చర్చ – ఋణానుబంధం

కొంతకాలం క్రితం కొన్నికథలమీద ఇక్కడ చర్చ జరిగింది. కొందరు పాఠకులు ఉత్సాహంగా చర్చలో పాల్గొని ఆ చర్చలని పరిపుష్టం చేసేరు. ఇప్పుడు మళ్ళీ అటువంటి సందర్భం వచ్చింది. ఈ చర్చ “ఋణానుబంధం” కథగురించి అనడం కన్నా ఆ శీర్షికగురించి అనడంలో ఎక్కువ సౌలభ్యం ఉంది.

కథానిలయంలో చూస్తుంటే ఈ ఋణానుబంధం శీర్షికకింద 69 కథలు కనిపించేయి. ఇన్ని కథలంటే అన్ని విభిన్నకోణాలు ఉంటాయి కదా, అవి ఆయా రచయితలు ఎలా ఆవిష్కృతం చేసేరు అన్న కుతూహలంతో కొన్ని కథలు తీసుకుని చదవడం మొదలు పెట్టేను. వాటిలో నాదృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించింది త్రిపురనేని ప్రమీల రాసినకథ. రచయిత్రి వయసు 14, ఇంటిపేరు త్రిపురనేని కావడం కొంత కారణం నా కౌతుకానికి.

ఆ కథ ఫేస్బుక్కులో పెట్టేను. అక్కడ ఈ రచయిత్రి వయసుపిల్లల సృజనని ప్రోత్సహించేవారు చంద్రలత, లలిత గూడవంటివారు ఉన్నారు. వారేమంటారో చూదామని. ఆ మీదట ఎ.వి. రమణమూర్తిగారు నాఅభిప్రాయం అడగేరు. తీగెలాగితే డొంక కదిలినట్టు నాకు అనేకానేకాలోచనలు తట్టేయి ఆ ప్రశ్నకి సమాధానం రాయబోతే. ఈ కధగురించి సూక్ష్మంగా నా అభిప్రాయాలు చెప్పి, తరవాత నాగొడవ – నేనెవరు, నాకు ఏ కథ నచ్చుతుంది, ఎందుకు నచ్చుతుంది, నా కారణాలు ఈనాటిపాఠకులకి ఆదరణీయమేనా వంటి విషయాలు విహంగావలోకనగా పరామర్శించదలుచుకున్నాను.

మొదట ప్రమీలగారి కథ చూదాం. 1953నాటికి 14 అంటే నాకంటే రెండేళ్ళు చిన్న! ఆమెకథలో అంశాలకి పూర్వాపరాలు నాదృష్టిలో – ఋణానుబంధం అన్నపదం వ్యవహారంలో అనేక సందర్భాలలో వాడుకలో ఉంది. ఒకొకప్పుడు ఊతపదంలా ప్రయోగించడం కూడా వినిపిస్తుంది. నేను చదివిన మరో నాలుగైదు కథల్లో కేవలం కారణకార్యసంబంధం అట్టే లేనప్పుడు ఋణానుబంధం అని సరిపెట్టుకోడం అనిపించింది. ఉదాహరణకి ఇంటినుండి పారిపోయిన ఇద్దరు యువకులు చేతిలో డబ్బు అయిపోయేక తమలాగే పారిపోయి వచ్చిన మరో యువకుడి డబ్బు వాడుకోడం, చివరలో అతను తెలివి తెచ్చుకుని తన డబ్బు వసూలు చేసుకోడం. ఇలా ఏవో కొన్ని సంఘటనలు పోగు చేసి ఓ కథ అల్లి ఋణానుబంధంవల్ల అలా జరిగింది అని చెప్పినకథలు చాలానే ఉన్నాయి. నేను కూడా రెండు కథలకి ఇదే శీర్షిక ఇచ్చేను.

కానీ ఈ పదానికి తాత్వికపరమైన అర్థం ఉంది. ప్రమీలగారికథ అలాటి తాత్త్వికచింతనతో కూడుకున్నది. అంత చిన్నవయసులో ఆ కోణాన్ని ఎలా ఆవిష్కరించేరు అన్న కుతూహలం కలిగింది నాకు. ఋణానుబందం అన్నపదం ఇంట్లో పెద్దవారు అంటే ఆమె విని ఉండవచ్చు. కానీ దాన్ని కథగా మలచడానికి నేర్పు కావాలి. ఈకథలో నేను అది చూసేను.

