ్రతకథ

మున్ను కాదులెండి ఈమధ్యనే నారదులవారు ఇలాతలానికి వేంచేసి, భూనభోంతరాళాల చుట్టుతిరిగి, ఈనాటి నవచైతన్యానికి, నవనవోన్మేషమై పరిఢవిల్లుతున్న నవజీవనవిధానానికీ అచ్చెరువొంది, హడావుడిగా వైకుంఠం చేరుకున్నారు శ్రీమహా విష్ణువునితో సంప్రదించడానికి.

“మహా ప్రభో, ఆంధ్రదేశము నాకు మిక్కిలి అయోమయముగా నున్నది. వీరు అంతర్జాలమునందు వేళా పాళా లేక విహరించుచు, పరస్పర భూషణలతో కాలము గడుపుచున్నారు. మున్ను సత్యనారాయణవ్రతము చెప్పి తమరు జనులను తరింపజేసిరి. ఈనాటిజనులకు అట్టి వ్రతము ఏదైనను గలదా?” అని కరద్వయము ముకుళించి ప్రశ్నించెను దీనాతిదీనముగా.

అంతట శ్రీమహా విష్ణువు గాఢముగా నిట్టూర్చి. “కుమారా, వ్రతము లేకేమి. కలదు గలదు. చక్రవాళవ్రతము అని ఆ వ్రతముపేరు.”

“చక్రవాళవ్రతమా? అది ఏమి స్వామీ? చక్రవాళమననేమి? ఆచరించు విధానమెట్టిది?”

“చక్రవాళమన గుంపు, మంద అని అర్థములు గలవు. మానవుడు ఒంటరిగా బుట్టి, ఒంటరిగా పోవుననునది సర్వజనవిదితమే గదా. ఆదిమానవుడు ఒంటరివాడే. క్రమముగా వాతావరణరీతులనుండి తనను కాపాడుకొనుటకొక నివాసము, స్త్రీసంపర్కముతో కుటుంబమూ, గణవిభజనతో నాయకత్వము మున్నగునవి ఏర్పడినవి. 20వ శతాబ్దములో ఈ వర్చువల్ మేధవలన తిరిగి ఆ ఒంటరితనము మానవులను ఆయోమయములో పడవేసినది. అందుకు విరుగుడుగా ఈ సామాజికగుంపులు ఉద్భవించినవి. వానిలో భాగమే ఈ చక్రవాళములు. ఇవి తమ తమ అభిరుచులననుసరించి ఏర్పడును. తత్సంబంధి ఈ వ్రతము. శ్రద్ధాళువై విని, ఆంధ్రదేశమునందు ప్రచారము చేయుము. నీవును వారును తరింపగలరు,” అని వ్రతవిధానము ఈవిధమున వివరించెను.

అది ఎట్టిదనిన –

“రాత నేర్చిన ప్రతి ఒక్కరూ కనీసం మూడు చక్రవాళములలో చేరవలె. చేతివ్రాత రానివారు టైపు నేర్చుకుని, టైపు చెయవచ్చు. రానివారికి వచ్చినవారు నేర్పవలె. అట్టు రాయనేర్చినవారు రోజూవారీ లైకుద్వారా గానీ వ్యాఖ్యద్వారా గానీ తమ లేదా తమ స్నేహితులగోడపై సందేశముద్వారా గానీ తమ ఉనికిని ప్రకటించుకొనవలెను.”

“అందరికీ ప్రతిదినము కుదరకపోవచ్చు స్వామీ.”

“అట్లు కుదరకపోయినచో, దోషపరిహారార్థము, మరునాడు మూడింతలుగా తమ ఉనికిని ప్రకటించుకొనవలెను.”

“ఇది సులభతరముగనే గన్పట్టుచున్నది. ఈ వ్రతమునకు ఉద్యాపన గలదా?”

“ఆహా, గలదు, గలదు. పై విధముగ ఒక నెలపాటు వ్రతమునాచరించి, తరువాత, సంఘేతరులను నలువురిని తమ తమ చక్రవాళములలో చేర్చి ఉద్యాపన సంపూర్ణము చేసుకొనవలె.”

“ఒక నెలపాటు చాలునా?”

“కుమారా, కలికాలములో జనులు సద్యఃఫలమునాశింతురు. వారికి నెలరోజులపాటు అనగా మన కల్పముతో సమము.”

“ఈ వ్రతమునకు ఫలశ్రుతి ఏమి?”

“మిత్రసందోహము వృద్ధి కాగలదు. తద్వారా దేశ విదేశములయందు పలుకుబడి పెరుగును.”

“ఆహో ధన్యతనొందితిని. ఈవ్రతము నాకు మిక్కిలి ఆనందదాయకముగా నున్నది. వ్రతము కారణాంతరములవలన సంపూర్ణము కాకున్న కలుగు దుష్ఫలితములును వివరించి నన్ను ధన్యుని ఒనరింప వేడుచున్నాను.”

“వ్రతము చేయకపోయినను, ప్రారంభించి త్యజించినను జన్మరాహిత్యము కలుగును.”

“అదేమి ప్రభూ. జన్మరాహిత్యము పాపపరిహారమెట్టుల కాగలదు? మానవజాతి ప్రభవించిననాటినుండీ మానవాళి కోరునది జన్మరాహిత్యమే గదా.”