కథ ఎత్తుగడ – ఇంట్లో తాము అందరూ తమ్ముడిని పిల్లి అని పిలుస్తారు, వాడు పలుకుతాడు కూడా అని. పిల్లికీ, కుక్కకీ మనుషులపేర్లు పెట్టడం ఉంది కానీ మనుషులకి పిల్లిపేరూ, కుక్కపేరూ పెట్టడం నా ఎరికలో లేదు. ఇది కథనానికి బలం ఇచ్చింది. ఆ తరవాత “ఎలా జరిగిందో చెప్తాను” అంటూ కథనం కొనసాగించడంతో పాఠకుడికి ఉత్కంఠత కలుగుతుంది. అది ఋణానుబంధం అన్నఅభిప్రాయం ఎలా కలిగిందో వివరించడంతో కథ ముగుస్తుంది. శిల్పందృష్ట్యా సంపూర్ణంగా పరిపుష్టమైన కథ అనుకుంటున్నాను. కథకి శీర్షిక ప్రధానం. కథాంశం కూడా ప్రధానమే కానీ మొట్టమొదట మనకళ్ళ బడేది శీర్షికే కదా. ఈకథ శీర్షికలో తాత్వికచింతన కథకి అతికినట్టు సరిపోయింది. భాష అచ్చ తెలుగు. ఇవి నాకు ఆమోదకరమూ, హర్షదాయకమూ అయిన అంశాలు.

త్రిపురనేని ఇంటిపేరు అయితే గోపిచంద్ గారితో బంధుత్వం ఏమైనా ఉందా, ఉంటే వీరిద్దరిశైలిలో ఆ బంధుత్వఛాయలు కనిపిస్తున్నాయా అన్నవి నాకు కలిగిన ఉపప్రశ్నలు. ఇవి కథకి సూటిగా సంబంధించినవి కావు కానీ సాధారణంగా కథా, కథకుడినేపథ్యం తెలిస్తే కథని ఇతోధికంగా ఆస్వాదించగలం. నా కథలవెనక కథలు, నేనూ నారచనలూ వ్యాసాలు చూసి స్పందించినవారు కూడా ఈ అభిప్రాయాన్ని ధృవపరిచేరు. రమణమూర్తిగారు కూడా “చివరి చెప్పులు కుట్టేవాడు” రచయితతో స్వయంగా భాషించినతరవాత తమకి కొత్త ఆలోచనలు కలిగేయి అన్నారు. ఒక కథని పరిశీలనాత్మకంగా చూసి అర్థం చేసుకోవాలంటే ఇవన్నీ కూడా తోడ్పడగలవు అని మాత్రమే చెప్తున్నాను. హెచ్చరిక – ఇక్కడ నా అభిప్రాయం కథకుడు లేక రచయిత వైయక్తిక జీవితం అంతా అటు మూడు తరాలు ఇటు మూడు తరాలు తవ్వి తీసి, లేని అర్థాలు కల్పించి ఆశమ్మబోసెమ్మ కబుర్లు ప్రచారం చెయ్యమని కాదు. ప్రస్తుతం ఇది జరుగుతోంది కొన్ని కథలవిషయంలో. తస్మాత్ జాగ్రత్త!

కథకి సంబంధించినంతవరకూ నావ్యాఖ్యానం ఇంతే.

ఇక నాగొడవ. ఏ కథ నాకు ఆహ్లాదకరంగా ఉంటుంది, ప్రధానంగా కథల్లో నేను ఏమి చూస్తాను అన్నఅంశాలకొస్తాను.

ఓం ప్రథమంగా శీర్షిక కుతూహలం రేకెత్తించేదిగా ఉండాలి. వస్తువు కూడా ప్రధానమే కానీ శీర్షిక నచ్చితేనే ఆ తరవాత ఏం చెప్పేరు అని చూస్తాను. నిజానికి ఋణానుబంధం నాకంతగా నచ్చేది కాదు కానీ పైన నాకారణం మనవి చేసుకున్నాను కదా. అలాగే బహుళ ప్రచారంలో ఉన్న మరో రెండు తప్పెవరిది, తనదాకా వస్తే శీర్షికలతో కూడా చాలా కథలు ఉన్నాయన్నారు అని రమణమూర్తిగారు. నమ్మకం అన్న శీర్షిక కూడా అలాటిదే. ఇలాటి అరిగిపోయిన రికార్డులాటి పేర్లు పెట్టడం అంత మంచిది కాదనే నా అభిప్రాయం. కథలో ప్రధానాంశాన్ని పదునుగానూ, నర్మగర్భంగానూ చూపించాలి శీర్షిక. 60, 70 దశకాలలో కొన్ని మరీ నేలబారుగా ఉండేవి. ఇదొక కథ, నిజంగా జరిగిన కథ లాటివి. ఆరోజుల్లో వచ్చిన ఒక హాస్యకథ – ఒక రచయిత “ఇది కథ కాదు” అన్న శీర్షికతో ఒక పత్రికకి పంపేడు. సంపాదకులు, “అందుకే తిరిగి పంపిస్తున్నాం,” అని తిరగ్గొట్టేరు.

నాకు రెండో అభ్యంతరం ఇంగ్లీషు శీర్షికలు. మరొక సంస్కృతిని ఆ సంస్కృతికి ప్రత్యేకమైన అంశాన్ని స్పృశించినప్పుడు తప్ప, ఇంగ్లీషుపేర్లు నాకు నచ్చవు. నేను కేశవరెడ్డిగారి కథలు చదవలేదు. ఇప్పుడు ఆయన గతించేక, నాకు కుతూహలం కలిగి రమణమూర్తిగారిని అడిగేను. ఆయన తనవద్ద ఇవి మాత్రమే ఉన్నాయనీ, కథలకీ నవలకీ చెప్పుతగ్గ తేడా ఉందని చెప్తూ పంపిన మూడు కథలు పల్స్ ఆప్ రోడ్, ద రోడ్, శ్రీభగవానువాచ. ఇందులో మొదటి శీర్షిక నాకు అయోమయంగా ఉంది. కథకి ఎలా నప్పిందో సరిగా తెలీలేదు. కథ అంతా ఒక తెగవారికి సహజమైన భాషలో రాసేరు. ఆ భాష ఒక కారణం కూడా కావచ్చు ఆ కథ అంతగా పాఠకులను ఆకర్షించడానికి. పాత్రలు మాటాడేభాషను బట్టి పాఠకులమనసులో ఆ పాత్ర రూపు కట్టడం జరుగుతుంది ఒకొకప్పుడు. ఆ భాషకి తగిన నుడికారమే శీర్షికలో కూడా ఉంటే బాగుండేది. మరొక ఉదాహరణ చెప్తాను. ఈమధ్య బహుళ జనాదరణ పొందిన “చివరి చర్మకారుడూ లేడు.” ఈ పేరు చూడగానే నాకు చదవాలనిపించింది ఎందుకంటే అణగారిపోతున్న ఒక వృత్తివిద్య, ఆ విద్య ఆధారంగా జీవించే ఒకవ్యక్తిజీవితం కనక. అదే కథ cobbler అని పేరు పెట్టి ఉంటే నేను చూసేదాన్ని కాదు. ఎందుకంటే, ఇంగ్లీషుపేరు చూడగానే, ఆ కథ పాశ్చాత్యభావజాలంతో కూడుకుని ఉండవచ్చు అన్న అనుమానంతో. అది తప్పు అని తరవాత గ్రహించేననుకోండి అది వేరే కథ. కథలో “చెప్పులు కుట్టేవాడు అంటే cobbler” అని వివరించడం కూడా నాకు ఆశ్చర్యం కలిగించింది. ఈ వివరణ మన కథాసాహిత్యం ఏ దిశగా పయనిస్తోందో తెలియజేస్తుంది.

మరో బాధ – ప్రస్తుతం కథలో భాష అక్షరగతం చేయడం నాలుగు రకాలుగా సాగుతోంది. తెలుగులిపి, తెలుగులిపిలో ఇంగ్లీషు, ఇంగ్లీషులిపి(రోమన్)లో తెలుగు, ఇంగ్లీషులిపిలో ఇంగ్లీషు. నేను మొదటి సంప్రదాయాన్ని ఆహ్వానిస్తాను. చివరిసంప్రదాయం ఇంగ్లీషుకథ అయితే కథాంశం నాకు నచ్చినది అయితే గ్రహిస్తాను. మిగతా రెండు సంప్రదాయాలు నాకు కొరుకుడు పడవు. ఉప్పల లక్ష్మణరావుగారి అతడు-ఆమె నవలలో ఒక సంభాషణ మూడు పేజీలు తెలుగులిపిలో రాసిన ఇంగ్లీషులో సాగుతుంది. ఆపేజీలతో నానవలాపఠనం కుంటుపడిపోయింది. అయితే ఈ రోజుల్లో చాలామందికి ఈ భాష అలవాటయిపోయిందనీ, అంచేత వారి స్పందన నాస్పందనలా ఉండదనీ కూడా నాకు నిశ్చయంగా తెలుసు. ఇది ఒక కథని ఆస్వాదించే విషయంలో నాకూ, ఈనాటి పాఠకులకూ మధ్య తిరుగు లేని బేధం.