“నాయనా, ఆ కాలము గతించినది. పూర్వము జన్మరాహిత్యమునకై మానవులు తపములాచరించిరి. ఆ ధర్మములు వేరు. ప్రస్తుతము ప్రజలకు జాలరాహిత్యము రౌరవాది నరకములతో సమము. వారికి జన్మరాహిత్యముప్రశ్న లేదు. సూర్యోదయాత్పూర్వమే లేచి జాలజలధిలో ఓలలాడుటే వారికి జన్మరాహిత్యమంత హర్షమును కలిగించును.”

“తండ్రీ, నేనెంతటి అజ్ఞానాంధకారములో మునిగియుంటినో ఇప్పడు నాకు సంపూర్ణముగా అవగతమయినది. అయినను నాకు మరియొక స్వల్పసందేహమును గలదు.”

“ఏమది చెప్పుము.”

“వారికి వైకుంఠమునందు ఆసక్తి లేదేని మరి మనగతి ఏమగును?”

“అదియే ఇందలి చిదంబరరహస్యము. అంతర్జాలము విశ్వవ్యాప్తము. నేను విశ్వవ్యాపకుడను. అనగా విశ్వంతయు వ్యాపించియున్నవాడను. అనగా జాలజనులందరును పరోక్షముగా నన్నును, నాయందే లీనమైయున్న నిన్నును సేవించుచునే యున్నారు.”

నారదులవారు వైకుంఠవాసునికి మరొక వంద అభివాదములు సమర్పించుకుని హడావుడిగా భూలోకంలో దిగారు. మూడు రోజులపాటు వింతలు విశేషాలు నిదానంగా పరిశీలించి, తమ తప్పు తెలుసుకున్నవారయి అదురుతున్న గుండెలతో తిరిగి శ్రీమన్నారాయణుడిమందిరం చేరుకున్నారు.

“దేవాదిదేవా, ఆదిదేవా, పరమపురుషా, మీరును నేనును మిక్కిలి వెనకబడి యున్నవారము. మీరు చెప్పిన వ్రతము సుమారుగా చాలాకాలముగా ఆచరణలో ఉన్నట్టే కన్పట్టుచున్నది. ప్రజలు గంగాళమ్మజాతరలోవలె అలివి కాని ఉత్సాహముతో తమ తమ నిత్యనైమిత్తికములును మరిచి వెబ్బులో తేలియాడుచున్నారు. ప్రస్తుతము కావలసినది దీనికి ప్రతిహారము గానీ మరొక వ్రతము గాదు,” అని చెప్పెను.

శ్రీమన్నారాయణుడు మందహాసము చేసి, “నాయనా, నేను సర్వజ్ఞుడను కదా. నీకు తెలియజేయుటకే నిన్నంపితిని. లెస్స గ్రహించితివి. ప్రతి జాడ్యమునకు విరుగుడు గలదు. నీవు మరల అచ్చటికేగి వారికి ఉపవాసముయొక్క అవుసరమును వివరింపుము. మాసమున కొకమారు 3వ తేదీన గానీ¸లేదా 5, 9, 14వ తేదీనగానీ, వెబ్ జోలికి పోరాదు, ఆఫీసుపనులు మినహాయింపు. వాస్తవములో కీబోర్డుమీద వ్రేళ్ళు పడిన ఈ చక్రవాళములలోకి దిగకుండ తమని తాము అదుపులో పెట్టుకొనగలుగుటే ఈ ఉపవాసవిధిలో కిటుకు. అది ఇనుమిక్కిలి దుఃఖతరము, దుస్తరము. మాసములో రెండు దినములు ఒంటిపూట ఉపవాసము చేసినను అదే ఫలము. ఒంటిపూట అనగా రోజుకు ఒకమారు మాత్రమే జాలప్రవేశము చేయుట.”

నారదులవారు ఆ ఆద్యంతరహితుని మోము అత్యంత కుతూహలముతో పరిశీలించి చూచి, తల పంకించి, భూలోకానికి తిరిగి విచ్చేసిరి.

అటు పిమ్మట కారణజన్ముడూ, లోకసంచారీ అయిన నారద మహర్షి అవిఘ్నమస్తు అని మనసులోనే ఒక ప్రార్థన చెప్పుకుని, శ్రీమన్నారాయణుని పేరున ఒక ఖాతా చక్రవాళములో తెరిచి సర్వే జనాః సుఖినో భవంతు అని దీవించేసేడు. ఆ తరవాత సమస్త ప్రజానీకమూ సుఖపడిపోయింది.

కథ సుఖంగా కంచికి చేరుకుంది!

ఉపసంహారం. ఈ కథ చదివినవారును, విన్నవారును, తమ తమ చక్రవాళములలో పంచుకున్నవారును చాలా జాలసుఖముల బడయగలరు.

(ఫిబ్రవరి 5, 2015)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

4 thoughts on “చక్రవాళ వ్రతకథ”

  1. కొత్తగా చక్రవాళములో ఖాతా తెరచిన ఆ శ్రీమన్నారాయణునికి కూడా వెబ్ ఉపవాసము చేయుట కష్టము గావచ్చునేమో..హ హ. బాగుందండీ..

    మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.