ఈనాడు విస్తారంగా ఆమోదిస్తున్న కథాంశాలలో కూడా నాకు నచ్చనివి ఉన్నాయి. అంటే అవి మాటాడకూడదని కాదు. నన్నురంజింపజేయవు అని మాత్రమే చెప్తున్నాను. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, నేను మూడుతరాల ముందటి మనిషిని. ఈనాడు వస్తున్న కథల్లో ఇతివృత్తాలూ, కథనం కూడా నాకు అగమ్యగోచరం. కథ “అరటిపండు ఒలిచి చేతిలో పెట్టడమో,” “గోరుముద్దలు తినిపించడమో” కాకూడదు. కల్పిత కథకీ వ్యాసానికీ మధ్యగల తేడాలలో ఇదొక ముఖ్యమైన తేడా. కథలో ధ్వని ఉన్నప్పుడే పాఠకుడికి (అంటే నాకు) ఆలోచించుకోడానికి అవకాశం ఉంటుంది. మన ప్రాచీనసాహిత్యంలోని ఒకొక గ్రంథానికి అనేక పరిష్కరణములు ఉండడానికి ఇదే కారణం. అంతే కాదు. ఏ విషయాన్నిగానీ నిష్కర్షగా చెప్పడం ఏనాడూ సాధ్యం కాదు కూడాను. స్త్రీవాదులు, దళితవాదులు భాష కొందరికి మాత్రమే అనుగుణంగా వర్థిల్లింది అని వాదించవచ్చు కానీ ఏ ఒక్కవాక్యమూ ఒక్క అర్థం మాత్రమే అందించగలదై ఉండదు. కనీసం వినేవారికి వేరు వేరుగా ధ్వనించవచ్చు. ఈరోజుల్లో ఇక్కడ స్పష్టంగా లేదు, అక్కడ స్పష్టంగా లేదు అని వ్యాఖ్యానించడం చూస్తే ఏమనుకోవాలో నాకు తెలీడంలేదు.

సూక్ష్మంగా, భాష, శిల్పం, ఇతివృత్తాలు – వీటివిషయాలలో నాఅభిప్రాయాలకీ ఇప్పుడు ప్రాచుర్యంలో ఉన్న అభిప్రాయాలకీ సహస్రాంతం వ్యత్యాసం ఉంది. అంచేత, ప్రమీలగారి కథ మిమ్మల్ని ఆకట్టుకోకపోతే నేను ఆశ్చర్యపోను. అది అవునో కాదో మరొకసారి నిర్ధారణ చేసుకోడానికి ఫేస్బుక్కులో పెట్టేను. ఇక్కడ కూడా అందుకే లింకు ఇస్తున్నాను,

కథానిలయంలో ఈ లింకు చూడండి http://kathanilayam.com/story/8461.

చివరిమాటగా, రచయితలు తమకథలమీద నాఅభిప్రాయాలు అడిగినప్పుడు నేను ఊరుకోడానికి కూడా ఇవే కారణాలు. నేను గత శతాబ్దపు చదరపు తునకని ;). నా ఆలోచనలూ, అభిప్రాయాలూ గతానుగతికం కాదు.

 

(మార్చి 4, 2015)

 

 

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

2 thoughts on “చర్చ – ఋణానుబంధం”

  1. రమణమూర్తిగారూ, మీ స్పందనకి ధన్యవాదాలు. ముగింపుగురించిన మీవాక్యం అబినందనీయం. బాగా చెప్పేరు. అలాగే రంగారావుగారి మాట కూడా నాకు కొత్తే. ఇక్కడ పంచుకున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

    మెచ్చుకోండి

  2. చాలా బాగా రాశారు, మాలతి గారూ! విషయం చిన్నదైనా పెద్దదయినా, దాన్ని ఓపిగ్గా అందరికీ అర్థం అయ్యేలా వివరించగలగడం మీ ప్రత్యేకత!

    అరవై యేళ్ళ క్రితం – అదీ బాలసాహిత్యం క్రింద – ఇంత మంచి శిల్పంతో కూడిన కథని ఓ చిన్నపిల్ల రాసిందంటే ఆశ్చర్యంగా ఉంది. కథాసూత్రాలకి అనుగుణంగా దీన్ని ఓ జీవిత చరిత్రలాగా కాకుండా, ఫ్లాష్ బాక్ ని విడిగా చెప్పడం; ముగింపు విషయంలో ‘ఇది మూఢనమ్మకాలని ప్రోత్సహించే కథ’ అన్న అపప్రధ రాకుండా ముగింపుని పాఠకులకి వదిలేయడం – ఈ రెండూ కూడా గొప్ప విషయాలే!

    కథల విషయమై మీ మిగతా అభిప్రాయాలు కూడా గౌరవించదగ్గవీ, ఆలోచించదగ్గవీనూ! వి ఎ కె రంగారావుగారు పాటలవిషయంలో ఓసారి అన్నట్టు: “మంచీ చెడూ అన్ని కాలాల్లోనూ ఉంది. కాకపోతే వాటి నిష్పత్తి కొంచెం మారుతూ ఉంటుంది..’. ఇదే విషయం కథలకీ వర్తిస్తుంది!

    మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s